సంపాదకీయం సాధారణంగా పత్రిక ముందు పుటల్లో కనిపించినా, రాయడం మాత్రం చివర్లో జరుగుతుంది. ఈ‘కబురు’ సిద్ధంచేయడం మొదలు పెట్టిన దగ్గర్నుంచీ, అసలు ఎప్పుడన్నా ఈ పేజీకి చేరుకుంటామా అన్న ప్రశ్న వేధిస్తూనే వుండింది. ఎందుకంటే అందించాల్సిన సమాచారం ఏవిటో ఎంతముందునుంచి తెలిసినా, ఆఖరిక్షణంలోగాని అందించరు అందించవలిసినవాళ్ళు.
ఈ పుస్తకానికి ‘కబురు’ అనే పేరు పెట్టడానికి కారణం, ఈ పుస్తకంలో మన జాతి మేలుకొని వినవలసిన కబురుంది. హెచ్చరిక వుంది. పిలుపుంది. మనని చుట్టుముట్టిన ‘ఎత్తుటెక్కు’ రణగొణ ధ్వనిని చీల్చుకుని, దేశం మహాబలవంతుల జాబితాలోకి చేరిపోతోందనే నినాదాల హోరుని పెకల్చుకొని మనని చేరడానికి ప్రయత్నించే సన్నని మూల్గులున్నాయి.
ఆంధ్రజ్యోతి సౌజన్యంతో జరిపించి ఇందులో ప్రచురించిన పోటీ రచనల్లో ఈ గొంతులే వినబడుతున్నాయి. ఈ పుస్తకంలో దేశంలో మారుతున్న గ్రామీణవాతావరణం గురించిన ప్రస్తావన విస్తృతంగా వుంది. ఒకనాడు సమగ్రంగా వుండిన గ్రామఆర్ధిక, సామాజిక, రాజకీయ వ్యవస్థ విచ్ఛినమౌతున్నతీరు, ఆ స్థానే వేరొక సమగ్రమైన వ్యవస్థ రూపుచెందని అస్తవ్యస్త పరిస్థితుల్లో, దిగజారుతున్న జీవితాలను గురించి కళాత్మకంగానూ, సాధికారికంగానూ వ్రాయడం జరిగింది. ఈ మార్పువల్ల లబ్ధిపొందిన వాళ్ళలో ప్రవాసులూ, వారి బంధుమిత్రపరివారమూ, పాలకవర్గమూ, అధికారవర్గమూ ఇలా అందరూ వెరసి జనాభాలో పై 8-10 శాతం జనం వుండగా, మిగిలినవాళ్ళు ఏదోరూపంలో నష్టపోయినవాళ్ళేవుంటారు. ఎంతోకాలంగా పేదరికపుగీత దిగువన జీవించడం అలవాటైన వాళ్ళను మినహాయించినా, గ్రామాలలో సన్న ,చిన్న,మధ్యకారు వ్యావసాయిక కుటుంబాలలోకూడా ఆర్థికస్తోమత తరిగిందేతప్ప, కొత్తసంపద వాళ్ళ వాకిళ్ళను చేరటంలేదు. కేకు సైజు పెరుగుతోందికాని, స్వల్పశాతం జనాలకే దక్కుతోంది. ఈ క్లిష్టపరిస్థితుల్లో ఇరుక్కున్న వాళ్ళ మూలుగులు వినకపోవడం వల్ల, ‘ఎత్తుటెక్కు’ తో ఎత్తులెక్కెయ్యగలం అనుకోడంవల్ల గత ఎన్నికలలో మెరిసేపార్టీ(India shining)ల వాళ్ళెందరో కళావిహీనమైనముఖాలతో ఇళ్ళుచేరుకున్నారు.
అటువంటి విషయాలను పట్టించుకోవడం ప్రవాసులలో అధికసంఖ్యాకుల లక్షణం కాకపోయినప్పటికీ, ఆ విషయాలను ఎలుగెత్తి చాటడమే వాటిని గురించి ఆలోచించే తరహా ప్రవాసుల గీతంలోని నవసంగీతం. ఒకనాడు, దేశపు అస్వాతంత్య్రాన్ని అంతం చేయడానికి నడుం కట్టుకొని ఉద్యమరంగంలోకి నడిచిన ముఖ్యాతిముఖ్య నాయకుడుకూడా ఒక ప్రవాసి అన్న సంగతి ఇక్కడి ప్రవాసులు పదేపదే మననం చేసుకోవలసిన విషయం.దేశంలోని అవకాశాలను వాడుకొని, తమ సంపత్తిని పెంచుకోవటమే కాకుండా, ప్రజాబాహుళ్యపు బాగోగులకై చేపట్టవలసిన ఉద్యమాలను గూర్చికూడా ఆలోచించడం నవప్రవాసగీతపు ఎత్తుగడ కావాలి.
ఎన్‌ఆరై రచనలపోటీ
ఇక ఇక్కడి రచయితలకోసం ప్రకటించిన పోటీలో, గడువు సమయంలో అందిన రచనలు ఏవీకూడా మేం చెప్పిన నిబంధనల మేరకు వ్రాయబడినవి కావు. ప్రవాసజీవిత అంత:స్రవంతిని దోసిటపట్టే రచనలు కావాలని అడిగితే, రచయితలు ఆ జోలికే పోలేదు. చేయి తిరిగిన వారు, వార్త అందకనో, మరే కారణం వల్లనో ఉలకక, పలకక ఊరుకున్నారు. అందువల్ల ప్రవాసరచనలకు దేనికీ బహుమతులు ఇచ్చే అవకాశం మాకు కలగలేదు. అందుకు విచారిస్తున్నాం.
ఈ పుస్తకంలో రెండు కొత్త అంశాలు చేర్చాము.
- ఇక్కడ పుట్టి, పెరిగిన పిల్లల్లో శాస్త్రీయనృత్యంలో రంగప్రవేశం చేసిన వాళ్ళబొమ్మలను ఒక ఆల్బమ్‌గా తీర్చడం.
- .హైద్రాబాదు నగరంమీద ఒకటి, మరికల్ అనే గ్రామం మీద ఒకటి ఛాయాచిత్రవ్యాసాలు ప్రచురిస్నున్నాం.
తొలుదొల్త స్పృశించిన విషయాలను ఈ రెండిటిద్వారా కంటికి కనిపించేట్టు చెయ్యాలన్నది మా ప్రయత్నం.
ఈ పుస్తకం అంతా ఇక్కడే కూర్చబడింది. ఆ శ్రమలో పాల్గొన్నది శర్మ,పద్మ, వెన్నెల, స్వర్ణ,లక్ష్మి గార్లు. వాళ్ళకి ఎన్నివిధాల కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది.ఇక పోటీ బాధ్యతను నిర్వహించిన ఆంధ్రజ్యోతి వసంతలక్ష్మిగారికి, ఆ బాధ్యతను అంత సహృదయం, కార్యదీక్ష కలిగిన వ్యక్తికి అప్పగించిన ఆంధ్రజ్యోతి సంపాదకులు రామచంద్రమూర్తిగారికి, ఆటావారు గాని, నేను గాని బుణం తీర్చుకోడం కష్టమే!
ఈశతాబ్దంలో తెలుగు సాహిత్యం మనుగడకి ఇంటర్నెట్ లాంటి ఇంటరాక్టివ్ మీడియం వినియోగించుకోవడం తప్పనిసరి అని మా నమ్మకం. అందుకే ఈ సావనీర్‌లోని సృజనసాహిత్యాన్ని, నలుగుర్నీ చేరాల్సిన ఇతరవిషయాల్ని ‘ఈమాట’లో పెట్టడానికి నిర్ణయించాము. తద్వారా, సభలకు రానివారుకూడా ఈ రచనలు చదివి, చర్చించే అవకాశం కలుగుతుంది. ఇప్పట్నుంచి ఇదొక సంప్రదాయంగా మారుతుందని ఆశిస్తున్నాము.ఈ విషయంలో తమ సహకారాన్ని, అనుమతిని అందించిన ‘ఈమాట’ సంపాదక వర్గం వేలూరి వెంకటేశ్వరరావు, కే.వి.ఎస్.రామారావు, సురేష్ కొలిచాల గార్లకు మా బృందం తరఫున కృతజ్ఞతలు. మేం వాడిన ఫాంట్స్‌ని యూనికోడ్‌కి మార్చడంలో సురేష్ పాత్ర ప్రత్యేకించి చెప్పుకోవాలి.
http://ata2006.eemaata.com కు వెళ్ళి ఈ సావనీరు రచనలు చదివి మీ అబిప్రాయాలు తెలియజెయ్యమని కోరుతున్నాము.
— మురళి చందూరి, సంపాదకుడు
ఐ.ఎస్.శర్మ: సహాయ సంపాదకుడు
పద్మ ఇంద్రగంటి: సహాయ సంపాదకురాలు
ఉత్తయ్య: చిత్రకారుడు
స్వర్ణ చందూరి: సహాయకురాలు
లక్ష్మి బుగ్గ : సహాయకురాలు
కబురు: 9వ ఆటా (ATA) మహాసభల ప్రత్యేక సంచిక సంపాదక బృందం