అమ్మా,నీ జ్ఞాపకం
ఫొటోలా దుమ్ము పడుతోంది.
ఒకప్పుడు
వేల చిత్రాలై
నన్ను ఉక్కిరిబిక్కిరిచేసిన జ్ఞాపకం
అంతులేని చలన చిత్రమై
నా కళ్ళల్లో కదలాడిన జ్ఞాపకం
ఒకే ఒక గమనింపబడని పటంగా మారి,
మనసులో
ఏ మారుమూల గోడకో వ్రేలాడుతోంది.
అనుక్షణం
ఆకాశంలా నోరు విప్పిన జ్ఞాపకం
ఇప్పుడు
ఏ మాటల మంత్రధ్వనికో
గుహతలుపులా తెరుచుకొంటోంది.
ఒకప్పుడు జలపాతం లా
కళ్ళల్లోంచి ఉరికిన జ్ఞాపకం
అపుడపుడు ఒక అశ్రుకణం మాత్రమై,
కనుకొనల్లో నిలుస్తోంది.
నీ మాటై,
నీ చూపై,
నీ నడకై,
విశ్వరూపం దాల్చిన జ్ఞాపకం
ఎప్పుడో నీ గురించిన మాటగా
మరుగుజ్జు రూపంలో దర్శనమిస్తోంది.
మృత్యువు నీ స్పర్శతో
తన మార్మికతను కోల్పోయింది.
ఇప్పుడు మాకది
జీవితంలో భాగంగా అలవాటైపోయింది.
అందుకే, నీ గురించిన జ్ఞాపకం
మరణించినా కూడా,అమ్మా,
అది మేం గమనించమేమో !