అనుభవం
ఎప్పటిలాగే తెల్ల మంచు చీరని కట్టుకొని
ఈ నగరం క్రొత్త సంవత్సరం కోసం ముస్తాబవుతుంది
ఈ కాలపు కూడలిలో చలికి పగిలిన పెదవులపై
క్రొత్త సంవత్సరపు చుంబనం ఆ క్షణంలో అనంతంగా వెలిగిపోతుంది
మరుక్షణంలో, సద్దుమణిగిన హోరులో
ప్రొద్దున తయారుచేసిన ప్రమాణాల చిట్టా చేజారిపోతుంది
రాత్రి నరాల్లో మిగిలిపోయిన విస్కీ ప్రొద్దున తలపగిలే నొప్పై ఉదయిస్తుంది
ఎప్పుడో, ఎక్కడో తెలియని జ్ఞాపకవొకటి రెక్కవేస్తుంది
జారిన కన్నీటిబొట్టొకటి పెదవులపై చిరునవ్వై మెరుస్తుంది
రెక్కలురాల్చిన జ్ఞాపకం గుండెలోతుల్లోకి జారిపోతుంది
రోటీన్ గానుగెద్దు నిత్యం తిరుగుతూనే వుంటుంది
నిన్నటి కాఫీ ఘుమఘుమలే ఈ రోజు మరోసారి గుబాళిస్తాయ్
పోయిన సంవత్సరం అయిపోయిన మీటింగ్ ఆఫీస్ లో మరోసారి మొదలవుతుంది
ప్రొద్దున పోట్లాడిన ట్రాఫిక్ తో సాయంకాలం సరిక్రొత్త యుద్ధం కొనసాగుతుంది
ముసురుకున్న చీకటితో లైట్ బల్బొకటి యధావిధిగా కబుర్లలో పడుతుంది
నిన్నరాత్రి, మొన్న రాత్రి అంతకుముందు మరెన్నో రాత్రులలాగే
చీకట్లో, ఐదు నిముషాల ఆత్రం రొటీన్‌గా ఆవిరైపోతుంది
ఎప్పుడో, ఎక్కడో యుగాలకు పూర్వం
విచ్చుకున్న మల్లెల వాసన మనసుకి తెలుస్తుంది
కన్నీటి బొట్టొకటి చెంపల పైకి జారుతుంది
యధావిధిగా చిరునవ్వొకటి మెత్తగా పెదవులపై ప్రాకుతుంది
గుండెలోతుల్లో శూన్యపుపొర మరింత విస్తరిస్తుంది
నిద్రేపోని ఈ నగరం మరో రోజుని కబళిస్తుంది
పరుగు సాగిపోతూనే వుంటుంది
క్రొత్త సంవత్సరం పాతదైపోతుంది
మరో జ్ఞాపకం మనసుపొరల్లో వొదిగిపోతుంది.
జ్ఞాపకం
రాబోయే వసంతంకోసం చేబోయే తపస్సుకి నాందీగా చెట్లన్నీ ముస్తాబవుతాయ్
నిన్నటి అనుభవాల్ని రంగు రంగుల జ్ఞాపకాలుగా అలంకరించుకుంటాయ్
రవికిరణాలకి భయపడక అప్పుడప్పుడే తలెత్తుతున్న చలి పులితో
రివ్వున వీచే గాలి చేసే స్నేహం, చెట్టు గుండెలో పులకింతలు పెడ్తుంది
గలగల రాలే ఆకుల శబ్దం, ఎర్ర్ర్రని మట్టి గాజుల అమ్మ చేతుల జ్ఞాపకాలని రేపుతుంది
ఎప్పుడో ఎక్కడో యుగాంతాలకు పూర్వం, ఊహ తెలియని కాలంలో
వయసులో, మనసులో ఆరోగ్యం, గుండెలో ఆనందం నిండిన అమ్మ నవ్వు
లీలగా వినిపించిన భ్రమ మనసునిండా ఆవరిస్తుంది
నేలతల్లి వొడిని చేరిన అనుభవాల్ని, ఎముకలు కోరికే చలిగాలి
చెల్లా చెదురు చేస్తుంది, ఏ అనుభవం ఏ చెట్టుదో తెలియకుండా
సర్వ ప్రకృతికీ చెందిన జ్ఞాపకాన్నొకదాన్ని అప్పుడే మొదలైన
తెల్ల, తెల్లని మంచు వర్షం ఘనీభవిస్తుంది.
చీకి, చివికి, మలిగి, కరిగి, కణకణాలుగా విడిపోయి, సర్వాంతర్యామిగా
ఆ జ్ఞాపకం రాబోయే వసంతపు పచ్చపచ్చని కలలకోసం
శిశిరపు సుషుప్తిలోకి జారిపోతుంది
మనసుని మెలితిప్పిన నిన్నటి నిరాశలు
గుండెలో సుళ్ళు తిరిగిన నిన్నటి కన్నీళ్ళు విచిత్రంగా అదృశ్యమౌతాయ్
అందుకోలేని గతం చక్కని, నులివెచ్చని జ్ఞాపకమవుతుంది
సురసురమని కాలిపోయే పండగనెల నెగళ్ళ నులివెచ్చని
సంగీతం మన గుండెల్లో ఏ మూలో చిరుసవ్వడి చేస్తుంది.