3.
‘నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటెను సూనృతవ్రత యొక బావి మేలు’ అనే పద్యంలో చివరికి లోకోపకారాలన్నిట్లోకి ఒక సూనృత వాక్యము మేలు అని తేలుస్తారు నన్నయ్య. సూనృతమంటే నిజం, అంటే సత్యమైన మాట. అనృతమంటే అందుకు విరుద్ధంగా నిజం కానిది, అంటే ‘జూటా’. నిజం చెప్పటానికి అది తెలిసుండాలి, ‘నిజాన్నే కనుక్కుని చెప్పాలీ’ అన్న పట్టుదలా ఉండాలి. అనృతం అని కూడా తెలిసి, తెలిసి కోరుండే చెప్పొచ్చు. లేదూ తెలియక, ‘ఏదో ప్రయోజనకరమైన నిజాన్నే చెప్తున్నాను’ అని నమ్మి చెప్పొచ్చు. ఈ రెండవ తరహా ‘జూటా’ ని జాగర్తగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే కళలతో సహా విజ్ఞానపు అన్ని పార్శ్వాలకు ఇలాంటి అమాయకత్వం వలన చాలా నష్టమే జరుగుతూ వచ్చింది. The road to hell is paved with good intentions అని సెయింట్ బెర్నార్డ్ (Saint Bernard of Clairvaux) అన్న మాట వివేచనకు అడుగడుగునా వర్తిస్తుంది. వివేచనలో అనృతాన్ని పరిహరించుకోడానికి, అదుపులో పెట్టాడానికి విజ్ఞాన శాస్త్రం, అంటే Science ఒక వ్యవస్థగా చేసిన పరిశ్రమ, విధించుకున్న కట్టుబాట్లు సృజనల్ని గురించిన వివేచనకూ పనికొస్తాయి.
నూతులు, బావులు, సత్క్రతువులు ఇవన్నీ కలకాలం ఉపయోగపడేవి. ఒక వాక్యానిదేముంది? కేవలం ఒక్క మాట. మనకందరికీ మాట్లాడటం సహజంగా వస్తుంది. తెలివైన వాళ్ళకైతే మాటల్ని రకరకాలుగా తెలివితేటలుగా అల్లటం కూడా వస్తుంది. ఇంకా చతురులైతే మాటల్ని ఒక గారడీలా, కనికట్టులాగ ప్రయోగించే చాతుర్యం ఉంటుంది. ఇలాంటి చాతుర్యానికి ఎన్నో లౌకికమైన ప్రయోజనాలున్నాయి – అమ్మటం, బోధించటం, పోరాడటం, నాయకత్వం వహించటం, వినోదింపచేయటం ఇలాంటివి. అందుకే వాక్చాతుర్యానికి లోకవ్యవహారంలో చాల గౌరవం, మతింపు ఉంటాయి. ఎప్పుడో ఒకసారి నేను, మా బావ వాజపేయీ గారి ఉపన్యాసం వినటానికి వెళ్ళేము. ఆయన గొప్ప చతురుడైన వక్త; కాంగ్రెస్ ని ఎండగడుతుంటే జనం ఆవేశంతో ఊగిపోయి చప్పట్లు కొట్టేరు. ఆ మర్నాడే అదే వేదికమీద ఇందిరాగాంధీ గారు ఉపన్యాసం ఇచ్చి ఆయన చెప్పిందంతా సరికాదు, తను చెప్పిందే సరైందని రూపిస్తే ఆ ప్రజలే అంత ఆవేశంతోనూ చప్పట్లు కొట్టేరు. అదీ, ఇదీ చూసి మా బావ – గొప్పదనం చెప్పిన విషయంలో లేదనీ, చెప్పినోడి మాటకారితనంలో ఉందనీ అన్నాడు.
ఏ విషయాన్ని గురించైనా మన పరిజ్ఞానానికి వాస్తవాలు, దృఢ నిశ్చయాలు, నమ్మకాలు, అభిప్రాయాలు, సంశయాలు, అపోహలు వంటి మౌలికమైన పార్శ్వాలుంటాయి. వీటిని మన అంతరంగంలో ఎలా నిర్మించుకుని, స్థిరపరుచుకుంటామనే విషయాన్ని గురించి సాంఘిక మనస్తత్వ శాస్త్రం చెప్పే సంగతులు ఇక్కడ లేవనెత్తుతున్న ప్రశ్నలకి ఎంతో ఉపకరిస్తాయి. వీటిలో చాలా వారకు పార్శ్వాలు మన వ్యక్తిత్వపు పరిమితుల – అంటే prejudice వంటి సంకుచితత్వాల – వలన మనమే గ్రహించుకోలేక పోతాము. ఒకవేళ ఎరిగి ఉన్నా సాంఘిక మర్యాదలకు, మనదే అయిన భేషజానికి తలొగ్గి వీటిని చాలా వరకు మరుగున ఉంచుకుంటాము. ఇది జరిగే పద్ధతిని వివరంగా తెల్సుకొవటం సృజనల పరిశీలనకు అనివార్యమౌతుంది. మనకి బాగా ఆసక్తి ఉన్న విషయాలలో పరస్పరం విరుద్ధమైన అభిప్రాయాల్ని, ప్రతిపాదనల్ని ఎలాగైనా సరే సమన్వయం చేసుకోవాలని మనకి చాలా తహతహగా ఉంటుందట. దీన్ని Cognitive Dissonance అన్నారు. సారస్వతం మీద ఆసక్తి ఉన్నవాళ్ళకి సహజంగానే ఇలాంటి జిజ్ఞాసను శోధించి, చర్చించి పరిష్కరించుకోవాలని తీరని ఆరాటంగా ఉంటుంది. అనుశీలన కోసం, చర్చ కోసం ఇందుకే ఆరాటపడతాము. ఇంతేకాక, ఈ Cognitive Dissonance మన అభిప్రాయాల్ని, నమ్మకాల్ని ఇతరులు కూడా ఒప్పుకొనే తీరాలన్న మంకుతనంగా పరిణమించడం కద్దు. ఇది ఒక్కోసారి తీవ్రమైన అసహనంగా, labeling అని వ్యవహరించే చిన్నచూపుగా, చివరికి ధూర్జటి ‘నిరూఢ క్రోధం’ అని వర్ణించిన కోపంగా కూడా ముదిరిపోవటాన్ని సారస్వతంతో సహా అన్ని రంగాల్లోనూ చూస్తుంటాము.
సృజనకారులు ఇలాంటి రుగ్మతల్నుండి ముక్తులు కావటానికి ప్రజాస్వామ్యం అని వ్యవహరించే సాంఘిక మర్యాద, సౌభ్రాతృత్వం అని వ్యవహరించే నైతిక మర్యాద, విశ్వ ప్రేమ, కరుణ అని వ్యవహరించే అధ్యాత్మిక, ధార్మిక మర్యాదా ఇవేవీ సరిపోవు సరి కదా అడ్డం పడి, చివరికి అవ్యవస్థకే దారితీస్తాయి. ఇంతకంటె లోతైన సాధన, సృజన తత్వాన్ని గురించీ, అనుభవం కోసం నిజాయితీ గల వెదుకులాట, ఆత్మ పరిశీలన ప్రాతిపదికలుగా దీనికి సృజన సమ్మతమైన మర్యాదను, అంటే వ్యవస్థను నిర్మించుకోవడం సాధ్యమవుతుందా? ‘జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచువారు’ అనిపించే ఇలాంటి క్షమను, సహనాన్ని కేవలం తమ సృజనానుభవమే భూమికగా సాధించుకున్న సాహితీమూర్తులు అరుదుగా తారస పడుతుంటారు. వీళ్ళ చరిత్రలు వెదుక్కొని, వీళ్ళు చెప్పిన మాటలు చదువుకోవటం ఆరోగ్యకరం అవుతుంది. Opinion Formation ఇంకా Cognitive Dissonance అన్న ఈ రెండు ముఖ్యమైన విషయాలూ ముందుకి వివరంగా చెప్పుకొనేదానికి ఇది కొంత ఉపోద్ఘాతం.
గడుసుదనంతో, మాటకారితనంతో అప్పటికి ‘ఇదేదో బాగానే ఉంది’ అని రూపించే మాటలు ఇలాంటి వెదుకులాట నుండి వచ్చేవి కావు. ఇవి తాత్కాలికమైన వినోదాన్నిస్తాయి, మన boredomకు, క్లిష్టమైన విషయాల్ని గురించి మన శక్తి కొద్దీ ఆలోచించి ఎలాగోలా సమాధానపడాలన్న ఆతృతకి కొంత ఉపశమనంగా ఉంటాయి. కానీ మా అప్పదొడ్డ మజ్జిగన్నం వంటి ఈ మాటల వలన, సంతృప్తినిచ్చి నాలుగు కాలాల పాటు స్థిమితంగా ఉండే ప్రయోజనం దక్కదు. ఇంట్లో ఎవరికైనా జలుబో, జ్వరమో ఇలా ఏ సుస్తీ చేసినా మా అప్పదొడ్డ చాలా ప్రేమతో, ఆతృతగా “అమ్మా! నానీ! వాడికి ఇంత మజ్జిగా అన్నం కలిపి పెట్టండే! ఇదుగో… ఈ మజ్జిగా అన్నం తినీరా నానీ?!” అని కలిపి తెచ్చీసీది. అయితే వాస్తవానికి అన్ని రోగాలూ మజ్జిగాన్నానికే తగ్గిపోవు. అందరి ఆరోగ్యం గురించి నిజంగానే ఎంతో పరితపించే ప్రేమమూర్తి మా అప్పదొడ్డ మజ్జిగా అన్నం కలిపి చేసే హడావిడి ఆవిడ ప్రేమనైతే ప్రకటిస్తున్నాయి గాని, రోగాలు కుదర్చటానికి పనికిరావని క్రమంగా అందరం గ్రహించుకున్నాము.
మానవ వ్యాపారాల్ని, విజ్ఞానాన్ని లోక వ్యవహారం, శాస్త్ర విజ్ఞానం, కళ, ఆధ్యాత్మికం అని ఇలా నాలుగు విభాగాలుగా అనుకున్నట్టయితే ఈ నాలుగింటిని గురించిన వివేచనకూ, పరిశ్రమకూ ‘మాట’ అంటే భాష ఒక సామాన్యమైన, ముఖ్యమైన పనిముట్టు. మనుషులందరికీ మాటలొచ్చు. కోట్లమందిలోన కొన్ని వేలమందైనా బాగా తెలివైనవాళ్ళుంటారు. వీళ్ళలో మాటకార్లకు తమ వాక్చాతుర్యాన్ని వినియోగించే అవకాశాలు ఈ నాలుగు రంగాల్లోనూ విరివిగానే ఉంటాయి. అలాంటివాళ్ళ మాటలలోని చమత్కారం, గడుసుదనం, చాతుర్యం వలన నిజానికి అవి చాల రంజింపచేస్తాయి. మరప్పుడు అలాంటి మాటలన్నీ ఈ నాలుగు రంగాల్లోనూ ‘సూనృతములు’, అంటే ఒప్పుకోవలసినవి, ‘నిజం’ అయిన మాటలవుతాయా? చెప్పే మాటలు నిజమే అవ్వాలన్న నియమం ఎందుకంటే నిజమైన మాటలు మాత్రమే ఈ నాలుగు రంగాల్లోనూ ప్రయోజనకరమైనవి. ఉదాహరణకు శస్త్రచికిత్స కత్తులు, దబ్బనాల వంటి పనిముట్లని ఉపయోగించి చేస్తారు. ఇలాటి పనిముట్లనే చెప్పులు, బట్టలు కుట్టడానికీ, కూరలు, మాంసం తరగటానికీ ఉపయోగిస్తారు. కాని వీటిలో ప్రతీ పనికీ తమవైన తర్ఫీదు, నైపుణ్యం ఉన్నప్పుడు మాత్రమే, అదే మనిషి అవే కత్తుల్ని వాడి ఎంచుకున్న పనిని విజయవంతంగా, అంటే ప్రయోజనకరంగా, హాని లేకుండా పూర్తి చెయ్యగలుగుతారు. ఆ పని జరిగే పద్ధతిని యదార్ధంగా వివరించగలిగేదే సూనృతం. అందుకే దానికి అంత విలువ. అప్పదొడ్డ మజ్జిగాన్నం వంటి అనృతాలు ఈ అన్ని రంగాల్లోనా రకరకాల కారణాల వలన ‘నిజాలు’ గా చెలామణీలోకి వచ్చేస్తుంటాయి.