ఇంతపని జరుగుతుందని నేననుకొన్నానా ?
అంతా ఒక్కటిగా వెళ్ళిన వాళ్ళం
బలవంతాన నిన్నక్కడ
మరచిపోయి రావలసి వస్తుందని !
శిల్పాల మధ్య తిరుగాడుతున్నప్పుడనుకొన్నానా,
నీ సజీవమైన నవ్వుల్నీ, ముఖ కవళికల్నీ, కదలికల్నీ
మా హృదయాల మీద మలుచుకుని మాత్రమే
మళ్ళీ చూసుకోవలసి వస్తుందని !
నీలి తెరలా సరస్సు విప్పారటం చూసాంగాని,
జీవితానికి, మృత్యువుకి మధ్య
సరిహద్దులాంటి దాని అంచుని,
దాని చల్లటి శవస్పర్శని
గమనించాం కాదు .
ఎంత అందమైన,కౄరమైన సరస్సు!
శిలకి ఉలిపెట్టిన గిలిగింత సరస్సు !
లోతు తెలియని శిల్పి మనస్సు సరస్సు !
చేజారిన బొమ్మలా నువ్వు పడిపోతుంటే,
బొమ్మల్లా నిలబడి చూసాం.
ఎంత తప్పు పని చేసాం !
వికృతమైన శారద రాత్రిలో నిన్ను
విడిచిపెట్టి వచ్చేసాం.
కరిగి నీరైన శిల్పి పనితనం సరస్సు !
లేకపోతే మర్నాటికే నీ మొహంలో
జీవన్మరణాలకతీతమైన నిర్లిప్తతని,
నన్ను నిలువెల్లా కుదిపేసిన నిశ్చలతని
ఎలా చూడగలిగాం !
నిన్ను మరిచిపోతే గదా
గుర్తు చేసుకోవాలనుకోవడానికి.
అసలు నువ్వు మాదగ్గర శెలవు తీసుకుంటే గదా,
తిరిగి రావనుకోవడానికి !