సగం నిద్రలో గడచిన సగంజీవితం
సగంనిద్రలో కలుక్కుమని గుచ్చుకున్న
సగంచదివి విడిచిన పుస్తకం.
సగమే ముందు
సగం గతం
ఆశపడటం అప్పుడప్పుడు అసంగతం.
నడినెత్తికిచేరిన బ్రతుకుపొద్దు
నిశితంగా చూస్తుంది
నెరిసిన చెంపలతో సముద్రం
పలకరిస్తుంది.
నడచివచ్చినదారి
నను మరచిపోతుంది
నడవవలసిన దారి
మరచిపోయి నేను.
నడుమ నేను
అటు అద్దం ఇటు అద్దం
రెండు ప్రతిబింబాలు
ఎడమొహం పెడ మొహం.