అహంకారము, మనసునిండా
మమత, బలిమియు, చెలగు మదమును,
మత్సరముతో ముందు వెనుకలు
చూడనైతినిగా!
మంచి చెడ్డల భేద మెరుగక
మన్ను మిన్నూ కాన కుండా
విహారించితి, లోకమంతా
నాదె అనుకొంటూ!
కాదు పొమ్మన కాలమాగున ?
పిదప కాలము దాపురించెను
ముంచుకొచ్చెను ముదిమి శీఘ్రమె
వెర్రి బాధలతో
ఘనత లన్నీ గోప్య మవ్వగ,
శక్తి యుక్తులు సన్నగిల్లగ ,
గతము కలవలె కరిగి పోవగ
సోలి పోయితినే!
బలము కరవై బ్రతుకు బరువై
మోయ జాలని భారమయ్యెను,
దినము గడుచుటె కష్టమాయెను
భీతి పెరుగుటతో!
కడలి నడుమను నావ పగులగ,
కష్ట సమయము చుట్టుముట్టగ,
అలల నడుమను చిక్కి హడలుచు
దుఃఖ భారముతో –
దిక్కు తెలియక వొడ్డు దొరకక
ఆశ తొలగక అల్లలాడుచు
తరణి ఏదని తల్లడిల్లెడి
బడుగు నావికలా
కన్నతల్లివి నీవు కావున
కాదు, లేదని చెప్పబోవని
ఆదుకొమ్మని ఆశ్రయించితి
ఆశ వీడకనే
జీవగతిలో అలసి పోతిని
ఆయు శేషము గడుపుటెటులో
నిలువు మమ్మా జగజ్జననీ
నాకు బాసటగా …
(హంసలు మరణించేందుకు ముందు ఒక పాటపాడి మరణిస్తాయి అంటారు, అది Swan Song అన్న పేరుతో జగత్ప్రసిద్ధమైన మాట. హంస – అంటే మన భాషలో ‘ఆత్మ’ అన్న అర్ధం కూడా ఉంది).