బౌద్ధ గురువు ఆచార్య నాగార్జునుడు తెలుగువాడే. బౌద్ధ తర్క పండితుడు దిజ్ఞాగుడు మెదక్ జిల్లా కొండాపురం ప్రాంత వాసి. తెలుగునాట బౌద్ధాన్ని వ్యాపింపజేసిన వారిలో భావివేకుడు, బుద్ధపాలితుడు ఉన్నారు. బుద్ధపాలితుడు మంగళగిరి వాడు. జైనాన్ని వ్యాపింపజేసిన కొండకుంభాచార్యులు పేరు సాధారణంగా వినిపించకపోయినా ఆయన అనంతపురం జిల్లా గుత్తికొండ వాసి. ఆయనను మనం నిర్లక్ష్యం చేస్తే కన్నడిగులు అక్కున చేర్చుకున్నారు.
సాముదాయిక, ఉత్పాదక శ్రమలో అలసట తీర్చుకోవడానికి, శ్రమకు సమానమైన లయతో సహా వెలువడిన వాక్కే తొలి సంగీతం. తొలి సంగీతం ఎలాంటిది అని చెప్పడం కష్టమే కాని ఆ సంగీతశాస్త్రానికి వ్యాఖ్యానం చేసిన తెలుగువాడి ఆచూకీ కనిపెట్టడం కష్టం కాదు. మారాఠ్వాడా లోని దౌలతాబాద్ (దేవగిరి) రాజధానిగా పరిపాలించిన యాదవవంశ రాజు సింహణుని ఆస్థాన విద్వాంసుడు శార్ఞదేవుడు ‘సంగీత రత్నాకరం’ రాశాడు. ఆంధ్రదేశపు వెలమ ప్రభువు సర్వజ్ఞ సింగభూపాలుడూ, విజయ నగర కర్ణాటక సామ్రాజ్య ఆస్థాన విద్వాంసుడైన చతురకల్లి నాథుడు సంగీత రత్నాకరానికి ‘సంగీత సుధ’, ‘కళానిధి’ అనే వ్యాఖ్యానాలు రాశాడు. శార్ఞ్ దేవునికి సమకాలికుడైన జాయప సేనాని ‘నృత్యరత్నావళి’, ‘గీత రత్నావళి’, ‘వాద్య రత్నావళి’ గ్రంథాలను రాసి సంగీత, నాట్యకళలతో పాటు వాద్యాలకు సంబంధించిన తబ్సిళ్ళు కూడా అందించాడు. శ్రీనాథుడిని ఆస్థానకవిగా నియమించిన కొండవీటి రాజు కుమారగిరి వసంత భూపాలుడు ‘వసంత రాజీయం’ పేర భరతుడి నాట్యశాస్త్రానికి వ్యాఖ్య అనదగిన లక్షణ గ్రంథాన్నీ, పెదకోమటి వేమారెడ్డి ‘సంగీత చింతా మణి’ని అందించారు. ఇవన్నీ సంస్కృతంలో ఉన్నా రాసింది తెలుగువారు. ఆళ్వారుల తర్వాత ఆళ్వారులంతటి వాడైన పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు సంకీర్తనా పద్ధతికి ఆద్యుడయ్యాడు. సిద్ధేంద్రయోగి ‘భామాకలాపం’, నారాయణ తీర్థుని ‘కృష్ణలీలా తరంగిణి’ క్షేత్రయ్య పదాలకు దోహదం చేశాయి.
కృష్ణదేవరాయల తర్వాత తంజావూరులో స్వతంత్రులయిన తెలుగునాయక రాజుల హయాం తెలుగు యక్షగానాలకు స్వర్ణయుగం. 1762లో జన్మించిన శ్యామశాస్త్రి, 1767లో పుట్టిన త్యాగరాజు, 1775లో జన్మనెత్తిన ముత్తుస్వామి దీక్షితులు కర్ణాటక సంగీత వాగ్గేయకారుల్లో త్రిమూర్తుల్లాంటివారు. పేరుకే అది కర్ణాటక సంగీతం కాని వస్తుతః తెలుగు సంగీతమే.
తెలుగువాడి నాట్యరీతి అనగానే కూచిపూడి నృత్యమే గుర్తొస్తుంది. కృష్ణాజిల్లా దివి తలూకా కూచిపూడి గ్రామం పేర ఉన్న ఈ నాట్యానికి 1950ల తర్వాత ఎక్కువ ప్రచార, గౌరవాలు దక్కాయి. శాతవాహనుల రాజధాని శ్రీకాకుళానికి (కృష్ణా జిల్లా) కూచిపూడి దాదాపు తొమ్మిది మైళ్ళ దూరంలో ఉంటుంది. క్షేత్రయ్య జన్మస్థలం అయిన మొవ్వకు మూడు కిలోమీటర్లే.
తెలుగు వాఙ్మయం ఆనవాళ్ళు కనిపెట్టడానికి అమూల్యమైన కాలాన్ని వృధా చేసి నన్నయకు అగ్రాసనాధిపత్యాన్ని కట్టబెట్టి పనైపోయిందనిపించారు. తదనంతర ప్రబంధయుగం ఉక్తివైచిత్రిలో ఎంత గొప్పదైనా జనసంస్కృతీ చైతన్యాన్ని తాకకుండానే గిరి గీసుకు కూర్చుంది. ఆ బంధాలన్నీ తెంచుకుని ఇంగ్లీషు చదువుల ప్రభావంతో ఇప్పుడు ఆధునిక సాహిత్యంగా పరిగణిస్తున్న రచనలో ఒక పాయ సమాజాభ్యుదయానికి చేదోడుగా ఉంటే, స్వీయ మానసిక ధోరణులే కవితకు పరమార్థం అనుకున్న భావ కవిత్వ పాయ జనచేతనను పట్టించుకోకుండా ఉండిపోయింది.
కానీ గురజాడ వేసిన బాట ఒక శతాబ్దంలో సాహిత్యాన్ని పురోగమన మార్గం పట్టించింది. భావకవిత్వ ధారను చరిత్ర గర్భంలో నిక్షిప్తం చేసింది. కందుకూరి వీరేశలింగం సంస్కరణోద్యమం, గిడుగు భాషా సంస్కరణోద్యమం ఈ మార్గానికి అదనపు జవసత్వాలు సమకూర్చాయి.
1524లో కృష్ణదేవరాయలతో ఆదిల్ షా తలపడినప్పుడు ప్రపంచచరిత్రలోనే మొట్టమొదటిసారి ఆధునిక ఆయుధాలైన తుపాకులతో యుద్ధం జరిగింది. దీన్ని ‘దోఅబ్ యుద్ధం’ అంటారు. అంటే తుపాకుల వాడకానికి దారి చూపిందీ తెలుగు వారే.
తెలుగునాట వాస్తుకళలో మూడు ప్రధాన స్రవంతులు కనిపిస్తాయి. మొదటిది శాతవాహనుల కాలంలో నిర్మించిన అమరావతి స్థూపం. రెండవ పాయలో ఈ ప్రాంతంలో దండిగా ఉన్న రాయి, సున్నపురాయిని ఉపయోగించి నిర్మించిన వివిధ దేవాలయాలు, కోటలు ఉన్నాయి. వరంగల్‌లోని దేవాలయాలు దీనికి నిదర్శనం. మూడవది హైదరాబాదీ సంప్రదాయం. ఇందులో పర్షియన్ వాస్తుకళ మిళితమై ఉంటుంది. చార్మినార్‌తో పాటు హైదరాబాద్‌లో ఉన్న అనేకానేక రాజభవనాలు ఈ సంప్రదాయానికి తార్కాణంగా నిలుస్తాయి.
వంటకాల విషయంలో తెలుగువారి పేరు చెప్పిన తర్వాతే మరెవరినైనా తలుచుకోవాలి. ఆవకాయ, గోంగూర, పులుసు, పప్పుచారు, బొబ్బట్లు, అరిసెలు మరే సంస్కృతిలో కనిపించవు. తెలుగువారు మసాలా దినుసులు వాడడంలో దిట్టలు. నీరో చక్రవర్తి రోమ్‌ను పరిపాలిస్తున్న కాలంలో ఆంధ్ర ప్రదేశ్ నుంచి మిరపకాయలు విపరీతంగా ఎగుమతయ్యేవి. రోమ్ నగరాన్ని పునర్మిస్తున్న సమయంలో రోమ్ పౌరులు ప్రభుత్వానికి కడుతున్న పన్నుల కన్నా ఆంధ్రప్రదేశ్ నుంచి మిరపకాయలు దిగుమతి చేసుకోవటానికి చెల్లిస్తున్న సొమ్మే ఎక్కువ అని వగచిన నీరో ఆ దిగుమతులను నిషేధించాడు.
కోహినూర్ వజ్రం, హోప్ వజ్రం తెలుగునాట ఉన్న విలువైన ఖనిజ వనరులకు నిదర్శనం. ఆఫ్రికాలోని రోడిషియాలో వజ్రాల గనులు కనిపెట్టేదాకా అంటే 1826 వరకు వజ్రాల వ్యాపారంలో తెలుగువారిదే గుత్తాధితప్యం. నగల తయారీకి వినియోగించే పది విలువైన రాళ్ళలో ఎనిమిది తెలుగునాట దొరికేవే.
బస్తీ అన్న మాటను కోస్తా ప్రాంతంలో పెద్ద పట్టణం అన్న అర్థంలోనూ, తెలంగాణ ప్రాంతంలో వీధి అన్న అర్థంలోనూ వాడతారు. ఈ మాట జైన సంప్రదాయంలోని బసతి (వసతి) నుంచి వచ్చిందే. ‘ఎక్కాలు’ అన్న మాట కూడా జైన ప్రభావం వల్ల తెలుగులో స్థిరపడిరదే. దక్షిణాది వారిలో తెలుగువారు మాత్రమే రోజులో మంచి పనులు చేయడానికి అనువుకాని కాలాన్ని ‘వర్జ్యం’ అంటారు. మిగతా దక్షిణాదివారు రాహు కాలాన్ని పట్టించుకుంటారు. వర్జ్యం కూడా జైన సంప్రదాయానికి చెందిందే. ‘రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టు,’ అనే మాట కూడా జైన రామాయణం ఆధారంగా వచ్చిందే.
ఇతర భాషాపదాలను తన భాషలో ఇముడ్చుకోవడంలో భారతీయ భాషల్లోకెల్లా తెలుగుదే అగ్రస్థానం. తెలుగులో హీబ్రూ పదాలు రెండు వందల దాకా ఉంటాయి. క్రీ.పూ. 722 నుంచే హీబ్రూ మాట్లాడేవారు తెలుగు ప్రజలతో కలిసి జీవించారు. అందుకే ఇజ్రాయిలీ ప్రజల్లాగా తెలుగువారు కూడా తండ్రిని ‘అబ్బ’ అని, తల్లిని ‘అమ్మ’ అని అంటారు. హీబ్రూలాగే తెలుగు ప్రాచీనమైన భాష. క్రీ.పూ. 1500 నాటికే తెలుగుభాషకు లిపి వుంది.
అయితే క్రమంగా తెలుగు సంస్కృతి కొల్లబోతోంది. మహాద్భుత నిర్మాణం అయిన స్వయంభూ దేవాలయం రాయి రాయి విడిపోతే కళ్ళప్పగించి చూస్తున్నాం. తెలుగుభాష మీద, సంస్కృతి మీద మనల్ని ఏలిన పరాయి భాషల పాలకులకు ఉన్నపాటి గౌరవాదరాలు కూడా తెలుగు పాలకుల్లో ఏ కోశానా కనిపించడం లేదు. అయితే ఏదైనా సంస్కృతిని, భాషను పొదివి పట్టుకుని పరిరక్షించుకునేది ప్రజలే. భాషాభిమానం కొరవడకుండా చూసుకుంటే భవిష్యత్తులోనూ తెలుగు మనగలుగు తుంది.