తోలుబొమ్మలాట – 06వ భాగం

గ్రామ పెద్ద రాఘవరెడ్డి ఇంటినుంచి బియ్యం, బేళ్ళు, ఉప్పు, పప్పు, మిరపకాయ, చింతపండు వగైరా సంభారాలు రావటంతో – ఆయమ్మనో ఈయమ్మనో అడగకుండా చట్టీ ఇప్పించుకని గుడి వద్దనే పొయ్యి రాజేసింది కమలాబాయి.

ఎర్రమట్టి నీళ్ళలో కందుల్ని నానేసి, ఎండబెట్టి, సాంప్రదాయిక పద్ధతిలో తయారుచేసిన కందిబేడల పప్పూ, వేడి వేడి అన్నమూ పాత రోజుల్ని గుర్తుజేసి ఏదో తన్మయా భావన కలిగించింది గోవిందరావుకు. రుచిగ్రంథులు ఎండిన నాలుక చెలిమల్లో తేమ ఊరించాయి.

ఏదొక ఇంటి వద్ద భోజనం యాచించే శ్రమ తప్పినందుకు అందరూ సంతోషిస్తోంటే వెంకట్రావు, రామారావులకు మాత్రం చింతగా ఉంది.

వాళ్ళీ ఉదయమే వీధుల్లో అమ్మవచ్చిన చేపల బుట్టల్ని చూశారు. చాలామంది ఎగబడి కొంటూ ఉంటే ఆసక్తిగా తిలకించారు. దగ్గరకు వెళ్ళి చేపల్ని ఆశగా చూశారు. మంచి కులం కలిగిన చేపలే … జెల్లలు, కుంటపాములు, ఇసుకదండులు, … ఒకటి రెండు ఇండ్లకు మాత్రమే దొరికిన ఉల్చలు …

వీధిలో నిలబడి ఏ ఇంటికి ఏ రకపు చేపలు వెళ్ళేది జాగ్రత్తగా గమనించారు.

చేపలకూర చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు. చేపల కడుపునిండా గుడ్డే కనిపిస్తుంది. చిన్న చేపల్లో సైతం ఈత గింజలంత గుడ్డుతో … తింటోంటే జిహ్వకు బహుపసందుగా ఉంటుంది.

ముత్రాసు వెంకటేశ్వర్లుకు చెప్పి తమకు ఇష్టమైన ఇంటిలో భోజనం చెప్పించుకొందామనుకన్నారు. తమకు తెలుసుగదా ఏ ఇంటిలో ఏ రకపు చేప ఉడికిందీ!

తమ ఆశలన్నింటికీ పెద్దరెడ్డి గండికట్టాడు.

కుశిలిస్తానే కూడు తిన్నారు వాళ్ళు.

భోంచేసి చేయి తుడుచుకొంటూ పళ్ళెం ముందునించి లేచాడు గోవిందరావు. అట్లా సర్దుకొని కూసానికి ఆనుకుని కూచుని కొంతసేపు విశ్రాంతి తీసికొందామనుకొనే లోపలే వచ్చి మెదడంతా ఆక్రమించుకన్నాయి, ఉదయాన్నించి అతలాకుతలం చేస్తోన్న ఆలోచనలు.

ఊర్లోకి అడుగుపెట్టి రెండవ రోజు మధ్యాహ్నం కూడా గడచిపోతూ ఉంది.

ఇప్పటికింకా అన్ని కులాల పెద్దలనూ కలవలేదు.

వాళ్ళే వచ్చి తమను కలిసే రోజులు పోయాయి. కాబట్టి తామే వాళ్ళ ఇళ్ళు వెదుక్కంటూ వెళ్ళాలి.

ప్రెసిడెంటును కలవాలి.

భారమంతా అతని మీదే వేశాడు రాఘవరెడ్డి.

టౌనుకేమో వెళ్ళాడుట ప్రెసిడెంటు. మధ్యాహ్నానికి వస్తాడుట. పొద్దు వాటాలిన తర్వాత గ్రామ చావిడిలో పంచాయితీ ఉందిట. అక్కడ కస్తాడుట అతను.

భోజనాల సమయంలో ఇంటి వద్ద దొరకగలడుగాని ఆ ఇంటికేసి మొగమెత్తేందుకు ధైర్యం చాలకుండా ఉంది తమకు. అతని తండ్రి పెద్ద వీరారెడ్డి ఎదుటబడాలంటే భయంగా ఉంది.

ప్రెసిడెంటును చావిడి వద్దే కలవాలి.

ఈరోజు ఒప్పందం చేసికొంటే రేపు రాత్రికయినా ఆటాడొచ్చు.

సుబ్బారావును వెంటేసుకొని మెల్లిగా అక్కణ్నించి కదిలాడు.

తూర్పు వీధిలో ప్రవేశిస్తూ ఉండే ఉత్తరపు వీధి మొగదల మిద్దె పంచలోంచి రామారావు గొంతు విన్పించింది.

‘‘పరగడుపున, సభలోపల,

తరుణుల యెడ, భుక్తమైన తరియొక విడెమున్‌

దొరకని నరునకు సౌఖ్యము

కరువప్పా కుందవరపు కవి చౌడప్పా!’’

భోంచేశాడుగదా! తాంబూలం కోసం అగచాట్లు పడుతోన్నట్టుంది.

పద్యాలతో పరిచయం ఉన్న వాళ్ళయితే వెంటనే కోరుకున్న తాంబూలం తెప్పించి ఇవ్వగలరు. అంత రసికత ఎక్కడుంది?

గ్రామ చావిడి చేరుకోవాలంటే రెండు వీధులు దాటివెళ్ళాలి.

అడుగడుగునా ఎదురయ్యే జనం తమకో అవకాశం.

పొన్ను కర్ర, చెవికమ్మ, పిలక జుట్టుతో విలక్షణంగా కన్పించే తాము జనాల హృదయాలలో కూడా కొత్తదనం నాటేందుకు ప్రయత్నించాలి.

వీధి కూడళ్ళలోని మనుషుల మధ్య చాటు పద్యాలు విసరాలనుంది.

మిద్దెపంచల్లోని ముసలాళ్ళ ముందు పాతపురాణాలు విప్పాలని ఉంది.

వీధరుగుల మీద పెద్ద రెడ్ల వద్ద స్తోత్రాలు పాడాలని ఉంది.

ఎద్దుల కొట్టాల్లో, వడ్రంగి ధాతివద్దా పిట్ట కథలు కుమ్మరించాలనుంది.

తమ అదృష్టమో దురదృష్టమో గాని పురాణ జ్ఞానమున్న పాతతరపు ముసలాళ్ళు చాలామంది రాలిపోయున్నారు.

ఊర్లోకి అడుగు పెట్టక ముందు వాళ్ళను తల్చుకొని భయమేసింది.

ఉత్తరరామాయణమో, వసుచరిత్రో తమ ముందుంచి అర్థ తాత్పర్యాలు వివరించమంటారేమోనని భయం.

వాటి జోలికి వెళ్ళక దశాబ్ధాలు గడిచింది గదా! అర్థాలు స్ఫురిస్తాయో లేదో? తాత్పర్యం చెప్పేందుకు నోరు పెగులుతుందో లేదో?

ఒక్క పూటకే ఆ భయం తగ్గింది.

తమను నిలేసే వాళ్ళు ఎటూ లేరు.

తాము చెబుతోంటే వినేవాళ్ళు కావాలి.

కొద్దిసేపయినా ఆలకించే వాళ్ళు దొరకాలి.

ఊరుతత్వం చాలా మారిపోయి ఉంది.

ఎద్దుల కొట్టాలు చూద్దామన్నా కన్పించటం లేదు.

సంసారం చేసే ఇంటి పక్కనే ఎద్దులకు బర్రెలకు ప్రత్యేకించి కొట్టం ఉండేది. ఎద్దుల్నయితే సంసారం చేసే ఇంట్లోనే ఓ వైపు గాడి ఏర్పాటుజేసి కట్టేసే వాళ్ళు. వాకిట్లోకి అడుగుపెట్టేసరికి మాగిన రొచ్చు పేడవాసన గుప్పున మొహాన కొట్టేది.

ప్రశాంతంగా గాడిలో తలపెట్టి మేపు తింటున్నపుడు – చెవి గూబవద్దో, గంగడోలు మీదో జోరీగ వచ్చి వాలటంతో తల విసిరిన కదలికలకు మెడగంట గణగణ మోగటం – దారిన వెళ్ళే వాళ్ళకు సైతం ఎద్దు దృశ్యాన్ని కళ్ళ ముందు ఊహించుకొనేలా చేస్తుంది.

శివరాత్రికి పూర్తికాకున్నా ఓబుళం తిరునాళ్ళకంతా వాములు వేయటం ఎంట్లు కట్టటం కూడా అయిపోయి రైతులు ఎండపొద్దున ఖాళీగా కూచోలేక ఎద్దల కొట్టాల్లో నులక పేనుకుంటూ ఉండటం అప్పటి సహజ దృశ్యాలు.

బోదకొట్టాలు తగ్గిపోవటాన్ని గురించి ఓ రైతును ప్రశ్నించాడు గోవిందరావు.

ఇప్పుడు బోదకొట్టాల్ని సాకటం బరువైందిట. బోదకుళ్ళటమో, చెదలు పెట్టటమో జరుగుతుంది. ఏడు మార్చి ఏడయినా బోదకొని, తోలుకొచ్చి కప్పటం ఆషామాషి పనికాదుట. పూర్వంలాగా ఇంటిల్లిపాది కొండకు వెళ్ళి బోదకోసుకచ్చేంత ఓపిగ్గానీ, బండ్లు ఎద్దుల్లాంటి అవకాశాలుగాని ఇప్పుడు లేవు. దానికితోడు అగ్గి భయం.

అందుకే ఒక్క అంకణమయినా గట్టి కంత నిర్మించుకంటే చాలు. ఎద్దులు ఎటూ లేవు. బర్రెలకు వసారా వేసి ఆకో అలమో కప్పొచ్చు.

పాతకు కొత్తకు మధ్య సంబంధాలు గురించి గోవిందరావుకు అర్థమవుతూనే ఉంది.

ప్రతి ఇంటి ముందరా ఎద్దుల గాడి ఉండేది. బిడువు స్థలం దొరికితే చాలు గూటాలు బాతిపెట్టేవారు. ఎండ దిశను బట్టి గాళ్ళు మారుస్తూండే వాళ్ళు. ఎద్దులకు మోపేస్తూనో, నీళ్ళు తాపుతూనో, పైన కడుగుతూనో గాళ్ళూ మీద జనాలు కన్పించే వాళ్ళు. కుండపెంకులో నిప్పులు వేసికచ్చి ఎద్దు పంటిమీది పిడుదుల్ని గోటపీకి నిప్పుల్లో వేసి కాల్చే దృశ్యాలు కూడా సాధారణంగానే కన్పిస్తుండేవి.

మనుషుల సంఖ్యకు రెట్టింపుగా పశువుల సంఖ్య కన్పించే ఆ కాలం …

పశువుల్ని కూడా తమ కుటుంబ సభ్యుల్లో ఒకరుగా భావించే కాలం …

అదో మంచికాలం … ఎర్రికాలం … ఎర్రిబాగుల కాలం …

కప్పురాలిన ఎద్దుల కొట్టంలో మొండిగోడ కింద కూచుని ఉన్నాడు ఓ ముసలాయన. పక్కనే విరిగిన నాగలి గోడకాన్చి ఉంది.

ఆ దృశ్యం గోవిందరావును కదిలించింది.

ఆ రైతు ఎవరో, ఆ కొట్టం ఎవరిదో సరిగ్గా గుర్తురావటం లేదు.

ఎదురైన మనిషిని అడిగాడు.

అతను చెప్పిన సమాధానం గోవిందరావును కుదిపేసింది.

ఆ కాలాన … బొమ్మలాటల కాలాన … ఊరిని శాసించే ఇద్దరు ముగ్గురు రైతుల్లో … పెద్ద రెడ్లలో ఆయనా ఒకరు.

వర్షాధారపు పొలాల్లాగే … మెట్ట వ్యవసాయం లాగే … వ్యవసాయపు పనిముట్టులాగే … సేద్యాన్ని నమ్ముకొని చెదలు తినేసిన కొయ్యలా ఆయనా … ప్యాక్టరీలనో, చిన్నచిన్న వ్యాపారాల్నో వెదక్కొంటూ వెళ్ళిన కొడుకులకు దూరమైన ఆయనా … పొలానికి దూరమైన సేద్యపు పనిముట్లూ …

తనకూ ఆ రైతుకూ ఏదో సామ్యమున్నట్టుగా తోచింది గోవిందరావుకు.

వెంటనే కిరీటి గుర్తొచ్చాడు.

తోలుబొమ్మల ఆస్తికోసం వెంపర్లాడే అతని ఆరాటం గుర్తొచ్చింది.

తోలు విగ్రహాలంటే వాని దృష్టిలో అదో చరాస్థి. ఎప్పుడంటే అప్పుడు అమ్మి సొమ్ము సేసికొనే ఆస్తి.

వాడి కళ్ళల్లో కాంక్షను తల్చుకంటే చాలు భయమేస్తోంది.

ఇక్కడికి కూడా రాగలడేమో!

గొడవ పెట్టుకోగలడేమో!

ఎదలో సన్నని అదిరిపాటు మొదలైంది.

అది క్రమేణా పెరుగుతూ ఉంది.

ఇళ్ళను, సందుల్ని, మనుషుల్ని గుర్తుకు తెచ్చుకోవటంలో ఆందోళనని అణచుకొనేందుకు ప్రయత్నిస్తూ వీధి దాటాడు.

రెండవ వీధి మొగదలే ఎదురైంది పాతకాలపు మిద్దె.

వెంటనే గుర్తొచ్చాడు సుబ్బయ్య శ్రేష్టి.

ఆ కాలం … ఊర్లో ఏకైక చిల్లర అంగడి.

ఊరందరికీ సరుకులు అప్పులిస్తూ, పంటకాలంలో పంటను కొని చెల్లేసుకంటూ, చేతినుంచి ఒక్క పైసా ఉచితంగా రాల్చకున్నా అందరికీ పెద్ద సాయంగా ఉంటూ …

వాకిలికి ఎదురుగా నిల్చుని లోపలికి చూడబోయాడు.

మామ మనస్సు గుర్తెరిగిన వాడిలా గుమ్మందాకా వెళ్ళి సగం అడ్డగించిన తలుపును పూర్తిగా నెట్టాడు సుబ్బారావు.

వెంటనే లోపల్నించి స్పందన ‘‘థేయ్‌ … థేయ్‌ …’’ అంటూ – ‘‘ఇదో … పలకదూ … కుక్కేమో వాకిలి తోసినట్టుంది సూడూ …’’ లోపలి ఇంట్లోని భార్యనుద్దేశించి కాబోలు కేక.

‘‘ఈ చెవిటి దానితో యేగలేక సస్తాండ …’’ ఊతకర్ర టకటకలు …

తల బైటబెట్టి ‘‘ఎవుర్నాయినా?’’ అంటూ ప్రశ్న.

సుబ్బారావు చెప్పగానే శ్రేష్టి మొహంలో వ్యక్తీకరించిన సన్నపాటి వెలుగు.

వాకిలి దాటి వీధిలోకి రాగానే ‘‘అయ్యా! సుబ్బయ్య శ్రేష్టిగారూ! దండాలు మహాప్రభో!’’ అంటూ గోవిందరావు.

‘‘కుసుమ శెట్టికి ముద్దు కూతురై తగను

వసుధ కోరిన వార్కి వరము లొసగుచును

పొసగ ఇంటింట బహు పూజలందుచును

వెసగజేసిన పొద్దు హెచ్చరింపుచును

వన్నె కెక్కితివమ్మ వర పసిడి బొమ్మ

కన్నెకా దేవమ్మ కరుణించవమ్మ!’’

బొమ్మలాట రాగంలో గానం చేయగానే శ్రేష్టి నిలువెల్లా కరిగిపోయాడు. నోట మాటరాక నిలువు గుడ్లేసుకొని అటే చూస్తూ ఇంటి అరుగు మీద కూచున్నాడు.

‘‘ఆ తల్లి వంశీయులు మీరు … వైశ్య ప్రముఖులు … గ్రామానికి పట్టుగొమ్మలు … ఆనాటి వ్యాపారం, లావాదేవీలు, వైభవం తల్చుకొంటే చాలు మనస్సు ఆనంద పరవశమౌతూ ఉంది శ్రేష్టిగారూ! ఇప్పుడా వ్యాపారం ఉందా? లేదా?’’

మెల్లిగా తేరుకొన్నాడు సుబ్బయ్య శ్రేష్టి.

పెదాలు తడువుకొంటూ అటు ఇటు చూశాడు.

అప్పటికే నలుగురైదుగురు జనం అక్కడ పోగై ఉన్నారు.

‘‘కోమటోల్లే యాపారంజేసే కాలంలో నువ్వు జెప్పింది నిజమే గోవిందరావూ! ఇప్పుడు అన్ని కులాలోల్లూ యాపారానికి తిరుక్కున్నెరు. అందరూ కోమటోల్లయిన్రు … ఏ కులపోడు ఆ కులపోనికాడ కొంటాండు. యాపారం గూడా కులాల బట్టి నడుస్చొంది. … యాపారమంటే మీరనుకుంటాన్నెట్టు బీడీలు, అగ్గిపెట్టె, ఉప్పు, పప్పు, మిరపకాయ కాదు. యాపారమంటే టీ కాచాల … బజ్జీలు వడల్జెయ్యాల. దోసె పొయ్యాల. మిక్చర్‌ కట్టాల .. కూల్‌డ్రింకులు పెట్టాల … ఆ కూలింగ్‌ బాక్సుల్లోనే బీరుసీసాలు పెట్టాల … అప్పులియ్యాల … గట్టిగా అడిగి తన్నిచ్చుకోవాల … అందరికీ అనిగిమనిగి ఉండేటోడే యాపారంలో పది రూపాయలు ఎనకేసుకొంటాడనేది లోగడి మాట. ఇప్పుడు పల్లెల్లో యాపారమంటే కండబలమో, మంది బలమో ఉండేటోడు చేసేది. తెల్సునా! … పల్లెలు మారిపొయ్యినయి గోయిందరావూ! అందుకే మావోడు టౌను జేరిండు. ఆన్నే యాపారం జేసుకుంటాండు …’’ తన ఆవేదననంతా వెళ్ళగక్కాడు శ్రేష్టి. తమ కులవృత్తిని ఇతరులు లాగేసుకోవటం పట్ల ఆక్రోశించాడు.

తర్వాతి సంభాషణను బొమ్మలాట పైకి మళ్ళించాడు గోవిందరావు. ఆటాడేందుకు వచ్చామనీ, తమ మీద గ్రామ పెద్దలకు కరుణ కలుగలేదనీ, గతంలోలా శ్రేష్టిగారు రెడ్డిగారికి ఓ మాట చెబితే బావుంటుందనీ…

సమాధానం ఇవ్వలేదు సుబ్బయ్య శ్రేష్టి.
వెనక్కి తిరిగి ఇంట్లో కెళ్ళాడు.

అతని ప్రవర్తనకు చుట్టుపక్కల వాళ్ళు నవ్వుకొంటున్నారు.

కొంతసేపు చూసి ‘‘రా మామా పోదాం!’’ అన్నాడు సుబ్బారావు కూడా.

గోవిందరావు వెనుదిరగబోతోన్నంతలో … ఇంట్లోంచి బైటకొచ్చాడు శ్రేష్టి. ‘‘ఇదిగో నాయినా! ఇదీ నా సాయం’’ అంటూ చేయి చాచాడు.

ఆయన గుప్పెట్లో రెండు బీడీ కట్టలు, అగ్గిపెట్టె ఉన్నాయి.

రెండు చేతులు చాచి దోసిలితో అందుకొన్నారు గోవిందరావు.

‘‘ఆటాడితే తెల్లార్లూ సూస్తా నాయనా!’’ మరో సాయం ప్రకటించాడు.

‘‘తమరి దయ మా మీద ఈ మాత్రమున్నా చాలు …’’ అంటూ బీడీ కట్టలతోటి రెండు చేతులు తలపైకెత్తి నమస్కరించి వెనుదిరిగాడు గోవిందరావు.

పిల్లికి సైతం భిక్షంపెట్టని సుబ్బయ్య, ఐదు రూపాయల విలువైన బీడీల్ని బొమ్మలాటగాళ్ళకు ఉచితంగా ఇవ్వటం అక్కడున్న వాళ్ళకు వింతగా ఉంది. … ఆశ్చర్యంగా ఉంది.

బొమ్మలాట గురించీ, బొమ్మలాటగాళ్ళ గురించీ, బొమ్మలాటల కాలం గురించీ వాళ్ళకు తెలీదు గాబట్టే ఆ కొత్త భావన.

తమ వృత్తిని గురించీ వృత్తి మార్పిళ్ళ గురించీ సుబ్బయ్య శ్రేష్టి వ్యక్తీకరించిన ఆవేదన పదే పదే గుర్తుకు వస్తూ ఉంది గోవిందరావుకు.

గ్రామ చావిడిదాకా అది వెంటాడుతూనే ఉండిపోయింది.

అవును – వ్యాపారమంటే ఉప్పు పప్పు అమ్మటం కాదు.

టీలు బజ్జీలు బీరు బ్రాందీలు అమ్మటం.

బొమ్మలాటలంటే – తోలుబమ్మల్ని ఆడిస్తూ గొంతు చించుకోవటం కాదు.

టీవీ బొమ్మలు, సినిమా బమ్మలు, రికార్డింగ్‌ డ్యాన్సులు, … కూలింగ్‌ పెట్టెల్లో కూల్‌డ్రింక్‌లకు బదులు బీరుసీసాలకు లాగా – తోలుబొమ్మలకు బదులు బతికిన తోలు బొమ్మలతో రికార్డింగ్‌ డ్యాన్సులు కావాలి వీళ్ళకు.

‘‘రామచంద్రా!’’ అనుకున్నాడు గాఢంగా గాలిపీల్చి వదులుతూ.

చావిడి వద్ద పది మంది దాకా జనమున్నారు.

వాళ్ళంతా ప్రెసిడెంటుకోసం ఎదురు చూస్తున్నారు.

వాళ్ళతో కలిసేందుకు ప్రయత్నించారు.

పిట్ట కథలు చెప్పేందుకు చూశారు.

చాటువులు విప్పేందుకు పూనారు.

పొడుపు కథలు పొడిచేందుకో, పురాణాల్లోని సంఘటనల్ని వివరించేందుకో, లోగడి పెద్ద రెడ్ల కాలంనాటి పరిస్థితుల్ని జ్ఞాపకానికి తెచ్చేందుకో తపన పడ్డారుగాని అక్కడి జనం వాళ్ళను భరించేందుకు సిద్ధంగా లేరు. వాళ్ళు బారినుంచి తప్పించుకనేందుకే ప్రయత్నించారు.

‘‘కొందరు భైరవాశ్వములు కొందరు పార్ధుని తేరి టెక్కెముల్‌

కొందరు కృష్ణ జన్మమున కూసిన వారలు … మహానుభావులు

మన మాటలు వాళ్ళ చెవుల నాటుతాయా?’’ సుబ్బారావు గొణిగాడు.

అంతలో ప్రెసిడెంటు వచ్చాడు.

కళాకారులు లేచి నిల్చుని రెండు చేతులెత్తి నమస్కరించారు గాని అక్కడున్న వాళ్ళు మామూలు గానే ఉన్నారు.

‘‘శానాసేపైంది మేమొచ్చి’’ అన్నాడొకడు. ‘‘అప్పుడే వస్చావనుకుంటిమి.’’

‘‘యాడబ్బీ! సేలకాన్నించి అట్నే పోతిమి. బువ్వన్నా తిన్రాపద్దా!’’ ప్రెసిడెంటు సమాధానం.

కొంతసేపటికి విషయంలోకి దిగారు.

పంచాయితీకి కూచున్న వాళ్ళు రెండు వర్గాలుగా వాదించుకొంటున్నారు.

వాళ్ళ ఆరాటం, వాళ్ళ ఆవేశం, వాళ్ళ వాద ప్రతివాదాలు న్యాయసూత్రాలూ అన్నీ సారాయి అంగళ్ళకు సంబంధించినవేనని అర్థమయ్యేసరికి చాలా సమయమే పట్టింది గోవిందరావుకు.

ఊరి గమిల్లోనే అలుగొంక అవతల మరో ఊరు. యాభై ఇళ్ళు కూడా ఉండవు. ఆ ఊర్లో లిక్కర్‌ బెల్ట్‌షాపు నిర్వహణ కోసం పోటీలు. ఈ ఊరి ప్రధాన అంగడి నుంచి సరుకు తీసుకపోయి అక్కడ అమ్మటం.

చాలాసేపు పంచాయితీ వొగదెగలేదు.

చివరికి సవాలు పాట పాడక తప్పలేదు.

ఎక్కువ మొత్తాన్ని పాడిన వాళ్ళకు షాపు అందింది.

చిలకలపాడు షాపు కూడా మండల కేంద్రానికి సంబంధించిన పెద్ద అంగడికి బెల్టు షాపే.

దాన్ని నిర్వహించేది ప్రెసిడెంటు వీరారెడ్డేనని వినున్నాడుగాని ఇప్పుడు స్పష్టంగా అర్థమయ్యి మెదడుకెక్కేసరికి మనస్సు అదోలా అయ్యింది.

ఏడాదిపాటు బ్రాందిషాపు నిర్వహించుకొన్నందుకు గాను దేవాలయానికి డెభ్బై రెండు వేల రూపాయల రుసుము కట్టేట్టుగా ఒప్పందమట. వేలం పాటలో వీరారెడ్డి షాపును స్వంతం చేసికొన్నాడుట.

తల తిరిగిపోయింది ఆయనకు.

ఎంత మంది ఎన్ని సీసాలు తాగితే వీరారెడ్డి పెట్టుబడులు పోను లాభాలు మిగలగలవో అంచనా వేసేందుకు శక్తి చాల్లేదు.

సారాయి మత్తులో జనాల్ని ఊగి తూగించే కార్యక్రమంలో నిమగ్నమైన సర్పంచి తమ విషయం పట్ల అనుకూలంగా స్పందిస్తాడంటే ఎందుకో సంశయాత్మకంగా అన్పించింది గోవిందరావుకు.

కొంతసేపటికి అతని అనుమానం నిజమైంది.

మొదట తనకు తీరికలేదని సాకు చెప్పాడు వీరారెడ్డి. తను వ్యాపార పనులూ, కంట్రాక్టు పనులూ, కుటుంబ పనులతో సతమతమవుతున్నాననీ, ఊరందరినీ కూడేసి తీరువా రాబట్టి ఆటాడించేంత సమయం లేదనీ అన్నాడు. నీళ్ళ ప్రెసిడెంటునో, బడి ప్రెసిడెంటునో కలవమంటూ సలహా ఇచ్చాడు. చివరగా అసలు విషయం కక్కాడు. గతంలో తన తండ్రి ఇలాగే హామీ ఇచ్చి, గ్రామస్తులు సహకరించక పోవటంతో ఇబ్బందిపడ్డాడనీ, ఆయన్ను అర్థం చేసికోలేని బొమ్మలాటగాళ్ళు గ్రామగ్రామాన బొమ్మను చేసి అవమాన పరిచారనీ, తనా పరిస్థితి కొని తెచ్చుకోననీ.

మరేమీ మాట్లాడలేదు కళాకారులు.

వెనుదిరిగి ఊర్లోకి నడిచారు.

ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.

ఎవర్ని కలవాలో తెలీని గందరగోళం.

ఆట ఆడగలమో లేదోననే అనుమానం.

ఆడలేని పరిస్థితే ఎదురైతే .

కళ్ళనిండా ఎర్రటి కాంక్షతో ఎదురయ్యే కిరీటి …

బొమ్మల్ని ఎత్తుకెళ్ళి మద్రాసు బేరగాళ్ళకు అమ్మి సొమ్ముచేసికొనే కసాయి దృశ్యం…

ఆడాలి … తప్పనిసరిగా ఆడాలి … ఏ మహారాజు కాళ్ళయినా పట్టుకొని ఆటాడి మెప్పించాలి … బొమ్మలాటను బతికించాలి. తామూ బతకాలి. తాము బతికేందుకయినా దాన్ని బతికించాలి.

తమ మాటలు వినే వాళ్ళుంటే బొమ్మలాట మీద ఆసక్తి కలిగేది.

తమ చాటువులు ఆలకించే వాళ్ళుంటే గదా తోలుబొమ్మల పొగడ్తల మీద మనస్సు పుట్టేది.

తమ చేత పురాణం చదివించే వాళ్ళూ, తమ చదువులో తప్పులు ఎత్తి చూపే వాళ్ళుంటే గదా తోలుబొమ్మలు విగ్రహాలుగా కనిపించేది!

నీళ్ళ ప్రెసిడెంటు ఎవరో? బడి ప్రెసిడెంటు ఏ కులపోడో! … ముత్రాసు వెంకటేశు అవసరం మళ్ళీ వచ్చింది.

వాళ్ళ వీధికేసి కదిలారు.
కంసలివాళ్ళ ఇళ్ళ సందుల్లోంచి నడిస్తే కోటవీధి వస్తుంది.

కంసలి బ్రహ్మయ్య కన్పించగానే రెండు చేతులెత్తి నమస్కరించాడు గోవిందరావు.

‘‘వీరబ్రహ్మంగారి వంశజులు … కందిమల్లాయపేల్ల స్వాముల వారి కులస్థులు … బ్రహ్మ స్వరూపులు … పరబ్రహ్మ సంజాతులు …

పేషిణీ హనుమంత బిరుదు విఖ్యాత

భాషా చమత్కార బ్రహ్మ నిర్మీత

పోషించు పెందోట పురవర సమేత

శేషభూషణ కల్ప చెలగు విఖ్యాత

పంచముఖముల పరబ్రహ్మవైనావు

పంచలోహముల నేర్పడ జేసినావు.

అంచితముగ సిరుల కాధారమైనావు.

మహానుభావులు … దైవసమానులు … బొమ్మలాట కళాకారులం వచ్చాం. సహాయం చేయండి స్వామీ!’’ అన్నాడు.

‘‘కూచో నాయినా గోవిందరావూ!’’ ఆర్ద్రంగా ఆహ్వానించాడు బ్రహ్మయ్య.

చెక్క పీటలను చూపాడు.

‘‘భోంచేసినారా నాయనా!’’ అడిగాడు.

కూచుంటూనే అటు ఇటు చూశాడు గోవిందరావు.

పెద్ద చిన్న బాడిసెలూ, ఉలి, రంపం, గూటం, పిడిసెన … ఎటు చూసినా గొర్రు గుంటకలాంటి వస్తువులతో, కలిమితిత్తి, సుత్తి, పట్టకారులతో కాలు తీసేందుకు సందులేకుండా ఉండే ఇల్లు ఇప్పుడు ఏ వస్తువులూ నేలమీద కన్పించకుండా, చిన్న బాడిసెలాంటివి ఎక్కడో గూళ్ళలో వొదిగి, అక్కడ కలిమి పనిగాని, చెక్క పనిగాని ఏమీ జరగనట్టుగా తోస్తూ –

ఆశ్చర్యపోతూనే ఆ విషయాన్ని ప్రస్తావించాడు.

విషాదంగా మూలిగాడు బ్రహ్మయ్య.

‘‘కులవృత్తులు యాడుండాయి నాయినా! మాదిగోని చెప్పులు ఎవురు తొడుగుతుండాడు. కుమ్మరోని కుండలు ఎవురు వాడుతుండారు … చెప్పు! ఎద్దల సేద్దెం ఉంటే అన్ని కులాల వాళ్ళతో పనిబడతా ఉండె. ఇప్పుడంతా ట్రాక్టరు సేద్దేలయిపాయె. సేద్దెపు కొరముట్లతో ఏం పని? ఎప్పుడో కొడవలో గొడ్డలో చరిపించుకోవాలంటే టౌనుకు పోతాండ్రి. రైతు పని ఇడిస్తేగాని మేం గూడా బతకలేని కాడికొచ్చినం. … అందుకే నా కొడుకు టౌన్జేరిండు. డబుల్‌ కాట్లూ, సోఫా సెట్లూ, డైనింగ్‌ టేబుళ్ళూ … ఇట్లా నైసు పనుల్జేసుకుంటా బతుకుతాండు. మా కులపు పిల్లోల్లు చానామంది చిల్లరంగళ్ళు పెట్టుకొనో, బేల్దారి పనికి పోతానో, కోత మిషన్లలో కూలికి పోతానో బతుకుతుండారు …’’ చెప్పాడు.

మారుతున్న కాలాలూ, మారిపోతోన్న కులవృత్తుల గురించిన ఆవేదనా పూర్వక సంభాషణ కొంతసేపు వాళ్ళ మధ్య జరిగింది.

చివరగా చెప్పాడు బ్రహ్మయ్య ‘‘నేనేం సాయం చేయగలను. గోవిందరావూ! మన మాటలు వినే కాలంగాదు ఇది. లెక్క బలమున్నాడూ, మంది బలమున్నోడూ కలిసి ఏం జెబుతే అదే ఖాయం. నా సాయంగా నా వంతు తీరువా ఇస్తా. తెల్లార్లూ ఆటసూస్తా … రేత్రికి ఒక మనిసికి పప్పన్నం పెడ్తా …’’

మరీ మరీ వందనాలు చెప్పి అక్కణ్నించి లేచారు బొమ్మలాటగాళ్ళు.

వెంకటేశును దొరకబుచ్చుకనేసరికి పొద్దు దిగమల్లింది.

నీళ్ళ ప్రెసిడెంటుగా పిలవబడే నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు రామిరెడ్డి వద్ద కెళ్ళారు వాళ్ళు.

ఇంటి పక్కన రేకుల షెడ్‌లో కూచుని పేకాటలో మునిగున్నాడు అతను.

గోవిందరావు గొడవ ససేమిరా అతని చెవికెక్కలేదు.

ఇంటి ఆడవాళ్ళొచ్చి గంటసేపు బండబూతులు తిట్టినా, గొంతు చించుకొని అరచినా తలెత్తి కూడా చూడని వాళ్ళకు బొమ్మలాటగాళ్ళ పొగడ్తలూ, వేడికోళ్ళూ ఎక్కడ చెవిలో దూరతాయి!

‘ఏం చేద్దా’మన్నట్లుగా తలెత్తాడు వెంకటేశు.

‘‘వాల్లకు దయలేదు. మాకు ప్రాప్తం లేదు నాయినా! బడి ప్రెసిడెంటునయినా బంగపడ్డాం పా …’’ గోవిందరావు చెప్పటంతో మరో వీధికి దారితీశాడు.

అక్కడా మొండిచేయి ఎదురయితే ఏం చేయాలా? అనేది నిలువెత్తు ప్రశ్న అయి గోవిందరావును పొడుస్తోంది.

అక్కడక్కడా వీధి కూడళ్ళలో నడుములెత్తున నిల్చుని ఉండిన కల్రోళ్ళు శిధిలమై కన్పిస్తున్నాయి. మిక్సీలు, గ్రైండర్ల దాటికి పనికి రాని రాళ్ళుగా మారి మనుషులు కూచునేందుకు ఉపయోగపడుతున్నాయి. విసరు రాళ్ళు, రుబ్బుడు గుండ్లూ, రోళ్ళూ, రోకళ్ళూ … అన్నీ అంతే … గతకాలపు చిహ్నాలుగా.

ఎగువ్వీధికి దారితీశాడు వెంకటేశు.

వీధి చివరిదాకా …

గోవిందరావు మనస్సు నిండా ఏవో స్మృతులు.

ఈ ప్రాంతంలో లోగడ నాలుగు సాయిబుల ఇండ్లు ఉండేవి. ఆ నలుగురి కోసం హిందువులంతా కలిసి చిన్న దర్గా కట్టించి, పీర్లు నిలపి పీర్ల పండగ కూడా ఘనంగా చేసేవాళ్ళు.

పక్కనే పెద్ద చింతమాను … తరాల నాటి మాను ..,

చెట్టు మొదట్లోనే కలిమి ఉండేది. ఆందుకే అది కలిమిమాను.

కలిమి ఊదుతూ ఉంటే, ఇనుము కాగుతూ ఉంటే, సమ్మిట వేసేవాడు వేస్తోంటే … కొమ్మల పైన రకరకాల పిట్టల అరుపులూ … సెట్టు నీడన నెమరువేస్తూ నిల్చునే బర్రెలూ …

ఏదీ కలిమి మాను?

ఎక్కడ … తరాలనాటి వృక్షం?

‘‘నాయినా వెంకటేశూ! ఇక్కడెక్కడో పాతకాలపు చింతచెట్టు ఉండాలే … నీకు గుర్తేనా?’’

‘‘ఎందుకు లేదు పెద్దాయనా! మొన్ననే … ఆర్నెల్లు గూడా కాలే … ఇటికె బట్టీలకు అమ్ముకున్నేరు …’’

గుండెలో కళుక్కుమంది గోవిందరావుకు.

ఎంత పెద్ద చెట్టు! …

ఊరంత చెట్టు …

ఊరిజనం కంటే ఎక్కువగా పిట్టలు కాపురముండే చెట్టు.

రకరకాల పిట్టలు … రకరకాల కూతలు … రకరకాల జీవితాలు .. చెట్టు ఒక పక్షుల గ్రామం … అవును … అది పిట్టల ఊరే …

దాన్ని నరకడమంటే – ఒక ఊరును కాల్చి బూడిద చేసి జనాల్ని రాళ్ళు రప్పల్లోకి తోలటమే గదా!

నిజంగా మనుషులకే అట్లా జరిగితే ఎంత గోల చేసేవాళ్ళు!

పేపర్లలో మొత్తుకొనే వాళ్ళు.

టీవీల్లో రొదపెట్టే వారు.

అసెంబ్లీని స్థంభింపచేసి నేరస్తులకు శిక్షపడే దాకా పోరాడే వారు.

పక్షుల గ్రామం ధ్వంసమవుతే ఏ గోలా లేదు.

అంతా నిశ్శబ్దం …

ఒక్క సానుభూతి లేదు … ఒక్క కన్నీటి చుక్కలేదు.

గోవిందరావు గుండె చెరువయ్యింది.

ఆ పక్షులన్నీ ఎట్లా వెళ్ళిపోయుంటాయో!

ముఖ్యంగా … కొన్ని వేల గబ్బిలాలు చెట్ల కొమ్మలకు వేలాడుతూ .. ఎక్కడో అరుదుగా కన్పించే దృశ్యం అది … ఆ కళ్ళులేని కబోదులు చెట్టు నేలకరిగిన పగటిపూట ఎక్కడికని వెళ్ళుంటాయి? వసతి సౌకర్యం లేక ఏ కంపల్లో రాలుంటాయో!

‘‘రాత్రంతా తిని పగలంతా కొమ్మలకు యేలాడే కబోదులు – వెంటబెడ్తా ఉంటాయి పెద్దాయనా! కొంగలు, కాకులు, పిట్టలు రాత్రంతా వెంట బెడ్తా ఉంటాయి. చెట్టు కింద మంచమేసుకొని పండుకోవాలన్నా ఇబ్బందే. ఇళ్ళకు ఇరుకై కలిమి మానుకొట్టి ఆ బిడువులో మిద్దె లేసుకొన్నేరు …’’ చెప్పాడు వెంకటేశు.

తనొక్కని గూడుకోసం … తరాల నాటి వాటి ఆవాసాన్ని కూల్చేశాడు మనిషి.

ఆయన భావాలతో తనకేమీ సంబంధం లేనట్టుగా ‘‘ఉసేనయ్యా! ఓ ఉసేన్‌ పీరయ్యా!’’ పిల్చాడు వెంకటేశు.

విద్యా కమిటీ ప్రెసిడెంటు హుస్సేన్‌ పీరాట. ఇరవై ఇళ్ళ సాయిబుల్ని తృప్తిపరిచేందుకు ఆ పదవిని ఇచ్చారుట.

హుస్సేన్‌ పీరా అనబడే వ్యక్తి ఇంట్లోంచి బైటకొచ్చాడు.

తెల్లటి పొడవాటి అంగీ, గళ్ళలుంగీ, తలపైన టోపీ, పిల్లి గడ్డంతో నలభై యేళ్ళ వ్యక్తి వాళ్ళ ముందు నిల్చున్నాడు.

బొమ్మలాట కళకారుల్ని పరిచయం చేశాడు వెంకటేశు.

ఆట ఆడించేందుకు సాయం చేయాల్సిందిగా కోరాడు.

ప్రెసిడెంటు చెప్పాడని కూడా తెలిపాడు.

హుస్సేన్‌ పీరా మొహంలో ఏదో అస్పష్టత.

‘‘ఈ బొమ్మలాటలూ … హరికతలూ … ఇయ్యన్నీ మాకెందుకు భాయా! ఆ గొడవేందో మీరు మీరు పడండి … పెద్ద రెడ్డిగారుండారు … వాల్లకాడికే పోండి …’ నిర్మొహమాటంగా చెప్పాడు.

గోవిందరావు ఏదేదో వివరించబోయాడు.

‘‘తమరి పూర్వీకులంతా మమ్మల్ను ఆదరించినోల్లే! … కొన్ని ఊర్లల్లో సాయిబులే స్వంతంగా ఆటాడించినారు …’’ అంటూ ఊర్ల పేర్లు కూడా చెప్పబోయాడు.

హుస్సేన్‌ పీరా వినిపించుకోలేదు.

అంతలో కర్ర ఊతేసుకంటూ ఇంట్లోంచి బైటకొచ్చిన మనిషిని చూడగానే గోవిందరావు కళ్ళు విప్పారాయి.

‘‘సలాం మాబుసాబ్‌ గారూ! సలాం …’’ అన్నాడు.

‘‘ఎవురు? గోయిందరావా?’’ అంటూ మరో రెండడుగులు ముందు కేశాడు అతను.

అప్పుడు గొంతు విప్పాడు గోవిందరావు.

‘‘శాబాసు కర్తాన శాబాసురీణా

బాబయ్య కరుణతో ప్రబలితీ ధరణి

నీ బాహుబలము నిర్మింప ధరలోన

బాబురే మదవి చేకొనుము నిర్జానా

పటు ఖుదా పాదాబ్జి బంభర నితాము

చటుల రవి ఘోరారి కౌషం సలాము

సామ్రాజ్య వైభవా సాహెబు సలాము

సలాం మాబూసాబ్‌! .. ఏం వీరుడివయ్యా! తురకల్లో ముత్యం లాంటోనివి. పిడికిలి బిగిస్తే వరసగా పది టెంకాయలు పగలగొట్టే వానివి. పెద్ద పెద్ద పాలెగాళ్ళు గూడా మోకాళ్ళ దాకా ఎత్తలేని రాతి గుండును సునాయాసంగా భుజంమీది కెత్తుకొని వెనక్కేసే వాడివి … సలాం … సలాం …’’

‘‘కూకో గోవిందరావూ!’’ చెప్పాడు ఆయన.

‘‘మా తరం పోయింది నాయినా! ఈ పిల్ల తరానికి కులాల మతాల పిచ్చి ఎక్కువైంది … మతమంటే ఏందో తెలుసుకోకుండానే మతం కోసం కొట్టుకొనే వాల్లే ఎక్కువయితండారు. బొమ్మలాటగ్గూడా మీది మాది అనే రంగుపూసిండు సూసినావా!’’ విషాదంగా నవ్వాడు. కొడుకు కేసి తిరిగి ‘‘ఒరే నయా ముసల్మాన్‌! ఈ చేతల్తో గుంతలు తీసి కూసాలు బాతి డేరా కట్టి అవసరమైతే లోపలికిపోయి పలకలు తొక్కి బొమ్మలాట ఆడిస్తాన్నెంరా భేటా! … జుట్టుపోలుగాడు, బంగారక్క బుడ్డ కేతిగాడు .. ఎంత నవ్వు! .. ఎంత కుశాల! ఆ ముసిలోడెవుడూ గోయిందరావూ? .. భీష్ముడు … ఎంత అనుభవం .. ఏమి నీతులూ … ఇంకొక పిల్లోడు … ఎవుడూ … అభిమన్యుడు … ఎంత పౌరుసం … సూసేవాల్లగ్గూడా రోసమొస్చాదే! … బారతమంతా వాల్లిద్దరే గద! … కండ్లు బెట్టి సూడాల … మనసుబెట్టి ఇనాల … మనం మనుసులం కావాల … హిందువులం గాదు … ముసల్మానులం గాదు … మనుసులం గావాల …’’ చెబుతున్నాడు ఆయన.

అప్పటికే గోవిందరావు కళ్ళు ధారాపాతంగా వర్షించటం మొదలెట్టాయి.

కొద్ది సేపయింతర్వాత మాబుసాబ్‌ చెప్పాడు ‘‘పెద్ద పెద్ద సర్పంచులతో కానిపని వీనితో ఏమయింది? వాల్లనే పట్టుకోపో నాయినా!’’ అని.

మెల్లిగా అక్కణ్ణించి కదిలాడు గోవిందరావు.

మాబుసాబ్‌ మాటలు అతన్నింకా వెంటాడుతున్నాయి.

ఎదలో కదిలిన స్పందనలు చాలాసేపటిదాకా అణగలేదు.

తమ టౌన్లో కూడా ఎక్కడో ఏదో బొమ్మ వేశారని వీధికెక్కిన ముస్లిం యువకులూ, మరెక్కడో ఏదో జరిగిందని కాషాయపు రంగులతో గుమిగూడే హిందూ యువకులూ …

ఎక్కడో … వీళ్ళవి కాని జీవితాల్లో, బతుకుల్లో, ఏదో జరిగిందని ఇక్కడి తమ జీవితాల్లోకి ఆహ్వానించి, అనువదించుకని, అరాచకాలుగా మార్చుకని … సమాజాన్నంతా ఇబ్బంది పెడుతూ …

మరో వీధికి వెళ్ళేదాకా అవే ఆలోచనలు గోవిందరావుకు.

కథంతా మళ్ళీ మొదటి కచ్చింది.

పెద్ద రెడ్డితోనే తిరిగి ప్రారంభించాల్సిన పరిస్థితి.

రాత్రి పొద్దుబోయే దాకైనా తిరిగి ఏదొక రీతిలో ఆట ఒప్పందం చేసికోవాలి.

రాఘవరెడ్డిని, సర్పంచి వగైరాల్ని ఒకచోట కలిపి అయినా … సర్పంచి నాయిన పెద్ద వీరారెడ్డి కాళ్ళు పట్టుకునైనా ఆట ఆడేందుకు తాంబూళాలు తీసికోవాలి.

ఆట ఆడాలి …

బొమ్మలు మద్రాసుపరం కాకుండాలంటే ఆటాడాలి.