హంస ధ్వని

‘‘బాతులు కావండి! బాతులు కావయ్యి. హంసలేని!’’ అన్నాడు. పొడూగ్గా కొనదేలిన ముక్కుకి అంటుకున్న కేపుచినో నురగని ఒక వేలితో మీటి నాలిక మీద వేసుకున్నాడు. ‘ఈ విస్సు….. హైకోర్ట్‌లో లాయరా?’ అన్నట్టు నర్సింగరావుకేసి రహస్యంగా నవ్వింది రాజాలి. కుర్‌ కురే భేండీ మీద ఉడతల్లాగ పడి తింటున్నారు ఛోటు, బబ్లు. హంసలు ఆ పెద్ద అందమైన గోలెం లాటి వెండి కొలన్లో బందీలమా అన్నట్టు ఉకౄ ఉకౄ అని ఉక్రోషంగా అరుస్తున్నాయి. నవ్వు ఆగక తింటున్నవి అడ్డుకుని పొలమారింది. ‘‘ఎందుకురా నవ్వుతున్నావు, ఎందుకు నవ్వుతున్నావూ?’’ అని కుక్కుకున్న బుగ్గల్లోంచే గద్దిస్తున్నాది రాజాలి. విస్సు కూడా అడుగుతున్నాడు లాయర్‌ గొంతుక వేసుకుని. ‘‘ఏంటండీ నర్సింగరాగారు? ఏంటి నేనేంటన్నా రాంగ్‌గా అన్నానా?’’ అని రెట్టిస్తున్నాడు.‘‘ఇదై కోర్ట్‌లో అండరోత్‌ అయితే గనక తెలిసుండీ దాస్తుంటే నెగోషియబుల్‌ ఇనుష్ట్రుమెంట్స్‌ ఏక్ట్‌ కింద మిమ్మల్ని మూయించేస్తారు!’’ అని బెల్లిస్తున్నాడు. ‘‘అది కాదు విస్సు… అవి! వాటి ఏడుపు హంసధ్వని లాగ లేదు! బాతుధ్వని… బాతు…’’ అంటే సాయి చేతిలో నాన్‌ కూర టేబిల్‌ మీదికి చిందుకుంటూ ‘‘అహ్హహ్హహ్హహా!’’ అని నవ్వుతోంది. బబ్లూ గాడు కుర్‌కురా బొక్కడం ఆపుకుని ‘‘వాట్సో ఫన్నీ డేడ్‌?’’ అని కొట్టడానికి వస్తున్నాడు వాళ్ళ తమ్ముడ్ని వేసుకుని. ‘జోక్‌’ ఏంటో వాళ్ళకి చెప్పాలి. కాని అంతలా నవ్వు ఎందుకొస్తుందో నర్సింగరావుకే తెలీదు. ఎప్పుడూ. బాతుధ్వని ఒక రాగం కాదు, అది ఏమీ కాదు. హంసధ్వని ఒక రాగం. అది తనకి వొచ్చు. పద్మగారు నేర్పించింది. ‘స్వస్తయే వాయుమ్‌ ఉపభ్రవాహమై సో…మమ్‌’ అని కంఠనాళాలు సన్నటి తీగెల్లాగ మెలిపేట్టుకుని బాత్రూముల్లోనూ, షేర్‌ ఆటోలకోసం వేచి చూచే దగ్గర, ఉర్దూ యూనివర్సిటీ వాచ్‌మన్‌ ఇంకా ముసుగుతన్ని పడుకుని ఉంటే జాగింగ్‌ వేషం వేసుకుని ఆ పెద్ద పెద్ద రాతి బండలు నిద్రమత్తులోనే ‘రే…’ అని ప్రతిధ్వనించేలాగ. ఛోటు గాడి నున్నటి మెత్తని బొజ్జకి సబ్బు తోముతూ, పళ్ళు కొరుక్కుంటూ అప్పుడూ. ‘స్వస్తి భువనస్య య:పతీ …ఈ…’ అని గింజుకోగా గింజుకోగా చివరికి. హంసానంది గుండెల్ని కలచివేసే రాగం. పశ్చాత్తప్త హృదయం ఎవరిదో ఎప్పుడో నిర్మించిన నీలలోహిత కాంతి నీడల రాగం. హంసధ్వనిలా తెలుపును ప్రదర్శించే సగం నిజం రాగం కాదు, విజయశ్రీ లా పట్టుదలల బింకపు రాగం కాదు, మానవతి లాగ అది మర్యాద రాగం కాదు.

హంసానంది తనకి రాదు? అబ్బలేదు! రెండేళ్ళబట్టి గింజుకుంటున్నా ‘స్వస్తి పధ్యే…ఱ్‌..ఏవతీ…’అని హృదయాంతరాళాల్లోంచి, నాభి లోతుల్లోంచి తవ్వి తీసే ప్రయత్నాన్ని పద్మగారు ఆత్రంగా ఏమాత్రం అసహనం చూపించకుండా రెండేళ్ళ బట్టి ఓపిగ్గా ఎదురు చూస్తున్నా గురి తప్పిన బాణం లాగ అది. కిటికీ ఊచల్లోంచి పైకి గోదావరిని చూపించి ‘‘అది చూసేరా? పారుతుంది. అసలు వెళ్ళి ముట్టుకుని చూస్తే కనక చాలా వడిగా ఉంటుంది! కాని మనకి ఇక్కడ్నించి చూడండి! ఏం తెలీకుండా ఏదో అస్సలు కదలికే లేకుండా ఉంటుందంతేగా? హంసానంది అంతే, కనిపించాలని ఏం కాదూ! కాని అంతర్వాహిని లాగ పేథోస్‌ అంటామా? అది రావాలి.’’ అని చెప్పింది. తనకంటే చాల చిన్న అమ్మాయి. దు:ఖం ఏ రాగమో చెపుతుంది! ఒక సాదా సీదా జంపఖానా మీద తలవాల్చుకుని కూర్చుని. ‘‘ఏదీ? గమదనిస`నిరీ…సా అనండీ?’’ అని ఓపిగ్గా హెచ్చరిస్తుంది. ‘‘ప అంటున్నారు మీరు! ని బదులు ప అంటున్నారు! మళ్ళీ అదుగో టందాక విడిగా బాగానే అన్నారు, ఇప్పుడు మళ్ళీ ప అనేస్తున్నారు!’’అని. వేల వేల సంవత్సరాల నుండి పెచ్చులు కట్టి పూడుకుపోయిన దు:ఖం కరిగి అన్ని ప్రదర్శనలనూ దాటుకుని కనీసం కొంచెం దానితో పైకి రావాలి. కాని తనకి రాలేదు. ఇప్పుడు విస్సు, సాయి అవి హంసలే అని నమ్మబలికితే, ఈ ద్రాక్ష పందిళ్ళ చలవల్లోన కొలను చుట్టూ అవి వయ్యారంగా తక్కుకుంటూ తారుకుంటూ గొంతు విప్పితే మాత్రం బాతుధ్వని. ఇది అని చెప్తే వాళ్ళు బలవంతంగా నవ్వి మళ్ళీ నాన్‌లలోన, బగారా బైగన్లోన, చికెన్‌ విందాలూ లోన నిమగ్నమైపోయేరు. ఛోటు, బబ్లు ‘దట్స్‌ నాట్‌ ఫన్నీ డేడ్‌!’ అని గుద్దులు గుద్ది సతాయిస్తున్నారు. నర్శింగరావు ఆ గుద్దులు తింటూ వెయిటర్‌ వినయంగా వినోదంగా తెచ్చిన క్రెడిట్‌కార్డ్‌ బిల్లు మీద సంతకం వంకర్లు పోతుంటే కుయ్యో మొర్రో మని ఆ తన్నులు తింటూనే మళ్ళీ నవ్వుతున్నాడు. ఆపుకోలేడు నవ్వులు. ఎప్పుడూ. ఎందుకో తెలీదు. Martha Ray అడిగింది ఒకరోజు. “Hey Nary? Why are you always chuckling like that? Your smiling face is a pleasure to look at sweet heart, but…whats so freakin` funny?” అని తన మచ్చల మచ్చల చేతులు, ఎర్రనోరు వణుకుతుంటే అడిగింది నవ్వుతూనే. “YOU Darlin`! You married that mailman and broke my heart! I’m always thinkin` of you and cusssing inside, but when YOU are lookin`, why… I’m smirkin and chucklin and gigglin and smiling and laa…ughgin” అంటే ఫైళ్ళు మీదికి విసురుతున్నట్టు నటిస్తూ తరుముతూ వచ్చి పడీ పడీ నవ్వుతుంది. తను చెప్పే కారణాలు ఎవరూ నమ్మరు. కారణాలు ఏమీ తెలీదు.

హంసానంది నవ్వులాట కాదు. హంసానంది నదులకు ఎవరూ ‘గోదావరి’ అని పేరైనా పెట్టక మునుపంత పురాతనమైన దు:ఖం. స్వఛ్ఛమైన పశ్చాత్తాపపు నొప్పి. నొప్పి బహుశ: అందరికీ ఉంటుందేమో. పశ్చాత్తాపం తనకి ఉంది. కాని గడ్డకట్టుకుని. రాజాలి సమక్షంలో కాదు, పద్మ గారు చాపమీద మఠం వేసుకుని కూర్చుని శ్రుతి పెట్టె సవరించుకొంటూ ‘ఏదీ అది మళ్ళీ ఒక్కసారి ఆదిత్యాసో…?’అని హెచ్చరించినా రాదు. దొంతరలు దొంతరల కింద సంవత్సరాల కింద అది ఎక్కడో ఘనీభవించి ఉంది. గొంతు దాకా వచ్చినట్టే వచ్చి జారిపోతుంది. హంసానందిని అందుకోగలిగినంత పశ్చాత్తాపం తనలో? నాగరికత ఏదో అడ్డు. గోదావరిని చూడటానికి అని ‘ప్లెజర్‌ ట్రిప్‌’ కాదు కొత్తపేట. హంస కోసం.

‘‘రండిలాగొచ్చియ్యండి!’’ అని కొబ్బరి మడిగట్ల మీద నుండి తన కోనసీమ రాజ్యాల్లోంచి ఉత్సాహంగా పరిగెడుతున్నాడు అబ్బులుగారు. గోదావరికి సమాంతరంగా ఎక్కడికో దూరానికి పోతుంది ఆయన వీధి. వీధి పొడవునా ఇళ్ళ వరసల్లోన అవన్నీ వాళ్ళ అన్నలు బావలు చింతాతియ్యలు తోడల్లుళ్ళు షడ్డకులు కొబ్బరి మట్టల పెరళ్ళు పందిళ్ళ లోగిళ్ళు. అక్కడ మట్టితో ఎర్రగా ఎండి కాలవలలో తడిసి లాకుల్లో పెనవేసుకున్న వాళ్ళ ఇంటి చరిత్రని ఆ వైనతేయ చరిత్రతో పాయలు పాయలుగా అల్లి పెద్ద గొంతుకతో చెపుతున్నాడు. ‘‘అది కాదు బాబాయీ? ఉప్పుడూ….వైనతేయుడు గోదాట్లో ఒక పాయని లాక్కొస్తుంటె మజ్జిలోన గరుక్మంతుడొచ్చీ సేడు కదా? ఆడొక పాయ ఇలాగ ముక్కుతోటి సైడుకు తీసేసేడూ…?’’అని విస్సు తన చిన్ననాటి కథలు ఎగసన్దోస్తుంటే. వేడి పాలకోవా ముద్దలు కాలవల్లో నీళ్ళకి తేలుతూ చెట్ల నీడలు గాజు బ్రాందీ బుడ్డీల మూటల సందులు కాగు బిందెలు వాడాంబరాలు కాకుల పెరళ్ళు ఇవన్నీ చూపిస్తూ ఒక అడుగు వెడల్పు మడిగట్ల మీద నాట్యం లాంటి పరుగులతో అందర్నీ వరసగా నడిపిస్తూ చేతులు విసురుకుంటూ అబ్బులుగారు. ‘‘చూడండది ఈతలొడ్నుండి ఆతలొడ్డు కనిపించినంత దాకాని అది మావోల్దే ఎనిమిది మంది అన్న దమ్ములు! వొయంజీసీవోడు కొనుకున్నాడు..!’’ అని. అక్కడ ఎటు చూసినా కొబ్బరి చెట్లు తెలిసినతనంతో సున్నితంగా తలలూచుతూ చేతులు తిప్పుకుంటూ గుసగుసలాడుకునే దృశ్యం. పెరళ్ళు బోరు కాలవల్లోంచి కూరాకుల తోటలై తోటలు పొలాలయ్యి పొలాలు మెరక దిబ్బలయి దిబ్బలు గోదావరిలో కలిసే లేతాకుపచ్చ మడిరంగు చిత్రాలు. కొత్తపేట అంటే New York అనంటే బబ్లూ గాడు పెద్ద కళ్ళు పెద్ద చెవులు ఇంకా పెద్ద పెద్దవి చేసుకుని కొబ్బరి మీగడ కుక్కుకుంటూ ఎడ్లబండతన్ని ఒక్కసారి ఎద్దు తోక ముట్టుకోనిమ్మని ప్రాధేయపడుతున్నాడు. “One last time? Pretty plee….ease?” అని.

నానమ్మ గారు మళ్ళీ వడ్డించింది. అడక్కుండా, లొడక్కుండా. పసుపు రాసుకున్న మొహం నిండా అలాంటి రైతువారి తాతమ్మలకే సాధ్యమైన ఆదరాల నవ్వులు వడ్డస్తోింది, ఎనభయిల్లో కనీసం తొణక్కుండా బెణక్కుండా. కమ్మలింటి వాకిట్లోన ఏనాటి క్యర్రదో పడక్కుర్చీలోన తాతగారు చుట్ట కొస కొరికి పక్కకి ఊస్తూ ‘‘మొమోటం పడకండి. మళ్ళీ చాన లెక్క ఎళ్ళాలి!’’ అని తెల్లటి వెండి జుత్తు గోదావరి వైపు ఎగురుతుంటే చుట్టని ఖద్దరు జుబ్బా జేబులో వడీసి జుత్తు సద్దుకుంటూ. తోట ఆ ఇల్లు గోదావరి ఏటి మన్ను కొబ్బరి చెట్లు, కూరాకుల మళ్ళు మట్టలు ఆవుల కొట్టాలు ఇవి వేరే వేరేగా లేవు అవన్నీ ` వాళ్ళందరూ ` ఒకటే. ఆ జీవన క్షేత్రం అంతా వాళ్ళిద్దరూ అరవయ్యేళ్ళకి పైగా చేస్తున్న పొలాలు! ఆ విశాలమైన నడవల్లోన ఎత్తు పెంకుటి కప్పుల కింద పురాణీ దూలాల చలవ ధాన్యాల రాతి గచ్చులమీద పుట్టేడట తాతగారు. నానమ్మగారు ఆయనకి వరసకి అక్కయ్యగారమ్మాయి. ‘‘తాతియ్యమ్మా అదేంటి తాతియ్యమ్మా? 1936 లోనా మీకు పెల్లయ్యిందీ…?’’ అని సాయి అడుగుతుంటే, పట్టుకోలేని ఆశ్చర్యంతో నర్శింగరావు రాజాలి వింటుంటే ఆవిడ పిల్లలకి దూడల గంగడోలు ఎలా నిమరాలో చూపిస్తూనే వెండి కడియాలు టంగు టంగుమని తాటించుకుంటూ అవి చెపుతోంది. పసుపు నవ్వుల కళ్ళు ముక్కు నత్తుల మీద పడి తళుక్కుమని మెరుస్తూ అన్ని శతాబ్దాల వాళ్ళ చరిత్రని ఒక రాగి చెంబులోను, కమ్మల గదుల చుట్టూఅటకల మీద వరసగా పేర్చిన సారె సామాన్లలోను, ఎత్తు దూలాలకి కట్టిన కవ్వాలు, చిలవల పలవల ద్వారగుమ్మాలు, పేడమన్ను రాసిచలవ చేసిన గాదెలలోను ఒకొక్కటీ గర్వంగా చూపించి చెపుతోంది. సాయి, రాజాలి అసూయగా వింటున్నారు అహమ్మదాబాద్‌ వస్త్రపూర్‌ కల్చర్‌ కళ్ళూ చేవులు రిక్కించుకుని. ‘అబ్బ ఇద్చూడవే? మీ డ్రాయింగ్‌రూం ఇటు సైడ్‌ కార్నర్లో ఒక ఎర్తెన్‌ పాట్‌ కొని దానిమీద పెడితే…? అద్దిరిపోతుంది!’అని.

ఆవిడ చూడనప్పుడు సాయి రాజాలి చెవిలోన అంటోంది ఏవో. వాళ్ళిద్దరూ ఎప్పుడూ చెప్పుకునే ఆర్కిటెక్చర్‌ ఆదర్శాల జనప నార బెంగ కబుర్లు. ‘‘అబ్బ మా తాతియ్యమ్మకి ఎయ్‌టీ వన్‌ అంటే అసలు నమ్ముతారా?’’ అని ఆ పొలం పాక నది ఇల్లునీ, వాళ్ళు పోగొట్టుకున్న ఆస్తి అని కళ్ళతోటే తాగుతున్నారు సాయి విస్సు అదంతా అపనమ్మకంగా బెంగగా చూస్తూ. పేక్‌ చేయించి రోడ్‌ నెంబర్‌ టూ డ్రాయింగ్‌ రూముల్లో పెట్టుకున్నవి పెట్టుకోగా ఇంకా ఇక్కడే తమది ఏదో ఉండిపోయిందన్న వెలితి. ఆకుల్లో చప్పుడు చేసుకుంటూ రాజాలి, ఆవుదూడని కౌగిలించుకుని వదల్లేక వదల్లేకుండా ఛోటు బబ్లు ఒకొక్కరూ బయటికొస్తుంటే ఒక ముగ్గురు ఆడవాళ్ళు ఎదురొచ్చేరు. ఒక పాపాయిని పొత్తిళ్ళలో పట్టుకుని తెచ్చేరు. తాతగారిని నానమ్మ గారిని పేరు పెట్టమని. తాతగారు చిటికెలు వేస్తూ ‘వ్వ..వ…వ్వ..’మని చుట్ట పొగ లోనికి పీలుస్తూ నవ్వుతున్నారు. నానమ్మగారు పసుపు ముఖాన్ని కుంకుమ నవ్వులో ఆ పాపాయి నవ్వు ప్రతిబింబాన్ని చూస్తూ ‘‘చ్చి..చీ…! చీ…చ్చి!ఓంటిరా?! ఓటి? నీను తెల్సేటి…….? ఉఖాలు కొడతంది చూడూ?! అంగార బొట్టు పెట్టుకోని…సుక్కలాగున్నావు! ఊ( …. తాతకి సూణ్ణానికొచ్చేవా….? ఊ(….? అని ఆ పాప కేరింతల్ని అనుకరిస్తూ ఆ కొత్త పాపని ఈ తమ ఏళ్ళనాటి సంస్కృతిలోకి ఆహ్వానిస్తోంది. ‘‘పేరు చెప్పండి’’ అని అడుగుతోంది ` వాళ్ళ మమ్మీ. తాతగారు నానమ్మగారు ఇలాటి పసి పాపల్ని ఎందరు? కొన్ని వందలమందిని ఇలా ఈ నది ఒడ్డు కొబ్బరి తోపుల ప్రపంచంలోకి ఆహ్వానించి ఉంటారు? వాళ్ళు చొంగ నోళ్ళు అంగార బొట్లు అబ్బురం కన్నులు వేసుకుని ఇలాగే తమ పేర్లు పెట్టించుకుని ఉంటారు. అబ్బులు గారి అసలు పేరు అబ్బులు కాదు. ఆది నారాయణ. అదీ ఈ తాతగారు ఇలాగే… ఈ మార్కెటింగ్‌ యార్డ్‌ కమిటీ చైర్మన్‌, మున్నూరు కాపు సంక్షేమ సంఘం సెక్రట్రీ అబ్బులు గారు అప్పుడు ఈ నానమ్మగారి పొత్తిళ్ళలో అంగారబొట్టు పెట్టుకుని పసి పాప! నర్సింగరావు నవ్వుకుంటుంటే రాజాలి ఇబ్బందిగా చూస్తున్నాది. అబ్బ ఇక్కడ కూడానా అని.

‘‘నీకూ మీ ఆయనుకీ ఏం పేరు పెట్టాలున్నాది?’’

‘‘శివాన్వితా…’’

‘‘ఏటీ…?’’

‘‘శివాన్వితా…’’

‘‘అలగైతే ఆ పేరే పెట్టీ! సి“వా“`న్వీ“తా“`! నాలుగు! శ్రీశివాన్వితా… అనండి.. ఆడపిల్లైతే బేసి పేరు పెట్టాల! మొగ పిల్లడయితే సరి సంక్య…! ఏటీ….?’’

‘‘బేసి సంఖ్య! అలాగే తాతియ్యా!….శ్రీశివాన్వితాయే బాగున్నాది…’’ అంది. వాళ్ళ మమ్మీ. హైదరాబాద్‌ నుండి తమ వెనకే వచ్చింది వాళ్ళ ఇండికా. ఆవిడ తాతగారి నానమ్మగారి అందరిలోనా ఎవరో ఒక మనవరాలు. విస్సు గర్వంగా చెప్తున్నాడు. ‘‘తాతగారు నానమ్మ గారి పిల్లలు మనవలు ముని మనవలు ఇని మనవలు వాళ్ళందరూ హైడ్రాబాడ్‌ బొంబాయి కల్కటా డిల్లి అమిరికాలో చానామందున్నారు.. లండల్లోన మణిప్రభా గారనేసేసి పెద్ద డాక్ట్రమ్మ ఆవిడి మరి తాతయ్‌ గారి తమ్ముడి కూతురి కూతురు. నిమ్స్‌లో రామేశ్వర్రావు గారనేసి విన్నారా? నిమ్స్‌లో రామేశ్వర్రావు గారన్చెప్పేసేసి పెద్ద న్యూరో సర్జను?!ఆయన మరి తాతియ్‌గారి కొడుక్కొడుకు!’’ అని విస్సు సాయి తన ఆశ్చర్యాగ్నిలో సమిధలు వేసి ఆ మంట ఇంకా ఎగసన దోస్తున్నారు. వాళ్ళందరూ అంగారబొట్లు వేసుకుని చొంగల నోళ్ళతో ఇలా ఇక్కడే? అన్నాలు వడ్డిస్తున్నప్పుడు ‘ఇవి ఇక్కడ పండినవేనా?’ అనడిగితే ఆవిడ మొఖంలో గర్వం వెలుగుగా విచ్చుకుంది. ‘‘ఒక్కన్నీవే కాదు బాబూ! ఈ కూరగాయలు, ఈ పులుసు, ఈ ఊరగాయా మన తోట్లొని కాయేని! ఒక్క ఉప్పు తప్పించితే అన్నీ ఇక్కడ మన బూ(విలో పండినియ్యే! తాతియ్‌ గారి సుట్టలకి పొవ్వాకూ ఇక్కడిదే!’’ అంది.‘Unto the Last అని అందులో ఇలాగేనండీ’ అని నర్సింగరావు ఏదో చెప్పబోతే ఆవిడ వినిపించుకోలేదు. ఒకొక్కరికీ జాకట్టు గుడ్డ అరటి పళ్ళు పసుపు కుంకం బరిణెలు సమింగా వచ్చేయో లేదో లెక్క పురమాయిస్తోంది సాయికి, రాజాలికీ. ‘‘ఈ పిల్లలు అమిరికా పిల్లలంటే ఎవరేన్నమ్ముతారా? పాలూ, వెన్న, కూరలు అన్ని పోషాకు సమంగ చూసుకోవాలి?!’’ అని మందలిస్తోంది. నర్సింగరావు తినే అన్నం పుయెర్టొరికోది. కూరలు మెక్సికోలో. వెన్న గౌటమెలా. పప్పులు వియత్నాం. ఒకసారి పెరట్లో ఒక టమాటా పండు పండితే దాన్ని చారు పెట్టుకుని ఇంటిల్లిపాదికీ పంచింది రాజాలి. ‘ఈ దేశంలో కూరలు నిర్గుణ బ్రహ్మాలు! చూడ్డానికి ఎర్రగా నా అంతలేసుంటాయి గాని ఓ రంగూ రుచీ వాసనా…!’ అని ఈసడించుకుంది. ఇప్పుడు బెండ మళ్ళ దగ్గిర ఎవరూ చుట్టూ లేకుండా చూసి ‘‘ ఆవిడ చూడ్రా ఎంత….ఎంథ కాన్ఫిడెన్సో ఆవిడకీ? వీళ్ళకిక్కడ మెడికేర్‌ అవీ ఏం ఉండవు?!’’అంది అపనమ్మకంగా. పద్మగార్ని గురించి నర్సింగరావు అలాగే అనుకున్నాడు మొదటిరోజు చూసి ఇంకా ఆవిడ పాట వినకముందు. నగరాల అంచనాల ప్రకారం ఆవిడ ఒక నిరుద్యోగి, ‘స్కిల్‌ సెట్‌’ పెద్ద ఏమీ లేని మనిషి. కాని ఆవిడ మాట లోన, పాటలోన తనమీద, భవిష్యత్తు మీద, జీవితం మీద ఏదో మనకి తెలీని ఎంత విశ్వాసం అని చెప్పేడు రాజాలి ఒక చెయ్యి ఒక కాలు తనమీద వేసుకుని పడుకునీ నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతుంటే.

‘ఎందుకు?’అంది. ‘‘ఎందుకురా వీళ్ళకీ… అంత నమ్మకం…?’’అని ఇవాళ మళ్ళీ. వాళ్ళకి హెల్తిన్స్యూరన్స్‌ కూడా ఉండదు కదా అని సంభ్రమంగా. ‘‘ఆవిడకి హంసానంది వొచ్చు…’’ అంటే ‘‘పోబే నీయబా నీ హంసానందీ నువ్వూ! చెప్పు…?’’అందీ. ‘ఇన్‌సైట్‌’ చెప్పు అని తహ తహగా. ‘‘వాళ్ళు ఆర్టిష్ట్స్‌కి… అలా ఉంటుందే! They are possessed! అని అంటే ‘‘మరి నానమ్మగారో అంది’’ నానమ్మగారు కూడా ఆర్టిష్టే అంటే ‘Ugghh…’ అని అర్ధం వచ్చేలాగ కళ్ళు తిప్పి కొబ్బరి మీగడ గీరుకుంటుంది.

పద్మగార్ని అవతలి ఒడ్డున దింపడానికి వెళ్తుంటే ఎండంతా చల్లబడిపోయింది. ఆవిడ దిగి ఒక బోగన్‌విల్లాల కోట గుమ్మంలోంచి ఆ దేవిడీల్లోకి నడచి వెళ్తూ ‘‘ బాగా ప్రాక్టీస్‌ చెయ్యండి!’’అంది. అభ్యర్ధన లాగ, కాని అది ఆజ్ఞాపన. సాధన చెయ్యకుండా మళ్ళీ పాఠానికి రావద్దు సుమా అని హెచ్చరిక. అక్కడ ఆడపిల్లలు బంతి ఎత్తుగా నెట్‌ మీదికి ముష్ఠి ఘాతాలు కొడుతూనే ‘సారసాక్ష పరిపాలయమాం…’ అని అన్ని గొంతులు ఒక్క గొంతుగా పాడుతున్నారు గట్టిగా. వాళ్ళ బాస్కెట్‌బాల్‌ అడుగులూ నాట్యంలా పడుతున్నాయి. పాటని జీవికగా చేసుకోడానికి, పాటలు పాడి కథలు చెప్పి నిలదొక్కుకోడానికీ ఎక్కడెక్కడ్నుంచో అక్కడికి వచ్చి. పాట జీవనాధారం కాదు నర్సింగరావుకి. ఒక హాబీ అంతే. చిన్ననాటి అక్క పాట తమని అనుకోకుండా అంటుకుని వదలకుండా వదల్లేకుండా తియ్యగా బాధించే తమ్ముళ్ళలో ఒకడు అతను. వీళ్ళది పాటభాష. పాట బతుకు. పాట పిట్టల్లాగ బిలబిల్లాడే ఈ ఆడపిల్లల ప్రపంచానికి పద్మగారు అధినేత్రి. హంసానంది ఆవిడకి బంటు. ఎవరెవరి దగ్గరో సెల్‌ ఫోన్‌ నంబర్లు అడుక్కుని చివరికి బాగా రాత్రి ఒక రోజు తలుపులు కొట్టి వెళ్తే, గరిట టేబిల్‌ మీద పెట్టి చేతులు తుడుచుకుంటూ ‘.నేను అసలెక్కువ సిటీలో ఉండనండీ! ఎక్కువ ఈష్ట్‌ గొడావరీ…!’’ అని సున్నితంగా తిరస్కరించబోయింది. కాని ఆవిడ ‘మాణిక్య వీణాం ముపలాలయంతీ…’ అని ఎత్తుగా అలవోకగా సుళ్ళు సుళ్ళు చుడుతూ పాడితే నర్సింగరావు మాయా ప్రపంచం నిశ్చలంగా ఆగిపోయింది. ‘మదాలసాం మంజుల వాగ్విలాసాం…’ అని అంటూనే ఆవిడ కూర కలుపుకోడానికి వెళ్తే ఆ కొద్దిపాటి అవకాశంలో కళ్ళు ఎఱ్ఱగా చేసుకొని చెమర్చి మళ్ళీ ‘నార్మల్‌’ అయి కూర్చున్నాడు చిత్రిక పట్టిన ఱంపం పొట్టు కుప్ప పక్కన కొత్త ఎపార్ట్‌మెంట్‌ వార్నిష్‌ వాసనలు గుర్తు పెట్టుకుంటూ. మంజుల వాగ్విలాస ఎవరు? మదాలస అని తనకి ఒక పిన్ని ఉండెది. ఆవిడా? తనకి మాటల వరకు తెలుసు. ‘Its all yours Nary!’ అని నిష్పూచీగా వేదికలు తనకు అప్పగిస్తారు. మాటలని పదునుగా అందమైన శిల్పాల్లాగ చెక్కి తన జీవితాన్ని సుఖాన్నిబతుకులోన అర్ధాన్ని నలుగురిలో గౌరవాన్ని, వాటి మీద నిర్మించుకున్నాడు నర్సింగరావు. హంసధ్వని వంటి రుజువైన జీవన రాగాన్ని, దాని అడుగున ఎక్కడో ఒక జాలి పాట వెన్నాడి ఈవిడ సన్నిధికి తీసుకొనివచ్చింది. నిండా ఐదడుగులూ, ముఫ్ఫయ్యేళ్ళన్నా లేని ఈ అమ్మాయి మంజుల వాగ్విలాస! అన్ని అలుగులతో పాట ఈవిడకి కట్టు బానిస. ‘సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీప స్రగాబద్ధ చూళీ…..’అని ఇలాంటి ఏ పాట వినో అంత ఆవేశపడి ఉంటాడు అతను. పన్ని నోట్లో పెట్టుకుని చిక్కు తీసి చుట్టలు చుట్టుకుంటుంది. పాటని అమ్ముకోలేదు పద్మగారు. పంచిపెడుతోంది ఈ పిల్లలకి. మనిషి గొంతుకి, ఒక ఆడపిల్ల గొంతుకి, ఇంత శక్తి ఉందా? నర్శింగరావు వివశుడైతే చూసి అప్పుడు ఏదో కొంత గ్రహించినట్టు ‘ఓహో ఇది మీకు నచ్చినంట్టుందే?’ అంది. ‘‘అది హంసానంది! అంటే..ఇప్పుడు…ఒక మధురమైన విషాదం అంటాం కదా?! అది పలికిస్తుంది….’’ అని ఱంపం పొట్టు అంతా ఊడ్చి ఎత్తి ఒక వార పోసి వాళ్ళాయనకి భోజనం సిద్ధం చేస్తోంది. పాటకి కాదు. పాటకే కాదు అతను వివశుడైనది.

విస్సు అదే అడిగేడు ఒక రోజు. ‘‘హంసానందీ ఏటండీ? ఎందుకదంటె మీకంత దీనిగా ఉంటాదీ…? టూ ఇయర్స్‌ బట్టి చూస్త్నాను?! ఓ పన్చెయ్యండి? రోడ్‌ నంబర్‌ సెవెన్‌ కాడి కొచ్చేసేసెయ్యండి మీకు ఒక రష్టారెంటున్నాది! అక్కడ హంసలున్నాయి. నిజిం హంసలు. ఆ హంసలు చూసుకోని ఆనందిద్దురుగాని?!’’అని. కన్‌ఫెషన్‌ అంటే తెల్సు కదా విస్సు అంటే ‘‘మనకెందుకండి బాబు కన్‌ఫెషను? మన ( వేటి దొంగతనం రంకుతనం చెయ్యలేదు! నీను హైకోర్ట్‌లో లాయర్ననేసేసి పేరే గాని నాకాడ క్లయింట్లందరూ దరిద్రిగొట్టోలేని. ఏంటండి? ఇందాక వేన్‌ కడ్డంగొచ్చి ఆపీసేడు చూసేరా? ఆల్దీ మావూరికాడే. భట్నవిల్లి. ఈడు షెడ్యూలు కేష్టు కేండేటు! ఒక్కన్ను లేదు. ఫంక్షనల్లీ బ్లైండనేసేసి సర్టిఫికట్‌ తెచ్చుకుని మున్సఫలాఫీసులో జాబ్‌ సంపాయించేసేడు. ఆడి సైడిన్కం చూసి ఓర్చుకోలేక ‘ఒక్కన్ను గుడ్డయినోడికి ఆ జాబివ్వడం అన్యాయం. ఆ జాబు నాకివ్వం’డనేసేసి మావూరోడే రెండు కళ్ళూ గుడ్డోడొకడు కేసేస్సేడు! ఈడొచ్చి నిన్న నైట్టైము మా ఇంటికాడొచ్చేసేసి ఏడుపు. బ్లేడు తోటి మణికట్టు మీద కోస్సుకోని సూసైడ్‌ చేస్సుకుంటాన్నీసి. ‘అంబాబంత పనొద్దురా ఉండు నిమ్మలంగుండు చెప్తా’ననేసి! ఏంటండి? ఇప్పుడు ఎల్వీ ఐ హాస్పటలకెళ్ళి మనకి తెల్సినోలున్నారు సర్టిఫికటు తీస్కోనొస్తనాను. ఒక్కన్నున్న గుడ్డోడయినా ఫంక్షనలీ బ్లైండే కాబట్టి ఈడుద్యోగం తీసీకుండా ముందు స్టే తెచ్చేను! అసలు సైన్సు ప్రకారం గనకైతేని ఫార్టీనైన్‌ పెర్సంటు గుడ్డైనా గుడ్డోడికిందే లెక్క! ఏంటండి? చగ్గా హంసలు మాటాడుకుంటుంటె వినుకోని హంసానందం ఆనందించాలి గాని మకెందుకండీ కన్‌ఫెషన్లయ్యెని? ఏటంటారు….? అని ఎగతాళి నిష్ఠూరం పడ్డాడు.

హంసలదేముంది! వాటికి ఏ పాపం తెలీదు. రోడ్‌ నంబర్‌ టూ కొండ లేత పచ్చికలు తింటూ అవి అకారణంగా ఆనందిస్తాయి. విస్సూ అంతే. కాళ్ళ దగ్గరికొచ్చిన డివోర్స్‌ కేసుల పార్టీల్ని అతికించి కలుపుతూ, ఒక్కన్ను గుడ్డివాళ్ళకి ఎదురు ఖర్చులు పెట్టుకుని ఉద్యోగాలు నిలబెడుతూ. కాని విస్సు, తను హంసలు కారు. ఒక్కన్ను గుడ్డివాళ్ళు కారు. నలభయ్యేడేళ్ళ మాటలలోకం వెనుక, నిజం తెలిసీ గుర్తుపెట్టుకోలేని నిస్సహాయుడైన నర్సింగరావు దృష్టి ఆడపిల్లల పట్ల అశక్తుల పట్ల సాటి మనుషుల పట్ల చాల మలినమైనది. రహస్యంగా కళ్ళ వెనక దాహం ఏదో, ఒక వెక్కిరింత ఏదో, పోలికలేవో, ఇంకా ఇంకా అని తీరని కోరిక ఏదో. రెందు కళ్ళూ ఉండీ, ‘సాటి హంసల మీద మీ దృష్టి ఏంటి విస్సు? నిజంగా….సరస్పతోడు?’అని ఒక రోజు ధోలారే ధానీలో మార్వాడీ అమ్మాయిలు దూరంగా వెళ్ళిపోయేక అడిగితే విస్సు సిగ్గుగా నవ్వి కొట్టి పారేసేసేడు గాని ఏమీ బదులు చెప్పలేదు. చిల్డ్‌ బీర్‌ ఆవిరి మీద గీతలు గీస్తూ జే శ్రీనివాస్‌, బెనిఫిట్‌ షో టికెట్లు అమ్ముతూ వంశీ మోహన్‌, The Great Indian Middle Class అనే విషయం మీద తమకంతో మాట్లాడుతూ భాగవతుల శ్రీనివాస్‌, ‘రండ్రండి సంధ్యావందనం చేసుకుందాం’ అని గుంభనంగా నవ్వుకుంటూ జేసీ వాళ్ళ బావగారూ` ఎవరూ ఏమీఅనలేదు గాని. ఆడది తమ అంతరాంతరాల్లోన ఒక ఆట బొమ్మ. మెత్తని భోగపు సరుకు. ఇది ఎవరికీ ఎప్పుడూ చెప్పుకోడు నర్సింగరావు. ఇది అందరికీ బహుశ తెలుసు. బహుశా విస్సుకీ ఇది తెలుసు. వేసవుల్లో గోదాటొడ్డున కొబ్బరితోటల మధ్య షామియానాలు వోయించి ఎలా ఎంజాయ్‌ చేస్తారో చెప్తాడు విస్సు. దీన్ని అందూ అదేలే అదే ఆ ( అని అంగీకరిస్తారు. నర్సింగరావు ఒప్పుకోలేదు.. కాని తప్పించుకోలేడు. ప్రభాత రాగాలైన విజయ శ్రీ, గౌరవ వాచకాల్లా మానవతి, హంసధ్వని, బయటికి నిటారుగా నటభైరవి, నాటకప్రియ ` ఇవి అతనికీ వచ్చు. ఇవి కాదు అని….హంసానంది కోసం అందుకే…తడబాటు పడతాడు. ఈవిడ….నానక్‌రాం గుడా సందు గొందుల్లోన మంగ సాయీ ఎపార్ట్‌మెంట్స్‌ లో నాలుగో అంతస్థులోన హైటెక్‌ భర్తని అత్తగార్ని కనిపెట్టుకొనుండి, ఆటో వాళ్ళంటే హైటెక్స్‌ దగ్గర మనుషులంటేనూ ‘అమ్మో అటుసైడు ఒద్దండీ!’ అని భయం భయంగా ఒక వారగా ఒదిగి వెళ్ళే ఈ అమ్మాయి గళం విప్పినప్పుడు ఆ మాణిక్య వీణ పురాతన స్వన సంచయం లోన హంసానంది విషాద ముద్రలు స్పష్టంగా కనిపించి తన రెండు కళ్ళ మసకలు దిగుతున్నట్టు అనుకున్నాడు నర్సింగరావు. వాటిని మనసులో పట్టుకుని తెరిపిగా మెట్లన్నీ దిగుతూ నల్లగా నీళ్ళకి కొంచెం పగులుతున్న ఆవిడ పాదాల ముద్రల దగ్గర తన శిరస్సు ఉంచి మళ్ళీ మళ్ళీ నమస్కరించుకుంటూ డ్రైవర్ని నిద్ర లేపి అప్పుడు అనుకున్నాడు నర్సింగరావు. హంసానంది విషాద రాగం కాదు. అది మలినమయ్యీ సున్నితమైన మనిషి గుండెలు గొంతుకలు ఏవో కట్టిన పశ్చాత్తప్త రాగం. లజ్జితులైన మనుషుల ఒప్పుకోలు `‘కటారి నా కొడుకులం! మా నిజం ఒకటి మీతో ఇది ` ఓ రాఘవా?!’ అని వేడుకోలు అది.

‘‘అసలు పా నిషిద్ధం ముట్టుకోకూడదు! మీరేమో మా నుండి మీదికీ దా నుండి కిందికీ పా నే అంటున్నారు! అది పూర్వీ కళ్యాణీ అయ్యిపోతుంది. పా అనేసేస్తున్నారు!’’ అని చాలా నొచ్చుకున్నాది పద్మగారు. పాఠశాల పిల్లలందర్నీ పేరు పేరునా పరిచయం చేసింది. అరటి చెట్ల వరుసల మధ్య దూరంగా మట్టి అరుగులు చూపించేరు. అవే మా వేదికలు అన్నారు. అక్కడ ఒక్కో కధలో ఒకొక్క పాటకి ఎలా అడుగులు పడతాయె గర్వంగా వాళ్ళు చేసి చూపిస్తుంటే ఇనపమడత కుర్చీల్లో కూర్చుని బెల్లం కాపీలు తాక్కుంటూ అబ్బురంగా విన్నారు. ఆ కధలు ఏంటో చెప్పమని ఛోటుగాడు వాళ్ళమ్మని సతాయిస్తున్నాడు. చిడతల లయకి అనుగుణంగా ఒకొక్కరే కుచేలుడు, దుష్యంతుడు, శిబి, వామనుడు, బలి అని ఆ పిల్లలు లాఘవంగా చేతులు, పాదాలు, కళ్ళు, పెదవులు కదిలిస్తూ కలయదిరుగుతింటే. వాళ్ళందరూ ఎవరు, ఆ పాటకి అడుగులకి అర్ధం ఏమిటి? అని సతాయిస్తున్నాడు. అరిటాకులు విసురుగా ఊగుతూ దుమ్ము రేగుతుంటే ఆపడం ఇష్టం లేకపోయినా నాట్యాలు పాటలు ఆపి వరసగా ఒక వలయంగా పద్మగారి చుట్టూ కూర్చుని ‘శివ ధనుర్భంగం ఒక్కటీ చెప్పేస్తే బావుండేది?’ అని మూసుకొస్తున్న ఆకాశంకేసి దిగులుగా చూస్తూ అంటున్నారు వాళ్ళు. లెగండి లెగండెల్దాం పదండి అన్నాడు అబ్బులు గారే. ‘‘నాటు పడవలో ఎళిపోదాం పాండి! అదుగో ఆ కనపడతన్నాయా దిబ్బలు? అయ్యే మన పెరళ్ళు! ఎంతో లేదొకిరవై నిమషాల్లో ఎళిపోతా (వు! ఏ ( విరా ఇస్సుబాబు? నాటుపడవ…?’’ అని హడావిడిగా పురమాయిస్తున్నాడు. విస్సు లాకుల దగ్గర బుట్ట చేపలు బేరం చేసుకుంటున్నాడు, సెల్‌ ఫోన్లో ఎవరితోనో అరుస్తూనే! ‘‘ఆడు కా వనేసి దబాయించ్సినంత మాత్రాన మనం గుడ్డోలం కాకుండైపోతా(వా? ఏంటరది? మన బ్లైండేంటో మనిదేంటో అది మనకి తెల్సు! వుయ్‌ నో అవర్‌ బ్లైండ్‌!’’ అని పోయింటు ఎత్తి చెపుతూ. పన్లు దిగి తట్టలు కేరేజీలు ఊపుకుంటూ మేస్తుర్లు ఆడంగులు పడవ కోసమే ఎదురుచూస్తున్నారు. అవతలొడ్డున ఇళ్ళకి వెళ్ళడానికి. పద్మ గారు తోడిచ్చి పంపించిన అమ్మాయి తలంటు జుత్తు తువ్వాల్తో ఆరబెట్టుకుంటూనే నది ఒడ్డు వరకూ వచ్చి ఆ దేవిడీ చరిత్ర చెప్తోంది. సాయి, రాజాలి ఆ అమ్మాయిని ప్రశ్నలతో కవ్విస్తుంటే. ‘‘పెద్ద రాజావారు కాలం చేసేక దేవిడీ తలుపులు ఎప్పుడోగాని తెరవరు కదండి! వారూ రాణీగారూ మెద్రాస్‌ నుండి వచ్చినపుపుడు నేను మాళవికాగ్ని మిత్రం కధ చెప్పేను. అవునండి….అంతా సంస్కృతం లోనే…!’’ అని. వాళ్ళిద్దరూ ఆ అమ్మాయి వెళిపోతున్న వెనుకే తనని ఇష్టంగా అనుకరిస్తూ నాట్యం వంటి ఆ పిల్ల నడకల్ని గోదావరొడ్డు టసకలో నడిచి చూపిస్తున్నారు, ఛోటు, బబ్లు కేరింతలు కొడుతుంటే. ‘నాటు పడవలో ఇంత మంది (వి పరవాలేదా బాబాయి?’ అని విస్సు వెనక్కి లాగుతుంటే అబ్బులుగారు ‘ఆ (ఏం పర్లేదు!’ అని పేంటు ముణుకుల దాకా ఎత్తుకుని నీళ్ళల్లోకి దిగిపోయేడు. ఛోటు, బబ్లు ఆ సన్నని చెక్క పడవలో గెంతబోతుంటే పడవ మనిషి ‘ఒద్దు కూకోండి ఏట్లో పడేరు జీగర్తా!’ అని హెచ్చరిస్తూ బలంగా నీళ్ళలోకి లాగుతున్నాడు. సాయి, రాజాలి చీర చెంగు కమీజ్‌ ఓణీ నెత్తి మీద వేసుకుని చిరు చీకటిని చలిగాలిని ఎదురుచూపుల కళ్ళతో తాగుతున్నారు దండీ మీద కూర్చుని.

గాలికి పడవ కొయ్యకి కట్టిన జండా పీలికలు రెపరెపలాడుతున్నాయి. అది సముద్రం పోటు వైపు వీచే గాలట. సముద్రం అక్కడికి ఎంతో దూరం లేదు. ఇంకొంచెం దిగవకెళ్తే ఉప్పు నీటి రంగు ఆ మన్ను తేడా తెలిసిపోయిద్ది మీకూ అని చెప్తున్నాడు అబ్బులు గారు. ఆ మైలున్నర నీటిని ఆ ఒడ్డునుండి ఈ ఒడ్డుకి కొన్ని వేల సార్లు దాటిన ధీమాతో. దూరాన్ని పేరులేని లంక దిబ్బల వైపుగా నీరు నిలచి ఉన్న చోట కొంగలు వాటంగా సరున్ర నీళ్ళలోకి దిగి ఖాళీ నోళ్ళతో నిరాశగా వెనక్కొస్తున్నాయి. ఒడ్డు ఒదిలి నదిలోకి పోతుంటే మేస్తుర్ల చుట్ట పొగ వాళ్ళ చేతిలోని రేడియో వార్తలతో కలిసి తెరలు తెరలుగా అక్కడికి తేలి వస్తోంది. ఛోటు విస్సు మొహం బలంవంతంగా తనవైపు తిప్పుకుని ‘‘విస్సంకుల్‌…? విల్‌ వియ్‌ ఆల్‌ డై ఇన్‌దిస్‌ రివర్‌?’’ అని అడుగుతుంటే అందరూ నవ్వుతున్నారు. బబ్లు నీళ్ళలోకి వంగి అందుకోబోతుంటే అబ్బులుగారు వాడ్ని నడుం పట్టుకుని వారిస్తూ .రాత్రుళ్ళు యేటకెల్తన్నవవేర అబ్బాయి?’ అని పడవతన్ని మాటల్లోకి దింపుతుంటే నది మధ్యలోకి వచ్చే వేళకి నిండా చీకటి పడిపోయింది. దూరాన్న గుడ్డి దీపం వెలుగుతున్న ఒక గూటిపడవని చూపించి ‘‘అదుగో అది మావోల్దేనండి. రాత్తిరికి దన్లో యెళ్తాం…’’ అని మాట్లాడుతునే కాని ధ్యాసంతా చేతిలో తెడ్డుమీద, పడవ విసురు వాటం మీదనే పెట్టి నడుపుతున్నాడు. రాత్రంతా ఆ వేట పడవలోనే సముద్రానికి దగ్గరగా చేపల కోసం వేచి ఉంటారట. సాయి విస్సుని గద్దిస్తోంది ఆత్రంగా ‘‘ఏయ్‌ యిస్సుబావా! కొత్తపేట ఎప్పుడొచ్చెద్దాం?’’ అని. రాజాలి నర్సింగరావు విడి విడిగానే చేతిలోన చెయ్యి ఒకటి వేసుకొని, రెండో చేతులతో నాటు పడవ విసులుగా తూలినప్పుడల్లా భయం భయంగా ఛోటూని, బబ్లూని కరిచి పట్టుకుని లేక్‌ సాస్తాలో ఒక వేసవుల్లో పిక్‌నిక్‌ అని వెళ్ళిన సంగతి జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. ‘‘ఇది అలా ఉండదేం…ఇది వేరేగా ఉంటుంది?’’ అని అడుగుతోంది. ‘‘అది మనది కాదు కదా! ఇదయితే…ఇది మన్ది కదా! ఏం…?’’అని ఇద్దరూ ఒక్కసారే అనుకుంటూ. సాయి ఉండుండి ఆ పాఠశాల అమ్మాయిని తల్చుకుని మెచ్చుకుంటోంది. ‘‘ఇక్కడెంత బాందేం? అబ్బ అవతలొడ్డు కనిపిస్తంది చూడూ…? ఆ ఎత్తుగా దిబ్బ, ఆ దిబ్బెనకాల దీపాలు? అవే తాతియ్‌గారాల ఇల్ళు! అందులో మనకీ ఒక వాటా ఉంజే’వ అని. చేపలు పట్టి, పాటలు నేర్పించి, హరికథలు చెప్పుతూ, పడవలు నడుపుకుంటూ, పొలాలు చేసుకుంటూ ఇన్ని రకాలుగా ఇలా బతుకుతారనీ, వీళ్ళు తమ గతంలో ఎక్కడో ‘ఒద్దు!’ అని వొదులుగున్న తమ వాల్ళనీ, కాని ఇప్పుడిక తమకి ఏమీ కారనీ. తమకు లేనిదాన్ని కొంచెం సేపటి కోసం అరువు తెచ్చుకున్నట్లు చెప్పుకుంటూ ఆస్వాదిస్తుంటే అబ్బులు గారు ఇష్టంగా వింటున్నాడు. ‘అసలింత అడుదుంబుడుదుంగా వొచ్చేరేట్రా ఇస్సుబాబూ? అయినివిల్లీ, అనాతారం, ముక్తేస్సరం.. అసలేయీ చూసుకోకుండానీ…? ఉప్పుడు రేపో పన్చెయ్యి! పొద్దుటే రేవు దాకెళ్ళి వేను పంటికెక్కించియ్యి. మీరిలాగ నతోటొచ్చేసెద్దురుగాని? అని. కొబ్బరి నీళ్ళు పేకేజింగ్‌ ఇండష్ట్రీ గురించి ఆయన నర్సింగరావుని వరసపెట్టి ప్రశ్న లేస్తుంటే ఇంక ఒడ్డు కూతవేటు దూరాన్న ఉందనగా చినుకులు పట్టుకున్నాయి. చీకటిని మబ్బుల్ని చప్పుడు చెయ్యకుండా పారుతున్న నదిని గమనిస్తూ ఎవరూ ఏం మాట్లాడకుండా అయిపోయేరు ఛోటు, బబ్లుతో సహా.

పడవ ఒడ్డెదురుగా చక్కర్లు కొడుతుంది గాని ఒడ్డుకి తిప్పడానికి వాటం కుదరటం లేదు. పడవ మనిషి శక్తంతా కూడాగట్టుకొని రాటతో ఎంత బలంగా నెడుతున్నా పడవ మెరక వైపుకే పోతుంది గాని లోతు వైపుకి పొవటం లేదు. ‘‘ ఆ పిట్టిన్నావురా యిస్సుబాబు? తీతువు పిట్టది…! తీతువు…! నెత్తిమీంచి ఎగిలెలితే మంచిదికాదురబ్బాయి…’’ అని బెదరగొడుతున్నాడు అబ్బులు గారు. అవతలొడ్డంతా వెరిరాకాసి తుప్పల్లే నల్లగా జుత్తులు విరబోసుకుని ఉన్నాయి. పడవ ఒడ్డంట సమాంతరంగా నడుపుతూ ఇటూ అటూ సోలిపోతుంటే ‘‘బెంగనేదండీ అదిగద్దిగో ఒచ్చే వొచ్చీసే(వు…! ’’అని ధైర్యం చెపుతున్నాడు అతను. ఒడ్డున ఎవరో చీకట్లో ఒంటరిగా ఏడుస్తున్నట్టు గాలిలో జీబు జీబుమని ఒక రాగం. ఇటు వైపు పేరులేని లంక దిబ్బల మీద ఒక జంతువు ఏదో పడవ తోనే పిగెడుతోంది. దాని కళ్ళు చీకట్లో పచ్చల దీపాల్లాగ మెరుస్తుంటే, తుప్పల్లోంచి కాసేపు కనిపించకుండా పోయి మళ్ళీ పరిగెడుతూ. ‘‘గుంటనక్క! నక్కది….యెదవ కూతురు? ఏరబ్బాయి నక్కేనా…?’’ అని అబ్బులు గారు. పడవ ఒడ్డున కట్టి ఒక్కొక్కరికీ అబ్బులుగారు చెయ్యందిస్తుంటే అక్కడ చిట్టివోక తుప్పల దిబ్బల్లోన ఎవరో ఒకతను బిగ్గరగా ఎవర్నో తిడుతూ శోకాలు పెడుతున్నాడు.. ‘‘ఏవర్రా వోరబ్బాయి? ఎవడివిరా నువ్వూ ఈ వేళప్పుడు’’ అని గద్దిస్తే రాయి అబ్బులు గారి మీదికి విసిరి తూలుకుంటూ మళ్ళీ కింద పడ్డాడు. ఎవరినో అమ్మనా బూతులు తిడుతూ హృదయవిదారకంగా ఏడుస్తున్నాడు. ‘నీయమా నీ ఊసెత్తేన నీ జోలెత్తేన్రా….? నీ…’ అని ఎత్తుకుని ఆక్రోశం వెఱ్ఱి చేతకాని దు:ఖాన్ని ‘ఓ..’ అని తాగుబోతు ఏడుపు ఏడుస్తున్నాడు, చుట్టూ ఎవరి స్పృహా లేకుండా. వెనక పడవలో వచ్చిన మేస్తుర్లు కాలితో ఎత్తి కొట్టినట్టు చేస్తే మళ్ళీ కోపం తెచ్చుకుని లేచి ఇసక గుప్పిళ్ళతో విసిరి కింద పడుతున్నాడు. ‘ ఆడికిది మామూలేని బాబూ తాగుముచ్చు నాంబ్డికేయ్‌…!’ అని సిలవరి కేరేజీలు వరసగా ఊపుకుంటూ మేస్తుర్లు దిబ్బ ఎక్కుతున్నారు. అతన్ని ఎవరో దగ్గిర వాళ్ళే నమ్మించి మోసం చేసేరు. అతని భార్యని ఏవరో! నమ్మించి వోరే ఊరు పంపించి అతన్వి అనుకున్న వన్నీ దోచుకునారు. ఇవి ఏవో పాటల్లాగ తల్చుకుని తల్చుకుని ఇసక గుప్పిళ్ళు మెరుపుల చినుకుల్లోకి విసిరి కొడుతూ ఏడుస్తున్నాడు. వాళ్ళు ఇంటిముఖంగా అబ్బులు గారి పెరళ్ళ వైపు ఎక్కుతుంటే, నర్సంగరావు ఏదో చాలా పరిచయం ఉన్న గానంలా విన్నాడు. ఆగిపోయి ఒక్కడే. ఆ తాగుబోతు వెర్రి వాడి ఆక్రందన. ‘‘అబ్బ ఏంటి ఆ చీకట్లో…? తడిసిపోతావు వేగం రా!’’ అని వెనక్కి తిరిగి గద్దిస్తోంది రాజాలి. విస్సుని వెనక్కి పంపించింది. అతను ఇసకలో కాళ్ళీడ్చుకుంటూ వచ్చి పైనుండి చెయ్యందిస్తే నర్సింగరావు అందుకోలేదు. ‘‘ఇస్ష్‌! విస్సు! వినండి! అది హంసానంది!’’ అంటే విస్సు విరగబడి నవ్వుతున్నవువాడు అంత చీకటో నవ్వాపి స్థిరంగా నిలబడి విన్నాడు. కొబ్బరి తోట వెనక ఇళ్ళ మీద సిరా చారల్లోకి మెరుపులు మెరుపులు దిగుతున్నాయి. మేస్తుర్ల మాటలు, పిల్లల కేరింతలు, అబ్బులుగారి హెచ్చరికలు, సాయి, రాజాలి నవ్వులు అన్నీ చిన్నవై దూరంగా మరుగైపోయినా ఇంకా మాటలేం మాట్లాడకుండా ఒక చెయ్యి తన ముణుకుల మీదే వేసుకుని ఇసకలో ఆనుకుని మెరక మీంచి రెండో చెయ్యందించి పట్టుకుని నిలబడ్డాడు విశ్వేశ్వర్రావు. నదిలో చినుకుల చప్పుడు బలుసు తుప్పల్లో గాలి చప్పుడు ఉధృతమవుతున్నా అవి పట్టించుకోకుండా నిలబడి తదేక ధ్యానంతో విన్నారు. పిచ్చివాడి ప్రేలాపనల పాట. హంసానంది. *