తోలుబొమ్మలాట – 12వ భాగం

ముగింపు

బొమ్మల పెట్టెను మోస్తూ తోపుడు బండి ఊరు దాటింది.

బొమ్మలాట కళాకారులంతా దీనమైన మొహాలతో వెనక నడుస్తున్నారు.

ఎన్నెన్నో ఆశలతో పల్లెకొచ్చారు.

ఆశలన్నీ వమ్మయ్యాయి.

కలలన్నీ కన్నీళ్ళయి జారిపోయాయి.

పల్లె పూర్వపు పల్లెలాగే ఉందనుకొన్నారు.

కాపులంతా రైతుల్లాగే ఉన్నారనుకొన్నారు.

కులాల మతాల తేడా లేకుండా పని పాటలే జీవితంగా ఉన్నాయనుకొన్నారు.

కాపులంతా రెడ్లయ్యారని తెలీదు.

సుబ్బయ్య, రామయ్య, గురయ్యలుగా ఉన్న పాత కాలంలోనే తాము కాపులందర్నీ ‘రెడ్డిగారూ!’ అని పిల్చేవారు. వాళ్ళకు లేని ఉన్నతిని అనుభూతికి తెచ్చేవారు.

ఇప్పుడు అందరూ ఒకర్నొకరు రెడ్లుగా పిల్చుకొంటున్నారు.

తురకలు సాహెబులయ్యారు.

గొల్లలు కూడా చాలామంది యాదవులయ్యారు.

అన్ని కులాలు ఎక్కడివక్కడ బిగదీసికొంటున్నాయి గాని కలిసిపోవటం లేదు.

బొమ్మలాట ఆడాలని భావించటం ఏటికి ఎదురీదటమే. ప్రవహించే కొండవాగుకు అడ్డుకట్ట వేయటమే. మారేకాలం వెంట తామూ మారకుండా పాతకాలం కేసి వెళ్ళాలనుకోవటం అవివేకమేనేమో!

బొమ్మలు అమ్మి సొమ్ము చేసికోవటమే ఉత్తమమేమో!

టమోటా రైతు కళ్ళముందు మెదిలాడు గోవిందరావుకు.

‘‘ఊరు కూడా ఆ రైతులాగే ధ్వంసమైంది’ అనుకున్నాడు.

‘ఈ పల్లె మీగడోల్ల రాఘవులు బతుకులాగే శిధిలమైంది’ అనుకొంది కమలాబాయి.

‘రోల్లు, విసర్రాళ్ళు, రోకళ్ళులాగా గ్రామం కూడా పనికి రాకుండా పోయింది’ అనుకొన్నాడు వెంకట్రావు.

కలిమి మాన్లను కొట్టి పక్షుల్ని తరిమేసిన ఊరు ఇట్లా కాకుండా మరెట్లా ఉంటుంది!’ అనుకున్నాడు రామారావు.

‘‘దీనెక్క …. బొమ్మలాట సుజ్జూరమ్మని డబ్బాగొట్టుకంటా ఈధలంబడి పిల్చుకుంటా పోతాంటే కుక్కల్ను ఉసిగొలిపిన నాయాల్లకు తెలివేడ ఉంటది?’’

తిక్కలకొండి కూడా అసహనపడ్డాడు.

పల్లె అంటే – రాత్రి దొంగతనంగా తన ఎదల మీదకు వాలిన రెండు చేతులే గుర్తుకొస్తున్నాయి వనజకు.

ఊరు ఒక పీడకలగా అన్పిస్తూ ఉంది వాళ్ళకు.

అప్పటికే వంకదాకా నడిచి ఉన్నారు.

వెనుదిరిగి ఒకసారి పల్లెకేసి చూసి వంకలోకి దిగారు.

గట్టెక్కి కొంత దూరం నడిచేసరికి చెట్లల్లోంచి ‘‘దండాలయ్యా!’’ అంటూ ఎదురయ్యాడు పాములేటి.

ఎడమ చంకలో బొట్టెకట్టె ఉంది.

షుమారైన పొట్టేలి పిల్ల మెడకు చుట్టిన కండువా కుడిచేతిలో ఉంది.

దాన్ని ఈడ్చుకొస్తాన్నట్టుంది.

‘‘ఊరున్నమ్ముకొచ్చినోల్లు …. కడుపు గాలి తిడ్తే ఊరు నాశినమైతది. మీ ఒప్పందపు లెక్క బదులు ఇదో …. ఈ పొట్టేల్ని తీసప్పోండి …. మా ఊరిని తిట్టగాకండి …. నన్ను పొగడగాకండి …. పాత రోజులు మర్చిపోండయ్యా! పాత పగలు కూడా మర్చిపోండి ….’’ అంటూ పొట్టేలిని వాళ్ళకు అప్పగించి వెళ్ళిపోయాడు.

గోవిందరావుకయితే నోటమాట రాలేదు.

ఆలోచిస్తూ ఉంటే – అంతర్నేత్రమేదో తెరచుకొన్నట్టుగా అనుభూతి.

తాము పొరబాటే చేశారేమో!

ఎప్పుడో ఇరవైయేళ్ళ క్రితం జరిగిన కొద్దిపాటి ఆర్థిక నష్టాన్ని అదే పనిగా, పట్టుదలగా గుర్తుపెట్టుకొని దానికి కారకుడైన వ్యక్తిని ఇప్పుడు కూడా అవమానపరచటం …. తప్పే! …. ఇన్ని గ్రంథాలు చదువుకొన్న తాము ‘తనకు ఎవరైనా కీడుచేస్తే ఉత్తముడయిన వాడు తక్షణమే మరిచిపోతాడు. అధముడే కీడు చేసిన వ్యక్తిని జీవితాంతం గుర్తుంచుకొనేది’ అనే సూక్తిని ఎందుకు గుర్తుపెట్టుకోలేక పోయారు?

ఆ సూక్తి తమను స్పందింపజేయలేదు కాబోలు.

అంటే – తాము అధముల కోవకే చెందుతారా!

సిగ్గుగా అన్పించింది ఆయనకు.

జనాల్ని భయపెట్టుకొనేందుకూ, గ్రామంలో ఎవరూ తమకు సంభావన ఎగరగొట్టకుండేందుకూ ఆనాడు అది అవసరమే కాపచ్చు.

బెదిరించుకొని పని జరిపించుకొనేందుకు ఒక ఉపాయం కాపచ్చు.

ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు గదా!

బొమ్మలాట చూసేవాళ్ళే కనిపించని పరిస్థితుల్లో ఇంకా పాత పద్ధతులెందుకు!

పొట్టేలిని ఎంటేసుకొని ప్రయాణమయ్యారు వాళ్ళు.

గోవిందరావు ఆలోచిస్తూనే ఉన్నాడు – తార్రోడ్డు దాకా.

ఇరవై ఏళ్ళ క్రితం డబ్బెగరగొట్టిన వాన్ని ఇంకా గుర్తుబెట్టుకొని కసిదీర్చుకోవాలనుకోవటం సిగ్గుగా అన్పించింది.

తమకు నిజంగా ద్రోహం చేసింది వాళ్ళు కాదు.

తమ కళను పల్లెల దరికి రాకుండా చేసింది పెద్ద వీరారెడ్డి లాంటి వాళ్ళు కాదు …. వాళ్ళెవరూ తమ శత్రువులు కాదు.

తమకు నిజమైన శత్రువులు టివీలే.

బొమ్మను చేసి అవమాన పరచాలనుకంటే టీవీల బొమ్మను చేసి పోకమాను మోయించాలి.

ఒక్కో సీరియల్‌కు ఒక్కో రకమైన అవమానం.

ఒక్కో చానల్‌కు ఒక్కో విలక్షణమైన పరాభవం ….

అవును …. టివిల బొమ్మలు చేయాలి.

పాములేటి ప్రవర్తన గోవిందరావులో పెద్ద కుదుపే తెచ్చింది.

గ్రామాన్ని తిట్టొద్దన్నాడు.

తన కళ్ళతో చూస్తే గ్రామమంతా చెడిపోయినట్టే తోచింది.

తమ ఇళ్ళల్లో వచ్చిన మార్పులే గ్రామంలో కూడా వచ్చాయి.

తాము మారొచ్చు …. పల్లెమాత్రం దశాబ్దాల నాడున్నట్టే ఉండాలి. పాములేటి లాంటివాళ్ళు పల్లెల్లో ఇంకా మెజారిటీ సంఖ్యలోనే ఉన్నారు. వాళ్ళ దృష్టి కోణంలోంచి ప్రపంచాన్ని చూడగలగాలి.

గోవిందరావుకు ఎందుకో మళ్ళీ ఆట మీద మనస్సు మళ్ళింది.

జనాలమీద నమ్మకం కలుగసాగింది.

టౌనుకు వెళ్ళే బస్సును ఆపబోతూవున్న సుబ్బారావును వారించాడు.

తమ తర్వాతి మజిలీ ‘అక్కెంగుండ్ల’ అనే మరో కుగ్రామంగా సూచించాడు.

ఆశ్చర్యపోయి చూస్తోన్న తన వాళ్ళందరికీ ఆయన ఏదో చెప్పటం ప్రారంభించాడు.

[అయిపోయింది]