తోలుబొమ్మలాట – 04వ భాగం

మలిరోజు

చల్లని నిద్దురవేళ …. చలిపొద్దున ఢమరుక శబ్దం ….

ఆ వీధి నుంచి ఈ వీధికి నిరంతరాయంగా మోగుతూ ఉన్న బుడబుక్కల వాని కంఠస్వరం …. అదో రకమైన యాసతో, చల్లపొద్దును పక్కలో చేయి దూర్చిలేపినంత జలదరింపుగా అతని గొంతు ….

కళ్ళు తెరవకుండానే ఢమరుక శబ్దం వింటూ హృదయం అనుభూతించే పురాభావాల స్పందనల్ని గమనిస్తూ ఉండిపోయాడు కొంతసేపు.

లేచి కూచుని కళ్ళు తెరిచేసరికి తెల్లవారుతూ ఉంది.

ఢమరుక శబ్దం ఇంకా మోగుతూనే ఉంది. వీధుల్ని నిద్ర లేపుతూనే ఉంది. నిద్రా భంగమైనందుకు విసుక్కొంటోన్న వాళ్ళు వద్దన్నా మరికొంత సేపు మోగుతోంది.

ఆసక్తికరంగా అన్పించింది ఆయనకు.

అలాంటి సన్నివేశాలు కన్పించవేమో అనుకున్నాడు.

ఆ కళలన్నీ తమ కంటే ముందే అంతరించి ఉంటాయను కున్నాడు.

ఇంకా జీవించి ఉండటం ఆశ్చర్యమే!

అయితే – అప్పటికి ఇప్పటికి కొంత తేడా కన్పిస్తోంది.

ఏ ఇంటి వద్దా ఎక్కువసేపు నిల్చున్నట్టు లేదు అతను.

లోగడ అయితే ఒక్కో ఇంటివద్ద ఒక ఉదయమంతా గడిచిపోయేది. పాత వస్త్రాలిమ్మనీ, చేరెడు గింజలు పెట్టమనీ, మరేవేవో కోరికలతో గృహస్తుల్ని పీడించేవారు. ఇంటి ముందునించి లేచేవారు కాదు. ఢక్కి మోత ఆపేవారు కాదు. పాడటం చాలించేవారు కాదు. ఇంట్లో వాళ్ళచ్చి కాళ్ళా వేళ్ళాపడి బతిమాలి చేటెడు గింజల వద్ద సగం చేటెడయినా పెట్టి పంపేవారు.

ఇప్పుడు బుడబుక్కల వాడి ఆలోచనా ధోరణిలో తేడా వచ్చిందో మరి రైతుల్లో మార్పొచ్చిందో అర్థం కాలేదు.

పూర్తిగా తెల్లారేసరికి అతని యాచన విరమించబడుతుంది.

తన వాళ్ళను లేపాడు గోవిందరావు.

కాలకృత్యాలు తీర్చికొనేందుకు చెంబుపట్టుకని ఊరిబైటకు నడిచాడు.

అతనికి ఆశ్చర్యాన్ని గొలుపుతూ గ్రామమింకా మేలుకోలేదు – ఎవరో తమలాంటి వృద్ధులు తప్ప.

బరుగొడ్ల కట్టాలు పాలధారలతో ఇప్పటికే మోగిపోవలసింది.

చాలామంది ఇంకా మంచాలమీద ముసుగు తన్ని ఉన్నారు.

ఆ విషయాన్నే అల్లునితో చర్చిస్తూ వంకలోకి చేరుకొన్నారు.

కాలకృత్యాల అనంతరం వేపపుల్ల విరుచుకొని మెల్లగా ఊరుదారిబట్టారు.

అప్పటికే తూరుపుకొండన కుంకుమరాశి రేగింది.

పొద్దు బిళ్ళ ఆకాశపు నుదుటికి ఎగబాకేందుకు తొంగిచూస్తోంది.

దేవాలయం వద్ద కొస్తోంటే ఆ వీధిన ఇంకా ఢమరుకాన్ని మోగిస్తూ బుడబుక్కల వాడు.

నమ్మలేనట్టుగా చూశాడు గోవిందరావు.

ఇంకా అడుక్కొంటున్నాడు అతను.

ఇంతకు మునుపటి కాలంలా ఎవరినీ వేధించటం లేదు.

మొండికి పడి పాత వస్త్రాన్నో, చేటెడు గింజెల్నో గుంజుకోవటం తన హక్కుగా భావించటం లేదు.

పొద్దు పొడిస్తే వీధుల మొహం చూడకూడదనే సాంప్రదాయిక కట్టుబాట్లను పాటించటం లేదు.

వేషం అదే ఉన్నా, భాష మారకున్నా, ఢమరుకం వీడకున్నా తనవృత్తి లక్షణాల్ని వేటినో వదలుకున్నాడు.

సాధారణ యాచకుల్లా పది రూపాయలిచ్చినా చేయిపడుతున్నాడు. ఐదు రూపాయలు విసిరినా కొంగు పడుతున్నాడు. చివరకు రెండు రూపాయల బిళ్ళతో సైతం తృప్తిపడి మరో ఇంటికి వెళుతున్నాడు.

బుడబుక్కల వాడి గురించిన ఆలోచనలు చాలా సేపటిదాకా గోవిందరావును వదలిపోలేదు.

అంతలో ముత్రాసు వెంకటేశు వచ్చాడు ‘‘పెద్దాయనా! పోదామా!’’ అంటూ.

‘‘బహు జాగ్రత్తగా వచ్చావు నాయనా! కార్యదీక్షలో మీ తండ్రికి ఏ మాత్రం తగ్గే వాడివిలా లేవు …. ఒక్క చిటుక సేపు ఆగు నాయనా! అంటూ గబగబ నోరు కడుక్కన్నాడు ముసలాయన.

వంకీ కర్ర చేతబట్టుకని సుబ్బారావుతోటి కదిలాడు.

తాము కలవబోయే గ్రామపెద్ద రాఘవరెడ్డి కాంట్రాక్టరనీ, ఓ మోస్తరు రాజకీయ నాయకుడనీ వెంకటేశు మాటల్లో తెలిసింది.

అతను చిన్న రామిరెడ్డి కొడుకని తెలిసి ఆశ్చర్యపోయాడు.

తమ హయాంలో చిన్న రామిరెడ్డి ఓ మామూలు రైతు.

వ్యవసాయాన్ని వదిలేసి రాజకీయాల్లోకి దిగి మండల స్థాయిలో గుర్తింపు పొందాడట. బాగానే డబ్బు సంపాదించాడట.

పాతకాలం నాటి పెద్దరికాలు చాలా వరకూ మారిపోయున్నాయి.

ఆనాటి పెద్ద మనుషులు కొందరు కాలమైపోగా మిగిలిన వాళ్ళు వృద్ధాప్యంతో మగ్గుతున్నారట.

అప్పటి చిన్న రామిరెడ్డికి నాలుగంకణాల కొట్టం.

ఇప్పుడో …. దాని స్థానంలోనే వెలసిన పెద్ద బిల్డింగ్‌.

ఇంటి ముందు జీపు కూడా ఉంది.

వాళ్ళు గేటు తీసుకొని లోపలికి వెళ్ళేసరికి రాఘవరెడ్డి కొలువుదీరి ఉన్నాడు.

ఎదురుగా అరుగుల మీద పది మందికి పైగా గ్రామస్తులున్నారు.

మీసాలు తడువుకొంటూ దూరాన్నించే బొమ్మలాటగాళ్ళను గమనించాడు అతను.

నల్లని పత్తయిన జుత్తు, లావు మీసాలు, కొవ్వు పట్టిన శరీరం, ఖద్దరు దుస్తులు నలభైయేళ్ళ లోపు వయస్సుతో అందంగా ఉన్న అతనే రాఘవరెడ్డి అని తెలియగానే రెండు చేతులు తలపైకెత్తి ‘‘ధర్మ ప్రభువులకు నమస్కారం ….’’ అంటూ దండం పెట్టాడు గోవిందరావు.

‘‘మహా ప్రభువులు .. పెద్ద రెడ్లు .. ఈ గ్రామానికి రారాజులు …. మండలానికి మహరాజులు .. రెడ్ల వంశానికే వన్నెదెచ్చిన పాలెగాళ్ళు .. రెడ్డిగారూ..

పాకనాటి కులాబ్ది పరిపూర్ణ సోమ

శ్రీకరోపాయ లక్ష్మీ సత్య సాంద్ర

పాక శాసన భోగ ప్రస్తుత కులీంద్ర

నీకు తగునా కీర్తి నిల హరిశ్చంద్ర

దండి రెడ్లకు నెల్ల దండిబలుడనగ

మిండొద్దు లోభులకు మిండడితడనగ

కొండెమాడెడు రెడ్ల గుండె దిగులనగ

నిండు వేడుక ప్రజల్‌ నిను మేటియనగ

ధర్మ ప్రభువులు మీరు …. కులానికే వన్నెతెచ్చిన మహానుభావులు …. రెడ్లకు రెడ్లు ….’’ అంటూ దగ్గరగా వెళ్ళాడు. వంకీ కర్రను రెండు చేతుల్లో పట్టుకొని నిల్చున్నాడు.

వాళ్ళకేసి చిరునవ్వుతో చూశాడు రాఘవరెడ్డి.

‘‘మీలో గోవిందరావు ….?’’ అంటూ ప్రశ్నార్థకంగా నొసలు ముడేసే సరికి ….

‘‘నేనే స్వామీ!’’ చెప్పాడు.

‘‘మీ రొచ్చిన సంగతి ఉదయాన్నే చెప్పినారు …. సరే …. కూచోండి …. రేయ్‌ .. వీళ్ళకు కాఫీ తెచ్చీండ్రా!’’ పని మనుషుల కేసి చూశాడు.

ఈలోపు ఓ చిన్న అరుగుమీద కూచున్నాడు గోవిందరావు. రెండు మోకాళ్ళ సందుల్లో కర్ర వూతేసుకని, దాని కొంకిపైన రెండు చేతుల్ని మోపి రాఘవరెడ్డి కేసి చూడసాగాడు.

‘‘గోవిందరావూ! …. చెప్పు ….’’ చిరునవ్వుతో అడిగాడు రాఘవరెడ్డి.

‘‘తమరికి తెలీందేముంది – ధర్మ ప్రభువులు’’ దగ్గరకు తెచ్చిన కాఫీ గ్లాసును అందుకొని పక్కన పెట్టుకొన్నాడు. ‘‘మీ తండ్రి చిన్నరామిరెడ్డి మహాప్రభువు. ఆయన హయాంలో మా కళకు మంచి ఆదరణ ఉండింది. ఈ ఊరొస్తే చాలు మాకు ఎలాంటి కుందస్తు జరక్కుండా రెడ్డిగారు కళాపోషణ జేస్తాండిరి …. వారి సంతానం మీరింకా వన్నెకెక్కి ఉన్నారు. వాసిగాంచినారు. ఎండలు కాసే భూమండలానికంతా ప్రఖ్యాతిగాంచి ఉన్నారు. ఇప్పుడు కూడా …. మీ తండ్రి వలెనే మీరూ దయదలిస్తే …. ఒక్క ఆట ఆడిపోదామని వచ్చినాము రెడ్డిగారూ!’’ అంటూ కాఫీ గ్లాసును మెల్లిగా మునివేళ్ళతో తీసి భుజం మీది పలుచని కండువా గుడ్డతో పట్టుకున్నాడు.

తన వాళ్ళకేసి ఓసారి చూసి చిన్నగా నవ్వాడు రాఘవరెడ్డి.

గోవిందరావు మాటలనిండా పొగడ్తలే అయినా కొత్తగా ఉన్నాయి. గతంలో వేదిక ఎక్కి పొగిడించుకొన్న అనుభవాలు తనకున్నాయి గాని, ఇట్లా పొందికయిన మాటలు, శుద్ధమైన ఉచ్చారణా ఎప్పుడూ ఎరగడు. తనొక్కన్నే కాకుండా తన పూర్వీకుల్ని కూడా గొప్ప వాళ్ళుగా చిత్రీకరించటం కూడా కొత్త రుచినిచ్చేందుకు కారణం కావచ్చేమో!

‘‘ఇప్పుడెవురు సూస్తారబ్బా బొమ్మలాట..’’ పక్కనే ఉన్న ఆయన ప్రధానమంత్రి సుబ్బారెడ్డి అన్నాడు.

అతనికేసి కుతూహలంగా చూశాడు రాఘవరెడ్డి.

‘‘అంతమాటనొద్దు రెడ్డిగారూ! మా మీద మీరు దయజూపాల …. మాకు ఒక్క అవకాశమిప్పించండి .. ఆటాడించే అవకాశమియ్యండి … ‘‘గోవిందరావు లేచి నిలబడ్డాడు.’’ అయ్యా! మా పూర్వీకులు ఎప్పుడో మరాఠా దేశంనుంచి కళను భుజాన మోసుకొచ్చినారు రెడ్డిగారూ! ఈ గడ్డమీద వాళ్ళకింత ఆశ్రయమిచ్చి ఇంతదాకా ఈ కళను బతికించింది ఆనాటి నుంచి ఈనాటి వరకూ తమరి కులస్థులే స్వామీ! …. ధర్మ ప్రభువులు .. ఆ సంప్రదాయాన్ని నిలబెట్టండి…. ఒక్కరాత్రి మాకు ఆటాడే అవకాశం ఇప్పించండి చాలు.. ‘‘రెండు చేతులు ముకుళించి ప్రాధేయ పూర్వకంగా అడిగాడు.

అక్కడ కొంతసేపు చర్చ జరిగింది.

రాఘవరెడ్డిని ఇంట్లోకి తీసికెళ్ళాడు సుబ్బారెడ్డి.

‘‘బావా! ఈ గొడవ నెత్తికేసుకోగాకు..’’ చెప్పాడు.

‘‘ఎంత లెక్క పోగొట్టడం లేదు.. వాల్ల ఆశ తీరుద్దాం….’’ రాఘవరెడ్డి అన్నాడు.

‘‘నీకు తెల్దులెబ్బీ! లెక్క విషయం గాదు.. వీల్లతో చాలా బరువు. వీల్ల కాడ ఇరుక్కున్నేమంటే మన పానాల్దీస్చరు – స్టేజీ అంటారు తెర గుడ్డ అంటారు. సంభావనలంటారు.. యరుగు ఆముదమంటారు. కోడిపుంజంటారు.. టెంకాయలంటారు – ఇస్తే మారాజులంటారు. సెప్పిన కాడికి పైసా తగ్గినా ఇంకోకూరికాడ మన బొమ్మజేసి కేతిగాని పోకమాను బుజాన పెట్టి మోయిస్తారు…. ఎట్టనోకట్ట వీల్లను పదిలించుకొనేదే మేలు.’’ వెనక వచ్చి ముసలి రామిరెడ్డి అన్నాడు. బొమ్మలాటగాళ్ళ పాతకాలపు సంగతులు కొన్ని వివరించారు.

రాఘవరెడ్డికి మాత్రం చేతినుంచి డబ్బు పెట్టి ఆటాడించాలని ఉంది.

‘‘ఊరందరి పని నాయినా ఇది. ఇంటికింత తీరువా వేసికొని ఆటాడిస్తేనే గ్రామ కట్టుబాట్లు నిలబెట్టినట్టు లెఖ్క. సన్నోన్ని పెద్దోన్ని సూసి ఇంటికింత తీరువా రాయాల రాబట్టాల. అందరూ సక్రమంగా ఇయ్యరు. చేతినుంచి పెట్టుకోబుద్ధిగాదు. బొమ్మలాట గాళ్ళు పత్తిడి జేస్తారు…. రాని బాకీలు వాళ్ళకు చెప్పాల.. పోకమాను మోపిస్తామని వాళ్ళని బెదిరించాల. పెద్దరికం కట్టుకున్నాడు చెడ్డపడాల …. ఆ తరుణంలో మనం అడ్డుపడి బొమ్మలాట గాళ్ళను పిల్చి మిగిలున్న బాకీ ఇచ్చినామనుకో.. బో రుచిగా ఉంటది …. అదీ కాదు.. ఏ తిరునాల్లకో, పండక్కో వాళ్ళను మనమే పిల్చి ఆటాడిస్తాం …. ఇప్పుడు మాత్రం ఊరు మొత్తం కలిసే ఆడించాల….’’ మరో పెద్దాయన సలహా.

ఇదీ ఓ లాజిక్కే అన్పించింది రాఘవరెడ్డికి.

‘‘తీరువా రాబట్టి ఆటాడించే పనికి పూనుకోడమంటే కొరివితో తలగోక్కోడమే….’’ ముసలాయన అన్నాడు.

‘‘మరెవరు రాబట్టాల?’’ రాఘవరెడ్డి ప్రశ్న.

‘‘ఉండాడు గదా సర్పంచి .. వానికాడికి పొమ్మను. ఊరి పెద్దరికం కావాలని ఆశపడ్తాండు గదా!’’

ఇదేదో మంచి ఉపాయంలా తోచింది రాఘవరెడ్డికి.

అప్పటికే బైట జనాలవద్ద కళాకారులిద్దరూ తమ ప్రజ్ఞాపాటవాల్ని రవ్వంత రవ్వంత రుచి జూపించేందుకు తమకు తెలిసిన సాహిత్యపు తునకల్ని పద్యాలుగా గద్యాలుగా గొంతెత్తుతున్నారు.

‘‘ఆలినొల్లక యున్న వానమ్మ మగని

నందు లోపల నున్న వానక్క మగని

నమ్మి నాతని జెరచు దానమ్మ సవతి

సిరుల మీకిచ్చు నెప్పట్ల గరుణ తోడ.

ఈ పద్యాన్ని వింటే మీరేమనుకుంటారు. ఆలి, అమ్మ, అక్క, దానెమ్మ సవతి …. ఇవన్నీ తిట్లే గదా! ఈ తిట్ల పురాణమేంది? ఎవుర్ని తిట్టినట్లు? అనుకుంటారా లేదా? అయితే వాస్తవానికి ఈ పద్యంలో మీరనుకున్నట్లు బూతుమాటలేమీ లేవు. లక్ష్మిదేవి మీకు సంపదలు ఇస్తుంది అని అర్థం.

అదీ తమాషా అంటే.. బొమ్మలాటలో ఇట్లాంటి చమత్కారాలు దండిగానే ఉంటాయి.’’ సుబ్బారావు చెబుతున్నాడు.

‘‘మీరు ఆడొద్దు …. మేం చూడొద్దులే .. అది అంత సులభంగా జరిగే పనిగాదుగాని .. ఎంతో కొంత లెక్కిస్తాం.. మీ దావన మీరు పొండి..’’ ఓ పెద్ద మనిషి అన్నాడు.

గోవిందరావు మనస్సు కళుక్కుమంది.

‘‘మమ్మల్ను భిక్షగాళ్ళను చెయ్యకండి స్వామీ! మేం ఆటాడాల…. కష్టపడాల. మిమ్మల్ను మెప్పించాల. మీ చేత సంభావన అందుకోవాల. అంతేగాని .. ఊరక ఎంతిచ్చినా పద్దు మారాజా’’ చెప్పాడు.

అప్పుడు గొంతు విప్పాడు రాఘవరెడ్డి ‘‘గోవిందరావూ!’’ అన్నాడు. ‘‘కళను చూపాలని పచ్చినారు. నాగ్గూడా సంతోషంగా ఉంది. బొమ్మలాట ఆడించాల. ఇప్పటి తరానికి దానిరుచి చూపించాల …. నేను ఓకే .. నాక్కూడా ఆట చూడాలని ఉంది …. నా సహకారం మీకు ఎల్లవేళలా వుంటుంది…. అయితే ఇప్పుడొక ఇబ్బంది పచ్చిపడింది ….’’

‘ఏమి’టన్నట్లుగా చూశారు కళాకారులు.

‘‘రేపు టెండర్లుండాయి. నేను కడపకు పోవాల. చీకట్లోనే లేచిపోవాల. మీ పంచాయితీ పట్టించుకనేంత టైంలేదు నాకు …. ఒక పన్జేయండి. మన సర్పంచి కాడికి పోండి …. ఆయప్పకు నేను చెప్పి పంపుతా అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటాడు’’ చెప్పాడు.

‘‘మీరు లేకుండా మేం ఆడటమా! …. మహాప్రభో …. మా కళను మీరు చూడాల …. మెచ్చుకోవాలా …. తగు సూచనివ్వాల ….’’

‘‘చూస్తాను …. చూస్తాను …. రాత్రికి వస్తాను. ఆట చూస్తాను …. అయితే ఆట ఒప్పందం …. తీరువా …. ఇవి నేను చేయలేకపోతున్నాను …. తప్పటం లేదు ….’’

కళాకారుల మొహం నిండా నిరాశ.

మరికొంతసేపు అక్కడే మాట్లాడి నమస్కారాలు చెబుతూ వెనుదిరిగారు వాళ్ళు.

రెడ్డిగారి వీధికి పడమటి వీధిన్నే ఉంది ప్రెసిడెంటు ఇల్లు.

అక్కడక్కడా ఇంకా పాత మట్టిమిద్దెలున్నాయి.

సన్నని గొందిలోంచి కళాకారుల్ని తీసికెల్తున్నాడు వెంకటేశు.

‘‘ప్రెసిడెంటు పేరు ఏమంటివి నాయినా?’’ గోవిందరావు అడిగాడు.

‘‘చిన్న వీరారెడ్డి. ఊర్లో సారాయి అంగడి ఆయప్పదే….’’

ఆ పేరు ఎక్కడో విన్నట్టుగా అన్పించింది.

అగాధపు స్మృతుల పొరల్లో ఏ మూలో కదలినట్టుగా తోచింది.

పాత మట్టిమిద్దె ముందు అరుగుమీద గంప దించి టమోటాలు బేరమాడుతున్నారు ఆడవాళ్ళు.

కిలో రూపాయికి దిగిపోయిన టమాటాల్ని ఇంకా కొసరుతున్నారు.

మొన్న మొన్నటిదాకా కిలో ముప్పయి రూపాయలు కూడా అమ్మాయి.

ఇప్పుడు మార్కెట్‌ నిండా ఎటుజూసినా టమోటాల గంపలే.

కొనే దిక్కులేక రైతులు ఏడుస్తున్నారు.

పడమటి వీధిలోకి అడుగుపెట్టి నాలుగిళ్ళు దాటగానే ఎదురైన పాత మట్టిమిద్దె – చేతులు అడ్డుంచి నిలేసినట్టుగా ఆపింది గోవిందరావును. వీధిలో నిల్చుని అటుకేసే చూడసాగాడు.

‘‘ఆ మిద్దె బాపనయ్యదిలే ….’’ చెప్పాడు వెంకటేశు.

మెల్లగా ప్రహరీగోడ వద్దకు నడిచాడు.

అప్పటికీ ఇప్పటికీ అయ్యగారింట్లో మార్పేమీ కన్పించలేదు. గజ్జిరాళ్ళు, సుద్ద మొరంతో కట్టిన లావుపాటి ప్రహరీమీద నాపరాళ్ళు చుంచు ఉండటం వలన వర్షానికి తడిసి పడిపోవటం జరగలేదు.

మట్టిమిద్దె ఆనాటిదే అయినా అప్పటి కళ ఏమాత్రమూ మిగిలిలేదు. ఇంట్లోకి అడుగుపెట్టాలంటే భయాన్ని కలిగించే ఆనాటి స్వశ్చత ఇప్పుడు కన్పించలేదు. పెచ్చులూడుతోన్న మిద్దెగోడ, నైరుతిమూల సంస్కార రహితంగా విరిగిన కొమ్మలతో కూడిన చెట్లూ, జన సంచారం లేని లోగిలీ….

‘‘నాయినా! పూజారయ్య ఉన్నాడా!’’

సమాధానంగా ‘‘అమ్మా!.. ఓయ్యా!’’ అంటూ ధారాళంగా లోపలికి నడిచాడు వెంకటేశు.

గోవిందరావుకు ఆశ్చర్యం కలిగింది.

ఆనాడు పెద్ద రెడ్డిగారు కూడా ఇంట్లోకి అడుగుపెట్టేందుకు లేదు మరి!

‘‘అయ్యా! బొమ్మలాట గోయిందరావొచ్చిండు’’

లోపల్నించి సన్నని ప్రతిస్పందన.

‘‘ఎవుర్నాయినా?’’ అంటూ ఓ పండు ముదుసలి బైటకొచ్చాడు.

వెంకటేశు మరోమారు చెప్పటంతో ‘‘ఎవురూ? గోవిందుడా!’’ అంటూ ఎగాదిగా చూసి ‘‘బాగున్నావా నాయనా!’’ అన్నాడు.

శరీరం పంగిపోయి, చర్మం ముడతలు పడి …. ఎంతగా వెలిగిన కృష్ణమాచార్యుల వారు ఎలా అయ్యారు.

ఒక్క క్షణం గుండెల్లో కదలికలాంటిది జరిగింది గోవిందరావుకు.

మరుక్షణం గొంతెత్తాడు….

‘‘స్నాన సంధ్యానుష్ఠాన సత్క్రియలు

మానితా జపహోమమంత్ర పఠనములు

దాన దిషధ్విధులు దైవ తార్చనలు

రాణించు భాగవత రామాయణములు….’’

అతను పద్యం పూర్తి చేయకుండానే –

‘‘ఒరే నాయినా! అవన్నీ ఇప్పుడెక్కడున్నాయి లేరా! గతకాలపు సంగతులు ఇప్పుడెందుకురా గోవిందూ! మదికి తెచ్చుకొని మురిసిపోతే మనస్సుకు గాయాలే …. అదిసరే …. ఏం నాయినా’- ఇట్లొచ్చినారూ! కూచోరా .. అట్లా కూచోండి ….’’ అంటూ ఇంటిముందు అరుగుమీద తను కూచుంటూ మరో అరుగు చూపించాడు కృష్ణమాచార్యులు.

గోవిందరావు తటపటాయించాడు.

‘‘కూచో నాయినా!’’ మరోసారి చెప్పటంతో తప్పలేదు.

తర్వాత మెల్లగా తను వచ్చిన పని చెప్పాడు.

కృష్ణమాచార్యుల కళ్ళనిండా ఆశ్చర్యం కదలాడింది. వెర్రివాణ్ణి లాగా చూశాడు అతనికేసి. తర్వాత గొంతు విప్పాడు.

మారిపోయిన కాలాన్ని గురించీ, కూలిపోతోన్న కులవృత్తుల గురించీ ఆవేదనగా చెప్పుకొచ్చాడు. బొమ్మలాటలూ, హరికథలూ, బుర్రకథలూ, యక్షగానాలూ, పిచ్చిగుంట్ల కథలూ …. ఒకటేమిటి – పల్లెజనాలకు ఆనందంతోపాటు మంచి నడవకనూ, ఆధ్యాత్మిక స్పృహనూ కలిగించే ఈ కళలన్నీ అంతరించిపోయిన వైనాన్ని ఆవేదనగా వెలిగక్కాడు. అన్ని గ్రామీణ వినోదాల్ని మింగేసి తనొక్కడే వెలిగిపోతూ ఉన్న టీవీల గురించి వివరించాడు. దానికి బానిసలైన జనాలపోకడ పట్ల బాధపడ్డాడు.

ఊరి మధ్యన గుడ్డతెరలు కట్టి, దీపాలు వెలిగించి, తెరలు బొమ్మలెత్తి, తెల్లార్లూ గొంతు చించుకొన్నా – టీవీ బొమ్మల్ని చూసే కళ్ళకు తోలుబొమ్మలు ఎబ్బెట్టుగా కన్పిస్తాయనీ, వాటిని ఆదరించి ఆనందించే స్థితిలో జనం లేరనీ చెప్పాడు.

చివరిదాకా విని ఒక్క నిట్టూర్పు విడిచాడు గోవిందరావు.

‘‘బ్రహ్మ సమానులు .. తమరు మమ్మల్ను దీవించాల’’ అన్నాడు పొడిపొడిగా.

‘‘మీకు నా దీవనలు ఎల్లవేళలా ఉంటాయి నాయినా! నేను కూడా తెల్లార్లూ మేలుకొని ఆట చూస్తాను. నేనిట్టా అన్నానని నిరాశ పడొద్దు. లోకం రీతి చెప్పాను. అంతే…. నువ్వు ప్రయత్నించు …. జనాల్లో ఇంకా బొమ్మలాట మీద ఆసక్తి ఉందని తెలిస్తే నా కంటే సంతోషించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు….’’

మరోసారి నమస్కరించి ఆయన వద్ద సెలవు తీసికొన్నారు.

ప్రెసిడెంటు ఇంటికేసి నడకసాగించారు.

వీధిలో ఒక్కో ఇల్లు దాటుతోంటే గోవిందరావు మనస్సులో ఏవో జ్ఞాపకాలు వెలికి వచ్చేందుకు ప్రయత్నించ సాగాయి. అవి ఏవైందీ స్పష్టంగా తెలిసి రావటం లేదు. ఏదో బలమైన విషయానికి సంబంధించినవి లాగే ఉన్నాయి. అవి.. ఈ వీధికి సంబంధించినవి లాగే …. ఈ ఇళ్ళల్లో ఏదో ఇంటికి సంబంధించినవి లాగే .. మనస్సులోంచి వెలికిరావటం లేదు.. లోలోపల గింజుకొంటున్నాయి.

పాతకాలపు మిద్దెటింటి పక్కనే కొత్త బిల్డింగు ముందాగి ‘‘ఇదే సర్పంచి చిన్నీరారెడ్డి ఇల్లు….’’ చెప్పాడు వెంకటేశు. ‘‘అయ్యా! ఈ రెడ్డెయ్యా!’’ అంటూ గేటుతీసి కాంపౌండులోకి అడుగేశాడు.

తను కూడా అతని వెంట వెళ్ళబోతూ – ఇంతసేపూ గింజుకొంటూ ఉన్న జ్ఞాపకం తాలూకు స్వరూపమేదో హఠాత్తుగా బైటపడి మెదడును కమ్మేయటంతో ఎత్తిన పాదాన్ని అలాగే దించి చిత్తరువులా నిల్చుండి పోయాడు గోవిందరావు. కళ్ళు పత్తికాయల్లా విచ్చుకొని ఇంటికేసే చూడసాగాడు.

గతంలో ఇది కూడా పాతమిద్దే!

సర్పంచి నాయన పేరు కూడా వీరారెడ్డే!.. పెద్ద వీరారెడ్డి.

ఓ యేడాది గ్రామ పెద్దగా ఆటకు తాంబూళాలిచ్చాడు. తామెన్నెన్నో అవస్థలు పడి ఆడింతర్వాత ఒప్పందం చేసికొన్న సొమ్ము ఎగరగొట్టాడు. తమకు కడుపు మండించాడు. కన్నీళ్ళు తెప్పించాడు. గట్టిగా అడిగితే ‘బొచ్చు బోడి’ అంటూ తన్నేందుకొచ్చాడు.

అందరిలాగా నోర్మూసుకొని పడుండేందుకు తాము బొమ్మలాట గాళ్ళ వంశాన పుట్టింటిమి. అతని మీద కసిదీర్చుకోకుంటే తమ తోలుబొమ్మ లెందుకు? జుట్టు పోలుగాడు, బుడ్డ కేతిగాడు, అల్లాటప్పా పాత్రల సృష్టి ఊరూరా అతని కథ చెప్పటం ప్రారంభించారు తాము. పోకమాను మోయించటం, కేతిగాని బుడ్డను భుజాన పెట్టటం వగైరాలతో కసిదీర్చుకోవటం మొదలెట్టారు.

ఒకసారి అతను తమ మీద దండయాత్రకు కూడా పూనుకున్నాడు. పక్క గ్రామంలో అతని బొమ్మను ఆడిస్తోంటే మనుషులతో వచ్చి దాడి చేశాడు గాని ఆ ఊరి వాళ్ళు అడ్డుకోవటంతో బెడద తప్పింది. అప్పటి నుంచి అతనికి తమకు విరోధం నడుస్తూనే ఉంది.

ఇప్పుడతను ఉన్నాడో? లేడో?

ఉంటే మాత్రం పాత విషయాలు గుర్తుకు రాకమానవు.

ఇప్పటికే వయోవృద్ధుడయి ఉండాలి – అతను గనక బతికుంటే.

‘పాపి చిరాయు’ వన్నారు.

బతికే ఉండొచ్చు.

కాళ్ళు చేతులు ఆడుతూండొచ్చు.

కనీసం – కళ్ళు చెవులు సరిగ్గా పన్జేయకుంటే చాలు.

‘‘అయ్య ఉండాడామ్మా?’’ అడుగుతున్నాడు వెంకటేశు.

‘‘లేడురా! ఈదుల్లో ఉండాల పో….’’ లోపల్నించి ఆడమనిషి గొంతు.

‘‘ఎవురూ!.. ఎవురొరే ….’’ మరెవరిదో ముసలాయన కంఠం.

‘‘నేనేలే పెద్దయ్యా! ముత్రాసోల్ల ఎంగటేశును.. అయ్యకోసం పచ్చినాలే….’’

‘‘బొమ్మలాట గోయిందరావు పచ్చింటే….’’

‘‘ఎవురూ?’’

వెంకటేశు మళ్ళీ చెబుతున్నాడు.

ఆ ముసలాయన ఎవరో అర్థమైంది గోవిందరావుకు. అతని కదలికల వేగం, మాటతీరు తను కోరుకున్నట్టుగా లేవు.

కళ్ళు చెవులు పన్జేస్తున్నట్టున్నాయి.

అక్కడ నిలబడబుద్ధి కాలేదు వాళ్ళకు.

వెనుదిరిగి మెల్లగా వీధెంట సాగారు.

వెనక నించి ముసలి వీరారెడ్డి మాటలు విన్పిస్తున్నాయి.

‘‘ఏం పనెంట? నా బొచ్చులో పనెంటనా? ఎవుడు సుస్సాడంట తోలుబొమ్మలాట? .. బోడిగాడు సూస్సాడంటనా….’’ ఇంకా ఏవేవో అసభ్యపు మాటలు .. కసిదీరా రుసరుసలు..

పాతకాలపు జ్ఞాపకాల్ని పదిలంగా దాచుకొన్న ప్రవర్తన ….

మనస్సు వికలమైంది గోవిందరావుకు.

తాము లోగడ అతన్ని ఊరూరా తిట్టి మరీ అవమానించారు.

బొమ్మలాటగాళ్ళ జోలికిపోతే దగ్గరి ప్రాంతాల్లో ఏమీ అనకున్నా, దూరపు పల్లెల్లో అయినా బొమ్మను చేసి అవమానిస్తారనే భయం ఉండటం వలన తమ జోలికి ఎవరూ రారు. తమకు అన్యాయం చేయాలని ఎవరూ ప్రయత్నించరు.

అప్పుడున్న ప్రజాదరణ పొందిన ఏకైక వినోదకళ తమదే కాబట్టి, తాము మంచయినా చెడయినా ఊరూరా తిరిగి ప్రచారం చేస్తారు కాబట్టి తామంటే జనం బెదిరే వారు.

ఇప్పుడయితే ఊరు దాటగానే పండబెట్టి గొంతుకోసే వారేమో!

తమ ప్రవర్తన కొంత అతిగానే ఉండేది. అవమానించే పద్ధతి కూడా భరించరానంత నీచంగా ఉండేది. జుట్టుపోలుగాని మర్మావయవాన్ని పోకమానుగా అభివర్ణిస్తూ దానికో రూపాన్నిచ్చి, దాన్ని తమకు సరిపోని వ్యక్తుల పేర రాసిన బొమ్మ భుజాలమీద ఆనించి మోయించటం, పోకమానుతో పళ్ళు తోమించటం …. ఇంకొన్ని అసహ్యకరమైన పనులు చేయించే వారు.

అట్లాంటి పనులు చేయగలమనే బెదిరింపుతో గ్రామాన్ని భయపెట్టుకొనే వారు.

ఆలోచనల భారంతో మెల్లిగా నడుస్తోంటే వెనక నించి వచ్చి కలుసుకొన్నాడు వెంకటేశు.

‘‘పెసిడెంటు లేడంట. ఊర్లోకి పోయిండంట ….’’ చెప్పాడు.

ముసలాయన తిట్లు వాళ్ళు వినలేదనే భావించాడు.

ప్రెసిడెంటును కలవకుండా పన్జరిగేట్టు లేదు. భారాన్నంతా అతని నెత్తిన్నే వేశాడు రాఘవరెడ్డి.

ఏం చేయాలో అర్థంకాకుండా ఉంది గోవిందరావుకు.

ఆ ముసలాడున్న ఇంటికి వెళ్ళటం తమకు సాధ్యపడుతుందో లేదో! రానిస్తాడనే నమ్మకం కూడా లేదు.

ప్రెసిడెంటును వీధుల్లో కలిస్తే పన్జరుగుతుందో లేదో?

‘‘నాయినా ఆట ఒప్పందమైందే?’’ వీధిలో నిలేసి అడిగింది ఓ ముసలామె.

‘‘యాడయిందవ్వా! పెద్దమనుసులు చిక్కద్దా …. ఒప్పందం సేసుకోవద్దా’’.. వెంకటేశు చెప్పాడు.

‘‘ఎట్టనోకట్ట ఆడించండి నాయినా! ఎన్నేండ్లయిందో బొమ్మలాట సూడక …. బొమ్మలాటలు, బుర్రకతలు, ఈది నాటకాలూ …. ఇయ్యన్నీ లేకనే వానలు బిగదీసింది…. ఆటాడండి నాయినా – మీకు పున్నెముంటది ….’’ ఆమె గొంతులో ఏదో ఆశ.

నిలబడి ఆమెకేసి దీక్షగా చూశాడు గోవిందరావు.

తనలాంటి వాళ్ళకు ఇంకా ఈ బొమ్మమీద వ్యామోహం తగ్గకుండా ఉండేందుకు బహుశా బొమ్మలాట మీద ఇలాంటి వాళ్ళ ఆశ ఇప్పటికీ సజీవంగా నిలిచి ఉండటమే కాపచ్చు…

‘‘మీ ఊరోల్లంతా ఇష్టపడితే గదమ్మా మేము ఆడేది….’’ చెప్పాడు.

‘‘నిజమే నాయినా! ఇట్టాంటియి సూడ్డానికి యేడ బుద్ధిబుడ్తాదిలే. ఈనాబట్టలకు గుడ్డలూడదీసి బిత్తల ఎగిరే బొమ్మలు గావాల. పీర్ల పండక్కూ, యినాకమయ్య పండక్కూ భోగమోల్లన్దెచ్చి బిత్తల. ఊరేగించే దానికి ఇరైయేలూ ముప్పయేలూ వాల్లబొక్కన కొట్టుకొంటారు …. యీనపునాబట్టలు ….’’ గొణుక్కొంటోంది.

తనలోని అసమ్మతిని బలంగానే వ్యక్తీకరిస్తోంది.

అక్కణ్ణించి కదిలి వీధివీధి తిరిగారు ప్రెసిడెంటు కోసం.

ఎక్కడా కన్పించలేదు అతను.

ఈ క్రమంలో నలుగురున్న దగ్గరంతా నిల్చుని వాళ్ళతో మాటలు కలిపేందుకు ప్రయత్నించారు. రామాయణ భారతాల్లోని ముఖ్య ఘట్టాలకు సంబంధించిన పద్యాలూ, శ్రీనాధుని చాటువులూ ఉటంకిస్తూ సంభాషణ కొనసాగించారు.