తోలుబొమ్మలాట – 03వ భాగం

పల్లె నడిబొడ్డు నున్న రామాలయంలో విడిది చేసి ఉన్నారు – బొమ్మలాట గాళ్ళు.

బొమ్మల పెట్టె వగైరాలన్నీ దేవాలయం లోపల సర్దుకున్నారు.

గుడి పంచదిగి ఛెత్రి కర్రను చేతబట్టుకొని మెల్లగా వీధిలోకి నడిచాడు గోవిందరావు.

అప్పటికి ఇప్పటికి ఊరు చాలా మారిపోయి ఉంది. గవర్నమెంటు బిల్డింగులయితేనేం, స్వంతంగా కట్టించుకొన్నవి అయితేనేం ఊర్లో చాలా వరకు మిద్దెలే కన్పిస్తున్నాయి.

మిద్దె పంచల్లో అక్కడక్కడా మోటారు బైకులు కూడా ఉన్నాయి.

వస్తూ పోతోన్న జనాల ముఖాలకేసి పరీక్షగా చూస్తున్నాడు ఆయన. ఇరవై ఏళ్ళ కిందటి జ్ఞాపకాల ఆనవాళ్ళను పోల్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు.

గుడివద్ద జనాలు ఎక్కువగా నిలబడటం లేదు.

పలుకరిస్తున్నారు గాని బొమ్మలాటగాళ్ళుగా గుర్తు పట్టటం లేదు. తెలుసుకన్న తర్వాత కూడా ఆసక్తిగా స్పందించటం లేదు.

ఒకరిద్దరు ముసలి ఆడవాళ్ళు మాత్రం గోవిందరావును పోల్చుకన్నారు.

ఆప్యాయంగా పలుకరించారు.

జనమంతా దక్షిణపు వైపు వీధిలో వేపచెట్టు అరుగు పక్కనున్న బంకువద్ద గుమిగూడుతున్నారు.

ఇప్పుడు మనుషుల్ని ఆకర్షించే కేంద్రమేదో అక్కడ వెలిసిందన్న మాట.

బహుశా టీ, వడల్లాంటి వ్యాపారముందేమో!

‘‘ఏమయ్యా! బాగుండావా?’’

పిలుపు విన్పించి అటుకేసి తిరిగాడు గోవిందరావు.

ఎవరో యాభైయేళ్ళ మనిషి. గోచిపంచె. ముతక చొక్కా.

‘‘ఎన్రోజులకొచ్చి నారబ్బా!’’

అతనెవరో మదికి తెచ్చుకొందుకు తెగ ప్రయత్నించాడు.

‘‘ఆటాడ్తాండారా?’’

‘‘ఏదో తమరి దయ ..’’ చెప్పాడు. ‘‘గ్రామంలో ఉండే మహా ప్రభువులంతా సమ్మతిస్తే ఆడాలనే పచ్చినాం’’ అంటూ. ‘‘నువ్వు..?’’ ప్రశ్నార్థకంగా చూశాడు.

‘‘నేనయ్యా! గొల్లోల్ల పాములేటిని. ఎలమంద కొడుకును ….’’

‘‘ఓ.. నువ్వా నాయనా! .. యాదవరాజులు .. కృష్టుని వంశం మీది.. మీరు లేకుండా ఆటా? బొమ్మలాట ఆడటంలో యాదవరాజుల సహకారమే ఎక్కువుంటది. మీ తండ్రి ఎలమందరాజు మహానుభావుడు. గోపాల క్రిష్ణుని విగ్రహాన్ని గీయించినాడు.. ధర్మ ప్రభువు.. మేకపోతునిచ్చి, రంగులిచ్చి, సంభావనలిచ్చి.. బొమ్మగీచిన తదుపరి ఆటాడించి …. యాదవరాజుల్లోనే ఆణిముత్యం …. నా తండ్రీ! ఆయన పుణ్య పరంపర నువ్వూ కాస్త నిలబెట్టుకో. ఊర్లో రవ్వంత చెప్పి పెట్టి ఆటాడించేందుకు చూడు ….’’ ప్రాధేయ పూర్వకంగా చెప్పాడు.

పాములేటి ఉబ్బి తబ్బిబ్బై ఏం మాట్లాడ్డానికి తోచక నిలబడి ఉన్న సమయంలోనే రెడ్డిగారి వీధినుంచి ఓ యువకుడు అటుగా వచ్చాడు.

అతనికేసి పరిశీలనగా చూసి ముఖ కవళికలు పోల్చుకొనేందుకు ప్రయత్నిస్తూ ‘‘సుబ్బారెడ్డిగారి కుమారునివా నాయనా!’’ అడిగాడు.

‘‘కాదు .. బండెద్దల ఎంకరెడ్డి కొడుకు..’’ పాములేటి చెప్పాడు.

వెంకటరెడ్డి వంశాన్ని గురించీ, వాళ్ళ దాతృత్వాన్ని గురించీ పొగడటం మొదలెట్టాడు గోవిందరావు.

రెడ్డి యువకునిలో సరైన స్పందన కన్పించలేదు.

‘‘బొమ్మలాట ఆడితే ఊరికి మంచిదెంట రెడ్డే! వానలు కురిసి మంచికాలమొస్చాదెంట..’’ పాములేటి అందుకన్నాడు.

ఇద్దరి ముచ్చట్లను తేలిగ్గా చప్పరించి బంకుదిశగా నడిచాడు అతను.

అప్పటికే పొద్దు గుంకింది. అసురసంజెవేళ అయ్యింది.

కొంతసేపు మాట్లాడిన తర్వాత పాములేటి కూడా వెళ్ళిపోయాడు.

గోవిందరావు ఆలోచనల్లో పడ్డాడు.

ఇప్పటికే గ్రామ పెద్దలు తనకు కబురు పంపవలసింది.

తమ మంచి చెడ్డలు విచారించవలసింది.

ఆనాటి పెద్దలున్నారో లేదో!

పెద్దరికం చేతులు మారిందేమో!

ఏదేమైనా ముందుగా పెద్ద రెడ్డిగారిని కలవాలి.

తర్వాతనే వివిధ కులాల పెద్దలతో సంప్రదించటం.

‘‘నాయనా సుబ్బారావూ!’’ అంటూ పిల్చి వంకీకర్ర చేతబట్టి బంకు దిశగా సాగాడు.

సుబ్బారావు అతన్ని అనుసరించాడు.

తిక్కలకొండి ఎవరితోనో తెగముచ్చట్లాడుతున్నాడు.

రామారావు వెంకట్రావులు కూడా గోవిందరావును అనుసరించారు

అడపాదడపా ఒకరో ఇద్దరో ఆడవాళ్ళొచ్చి కమలాబాయితో మాట్లాడి వెళుతున్నారు గాని ఒక్కరూ వాళ్ళ భోజన కార్యక్రమాల గురించి పట్టించుకోక పోవటం ఆమెక్కొంత అలజడిగానే ఉంది. మాట మాత్రానికయినా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు వాళ్ళు.

కుర్రాళ్ళు కొందరు వేపచెట్టు కింద నుంచి వనజకేసి ఓర చూపులు చూసి ఏదో వ్యాఖ్యానించటం కమలాబాయి కళ్ళబడింది.

అప్పటికీ ఇప్పటికీ గ్రామంలో చాలామార్పులు కన్పిస్తున్నాయి గాని రామాలయం మాత్రం యథాతథంగా ఉంది. పైట వేసికొనే వయస్సులో తను ఇప్పటిలాగే అప్పుడు తల్లి వెంట వచ్చింది.

రెడ్డిగారి వీధి తప్ప ఊరంతా బోదకొట్టాలే కన్పించేవి అప్పుడు.

ఇప్పుడు సిమెంటు రోడ్లు, పక్కా గృహాలు, కొలాయిలు ….

చేదుడు బావి కాలంనుంచి నేరుగా కొలాయిల కాలానికి వచ్చిపడింది తను. మధ్యలో ఇరవైయేళ్ళ బోరింగుల కాలమంతా పల్లెకు దూరమైంది.

చేదుడు బావి మదికొచ్చే సరికి హఠాత్తుగా ఆమె కళ్ళముందు ఓ యువకుని రూపం అస్పష్టంగా కదలాడి మాయమైంది.

ఉలికి పాటుకు గురయింది ఆమె.

అప్పటికే మెదడులో అన్వేషణ ప్రారంభమైంది. అందీ అందని ఆ రూపపు స్పష్టతకోసం జల్లించటం మొదలైంది?

కనుగుడ్లు విచ్చుకొని తదేకంగా ఎటో చూస్తోందిగాని ఎదుటి దృశ్యాలేవీ కళ్ళల్లోకి చొచ్చుకు రాలేదు. చూపుల వెనక జరుగుతోన్న తతంగం వేరుగా ఉంది.

‘‘అమ్మా! మనం పండుకొనేది ఇక్కడేనా?’’

వనజ ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చింది సన్నని నిశ్వాసంతో.

‘‘ఆ..’’ సమాధానించింది.

‘‘మరి .. అన్నమెట్లా?’’

తనను తొలుస్తూ ఉన్న ప్రశ్నే.

‘‘తాతను రానీ’’ చెప్పింది.

అంతలో ఇద్దరు ముసలమ్మలు అక్కడికొచ్చారు.

వాళ్ళ పక్కగా కూచున్నారు.

‘‘నువ్వు లచ్చింబాయి కూతురివేనా?’’ అడిగింది ఓ ముసలామె.

అవుననే సమాధానం రాగానే ఎరుకలమ్మను గురించీ, రంగాబాయి గురించీ విచారించారు. పెళ్ళికాని కమలాబాయి ఆనాటి అందాల్ని ముచ్చటించారు. వనజ కూడా అచ్చు తల్లి పోలికలతోనే ఉందంటూ మెచ్చుకన్నారు.

‘‘ఇప్పుడెవురు సూస్చారు తల్లీ బొమ్మలాట! ఎవురింట్లో చూసినా ఆ కొంపలు గూల్చే టీవీ పెట్టెలుండాయి. అయ్యేంటియో ఇసిత్రపు సీరెల్లంటమ్మా! కరంటొస్తే సాలు ఆడమొగ అందరూ టీవీలకు అతక్కపోయి కూచొనేవాల్లే…. మన కాలం అదొక ఎర్రికాలంలే.. తోలు బొమ్మలాట తొంభై ఆమడలయినా పోయి సూసి రావాలని సామెత. తెల్లబార్లూ కంటిమీద కునుకు లేకుండా సూస్చాంటిమి …. ఇప్పుడైనా ఓపికుండి బొమ్మలాట సూస్తే మంచిదే ….’’ ఓ ముసలామె అంది.

పాతకాలపు ముచ్చట్లు వాళ్ళ మధ్య నడుస్తున్నాయి.

తిక్కలకొండి జనాలతో కలిసిపోయాడు.

తోలుబొమ్మల్ని ఆడించటంలో తన నేర్పరితనాన్ని విశదీకరిస్తున్నాడు.

అతని ప్రకృతిని అప్పుడే కనిపెట్టేసినట్టుంది అక్కడున్న వాళ్ళు.

‘‘ఆ పిల్ల నీకేం గావాల?’’ అడిగాడు ఓ యువకుడు.

అతనికేసి వింతగా చూశాడు కొండల్రావు.

తనకు మాత్రమే పిల్లగా కన్పిస్తుందనుకన్న మామ కూతురు అతనికి కూడా తనలాగే కన్పించటం ఆశ్చర్యంగా అన్పించింది.

‘‘మా మామ కూతురే…. మేనకోడలు ….’’ చెప్పాడు.

వాళ్ళ వద్ద నుంచి రాబోయే తర్వాతి ప్రశ్నకోసం చాలాసేపు నిరీక్షించాడు గాని వాళ్ళు పెదాలు కదల్చకుండా కేవలం కళ్ళను మాత్రమే కదుపుతూ. వాటిని కూడా తనవైపు కాకుండా గుడికేసి తిప్పుతూ ఉండటం అతనికి అరిగి రాలేదు. ఆ పిల్లకు తనకు మధ్యన బంధుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళు సంబంధాన్ని గురించి అడుగుతారనుకొన్నాడు. అట్లా ప్రశ్నిస్తే తాను మంచి ఫోజొకటి విసిరి ‘తామిద్దరం ప్రేమించుకొన్నామనీ, త్వరలో అందర్నీ ఎదిరించి పెళ్ళి చేసుకోబోతున్నామ’నీ చెప్పాలనుకన్నాడు.

తనకా అవకాశం ఇవ్వలేదు వాళ్ళు.

నిరాశగా చూస్తూండి పోయాడు.

చీకటి దట్టంగా అలుముకొనే సమయానికి కరంటు వచ్చింది. వీధిలైట్లు ఒక్కసారిగా జీవం పోసుకొన్నాయి.

చకచక అందరి ఇళ్ళల్లో బల్బులు వెలిగాయి.

వెలుతురుతోటే ఇళ్ళల్లోంచి మాటల శబ్దాలూ, సంగీతమూ కలగలిసిన ధ్వనులు బైటకు రావటం మొదలైంది.

ఆ శబ్దాలకు వీధుల్లోని జనాల్లో కదలిక వచ్చింది.

క్రమక్రమంగా జనం వీధుల్లో పలచబడసాగారు.

ఇళ్ళు తాబేళ్ళుగా మారి తమ కాళ్ళను డిప్పల్లోకి లాక్కుంటున్నట్లు జనాల్ని అదృశ్యం చేసే దృశ్యం కమలాబాయికి భయం కలిగించింది.

బంకుకేసి వెళ్ళిన తమ వాళ్ళు తిరిగి రాగానే ఆహార సమస్యను మొగుని చెవిన వేసింది.

అతని మనస్సులో కూడా ఆ సమస్య చాలాసేపటి నుంచి రగులుతూనే ఉంది.

ఇల్లిల్లూ వెళ్ళి తాము దేబరించలేరు.

గంజి అయినా పరమాణ్నమయినా గౌరవంగా పుచ్చుకొనే సాంప్రదాయం తమది.

అలాగని పస్తులుండటం కూడా సాధ్యం కాని పని.

ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని తామూహించక కాదు. విధిలేని పరిస్థితి. నూకలకు కూడా అప్పు పుట్టని దుర్గతి.

మోటార్లు రన్నయ్యే కరంటు వచ్చింది కాబోలు కొందరు మగాళ్ళు దుప్పట్లు భుజానేసుకొని చేలకేసి వెళుతున్నారు.

‘‘అబ్బీ! సుబ్బారావూ!’’ గోవిందరావు పిల్చాడు.

సుబ్బారావు కదిలేంతలో అతను దారిబట్టాడు.

మౌనంగానే వీధెంట కదలుతున్నారు ఇద్దరూ.

పడమటి వీధిలో పదిళ్ళు దాటింతర్వాత అక్కడ నిలబడి వీధిలైటు వెలుతుర్లో ఇళ్ళను పోల్చుకొనేందుకు ప్రయత్నించాడు గోవిందరావు.

గతంలో బోదకొట్టాలుండేవి.

ఇప్పుడు ప్రభుత్వం వారిచ్చిన పక్కాగృహాలు.

‘‘ముత్తరాజు పిచ్చయ్య ఇల్లు ఇదేనా నాయినా!’’ దారిన వెళుతూ ఉన్న రైతు యువకుణ్ణి అడిగాడు.

అతను చేయెత్తి చూపాడు.

నేరుగా వెళ్ళి ఇంటి ముందాగి ‘‘పిచ్చయ్యా! ఓయ్‌ మీసాల పిచ్చయ్యా!’’ అంటూ పిల్చాడు.

రెండు మూడు పిలుపులకు గాని లోపల్నించి సమాధానం రాలేదు.

‘‘ఎవురూ?’’ అంటూ వాకిట్లోంచి తలబైట పెట్టాడు ఓ వ్యక్తి.

‘‘ముత్రాసు పిచ్చన్న ఇల్లు ఇదేనా?’’ సుబ్బారావు అడిగాడు.

‘‘ఆ .. ఇదే .. మీరెవురూ!’’

‘‘మేం బొమ్మలాట కళాకారులంలే …. పిచ్చయ్య కొడుకువా నువ్వు?’’

‘‘ఆ….’’

‘‘మీ నాయన్ను పిల్చు మరి….’’ గోవిందరావు అన్నాడు.

కొంతసేపు తటపటాయించి ‘‘కండ్లు కనబడవు …. చెవులు వినబడవు …. నడ్సలేడు….’’ చెప్పాడు.

ఒక్క క్షణం సాలోచనగా నిల్చున్నాడు ముసలాయన.

‘‘మరి .. గ్రామంలో వర్తమానాలు చెప్పే పని ఎవరు చేస్తున్నారు?’’ అడిగాడు.

‘‘వర్తమానాలా! పాడా!’’ తేలిగ్గా అన్నాడు అతను.

‘‘కాలం మారిపోయింది పెద్దాయనా! ఇప్పుడా పనులన్నీ ఏమీ లేవు. అందరూ కూడుకొని మాట్లాడేదేమన్నా ఉంటే మైకులో చెప్తారు.’’

‘‘పండగలకూ పబ్బాలకూ పంచాయితీలకూ ఊరందర్నీ పిలిపించి మాట్లాడరా?’’

‘‘పిల్చినా ఎవురొస్తారు? ఊరిపెద్ద ఫలానా పన్జెయ్యమంటే ఆయప్ప పక్క మనుసులంతా ఆ పన్జేస్తారు. ఏ పార్టీ ఎమ్మెల్యే గెలుస్తే ఆ పార్టీ వాళ్ళదే పెద్దరికం. మిగతా వాళ్ళంతా ఏడేండ్లూ గమ్మునుంటారు.’’

‘అదయినా మేలే. ప్రతి దానికీ అడ్డుపడి గొడవలు పెట్టుకొని కోర్టులకు తిరగకుండా’ అనుకున్నాడు ముసలాయన.

ఏదో ఆశతో ఇంతదూరం వచ్చిన తమ పరిస్థితే ఇబ్బందికరంగా ఉంది.

తాము ఊర్లోకొస్తే చాలు ముత్రాసు పిచ్చన్న ఎప్పుడూ ఎన్నంటి ఉండేవాడు. ఇల్లిల్లూ తిరిగి సంభారాలు తెచ్చేవాడు. భోజనానికి ఇబ్బంది లేకుండా చూసేవాడు.

ఆ అవకాశమేదో మూసుకు పోతున్నట్లుగా అన్పించి దిగాలుగా వెనుదిరగబోతోన్నంతలో ‘‘ఎవురూ….?’’ అంటూ తారాడుకొంటూ వాకిట్లోకి వచ్చాడు పిచ్చన్న.

‘‘నేనోయ్‌ …. గోవిందరావును..’’

పోల్చుకోలేకపోయాడు పిచ్చన్న.

‘‘ఎవుర్రా పెద్దోడా’’ గట్టిగా అరచినట్లు అడిగాడు.

‘‘బొమ్మలాట గాళ్ళంట ….’’ అదే స్థాయిలో చెప్పాడు కొడుకు.

అతని సంభోదన మనస్సును చివుక్కుమనిపించింది గోవిందరావుకు.

‘‘ఓ …. మీరా! ఎప్పుడొచ్చిన్నెరు దొరా?’’ పిచ్చన్న గొంతులో ఏదో సంభ్రమం.

‘‘ఈ సాయంత్రమే నోయ్‌!’’

‘‘ఎన్నేండ్లయింది ఊర్లేకి రాక! …. అది సరే మామా … బువ్వ సంగతి మాట్లాడుకొన్నెరా లేదా?’’

ఊర్లోకి వచ్చింతర్వాత అన్నం సంగతి ఎత్తిన మొదటి మనిషి అతనే.

తమ పట్ల అతనిలో ఇంకా ఇగిరిపోకుండా ఉన్న ఆప్యాయత గోవిందరావు గుండెల్ని సన్నగా జలదరింపజేసింది.

వాళ్ళ మౌనం పిచ్చన్నకు అర్థమైంది.

‘‘పెద్దోడా! ఊర్లేకిపోయి మామోల్లకు బువ్వ జెప్పిరాపో…’’ అన్నాడు కొడుకును ఉద్దేశించి.

‘‘ఎవరింట్లో చెప్పాలబ్బా ….’’ తలగీరుకన్నాడు అతను.

విషయం అర్థమై. ‘‘సరపంచో, నీల్ల పెసిలెంటో, బడి పెసిలెంటో, రెడ్డోరో, టీచరు సుబ్బడో …. రోంత నాన్నెంగా కూడు కూరాకు సేసుకొనే వాల్లిండ్లల్లో ఆ యిండ్లు …. ఆ యిండ్లు…. నాలిగిండ్లన్నా సెప్పుపో….’’

‘‘పెడ్తారంటావా?’’

‘‘ఒరే ఎంగటేశూ! ఈల్ల సంగతి నీకు తెల్దుపోబ్బీ! బొమ్మలాట ఆడే గోయిందరావు మనుసులకని సెప్పు.’’ చివరి మాట గొంతులోంచి ‘ఖంగ్‌’ మంటూ బిగ్గరగా ధ్వనించింది.

వెంకటేశు అక్కణ్ణించి కదిలాడు.

పిచ్చన్న వద్ద కొంతసేపు పాతకాలపు ముచ్చట్లు గుర్తుజేసికొని తర్వాత వెనుదిరిగాడు గోవిందరావు.

దేవాలయం వద్ద కెళ్ళేసరికి దిగులు కళ్ళతో కూతురు.

వీధుల్లో అక్కడక్కడా అరుగుల వద్ద బీడీ ముక్కలు వెలుగుతున్నాయి.

బంకు అంగడి వద్ద నుంచి ఏవో కేకలు విన్పిస్తున్నాయి. తాగి కేకలేస్తున్నట్టుంది ఎవరో.

వెంకటేశు వచ్చాడు.

‘‘అడిగినాను పెద్దాయనా! వాల్ల ఇండ్లకాడికే పోయి తినొస్తారా? బువ్వ పెట్టించుకొని ఈడికే తెచ్చుకొంటారా?’’ అడిగాడు.

కొంతసేపు తటపటాయించి ‘‘పెట్టించుకస్తాములేన్నా’’ చెప్పింది కమలాబాయి.

ఇంటికెళ్ళి సంగటి బుట్ట తెచ్చాడు వెంకటేశు.

‘‘రాండి మరి….’’ పిల్చాడు.

రామారావూ, వెంకట్రావూ తిక్కల కొండిలు అతనితో కలిసి ఊర్లోకి నడిచారు.

రెండిళ్ళ వద్ద పెట్టించుకొన్నారు.

మూడో ఇంట్లోకి వెళ్ళి వెంకటేశు చెప్పగానే టీవీ ముందునించి బలవంతంగా లేచింది కోడలు. వంటింట్లోకెళ్ళి సత్తు రేకులో అన్నం పెట్టుకొస్తా ఉంటే అత్త కాబోలు వెనక నించి పిల్చింది ‘‘ఏందమ్మే! ఆరోంత బువ్వ పెట్టక పోతాండవూ!’’ అని.

‘‘అడుక్కుండోల్లకు ఎంతబడ్తారు? ఒకింటికాన్నే తినేంత పెడ్తారా! నాలుగిండ్లకాడ నాలుగు పిడ్సలు పెట్టించుకోవాల’’ కోడలి గొంతు.

‘‘వాల్లు అడుక్కుండోల్లు కాదే నాయమ్మా! బోమ్మలాటగాల్లు..’’ అత్త గొంతులో రహస్యం చెబుతోన్న ధ్వని.

‘‘ఎవురయితేనేం? – బుట్ట బట్టుకొని బువ్వ కొచ్చినోల్లు అడుక్కుండోల్లు కాదా..’’

పానం చచ్చిపోయింది వెంకట్రావు, రామారావులకు.

కొంతసేపటికి అత్తే అన్నం పళ్ళెం తెచ్చింది.

‘‘కొత్త కోడలు.. బొమ్మలాటలంటే ఏమో తెలిసింది గాదు -’’ ఇండ్లు దాటగానే వెంకటేశు సంజాయిషీ యిచ్చాడు.

అన్నం బుట్టతీసికొని రామాలయం వద్దకెళ్ళిన తర్వాత వెంకటేశును దగ్గరకు పిల్చుకొని చెప్పాడు గోవిందరావు ‘‘ముత్తరాజులు నాయినా మీరు …. రాజవంశం మీది. మీ నాయన హయామంతా మేం ఈ ఊర్లో కొస్తే మమ్మల్ను పదిలి పొయ్యేవాడు కాదు …. ఆట ఆడాల …. సంభావనలన్నీ రాబట్టాల. మమ్మల్ను బండెక్కించి వాగుదాకా సాగనంపాల …. అప్పుడుగాని ఆయప్పకు తృప్తి ఉండదు …. కాలం మారిపోయింది. కొత్త తరానికి బొమ్మలాటలు తెలిసినట్టు లేదు. పాత తరం వాల్లు కూడా మరచిపోయినట్లుండారు …. వాళ్ళకు కొద్దిగా గుర్తుచేయి నాయినా! పొద్దున్నే లేచి గ్రామ పెద్దల కాడికీ, గుంపు పెద్దల కాడికీ మమ్మల్ను తీసకపోయినావనుకో .. మేమే చెప్పుకొంటాం తండ్రీ! .. ఈ ఒక్క సాయం చెయ్యి వెంకటేశ్వర్లూ!’’ అంటూ వేడుకొన్నాడు.

‘‘సరే.. అట్నేలే పెద్దాయనా!’’ తలూపాడు వెంకటేశ్వర్లు.

రాత్రి భోజనాల తర్వాత రామాలయంలోనే పడకేశారు.

వీధుల్లో జనాల సందడి లేదు.

రాత్రి పొద్దుబోయే దాకా వీధరుగులు, చావిళ్ళు, గుడి ప్రాంగణాలు జనాల యవ్వారాలతో మార్మోగుతుండేవి. పోటెత్తిన యవ్వన ప్రాయంలా ఉండేవి.

ఇప్పుడు బండలు విరిగిన వీధరుగులు మనుషుల్లేని రాత్రిళ్ళతో…. ఒంటరి ముసలి తనంలా….

పల్లెలకు ఈ అకాల వృద్ధాప్యాన్ని తెచ్చింది టీవీ పెట్టెలే ..

తమ నోరుకొట్టిందీ …. తమకే కాదు.. హరికథ, బుర్రకథ, యక్షగానం, వీధిభాగోతం, ఒకటేమిటి …. ఎందరో జానపద కళాకారుల నోర్లుకట్టి ఇంటింటికీ పడుపుగత్తె అయి. ఇంట్లో వాళ్ళ నెవర్నీ బైటకు పోనీకుండా …. ఈ టీవీ పెట్టె ….

అతిథి అభ్యాగతులకు కనీసం భోజనం పెట్టేందుకు కూడా తీరిక లేకుండా చేస్తోంది.

భోజనం సమస్య తీరి మనస్సు కుదుటబడినా భోజనం దొరికిన తీరు గోవిందరావును ఆలోచించుకొనేలా చేస్తోంది.

భోజనం వడ్డించటం కాస్తా పిడచవేయటంగా మారటం ….

అన్నం పెట్టటంలో ఆప్యాయత బదులు తప్పనిసరి విసుగు ప్రదర్శితం కావటం …. ఆయన మనస్సును మెలిబెడుతోంది.

ఆటాడేది తామే అయినా, అందుకు సంబంధించిన భారాన్నంతా మోసే గ్రామస్తుల స్థానే – ఇప్పుడు ఆడే బరువుగా భావించే మనుషులు తయారయి రావటం భయం కలిగిస్తూ ఉంది.

ప్రతి ఇంటిలో సజీవ దృశ్యాల్ని చూపించే బొమ్మల పెట్టెలున్న గ్రామంలోకి ఎప్పటివో నిర్జీవమైన తోలుబొమ్మల పెట్టెతో వచ్చి, ఆ బొమ్మలతోనే గ్రామాన్నంతా దేవాలయం వద్దకు చేర్చాలనుకోవటం, వాళ్ళ ఇళ్ళల్లోని టివీ పెట్టెల ముందునించి వాళ్ళను ఏమార్చాలనుకోవటం సాహసమే కాదు దుస్సాహసంగా తోస్తూ ఉంది.

ఆటాడి మెప్పించటం దేవుడెరుగు. అస్సలు ఆటాడే అవకాశం తమకు దొరుకుతుందో లేదోననే అనుమానం.

వెంటనే అతనికి కిరీటి గుర్తుకొచ్చాడు.

బలవంతాన ఇంటిలో జొరబడి తోలువిగ్రహాల్ని ఎత్తుకెళ్ళి బేరంపెట్టే భవిష్యత్‌ దృశ్యం కళ్ళముందు కదలి వణికిపోయాడు.

తర తరాల్నించి సాంప్రదాయికంగా వచ్చే ఒక కళాత్మక జీవనం – తన హయాంలోనే అంతరించిపోవటం తను భరించలేని ఒక దుస్వప్నం.

ఏది ఏమైనా సరే – గ్రామస్తుల్ని పప్పించాలి.

బొమ్మలాట ఆడాలి.

తద్వారా వచ్చే ఫలితంతోనే మరో గ్రామానికి తరలివెళ్ళాలి.

దృఢ నిశ్చయంతో కళ్ళు మూసికొన్నాడు గోవిందరావు.

తన మనోవాంఛ ఈడేరాలా వరమిమ్మని గుడిలోని రాముల వారికి మనస్సులోనే ప్రణామాలర్పించుకొంటూ నిద్రలోకి జారుకొన్నాడు.

తిక్కలకొండి గురకలు అప్పటికే దేవాలయాన్ని కేంద్రంగా నాలుగు వీధులకూ ఆక్రమించాయి గాని ఇళ్ళల్లోని టీవీల రొద ఇంకా సర్దుమణగక పోవటం వలన ఎవరినీ ఏమంత ఇబ్బంది పెట్టలేదు.

అయితే కమలాబాయికి మాత్రం ఇంకా నిద్ర పట్టలేదు.

దానికి కారణం తిక్కలకొండి గురక ఎంతమాత్రమూ కాదు.

ఏదో సన్నని కంఠస్వరం ఆమె చెవిలో దూరి నిద్రను ససేమిరా దగ్గరకు రానీయటం లేదు.

సన్నని రమ్యమైన కంఠధ్వని …. ఛందోబద్దంగా సాగిన కందపద్యం తాలూకు శకలాలు అస్పష్టంగా చెవుల్లో సోకుతున్న అనుభూతి ….

ఆ పద్యమంతా తన యవ్వన సౌందర్య విలాసమే ….

రెక్కలూపుకంటూ వెళ్ళే సీతాకోక చిలుకల్లాంటి తన నవయవ్వన సౌందర్యం ….

ఎంత గుర్తు చేసికొందామనుకన్నా పద్యం గుర్తుకు రావటం లేదు ….

పద్యభావం నిండా హుెెయలుపోతూ ఉన్న తన అందం మాత్రం గుర్తొస్తోంది.

ఆ కాలంలోనే ఇంటర్‌ చదివే ఆ రెడ్డిగారి పిల్లోడు ఇప్పుడెక్కడున్నాడో? ఏ స్థితిలో ఉన్నాడో? ఎలాంటి పెళ్ళామొచ్చిందో? ….

వాళ్ళ సంసారం ఎట్లా సాగుతోందో?..

అతన్ని చూడాలి.

అంత అద్భుతమైన ప్రేమ వాసనలు విరజిమ్మిన ఆ పూవు ఇప్పుడెవరి కొప్పులో ఉందో చూడాలి.

ఇక్కడే ఉన్నాడో …. మరో గడ్డన కాలూనాడో!

ఉన్నా – తనతన్ని పోల్చుకోగలదా? కనీసం అతని పేరుకూడా తెలీదు. చూస్తే గుర్తు పట్టగలదేమో!

తన జ్ఞాపకాలను ఇంకా దాచుకొని ఉన్నాడో లేదో!

దాపుడు జ్ఞాపకాల్ని వెలికితీసి చూసికోగలిగితే అతనే తన్ను వెదక్కొంటూ రాగలడు.

బొమ్మలాటే కనుమరుగయ్యింది గదా!

తన జ్ఞాపకాలు మాత్రం ఎక్కడ నిలిచి వుంటాయి!

ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమె.

అప్రయత్నంగానే ఆమె పెదాలమీద సన్నని జలదరింపు ఒకటి కలిగింది. వేడి శ్వాస ఏదో బుగ్గలమీద సోకిన అనుభూతి. నూనూగు మీసాల రాపిడి చెంపలకు గిలిగింతలు పెడుతోన్న పరవశం. పాతికేళ్ళ కిందటి యవ్వన భావావేశం.

ఉలికిపాటుగా ఈ లోకంలోకి వచ్చింది ఆమె.

కళ్ళు తెరిచేసరికి తన మొహం దగ్గరగా కూతురి మొహం …. ఆమె వేడి ఊపిరి తన చెంపల మీద సోకుతూ ….

సన్నగా నవ్వు కొంది.

ఆ పైన మెల్లిగా నిద్రలోకి జారుకొంది కమలాబాయి