జిగిరీ – 6వ భాగం

ఇమామ్‌ ఆలోచిస్తూ నడుస్తున్నాడు. ఆలోచనల్లో పడి ఎప్పుడు పొద్దు గూకిందో తెలియలేదు. మసక మసకగా చీకట్లు పరుచుకుంటున్నాయి. ఊరు ఇంకా చాలా దూరంగా ఉంది. వెనక్కి తిరిగి చూశాడు. షాదుల్‌ గుర్రు గుర్రుమని వెంబడిస్తున్నాడు.

‘నీకు చేస్తున్న అన్యాయానికి నన్ను చంపేయకుండా ఎందుకురా …. గుడ్డిగా నమ్ముతున్నావు’ అనుకున్నాడు ఇమామ్‌ షాదుల్‌ను చూస్తూ.

ఇంటికి వెళ్ళాక తను చెప్పిన ఉపాయం పారుతుందా అన్న ఆలోచన ఒకవైపు …. దినదిన గండంగా షాదుల్‌ను ఎన్ని రోజులు ఇలా తప్పించగలను అనే ఆలోచన ఒకవైపు పట్టి కుదిపేస్తుంటే ఇమామ్‌ నడక వేగం తగ్గింది.

***

‘‘నాకు అన్యాయం చేసినవు మామా …. నీకు ఎట్టి సాకిరి జేసిన. వస్తది వస్తది అన్నవు. చివరికి చూస్తే లిస్టుల పేరేలేదు.’’ అద్ద షేరు ఇప్పపూల సార సేసను టేబుల్‌ మీద పెడుతూ గుర్రుగా అన్నాడు బుచ్చయ్య.

సార సీసను చూసినాక లొట్టలు వేసుకుంటూ ‘‘ఏం జెయ్యాలెరా …. బుచ్చీ, లిస్టు మొత్తం తయారయింది. నీది పన్నెండో నెంబరు. ఆర్డీవో ఆఫీసుకు పోయినంక మారింది. ఆ పక్కీరోడు లేడా …. ఇమామ్‌గాడు. వాని పేరు వచ్చి చేరింది. చివరికి ఉన్న నీ పేరు కటయింది’’ అన్నాడు సర్పంచ్‌.

బుచ్చయ్య నీరసంగా కుర్చీలో కూర్చున్నాడు సారాసీసను ఓపెన్‌ చేశాడు. ‘‘మామా …. నేను మాత్రం ఉన్నాడినా చెప్పు …. గంటెడు భూమి ఉందా …. బతుకు దెరువు ఉందా …. కైకిలి పోదామన్నా దొరుకుతలేదు. భూమి ఇస్తరంటే అప్పుజేసి ఐదారు వెయిలు ఖర్చు పెట్టుకుంటి …. ఇప్పుడు నేను ఇసందాగి సచ్చుడే’’ బుచ్చయ్య బాధగా అన్నాడు.

సర్పంచ్‌ వచ్చి బుచ్చయ్యకు ఎదురుగా కూర్చున్నాడు. గ్లాసులు అటుకులు వచ్చినయి. సారవాసన ఘాటుగా గుప్పుమంది.

‘‘ఏం చెయ్యాలెరా …. చివరి నిమిషంలో ఎస్సై ఏలువెట్టిండు. ఇమామ్‌ గాని పేరు ఎంఆర్వోకు చెప్పి రెకమండ్‌ చేసిండట. ఆఫీసర్లు ఎట్లుంటరు ….? ఒకలను ఒకలు కలుపుకుంటరు …. వాళ్ళ కోటా వాళ్ళకుంటది గదా!’’ సర్పంచ్‌ అన్నాడు.

రెండు రౌండ్లు తిరిగినయి సీసల సారా నెత్తికెక్కింది.

‘‘ఇప్పుడు నా పని ఉత్తదేనా’’ బుచ్చయ్య అడిగాడు బాధగా.

‘ఇంకా ఫైనలు ఎక్కడయిందిరా …. ఆర్వోఆర్‌ల దరఖాస్తుపెట్టుకోవాలె. పట్టాలు దిగి రావాలె. ఇంకా మొదలులేదు మోక్షం లేదు. ఇయ్యల్లనే ఖనీలు పాతి, ఓటాలు చూసుకున్నరు. ఫైలు ఆర్డీవో దగ్గరనే ఉంది. ఇంకా కలెక్టర్‌ దగ్గరికి పోనేలేదు’’ అటుకులు నములుతూ అన్నాడు సర్పంచ్‌.

బుచ్చయ్యలో ఆశపుట్టింది. ‘‘ఇప్పటికైనా చేసేదుంటే చెయ్యి …. జర మొఖం సూడే. పుణ్యముంటది’’ బతిమిలాడుతూ అన్నాడు బుచ్చయ్య.

‘‘దాంట్ల ఎవని పేరన్నా ఒక్కటి కట్‌ చెయ్యాలె. అప్పుడు నీ పేరు ఎక్కుతది ….’’ సర్పంచ్‌ అన్నాడు ముద్ద ముద్దగా.

‘‘నాకు చెప్పేందేంది …. నువ్వే చెయ్యి’’ బుచ్చయ్య.

‘‘ఎవలది చెయ్యాలెరా …. పన్నెండు మందిల పదకొండుమంది నేను చెప్పినోళ్ళే’’ సర్పంచ్‌ ఆలోచిస్తూ.

‘‘అయితే ఆ పన్నెండో వ్యక్తి.’’

‘‘ఎస్సై పవర్‌ పుల్‌. పొలిటికల్‌ అండ ఉంది. కలెక్టర్‌నైనా ఒప్పిస్తడు. నీతిగల మనిషి. రూలు రూలే అంటడు’’ సర్పంచ్‌ అన్నాడు.

‘‘అయితే ఇప్పుడెట్ల …. ఆశ వదులుకునుడేనా ….? బుచ్చయ్య అడిగాడు.

‘‘ఒక్కటే మార్గంరా …. ఎస్సైతోనే వాని పేరును తొలగించాలె …. అంటే ఎస్సైకి కోపం తెప్పించాలె …. అదొక్కటే మార్గం ….’’ చివరి రౌండును పూర్తిచేస్తూ అన్నాడు సర్పంచ్‌.

‘‘ఎట్లా’’ అర్థంకాక అడిగాడు బుచ్చయ్య గ్లాసు కింద పెడుతూ.

‘‘ఏం లేదు …. గుడ్డేలుగు లేదని ఆ పక్కీరోనికి పైరోచేసిండు ఎస్సై. ఉన్నదని మనం ఎస్సై నమ్మేటట్టుగా చెప్పాలె. నాకే మోసం చేస్తవా అని ఎస్సైవాన్ని ఇరుగ దంతడు. పేరు కొట్టేస్తడు. అప్పుడు నీది లిస్టులకు వస్తది’’ సర్పంచ్‌ అన్నాడు.

‘‘నిజంగా ఉన్నదా …. లేదా ….’’ అనుమానంగా అడిగాడు బుచ్చయ్య.

‘‘ఎవనికి తెలుసురా …. మనం ఊర్లె. వాడు ఊరవుతల …. ఎవడు సూడవోతుండు. ఒకటి మాత్రం నిజం. ఇంత భూమి, భూమి అని అందరు అంటుండ్రు గదా! వాడు ఒక్కనాడు ఆపీసుకు రాలేదు, ఆ పోరాడే తిరుగుతండు. దీనిని వట్టి చూస్తే వాడు గుడ్డేలుగుతో యాడనో తిరుగుతుండని’’ సర్పంచ్‌ అన్నాడు.

‘ఇదేదో చూడాల్సిన విషయమే మామా ….’’ లేస్తూ అన్నాడు బుచ్చయ్య.

‘‘కనవడితే చెప్పు …. ఎస్సై చెవుల ఏత్తం ….’’ తూలుతూ లేచాడు సర్పంచ్‌.

అప్పుడు కూరుకు రాత్రి దాటింది. ఊరు నిద్ర గుక్కుతుంది.

st

పౌర్ణమి ముందు రోజులు. పిండిని చల్లినట్టు చల్లని వెన్నెల. కూరుకు రాత్రి.

షాదుల్‌ ఉషారుగా నడుస్తుంది.

ఇమామ్‌ కాళ్ళీడుస్తూ నడుస్తున్నాడు.

ఎందుకో ఆ రోజు వెన్నెల అంతగా నచ్చడం లేదు ఇమామ్‌కు. చీకట్లో అయితే కాస్త ధైర్యంగా నడుస్తుండే వాడు. వెన్నెల్లో భయం భయంగా నడుస్తున్నాడు. ఆ వెన్నెల తన జీవితాన్ని లోకానికి విప్పి చూపిస్తున్నట్టు. తనను ఇతరులకు పట్టి ఇస్తున్నట్టుగా అనిపించింది.

ఇమామ్‌ ఊర్లోకి అడుగుపెట్టాడు. అంతవరకు తనకి తాను ధైర్యం చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆ మాత్రం ధైర్యం కూడా చాలడం లేదు. గుండెలో దడ మొదలయింది. ఆ క్షణంలో షాదుల్‌ మీద విరక్తి పట్టుకుంది.

‘దీనికి సావు మూడింది. అడివిల వదిలినప్పుడు అడివిలనే బతుకక ఇంటికెందుకు రావడం. ఇప్పుడు వాడు ఉంచుతడా .. కోసి పారేత్తడు థూ దీనిగత్తర్రాను’’ అనుకున్నాడు.

దూరంగా వెన్నెల్లో మసక మసకగా గుడిసె కనిపించింది. మరోవైపు వీదిలైట్ల వెలుగులో పల్లె కనిపించింది. అడుగు ముందుకు వెయ్యాలంటే భయం పుట్టి ఆగిపోయాడు ఇమామ్‌. షాదుల్‌ కూడా టక్కున ఆగిపోయింది.

ఇంటికి వెళ్ళినాక ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందో .. ఎంతటి బీబత్సాన్ని చూడాల్సి వస్తుందో ఊహించుకుంటే ఇమామ్‌ కాళ్ళల్లో వణుకు పుడుతుంది.

ఇంటి మీదికి పాణం లాగుతుంది. ఇరవై ఏండ్ల కొడుకు మీదికి పాణం లాగుతుంది. వాళ్ళిద్దరు తల్లి కొడుకులు అంతగా అంటున్నప్పుడు తనేంది దేవులాడేది …? అనుకున్నాడు.

మనుసులోని విరక్తి ద్వేషంగా మారింది. యుద్దంలో పోరాడి పోరాడి చావు తప్పదని తెలుసుకున్న సైనికుడి మానసిక స్థితి ఉంది. ఇమామ్‌కు ఇప్పుడు ‘ఆ మందు పెట్టక తప్పు చేశానా అనిపిస్తుందిప్పుడు. ‘ఆ మందుపెడితే ఎక్కడనో కనబడకుండా చస్తుండె. ఇప్పుడు కండ్ల ముందటనే చావవట్టె … నా పిచ్చిగానీ నేను చెప్పిన మాటలు వాళ్ళు నమ్ముతరా …’ అనుకున్నాడు ఇమామ్‌.

వెనక్కి తిరిగి చూస్తే వెన్నెల్లో షాదుల్‌ వెంటాడే దయ్యంలా కనిపించింది. థూ … నీ వయ్య …’ అది తుపుక్కున ఊంచాడు. షాదుల్‌ గుర్రుమంది.

ఇమామ్‌ నడక వేగాన్ని పెంచి గుడిసె వైపు నడిచాడు.

దాదాపు పరుగెత్తుతున్నట్టుగా షాదుల్‌ అతని వెంట నడిచింది.

ఇమామ్‌ గుడిసె చేరేసరికి ఇద్దరూ బయటనే కూర్చున్నారు. వాళ్ళు ఇమామ్‌ను చూసిగూడా పలకరించలేదు. వాళ్ళ మౌనాన్ని చూస్తుంటే ఇమామ్‌కు భయమేసింది. షాదుల్‌ మాత్రం గుర్రు గుర్రుమంటూ మూల మూలలు తిరుగుతుంది.

కొడుకు అడుగక ముందే ‘అతని కోపాన్ని చల్లార్చాలని ‘అరే షాదుల్‌.. మందు తినిపించినరా .. అరగంటా గంటా ఆగమాగం చేసింది అంతే! మళ్ళీ తాములు కచ్చింది. వయసు ముదిరింది కదరా! మందు పారలేదు …’ అని కొన్ని క్షణాలు ఆగి ‘బేటా … నీ బుద్దిరా … నువ్వేం చెయ్యిమంటే అది చేస్త’ అన్నాడు.

బీబమ్మ నోరు విప్పలేదు. నోరు విప్పింది చాందే!

‘అమ్మీ … దానికింత గటుకవండు. ఆకలితో ఉంది. సోలెడు సాలది … తవ్వెడు .. తవ్వెడు వండు’ చాంద్‌ అన్నాడు తల్లితో. అతడి మాటల్లో కోపం లేదు.

మారు చెప్పకుండా బీబమ్మ ఇంట్లోకి నడిచింది.

ఇమామ్‌ ఆశ్చర్యంగా చూస్తుండి పోయాడు. కొడుకును అంచనా వేయలేకపోతున్నాడు. బీబమ్మ తవ్వెడు గటుకను తడిపి ఎసరు పెట్టింది.

నిన్నటి రోజు ఇంట్లో గటుక లేనేలేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? కోపంగా ఉండేవాడు కొడుకు. వానికోపం ఏమైంది? తనను చూడగానే చిందులు తొక్కుతుందనుకున్న భార్య మౌనంగా  ఉంది .. ఎందుకు…?

ఇమామ్‌లో ఎన్నో ప్రశ్నలు. అడుగుదామనుకుంటున్నాడు. అడుగాలంటే భయం పుట్టింది. మంచం వాల్చుకుని కూర్చున్నాడు.

ఏదో జరిగింది. భూమిని ఇయ్యనట్టున్నారు. … ఇయ్యకపోతే మంచిదే! లేక ఎస్సై ట్రాన్స్‌ఫర్‌ అయినట్టున్నాడు. అయినా మంచిదే! ఉండి ఎవలను ఉద్దరించిండు..? లేక గుడ్డెలుగు ఉన్నట్టు తెలిసిందా …? అయినా మంచిదే తెలువని, ఇది ఈ రోజుదా .. మా బతుకు దెరువే అది. మా తాతలు తండ్రుల నాటి నుంచి వస్తున్న వృత్తి. ఏం చేత్తరో చెయ్యని.

ఆలోచిస్తున్నాడు ఇమామ్‌. పొయ్యి మీద గటుక తుక్కపెక్క     ఉడుకుతుంది. అతని మనసు అలాగే ఉంది.

‘‘అబ్బా … పైలా తు కావో …’ చాంద్‌ అన్నాడు.

అప్పటికి గానీ ఇమామ్‌కు ఆకలి గుర్తుకు రాలేదు. కోపంలేని కొడుకు మాటలు ఆకలిని మరింత పెంచాయి. కాళ్ళు చేతులు కడుక్కుని బయలునే చాపలో కూర్చున్నాడు. భార్య పల్లెంలో అన్నంతెచ్చి ముందట పెట్టింది. ‘తు … కాయారే!’ అన్నాడు ఇమామ్‌ కొడుకుతో.

‘ఆ’ అన్నాడు చాంద్‌. ఎంత తర్కించినా అతనిలోని మార్పు అర్థం కావడం లేదు ఇమామ్‌కు. వీడు నిన్నటి కొడుకేనా, ఇది నిన్నటి భార్యేనా అనుకుంటున్నాడు.

అన్నం తింటూ ‘ఏమయిందిరా … భూమి ఇయ్యరటనా’ అన్నాడు మెల్లెగా. దీనికి కారణం అదే అయినట్టు.

అతని మాటలనేం పట్టించుకోకుండా ‘అబ్బా … నువ్వు వదిలిపెట్టరానిదే నయమయింది. ఎక్కడ మందు తినిపిస్తవోనని భయమయింది’ అన్నాడు చాంద్‌.

‘‘ఔ … ఇదొక్క మంచి పని జేసినవు….’’ భార్య కూడా అన్నది.

ఈ మాటలతో ఇమామ్‌కు సంగతంతా అర్థమైపోయింది.     ఉత్సాహాన్ని ఆపుకోలేక ‘‘ముందు ఎనుక ఆలోచించే వాడేరా … మనిషింటే .. వాళ్ళేదో గుంటెడో గంటెడో భూమి ఇస్తనంటే ఆశపడితివి. లొటపెట పెదువులకు నక్క ఆశపడ్డట్టాయె. ఐదో పదో ఖర్చయిపాయె. ఉన్నది ఊసి పాయె దిడ్డి వాశిపాయె … ఈంత దానికి నువ్వు సత్తాంటివి. షాదుల్‌ను సంపుతాంటివి’’ ఇమామ్‌ అన్నాడు బాధగా.

‘‘అమ్మీ … గటుకు సల్లార బొయ్యి … షాదుల్‌ ఎంత ఆకలితో ఉన్నదో … పెట్టాలె’’ చాంద్‌ అన్నాడు. బీబమ్మ గటుకను సల్లారబోసింది.

ఇమామ్‌ తింటూనే ‘వాళ్ళ భూములద్దు జాగలద్దు. ఇన్ని రోజులు బతుకలేదా …? ఇప్పుడు బతుకమా …?’ అన్నాడు.

చాంద్‌ నవ్వాడు. నవ్వుతూ ‘అబ్బా … నేను అంటున్నది అదికాదు. అడివిల వదిలిపెట్టినవనుకో … ఎర్రి తగ్గినంక వారానికో రెండు వారాలకో ఇల్లును చేరుకుంటుండె. మళ్ళీ కథ మొదలయినట్టే గదా! వదిలించుకోవడానికి ఎంతో కష్టపడాలి. అదేదో ఇప్పుడే కష్టపడితే పోదా! అని’ అన్నాడు.

ఇమామ్‌కు పొలమారింది. దగ్గుతూ గటగటా నీళ్ళు తాగాడు.

చాంద్‌ చెప్పుకు పోతూనే ఉన్నాడు. ‘‘ఈ రోజు మన వాటా చూసిన నాయినా మధ్యలో ఉంది. బ్యాంకులు లోన్లు ఇస్తాయంట. ఒక బోర్‌ వేసినమనుకో … రెండెకరాలు సాగు చెయ్యవచ్చు. నువ్వు రాకపోయేసరికి అందరూ అనుమానంగా చూస్తండ్రు. నేను ఏది చెప్పినా నమ్ముతలేరు. ‘‘…….’’

‘‘చాంద్‌ … గటుక సల్లారింది’’ మాటల మధ్యలోనే బీబమ్మ అన్నది. ‘‘అబ్బా … ఆ మధ్యల కుక్కలకు ఎర్రిలేత్తే సపాయి వాళ్ళు మందు వెట్టి సంపిండ్రు చూడు … ఆ మందు తెచ్చిన గటుకల పెట్టి తినిపించినమనుకో … గంటల మటాష్‌ .. పొక్కలో కూడుపుతే తెల్లారేసరికి ఆనవాళ్ళుండయి’’ చాంద్‌ చెప్పాడు.

ఇమామ్‌కు గొంతులోకి దిగుతున్న ముద్ద చేదుగా అనిపించింది. అన్నాన్ని పక్కకు నెట్టి చేతిని కడుక్కున్నాడు. గుండె దడ హెచ్చింది. తను ఊహించుకున్నది అబద్ధమని తెలిసిపోయాక ఎంతగా బాధకు లోనయ్యాడో అంతకంటే ఎక్కువగా ‘షాదుల్‌కు కుక్కల మందు’ అని విన్న తర్వాత బాధకు గురయ్యాడు.

చాంద్‌ ఇంట్లోకి వెళ్ళి మందును తెచ్చాడు. బీబమ్మ గటుక పల్లాన్ని తెచ్చింది. ఇమామ్‌కు మందు తిని తన్నుకు సచ్చిన కుక్కలు గుర్తుకొచ్చాయి. వెంటనే ‘చాంద్‌ .. ఆగురా’ అన్నాడు. అంటూ దగ్గరికి వచ్చాడు. వచ్చి అతని చేతిలోని గటుకను తీసుకున్నాడు.

‘‘నువ్వు బతుక పుట్టినోనివి బిడ్డా … ఆ పాపం నీకెందుకు. నేనే పెడుత. సాదినందుకు … దాన్ని సంపిన పాపం గూడా నేనే ముల్లె గట్టుకుంట’’ అన్నాడు ఇమామ్‌.

వెంటనే బీబమ్మ ‘‘అవున్రా చాంద్‌ … నువు వద్దు .. నాయినకియ్యి’’ అన్నది. చాంద్‌ మందు పొట్లాన్ని ఇమామ్‌కిచ్చాడు. ఇమామ్‌ ‘షాదుల్‌’ అని పిలిచాడు.

మూలకు నక్కి పడుకున్న షాదుల్‌ మెల్లిగా నడుస్తూ వచ్చింది.

‘మొదటి బుక్క విషాన్ని ఎట్ల పెడుదురా .. కొంత తినని’ అంటూ సగానికి పైగా గటుకను షాదుల్‌ ముందు ఉంచాడు ఇమామ్‌.

షాదుల్‌ ఆకలిగా గటుకను తింటుంది. కొంత మిగిల్చి ఇంకొంత పెట్టాడు. షాదుల్‌ గటుక మొత్తాన్ని తిని ఇమామ్‌ చేతుల్లో ఉన్న గటుక వైపు చూసింది.

ఒక చేత మందుతో మరో చేత గటుకతో షాదుల్‌ను, చాంద్‌ను మార్చి మార్చి చూసిండు ఇమామ్‌. కండ్లల్ల నీళ్ళు తిరిగినయి. అవి టపటప నేల రాలుతుంటే గటుకలో సైనైడ్‌ను కలిపిండు ఇమామ్‌.

ఏ పేగు కదిలిందో .. బీబమ్మ దూరంగా జరిగింది. ఆ మసక వెన్నెల్లో సైతం ఆమె కంటిలోని తడిని పసిగట్టాడు ఇమామ్‌. చాంద్‌ తండ్రినే చూస్తున్నాడు. మందును కలుపుతున్నాడా లేదా అన్నది అతని అనుమానం.

‘‘ఎంత కలిపినా తింటది. మందు వెగటుగా ఉండదట. వాటికి రుచిగానే ఉంటదట’’ చాంద్‌ అన్నాడు.

అతని ఉద్దేశాన్ని గ్రహించినట్టు కట్టెపుల్లతో మొత్తం మందును గటుకలో కలిపాడు ఇమామ్‌. చాంద్‌ హృదయం తేలిక పడ్డట్టుంది. అతని పెదవులపైన చిరునవ్వును గుర్తించాడు ఇమామ్‌.

‘బేటా … చాంద్‌’ పిలిచాడు ఇమామ్‌.

‘ఆ … అబ్బా’ చాంద్‌ అన్నాడు.

‘‘నీ అంత తొందరగా దీన్ని మరిచిపోలేమురా మేము. అట్లని నీ కంటే మాకు ఇదేం ఎక్కువ కాదు. ఎంతైనా నోరులేని జంతువు. ఇరువై ఏండ్ల నుంచి తిండిపెట్టి సంసారాన్ని ఈదుకొచ్చింది. రోగమొచ్చో, నొప్పి వచ్చో చస్తే ఏడుపు తప్ప బాధ ఉండకపోతుండె. మనమే చంపుతున్నం కదా …’’

ఇమామ్‌ మాటలు పూర్తి కాకముందే ‘ఇంతకు నువ్వు చెప్పేదేంది …? నువ్వు పెడుతవా … నేను పెట్టనా …’ కోపంగా అన్నాడు చాంద్‌.

‘కండ్ల ముందు అది కొట్టుక సత్తే చూడలేనురా … మందుపెట్టి ఒర్రెల వదిలి పెట్టి వత్త’’ ఇమామ్‌ అన్నాడు.

‘చాంద్‌ … పోనిరా’ బీబమ్మ అన్నది తనూ తట్టుకోలేనట్టు.

‘జెట్టనరా …’ చాంద్‌ అన్నాడు.

కండ్లు తుడుచుకుంటూ ‘ఎంత … అర్దగంటల వత్త’ అంటూ పగ్గం చేత పట్టుకుని ముందుకు నడిచిండు ఇమామ్‌. ఒక చేతిలో గటుక కలిపిన సైనైడ్‌ ఉంది.

అతని వెంట షాదుల్‌ నడిచింది.

అరగంట అన్నది గంట గడిచింది. తెల్లారింది. పొద్దు గూకింది.

ఇమామ్‌ తిరిగి రాలేదు.g