9.
మాస్లో విస్సన్న కాదు. ఆయన చెప్పిందే వేదం కాదు. ఆయన సిద్ధాంతం మీద ప్రబలమైన విమర్శ ఏమంటే అవసరాల్లో ఎగువ, దిగువ అని స్పష్టంగా ఉంటాయని ఋజువులేమీ లేవని. ఉదాహరణకు ప్రాధమికమైన అవసరాలు తీరకపోయినా సరే, దుర్భరమైన పేదరికాన్ని, అవిటితనాన్ని, కష్టాల్నీ అనుభవిస్తున్నా సరే అనివార్యంగా శాస్త్రజ్ఞులుగా, కళాకారులుగానే జీవించి, రాణించినవాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ అభ్యంతరానికి సమాధానంగా మాస్లో జిజ్ఞాస, సృజనశీలత వంటివి తీవ్రమైన స్వభావాలుగా ఉన్నవాళ్ళు అవసరాల అనుక్రమాన్ని అతిక్రమించి జీవిస్తారని ముందుగానే ప్రతిపాదించేరు. అలాగే, ఇది అనుక్రమమైతే అవును గాని ఒక అవసరం కంటే, ప్రవృత్తి కంటే ఇంకొకటి ‘ఉన్నతమైనది’ అన్న సూచన – అంటే value judgment లేదు. సాహిత్యం గురించి గొప్పవీ తక్కువవీ అని ప్రస్తావన వచ్చినప్పుడల్లా త్రిపుర ఈ విషయాన్ని నొక్కిచెప్తారు. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఇదివరకటి అభిరుచులు, అభిప్రాయాలు, విలువలు మారిపోయేయన్న విషయాన్ని ఆయన చెప్పే పద్ధతి ‘అక్కడ్నుంచి ఇంకోచోటికి సాగిపోయేవు’ అని (“You have moved on”). ఇప్పటి మనఃస్థితి మునుపటికంటె ఎక్కువా, తక్కువా అన్న సూచన, ప్రస్తావన అనవసరం. ఎవరైనా రచయిత, సాహిత్యాభిమాని చూడ్డానికి వెళ్తే త్రిపుర వైఖరి ఎలా ఉంటుందంటే ముందు వచ్చింది ఒక మనిషి; అందునా సారస్వతం అంటే ఇష్టమున్నవాడు. ‘పెద్ద’ రచయితా, ‘చిన్న’ రచయితా అని కాకుండా ముందు అతనొక రచయిత! అదే ఒక విశేషం. ఎందుకంటే రాయటం అనేది మనుషులం సాధారణంగా చేసే పని కాదు. అదే ఒక అసాధారణమైన సంగతి, ఒక ‘గొప్ప’. అంచేత – ‘దా ఇలాగొచ్చీ! కూచో!’ – ఇదీ ఆయన రచయితలమని దగ్గరకొచ్చే వాళ్ళని స్వీకరించే పద్ధతి. రాసే ప్రవృత్తిని గురించి ఒక సంగతి ఆయన చెప్పినది. వాళ్ళ దూరపు బంధువుల్లో ఒకాయన – పెద్దవాడు, ఇంకెవరూ లేని ఒంటరివాడు, ఒక చిన్న గదిలో ఒక్కళ్ళే ఉండేవారు. ఆయన చేతికి ఏవి అందుబాటులో ఉంటే అవీ – ప్రార్ధన పుస్తకాలు, శ్లోకాలూ ఇలాటివి – చూసి మళ్ళీ తన నోట్ బుక్కులో అలా రోజంతా రాస్తూ పోయేవారు. ఆయన్ని కొంత కాలం గమనించి త్రిపుర అనుకున్నది ఏమంటే అలా రాసుకోవటం ఆయనకి ఏదో సాంత్వన. ‘ఎందుకు త్రిపుర? ‘ అంటే ‘ఇంకెన్నెన్నో ghastly acts అంటే ఘోర పాతకాలు చెయ్యగల వీలున్న ఆ చేతులకి, అలాగేమీ చేసీకుండా ఇదొక వ్యాపకం కదవై! ‘ అని. Boredomకు సారస్వత వ్యాసంగంతో ఉన్న అవినాభావ సంబంధాన్ని గురించి మంచి చర్చ ఉన్నాది.
‘దా ఇలాగొచ్చీవై! ‘ పిమ్మట త్రిపురతో సంభాషణంతా ఒక కడిగి, తుడిచిపెట్టిన అద్దంతో మనం ఒక్కళ్ళమే చేస్తున్న సంభాషణలాగ ఉంటుంది. అది కేవలం వచ్చినవాడి ప్రతిబింబం; అంతకుమించి అక్కడ వచ్చినవాడి ఆలోచనలకు, అంచనాలకు ప్రతిగా ఆలోచనలు లేవు, అంచనాలు లేవు, ప్రతిపాదన లేవు. ఒప్పుకోలు, తిరస్కారం ఇలాగ ఏమీ లేవు. ముఖ్యంగా ‘త్రిపుర ఉవాచ!’ లేదు. రాయటం అనేది ఒక అసాధారణమైన ప్రవృత్తి, కాని దాన్ని ‘ఓహో సాహిత్యం బాబూ!’ అని ఊరికే విశేషంగా గౌరవించడం, సారస్వతం తక్కిన సమాజానికి ఏదో ఒరగబెడుతుందనీ లేదా ఉద్ధరిస్తుందని నమ్ముకోవడం, హడావిడి చెయ్యడాన్ని ఆయన ఒప్పుకోలేరు. ఆయన ఒక రచయిత అని, ఆయన రాసినవాటిని చర్చించాలనీ వచ్చే ప్రయత్నాల్ని త్రిపుర సున్నితంగా తిరస్కరిస్తారు, లేదంటే ఎదుటివాళ్ళు నొచ్చుకోకుండా సాంతం ఓపిగ్గా విని, కొంత చెప్పి, క్లుప్తంగా ముగిస్తారు. సంభాషణ ఎదుటివాళ్ళకి ఉపయోగపడుతుందని, లేదు ఊరటగా ఉందనీ అనిపిస్తే మాత్రం ‘ఊఁ’ కొడుతూ, సునిశితంగా పరిశీలిస్తూ కొనసాగనిస్తారు. కాని ఈపాటి సంభాషణనూ ఆయన నిర్వహించే పద్ధతి చాల సబబుగాను, సునిశితంగాను – అంటే reasonable గాను, insightful గాను ఉంటుంది. ఆయన మాటంటూ గనక మాట్లాడితే అది శస్త్ర నిపుణుడి కత్తివేటు లాగ సూటిగా, తను చెప్పదలచుకున్నది వింటున్నవాడికి స్పష్టం అయ్యేవరకూ ఏ మర్యాదా మప్పితం లేకుండా మొండితనంగానూ వస్తుంది. త్రిపురకిప్పుడు ఎనభైనాలుగేళ్ళు. కాని సంభాషణలో ఆయన చూపు, ఆలోచన, మాట ఎన్నేళ్ళనుండో ఒక్కలాగే స్థిరంగా వయస్సుకు అతీతంగా – timeless అంటారు, అలాగుంటాయి.
“Read anything I write for the pleasure of reading it. Whatever else you find will be the measure of what you brought to the reading.” అని హెమింగ్‌వే (Ernest Hemingway) తన సృజనల్ని గురించిన చర్చల్ని అయిష్టత ప్రకటించేరు. “It is hard enough to write… without being asked to explain them as well.” అని ఆయన నొచ్చుకున్నారు. త్రిపురతో ఆయన రచనల్ని గురించి ఒకటి రెండు సార్లు తప్ప ప్రస్తావించే సాహసం చెయ్యలేదు నేను. అది కూడా నైరూప్యమని, చైతన్య స్రవంతి అని వ్యవహరించే సృజన రూపాల్ని గురించి, వాటి స్వభావాల్ని గురించి నేనే ప్రస్తావించినప్పుడు. హెమింగ్వే ఒక ఇంటర్వ్యూ లోన జాయిస్ (James Joyce) గురించి చెప్తూ ఆయన తన సృజనల్ని గురించిన ప్రస్తావనను, చర్చను మిక్కిలి అసహ్యించుకొనేవారని, సహించేవారు కాదని అన్నారు: “In company with people of your own trade you ordinarily speak of other writers’ books. The better the writers the less they will speak about what they have written themselves. Joyce was a very great writer and he would only explain what he was doing to jerks. Other writers that he respected were supposed to be able to know what he was doing by reading it.”
‘ఉవాచ!’ అంటే assertion అనదగిన అభిప్రాయాల్ని, స్థిరమైన ప్రతిపాదనలు, ప్రణాళికలంటే త్రిపురకి బొత్తిగా ఆసక్తి ఉండదు. ఔత్సాహికులు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా త్రిపురతో సంభాషణను ‘సాహితీ చర్చ’ గా, ప్రణాళికగా, అంచనాగా నిర్వహించలేక నిరాశ పడతారు. త్రిపురతో సంబంధం హాయిగా ఉంటుంది గాని సాహితీ సంబంధం ఎంతగా ఊది, ఎగదోసినా రాజుకోలేక చల్లారేపోతుంది. వ్యవహర్తకు, సంస్కర్తకు, మూల్యాంకనం స్వభావంగా ఉండే విమర్శకుడికి, బాలరామానుజన్‌కీ ఇది చాల దుర్భరంగా ఉంటుంది. బెల్లం కొట్టిన రాయి కూడ త్రిపురలాగే ఉంటుంది కదా! ఉన్నతమైన తెలుగు సాహిత్యం కోసం, అభ్యుదయకరమైన సమాజం కోసం తనవంతుగా ఏ సాహితీ కృషీ చెయ్యకుండా, పోనీ ఎవరైనా ఉత్సాహంగా ముందుకొస్తున్నా సరే కలిసిరాకుండా! ఈపాటి దానికి త్రిపుర ఎందుకు? బహుశ అందుకేనేమో త్రిపురతో సాహితీ సంబంధాలు రకరకాలుగా స్థిరపడే ప్రయత్నాలు చేసి చివరికి ఏ తోవా లేక, ఎలాంటి వెసులుబాటూ లేక ఆగిపోతాయి. సాహితీ ఔత్సాహికులు ‘రకరకాల ఆలోచనలతో’ వస్తారు. (“They come here with some idea or other.”) త్రిపురకి వాటితో పేచీ లేదు, ప్రేమా లేదు. వచ్చినవాళ్ళు ఆయన పద్ధతిని అర్ధం కాదని, లేదంటే ‘నిష్క్రియా పరత్వం’ అని, కాదంటే ‘ఆయన్దారి ఆయన్దీ మన్దారి మన్దీ!’ అనీ చిన్నబుచ్చుకుని వెళ్తారు. ఒక కాఫ్కా కలగజేసుకుంటే త్రిపురకి కూడా –
మెరుపులు ఝళిపించి
మెరికల్లాంటి కొండల్ని నిలువుగా చీల్చి
ముదురు పాదాల వృక్షాలన్నిట్నీ
కూకటి వేళ్ళతో సహా
భూమ్మీదికి పడగొట్టి ………యింకా యింకా చాలా
ప్రణాళికలున్నాయి
ఆలోచిస్తే
జాగర్తగా కలుగజేసుకుంటేఅంతా మొత్తంగా మాడాలని
మనిషి కుడా మారాలని
కలుగజేసుకోకపోతే
మహా ముప్పు ముంచుకొస్తుందని ………
కానీ
Assumption అనే మాటకి సరైన తెలుగు మాట తోచదు. అది అటు కేవలం ఊహ కాదు, అలాగని అపోహా కాదు. బాలరామానుజన్ త్రిపుర దగ్గరికి ఎన్నో అభిప్రాయాలతో, అంచనాలతో, ప్రణాళికలతో, ఉవాచలతో, ఆరోపణలతో వెళ్తాడు. త్రిపుర ఔదార్యమనే అద్దంలో ఇవన్నీ ఒకొక్కటి, ఒకొక్కటీ పైకొచ్చి ప్రతిఫలించి, వీటన్నిటికీ ప్రాతిపదికలుగా ఉన్న assumptionsకి ఎలాంటి ఆలంబనా దొరక్క క్రమంగా పట్లు సడలి వాటంతటవే నశించే అవకాశం ఉంది. ఈ దుంప నాశనమే త్రిపుర బాలరామానుజన్‌కు ‘చెప్పే’ మొదటి పాఠం. ఇలాగ అవాలని త్రిపురకి ఆశ లేదు, తను బోధిస్తున్నాననీ, సరిదిద్దుతున్నాననీ ఆయనకి స్పృహ లేదు. కాని ఆయన ఎదుటివాడి అంతరంగాన్నే ప్రతిబింబిస్తూ అనే కొద్ది మాటలు, చూపులు చాల నునిశితంగా, అందుకోగలిగితే సహాయంగాను, అంటే therapeuticగా ఉంటాయి. ఎందుకో వివరించి చెప్పాలంటే ఇదివరకు Cognitive Dissonance అన్నదాన్ని గురించి, అలాగే Cognitive Consonanceను గురించీ కొంత చెప్పుకోవాలి. ఏ విషయాన్ని గురించైనా మన పరిజ్ఞానానికి వాస్తవాలు, దృఢ నిశ్చయాలు, నమ్మకాలు, అభిప్రాయాలు, సంశయాలు, అపోహలు వంటి మౌలికమైన పార్శ్వాలుంటాయి. సాంఘిక మనస్తత్వ శాస్త్రం చెప్పేది ఏమంటే మన అహానికి ప్రియమైన విషయాలపైనే మనకి బలమైన, స్థిరమైన అభిప్రాయాలుంటాయి. వాళ్ళు దీన్ని ego involvement అని అన్నారు.
The map of an individual’s attitudes about any given topic is a function of how ego involved that individual is about that topic. When an individual is highly ego involved with a topic, she or he believes that the issue is important, and the person typically holds an intense position. Because the topic is one that has personal significance to the individual, it is considered to be central to their sense of self – hence, she or he is ego-involved.