‘అబ్బా … అరే అబ్బా …’ చాంద్ మాటలతో ఉల్కిపడి తేరుకున్నాడు ఇమామ్. మంచంలోంచి లేచి కొడుకు వైపు చూసిండు. నిలువెత్తు గోతిలోంచి బయటకు వచ్చిండు చాంద్. వచ్చి తండ్రిని మరోసారి పిలిచిండు చాంద్.
ఇమామ్ బదులు పలుకలేదు. లేచి కూర్చున్నాడు. బీబమ్మ కోసం చూశాడు. బీబమ్మ వాకిట్లో కొంగు పరుచుకుని పడుకుంది. నిద్రపోతున్నట్టు గుర్రు వినిపిస్తుంది. ఇమామ్‌కు కోపం వచ్చింది. కోపంతో బాధ కూడా కలిగింది.
తుపుక్కున కింద ఉమ్మేసి ‘‘థూ … నీయవ్వ … నీకు ఎట్ల నిద్రపడుతుందే …’’ అన్నాడు గొణుక్కున్నట్టు.
పలుగూ పార కిందపడేసి తండ్రి దగ్గరికి వచ్చాడు చాంద్. కొడుకును చూస్తుంటే ఇమామ్‌కు భయమేసింది. తన ప్రాణాన్ని తీసుకుపోవడానికి వచ్చిన యమధర్మరాజులా కనిపించాడు.
‘‘అమ్మి’’ తల్లిని కేకేశాడు చాంద్.
‘‘ఆ’’ అంటూ లేచి కూర్చుంది బీబమ్మ.
‘‘ఏం జేద్దాం’’ అడిగాడు చాంద్.
‘క్యా కరీంగే’ బీబమ్మ అడిగింది.
తల్లికొడుకులిద్దరూ ఏదో బదులుకుంటున్నారు. చాంద్ చెమటలు కక్కుతున్నాడు. అతని మొఖం వెన్నెల్లో వికృతంగా ఉంది. చెప్పినట్టు ఒప్పుకుంటే సరి. లేదంటే దేనికైనా సిద్దమే అన్నట్టుగా ఉన్నాడు. అతని ఆలోచనను గ్రహించినట్టు బీబమ్మ ఏది చెప్పినా తలూపుతుంది.
మంచం కింద షాదుల్ గుర్రుగుర్రుమంటుంది. తను పెట్టిన అన్నం దానికి సరిపోలేదని అది ఆకలితో ఉన్నదని తెలుసు ఇమామ్‌కు. ఇరువై ఏండ్లు తమ ఆకలిని తీర్చిన షాదుల్ ఇప్పుడు ఆకలితో చస్తున్నాడు. తమ బతుకు దెరువు కోసమే ఇన్ని రోజులు బతికిన షాదుల్ ఇప్పుడు తమ బతుకుదెరువు కోసమే చస్తున్నాడు. ఈ ఆలోచన రాగానే కుమిలిపోయాడు ఇమామ్.
తండ్రి సమాదానం కొరకు చూడకుండానే కట్టెను అందుకుని మంచం కిందున్న ఎలుగును లేపాడు చాంద్. రెండు దెబ్బలు వేస్తే అది బయటకు వచ్చింది. ఏదో ప్రమాదాన్ని పసిగట్టినట్టు రాత్రి నుంచి అది కూడా దిగులుగానే ఉంది.
బీబమ్మ పడుకున్న చోటనే నిలబడ్డది. ఇమామ్ పడుకున్న చోటనే కూర్చున్నాడు. బయటకు వచ్చిన షాదుల్ మళ్ళీ మంచం కిందకి వెళ్ళడానికి ప్రయత్నించింది. దాని ప్రయత్నాన్ని సాగనియ్యలేదు చాంద్. మెడకు చుట్టిన పగ్గాన్ని విప్పి పట్టుకున్నాడు.
షాదుల్ పెనుగులాడుతుంది. చాంద్ వదలలేదు. తవ్విన గోతి వద్దకు దాన్ని లాక్కెళ్ళాడు. ఆ తొందరలో మూతికి బెల్టు కట్టలేదన్న విషయం చూడలేదు చాంద్. రాత్రి అన్నం పెట్టినప్పుడు ఇమామ్ విప్పాడు. ఎప్పుడైనా తిండి తినగానే బెల్టు పట్టాతో ముడివేసేవాడు. ఈ రోజు అలా వేయాలనిపించలేదు ఇమామ్‌కు.
షాదుల్ పెనుగులాడుతూనే గోతి దగ్గరికి వెళ్ళింది. గోతి దగ్గర కన్ని క్షణాలు ఆగాడు చాంద్. దానితో పెనవేసుకున్న జీవితమో, దాని బాల్యమో గుర్తుకు వచ్చికాదు. ఆ క్షణంలో అతనికి షాదుల్‌లా కనిపించలేదుగూడా. అదొక క్రూర జంతువులా కనిపించిందంతే! ఎలా నెట్టితే గోతిలో పడుతుందో ఆ ఒడుపు కోసం చూస్తున్నాడు.
మంచంలో కూచున్న ఇమామ్ పంచప్రాణాలు కదులుతున్నాయి. కొడుకును వారించాలని చూశాడు. భయమేసింది. బీబమ్మకైనా చెప్పాలనుకున్నాడు. అసహ్యమేసింది. ‘కన్నకొడుకుతో సమానంగా పెంచుకుంది …. కండ్లముందే చంపుకుంటుంది. థూ ఇదొక మనిషా …. రేపు ఇంకెవడో ఏదో ఇస్తానంటే నన్నుగూడా చంపమంటుంది’ అనుకున్నాడు.
ఇమామ్ అటువైపు చూడలేకపోతున్నాడు. చూడకుండా ఉండలేకపోతున్నాడు. బీబమ్మ మాత్రం కదలకుండా ఉంది.
చాంద్ ఎలుగును ఒక్కతోపు తోసిండు. ఎలుగు గోతికి ఆవల వైపున దూకింది. అక్కడి నుంచి ఇటుతోస్తే ఇటు దుంకింది. ఆటను నేర్చిన ఎలుగు. అదొక ఫీటులా చేస్తుంది. ఒకటి రెండుసార్లు ఒపిగ్గా నెట్టిన చాంద్‌కు కోపం వచ్చింది. దాని పగ్గాన్ని బిగబట్టి కాలికింద పెట్టుకుని పిచ్చిగా తోసివేయడం మొదలెట్టాడు.
‘చాంద్ …. నక్కోరే …. నక్కోరే ….’ పలవరిస్తున్నాడు ఇమామ్.
‘‘చాంద్ …. జాగ్రత్తరా …. కాలు జారుతుంది’’ బీబమ్మ హెచ్చరిస్తుంది.
చాంద్ మొసదీత్తున్నాడు. ముందుగా ఆటలా సాగిన ఆ కార్యక్రమం పోరాటంలా మారింది. ముందుగా తప్పుకోవడమే పనిగా చేసిన ఎలుగు ప్రతిఘటిస్తుంది. చాంద్‌కు అరికాలిమంట నెత్తికెక్కింది. చేతుల పగ్గంతో దాని వీపుమీద బలంగా కొట్టాడు. ఎలుగు గుర్రుమంది.
చాంద్ కోపంగా తండ్రి వద్దకు వచ్చాడు ‘అబ్బా …. తుజావో …. ఓసైతాన్ కో మారో.
ఇమామ్ నోరు తెరువలేదు. చాంద్ కోపంగా ఇంకోసారి అన్నాడు. బీబమ్మ ‘జావోరే …. జావో ….’ అన్నది.
ఇమామ్ ఉరిమి చూసిండు. చాంద్ కోపంగా గోతి దగ్గరికి వెళ్ళి మరోసారి తోసిండు. ఈసారి ప్రతిఘటించడం కాదు. ఎదురుదాడి చేసింది షాదుల్. నోరు తెరిచి చాంద్‌ను అందుకున్నది. అతని మీదికి ఎగబడింది.
‘అరే అల్లా …. బేటా మర్‌గయేరే’ అంటూ ముందుకు ఉరికింది బీబమ్మ.
ఇమామ్‌కు ముందుగా ఏం జరిగిందో అర్థం కాలేదు. అర్థం అయ్యేసరికి చాంద్ కింద పడ్డాడు. షాదుల్ మీద అలుముకున్నాడు. అది గుర్రుమంటుంది. చాంద్ కేకలు పెడుతున్నాడు.
ఇమామ్‌కు గుండె జల్లుమంది. ఒక్క ఉదుటన చాంద్ వద్దకు పరుగు తీశాడు. ‘షాదుల్’ అని గట్టిగా అరిచాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న బీబమ్మ ఇద్దరు కొడుకుల కొట్లాటను విడదీస్తున్న తల్లిలా షాదుల్‌ను బొచ్చుపట్టి లాగుతుంది.
‘షాదుల్’ అన్న అరుపు వినగానే షాదుల్ లేచి కూర్చుంది. కింద పడ్డ చాంద్ కూడా లేచి నిలబడ్డాడు. పక్కనే చేతి కర్ర కనిపించింది. కోపంతో కర్రను అందుకున్నాడు చాంద్. పిచ్చిపట్టిన వాడిలా షాదుల్‌ను కొట్టడం మొదలెట్టాడు. ‘మార్ …. సైతాన్‌కో’ అంటుంది బీబమ్మ.
దెబ్బలు భరించలేక షాదుల్ ఇమామ్ దగ్గరికి పరుగెత్తుకొచ్చాడు. ఇమామ్‌కు ఏమిచెయ్యాలో తోచలేదు. ‘వద్దురా .. వద్దు .. ఆగు’ అంటున్నాడు.
చాంద్ వినడం లేదు. బూతులు తిడుతూ కొడుతున్నాడు. దెబ్బదెబ్బకీ గొంతెత్తి అరుస్తూ ఇమామ్ చుట్టూ తిరుగుతుంది షాదుల్. దాని గోసను చూడలేక చాంద్‌కు ఎదురెల్లి కట్టెను అందుకోబోయాడు.
సరిగ్గా దెబ్బ ఇమామ్ భుజం మీద పడింది. ఆ దెబ్బ గనుక అతని పుర్రెమీద పడితే గిలగిల తన్నుక చచ్చేవాడే! కన్నెర్ర జేసింది. తనకండ్ల ముందే తన తండ్రిపై చేయి చేసుకుంటే కదిలిపోయిన కొడుకులా రెచ్చిపోయింది షాదుల్.
ముందటి కాళ్ళకు లంగించి నిలువెత్తు పైకిలేచి చాంద్ మీదికి దుంకింది. దాని ధాటికి చాంద్ విరుచుకు పడిపోయాడు. మొదటిసారి దాడి చేసినప్పుడు చాంద్‌కు చిన్న గాయం కూడా చెయ్యలేదు షాదుల్. కానీ ఇప్పుడు కోపాన్ని అదుపు చెయ్యలేకపోయింది.
నోరు తెరిచి చాంద్ గొంతును అందుకుంది షాదుల్. చాంద్ ప్రాణ భయంతో కేకలు వేస్తున్నాడు. ఒక్క క్షణం ఆలస్యమైతే చాంద్ గొంతు తెగిపడేదే. ఇమామ్ లేచి ‘షాదుల్’ను బొచ్చుపట్టి లాగడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
చాంద్ భయంగా లేచి నిలబడ్డాడు. బీబమ్మ ఏడుస్తూ కొడుకు పెయ్యంతా పుణికి చూస్తుంది. షాదుల్ లేచి గుర్ గుర్‌మంటూ ఇమామ్ పక్కకు వచ్చి నిలబడింది.
అక్కడ రెండు వర్గాలు ఏర్పడ్డాయి.
తల్లిని దూరంగా నెట్టి చాంద్ ఇంటిలోకి పరుగు తీశాడు. కొద్ది సేపట్లోనే తాడుతో బయటకు వచ్చాడు. తండ్రి ముందుకు వచ్చి నిలబడి ‘‘నువ్వు నన్ను చంపాలని ప్రయత్నించావు. కుట్ర చేశావు. నేను బతకడం నీకు ఇష్టంలేదు. అందుకే షాదుల్‌గాని మూతికి బెల్టు పెట్టలేదు. నువ్వు చంపుడెందుకు. నేనే చస్తా’’ అంటూ తాడును అందుకు పరుగును అందుకున్నాడు చాంద్.
తల్లి అడ్డం తిరిగింది. చాంద్ ఆగలేదు. ఇమామ్ అడ్డం తిరిగి తాడును లాక్కున్నాడు.
చాంద్ తిక్కగా చూసి ‘‘దాన్ని చంపుతవా …. నన్ను చంపుతవా …. ‘‘ఏదో ఒకటి చెప్పు’’ అన్నాడు.
బీబమ్మ సోకం బెట్టి ఏడుస్తుంది. షాదుల్‌ను, ఇమామ్‌ను సాపెన పెడుతుంది. ‘మీ తలపండ్లు వలుగ. నా కడుకును సంపుతరు. ఉంచరు ….’ అంటూ ఏడుస్తుంది.
ఇమామ్‌కు కోపమూ దు:ఖమూ పొంగివచ్చాయి.
బీబమ్మ వైపుకన్నెర్ర జేసి చూసిండు. ఆ చూపుకు బీబమ్మ ఏడుపును ఆపింది.
‘‘ఓ సైతాన్ …. నేనేం చేసిన్నే …. దాన్ని కొరుకుమన్ననా …. వాన్ని చావుమన్ననా …. మీరేం జేసినా నోరుదెరుత్తున్ననా ….’’ అన్నాడు ఇమామ్.
‘‘నువ్వేంజేసినవా …. వాన్ని కొద్దిలైతే అది సంపుతుండె. అప్పుడు నీ కండ్లు సల్లవడుతండే ….’’ అన్నది ఏడుస్తున్నట్టు.
ఇమామ్ బీబమ్మను ఇరుగ జూసిండు. చూసి ‘‘నీ లెక్క అది నీతి మాలిందిగాదు. దానికో నీతుంది. సనిరొమ్ము ఇచ్చి కన్న బిడ్డలెక్క పెంచి ఎకురం భూమికి అదంతా మరిచిపోతన్నావు. అది అట్లగాదు. కూడ వెరిగిన అభిమానం దానికుంది. అందుకే వానికి పన్ను దిగనియ్యలేదు. లేకుంటే ఈపాటికి చీరిపోగు లేత్తుండె’’ అన్నాడు.
షాదుల్ ఏమీ జరుగనట్టే గుర్రు గుర్రుమని తిరుగుతుంది. అప్పుడప్పుడు ఇమామ్ కాళ్ళను మురుక చూస్తంది.
చాంద్ గుర్రు మీదున్నాడు. తండ్రిని మిర్రి మిర్రి చూస్తున్నాడు. శాంతం మీదుంటే బండకున్నంత ఓపిక. తిక్కమీదికి వచ్చిండనుకో …. ఎక్కడ ఏ ముంది ఏం మాట్లాడుతున్నం అన్నది చూడడు. ఆ విషయం ఇమామ్‌కు బాగాతెలుసు.
‘‘ఆ దరిద్రాన్ని నువ్వే ఇడుత్తలెవ్వు. వాడు మంచిగ బతుకుడు ఇష్టం లేదు’’ అన్నది బీబమ్మ.
‘‘నేను ఇడువనిదేది చెప్పు.’’
‘‘ఇడిసిందేదో చెప్పు. యాడికో ఓకాడికి అమ్ముక రమ్మంటే పొయిండు పొయిండు. పోశమ్మను తెచ్చిండు.’’
‘‘మన దగ్గరంటే నీతిలేదు. ఆ నీతి దాని దగ్గరుంది. నువ్వు ఇంత జెట్టన మారుతవనుకో లేదే …. కన్న ప్రేమకంటే పెంచిన ప్రేమ పెద్ద దంటరు. నీ ప్రేమ ఏమయిందే! వాడంటే దానికి పాలోడు. ఇయ్యల్ల దాన్ని సంపుతనంటున్నడా …. రేపు మనలను సంపుతనంటడు. వాని సంగతి వేరే! నీకెమైందే …. దానికోసం ఎయ్యరాని ఏశాలేసినవు. ఇంత జెట్టున్నే మారిపోయినవు’’ అన్నాడు ఇమామ్.
‘‘బంచోత్ …. నేను సావనే సత్త’’ చాంద్ మళ్ళీ ఉరికిండు.
అడ్డం తిరిగి కొడుకును అందుకున్నడు ఇమామ్. కొడుక్కి అడ్డందిరిగి కాళ్ళు వట్టుకున్నది బీబమ్మ.
‘‘నువ్వే …. నువ్వే జేత్తున్నవు’’ మండిపడుతూ అన్నాడు చాంద్ తండ్రితో.
ఇమామ్ గొంతు కూరుకపోయింది. ‘‘మైక్యా కరారే …. జంగల్ ఇడువుమన్నవు. ఇడిసిపెట్టినా? అదే ఇంటికి వచ్చే! అమ్ముకరమ్మన్నరు. పోయిన్నా ….? అదే అమ్ముడుపోకపాయె. నేనేం జెయ్యాలె చెప్పు …. ఇప్పుడు పాణంతోని పాతిపెడుతనన్నవు. వద్దన్ననా …. అది పొక్కల దుంకని దానికి నేనేం జెయ్యాలె చెప్పు …. దాన్ని అడివిల నుంచి ఊర్లెకు తెచ్చినం, ఇరువై ఏండ్లు సోపతిజేసినం. దానికున్న అలువాట్లన్ని మాన్పి కొత్తయి నేర్పినం. ఇప్పుడు దానితో అవసరం తీరినంక పొమ్మంటే ఎటు పోతది చెప్పు’. ఈ మాటలుపైకి అనలేదు ఇమామ్.
పైకి అంటే కొడుకు ఏంజేస్తడో తెలువది. కాక మీదున్నప్పుడు వాన్ని దుయ్యవట్టాలె. సల్లపడితే మన మనిషి మనుసుల్ల గలుత్తడు. అప్పుడు ఏమన్నా మాట్లాడచ్చు.
‘బంచోత్ …. నేనన్నా ఉండాలె. మీరన్నా ఉండాలె’ చాంద్.
బీబమ్మ కొడుకు కాళ్ళను వదులుతలేదు. ‘‘మేము ఎక్కడుంటంరా …. నువ్వులేకుంటే …. మేము బతుకుతమా …. మా బతుకు దెరువే నువ్వు’’ బీబమ్మ అంటోంది.
‘‘బంచోత్ …. షాదుల్‌గాడు …. షాదుల్‌గాడు ….’’ అంటూ ఎలుగు మీదికి ఉరుకుబోయిండు చాంద్. ఇమామ్ ఆపిండు. చేతికందిన రాయిని షాదుల్ మీదికి విసిరిండు అది గురి తప్పింది.
ఊరి చివరి గుడిసె కాబట్టి ఆరాత్రి ఎవరూ అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. ఆ అరుపులకు, మాటలకు ఉల్కిపడి ఊరకుక్కలు మాత్రం వీధుల్లో మొరుగుతున్నాయి.
చాంద్‌ను సముదాయించడానికి ఇమామ్‌కు గంట పైనేపట్టింది. బీబమ్మ కొడుకు పక్కకుచేరి తప్పంతా ఇమామ్‌దే అంటుంది. ఇమామ్ నోరు ఎత్తుతలేడు.
చాంద్ చివరికి మెత్త బడ్డాడు. కాని ఒక షరతు మీద. అదేమిటంటే గోతిలో ఇమామ్ కూర్చోవాలి. అతడు కూర్చుంటే షాదుల్ అందులోకి దిగుతుంది. ఇమామ్‌ను చాంద్‌పైకి లాగుతాడు. షాదుల్‌కు పైకి వచ్చే అవకాశం లేదు. ముగ్గురూ కలిసి మట్టిపూడ్చాలి.
ముందుగా ఇమామ్ ‘సరే’ అన్నాడు. చాంద్ కొద్దిగా శాంతించిన తర్వాత ‘నీకు షాదుల్ కనిపించవద్దు …. అంతేగదా అన్నాడు.
‘ఆ …. అంతే! ఏం చేస్తవో చెయ్యి …. అది కనబడొద్దు’ బీబమ్మ అన్నది. ఆమెకు కొడుకు మీద ఆరాటం, అంతకు మించి భయంగా ఉంది. అందుకే చాంద్ కంటే ముందుగానే ఒప్పుకుంటూ అన్నది.
చాంద్ మౌనంగా ఉన్నాడు. తల్లిని తండ్రిని చూస్తున్నాడు.
ఇమామ్ బీబమ్మ ఇద్దరే మాట్లాడుకుంటున్నారు.
‘‘తెల్లారితే జనానికి తెలుస్తది. ఎవలో ఒకలు ఎలుగు ఉన్నట్టు స్టేషన్‌లనో ఎమ్మార్వో ఆపీసులోనో చెప్పతరు. ఎందుకంటే ఇప్పటికే రెండెకరాల భూమి వత్తున్నట్టు మనం రైతులమై పోతున్నట్టు ఊరందరికీ తెలిసింది. సగానికి సగం మనమీద మండుతుండ్రు’’ బీబమ్మ అన్నది.
‘సరే …. అది గోతీలకు దిగుడు వద్దు. నేను ఎక్కుడు వద్దు. తెల్లారకముందే దీన్ని అడివికి తీసుకపోత. ఇంటికి రాకుండ చేస్త …. ఎవలకంట పడక ముందే ఊరుదాటుతా ….’’ ఇమామ్ మాటలు పూర్తి కాకముందే కోపంగా అరిచిండు చాంద్.
‘‘ఒరే పాగల్ …. మొన్న ఏమైంది ..? పెద్దమ్మ జంగల్‌లో వదిలిపెడితే పొద్దుగూకక ముందే ఇల్లు చేరలేదా..? ఇప్పుడు అట్లనే అయితది. ఊరంతా ఎలిసి పారుతది. అప్పుడు మనం ఏది చెప్పినా జనం నమ్మరు. మొన్న ఎస్సైసారు ఏం చెప్పిండు. అడివి జంతువులు ఉంటే నేరమని చెప్పలేదా ….? అప్పుడు మనం ఏమని అబద్దం చెప్పినం. ఎలుగు మా దగ్గర లేదు దొరా …. ఒకప్పుడుండే …. ఇప్పుడు సచ్చిపోయిందన లేదా …. బతుకుదెరువు లేదని ఎమ్మార్వోకు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఏమన్నం …. యాదికి లేదా..? ఈ భూమికోసం పట్టరానోని కాళ్ళు పట్టుకున్న …. పది వెయిల దాకా అప్పుదెచ్చి ఖర్చుపెట్టుకున్న. ఏ సంగతి గాదు. మన దగ్గర ఎలుగు ఉన్నట్టు ఒక్క ఆనవాలు దొరికినా …. ఒక్కలు చెప్పినా మనకు భూమి ఎగవెడుతరు. పట్టాకానియ్యరు….’’
బీబమ్మ అంతే కోపంగా ‘‘ఔ …. పోరడు ఎంత తిరిగిండు …. ఏదో మనం ఇట్ల బతికినం వాడైనా సుఖంగా బతుకద్దా …. ఈ తిరుగుడు వానితో కాదు ….’’ అన్నది.
‘‘సరే! …. మూడో కంటికి తెలువనియ్య. తెల్లారకముందే అడివికి పోత. కంకెడు పొగాకును ఉప్పిచెక్కల దంచిపోత్త. అద్దగంటల ఎర్రిలేత్తది. మనిషిని గుర్తుపట్టది. మన ఇంటికిరాదు. అడివిల ఆగమై తిరుగుతది’’ అన్నాడు.
చాంద్ మౌనంగా ఇంటిలోకి నడిచాడు. బీబమ్మ అతని వెంట నడిచింది. ఇమామ్ మంచం దగ్గరికి వెళ్ళి వాలిపోయాడు. కొంతసేపటికి కంకెడు పొగాకు చుట్టను ఇమామ్ మీదికి విసిరిపోయాడు చాంద్.
వాళ్ళ మాటలన్నీ విన్నట్టు …. ఆ మాటల అర్థాన్ని గ్రహించినట్టు మౌనంగా ఉంది షాదుల్. ఇమామ్‌నే నమ్మినట్టు వచ్చి మంచం కింద పడుకుంది.
ఇమామ్‌కు నిద్ర పట్టలేదు. అలాగే చూస్తూ పడుకున్నాడు. నెలవంక గూకింది. చీకటి ముసురుకుంది. ఎలుగుకండ్లలా నక్షత్రాలు మిలమిల మెరుస్తున్నాయి. కొడుకు మాటలే గుర్తుకు వత్తున్నాయి. ఒక పట్టాన నిలువ బుద్ది కాలేదు. లేచి లుంగీ సర్దుకుని ఎలుగును చేతపట్టుకున్నాడు.
అతని ఆలోచనను గ్రహించినట్టు లేచి అడుగులు వేసింది ఎలుగు. చీకట్లోనే అడవిదారి పట్టాడు ఇమామ్. టైం ఎంతయిందో తెలువది. ఎప్పుడు తెల్లారుతుందో తెలువది.
ముందు ఇమామ్. వెనుక షాదుల్. చీకట్లోనే నడుస్తున్నారు. అడవులు దాటారు. ఏరులు దాటారు. పొద్దుపొడిచేసరికి అడవి మధ్యలో ఉన్నారు.
అలసటగా చెట్టుకింద కూర్చున్నాడు ఇమామ్. మనిషి జాడలేని …. ఉన్నా తమని గుర్తించని చోట ఉన్నారిప్పుడు. చెట్టు మొదట్లో ఒరిగి పాదుల్‌ను వదిలిపెట్టాడు ఇమామ్. షాదుల్ పురుగుల్ని ఏరుకుంటూ చీమల్ని అద్దుకుంటూ చెట్టుచుట్టే తిరుగుతుంది. తిరుగుతూ ఇమామ్‌ను ఒక కంట కనిపెడుతనే ఉంది.
ఇమామ్ జేబుల్ని తడుముకున్నాడు. నాటు పొగాకు కట్ట తగిలింది. పక్కనే ఉప్పిచెక్క ఉంది. నాటు పొగాకులో ఉప్పి చెక్క కలిపి పెడితే ఎర్రి లేచి తిక్కతిక్కగా తిరుగుతుంది.
ఉప్పి చెక్కను చూసినాక పదేండ్ల కింద జరిగిన సంగతి ఒకటి గుర్తుకు వచ్చింది ఇమామ్‌కు. షాదుల్ మొగ ఎలుగు. పదేండ్లకు వయసు మీదికి వచ్చింది. తోడు కోసం తెగ తండ్లాడేది. రాత్రిళ్ళకు రాత్రిళ్ళు అరిచేది. చెట్లను అలుముకునేది. నేలమీద దొర్లేది. మనుషుల్ని చూస్తే వగరుకట్టేది. పీట్లు చేసేది కాదు. మదంతో తిరగబడేది. రెండుసార్లు చాంద్‌ను కరిచింది. రెండుసార్లు ఇమామ్‌ను కరిచింది. ఒకసారి బీబమ్మపైకి ఉరికి గురుగురుమని వగరు కట్టింది.
అప్పుడు ఇమామ్ బావమరుదుల దగ్గర ఆడ ఎలుగులుండేవి. అంత దూరం తీసుకెళ్ళి రెండు మూడు రోజులు జతకట్టించాడు ఇమామ్. తిరిగి వచ్చిన మరునాడే షాదుల్ మొదటికి వచ్చింది. తేపతేపకు అంత దూరం వెళ్ళడానికి వీలు కాలేదు.
కోడెదూడలైతే మదం అనగడానికి పురుషభీజాల్ని నలిపి షేరువేస్తారు. ఎలుగుకు అది సాధ్యంకాదు. తన తాతలనాటి వైద్యాన్ని చెయ్యక తప్పలేదు ఇమామ్‌కు.
బ్రహ్మదండి చెక్కను ఉప్పి చెక్కను విషముష్టి, ఇష్టికాంత చెక్కలను కషాయంచేసి మాగవెట్టి వారంరోజులు తాగించాడు ఇమామ్. ఎలుగు మదమంతా కరిగిపోయింది. దాని మగతనం ఎగిరిపోయింది. ఆరోజు నుంచి కుదురుగా ఉన్నది.
చెట్టు కింద కూర్చుని ఇదంతా గుర్తు చేసుకున్నాడు ఇమామ్.
ఒకసారి షాదుల్‌ను చూశాడు. అది తన పనిలో తానుంది. ఆహారం కోసం వెదుకులాడుకుంటుంది.
‘అరే …. తండ్రీ …. నిన్ను అడివి నుంచి ఇంటికి తెచ్చిన్నాడు ఇప్పపూల సార తాగించిన. ఇల్లువిడిచి పారిపోకుండ మరుగు మందు పెట్టిన. మొగతనం పోయేందుకు మదం మందు వెట్టిన. ఇప్పుడు నిన్ను వదిలించుకోవడానికి ఎర్రి మందు పెడుతున్న …. నిన్ను అన్నింటికి దూరం చేసిన. ఇప్పుడు నా నుంచి గూడా దూరం చేసుకుంటున్న ….’ అనుకున్నాడు.
షాదుల్‌కు ఎర్రిమందు పెడుతున్నందుకు దు:ఖం వచ్చింది. చుట్టూ ఎవరూ లేరు కాబట్టి బిగ్గరగా …. గుండె బరువు దిగిపోయేదాకా ఏడ్చాడు. మనసు విరగ్గొట్టుకుని పొగాకును చెక్కను కలిపి దంచాడు.
దంచిన తర్వాత ‘ఇప్పుడే పెట్టుడెందుకు ….? కొంతసేపు తిరుగని. ఆకలితో ఉందికదా! తినని. తర్వాత పెట్టవచ్చు’ అనుకున్నాడు. అట్లాగంట గడిచింది.
గంట తర్వాత ‘ఏముందిలే మద్యాహ్నం వరకు పెట్టవచ్చు. ఇప్పుడే ఇంటికి వెళ్ళి చేసేదేముంది అనుకున్నాడు. అనుకుని మలుచుకుని పడుకున్నాడు.
మద్యాహ్నం మెలకువయింది. అప్పటికి ఎలుగు ఏదో ఒకటి చప్పరిస్తనే ఉంది. ‘ఆఖరు రోజున నేను కడుపు నింపకున్నా కనీసం అదైనా నింపుకోని …. సాయంత్రం వరకు పెట్టొచ్చు. రాత్రి వరకు ఇల్లు చేరవచ్చు. ఏం తొందర …. ఇక్కడెవరూ లేరుకదా!’ అనుకున్నాడు.
దంచిన మందు ముద్దకట్టి ఆరిపోయింది. ముద్ద మీద వాలిన ఈగలు, పురుగులు తిక్క తిక్కగా తిరుగుతున్నాయి. వాటిని చూసినాక అది షాదుల్ మీద ఎంత బలంగా పని చేస్తుందో అర్థమై భయమేసింది ఇమామ్‌కు. అలాగే చెట్టు మొదట్లో కూర్చున్నాడు.
పిట్టల అరుపులు జంతువుల అడుగుల చప్పుడు తప్ప ఏ అలికిడీ లేదు. తననే అంటిపెట్టుకున్నట్టు షాదుల్ చెట్టు చుట్టూ తప్ప దూరం నడవడం లేదు. ఇమామ్‌కు ఆకలిగా ఉంది. చుట్టూ తిరిగితే ఏ పండో కాయో దొరుకుతుంది. కానీ అక్కడి నుంచి లేవాలనిపించలేదు.
షాదుల్‌ను, ఎర్రిమందును, ఎర్రిమందు మీద వాలుతున్న పురుగులను, తిక్కతిక్కగా పారిపోతున్న పురుగులను చూస్తూ అలాగే కూర్చున్నాడు ఇమామ్.