అట్లా సారంపల్లిలో దిగినప్పుడు మండలానికి నడిచిపోయి ఎస్సైని కలిసిండు చాంద్. ఎస్సై ‘ఆడుక పోండ్రిరా’ అన్నాడు. ఎంత ధర్మాత్ముడు అని చాంద్ అనుకున్నాడు.
ఏదో కేసు మీద సారంపల్లి వచ్చిండు ఎస్సై. బజార్లో ఆడుతున్న తండ్రి కొడుకులను చూసి బూతులందుకున్నాడు.
‘‘దొరా …. మొన్న మా కొడుకు కలిసిండు గదా …. మీరే ఆడుకొమ్మంటిరి’’ ఇమామ్ అన్నాడు.
‘‘అరేయ్ …. స్టేషన్‌కు రాండ్రి మీ సంగతి చెప్పత’’ ఎస్సై అన్నాడు.
ఇద్దరూ షాదుల్‌తో స్టేషన్ చేరుకున్నరు. తెల్లారిగానీ స్టేషన్‌కు రాలేదు ఎస్సై. అంతవరకూ తిండిలేకుండా పడిగాపులు కాశారు. తండ్రి కొడుకలిద్దరూ ఆకలికి ఓర్చుకున్నరు గానీ షాదుల్ ఓర్చుకోలేదు. ఆకలితో అరవడం మొదలెట్టింది. దానిని చూస్తుంటే తండ్రి కొడుకుల మనసు తండ్లాడింది.
వచ్చిన ఎస్సై అంత ఊడ్చి కడుగుమని వెళ్ళిపోయిండు. అంతా శుభ్రం చేసే సరికి పొద్దుగూకింది. తిని వస్తమన్నా పోలీసుల వినలేదు. తుపాకి మడిమెలు చూపించిండ్రు.
చావు తప్పికండ్లు లొట్టలు పోయి పొద్దుగూకినంక బయటపడ్డరు ముగ్గురు. మళ్ళా ఆ మండల పరిదిలోకి అడుగుపెట్టలేదు.
‘‘అట్లే ఉంటరురా చాంద్ …. మొదలు అట్లనే మాట్లాడుతరు. ఇరికినంక సురుకు వెడుతరు’’, అన్నాడు.
‘‘కాదబ్బా …. అందరూ అట్లుండరు. చెప్పినగదా …. మన కులమే అని. ఎమ్మార్వో వచ్చిండు పేరు రాసుకున్నడు. సర్పంచ్ గూడా రాసుకున్నడు. ఖర్చు అయితయన్నరు. మనకు ఒక్కలకే గాదు. ఇంకా పది పన్నెండు మందికి ఇస్తండ్రట భూములు. ఇది ఎప్పటినుంచో నడుత్తందట పైరో. సర్పంచ్ పైరో జేత్తండట’’ అని వాళ్ళ పేర్లు, పైరో ఎప్పుడు మొదలుపెట్టిండ్రు ఎంత ఖర్చు పెట్టిండ్రు, ఎంత దూరం వచ్చింది అంతా తండ్రికి చెప్పిండు.
అప్పుడుగాని నమ్మకం కుదురలేదు ఇమామ్‌కు.
‘మరి ఎప్పుడు ఇస్తనన్నడురా …. ఎంత ఇస్తనన్నడు ….’’ ఆశగా అడిగాడు ఇమామ్. అప్పుడే తాను రైతునైపోయి కల్లంలో ఉన్నట్టు తన ఎలుగు వడ్ల రాశి చుట్టూ పొత్తి చుడుతున్నట్టు ఊహించుకుంటున్నాడు.
‘‘ఎమ్మార్వో ఊర్లె లేడట. రేపైతే అన్ని తెలుస్తయట. కానీ ఒక కండీషన్ పెట్టిండు ….’’ అన్నాడు చాంద్.
‘‘కండీషనా ….? ఏంటిది ….?’’ ఏదైనా చేస్తా అన్న ధీమాగా అడిగాడు ఇమామ్.
‘‘గుడ్డేలుగును ఆడియ్యద్దట’’ చెప్పాడు చాంద్.
ఇమామ్ నవ్వుతూ ‘‘ఎందుకాడిత్తం …. ఎప్పుడాడిత్తం …. భూమి ఇస్తే మనకే చేతినిండ పని ఉంటది గదా’’ అన్నాడు.
‘‘షాదుల్‌ను పట్నంల జంతు ప్రదర్శనశాలకు అప్పజెప్పాలెనట …. మన ఇంట్లనే ఉండనియ్యద్దట’’ అన్నాడు.
ఇమామ్ ఉల్కిపడ్డడు. గుండె దడదడ కొట్టుకుంది. కొడుకు ఎంత బలమైన నిర్ణయం తీసుకున్నాడో ఆ క్షణంలో అతనికి తెలియదు. అందుకే తెలిగ్గా కొట్టిపారేస్తూ ‘‘నువ్వేం చెప్పినవురా’’ అన్నాడు ఇమామ్.
‘‘మా దగ్గర ఎలుగులేదు. వారం కిందనే దమ్ము రోగమచ్చి సచ్చింది’ అని చెప్పిన.
‘‘సారు ఏమన్నాడు ….?’’
‘‘సర్పంచ్‌ను ఇంకో ఇద్దరు ముగ్గురిని అడిగిండు. వారం పది రోజుల నుంచి కనబడలేదు అన్నారు వాళ్ళు. సారు నా మాట నమ్మిండు. అబద్దమైతే పాణాన బతుకవు అని భయపెట్టిండు’’ చాంద్ అన్నాడు.
ఇమామ్ మౌనంగా ఉండిపోయాడు. ఆ రోజు సాయంత్రం కల్లాలు తిరుగలేదు. ఏదో భయం వేసింది. ‘ఇంతకు ముందు పోలీసులే నయం. యాభయో నూరో చేతుల పెడితే చూసిచూడనట్టుపోదురు’ అనుకున్నాడు.
తెల్లవారి ఎప్పట్లానే ఊర్లోకి బయలుదేరిండు ఇమామ్. రోజుకో రెండు మూడు సందులు తిరుగుతున్నాడు. ఊరు పూర్తికాగానే పక్క ఊర్లో డేరా వేస్తాడు. సామానంతా సైకిల్ మీద చాంద్ జారవేస్తాడు.
ఎప్పుడూ షాదుల్ ముందో వెనుకనో నడిచి అడ్డుపడే వీది కుక్కలను గెదిమే చాంద్ ఆరోజు నిద్ర లేవలేదు. వెంట నడువలేదు. అతడు ఏదో ఆలోచనలో ఉన్నట్టు గ్రహించాడు ఇమామ్. ఆ ఆలోచన ఏమిటో తెలుసు. అందుకని కొడుకును కదిలించాలంటే భయమేసింది ఇమామ్‌కు. మాట్లాడకుండానే బయటకు వచ్చాడు.
నాలుగు సందులు తిరిగి తాయితులు అమ్ముకుని ఎండ పొద్దున డేరాకు చేరుకునేసరికి సైకిల్ ఎక్కుతూ కనిపించాడు చాంద్. ‘కిదర్’ అన్నాడు ఇమామ్. ‘గావుకు ….’ అంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు చాంద్.
అప్పుడు వెళ్ళిన వాడు రెండో రోజుగాని తిరిగి రాలేదు.
ఇమామ్‌కు కోపంగా ఉంది. కల్లాలు పదిహేను రోజులైతే పూర్తయితయి. తవ్వెడో మానెడో అడుక్కునేది ఈ కాలంలోనే. ఎప్పుడూ కల్లాల మీద ఆరు నెలలకు సరిపోను వడ్లను జమచేస్తాడు ఇమామ్. ఇమామ్ కంటే ఎక్కువగా చాంద్ ఆరాట పడేవాడు. ఈరోజు సంచి నిండాలి అంతే! చీకటి పడినా, ఇమామ్ వద్దని చెప్పినా వినేవాడు కాదు.
అటువంటి చాంద్ ఇట్లా తిరుగుతుంటే ఇమామ్‌కు కోపం వచ్చింది. పైగా ఎలుగుకు తిండిలేదు. మక్కలు కనుక్కు రావాలె.
ఏం తిరుగుడురా …. చాంద్. ఆయిటి ముందట అటు ఇటు తిరిగి కార్తీకమాసంల కండ్లకు నీళ్ళు తీసుకుంటే ఏం లాభంరా …. కల్లాల మీదనే గదా నాలుగు గింజలు అడుక్కునేది ఇప్పుడు ఇట్లు తిరిగితే ఆర్నెల్ల పొద్దు ఏం తింటవు. షాదుల్‌కు మక్కలు లెవ్వు. కొనుక్క రావాలె. ఒకలం ఇక్కడుంటే ఒకలం తేవచ్చు గదా!’ అన్నాడు కోపంగా.
చాంద్ నవ్వుతూ ‘‘అబ్బా …. మీ తాతకు గానీ నాయినకు గానీ రెండెకురాల భూమి ఉందా’’ అన్నాడు.
భూమి పేరు వినగానే ఇమామ్‌కు భయం పుట్టింది. కోపం రెట్టింపయింది. అదే తీవ్రతతో ‘‘రెండెకురాల భూమే ఉంటే …. ఈ సంచారం ఎందుకు తిరుగుతరా …. ఎద్దు ఎవుసం చేసుకుంట’’ అన్నాడు.
‘‘అదే …. ఇప్పుడు వస్తంది. నిన్న ఎస్సైసారు ఎమ్మార్వోకు చెప్పిండు. పేరు రాపిచ్చిండు’’ చాంద్ అన్నాడు.
అది రాత్రిపూట. ఉన్న కొద్దిపాటి మక్క గటుకను కుండలో పోసి షాదుల్ కొరకు ఉడుక బెడుతున్నాడు ఇమామ్. తన కోసం పొద్దున ఇండ్లుతిరిగి అడుక్కొచ్చుకున్న అన్నం ఉంది.
పొయ్యి మండుతలేదు. వెదురు బొంగుతో ఊదుతున్నాడు ఇమామ్. చాంద్ మాటలకు అతని గుండె బరువెక్కింది. బలంగా ఊదుతూ బరువును దించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్టు చాంద్ చెప్పుకుపోతూనే ఉన్నాడు. ‘‘రేపు మనిద్దరినీ రమ్మన్నా డబ్బా …. నీతో మాట్లాడుతాడట.’’
ఇమామ్ ఆందోళనగా తలెత్తి ‘‘ఇద్దరం వెళ్తే …. మరి షాదుల్’’ అన్నాడు. చాంద్ మొఖంలో ఏ భావమూ బాధాలేదు. ఇదొక సమస్యనా అన్నట్టుగా ‘ఈ రాత్రి షాదుల్‌ను వదిలి పెడదాం’ అన్నాడు తెలిగ్గా.
ఇమామ్‌కు కొడుకు మాటలు అర్థం కాలేదు. అగ్గిని ఎగదోస్తున్న వాడల్లా ఆగి కొడుకు వైపు విచిత్రంగా చూశాడు. మసక వెన్నెల వెలుతురులో కొడుకు మొఖం స్పష్టంగా కనిపించలేదు.
‘‘ఏందిరా …. వదిలిపెడుతవా …. ఎటూ ….?’’ అడిగాడు ఇమామ్.
చాంద్ తెలిగ్గా నవ్వుతూ ‘‘అడివిలకు …. దాని తావుకు అది పోతది ….’’ అన్నాడు చాంద్.
ఆ మాటలకు ఇమామ్ తల దిమ్మెక్కింది. వినకూడని మాటలేవో విన్నట్టుగా గొంతు పెగలలేదు. కాళ్ళలో చేతుల్లో నిస్పత్తువ నిండుకుంది. చేతిలోని గొట్టం జారిపోయింది. పొయ్యిమీద ఎసరు పొంగింది. పొంగిన ఎసర్లో ఉప్పురాళ్ళు వెయ్యాలన్న ద్యాసకూడా లేదు. ఎసరు మండుతున్న పొయ్యిని ఆర్పేసింది.
‘‘అడివిలకా …. అడివిల జంతువును ఊర్లెకు తెచ్చినం. అలవాట్లు మార్చినం. ఇరువై ఏండ్లు ఎంటతిప్పుకున్నం. ఇప్పుడు ఉన్నట్టుండి అడివిల విడిచిపెడితే అది ఏం తింటదిరా ….’’ ఆ ఊహనే బరించనట్టుగా అన్నాడు ఇమామ్.
తండ్రి మాటలు చాంద్‌కు విసుగును పుట్టించాయి. ‘‘అడివిలకు కాకుంటే ఊర్లెకా …. ఊర్లెను పోయిన మనుకో …. భూమిగాదు …. మనమే ఉండం. లోపల కూసుండ వెడుతరు’’ అన్నాడు విసుగ్గా.
ఇమామ్ నోరు విప్పలేదు. ఉడికీ ఉడకని గటుకను షాదుల్ బోకెలో పోసి ఆరబెట్టాడు. షాదుల్ వెన్నెల్లో ఉషారుగా తిరుగుతుంది. తండ్రి నోరు విప్పక పోయేసరికి కొడుకే చెబుతున్నాడు.
‘‘పొద్దున లేద్దాం …. సామాన్లు ముల్లె గట్టుకుందాం. సైకిల్ మీద పెట్టుకుందాం. షాదుల్‌ను ఊరగుట్ట అడవిల విడిచిపెడుదాం…. సక్కగ మండలం పోయి ఎస్సైని, మిగితా సార్లను కలుద్దాం.’’
‘‘నేను రాను – నువ్వే పో ….’ విసురుగా అన్నాడు ఇమామ్.
అంతే విసురుగా ‘నేను పోతే పనిగాదు. నువ్వే రావాలంటండ్రు. భూమిని నీ పేరు మీదనే ఇత్తరట. మీ అయ్యను రమ్మను అంటుండ్రు’ అన్నాడు.
ఇమామ్ నోరు తెరువలేదు. ఎలుగుకు గటుక కలిపి పెట్టి ఏమీ తినకుండానే ముడుచుకు పడుకున్నాడు. అతనికి నిద్ర పట్టలేదు. పట్టినా పీడకలలకు ఉల్కిపడి నిద్రలేస్తున్నాడు. చాంద్ మాత్రం గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. నిద్రలో భూమి, భూమి అని కలవరిస్తున్నాడు.
ఆ రాత్రి ఇద్దరికీ సరిగ్గా తెల్లారలేదు. మబ్బుతోనే లేచిన చాంద్ డేరాను సర్దడం మొదలెట్టాడు. ఇమామ్ గుండె తరుక్కుపోతుంది. కోపంగా కొడుకును వారించాడు.
వద్దని ఒకరు – వెళ్దామని ఒకరు. కొట్లాట ముదిరింది.
కోపంగా చాంద్ తాడును అందుకున్నాడు.
‘‘ఇప్పుడు పోదామంటవా ….? లేక నన్ను ఉరివెట్టు
కమ్మంటవా?’’ అన్నాడు.
‘నీ ఇష్టం …. నేను మాత్రం రాను. వచ్చినా షాదుల్‌ను విడిచిపెట్ట’ అన్నాడు ఇమామ్ నిక్కచ్చితంగా. చాంద్ ఉరిమి చూసిండు. పక్కనే ఉన్న చెట్టుకు తాడును ముడివేసిండు. చూస్తుండగానే కొమ్మ ఎక్కి తాడుతో ఉరివేసుకున్నాడు.
అది ఇమామ్ ఊహించని పరిణామం. పిడుగు పడ్డట్టు అదిరిపడ్డాడు. నిజంగా అలా చేస్తాడని ఊహకైనా తట్టలేదు. గొడ్డలిని అందుకుని తాడును నరికాడు ఇమామ్. తర్వాత కుప్పకూలిపోయాడు.
చాంద్ ఇంకో తాడును అందుకున్నాడు.
ఇమామ్‌కు ఏడుపు భయం రెండూ పుట్టుకొచ్చాయి. చెట్టంత కొడుకు చేయి దాటిపోతుంటే వణుకు పుడుతుంది. కొడుక్కు ఎదురుగా వెళ్ళి అడ్డుకున్నాడు, ఏడుస్తూ ‘‘అరే బేటా …. వద్దురా …. నీ కాళ్ళు మొక్కుతరా ….’
చాంద్ శాంతించలేదు. వాదించాడు. ఒక మెట్టు కిందికి దిగలేదు ‘ఇప్పుడంటే ఆపినవు. ఊర్లెకి వెళ్ళి ఎండ్రిన్ తాగిన్ననుకో …. అప్పుడెట్ల ఆపుతవు’ అన్నాడు.
ఇమామ్ ఆలోచనల్లో పడ్డాడు. అంతర్మధనం చెందాడు. తల్లితో చెప్పిస్తేనైనా తగ్గుతాడేమోనని ఊరికి ఫోన్ చేశాడు.
‘‘అరే …. పాగల్ …. ఇంకా బయల్దేరలేదా …. ఇంటికి ఇద్దరు సుంకరోళ్ళు వచ్చిపోయిండ్రు’’ అన్నది బీబమ్మ. ఇమామ్ కాళ్ళు చేతులు సల్లబడ్డాయి. చాంద్ మరింత తొందర పడ్డాడు. ఇమామ్ కొడుకును ఒప్పించాలని చాలా ప్రయత్నం చేశాడు. చాంద్ వినలేదు. మాటమాటకు తాడును అందుకున్నాడు.
వాదనతోనే సాయంత్రమైంది.
ఇమామ్‌కు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. అతడు సాగదీసే పద్దతిని చూసి చాంద్ డెడ్‌లైన్ పెట్టాడు. గంటలో బయల్దేరాలి లేదంటే తన శవం బయలు దేరుతుందని.
ఇరువై ఏండ్లు మనల్ని సాదిందని, అది లేకుంటే బతుకును ఊహించుమని, అది ఎంత త్యాగం చేసిందని షాదుల్ గురించి ఎన్నెన్నో చెప్పాడు ఇమామ్. ఏ ఒక్కటీ నెత్తికెక్కలేదు చాంద్‌కు.
అతనికి నెత్తికి ఎక్కలేదని తెలిసినంక ‘సనిరొమ్ము ఇచ్చిసాదింది. కొడుకు లెక్కపెంచింది. దానికే లేదు ప్రేమ …. నీకెందుకుంటదిరా!’ అనుకుని మనసు విరుచుకున్నాడు ఇమామ్. చాంద్ చావును, షాదుల్ ఎడబాటును బేరీజు వేసుకుంటుంటే షాదుల్ ఎడబాటునే తట్టుకుంటాననిపిస్తుంది.
విడిచి పెట్టి ముందు కడుపునిండా తిండైనా పెడుదామని మక్కల్ని తెమ్మన్నాడు ఇమామ్. సైకిల్ మీద అరగంటలో ఊరిలోంచి తవ్వెడు మక్కల్ని తెచ్చాడు చాంద్. చెప్పకపోయినా లీటరు పాలను తెచ్చాడు.
షాదుల్‌కు పుట్టెడు దు:ఖంతో కడుపునిండ గటుకను తాగించాడు ఇమామ్. తండ్రి నిర్ణయం ఎక్కడ మారుతుందోనన్న అనుమానంతో సామాన్లన్నీ ముల్లెగట్టాడు చాంద్. షాదుల్‌కు సంబందించిన నీళ్ళతొట్టి, గటుకబోకే సత్తుపల్లెం, నూలుపగ్గం, ఎలిత చిటుక, ముందుగొట్టం, జోరతట్టులను దూరంగా విసిరికొట్టాడు.
సైకిల్ పట్టుకుని చాంద్, ఎలుగును పట్టుకుని ఇమామ్ …. ఇద్దరూ ఎన్నీల సాలున బయలు దేరారు.
ఊరు దాటగానే ‘అబ్బా …. దాన్ని విడిచిపెట్టు ….’ చాంద్ అన్నాడు.
‘‘అరే …. బెటా …. ఇది ఊరు అంచుగదరా …. కుక్కలు తిరుగుతుంటాయి. చూస్తే చీరి పోగులు పెడుతయి. మనుషులు చూస్తే కొట్టి సంపుతరు. ఇంకొంత ముందుకు పోదాం’’ అన్నాడు ఇమామ్.
ఇద్దరూ అడవి మధ్యలోకి వచ్చిండ్రు.
‘అబ్బా …. చోడో’ సైకిల్ మీద ముందు నడుస్తూ అన్నాడు చాంద్.
‘‘ఇది నట్టడివిరా బేటా …. తాగుదామంటే నీళ్ళు గూడా దొరుకయి షాదుల్‌కు కుండెడు కుండెడు నీళ్ళు గావాలె. లేకుంటే ఒర్రి సత్తది. కొద్దిగ నీళ్ళ తావుకు వదిలిపెడుదాం’’ అన్నాడు ఇమామ్.
చాంద్ మండుతుండు. అయినా నోరెత్తలేదు. తన కోపాన్ని సైకిల్ మీద చూపిస్తండు. వెన్నెల రాత్రి. చుట్టూ నిశ్శబ్దం, ముందు చాంద్ …. వెనుక ఇమామ్ …. వెనుక షాదుల్ మౌనంగా నడుస్తున్నారు. ఈసారి తండ్రి నోటి వెంటనే ఆ మాటను వినాలని మౌనంగా నడుస్తున్నాడు చాంద్.
ఇమామ్ ఆ మాట ఎత్తడమే లేదు షాదుల్‌ను చేతపట్టుకుని మౌనంగానే నడుస్తున్నాడు.
ముగ్గురూ దట్టమైన పెద్దమ్మ జంగల్‌లోకి అడుగుపెట్టారు. చూసీచూసి కోపాన్ని అనుచుకుంటూ ‘అబ్బా’ అన్నాడు చాంద్.
ఇమామ్ హీనస్వరంతో ‘ఇది పేరుకు పెద్ద జంగలే గానీ ఎప్పుడూ జనం తిరగుతనే ఉంటరురా …. దీనికి అడవిల బతికే పద్దతులు తెలియవుగదా …. ఎవలకంటిలోనే పడితే సంపి తోలును అమ్ముకుంటరు’’ అన్నాడు.
చాంద్ కోపంగా సైకిల్‌ను కిందికి తోసి తండ్రికి ఎదురుగా వచ్చాడు. తండ్రి చేతుల్లోంచి పగ్గాన్ని లాక్కున్నాడు. ఇమామ్ చేతలుడిగి నిలబడిపోయాడు.
చాంద్ కోపంగా షాదుల్ మెడనుంచి తాడును తప్పించాడు. షాదుల్‌ను అడవిలో గెదిమాడు. ‘బెల్టురో …. బెల్టు మూతికున్న బెట్టతియ్యిరో …. ఆకలితో సచ్చిపోతది’ అరిచాడు ఇమామ్.
రెండు గంతుల్లో ముందుకు ఉరికి షాదుల్‌ను అందుకున్నాడు చాంద్. ఉక్కును తప్పించి బెల్టును తప్పించి దూరంగా విసిరి కొట్టాడు. రాళ్ళతో విసురుతూ షాదుల్‌ను దూరంగా తరిమాడు,
కొద్ది దూరం వెళ్ళి నిలబడి చూస్తుంది షాదుల్. మరో రాయి విసిరాడు చాంద్. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళింది షాదుల్ ముందుకు ఉరుకుతూ రాళ్ళను రువ్వుతూన్నాడు చాంద్.
పొద్దంతా పడిన బాధ, సంఘర్షణ, ఇరువై ఏండ్ల సన్నిహితం, అన్ని గుర్తుకొచ్చి ఒక్కసారిగా ‘ఓ’ అని ఏడుపును అందుకున్నాడు ఇమామ్. శవం ముందు ఏడుస్తున్నట్టు భూమిపై మోకరిల్లి ఏడుస్తున్నాడు. నెత్తంతా కొట్టుకుంటూ …. బొచ్చెను గుద్దుకుంటూ ఏడుస్తున్నాడు.
చాంద్ షాదుల్‌ను తరిమీ తరిమీ తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రిని ఒక చేత్తో ఎత్తి సైకిల్‌మీద కూర్చోబెట్టుకున్నాడు. ఇమామ్ కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉన్నాడు. కండ్ల వెంట నీరు కారుతూనే ఉంది. చాంద్ సైకిల్‌ను వేగంగా తొక్కుతున్నాడు. కొంత దూరం వెళ్ళాక వారికి షాదుల్ అరుపులు వినిపించాయి.
తెల్లవారుతుండగా ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు.
ఆరోజు ఇమామ్ పచ్చి మంచినీళ్ళు ముట్టలేదు. ఏడుస్తూనే ఉన్నాడు.
అతని బాధను ఆవేదనను గుర్తించినట్టు వెదుక్కుంటూ వెదుక్కుంటూ, పొదల్ని దాటి కంచెల్ని దూకి ఊర్లుదాటి, ఒంటినిండా గాయాలతో రాత్రిపూట ఇల్లు చేరుకుంది షాదుల్.
షాదుల్‌ను చూసినంక చాంద్ బీబమ్మలు ఏడుపును అందుకున్నారు. బావమరుదులకు అమ్మిరమ్మని రాత్రికి రాత్రే ఇమామ్‌ను ప్రయాణం కట్టించారు.