కొడుకులు

‘‘ఏం చేద్దాం…’’ ఆందోళనగా అడిగాడు జనార్థన్‌.

‘‘అవును… ఏం చేద్దాం,’’ నీరసంగా అన్నది నీరజ, మళ్ళీ తనే భర్తను నిలదీస్తున్నట్టుగా, ‘‘ఏం చేస్తారో తెలియదు. ఈ పెళ్ళి మాత్రం జరగాల్సిందే. అమెరికా సంబందం ఇంత మంచి సంబందం రావాలంటే రాదు,’’ అన్నది.

జనార్థన్‌ నీరసంగా సోఫాలో కూర్చుంటూ, ‘‘అదేదో నేనే అడ్డుకుంటున్నట్టు,’’ అన్నాడు విసుగ్గా. గ్లాస్‌తో మంచి నీళ్ళు ఇస్తూ, ‘‘ఎవరు అడ్డుకుంటున్నారని వాదన కాదు. ఎలా చేయాలో ఆలోచించండి,’’ అన్నది నీరజ.

“నాకు మాత్రం తొందర లేదా నీరజా… మన చేతిలో ఏముందో చెప్పు. ఏడాది నుండి సంబంధాలు చూస్తున్నామా… ఒక్కటి కుదరలేదు. ఇప్పుడు నాన్న ఆరోగ్యం బాగులేదని మానుకున్నామా… సంబంధం వచ్చింది. నాన్న నేడో రేపో అన్నట్టుండె. ఇప్పుడు పెళ్ళి ఎలా కుదుర్చుకుంటాం చెప్పు. ఒకవేళ కుదుర్చుకుని అన్ని సర్దుకుని రేపో మాపో పెళ్ళనగా కళ్ళుమూస్తే ఎలా చెప్పు. ఆడపిల్ల పెళ్ళి కాదుగదా… తప్పు లేదనడానికి… మగపిల్లవాడి పెళ్ళి. సుష్టి ముట్టుడు…’’ గ్లాసు అందుకుంటూ అన్నాడు.

కోపాన్ని అణిచిపెట్టుకుని, ‘‘అలాగని ఏడాది వరకు ఆగు దామా,’’ అన్నది నీరజ.

‘‘తప్పదు మగపిల్లవాడు కదా… పైగా కర్మకాండ చేయాల్సింది నేనే… ఏడాది దినం జరిపి పిండాలు పెట్టేవరకు ఎలాంటి శుభ కార్యం జరగడానికి కూడదు కదా…’’ ఆమెను ఒప్పిస్తున్నట్టుగా అన్నాడు.

కోపంగా మునివేళ్ళపై లేచింది నీరజ. ‘‘అయితే సంబంధం వదులుకుందామంటరా,’’ అన్నది.

‘‘అలా ఎందుకంటాను చెప్పు. ఇప్పుడు కుదుర్చుకుందాం. ఎంగేజ్‌మెంట్‌ చేద్దాం. ఏడాది తర్వాత పెళ్ళి,’’ ఆమెను ఒప్పిస్తున్నట్టుగా అన్నాడు. నీరజ వెటకారంగా చూసి నవ్వింది. ‘‘ఇప్పుడు ఎంగేజ్‌ మెంట్‌ అట. ఏడాది తర్వాత పెళ్ళట. దేశంలో నీ కొడుకు ఒక్కడు తప్ప ఎవరూ లేనట్టు…’’ అన్నది.

జనార్థన్‌ మౌనంగా నీళ్ళు తాగి గ్లాస్‌ పక్కన పెట్టాడు. నీరజ అతని పక్కకు వచ్చి కూర్చుంటూ, ‘‘ఇంకో మాట చెప్పండి,’’ అన్నది. జనార్థన్‌ నవ్వడానికి ప్రయత్నిస్తూ, “ఇదేం బేరమా… ఏం చెప్పాలి. నాన్న రెండు మూడురోజుల కంటే ఎక్కువ బదకడు,’’ అన్నాడు.

నీరజ అతన్ని ఒప్పిస్తున్నట్టుగా గొంతు తగ్గించి, ‘‘మీ పట్టు మీరే కాని నా మాట వినే ప్రయత్నం చేయడం లేదు. అమ్మాయికి అమెరికాలో మంచి ఉద్యోగం. మంచి కుటుంబం. ఒక్కటే కూతురు. పెళ్ళి కాగానే అబ్బాయిని అమెరికా తీసుకెళ్తారు. మంచి ఉద్యోగం చూపిస్తారు. అలా వాడో దారిన పడతాడు. ఈ సంబంధం ఒప్పించడానికి మా అన్నయ్య ఎంత కష్టపడ్డాడని… ఇప్పుడు మనం జారవిడుచుకుంటే మళ్ళీ దొరకదు,’’ అన్నది.

జనార్ధన్‌ కూడా అదే ఆలోచిస్తున్నాడు. కాని ఏంచేయాలో తోచడంలేదు. తండ్రి పరిస్థితి అలా ఉంది.పెళ్ళి సంగతి ఇలా ఉంది. ఇన్నేళ్ళు బతికి ఇప్పుడే తొందరపెడుతున్న తండ్రి పై కోపం వచ్చింది.

‘‘ఏం చేద్దాం చెప్పు… నాకు మాత్రం వదులుకోవాలని వుందా… పైగా అనుకున్నంత కట్నం,’’ అన్నాడు.

నీరజ కూడా ఆలోచనలో పడిపోయింది. రెండు మూడేండ్లుగా కొడుకు కోసం ఎన్నో సంబంధాలు చూశారు. ఒక్కటీ కుదరలేదు. కుదురుతుందనుకున్న సంబందానికి ఇలా ఆటంకం ఎదురుకావడంతో మనసంతా ఆందోళనగా ఉంది.

‘‘వాళ్ళను ఓ సారి అడిగి చూస్తే,’’ జనార్ధన్‌ అన్నాడు.

‘‘ఏమనీ…’’

“అదే… ఇప్పుడు మాట ముచ్చట మాట్లాడుకుని ఏడాది తర్వాత…’’

భర్త మాటలు పూర్తికాక ముందే అందుకుంది నీరజ. ‘‘కుదరదన్నరట. అయినా అది పద్దతికాదు…’’ అన్నది.

జనార్ధన్‌లో ఎక్కడో మిగిలి ఉన్న చిన్న ఆశ కూడా అడుగంటింది. “చ… చేజేతులా ఒక మంచి సంబంధాన్ని పోగొట్టు కుంటున్నం. ఈ సంబందం కుదిరితే మన రొట్టే నేతిలో పడ్డట్టే,’’ అన్నాడు.

‘‘ఇప్పుడు నూతిలో పడ్డట్టుంది బతుకు. మీ నాన్న మనను ఎప్పుడు ఉద్దరించాడని… బతికి అలా సాధించాడు. చచ్చి ఇలా సాధిస్తున్నాడు,’’’ నీరజ అన్నది కోపంగా.

‘‘ఇంకా చావలేదుగా… చస్తేనన్నా పీడ విరగడవుతుండె,’’ కోపంగా అన్నాడు జనార్ధన్‌.

‘‘చస్తే పీడ విరుగడ కాదు. కొత్తగా పీడ చుట్టుకుంటుంది. చావక ముందే ఏదో ఒకటి చేయాలి,’’ అన్నది నీరజ.

అప్పుడే జనార్ధన్‌ జేబులో సెల్‌ మోగింది. చూస్తే అమ్మ. కోపంగా కట్‌ చేసి జేబులో వేసుకున్నాడు.

‘‘ఎవరు…?’’ అడిగింది నీరజ.

‘‘అమ్మ…’’ ఉసూరుమంటూ చెప్పి సోఫాలో జారిగిల బడ్డాడు జనార్ధన్‌.

‘‘ఎందుకటా… మందో మాకో తెమ్మని చెప్పడానికి చేసి ఉంటుంది. ఇంకో ఇద్దరు కొడుకులున్నారుగా… లక్షలు సంపా దిస్తున్నారు. వాళ్ళుకు తెమ్మని చెప్పచ్చుగా. అయినా ఎవరినని ఏం లాభం. అన్ని పనులు మీదేసుకుని మీరే ముందు నడిస్తేను…’’ కోపంగా భర్తను అన్నది నీరజ.

సంభాషణ ఎటో మలుపు తిరుగుతుందని గ్రహించిన జనార్థన్‌ తెలివిగా, ‘‘ముందు పెళ్ళి విషయం ఆలోచించు,’’ అన్నాడు భార్యతో.

కొద్దిసేపు ఆగి, ‘‘ఒకే ఒక మార్గం. అంతకుమించి మరో మార్గం లేదు,’’ అన్నది నీరజ.

జనార్ధన్‌ ఆసక్తిగా ఏమిటన్నట్టు చూశాడు. దగ్గరగా జరిగి, ‘‘మనం గట్టిగా నిర్ణయించుకుంటే చెయ్యవచ్చు,’’ అంటూ తన ఆలోచన చెప్పింది నీరజ.

కొద్దిసేపు ఆలోచినల్లో మునిగిపోయాడు జనార్థన్‌. తర్వాత ఒక నిశ్చయానికి వచ్చినట్టు లేచి నిలబడ్డాడు. అతడు అవును, కాదు అని ఏదీ చెప్పనకుండా లేవడంతో అర్థంకాక అతడివైపు చూసింది నీరజ. చదవడానికి అతడి మొహంలో ఏభావము లేదు.

‘‘ఏమంటారు,’’ అడిగింది నీరజ.

అప్పటికే తల్లి నుంచి రెండుమార్లు ఫోన్‌. మౌనంగా బయటకు నడిచాడు జనార్థన్‌. ఏ విషయం చెప్పకుండా వెళ్ళి పోతుంటే బయటవరకూ వచ్చింది నీరజ. జనార్థన్‌ మౌనంగా కారు ఎక్కి వెళ్ళిపోయాడు.

అతనికి కోపం తెప్పించానా అనిపించింది ఒక్కక్షణం. తర్వాత సర్దుకుని, ‘నాకు మాత్రం అలా చెయ్యాలనుందా… ఏంచేద్దాం. ఈ విషయంలో ఎలాగైనా అతడిని ఒప్పించాలి. ఈ మార్గం తప్ప మరోమార్గం లేదు,’ అనుకుంది.

కారులో బయలుదేరిన జనార్దన్‌ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ముగ్గురు కొడుకులు మూడు ఇళ్ళు కట్టుకుని బయటకు వచ్చాక తల్లి దండ్రి పాత ఇంట్లోనే ఉంటున్నారు. నెలకు ఇంత అని కొంత డబ్బు ఇస్తే అందులోనే సర్దుకుంటున్నారు.

జనార్ధన్‌ను చూడగానే తల్లి ఏడుపు అందుకుంది. ‘‘ఒరే… పెద్దోడా… మీ నాన్నను చూడరా… నిన్నమొన్న కాసిన్ని పాలన్నా తాగేవాడు. ఈరోజు పాలు పోస్తే కారిపోతున్నాయిరా… నాకేదో భయంగా ఉంది,’’ అన్నది.

“నీకే కాదు. నాక్కూడా…” అనుకుంటూ తండ్రిని పరిశీలనగా చూశాడు జనార్ధన్‌. రోజూ కనీసం కళ్ళు తెరిచి చూసేవాడు. మాట్లాడక పోయినా సైగలతో ఏదో చెప్పేవాడు. ఈ రోజు కనీసం కళ్ళు కూడా తెరవలేదు. ‘కొంపదీసి ఈ రోజే రేపో పోడు కదా,’ అనుకున్నాడు. ఈ ఆలోచన రాగానే భయం పట్టుకుంది. వెంటనే తెలిసిన డాక్టర్‌కు ఫోన్‌ చేసి ఏదో మాట్లాడాడు. తర్వాత ఇద్దరు తమ్ముళ్ళకు ఫోన్‌ చేశాడు. అరగంటలో ఇద్దరు వచ్చారు.