‘‘మామా! ఇంగ కానిజ్జామా!’’
సుబ్బారావు గొంతు విన్పించి తేరుకొన్నాడు.
‘‘జనమొచ్చినారా?’’ అడిగాడు.
‘‘ఓ మాదిరిగా ….’’
గోవిందరావు లేచి నిలబడగానే కళాకారులంతా వాయిద్యాల్ని ఒక్కసారిగా తారస్థాయికి వాయించి తిరిగి మామూలు స్థితికి తెచ్చారు.
అన్ని వాయిద్యాల్లోకీ తాళాల చప్పుడు స్పష్టంగా విన్పిస్తోంది.
దీపారాధన చేశారు.
ఆట ప్రారంభం కాబోతోందనే స్పృహ జనాల్లో కలిగించారు.
కళాకారులంతా ఒక్కసారిగా గొంతెత్తారు.
‘‘పరబ్రహ్మ …. పరమేశ్వర ….’’ అంటూ ప్రార్థనా గీతాన్ని ఆలపించారు.
కమలాబాయి టెంకాయకొట్టి ఊదుకడ్డీలు వెలిగిస్తోంటే – మెల్లిగా బల్బులు పైకెత్తి కట్టారు.
ఇప్పుడు ప్రేక్షకులకు తెరమీద బొమ్మలు గంభీరంగా కన్పిస్తున్నాయి.
అన్నింటినీ పక్కకు తీస్తూ విఘ్నేశ్వరుని బొమ్మమాత్రం ఉంచారు.
‘‘విఘ్న నాయకా! నిర్విఘ్నా దయాకర విఘ్ననాయకా!’’ అంటూ విఘ్నేశ్వరునికి జీవంపోస్తూ వేడుకొన్నారు. ‘‘తొండము నేకదంతమును తోరపు బొజ్జయు ….’’ పద్యం పాడారు.
తర్వాత సరస్వతీదేవి విగ్రహం….
‘సరస్వతీ నమస్తుభ్యం ….’, ‘తల్లీ నిన్ను దలంచి’ పద్యాలు శ్రావ్యంగా పాడారు.
తదుపరి మరికొందరు దేవతల ఆగమనా ….
ఆ పైన బంగారక్క సౌందర్య విలాసాల హేల ….
‘‘ఓయ్ బంగారక్కా! …. బంగారూ …. ఎక్కడున్నావే …. చిలకలపాడు గ్రామంలో అయ్యగారు, అమ్మగారు నిన్ను చూడాలని తహతహ లాడుతున్నారే పిల్లా! …. ఒక్కసారి నీ సింగారమైన మొహం చూపించే బంగారూ!’’ అంటూ సుబ్బారావు గొంతు.
తెర చివరి నుంచి కన్పించీ కన్పించకుండా, అడుగేసీ అడుగేయకుండా …. బంగారక్కను తెరపైకి తెస్తూ కమలాబాయి గొంతెత్తింది.
‘‘అరువుకు రోసింది
కరువుకు రోసింది
ఏ ఊర్లో ఉందో బంగారక్క ….
ఓ బంగారూ! రావమ్మా!….’’
బంగారక్క బొమ్మ తెరపైకి వస్తూ పోతూ ఉంది.
తాళాలు, గజ్జెలు, చెక్కపలకలు, మద్దెల, హార్మోనియం, వాయిద్యాల మధ్య ఆడ మగ గొంతులు ….
‘‘బంగారక్కా వచ్చెనమ్మా! భామలారా!
బంగారక్కా వచ్చె నమ్మా!
మాసిన వన్నె చీరగట్టి
మైనపు జిడ్డు రవిక దొడిగి
అత్తను కట్టి మామను తిట్టి
ముడ్డి పగల మొగున్ని తన్ని
బంగారూ వచ్చెనమ్మా! ఓ భామలారా!
బంగారూ వచ్చెనమ్మా!’’
పాటపాడుకొంటూ కులుకుతూ తెరపైకి వచ్చింది బంగారక్క.
‘‘నా పేరే బంగారూ …. ఓ యమ్మో
నేను తాళజాలనమ్మా
ఈ పురుషుల నడుమా
నేను తాళజాలనమ్మా!
మొగుడా! ఓరి మొగుడా! యాడుండావురా మొగుడా! ఓరి నా బంగారు మొగుడా! నా చెరకుతుంటా! నా చెక్కెర పాకా! నా బెల్లం వుండా! నా జుంటి తేనే! …. యాడుండావురా! ఈ మగ పురుషుల నడుమ నన్నిడ్సి యాడుండావురా? ఆ ముత్రాసు పిచ్చన్న జూడూ నా దిక్కు మిడిగుడ్లేసుకని ఎట్టా సూస్తాండడో! నాకు బయమేస్తాంది మొగుడా! యాడున్నే బెన్నేరారా! ఓ పాము లేటయ్యా! గొర్లకు పోతాండవేమో! నా మొగుడేడన్నా కనబడ్తే నా కాడికి పంపేయ్యా!’’ అంటూ ఎలుగెత్తి పిలుస్తోంటే డేరా లోపల్నించి జుట్టు పోలుగాడి బొమ్మను తెరపైకి ప్రవేశపెడుతూ ‘‘ఓయ్ నా పెండ్లామా! …. ఓ హోయ్ నా బంగారు బొమ్మా! …. నా కలకండ పలుకా! …. నా మీగడ పెరుగా! …. నా చెన్నూరు దోసకాయా! సిద్ధాటం కర్జూకాయా! పిచ్చిమామ ఇంట్లో కాల్చిన ఉప్పుచేపా! వస్తాండనే …. వస్తాండనే ….’’ అంటూ ఎత్తుకొన్నాడు సుబ్బారావు.
‘‘అబ్బా మగాడా!’’
‘‘అబ్బబ్బా పెండ్లామా!’’
ఎన్నో ఏళ్ళ విరహానంతర కలయికలా ….
‘‘జుట్టుకు జుట్టు, ముక్కుకు ముక్కూ, ఎదకు ఎదా, తొడకు తొడా’’…. అంటూ వెనక పాడుతోంటే బంగారక్క, జుట్టు పోలుగాడు ఆనందంతో ఒకరి మీద ఒకరు పడుతూ ….
‘‘మొగుడా! నా ముద్దుల మొగుడా! ఇంతసేపు యాడున్నెవబ్బీ?’’
‘‘పెందలాడే వస్తామని అనుకుంటి పిల్లా! ఇదో …. ఈ బొమ్మలాట నాయాన్లు రానిచ్చిన్రా! ఈ సుబ్బోజీ, ఆ రామోజీ …. ఒకటే నస …. పెద్దరెడ్డి కాడ్కపోియి ఆట ఒప్పందం సేసుకోవాలంటే …. ఆ యప్పకాడికి పోడానికి ఈల్లకు దొమ్మలేడుండాయి. అందుకే నా కాల్లు పట్టుకొని ఇడిస్తే ఒట్టు….’’
‘‘నువ్వంత దొమ్మకాయలుండే వానివా మొగుడా?’’
‘‘నా దొమ్మకాయల సంగతి మీ నాయన గోవిందాజీకి తెలుసే పిల్లా! …. అట్లా పెద్దరెడ్డి కాడికి పోతిమా! కాఫీ ఇచ్చె .. మర్యాదజేసె.. ఆట మాత్రం కుదరక పాయె.. సర్పంచి కాడికి పోతిమి …. నీల్ల ప్రెసిడెంటు, బడి ప్రెసిడెంటు, అన్ని కులాల పెద్ద మనుసులకాడికి పోతిమి. ఈ బొమ్మలాట నాయాన్లు ఊరంతా తిప్పి సంపిరి .. శనినాయాన్లు …. ఈల్ల యోగం జూసి ఎవురూ కాదనే వాల్లే!’’
‘‘అబ్బ! …. అందరూ ఒద్దంటే ఇప్పుడు ఆటెట్టా ఆడ్తాండవు మొగుడా!’’
‘‘సెప్పేది ఇను …. ఇండ్లిండ్లూ తిరిగితిమి …. వాకిలి వాకిలీ తిరిగితిమి. రెడ్డిగారంతా కుదరదనిరి …. ఊరున్నమ్ముకోనొచ్చి నోల్లము …. ఉత్త సేతల్తోనే పోదామనుకుంటాంటే …. మారాజు …. ధర్మ ప్రభువు …. యాదవరాజు పాములేటయ్య మమ్మల్ను ఆటాడిస్తాననె …. ఆయనకూ ఆయన కుటుంబానికీ భగవంతుడు ఆయురారోగ్యాలనిస్తాడు.
అయ్యా! యాదవ రాజుల్లారా!
నల్ల మేకలు గొర్లు నయమొప్ప గలిగి
పిల్ల పిల్లకు పది పిల్లలు గలిగి
కాపాడి మీమంద కాచి రక్షించు
గోపాల క్రిష్టయ్య మీపాల గలుగు ….
యాదవ రాజుల్లో సత్యముండబట్టే ఇంగా ఈ ఎండలు కాసే భూమండలాన అప్పుడప్పుడన్నా వానలు కురుస్తండాయి ….’’
కూచుని ఉన్నవాడు కాస్తా ‘‘అబ్బీ! అబ్బీ!’’ అంటూ సుబ్బారావును సంభోదిస్తూ లేచాడు గోవిందరావు.
అతని చేతిలోని బొమ్మను తను అందుకని –
‘‘పాడి పంటల్లేకుంటే జనానికి బతుకే లేదు. యాదవ రాజులు పాడి అందిస్తాంటే …. రెడ్డి మారాజులు పంటలు పండించి చప్పన్నారు కులాల వాళ్ళనూ బతికిస్తండారు. వీల్లుండబట్టే ఇంగా వానలు కురుస్తండాయి’’ అంటూ సవరించి, సుబ్బారావుకు జాగ్రత్తలు చెప్పాడు.
అప్పటికే మంచాలమీద కూచున్న రెడ్లు నొసలు ముడేశారు.
విషయం తెలిసి ఇళ్ళవద్దా, వీధుల్లో ఉన్న రెడ్ల కుర్రాళ్ళు కూడా ఆట వద్దకు వచ్చారు.
జుట్టు పోలుగాడు, బంగారక్క పాత్రలు నిష్కృమించిన తర్వాత విరాట పర్వానికి సంబంధించిన పాత్రల విగ్రహాల్ని తెరమీద నిలిపారు.
తిక్కలకొండి లోపలికి వచ్చాడు.
అతనికేసి అసహనంగా చూశాడు గోవిందరావు.
గొంతు సవరించుకొని కథ చెప్పటం ప్రారంభించాడు.
జూదమాడి ఓడిపోయిన పాండవులు నిబంధనల ప్రకారం పన్నెండేళ్ళ అరణ్యవాసం చేయటం, ఎన్నెన్నో కష్టాలు అనుభవించటం, పదమూడో సంవత్సరం అజ్ఞాతవాసం చేయటానికి పూనుకోవటం …. కథంతా చెప్పుకొచ్చాడు.
‘‘లేదు నాయినా! పొరబాటు దొర్లింది తండ్రీ! ఇక మీదట అట్లు జరగదులే ..’’ అంటూ గోవిందరావు సర్ది చెప్పాడు.
తను చెప్పిందాంట్లో తప్పేముందో సుబ్బారావుకు అర్థం కాలేదు.
వాస్తవమే గదా తను మాట్లాడింది!
పాత్రల్ని పరిచయం చేస్తున్నాడు గోవిందరావు.
‘‘నల్లని వాడు పద్మ నయనంబుల వాడు కృపారసంబు పై
జల్లెడు వాడు మౌళిపరిసర్పిత పింఛము వాడు నవ్వు రా
జిల్లెడు మోమువాడొకడు
– ఈ కృష్ణ పరమాత్మ విగ్రహాన్ని ఇంత అందంగా రాయించింది ఎవరంటే – తోలు ఇచ్చి, రంగులిచ్చి, సంభావనలిచ్చి రాయించిన దాత మా స్వంతవూరు అగ్రహారం వేమారెడ్డి గారు…. మహాదాత ….’’
‘‘బంగారు రంగు మేనిఛాయతో ఇదో ఈ అర్జునుడు …. అర్జున ఫల్గుణ పార్ధ కిరీటి స్వేతవాహన బీభత్స విజయ ధనంజయ వగైరా పది పేర్లతో ప్రసిద్ధి కెక్కిన ఈ వీరుని విగ్రహం ఎవరు రాయించారంటే ….
దాతల పేర్లు చెబుతున్నాడు.
‘‘ఈ ఊర్లో కూడా విగ్రహం రాయించిన మహాదాత ఉన్నాడు. ఈ ఊరు పేరును పదూర్లలో చెప్పుకొనేట్టు చేసిన మహానుభావుడు …. యాదవ రాజు …. ఎలమంద …. మేకపోతునిచ్చి, రంగులిచ్చి, కూళ్ళిచ్చి ఆయన రాయించిన విగ్రహమేదంటే …. భీష్మ పితామహుడు ….’’
‘‘ఎలమందరాజు ఎట్లుండేవాడు! గబ్బెడు గబ్బెడు మీసాల్తో, ముంత కప్పుతో, చేతిలో బొట్టెకట్టి పట్టుకని ఎంత గంభీరంగా ఉండే వాడనీ!
సుబ్బారావు అందుకకొన్నాడు ఎంటనే ….
జుట్టు పోలుగాని బొమ్మను చేతికి తీసికొన్నాడు.
‘‘ఆ మీసాలు దాతృత్వానికి గుర్తు, అడిగిన వానికి లేదనకుండా ఇచ్చేవాడు కాబట్టే ఆ మీసం.
పది మందికి భోజనం పెట్టేవాడు కాబట్టే ఆ మీసం.
ఇయ్యగల ఇప్పించగల
అయ్యలకే గాక మీసమందరికేలా!
రొయ్యకు లేదా బారెడు
కయ్యానికి కుందవరపు కవి చౌడప్పా!
అన్నట్లు ఇయ్యగల మహానుభావులకే మీసముండాల. పది మందికి దానం చేసే వానికే మీసముండాల. ఎలమంద మీసం ఆ ఒక్క తరంతోనే పోలేదు. ఆ మీసపు ఊడలు ఈ తరానికి కూడా వ్యాపించి ఉన్నాయి. అందుకే పాములేటి కళాకారుల బాధలు చూడలేకపోయాడు. తనే ముందుకొచ్చి తాంబూలమిచ్చాడు. ఇట్లాంటి ధర్మ ప్రభువులకు మీసాలుండాల. అందరికీ మీసాలెందుకు? రొయ్యకు లేవా బారెడు మీసాలు.. లాభమేల?
రాయచోటికాడ ఒక ఊర్లో …. అదీ చిన్న ఊరు …. ఆ ఊరి రెడ్డి ఆట ఒప్పందం చేసుకొని తాంబూల మిచ్చినాడు. ఆటాడించినాడు. పొద్దున్నే లేచి ఇంటికాడికి పోతే లెఖ్క ఎగరగొట్టినాడు. మేం గట్టిగా అడిగితే అంతలావు మీసం దువ్వి తన్నదానికొచ్చిండు. అట్లాంటి మోసగానికి మీసాలెందుకు? …. ఎలమందలాంటోల్ల కుండాలిగాని ….’’
‘‘ఎగరగొడ్తే నువ్వూరకున్నేవంటరా బొమ్మలాట నాయాలా?’’
ఓ మూల నుంచి అల్లాటప్పాగాడు ఇకిలించాడు.
‘‘అందుకేరా నియ్యక్క! ఇప్పుడా త్రాస్టుని చేత పోకమాను మోపిస్తా చూడు….’’
రెడ్డి బొమ్మ ఒకటి తెరమీదికి వచ్చింది.
ప్రేక్షకులలోని పెద్ద వీరారెడ్డి ఉలిక్కిపడ్డాడు.
ఆందోళనగా అటుకేసి చూశాడు.
తర్వాతి బొమ్మ తనదే ఉంటుందేమో!
బొమ్మ ఉండాల్సిన పన్లేదు. ఇప్పటికే పాతతరం జనాలందరికీ అలనాటి తన బొమ్మలాట వివాదం గుర్తుకచ్చే ఉంటుంది.
అక్కసు పట్టలేక పోయాడు.
‘‘ఈ నా కొడుకులు సెప్పేదేందిరా! గొల్లోల్లు తప్ప రెడ్లెవురూ మీసాలు పెట్టుకోకూడదనా!’’ గట్టిగా అన్నాడు ఆయన.
‘‘మనమంతా దానగుణం లేన్నాకొడకలం. లెక్కలియ్యనోల్లం. కళాపోషణ తెలీనోల్లం. ఆ గొల్లనాకొడుకొక్కడు మొగోడు …. లక్షల లక్షలు దానాలిచ్చి గుళ్ళు గోపురాలు కట్టించినోల్లం …. బొమ్మలాట ఆడించనే గతిలేదా మనకు? ఏమనుకుంటాండ్రు ఆ నా కొడుకులు ….’’
అక్కడే కుర్చీ వేసుక్కూచుని ఉన్న రాఘవరెడ్డి మెల్లిగా లేచి ఇంటికి నడిచాడు.
‘‘మనందర్నీ లెక్కియ్యలేని వాల్లుగా చూసె …. ఇయ్యాపెట్టని అయ్యకు మీసాలెందుకనె. అంటే మనమంతా మీసాలు గొరిగించుకోవాల్నా?’’ మరో మనిషి గొంతు చేసికొన్నాడు.
‘‘రెడ్లు దప్ప ఎవురూ ఎగరగొట్టరేమో! దేశంలో రెడ్లంతా లెక్కలెగర గొట్టే దొంగ నా కొడుకులనా వీల్ల ఉద్దేశ్యం? రెడ్లంతా మీసాలు గొరిగించుకోవాలనా?’’
మరో గొంతు అంది తీక్షణంగా.
ప్రెసిడెంటు అక్కణ్ణించి మెల్లిగా జారుకున్నాడు.
‘‘కండ్లు కనపల్లే నా కొడకలకు ….’’
ఇంకో గొంతు….
తెరమీద జుట్టు పోలుగాడు తన ‘పోకమాను’ను రెడ్డి భుజాల మీద ఆన్చి ‘‘మొయ్ నియ్యక్క …. డబ్బెగరగొడ్తావా! .. మొయ్ – పోకమానుతో పండ్లు తోముకో ….’’ అంటున్నాడు.
ఈ మాటలయితే తనూ చెప్పగలననుకున్నాడు తెరకేసే చూస్తూ ఉన్న తిక్కలకొండి. బొమ్మను కూడా ఆడించగలననుకొన్నాడు. వనజాబాయి దృష్టిలో మొగోడు కావాలనుకున్నాడు.
ఆదరాబాదరా జుట్టు పోలుగాడి బొమ్మను పట్టుకొని వాడి ఎర్రటి పోకమాను రెడ్డి తలమీద పెడుతూ ‘‘మొయ్ నా కొడక రెడ్డీ! మొయ్. పొద్దున్నే లేసి పోకమానుకు దండం పెట్టుకో .. మొయ్….’’ అంటూ హుషారు చేశాడు.
‘‘ఓ యమ్మా! ఓ నాయనా! నేను మొయ్యలేనే ….’’ అంటూ రెడ్డి ఏడుస్తోన్నట్లుగా అభినయం.
జనాల్లో కలకలం రేగింది.
ఒకదాని తర్వాత ఒకటిగా అందుకొన్నాయి గొంతులు.
రెడ్ల వంశాన్నే అవమానపరుస్తోన్నట్టుగా జనాల్లో భావన కలిగించటంలో పెద్ద వీరారెడ్డి ప్రభృతులు కృతకృత్యులయ్యారు.
‘‘నీ పోకమాను మీద బండబడ …. రెడ్లందరికీ కోపమొస్తాంది …. ఆ గొడవ సాలించండి ….’’ బైటకు వెళ్ళి వచ్చిన వెంకటేశ్వర్లు గాభరాగా చెప్పాడు.
కోపమెందుకో అర్థంకాలేదు గోవిందరావుకు.
‘‘మా కడుపు గొట్టినోన్ని తిట్టుకనే హక్కు కూడా మాకు లేదా?’’ అన్నాడు.
అంతలో డేరా లోపలికి తోసుకచ్చారు పది మంది యువకులు.
‘‘ఓయ్! ఆటాపండి …. ఈ ఊర్లో మీరాడొద్దు. ఏ కులమూ లేకుండా అందరూ గొల్లోల్లే ఉండే ఊర్లల్లో ఆడుకోపోండి ….’’ చెప్పాడు ఓ యువకుడు.
‘‘స్వామీ! మేమేం తప్పు జేసినాం స్వామీ? మిమ్మల్ని మేమేమీ అనలేదే! మీరు ఆగ్రహిస్తే మేం బతుకుతామా?’’ రెండు చేతులెత్తి దండం పెట్టాడు గోవిందరావు.
‘‘ఇంకా ఏమనాల? ఆ గొల్లోడొక్కడే లెక్కిచ్చి ఆడించినట్టూ …. మేమియ్యనట్టూ …. ఇదెంతా తీరువా లెక్కగాదా! ఇచ్చే వానికే మీసాలుండాలంటిరి. ఇయ్యనోడు కొజ్జాలాగా మీసాలు తీసేసి తిరగాలంటిరి. రెడ్లమంతా ఇయ్యలేదని కూస్తిరి …. అంటే మేం మీసాల్దీసి కొజ్జాల్లాగా ఉండాలనా?’’
‘‘స్వామీ! స్వామీ! …. అది మా మాటకాదు స్వామీ! కవి చౌడప్ప రాసిన పద్యం స్వామీ!’’ కాళ్ళావేళ్ళా పడ్డాడు.
యువకులు శాంతించలేదు.
రెడ్ల కులాన్ని కించపరచినారంటూ తెరమీది బొమ్మల్ని పీకి కింద పడేశారు.
బొమ్మలాటగాళ్ళు గగ్గోలెత్తారు. తమను రక్షించమంటూ గోడుగోడున ఏడవటం మొదలెట్టారు.
అప్పటికే కులపెద్దలు లోపలికి చేరుకున్నారు.
యువకుల్ని కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమిలాడారు.
పాములేటి అయితే చాలా దీనంగా ప్రాధేయపడ్డాడు.
‘‘అయ్యా! మీక్కోపముస్చే నన్ను తన్నండి సామీ! గొల్ల నాయాల్ని పొరబాటే సేసినా. ఇంతమంది రెడ్డి గార్లుండగా గొల్లోన్ని ముందుకొచ్చి తాంబూలమియ్యడం తప్పే.. వాల్లసేత పొగిడించుకోవడం పెద్ద తప్పే! తప్పంతా నాదే స్వాములూ! …. నన్ను తన్నండి మారాజా ….’’ అంటూ చేతులు ముకుళించి వాళ్ళకు అడ్డొచ్చాడు.
ఆటాడ వద్దని హెచ్చరించి రెడ్ల యువకులు బైటక్కదిలారు.
జనాలందర్నీ ఇళ్ళకు వెళ్ళమని ఆదేశించారు.
మరో అర్ధగంట సేపటికి ఏడుపులు కన్నీళ్ళతో బొమ్మల్ని పెట్టెలో సర్దుకొని దేవాలయంలోకి చేరుకొన్నారు కళాకారులు.
తెల్లార్లూ వాళ్ళకు నిద్రలేదు.
గోవిందరావు కళ్ళ ముందు భవిష్యత్తు అగమ్యగోచరంగా కదలాడుతోంది.
ఊరికి వెళ్ళగానే తనే బేరగాళ్ళను పిల్చి బొమ్మల్ని అమ్మటం ఉత్తమంగా తోచింది.