జిగిరీ – 4వ భాగం

‘అమ్మీ …. ఇయ్యాల్లనన్నా పీడ వదిలిపోతదంటవా ….’ చాంద్‌ అడిగాడు.

‘వదిలి పోతదిరా …. పొగాకు మందు గట్టిది. ఎనుకట మా మామ పెట్టిండు’ బీబమ్మ అన్నది.

‘దేనికి ….? ఎలుగుకా ….’’ అడిగిండు చాంద్‌.

‘‘కాదు …. కుక్కకు’’ నమ్మకంగా చెప్పింది.

‘‘కుక్కకా ….’’ విచిత్రంగా అడిగాడు చాంద్‌.

‘‘కుక్కకు ఎందుకమ్మి ….’’

‘‘ఇంట్లో ఎలుగుతో పాటు కుక్క ఉండేది. ఎలుగు ఈనింది. పిల్లల్ని కుక్క కరుకుతుందనే భయంతో మందుపెడితే ఒక్క పూటలోనే ఎర్రిముదిరి ఎక్కడికో వెళ్ళిపోయింది’’ చెప్పింది బీబమ్మ.

‘‘నా భయం అదిగాదు. అబ్బా మల్లా వెంట పెట్టుకొస్తాడెమోనని ….’’ అన్నాడు చాంద్‌.

మైబమ్మ పాత చీరను అతుకేసుకుంటుంది. చాంద్‌ ఊరికే కూర్చున్నాడు.

సూదిలో దారం ఎక్కీస్తూ ‘‘ఇంకా బుద్దిలేదు. మల్లా తెస్తడా …. రాత్రి జరిగిన బాగోతం మరిచిపోతడా ….’’ అన్నది.

‘‘తెల్వది బిత్తిరి మనిషి. ఎలుగును పట్టుకుని తిరుగడం తప్ప ఇంకేమీ చాతగాదు. ఊర్లెకుపోయే మొఖంలేదు. నలుగురితో మాట్లాడే మొఖంలేదు’’ అన్నాడు కోపంగా.

‘‘ఊర్లు తిరుగుడు తప్ప ఊర్లె తిరుగడు మనిషి. ఏదో నువ్వు తిరుగవట్టి ఈ మాత్రం ఆధారం దొరుకవట్టి’’ అన్నది బీబమ్మ.

‘‘ఏం లాభం అమ్మా …. నేను చేసింది సున్నా జెయ్యవట్టి. ఈ రోజు పల్లెబాట మీటింగుంది. సార్లందరత్తరు వత్తరు. రేపోమాపో కలెక్టరచ్చి పట్టా లిత్తడట. అబ్బ ఇయ్యల్ల, విడిచిపెట్టివత్తే సరే! లేదంటే గుట్టురట్టయితది. అవద్దమాడామని ఎరుకైతది. మనమంటే పడనోళ్ళు సార్లను వెగేసి సున్నా జేత్తరు.’’

బీబమ్మ వింటుంది. కొడుక్కు ఏం చెప్పాలో తోచలేదు. వారం పదిరోజుల నుంచి జరుగుతున్న సంగతులను చూస్తుంటే భర్తను నమ్మబుద్ది కావటంలేదు. ఇంతకు ముందే అమ్ముకుని వస్తానన్నడు అమ్మలేదు. వదిలిపెట్టి వస్తానన్నడు. వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఎర్రిలేపుతానన్నడు. ఏం చేస్తడో తెలియదు.

తల్లి నోరు విప్పకపోయేసరికి చాంద్‌కు అనుమానం వచ్చింది. వెంటనే తండ్రి మీద కోపం కూడా వచ్చింది. అదే కోపంతో ‘‘ఈరోజు గనుక వెంటపెట్టుకుని వస్తే నేను ఉరిపోసుకుని చావడం మాత్రం ఖాయం. నేనో ఆదో ఎవరో ఒకరే మిగులాలె’’ అన్నాడు.

బీబమ్మ ఉల్కిపడ్డది. భయం భయంగా చూసింది. వాకిట్లో అడుగుల చప్పుడు విని ఇద్దరూ మాటల్ని ఆపేశారు.

‘‘ఇమామ్‌ …. ఒరే …. ఇమామ్‌ …. వీనికి ఎక్కడి సిరివచ్చెరో …. గతిలేనోనికి గతులు లావన్నట్టు వీనికి పిలిచి భూమిని ఇయ్యవట్టిరి’’ వాకిట్లో సుంకరి అరిచాడు.

‘ఆ …. వత్తన్న’ అంటూ బయటకు వచ్చాడు చాంద్‌. ‘‘పోడా …. మీ అయ్య లేడారా ….’’ అడిగాడు సుంకరి.

‘ఊరికి పోయిండు …. ఎందుకు ….’ చాంద్‌ అడిగాడు.

‘‘ఎమ్మార్వో రమ్మంటండు’’ సుంకరి చెప్పాడు.

‘‘నేను వత్తున్న పా’’ అంటూ చాంద్‌ ముందుకు నడిచాడు.

‘‘ఆ …. బలే కూడిండ్రురా …. టేషన్ల ఎస్సై …. మండలంల ఎమార్వో, డివిజన్‌ల ఆర్టీవో …. అందరూ తురుకోలే …. మీకు కూసున్న కాడ భూమి రావట్టి …. గుడ్డేలుగేదిరా …. లేదు ….’’ ఆరాతీస్తున్నట్టుగా అడిగాడు సుంకరి.

చాంద్‌ ఆ ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా అన్నట్టు భయంగా చుట్టూ చూసి ‘‘ఎలుగు ఎక్కడిది మామా …. ఎన్నడో సచ్చిపాయె. ఎలుగుంటే ఇక్కడుందునూ …. ఇప్పటికి ఏ ఊర్లోనో అడుక్కుందుము’’ అన్నాడు.

‘‘ఔరో …. ఇప్పుడో కొత్త కానూను వచ్చిందట. అడవి జంతువులను సంపినా పట్టుకున్నా జైలేనట’’ సుంకరి అన్నాడు.

‘‘ఇప్పుడు గాదు. అది ఎప్పుడో ఉన్నది …. పోలీసోళ్ళకు ఎప్పుడూ తడుపుతుంటిమి. వాళ్ళు చూసి చూడనట్టు పోదురు. పారెస్టోళ్ళు గూడా ఆశపడుదురు. ఏదో ఏదో అడుగుదురు. ఇప్పుడు ఎస్సైలు కొత్తగ వచ్చిండ్రు గదా! కానూన్‌ అంటండ్రు. ఏదంటే మాకేంది ….? మా దగ్గర లేనే లేదాయె’’ చాంద్‌ అన్నాడు.

ఇద్దరూ గ్రామ పంచాయతీ దగ్గరికి చేరుకున్నారు. భూమిలేని పేదలను గుర్తించి పరంపోగు భూమిని పంచే కార్యక్రమం జరుగుతుంది.

ఊరు చిన్నదే కాబట్టి లబ్దిదారులు పది ఇరువై మధ్యనే        ఉన్నారు. అందరూ ట్రాక్టర్లో కూర్చున్నారు. చాంద్‌ కూడా ఎక్కికూర్చున్నాడు.

‘‘పోడా …. మీ నాయిన ఏడిరా …. నువ్వచ్చినవు’’ ఎవరో అడిగారు చాంద్‌ను.

‘‘ఊరికి పోయిండు’’ చాంద్‌ చెప్పాడు. అబద్దం చెబుతున్నప్పుడు గొంతు వణికింది.

‘‘అ …. అయ్య గుడ్డేలుగును ఏసుకుని ఊర్లు తిరిగి సంపాయిస్తడు. కొడుకు ఇక్కడ భూముల్ని మలుపుకుంటడు.’’ ఇంకెవరో అన్నాడు.

చాంద్‌ చేతికి మస్కట్‌ గడియారముంటది. మస్కట్‌ది జీన్‌ ప్యాంటు టీషర్టులుంటయి. ఎవ్వలనో అయ్యా, అప్పా అని బతిమిలాడి అడుక్కున్నయి. కాళ్ళకు మస్కట్‌ బూట్లుంటయి. అవి కాళ్ళుమొక్కి అడుక్కున్నయి. ఎలా వచ్చాయి అనే విషయం పక్కన పెడితే చాంద్‌ రూపం భూమిలేని పేద రూపం కాదు. ఊరికి దూరంగా ఉంటారు కాబట్టి ఎంతో సంపాదన పరులుగానే అందరికీ తెలుసు. ఇమామ్‌ రూపం మాట తీరుకూడా ఊరి వారికి అదే అభిప్రాయాన్ని బలంగా కలిగించాయి.

‘‘ఎక్కడిది …. నువ్వు చూసినావా ….? అది ఎన్నడో సచ్చిపాయె.’’ కోపంగా అన్నాడు చాంద్‌.

‘‘సావని బతుకని మాకెందుకు గనీ ….’’ అదే వ్యక్తి అన్నాడు.

అక్కడ లబ్దిదారుల కంటే లబ్దికోసం వచ్చినవాల్లే చాలా మంది  ఉంటారు. ఏదో కారణంగా వాళ్ళు ఎంపిక కాలేదు. అయినా చివరి ప్రయత్నం చేస్తన్నారు. ఎంపికైన వారు పూర్తిగా ఉపాదిలేని వారేం కాదని వారికంటే తామే హీనమని అధికారులతో వాదనకు దిగుతున్నారు. అందరి పిర్యాదుల్లో చాంద్‌, ఇమామ్‌లు నానుతున్నారు.

అందరినీ దాటుకుని అధికారుల జీపుకదిలింది.

దాని వెంట ట్రాక్టరు కదిలింది.

చాంద్‌ మనసు కుదుటపడింది. తండ్రి మీద కోపం వచ్చింది! రాత్రే దాన్ని మాయం చేస్తే ఎంత బాగుండు. ఇన్ని అబద్దాలు ఆడే అవసరం లేకుండె గదా! కండ్ల ముందు మనిషి కనిపించకపోతే వీళ్ళకు ఎన్నో అనుమానాలు అనుకున్నాడు.

జనం తిరగబడుతున్నారు. అధికారులు లెక్కచేయకుండా ముందుకు కదిలారు. అరగంటలో ఊరిబయట గుట్టల నడుమ ఆగింది ట్రాక్టరు. భూమినంతా చదునుచేసి రాళ్ళు పాతారు. ఎవరిది ఏ నెంబరో సుంకర్లు చూపిస్తున్నారు. వాళ్ళ వాళ్ళ నెంబరు భూమిలో వాళ్ళు పులకించి తిరుగుతున్నారు.

ఇమామ్‌ నెంబర్‌ మధ్యలో ఉంది. కొడుకు చాంద్‌ తండ్రి పేరు మీదున్న భూమి దగ్గర వెన్నువిరిచి నిటారుగా నిలబడ్డాడు. భూమినంతా చూసుకున్నాడు. గట్టిగా దమ్ము పీల్చుకున్నాడు. ఆ ఊపిరిలో సర్వశక్తులు తనలోకి ప్రవేశించినట్టయింది.

ఆ భూమిని తన నుంచి వేరు చేయడానికి ఏకైక కారణమైన తండ్రి మీద ఎలుగుమీద చెప్పలేని కోపం వచ్చింది. కసిగా పండ్లు కొరుక్కుంటూ ‘‘ముక్కలు ముక్కలు నరకుత, బంచోత్‌ ….’’ అనుకున్నాడు.

st

పొద్దు వంగింది.

ఇమామ్‌ ఎర్రిమందును చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడు గుర్తుకొచ్చింది. పొద్దంతా ఎలుగు నీళ్ళు తాగలేదని. కొద్ది దూరంలో ఉన్న మడుగు దగ్గరికి నడిచాడు. ఎలుగు నీళ్ళను గలికింది. ఇద్దరూ చెట్టుమొదట్లోకి వచ్చారు.

‘అరే షాదుల్‌ …. నవ్వు అడివిలనే ఉంటె మంచిగుండు గదరా …. నీకు ఎర్రిమందు ఎట్ల పెట్టాలారె …. ఇంటి దగ్గర ఏముందని వస్తున్నవురా….’ అన్నాడు ఇమామ్‌.

షాదుల్‌ దగ్గరగా వచ్చి కూర్చుంది. గుర్రుగుర్రుమంటుంది.

మందు తిన్న తర్వాత షాదుల్‌ ఎర్రిగా ఎట్లా తిరుగుతుందో ఊహించుకుంటే గుండె చెరువై పోతుంది. ఇమామ్‌ బలహీనుడై పోతున్నాడు. ఒక దశలో ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. కాని చాంద్‌ అన్న మాటలు గుర్తుకొచ్చి దైర్యం సాలలేదు.

‘వాడు మంకురోడు పట్టిన పట్టు ఇడువడు. సచ్చిపోతా అంటే సావనే సత్తడు. తిక్క మీద ఉరివేసుకున్నా వేసుకుంటడు. చాంద్‌ను సంపుకుందునా …. షాదుల్‌ను సంపుకుందునా …. ఎట్టా ….?’ అనుకున్నాడు.

వారం కిందటి మాట. అప్పుడు నేను ఉరిపోసుకుంటానని కోపంగా అన్నాడు చాంద్‌. చెట్టంత కొడుకు యాలాడుతుంటే తట్టుకోలేకపోయాడు ఇమామ్‌. వెళ్ళి తాడును తెగ నరికాడు. ఒక్క క్షణం ఆలస్యమైనా చాంద్‌ తన్నుకు చచ్చేవాడే!

కొడుకు మొండిపట్టు ఇప్పుడు గుర్తుకు వచ్చింది ఇమామ్‌కు. ‘వాడు పిచ్చికుక్కలా మారాడు. తను ఈ రోజు షాదుల్‌తో వెళ్తే మాత్రం ఏదో అఘాయిత్యం చేసుకుంటాడు. లేదంటే నన్ను నరికినా నరుకుతాడు’ అనుకున్నాడు ఇమామ్‌.

పొద్దుపూర్తిగా వాలింది. రెండు పడమటి కొండల నడుమ ఎండ నిలిచింది. ఆలోచించి ఆలోచించి దంచిన మందును దూరంగా విసిరికొట్టాడు ఇమామ్‌. ‘చత్‌ రేపువాడు గంజిపోత్తడో పొయ్యిడోగని ఇరువై ఏండ్లు గంజి పోసిన నిన్ను ఎట్ల సంపుత’ అనుకున్నాడు.

ఆ ఆలోచనైతే వచ్చిందిగనీ ఇంటికి వెళ్ళాలంటే భయమయింది. కొంతసేపు కూర్చున్నాక ఒక మార్గంతోచింది ఇమామ్‌కు. ‘సరే …. అలా చెప్పి నమ్మించవచ్చు’ అనుకుని ఇంటిదారి పట్టాడు ఇమామ్‌. అతని కదలికను గమనించే వెంట పడింది షాదుల్‌.

నీడలు సాగుతున్న పొద్దుకు ఇద్దరూ నడుస్తున్నారు. షాదుల్‌ నడుస్తూ గుర్‌ గుర్‌మంటే ఇమామ్‌ నడుస్తూ ఆలోచిస్తున్నాడు.

షాదుల్‌ను ఒక్కరోజు చూడకుండా ఉండలేని బీబమ్మ ఇప్పుడు ఎందుకు మారింది ….?

షాదుల్‌ తినగా మిగిలింది మాత్రమే తిని కడుపునింపుకునే చాంద్‌ ఇప్పుడు ఎందుకు దూరమైపోతున్నాడు ….? తమ మధ్య ఎవరు చిచ్చుపెట్టారు ….? కలిగింది తిని కాలు ముడుచుకుని పడుకునే తమను ఎవరు బయటవేశారు ….? పాలలాంటి మనుషుల్లో ఎవరు విషం కలిపారు ….?

ఆలోచిస్తూ నడుస్తున్నాడు. ఆలోచిస్తుంటే వారం కిందట జరిగిన సంగతి గుర్తుకొచ్చింది. అప్పుడు తమ ఊరికి బయట నాలుగు ఊర్లు దాటి మద్దిమల్ల ఊర్లో డేరాలేసుకుని ఉన్నారు. అది వడ్ల కల్లాల దినం.

st

‘చాంద్‌’ ఉట్‌రే …. తూమెడు వడ్లు జమైనయి. సైకిల్‌ మీద ఇంటి దగ్గర పడేసిరా పో ‘కొడుకును నిద్రలేపుతూ అన్నాడు ఇమామ్‌.

‘‘కల్‌ …. కల్‌ జాయింగే …. ఆజ్‌ నక్కో’’ అటునుంచి ఇటు దొర్లి పడుకుంటూ గొణిగాడు చాంద్‌.

‘‘తేరి లంగేమారో …. కల్‌ అట కల్‌ …. మొన్న ఏమైంది సంచెడు వడ్లు జమచేసి డేరాలో పెట్టి మనం ఊరు తిరుగబోతే వచ్చేసరికి ఎవడో ఎత్తుకపోలేదా …. అడ్డెడడ్లకు ఆకులు తెంపవోతే బుడ్డెడడ్లు దుడ్డె బుక్కిపాయెనన్నట్టు సంచెడు వడ్లు మాయమాయె. మనకు తాలమా తలుపా …. కూడినయి కూడినట్టు ఇంటి దగ్గర పోసుక రావాలె. నువ్వు పోనంటే నేను పోత ….’’ యాష్టపడుతూ అన్నాడు ఇమామ్‌.

అక్కడికింకా పొద్దు పొడవలేదు. అప్పుడే తెల్లారుతుంది. ఎండాకాలం కావడం వల్ల గాలిచల్లగా ఉంది. కండ్లు నలుపుకుంటూ లేచాడు చాంద్‌. అప్పటికే మక్కగటుక ఉడుకబోసి చల్ల కలిపి షాదుల్‌కు తినిపించాడు ఇమామ్‌. పొద్దుటి పూట ఊరు తిరిగితే నాలుగు తాయత్తులు అమ్ముకోవచ్చునని సాయంత్రం పూట పొలాలు తిరిగితే వడ్లు అడుక్కోవచ్చునని ఇమామ్‌ ఆశ.

సంచిని సైకిల్‌కి కట్టి కొడుకును ఇంటికి పంపించాడు ఇమామ్‌. మధ్యాన్నం వరకు తిరిగి రమ్మని పదే పదే చెప్పాడు. తను కోటు వేసుకుని షాదుల్‌ను పట్టుకుని కోటు జేబులో తాయతులు వేసుకుని ఊరిలోకి బయలుదేరాడు.

ఇమామ్‌ గొంతు సన్నగా, కీచుగా ఉంటుంది. ఆ గొంతుతో ఒకసారి ‘షాకినీ, డాకినీ, మోహినీ, కుంజినీ …. దయ్యం ఏదైనా భూతం ఏదైనా పిల్లలకు పెద్దలకు ఆడ మగ అందరికీ తాయితులమ్మా …. తాయితు గడుతా …. నీడ వారకుంట ముక్కువంచకుంట …. నిద్రలో బయపడ్డా …. ఉల్కిపడ్డా అగులు బుగులు లేకుండా చిన్న పిల్లలకు తాయితు గడుతనమ్మా తాయితు గడుతా ….’ అంటే చాలు. అందరూ నిలబడాల్సిందే. చిన్న పిల్లలకు కొని కట్టాల్సిందే!

దానికితోడు షాదుల్‌ విన్యాసం. కొంతసేపు తాయతును దాస్తుంది. నాలుకతో చుట్టూ తింపుతుంది. నోట్లోపెట్టుకుని సూటిగా కొనేవాళ్ళ వైపు విసురుతుంది. కొనే వాళ్ళను ఎదురుగా నిలబెట్టి షాదుల్‌తో కొంతసేపు జిమ్మిక్కులు చేసి అందుకుంటే మంచిగా పని చేస్తుందని ప్రోత్సహిస్తాడు ఇమామ్‌.

అట్లా మూడు తొవ్వల దగ్గర నిలబడి, చాయ వోటళ్ళ ముందు నిలబడి, ఇల్లు ఇల్లు తిరిగి ఆ రోజు ఇరువై వరకు తాయితులమ్మి ఎండ పొద్దు వరకు డేరాకు వచ్చాడు ఇమామ్‌.

ఎండ ఎక్కువైతే షాదుల్‌ ఒగరుకడుతుంది. మాడు మీద చెంబెడు నీళ్ళు పడితే గానీ కుదుటపడదు. చాంద్‌ ఉంటే రాగానే కుండలో నీళ్ళతో తలనంతా తడిపేవాడు. నాలుగు కాళ్ళను నీళ్ళల్లో ముంచేవాడు.

ఇమామ్‌ అవేమీ చేయలేదు. దోసెడు నీళ్ళు మాత్రం మాడమీద చల్లి గటుకను కలిపిపెట్టాడు. గటగట జుర్రి డేరా మూలకు ఒరిగింది షాదుల్‌. తానూ ఎంగిలి పడి నడుము వాల్చిండు ఇమామ్‌. ఊరి అంచుకైతే కుక్కలు షాదుల్‌ పైకి మొరుగుతాయని దూరంగా బీడు పొలాల్లో డేరా వేసుకున్నారు.

ఎండా కాలం కావడంతో డేరాకింద నీడగా ఉన్నా భూమి దగడుగా, గాలివేడిగా ఉంది. షాదుల్‌ కొరకని నేలంతా తడిపి జోరతట్టును వేసి నీళ్ళు చల్లి ఉంచాడు చాంద్‌. అక్కడైతే చల్లగా    ఉంటుంది. షాదుల్‌ కూడా అక్కడే పండుకుంటుంది.

ఇమామ్‌కు కన్నంటుకుని మెలకువయింది. చాంద్‌ రాలేదు. ఎప్పుడైనా అటుపోయి ‘ఇల్లు చేరవచ్చు’ అని తను అనుకునే లోపే ఇటు చేరుతుండె. ఇంత తొందరెందుకురా అంటే ‘షాదుల్‌ను నువ్వు జాగ్రత్తగా చూడవు. యాల్లకు తిండిపెట్టవు నీళ్ళుపెట్టవు’ అంటుండె.

పొద్దు వంగింది. కల్లాలు తిరిగే టైమయింది. చాంద్‌ రాలేదు. వెంట చాంద్‌ ఉంటేనే కల్లాలు తిరుగడానికి వీలుంటుంది. తను షాదుల్‌ను పట్టుకుంటే చాంద్‌ వడ్లు పడుతాడు. సంచి నిండగానే డేరాలో వేసివస్తాడు.

కల్లం దగ్గర షాదుల్‌ ఆటలు వేరుగా ఉంటాయి. కల్లం చుట్టూ పొత్తి చుడుతుంది. రెండు కాళ్ళతో రాశి ముందు నిలబడి దండం పెడుతుంది. రాశిమీద గీతలు గీస్తుంది. అట్లాచేస్తే పంట ఎక్కువ పండుతుందని రైతుల నమ్మకం. బిచ్చం బాగానే పెడుతారు.

చాంద్‌ కొరకు ఎదురు చూసి ఆరోజు కల్లాలు తిరుగనేలేదు ఇమామ్‌. తెల్లవారింది. మబ్బుతోనే లేచి షాదుల్‌ పడుకునే చోట నీళ్ళను చల్లి మక్కగటుక చేసి పాలుతెచ్చి తాగించాడు తానింతా తాగి కోటు వేసుకున్నాడు.

అప్పటికీ చాంద్‌ రాలేదు. ఇమామ్‌కు భయమయింది. ఎక్కడన్నా ఏదైనా జరుగలేదు గదా! అనుకున్నాడు. బయటకు వచ్చి ఊరికి ఫోన్‌ చేసి బీబమ్మను పిలిపించుకుని మాట్లాడాడు.

‘ఎస్సై కలువుమన్నడట. మండలం పోయిండు. రేపు పంపిస్త’’ బీబమ్మ అన్నది.

ఎస్సై పేరు వినంగానే ఇమామ్‌కు చెమటలు పుట్టినయి. ‘ఈ కల్లాల మీద సంపాయించినదంతా సున్న, మొన్న బెదిరిచ్చి రెండు వందలు గుంజుక పోయిండ్రు. వీళ్ళకంటే ‘దొంగలు నయం’ అనుకున్నాడు.

పోలీసోళ్ళు ఎప్పుడూ పిలిపించి బెదిరించడం, పదో ఐదో ఇచ్చి తాను తప్పుకోవడం అతనికి మామూలే. ఈ మధ్య ఆ బెడద మరీ ఎక్కువయింది. రేటు వందలకు వందలు పెరిగింది.

మూడో రోజు పొద్దు గూకుతుండగా వచ్చాడు చాంద్‌. ‘క్యావువారే …. వాడెంత నలిచిండు’ ఇమామ్‌ అడిగాడు.

‘‘ ఎస్సై కొత్తగా వచ్చిండబ్బా …. చాలా మంచోడు ‘‘మన బతుకు తెలిసినోడు’’ అన్నాడు చాంద్‌. ఎప్పుడూ పోలీసోళ్ళను బండ బూతులు తిట్టే చాంద్‌ అలా మెచ్చుకునే సరికి ఇమామ్‌ ఆశ్చర్యంగా సమాచారమంతా అడిగాడు.

‘‘అవునబ్బా …. ఎవలైనా టేషన్లకు పోంగనే అరేయ్‌ తురేయ్‌ అందురు. ఈన అట్లాగాదు పేరుపెట్టి పిలిచిండు. మన కులమేనట. చిన్నప్పుడు మన లెక్కనే ఎలుగుతో ఆడుకున్నడట. మనకు ఏదో దారి చూపిస్తనన్నడు. అక్కడికి జంగల్‌ అమీను గూడా వచ్చిండు. జంతువులతో ఆడిస్తే నేరమని చెప్పిండు’’ అన్నాడు.

ఇన్ని రోజులు పీక్కుతినే పోలీసులనే చూసిండు గానీ దారి చూపిస్తనన్న పోలీసును చూడలేదు. అందుకే విచిత్రంగా కండ్లు పెద్దవి చేసి ‘‘ఏం దారి చూపిస్తనన్నడు’’ అని అడిగాడు.

‘‘పరంపోగు భూములు పంచుతుండ్రట. మనకు భూమి ఇప్పిస్తనన్నడు. ఎం.ఆర్వోకు చెప్పుతనన్నడు. చాయ తాగిచ్చి మర్యాద చేసిండు’’ చెప్పాడు చాంద్‌.

భూమిపేరు వినగానే ఇమామ్‌ నమ్మలేకపోయాడు. అదంతా వట్టి మాటలని కట్టిపారేశాడు. ‘‘మన కష్టాలు తెలిసినో డబ్బా …. అందుకే నజరువెట్టిండు. వట్టోడికేం ఎక్కిళ్ళు వట్టినయి. మనోడు కాబట్టే ఈ తండ్లాట’’ అంటూ ఎస్సై తన ముందే ఎవరెవరికి ఫోన్‌ చేసింది, సర్పంచ్‌తో ఏం మాట్లాడింది చెప్పాడు చాంద్‌.

ఇమామ్‌ నమ్మలేదు.

ఇన్నేండ్ల జీవితంలో ఎప్పుడూ పోలీసులతో దొంగాట ఆడుతనే  ఉన్నాడు. ముట్టేది ముట్టినా తను కనబడితే చాలు. బగ్గున మండే పోలీసులనే చూశాడు.

‘‘అరే …. చాంద్‌ …. పోలీసుల మాటల ఎట్ల నమ్ముతున్నవురా …. వాళ్ళు ఎన్నడన్నా మనలను మనిషి లెక్క చూసిండ్రా. సారం పల్లిల ఎట్ల చేసిండ్రు. మన ఇద్దరినీ ఆగం చెయ్యలేదా’’ అన్నాడు ఇమామ్‌.

సారంపల్లి పేరు వినంగనే చాంద్‌కు కూడా భయమయింది.

ఐదారేండ్ల కింది ముచ్చట. ఏ మండలంలల అడుగుపెట్టినా ముందుగా పోలీస్‌స్టేషన్‌ల కలువాలనుకున్నడు చాంద్‌.

ఇమామ్‌కు ఆ పద్ధతి నచ్చదు. బంజరు దొడ్లె పడ్డ ఎద్దు పెండపెట్టక మానది. టేషన్లకు పోయిన మనిషి దండుగ కట్టక మానడు. వట్టిగ నూరు యాబై వాళ్ళకు పెట్టుడేంది ….? ఏదో ఆకు సాటు పిందెలెక్క అడుక్కుని మన జాగలకు మనం పోతే పోదా ….? అని ఇమామ్‌ అభిప్రాయం.

చాంద్‌ గూడా ముందుగా అలానే ఆలోచించే వాడు. వానికిచ్చే నూరుంటే మనకు నెల గడుస్తుంది అనుకునే వాడు. దానికితోడు పోలీసోళ్ళు ఒకటి రెండు సార్లతో వదిలే వాళ్ళుకాదు. మండలంల ఎన్ని ఊర్లుంటే అన్ని ఊర్లు తిరిగి నప్పుడు కలువుమనే వారు. కలిసినప్పుడల్లా ఏదో వస్తువు కొనుక్కరమ్మనే వారు. ఒక్కోసారి తాయితులు గూడా అడిగేవారు.

ఇదంతా ఎందుకొచ్చిన బాధ అనుకుని కలువడం మానుకున్నాడు చాంద్‌. ఒకసారి ఒక ఊర్లో దొంగతనం జరిగింది. వీళ్ళు అదే ఊర్లో ఉన్నారు. పోలీసులకు వీళ్ళ మీదనే అనుమానం వచ్చింది. మేము కాదని మొత్తుకున్నా వినలేదు.

‘మీరు వస్తే స్టేషన్ల కలువద్దారా’ అని తండ్రి కొడుకులిద్దరినీ లోపలేసి ఉతికిండ్రు. బటయకు రావడానికి ఆ సీజన్లో అడుక్కున్న బిచ్చం మొత్తం కరిగిపోయింది. మీద అప్పులయినయి. అప్పటి నుంచి కష్టమో నష్టమో కాళ్ళు మొక్కుకుని బతిమిలాడుకున్నా సరేగాని కలువకుండా ఉండకూడదనుకున్నాడు.