మార్చి 2004

“ఈమాట” పాఠకలోకానికి పునః పునః స్వాగతం!

ఉత్సాహంగా రచనల్ని పంపుతున్న రచయితలు, రచయిత్రులకు ఆహ్వానం. ఇప్పటివరకు పంపని వారికి మరోసారి మళ్ళీ!

“ఈమాట”కు పంపిన ప్రతి రచనను కనీసం ఇద్దరు, సాధారణంగా ముగ్గురు లోతుగా పరిశీలించి వారి అభిప్రాయాల్ని తెలియజేస్తే, వాటిని అనుసరించి సంపాదకులం ప్రచురణార్హతని నిర్ణయిస్తాం. ప్రచురించలేకపోయిన రచనల గురించి సూచనలు, సలహాలు ఇవ్వటం పరిపాటి. అలా జరిగిన రచనల రచయితలు ఇంకా దీక్షగా ప్రయత్నించి బాగా రాసి పంపుతారని, వారు ఇంకా ఇంకా రాస్తూనే వుండాలని దీని ఆంతర్యం. కొరగాని రచనల్ని ప్రచురిస్తే దానివల్ల అన్ని పక్షాల వారికీ నష్టమేనని మనకు దినదినం కనిపించే సత్యమే!

నేను కొద్ది నెలల క్రితం ఒక కోర్టు కేసు గురించిన కథ రాసి ఇక్కడ ప్రచురించాను. ఆ ముద్దాయిల్లో ఒకరి కేసు విచారణ జరగటం, జ్యూరీ ఏకగ్రీవంగా దోషిగా నిర్ణయించటం జరిగాయి. మిగిలిన వారి కేసులు ఇంకా రావలసి వుంది. (ఆ ముద్దాయి “ఈమాట” పాఠకుడు కాదనుకుంటాను, ఒక వింత డిఫెన్స్‌ ను వాడి ఒక్క జ్యూరర్‌ కి కూడ నచ్చజెప్పలేకపోయాడు అది వేరే విషయం). ఈ సందర్భంలో మా పాఠకులకు ఒక విషయం చెప్పాలని వుంది ఇండియా నుంచి వచ్చిన కొత్తలో ఇక్కడి వారు చవటలని, వీళ్ళకు ఏమీ తెలియదని, మనమే మేధావులమని చాలా మంది అనుకుంటారు. దానివల్ల మన తెలివి ముందు వీళ్ళు ఎందుకు చాలరని, అంచేత వాళ్ళ కళ్ళుగప్పటం మనకి నల్లేరు మీద బండి లాటిదని భావిస్తారు. పైగా ఇక్కడి సమాజంతో పరిచయం చాలా తక్కువ కనుక, మనలో మనమే గుడుగుడుకుంచాలాడుకుంటూ ఇదే అమెరికా అని భ్రమిస్తూ చట్టవ్యతిరేక చర్యల్లో పాల్గొనటానికి సందేహించకపోవటం కనిపిస్తుంటుంది. దొరకనంత కాలం ఇలాటి ప్రవర్తన దివ్యంగానే వుంటుంది, దానివల్ల చాలా లాభం కూడ కలగొచ్చు. కాని ఒక విషయం గ్రహించటం వల్ల ఎన్నో బాధలు తప్పుతాయి అదేమిటంటే, ఒకసారి ఏదో చట్ట వ్యతిరేక చర్యతో దొరికితే ఆ తీగతో పాటు డొంకంతా లాగి తీవ్రమైన శిక్షలకు గురిచేసే అవకాశం. ఇక్కడ చట్టం చాలా శక్తివంతమైంది. దాన్తో పోరాటం ఎంతో కష్టం. ఇది గుర్తిస్తే విపరీత పరిణామాల్ని చేజేతులా తెచ్చుకోకుండా ప్రయత్నించొచ్చు.

ఇక ఈ సంచిక విషయానికి వస్తే మళ్ళీ కొన్ని ఆడియోలను అందించిన పరుచూరి శ్రీనివాస్‌ గారికి కృతజ్ఞతలు. ఈసారి కూడ మాచవరం మాధవ్‌ గారు వాటిని డిజిటైజ్‌ చేసి ఇచ్చారు. అద్భుత హిందూస్తానీ గాయకుడు ఉస్తాద్‌ బడేగులాం అలీ ఖాన్‌ గురించి చక్కటి వ్యాసంతో పాటు విలువైన ఛాయాచిత్రాలు కూడ పంపిన కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గారికి కృతజ్ఞతలు.

అలాగే, రచనలు అందించిన వారందరికీ అభినందనలు.

కనకప్రసాద్‌ గత నెలరోజులుగా విదేశాల్లో వున్నందువల్ల “ఇసక” మూడో భాగం వచ్చే సంచికలో వస్తుంది.