తుది రోజు
ఆట ఒప్పందం తర్వాత బొమ్మలాట కళాకారుల యోగం మారిపోయింది.
ఉదయం లేచి చెంబుపట్టుకని వంకలోకి వెళ్ళేసరికి వాళ్ళను వెదక్కొంటూ పాములేటి వచ్చాడు.
పళ్ళు తోముకొనేందుకు వేపపుల్లలు విరిచి ఇచ్చాడు.
చిక్కటి పాలు, చక్కెర, కాఫీపొడి పంపాడు గుడి వద్దకు.
అంబలిపొద్దున ఉడుకుడుగ్గా బియ్యపు అడుగుల రాగిసంగటి, ఒట్టి చేపల పులుసు వడ్డించాడు. రాక్కొయ్య కాళ్ళ చేపల పులుసులో సంగటి పిడచ అద్దుకొని నోటబెట్టుకని సెగలు పొగలు ఊదుకొంటూ రెండు సార్లు నాలుక మీద అటు ఇటు తిప్పేసరికి నాలుక చుర్రున కాలి, సంగటి గబుక్కున బురదనేల మీద కాలుజారినట్టు అంగిట్లోకి జారి పేగుకాల్చుతూ కడుపులోకి దిగటం గమ్మత్తుగా అన్పించింది.
పళ్ళెంలోని సంకటి ముద్ద ఎప్పుడయి పోయిందో అతనికే అర్థంకాని పరిస్థితి.
సంకటి తిన్న తర్వాత సుబ్బారావు వగైరాలు బొమ్మల బుట్ట ముందు కూచున్నారు.
గ్రామస్థులు విరాటపర్వం కథ కావాలన్నారు.
పాండవుల కష్టాలూ, ద్రౌపది బాధలూ, కౌరవుల కుయుక్తులూ, కీచక వధ, మరో ముఖ్యమైన ఉత్తర గోగ్రహణ ఘట్టం …. ఉత్తరుని తోడుచుకొని బృహన్నల వేషంలోని అర్జునుడు కౌరవులందర్నీ జయించి ఆవుల మళ్ళించుకు రావటం …. గోవులూ .. గోపాలకులూ …. కరువుల ప్రస్తావనా …. పల్లెజనాల జీవితాలకు దగ్గరి పురాణ కథ ..
విరాటపర్వం కథ వీధుల్లో ప్రదర్శిస్తే వానలు కురుస్తాయి.
పెట్టెలోని బొమ్మల్లోంచి భారత కథకు సంబంధించిన వాటిని ఏరి పక్కన పెట్టారు.
గిన్నెనిండా ఆముదం తెచ్చి ఇచ్చాడు పాములేటి
సన్నపు నూలుగుడ్డ తునక నొకదాన్ని నూనెలో ముంచి, పిండి, బొమ్మల్ని తుడవటం మొదలెట్టారు సుబ్బారావు, వెంకట్రావులు. వెలుతురు పడ్డప్పుడు తెరమీద జిగేల్‌మని మెరిసేందుకు మెరుగు ఆముదం పట్టిస్తున్నారు.
గుడిపక్కన నించుని ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఉంది కమలాబాయి. ఉదయం నించి చాలా మంది ఆడవాళ్ళొచ్చి ఆమెను పరామర్శించి వెళుతున్నారు. రాత్రి జరిగిన సంఘటన పట్ల విచారం వెలిబుచ్చి, దొంగను నోటికొచ్చినట్టు తిట్టి తమ సానుభూతిని ప్రదర్శిస్తున్నారు.
గోడకానుకని గొంతుక్కూచుని బొమ్మలకేసే చూస్తున్నాడు గోవిందరావు.
ఎన్నెన్ని బొమ్మలు! ఎంత పురాతనత్వం! ఎన్ని తరాల సంపాదన ఇదంతా! ఒకనాడా? ఒకయేడా? తరాలు శ్రమిస్తేనే గాని సమకూరని సంపద.
కథలు విస్తృతమయ్యే కొద్దీ బొమ్మలు అవసరపడటం, దాతలు ముందుకొచ్చి బొమ్మలు గీయించటం ….
ఒక్కో బొమ్మకు ఒక్కో కథ.
ప్రతిబొమ్మ వెనకా ఓ దాత చరిత్ర ….
ఇంత అమూల్య సంపదను అమ్మి సొమ్ము చేసికోవాలని ప్రయత్నించే కొడుకు కిరీటి ….
ఒక్క బేరంతో వంశ పారంపర్య కళను బొక్కలో వేసి పూడ్చాలనే కోరిక….
ఆకలి ఎంత పనయినా చేయిస్తుంది. కాదనలేం .. కాని .. తరాల నించి తమ ఆకలి తీరుస్తోన్నది ఈ బొమ్మలే గదా!
వీటిని అమ్మటం తేలికే.
మళ్ళీ తయారుచేయాలంటే ఇప్పట్లో సాధ్యమయ్యే పనేనా?
ధర్మ ప్రభువులు .. ముంజేతికి ఎముకలేని దాతలు …. మాంచి కొమ్ములు తిరిగిన మేకపోతునిస్తారు – తమ పేర విగ్రహం రాయించమని. దాన్ని కోసుకొని మాంసాన్ని సుష్టుగా భోంచేసిన తర్వాత చర్మం విషయంలో చాలా జాగ్రత్తలు తీసికోవలసి ఉంటుంది. చర్మాన్ని నిద్రజేయకుండా వేడినీళ్ళల్లో వేయాలి. పటికి, పట్నం సబ్బు కలిపిన వేడి నీళ్ళల్లో …. చర్మం మీది వెంట్రుకలున్న పైపొర ఊడొచ్చేంత వేడి ఉండాలి తప్ప ఎక్కువ తక్కువ కాకూడదు. నీళ్ళ డ్రమ్ము కింద మంట సుతారంగా మండుతున్నప్పుడు నీళ్ళల్లోని చర్మాన్ని కర్రతో బాగా కలియదిప్పి పాకంగా అన్పించినప్పుడు చర్మాన్ని బైటపడేసి, నలుగురూ కమ్ముకొని బొచ్చు ఉన్న పైపొరను పీకేయాలి. తర్వాత దానిపైన గిన్నె కప్పి చాలాసేపు చన్నీళ్ళు పోస్తూవుండాలి. బాగా చల్లారింతర్వాత చర్మాన్ని బండమీద పరచి మాంసపు పొరలు ఊడేదాకా చురకత్తితో ఇరువైపులా గీకాలి. ఆ పైన రాత్రంతా చన్నీళ్ళలో నానబెట్టి ఉదయం మరోసారి శుభ్రంగా గీకి నాలుగు వైపులా చర్మాన్ని లాగి లావుపాటి రాళ్ళను బరువెత్తాలి. లేదా మేకులు కట్టి లాగాలి. ఎండ కాస్తే రెండు గంటల్లోనే ఆరిపోయి కాగితం లాగా పారదర్శకంగా కన్పిస్తూ చర్మం ఫెళ ఫెళలాడుతుంది.
ఇక బొమ్మ గీసేందుకు తోలు కాన్వాసు సిద్ధమైనట్టే.
బొమ్మ గీయడం అందరితో సాధ్యమయ్యే విషయం కాదు.
లలిత కళల్లోని చిత్రలేఖనమూ, శిల్పమూ రెండూ కలిస్తేనే తోలుబొమ్మల తయారీ కళ అవుతుంది. చిత్రకారుని ఊహా ప్రపంచమూ, శిల్పి నైపుణ్యమూ కలబోస్తేనే తోలుబొమ్మ తయారవుతుంది.
ముందుగా చర్మపు కాగితం మీద ‘గోరుగల్లు’తో స్కెచ్ గీయాలి. దాని మీద నల్లటి రంగుతో గీతలు గీయాలి. గోరుగల్లు అంటే – చర్మంమీద రాసే ఇనుప ములికి. స్కెచ్ సంతృప్తిగా వచ్చిందని నమ్మకం కుదిరిన తర్వాత ‘మనాలి’ అనే ఇనుప ఉలితో గీతలవెంట బొరకలు వేయాలి. ‘షోటల్’ అనే మరో ఇనుప సాధనంతో గొలుసు మాదిరి ‘చీరు’కట్టాలి. తర్వాత సాంప్రదాయిక రంగులతో విగ్రహాన్ని చిత్రించాలి.
విగ్రహానికి తల, కాళ్ళు, చేతులు విడివిడిగా తయారుచేసి కీళ్ళతో అతికించాలి. అప్పుడు బొమ్మ పూర్తయినట్టు లెక్క.
ఆ కాలంలో గుంపుకో మనిషి విగ్రహాలు చెక్కటంలో ప్రావీణ్యత కలిగి ఉండేవాడు.
ఇప్పుడు బొమ్మలు రాసేవాళ్ళు లేరు.
విగ్రహాలు చెక్కేవాళ్ళు వెదకినా కన్పించరు.
గోవిందరావు కళ్ళముందు తోలు విగ్రహాలకు సంబంధించిన పాత రోజులు గిరగిర తిరుగుతున్నాయి.
ఎక్కడి మరాఠా దేశము!
ఎక్కడి ఆంధ్రదేశము!
కడుపు చేతబట్టుకొని, కళను చేతిలో పెట్టుకొని ఎంత నేలను దాటుకొచ్చారు! నిన్న మొన్నటిదాకా తమ పేర్ల వెనక ‘జీ’ అని తగిలించుకనే వారు. సుబ్బోజీ, రామోజీ, వెంకోజీ అంటూ ఇంట్లో చాలా వరకు మరాఠా భాషనే ఉపయోగించే వారు.
మరాఠా దేశంలో నిరంకుశ పాలకుడు వడియరాజు. ఆయన పాలనలో ప్రజలు అష్టకష్టాల పాలయ్యారుట. అతన్ని చంపేందుకు శత్రువులు పెద్ద వ్యూహం పన్నారు. రాజమందిరం వద్ద తోలుబొమ్మలాట ప్రదర్శన ఏర్పాటుచేయించారు. రాత్రిపూట బొమ్మలాట ఆసక్తికరంగా సాగుతోంది. జనమంతా ఏకాగ్రతతో తిలకిస్తున్నారు. వేదిక ముందు ప్రత్యేకాసనంలో వడియరాజు కూచుని ఆటను వీక్షిస్తున్నాడు. ఆంజనేయ స్వాములవారు సీతమ్మను వెదకేందుకు లంకకు పోయాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. రాకాసి మూకలను నేలకేసికొట్టి చంపాడు. చివరకు ఇంద్రజిత్తు మాయోపాయం వల్ల బంధించబడ్డాడు. ఆయన తోకకు నిప్పంటించారు. అప్పుడు హనుమంతుల వారు తోక నిప్పుతో లంకను కాల్చటం మొదలెట్టాడు. లక్కతో నిర్మించబడిన భవనాలన్నీ భస్మీపటలమవుతున్నాయి. ప్రేక్షక జనమంతా ఆనందంతో ఈలలేస్తున్నారు. అదే సమయంలో వడియరాజు కాళ్ళ కింద పరచిన లక్క తివాచీకి నిప్పు అంటించబడింది. వడియరాజు మంటల్లో కాలిపోయాడు. నిరంకుశరాజు చావులో బొమ్మలాట గాళ్ళు కూడా పాలుపంచుకొన్నారు. తర్వాత ఏమయిందో తెలీదు. రాజద్రోహానికి పాల్పడినందుకు వీళ్ళు పశ్చాత్తాప పడ్డారో లేక కొత్తరాజు వీళ్ళను విశ్వసించలేకపోయాడో తెలీదుగాని మరాఠా దేశాన్నించి తెలుగుగడ్డకు వలస వచ్చారు. ఎట్లో ఎన్నెన్నో నదులు, కొండలు, మైదానాలు దాటుకొంటూ ఈ గడ్డ మీదకు వచ్చి స్థిరపడ్డారు.
‘‘గోవిందరావూ!’’ పిలుపు విన్పించి ఆలోచనల్లోంచి బైటపడి ఎదురుగా చూశాడు.
సుబ్బయ్య శ్రేష్టి.
‘‘సరిపోయ్యిందా? .. ఆట ఖాయమే గద!’’ అడిగాడు.
‘‘తమరి దయవల్ల…’’ చెప్పాడు గోవిందరావు. ‘‘ఒక్క ఆట ఒప్పందానికి ఎంత కష్టమైపాయె స్వాములూ! ఈ కళను నమ్ముకొని ఆర్నెల్లపాటు – పుష్యమాసం మొదలుకని జ్యేష్ఠమాసం దాకా… ఆరు నెలలు ఇంటి మొగం సూడకుండా ఊరూరా తిరుగుతా ప్రదర్శన ఇస్తాంటిమి. ఈ ఊర్లో ఆటాడతామంటే అవతలి ఊరోల్లొచ్చి మా ఊరికి రమ్మంటూ ఆట ఒప్పందానికి పిల్చేవాల్లు. అవి బంగారు కాలాల్లే శ్రేష్టిగారూ! బొమ్మలకు తీరికుండేదే గాదు. మెరుగు ఆముదం ఆరేదిగాదు…’’
‘‘నిజమే నిజమే …’’ తలూపాడు సుబ్బయ్య శ్రేష్టి.
‘‘ఈ టీవీలొచ్చి మా ఆయువు పట్టున కొట్టె తండ్రీ! కోలుకోలేనంత దెబ్బకొట్టె. ఏడాదికి ఒక్కరాత్రి మా కోసం టీవీలు సూడ్డం మానలేరా మహాప్రభో! మా కోసం ఒక్క పాతిక రూపాయలు ఖర్చుబెట్టలేరా? ఒక్క సిగరెట్టు పెట్టె ఖర్చంత .. ఒక్క కూల్‌డ్రింకు ఖర్చంత … ఈ రవ్వంత సాయంజేస్తే బొమ్మలాట బతుకుతుంది గద మహానుభావా!’’ వాపోయాడు.
‘‘తీరువా వేసి ఇంటింటి నుంచీ డబ్బు రాబట్టాల్సిన పనికూడా లేదు గోవిందరావూ!’’ చెప్పాడు సుబ్బయ్య. ‘‘యేటా డెబ్బై వేల రూపాయల రుసుం డబ్బు దేవాలయానికి వస్తది … దాన్లోంచి కొంతతీసి ఖర్చు బెడ్తే సరి …’’
‘‘డెబ్బై వేలా! నూటికి రూపాయా? అర్ధ రూపాయా?’’
‘‘రూపాయి…’’
‘‘అంత ఫలితమొస్తదా స్వామీ?’’
‘‘పాడినోనికి బాగానే మిగుల్తాది.’’
‘‘కరువు గాలమేమోనే!’’
‘‘ఏ కరువైనా … పండే పంటంతా అమ్మేదే గదా! ఎవురూ గింజలు పండించడం లేదుగదా! పత్తో .. పొద్దు దిరుగుడో … పొలాలు అమ్ముకోవడమో, పశువులనూ గొర్రె మేకల్ను అమ్మకోవడమో … సారాయి పాటమీదా .. వస్తువుల అమ్మకాల మీదా … అంగళ్ళ మీదా … అంతా లక్షన్నర దాకా వస్తది మా దేవునికి …’’
‘‘ఆ లెక్కంతా ఏం జేస్తారు స్వామీ?’’
‘‘ఏముంది … పెద్ద పెద్దోలు తలకింత తీసికొని మళ్ళీ నవమి వచ్చే తారికి వడ్డీ వేసి కడ్తారు .. లెక్క గట్టకున్నే ఎంతయింది తేల్చి బాండు తిరగరాస్తారు … కడకు ఏమయితదో ఏమో?’’ పైకెగజూశాడు శ్రేష్టి.
ఆయన వెళ్ళింతర్వాత సారాయి పాట, వస్తు విక్రయ రుసుము గురించి కొంతసేపు ఆలోచించిన గోవిందరావుకు మనస్సులో ఏదో తోచి ఉలిక్కిపడ్డాడు.
డెబ్బై వేల రుసుం వచ్చేంత పంట పండించి అమ్ముతున్నారు.
డెబ్బై వేల సుంకం కట్టేంత కడుపుకు తాగుతున్నారు.
సంపాదించిన దానికీ, తాగిన దానికీ సరిపోతోంది.
రైతుల్లో తాగుడు శాతం తక్కువున్నా కూలీల్లో ఎక్కువుంది గాబట్టి బ్యాలెన్స్ సరిపెట్టుకొంటోంది.
ఇరవై యేళ్ళల్లో ఎంత తేడా!
అప్పుడు తాగేవాళ్ళను వేళ్ళ మీద లెక్కేసుకోవచ్చు.
ఇప్పుడు తాగని వాళ్ళను
సారాయి వాడకాన్ని పెంచేందుకు చేసినంత కృషి ప్రభుత్వం మరే రంగంలోనూ చేయలేదనేందుకు ఈ పల్లే సాక్షి.
దాదాపు పల్లెలన్నీ ఇలాగే ఉంటాయేమో!
రెండు చేతుల్లో తల ఇరికించుకని చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు గోవిందరావు.
మారుమూల గ్రామమనీ, నాగరికత అంటని ఊరనీ, పాత పద్ధతులూ, అలవాట్లూ, భావాలూ ఇంకా ఉంటాయనీ – ఈ ఊరిని ఎన్నుకొన్నాడు తాను.
ఊరి స్థితి ఇలాగుంది … మరి … తమ ఆట పరిస్థితి ఎలా ఉంటుందో!
మెల్లిగా దేవాలయంలోంచి బైటకొచ్చాడు గోవిందరావు.
అప్పటికే అంబలి పొద్దు దాటి ఉంది.
సుబ్బారావుతో కలిసి ఊర్లో వీధులన్నీ తిరగటం మొదలెట్టాడు.
పాములేటికి జాగ్రత్తలు చెప్పాడు.
కన్పించిన వారినల్లా బొమ్మలాట చూడమని అభ్యర్థించాడు.
రాత్రికి డిష్ కనెక్షన్ ఆపేసేట్లుగా పెద్ద మనుషుల చేత హామీ పొందాడు.
వీధుల్నిండా చాటుపద్యాల్ని వెదజల్లాడు తన వాళ్ళతో కలిసి.
‘‘వంగతోట నుండు వరిమళ్ళ నుండును
జొన్న చేలనుండు చోద్యమగును
తలుపు మూలనుండు తలమీద నుండును
దీని నామమేమి తిరుమలేశ’’
అంటూ పద్య రూపంలోని సమస్యల్ని పొడిచాడు. జనాలకు తమ మీద ఆసక్తి కలిగేలా వాటిని విప్పి చెప్పాడు.
ఎవరికి తోచినట్టు వాళ్ళు వీధులెక్కారు కళాకారులంతా.
‘‘ఆటాడిస్తామనీ, సంభావనకు కొదువజేయమనీ మాటిచ్చారు. మాట నిలుపుకొంటే ధర్మ ప్రభువులే … లేదంటే … ఇదో ఈ పద్యం వినండి … మహానుభావులు చెప్పిన పద్యం ..
ఆడిన మాటను తప్పిన
గాడిద కొడుకంచు దిట్టగా వినియయ్యో!
వీడా నా కొడుకంచును
గాడిద యేడ్చెంగదన్న ఘనసంపన్నా!
‘ఆడిన మాట తప్పిన వాణ్ణి చూసి గాడిద కూడా అసహ్యించుకుంటుందట…’ అంటూ పాములేటి ముందు పద్యం చెప్పాడు సుబ్బారావు.
‘‘రాముడెవ్వరి గూడి రావణు మర్ధించె
పరవాసుదేవుని పట్నమేది?’’
అంటూ వెంకట్రావు ఓ వైపూ –
‘‘ఏనుగు సింహంబు నెలనాగయును గూడి
ఒక మాట లోపల నుండవలయు’’
అంటూ రామారావు మరోవైపూ – గ్రామాన్ని చుట్టుముట్టారు.
రాత్రి ప్రదర్శించబోయే బొమ్మలాట వాతావరణాన్ని ఇప్పుడే వీధుల్నిండా నింపుతున్నారు. జనాల మనసుల్లోకి ఏదో ఉత్సుకతను ఎక్కించేందుకు తంటాలు పడుతున్నారు.
వీధులన్నీ తిరిగి తిరిగి … కన్పించిన వాడికల్లా హుషారు కలిగించి .. ఆట చూసేందుకు సమాయత్త పరిచి దేవాలయం వద్దకొస్తోంటే … ఆ వీధిలో ఓ ఇంటిముందు … పొద్దు నడిమింటికి వచ్చే ఆ సమయాన …
నోట్లోని వేపపుల్లను విసరేసి నోరు కడుక్కొంటూ ఉన్న ఓ రైతు ‘‘థూ దీనెక్క … ఈ పైరు పెట్టే దానికన్నా అదో … అట్లా మిరబ్బజ్జీలు కాల్చుకొనేది మేలు … అదో అట్లా గాజులమ్ముకొనేది మేలు … ఈ పొలం దున్నేకన్నా బేల్దారి పనికి పొయ్యేది మేలు … సేద్దెం సేసేకన్నా అడక్క తినేది మేలు … వానెక్క .. వానేలి … గంపెడు టమోటాలకు మూడ్రూపాయలా! గంపకు ఐదు రూపాయలొంతున బస్సు లగేజి ఇచ్చిన్నే! నా కొడకలకు రైతంటే ఎంటికెతో సమానం … థూ దీనెమ్మ పొలం … దీనిని నమ్ముకొనేకన్నా గుగ్గుల్లముకొని బతికేది మేలు …’’ కేకరించి ఊస్తూ ఇంట్లో కెళ్ళాడు అతను. ఆక్రోశాన్నంతా కక్కాడు.
వింటోన్న గోవిందరావుకు మనస్సు వికలమైంది.
ఎక్కడా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా పస్తులు పచ్చినట్టున్నాడు పాపం ఆ రైతు. ఇంటికొచ్చి పళ్ళు తోముతున్నాడు.
ఆలోచిస్తూ ఉంటే అతనికీ తనకూ పెద్ద తేడా లేదనిపించింది.
తన వృత్తిలో కూడా అతని బాధలే కన్పిస్తున్నాయి.
ఇవన్నీ ఊహించాడు కాబోలు తన తమ్ముడు – ఇరవై యేళ్ళ క్రితమే తండ్రితో విభేదించి బొమ్మలకు విలువకట్టి వాడి వాటా సొమ్ము పట్టుకు పోయి, అప్పుడది తక్కువ మొత్తమే అయినా, దానితో చిన్న అంగడి పెట్టుకొన్నాడు. ఇప్పుడు బాగా స్థితిమంతుడయ్యాడు. పిల్లల్ని చదివించుకొన్నాడు. వాళ్ళు కూడా ప్రభుత్వోద్యోగులై ప్రయోజకులయ్యారు. బొమ్మల్ని నమ్ముకన్న తను వాడి కళ్ళ ముందరే తిండికి గతిలేని పరిస్థితిలో ఉన్నాడు.
జ్ఞాపకాలు మనస్సును కలచివేస్తున్నాయి.
అవన్నీ తలచుకనేందుకు ఇప్పుడు సమయం కాదని తెలుసు.
‘దారిద్య్రమున నుండి తన పూర్వ సంపద లూరక తలచువాడుత్త వెధవ’ అనే విషయం తెలుసు.
అయినా మనస్సు అదుపులోకి రాకుంది.
మధ్యాహ్న భోజనం తదుపరి గాని మామూలు మనిషి కాలేకపోయాడు ఆయన.