తండ్రి పడే అగచాట్లన్నీ కమలాబాయికి తెలుస్తూనే ఉన్నాయి.
ఇల్లిల్లూ తిరిగి అందరికాళ్ళు పట్టుకన్నా ఎవరి మనస్సూ కరగలేదనే విషయం అర్థమవుతూనే ఉంది.
భోజనం ఏర్పాట్లు ఒక గాడిలో పడ్డాయి. మొహం విరుపులతోటో, తప్పని తద్దినం గానో కొన్ని ఇళ్ళల్లోనైనా తిండి దొరుకుతోంది.
ఆట ఆడించాలనే నాన్న తపన, ఆరాటం ఆమెను కదిలించాయి.
తన పరిధిలో తనూ ప్రయత్నించాలి.
స్త్రీల మద్దతు కూడగట్టాలి.
వాళ్ళ చేత మగాళ్ళకు చెప్పించాలి.
తన తల్లిలా తనిప్పుడు ఆటాడటంలో ప్రధానపాత్ర వహించే సమయం వచ్చింది. కేవలం స్మృతుల్లో మాత్రమే మిగులుతుందన్న ఆట అనుభవానికి రాబోతోంది. ఈ అవకాశాన్ని జారవిడువకూడదు.
పంచల్లో పనుల్జేసుకంటూ ఉన్న ఆడవాళ్ళు వద్దకు వెళ్ళింది. తను సాయం చేద్దామనుకొంది గాని చేసాయం చేసే పనులేవీ వాళ్ళు చేయటం లేదు. దంచటమో, విసరటమో అయితే చేయందించేది. దోర చింతకాయలు ముందు పోసుకొని తొడిమలు తీసి బాగుచేస్తోంటే అందులో చేయి కలిపింది. అక్కడక్కడా మాగివున్న చింతకాయల్ని బొప్పటతీసి నోట్లో వేసికొంటే – సగం మాగి, సగం పచ్చిగా వింతయిన రుచి. దోరకాయల్ని శుభ్రంగా నీళ్ళల్లో కడిగి రాత్రికి రోట్లో పోస్తారు. తగిన మోతాదులో పసుపు, ఉప్పు కలిపి దంచి ఊరగాయ పెడితే అదే చింతతొక్కు లేదా ఉప్పు తొక్కు. కొద్దిపాటి నెయ్యి కలుపుకని వేడివేడి అన్నంలో పొగలూదుకొంటూ తింటే అదో మధురమైన రుచి.
ఊరిబైట అట్లా కళ్ళాలకేసి కూడా వెళ్ళింది.
బిగించిన కంప కట్టవతల మధ్య పోటు వాముల్తో పోటెత్తే కళ్ళాలు ఇప్పుడు శల్యావసిష్టంగా ఉన్నాయి. శివరాత్రి కంతా కళ్ళాలన్నీ జనాల కదలికలతో హోరెత్తాల్సింది. చెత్త కట్టే వాళ్ళతో, గింజలు తూరుపెత్తే వాళ్ళతో, పండెకొయ్యలు సరిజేసే వాళ్ళతో, వాములేసే వాళ్ళతో మారు మోగాల్సింది. ఒకరికంటే మించి మరొకరి వాములు …
ఎద్దు మేపుకోసం వచ్చే వాళ్ళు తాము.
ఎక్కడ ఇంత సందెడు తీసికెళ్ళినా తలెత్తి కూడా చూసేవాళ్ళు కాదు ఎవ్వరూ.
ఇప్పుడు తిండి గింజల పంటలే లేవుట. పత్తి, పొద్దు తిరుగుడు, వేరుసెనగ, మిరప … అన్నీ రూపాయల పంటలే … బోర్ల వ్యవసాయమే.
తిండి గింజలు కొనాల్సిందేనట. పశువులకు గడ్డి కొనాల్సిందేనట.
గంగిరెద్దుల వాళ్ళో, పరాయి ఊరి గెనుసుగడ్డల బండో ఊర్లోకి వస్తే – ఇప్పుడయితే మేపుకూడా వాల్లే వెంట తెచ్చుకోవాలిట. ఊర్లో ఎవ్వరూ పిడికెడు గడ్డి పోచలు కూడా రాల్చరట. ఎందుకంటే – ఎక్కడో కె.సి.కెనాల్ కాలువ కింద నుంచి గడ్డి కొని తోలుకు రావాలి. ఆ పిడికెడే రూపాయల్లో చూడాల్సిన పరిస్థితి. బండో, రెండు బండ్లో కట్టల లెక్క కొనుక్కచ్చి అపురూపంగా దాచుకొని పొదుపుగా వాడుకొనే స్థితి.
కొన్న గింజలు కాబట్టి భిక్ష గాళ్ళొచ్చినా మనస్ఫూర్తిగా భిక్షం వెయ్యలేనితనం. ఏదో మొక్కుబడిగా, అది గొణుక్కుంటూ నాలుగు బియ్యం గింజలు రాల్చటం…
కొన్న గడ్డి కాబట్టి – గాళ్ళల్లో నాలుగు పోచలు కూడా మిగలకుండా దిబ్బల్లో గడ్డిపోచకూడా కనబడకుండా పశువుల్ని మేపటం ..
అందరి ఇళ్ళల్లోకీ టివిలు మాత్రం కావాలి. నెలకు డెబ్బై రూపాయలు ఖర్చుజేసి కేబుల్ కనెక్షన్ల ద్వారా రకరకాల చానల్లు చూడాలి.
అవసరమున్నా లేకున్నా అప్పు చేసైనా ఇంట్లో ఫ్యాన్లు బిగించాలి. మిక్సీలు కావాలి. వీలైతే సెకండ్ హ్యాండ్ మోటారు బైకులు కూడా కొనాలి. సుమారైన వారంతా జేబుల్లో సెల్లు మోగిస్తుండాలి.
తినేందుకు ఖర్చుబెట్టరు గాని … మిగతా అన్నింటికీ …
ఎవరైనా కొత్త మనుసులు ఇంటికి వచ్చినా అన్నం పెట్టేందుకు వెనకాడతారు కాని కాఫీలు, కూల్‌డ్రింక్‌లు ఇచ్చేందుకు ముందుకొస్తారు. వాటితోనే వీడ్కోలు పలికేందుకు ప్రయత్నిస్తారు.
ఈ రెండ్రోజుల్లో వాళ్ళను వీళ్ళను కదిలిస్తే తెలిసిన సంగతులవి. కొంతమంది ఆడవాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకని మరీ బాధపడ్డారు.
నలుగురు ఆడవాళ్ళు కలిస్తే ఇరుగమ్మ పొరుగమ్మ సంగతుల కన్నా, టీవీ సీరియళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. జగరబోయే కథ గురించి ఊహలు అల్లటంతో పోటీ పడుతున్నారు. సీరియళ్ళు టైటిల్ సాంగ్‌లను పాడుకంటున్నారు.
టౌనుల్లోనే ఈ పిచ్చి ఉందనుకొంది కమలాబాయి.
పల్లెలకు కూడా బాగా పాకింది.
మాటల సందట్లో తన యవ్వనంలో తారసపడిన యువకుని గురించి ఆరా తీసింది ఆమె. తపన చంపుకోలేక ఆడాళ్ళ ముందు తెలివిగా ప్రశ్నించింది.
అతని పేరు తెలిసింది. మీగడోల్ల రాఘవరెడ్డిట.
తండ్రి చనిపోవటంతో ఆ యేడాదే వ్యవసాయంలోకి దిగాడుట.
అంటే … ఊర్లోనే ఉన్నాడన్న మాట.
వ్యవసాయ దారునిగానే జీవిస్తున్నాడన్న మాట.
తాను గుర్తుంటుందో లేదో!
ఆ పడుపూ, ఆ హయలూ, సూదంటు రాయిలాంటి ఆ చూపులూ, ఆ యవ్వనం …
ఒక్కసారి అతన్ని చూడాలని ఉంది.
అతనేమైనా తమకు సాయం చేయగలడేమో!
ఆనాటి జ్ఞాపకాలు అతన్ని వీడిపోకుంటే సరిగ్గానే స్పందించగలడు.
ఊర్లో పెద్ద మనుషుల్ని అడిగినట్టు అతన్నీ అభ్యర్థించాలి. ఆటాడేందుకు అవకాశం ఇప్పించమని అడగాలి.
తనకెందుకో చాలా నమ్మకంగా ఉంది – తప్పక కృషి చేయగలడని.
ఆ ఊహ వచ్చింది ఆలస్యం – ఆమె హృదయం ఆనంద పరవశురాలైంది. నిలువెత్తు సమస్య ఒకటి పూర్తిగా కరిగిపోతోన్నట్టే అన్పించింది.
కూతురికి కొన్ని జాగ్రత్తలు చెప్పి వీధిలోకి నడిచింది.
వేపచెట్టు కింది కల్రోళ్ళ మీంచి యువకుల చూపులు గుడిలోకి సురసుర దూసుకొస్తున్నాయి.
వాళ్ళతో కలిసున్నాడు తిక్కలకొండి.
ఇంటి గుట్టు బైట విప్పే విభీషణుడి లాంటివాడు.
వాడక్కడ ఉండటం క్షేమం కాదు.
‘‘అబ్బీ! ఓ కొండల్రావూ!’’ కేకేసినట్టుగా పిల్చింది.
రెండో పిలుపుకు గాని అర్థం కాలేదు తిక్కలకొండికి.
అంత మర్యాదకరమైన పిలుపు తనదేనని అతనూహించలేదు.
నిర్ధారణ అయింతర్వాత ఆనందం పట్టలేకపోయాడు.
ఒక్క లగువున అత్త వద్దకు చేరుకొన్నాడు.
‘‘పోదాం రాబ్బీ!’’ అంటూ దారితీసింది.
గంగిరెద్దులా వెంట నడిచాడు.
‘‘ఆటాడ్డం కుదరలేదంటబ్బీ! మనోల్లెంత బంగపన్నే పెద్ద మనుసులెవురూ పప్పుకోలేదంట…’’
‘‘ఎందుకత్తా?’’
‘‘ఏమోబ్బీ! ఉత్తసేతల్తో ఊరికి పోవాల్నేమోనని మనోల్లు దిగులు బడ్తాండ్రు.’’
‘‘దీనెక్క … ఇప్పడెట్ట జెయ్యాలత్తా?’’
‘‘పొద్దున నాకొక సాధు కనబన్నెడబ్బీ! చిన్న ఉపాయం జెప్పిండు … ఎవురో … మీగడోల్ల రాఘవరెడ్డంట … ఆయప్పను పప్పించుకంటే అన్నీ ఆయప్పే సూసుకుంటాడంట. మనం కాల్లా యేల్లా పడైనా …’’
‘‘నియ్యక్క … కాల్లు బట్టుకుండే పని నా కొదిలిపెట్టు లేత్తా! పప్పుకునేదాకా ఇడ్సన్లే … నువ్వు ఒప్పిచ్చుకున్నేంక ‘అబ్బీ కొండల్రావూ!’ అని పిల్చినాంకనే ఇడుస్చాలే ..’’
నవ్వొచ్చింది ఆమెకు.
బలవంతాన ఆపుకొంది.
‘‘ఆయప్ప యాడుండేది నాకు తెల్లేదబ్బీ! .. నెల తక్కువైనా మొగపిల్లోడై పుట్టాలని సామెత. నువ్వయితే ఎతికి కనుక్కుంటావు … మనోల్లతో కానిపని మనిద్దరం కల్సి సెయ్యాల …’’
ఉబ్బి తబ్బిబ్బయ్యాడు తిక్కలకొండి.
గుండెల నిండా గాలి పీల్చుకొని ముందుక్కదిలాడు.
కమలాబాయి అక్కడే నిలబడింది.
వేపచెట్టు నీడన నిల్చుని వీధిలో అటు ఇటు చూడసాగింది.
పల్లెలు కూడా పూర్తిగా మారిపోయాయి.
కుచ్చెల పైటల్లో కనిపించే ఆడపిల్లలే కరవయ్యారు.
పంజాబీ డ్రస్సుల్లోనో, నైటీల్లోనో కన్పిస్తున్నారు చాలా వరకు. ఆ దశ నుంచి నేరుగా చీర జాకెట్ల దశకు వెళ్ళిపోతున్నారు.
మెల్లిగా రెడ్డిగారి వీధిలోకి నడిచింది.
పంచల్లో కూచునున్న అమ్మగారితో మాటలు కలిపింది.
బొమ్మలాట ఒప్పందం గాని విషయాన్ని ఆవేదనగా చెప్పింది.
ఆడమ్మ గారయినా కరుణించండంటూ వేడుకంది.
‘‘నను బ్రోవమని చెప్పవే … సీతమ్మ తల్లీ!’’ అంటూ రామదాసు కీర్తన పాడింది.
‘సీతమ్మ చెబితే రాముడంతటి వాడు కూడా ఒప్పుకొంటాడు. మీరు చెబితే రెడ్డిగారు ఎందుకు సమ్మతించరూ?’’ అంది.
ముసలీ ముతకా బాగానే స్పందించారుగాని వయస్సులో ఉన్న వాళ్ళు పట్టించుకోలేదు. ఆడపిల్లలైతే మరీ వింతగా చూశారు.
వరస పంచలన్నీ ఓపిగ్గా తిరిగింది.
కన్పించిన ఆడ మనిషినల్లా అడిగింది.
తిక్కలకొండి గుర్తుకొచ్చేటప్పటికే చాలా సమయమైనట్టుగా అర్థమై గుడి వద్దకు నడిచింది.
కోటవీధికేసి ఎగమల్లింది.
దారిన్నే ఎదురయ్యాడు వనపర్తి కొండలరావు.
ఆమెను అల్లంత దూరంలో చూడగానే ‘‘దీనెక్క … దొరికిందత్తో!’’ అన్నాడు మొహం నిండా హుషారు నింపుకని.
ఆమె గుండెలు జల్లుమన్నాయి.
అతని వెనగ్గా చూసింది.
ఎవరో మనిషి వస్తున్నాడు.
మీగడోల్ల రాఘవరెడ్డి కాదుగదా!
అప్రయత్నం గానే ఆమె పైట సవరించుకొంది.
బట్టతల, నెరిసిన మీసం, బక్కచిక్కిన శరీరం, మాసిన బట్టలు … అతన్ని రాఘవరెడ్డిగా ఆమె మనస్సు ఏమాత్రం అంగీకరించలేదు.
ఆమె స్మృతుల్లోని రాఘవరెడ్డి వేరు.
‘‘దీనెమ్మ .. పొద్దుననంగా సేనికాడికి పొయ్యిండంట … సంగటిగ్గూడా రాలేదంట … నేనేడుండేది కనుక్కున్నే … దీనెక్క .. ఎంత సేపడిగినా ఆయప్ప పెండ్లాం సెప్పనే సెప్పదే … బొమ్మలాట గాల్లమని నమ్మ బలుకుతే గాని ఆయప్ప యాడుండేది సెప్పలే …’’
నొసలు ముడేసింది కమలాబాయి.
‘‘ఈ పక్క సేలల్లో సేనంట … పోలేరమ్మ సేలంట …’’ దక్షిణం దిశగా చేయి చూపించాడు తిక్కలకొండి.
ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు ఆమె.
ఇద్దరూ ఊరుదాటి చేలదారి బట్టారు.
నడుస్తూ రాఘవరెడ్డి భార్యను గురించి ప్రశ్నించింది.
ఆమె బక్కపలచగా, ఎండిన శరీరంతో, రోగిస్టిలాగుందని తెలిసి ఆశ్చర్యపోయింది.
ఆ కాలంలోనే చదువుకున్న వాడు. వ్యవసాయంలో కొత్త మెలకువలు ప్రయోగించి మంచి ఫలితం తీస్తూ సంపన్నుడై ఉంటాడని ఆమె ఊహ … కోరమీసంతో, ఇస్త్రీ మడతలు నలగని ఖద్దరు చొక్కాలో, వేళ్ళమధ్య సిగరెట్‌తో, జేబులో సెల్‌ఫోన్‌తో .. ఆమె ఊహించుకుంటూనే ఉంది.
తమ స్మృతులు గుర్తుండే ఉంటాయనీ … సమస్య పరిష్కరించగలడనీ, ఆటాడించేందుకు సాయం చేయగలడనీ …
మనస్సులో ఓ వైపు సంకోచంగా కూడా ఉంది – కొద్దిపాటి స్నేహాన్ని స్వార్థానికి వినియోగిచుకోబోతున్నానేమో!’ అని.
రెండు చేలు దాటింతర్వాత కాలువ వద్ద మడవ కడుతోన్న మనిషిని అడిగి రాఘవరెడ్డి మోటారు ఆచూకీ తెలిసికొచ్చాడు తిక్కలకొండి.
ఎదురుగా మరో రెండు చేల ఆవల … వంకగట్టున వేపచెట్టు … దానిపక్కగా గుడిసె … అదేనట..
కమలాబాయి ఎదలో ఎన్నెన్నో భావనలు.
తాను అతిగా ఊహించుకంటోందేమో!
ఎప్పుడో యుక్త వయస్సులో స్పర్శించిన చిన్నపాటి పరిచయాన్ని అతనింకా గుర్తు పెట్టుకుంటాడనీ, తనలాగే స్పందిస్తాడనీ భావించటం పొరబాటేమో!
ఏదేమైనా తన్నతను గుర్తు బడతాడని మనస్సు మాత్రం దృఢంగా నమ్ముతోంది.
పొద్దు తిరుగుడు పైరు బాగా గింజపట్టి ఉంది.
చివరి తడి కాబోలు సమయానికి నీరందక అక్కడక్కడా నిలువునా వాడిపోయి ఉంది. కొన్ని చేలల్లో కంకులు ఎర్రగా ఎండి గగ్గులై కన్పిస్తున్నాయి .. తెగులు సోకింది కాబోలు.
రెండవ చేను సగానికి నడిచింతర్వాత కొండల్రావుకు చెప్పింది ‘‘అబ్బీ! నువ్వీన్నే ఉండు … నేను బోయి మాట్లాడొస్తా …’’ అని.
‘‘అత్తా! ఒప్పుకోకుంటే సెప్పు … నేనొచ్చి కాలుబట్టుకొంటా .., నువ్విడ్సుమనే దాకా ఇడ్సనే ఇడ్సను …’’
నవ్వొచ్చింది ఆమెకు.
‘‘సరేలే’’ అంటూ నేరుగా గుడిసెకేసి నడిచింది.
మనస్సులో ఓ మూల గోలజేస్తూనే ఉంది – అపరిపక్వ భావాల కన్నెపిల్ల చేష్టలు కూడా కాదు. ఇంకా చిన్న పిల్లల చేష్టలు చేస్తున్నానేమోనని. అతని ఎదురుగా వెళ్ళి తనెవరో పరిచయం చేసికోవటం కాదు – ఆనాటి స్మృతుల్ని సైతం గుర్తు చేయాల్సిన దుస్థితి కలుగుతుందేమోనని.
హృదయమెందుకో ఏ వ్యతిరేక భావనల్నీ ఒప్పుకోవటం లేదు.
తన నమ్మకం తనదిగా ముందుకు నడిపిస్తోంది.
పొద్దు ఇంకా బారెడుంది.
గుడిసెకు ఇవతలే సబ్ మెర్సిబుల్ మోటారుంది.
ఆడటం లేదు అది – కరెంటు వదిలే సమయం కాదేమో!
గుడిసెకేసి కదలుతోన్నదల్లా – ఉన్నట్టుండి ‘బళుక్’మనే చప్పుడూ వెంటనే సరసరమని నీళ్ళు దూకే ధ్వని వినిపించటంతో ఉలిక్కిపడి అటుకేసి చూసింది.
పంపులోంచి ఇప్పుడు నీళ్ళు దూకుతున్నాయి.
ఆశ్చర్యంగా అటే చూస్తూండి పోయింది ఆమె.
పది కడవల నీళ్ళు దబదబ దూకగానే నీటిధార తగ్గింది.
మరో నిమిషం తర్వాత సన్నగా కారుతున్నవి కాస్తా ఆగిపోయాయి.
మోటారు మాత్రం భూమి లోపలి పొరల్లో ఎక్కడో నిశ్శబ్దంగా రన్నవుతోంది.
నీళ్ళు మాత్రం రావటం లేదు.
నిమిషం గడిచింది .. రెండు నిమిషాలు … మూడో నిమిషం … ఉన్నట్టుండి మళ్ళీ దూకాయి నీళ్ళు.
ఆశ్చర్యపోయింది ఆమె.
కరవు దెబ్బకు భూగర్భ జలాలు ఇంకిపోయి మోటార్లకు నీళ్ళందటంలేదని తను విన్నదిగాని ప్రత్యక్షానుభవం ఇదే.
ఏడు గంటల కరంటైనా, ఇరవై నాలుగ్గంటల కరంటైనా ఈ నీళ్ళకు కాలువ తడుస్తుంది గాని కయ్య తడవదు.
మోటారు పరిస్థితి చూడగానే రైతు వ్యవసాయ వాతావరణమేదో అర్థమైంది కమలాబాయికి.
దీర్ఘంగా నిట్టూరుస్తూ గుడిసెకేసి రెండడుగులు వేసింది.
గుడిసెలోంచి ఏవో శబ్దాలు విన్పించినట్టు తోచి చెవులు రిక్కించింది.
ఎవరో మాట్లాడుతున్నారు.
లోపల కూచుని యవ్వారం చేస్తున్నారు కాబోలు రైతులు.
మరో నాలుగడుగులు వేసేసరికి ఆ సవ్వడి కొంతలో కొంత స్పష్టమై … అదేదో మూలుగులాంటి శబ్దంలా … ఏడుపులా … ఏడుపు మధ్యలో గొంతెత్తి తనలో తనే మాట్లాడుకంటోన్నట్టుగా … ఆ గొంతు ఖచ్చితంగా మగగొంతే … సందేహం లేదు.
గుడిసెకు మూడు వైపులా పత్తి పుల్లలతో దడి కట్టబడి ఉంది.
దడికి దగ్గరగా వెళ్ళి సద్దుచేయకుండా ఆనుకొని నిల్చుంది.
ఏదో ఉత్సుకతతో చెవిపగ్గింది.
‘ఎట్ట జెయ్యాల్రా దేవుడా? పైరెట్టా బతికించుకోవాల్రా పరమాత్ముడా! కరువుల మీంద కరువుల్దోలి యేసిన బోర్లన్నీ ఎండబెడ్తివి. చేసిన అప్పులెట్లా దీర్సాల? నేనేం సారాయి దాగి అప్పుల్జెయ్యలే! … పేకాడి అప్పుల్జెయ్యలే! … ముండల మరిగి అప్పుల్జెయ్యలే! … ఇదో … ఈ బూమికే .. ఇత్తనాలకూ .. ఎరువులకూ … పురుగు మందులకూ … సేద్దేలకూ … టౌనుకు పోతే ఒక్క పూటన్నా లెక్కబెట్టి హోటల్లో బువ్వ దిన్నేనా? పేగెండ గట్టుకొని మాపిటేల ఇంటికొచ్చి కుండలో కలిగింది తింటాంట .. నాకెందుకు బెట్టినావురా బగవంతుడా – ఈ కష్టాలన్నీ? ఇంటికి పోదామంటే అప్పులోల్లు మెడకు గుడ్డేస్తారేమోనని బయ్యం … నడీధిలో నిలేస్తారని బయ్యం … ఎట్ట జెయ్యాల నాయనా! పొలమమ్మి టౌన్లో సిన్న యాపారం పెట్టుకొందామని పెద్దోడు కొట్లాడి కొట్లాడి నన్ను లొంగదియ్యలేక దేశాలు బట్టి పాయే. యాడుండాడో బిడ్డ? .. వాని మాటిన్నే బాగుపడిండేవాన్ని … కూతురు ఎదిగొచ్చె … అప్పులు సప్పులు జేసి సిన్నోన్ని ఇంజనీరింగ్ రొండేండ్లు ఇగ్గులాడి మల్ల అప్పులు పుట్టక … వాడు ఉట్టికీ సొర్గానికీ చెల్లక పాయే .. ఎట్ట జెయ్యాల రామచంద్రా! … అప్పులు దీర్సే మార్గమెట్టరా నాయనా! … గట్టెక్కే దారేదిరా తండ్రి! అప్పులోల్లు ఇంటిమీది కొచ్చి అమ్మలక్కల తిట్టి యీదుల్లోకి ఈడ్సక ముందే ఇంత మందు దాగి సచ్చేంత తెంపన్నాయాయరా దేవుడా ..!’’
ఎవరూ లేని ఏకాంతంలో శోకాలు తీస్తున్నాడు.
కడుపులో బాధనంతా కనిపించని దేవునికి నివేదిస్తున్నాడు.
కనీసం పెండ్లానికయినా చెప్పినాడో లేదో!
పాతిన నంబర్రాతిలా చాలాసేపు అలాగే నిల్చుండి పోయింది కమలాబాయి. ఆమె తలలో ఏ ఆలోచనలూ కదలాడలేదు.
లోపల్నించి ఇంకా ఏడుపులు విన్పిస్తూనే ఉన్నాయి.
మగాడు ఏడవటం ఆమె ఎప్పుడూ చూడలేదు.
అందులోనూ స్వతంత్ర జీవనం కలిగిన రైతు..
బండరాయిలా ఉండాల్సిన మగాడి గుండె కరగి నీరవుతోన్న దృశ్యం గుడిసె నిండా.
ఒక దీర్ఘ నిశ్వాసం తర్వాత గుడిసె నించి ఒకడుగు వెనక్కివేసింది.
గుడిసెను చుట్టి లోపలికి వెళ్ళి అతన్ని చూడాలనే కోరికను బలవంతంగా ఆపుకంది.
అతను ఎలాగైనా ఉండొచ్చు …. తనూహించుకన్న రూపంలో లేకపోవచ్చు …. బక్కచిక్కి ఎముకల గూడులా …. ఎండిన బోరు బావిలా …. చీడపట్టిన పైరులా …. పరమ దరిద్రంలా …. ఏమో …. ఎలాగైనా ఉండొచ్చు …. ఎలా ఉన్నా అతన్ని చూసే ధైర్యం తనకు లేదు.
తన స్మృతుల్లోని యువకుణ్ణి అలాగే బతకనీ.
అతన్ని తను చంపుకోలేదు.
అతని స్థానంలో మరొకర్ని, ఇంకకర్ని ఊహించుకోలేదు.
బహుశా గుడిసెలో ఉండేది మీగడోల్ల రాఘవరెడ్డి కాకపోవచ్చు.
ఎవరో …. బక్కచిక్కిన రైతు …. అంతే ….
వెనుదిరిగి విసవిస ఊరికేసి నడిచింది.
తిక్కలకొండి ప్రశ్నకు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేకపోయింది ఆమె.