భిక్షువు

భిక్షువు..

నీ ఇంటిముందు నిలబడి

బిగ్గరగా యాచిస్తే..

పెళ్ళి ఊహల్లోనో

అల్లిక పనిలోనో మునిగి

వెళిపో.. వెళిపో అని

అరవకు..కసరకు

పాదాలకు పనిచెప్పి

సోపానశ్రేణి దిగివచ్చి

భిక్షువుగానం

ఉబికే మెడనరం

వణికే కంఠస్వరం

తిరిగి మౌనం

నిండని జోలె

నిండిన కనులు

విని..తిలకించి

వెనుదిరిగి

ద్రవించే హృదయంతో

తడబడే అడుగులతో

అన్నమో..బియ్యమో

ఉన్నదేదైనా

నీ చేతులమీదుగా

జోలె బరువు పెంచి..

గుండె బరువు దించి..

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...