మనిషంటే… మింగేస్తూ మింగేయబడుతున్న జ్ఞాపకం

అక్కడప్పుడు
మామూలు మనుషులే ఉన్నారు
మంత్రాలు జపించి మాయమయ్యే
విద్యలేవీ రాని వారు…

అక్కడే గుర్రాలున్నాయి
దేవాతాశ్వాలు కావవి
రెక్కలు లేని నాలుగు కాళ్ళ
మామూలు గుర్రాలు మాత్రమే…

జీవులను మోసుకెళ్తాయనుకునే
నిర్జీవ వాహనాలు కూడా కొన్ని అక్కడే
ఆగుతూ తిరుగుతూ శవపేటికల్లా…

ఆవాసయోగ్యాలమని నమ్మబలికే
నాలుగేసి గోడల
కట్టడాలు కూడా
అమాయకంగా కొలువుతీరాయక్కడ.

ఎవరినీ పట్టించుకోనట్టున్న
నిర్లిప్త కాలం
అజ్ఞాతంలో అజ్ఞానాన్ని ఆస్వాదిస్తున్న
అసందర్భ స్థితి అది.

అదిగో… అప్పుడే అదాటుగా…

కుండపోత వర్షం ముంచెత్తి
ప్రకృతి కన్నెర్రకు
చిమ్మిన ప్రళయ ప్రతీకారాన్నంది.

ఆర్తనాదాలకూ ఆస్కారమివ్వకుండా
అందినంతా ఊడ్చుకు పోయింది
దేహాలను లక్కపిడతలను చేసి
బురదలో కూరేసి పోయింది

అప్పుడే తెలిసిపోయింది
మృత్యువూ బతుకుల మధ్య
ఊగిసిలాడే తెరచాపలు
ఎంత పల్చటివో…

పేకమేడల నాగరికత
తను కూలిపోతూ
మనిషిని కూడా కూల్చేసింది

ఎవరన్నారు మనిషంటే ఘన పదార్ధమని?
చెట్టిక్కిన వాడూ మనిషే
ఎక్కిన కొమ్మను నరుక్కున్న వాడు మనిషే
కింద పడి విలవిలలాడి మృత్యువును ముద్దాడిన వాడూ మనిషే
పడబోతూ ఆశగా అందిన తీగలు పట్టుకు ఊగిసలాడిన మరొకడూ మనిషే
ఒడిసి పట్టి ఒడ్డుకుచేర్చి సేద తీర్చిన సైనికుడూ మనిషే
సేదతీరుతున్నోడి అశక్తతే అలుసుగా అదను చూసి దోచుకున్నదీ మనిషే
తప్పించో ఒప్పించో తనవారి మధ్యకు చేరుకుని
బ్రతుకుజీవుడా అని నిట్టూర్పు విడిచిందీ మనిషే

మనిషంటే గాలీ నీరూ తుడిచేసే మట్టి పదార్ధమని కేదార్‌నాథ్ లోనే తెలిసింది.
మనిషంటే… మింగేస్తూ మింగేయబడుతున్న జ్ఞాపకమని అక్కడే తెలిసి పోయింది.


రచయిత గరిమెళ్ళ నారాయణ గురించి: డా. గరిమెళ్ళ నారాయణ ప్రస్తుతం హెర్న్‌డన్, వర్జీనియాలో ఉంటున్నారు. వృత్తి సైంటిస్ట్.  ...