గతమెంతొ ఘనకీర్తి కలవాడా!

(ఈ వ్యాసాలు శ్రీ కలశపూడి శ్రీనివాస రావు గారు ఇటీవలే ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురించారు. ఐతే వీటిలోని విషయం ఎక్కువభాగం ప్రవాసాంధ్రులు ముఖ్యంగా ఉత్తర అమెరికా వాసుల్ని ఉద్దేశించినది. వీటిలో మనం మామూలుగా ఆలోచించని అనేక విషయాల గురించి సాధికారంగా చర్చించారాయన.

మేం వీటిని ఇక్కడ ప్రచురించడంలో ఉద్దేశం ఎంతో ముఖ్యమైన ఈ విషయాల గురించి మా పాఠకులలో ఆలోచనలు కలిగించడం. అందరూ అన్ని విషయాల్లో ఈ అభిప్రాయాల్తో ఏకీభవించక పోవచ్చు. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడానికి మా అహ్వానం. ఇక్కడున్న “పాఠకుల అభిప్రాయాలు” శీర్షికలో మీ ఆలోచనలను పంచుకోవచ్చు.

మిగిలిన విషయాలెలా ఉన్నా కనీసం వీటిని చదవండి. ఆపైన వీటి గురించి ఏమైనా చెయ్యాలా అక్కర్లేదా అనేది మీ ఇష్టం. సంపాదకులు)

“గతమెంతొ ఘనకీర్తి కలవాడా!” అని నాటి కీర్తిని నేడు పాడుకోవడమే నేటి మనకీర్తిలో ముఖ్యభాగంగా కనబడుతుంది. ప్రతీరోజు ” ఇంటర్‌నెట్‌”లో వస్తున్న తెలుగు వెబ్‌ పేజీలలో ముఖ్యంగా మీ దినపత్రిక (“ఉన్నమాట” వంటి విశేష విశ్లేషణ ఉన్న వ్యాసాల కారణంగా) చదువుతాను. “నేటి మన కీర్తి” ఏమిటి అన్న ప్రశ్న భూతద్దంగా చేసుకుని వెతుకుతూ ఉంటాను. భూతద్దం ఎందుకు? ఏడుకోట్ల మంది తెలుగువారిలో లక్షకి ఒక్కరైనా తెలుగువారి కీర్తిపతాకాన్ని ఎగరవేసే లక్షణమైన పని ఒక్కటైనా చేసినట్లయితే మనం భూతద్దాలు వాడనక్కరలేదు. లక్షణమైన పని అంటే ఏమిటి? తనకు తనవారికి శ్రేయస్సు, యశస్సుల కొరకు మాత్రమే కాక, పదిమందికి ఉపయోగపడేది, మానవత్వాన్ని ప్రతిబింబించే పని. అలాంటివి అంత ఎక్కువగా జరగడం లేదు. అక్కడక్కడ, అప్పుడప్పుడు జరుగుతున్నాయి. అందుచేత అవి మిగిలిన నానారకాల విషయాల మధ్య మరుగున పడుతున్నాయి. కాబట్టి వాటిని చూడడానికి భూతద్దాలు వాడాలి. అందుకే కనిపించేది లేశమైనా, వీశెడుగా భావించి ఆనందిస్తాను. లేశమైనా, వీశెడు అని ఎందుకనుకోవాలి? అనుకుని ఎందుకు ఆనందించాలి?

అప్పుడప్పుడు నేను తెలుగునాట తిరిగినప్పుడు నా అంతట నేను చూసి, అనుభవించిన సామాన్యుని జీవితం, మిత్రులు నాతో పంచుకున్న వారి అనుభవాలు, వార్తాపత్రికలు అందించే వర్తమాన చరిత్ర వివరాల వలన తెలుగునాట నేడు తెలుగువాడు లక్షణమైన పనులు చెయ్యడం అతికష్టమైన విషయం అన్నది స్పష్టం. అందుకే అది లేశమైనా వీశెడుగా భావిస్తాను. అంతేకాక, కీర్తి సంపాదించే మార్గం లోనే మనం ఉన్నామని, మిల్లీమీటరు మాత్రమే ముందుకి వెళుతున్నా అది ముందుకి వెళ్ళడమే, ప్రగతేనని ఆనందిస్తాను.

లక్షణమైన పని చెయ్యడం ఎందుకు అంత కష్టం? ఈ ప్రశ్న మీకూ వచ్చిందా? నేడు తెలుగునాట ఉన్న రాజకీయ, ఆర్థిక, మరియు సామాజిక పరిస్థితుల మధ్య బ్రతుకుతున్న తెలుగువాడి దైనందిన జీవితాన్ని ఒక్కసారి పరిశీలించండి. ఉదయం నిద్ర లేచినది మొదలు రాత్రి నిద్రపోయేవరకు, నిద్ర పోయినది మొదలు ఉదయం మేలుకునే వరకు (ఉండీ ఉండని కరెంటు, వచ్చి పోని దోమలు, అవి తెచ్చిచ్చే జబ్బులు, వరల్డ్‌ బేంక్‌ వాళ్ళు మన దారిద్య్రాన్ని మనకి తెలియని లెక్ఖలు కట్టిచ్చే అప్పులు .. మొదలైనవి) ప్రభుత్వం ప్రత్యక్షంగానో పరోక్షంగానో పౌరుల జీవితాలని  నియంత్రిస్తూనే ఉంటుంది. అధికార, అనధికార (రాజకీయ) ప్రభుత్వపు ఏజెంట్లు స్వార్ధ, నిర్దాక్షిణ్య కరచాలనాల సంకెళ్ళలో ఎటూ కదలలేక, కదిలితే ప్రభుత్వపు లాఠీయో, ప్రజానాయకుల ధాటియో నెత్తినపడి, అది అక్కడ ఆగక, ఉగ్రవాదుల బాంబుల కంటే ఖచ్చితంగా నట్టింట పేలుతుందని తెలుసు అందరికీ. అందుకే అధికారం, రాజకీయం, కులం, ధనం, లంచం, చట్టం, అనుబంధం, దురాశ ..) వంటి “లేండ్‌ మైన్ల” మధ్య నిరాయుధులై, నిస్సహాయులుగా ఆచి తూచి మాట్లాడుతూ, చూసిచూసి అడుగులేస్తూ నడుస్తున్న తెలుగుప్రజ చేసే లక్షణమైన పని లేశమైనా వీశెడుగా భావిస్తాను.

అయితే ఈ కష్టనష్టాలు లేని తెలుగువాళ్ళే లేరా? తెలుగువారి బాగుకై తామాడే మాట, తాము చేసే చేత తమ మామూలు జీవితానికి ఎటువంటి ఆటంకం కలిగించకపోగా, ఆపైని నాలుగింతలుగా ఉపయోగపడే అవకాశాన్ని కలిగిన తెలుగువాళ్ళు లేరా? లేకేం ఉన్నారు. తెలుగునాట మాట అటుంచి, విదేశాలలో ఎందరో ప్రవాసాంధ్రులుగా ఉన్నారు. ఉత్తర అమెరికాలో వేలల్లో ఉన్నారు, లక్షమంది కాబోతున్నారు. మరి వీరు ఎవ్వరినీ లెఖ్ఖ చేయక లక్షణమైన పనులు చేయవచ్చుకదా? మరి చేస్తున్నారా?

“అమెరికన్‌ డ్రీమ్‌”కై రాత్రనక, పగలనక చిత్తశుద్ధితో, చిరునవ్వుతో, మేధని పంచి, విజ్ఞానపు దివ్వెలు వెలిగించి, అమెరికా అభివృద్ధికి అనుక్షణం వెచ్చించి పనిచేస్తున్నారు. తమ కలలు నిజం చేసుకుంటున్నారు. ఆ కలలో ఇతరులకి సూదిమొన మోపినంత భాగం కూడా లేదు. అప్పుడప్పుడు డబ్బు లెఖ్ఖలలో తల మున్కలయినప్పుడు, అంతరంగం “వింతమాట” మాటాడినప్పుడు, పేరు వచ్చే డాలరు చెక్కు విరాళంతో దానిని బుజ్జగిస్తారు. లేదా కోటిడాలర్ల కోవిళ్ళకు డబ్బులిస్తారు. పాపప్రక్షాళనం కావించుకుంటారు. ఇది చాలా చాలా మంది చేసేది. అయితే కొంతమంది నిస్వార్థంగా, తమ మనసంతా తెలుగువారి అభివృద్ధికై, లక్షణమైన పనులతో, మేధంతా ఆ పనుల ఆచరణకై వెచ్చిస్తారు.

ఈ రెండు తరగతుల వారిని, వారి మధ్యనున్న వారందరినీ కలుపుకుని “తెలుగు” పేరిట ఉత్తర అమెరికాలో సుమారుగా ప్రతిరాష్ట్రంలో ఒకటి రెండు సంఘాలు ఉన్నాయి. ప్రతీ ఏటా తెలుగు సభలు, మిలియన్‌ డాలర్లకు మించిన ఖర్చుతో జరుగుతాయి. తెలుగు సంస్కృతిని అమెరికాలో నిలబెడుతున్నామని ఇంగ్లీషులో ఉపన్యాసాలు ఇస్తారు, వ్యాసాలు వ్రాస్తారు. తెలుగునాట మరుగుపడిపోతున్న తెలుగువైభవాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నామని గర్విస్తారు. “మా తెలుగుతల్లికి మల్లెపూదండ”తో మొదలుపెట్టి, “గతమెంతొ ఘనకీర్తి కలవాడా!” అనేదాకా పాడుకుంటారు.

ఈ తరహా ఆలోచనలకు ఈవ్యాసం ప్రారంభమే కాని, సమగ్రమైన సమీక్ష కాదు. నాకు కొద్దిగా పరిచయమున్న ప్రవాసాంధ్రుల పరిస్థితులను చూసి వ్రాసినదే కాని ఊహించి వ్రాసినది కాదు. ముందుచూపుతో నిర్భయంగా అడుగువెయ్యడానికి ప్రవాసాంధ్రులకి అవకాశాలు పుష్కలం. అందచేత, లక్షమంది కాబోతూ, లక్షణమైన పనులు చెయ్యాడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్న వీళ్ళు ఎలా ఉన్నారు? తెలుగు కీర్తిపతాకాన్ని ఎగురవేయడానికి చేస్తున్నదేమిటి? ఈ ప్రశ్నలు, వీటి సమాధానాలు “నవ్యాంధ్రదీప్తి”కి దోహదమవుతాయని, ప్రవాసాంధ్రుల “తెలుగు తేజం” తెలుగు వారందరికి ఉత్తేజాన్ని కలిగిస్తుందని ఆశిద్దాం.

పెరుగుతున్న సంఘాలు తరుగుతున్న భాష

తెలుగు సంఘాల పేరులో ముఖ్యమైన పదం, వాటి ఉనికికి మూలం, వాటి సభ్యుల, దాతల, నాయకుల మాతృభాష తెలుగు (1). సుమారు 6,700 ప్రపంచభాషల్లో, మాట్లాడేవారి సంఖ్యాపరంగా 15వ స్థానంలో, భారతీయభాషలలో 3వ స్థానంలో ఉన్న భాష తెలుగు (2).

ఉత్తర అమెరికాలో తెలుగు

1971లో తెలుగు సారస్వత సంస్కృతిక సంఘం ఉత్తర అమెరికాలో ఏర్పడ్డ మొట్టమొదటి తెలుగు సంఘం (శ్రీ చెరుకుపల్లి నెహ్రూ). అప్పటినుండి ఇప్పటిదాకా ఎన్నో సంఘాలు ఏర్పడ్డాయి. అమెరికాలోని ఉద్యోగావకాశాల వలన తెలుగువారి సంఖ్య 100,000 దాటిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరిన్ని తెలుగు సంఘాలు ఏర్పడవచ్చు. ఉత్తర అమెరికాలోని తెలుగు సంఘాల సంఖ్య 100 కావొచ్చు. అటువంటి తెలుగువారు ప్రవాసంలో కూడా తెలుగు కావాలని, సంఘాలు పెట్టుకోవడమే కాకుండా తెలుగు నేర్పే “బడులు” పెట్టుకున్నారు. పత్రికలు మొదలుపెట్టారు. గ్రంధాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 3,000 పుస్తకాలతో నడపబడ్డ తెలుగు సారస్వత సంస్కృతిక సంఘం వారి గ్రంధాలయం వీటిల్లో ముఖ్యమైనది.

గత ముప్ఫై ఏళ్ళలో “తెలుగు భాషా పత్రిక” (శ్రీ పెమ్మరాజు వేణుగోపాల రావు గారి ఆధ్వర్యంలో) నుండి నేటి వరకు చాలా తెలుగు పత్రికలు వచ్చినా “తెలుగుజ్యోతి” (3) (శ్రీ కిడంబి రఘునాథ్‌), తానాపత్రిక (4) (శ్రీ జంపాల చౌదరి), అమెరికాభారతి (5) (శ్రీ చందూరి మురళి) పత్రికలు, వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా ప్రచురణలు (శ్రీ వంగూరి చిట్టెన్‌ రాజు) మరియు ఇంటర్నెట్‌ పత్రిక “ఈమాట” (6) (శ్రీ కె. వి. ఎస్‌. రామారావు) అమెరికాలో తెలుగు వ్రాసేవారికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి.

“క”కార ప్రాస కుదిరింది కదా అని కవిత్వాలు వ్రాసే వారు మాత్రమే కాక, కథలు, సాంప్రదాయకవిత్వం, నాటకాలు, విమర్శలు, అనువాదాలు, కావ్యరచన చేసినవారు (శ్రీయుతులు వేమూరి వేంకటరామనాథం, కృష్ణ దేశికాచారి) కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ మొదటితరం వారికి మాత్రమే పరిమితం. మొదటితరం తెలుగువారు తెలుగు మాట్లాడగలిగినా, రానురాను వారి తెలుగు వాడకం తగ్గుకుంటూ వచ్చింది. వారిపిల్లలు చిన్నప్పుడు తల్లిదండ్రుల ప్రోద్బలం వల్ల మాట్లాడినా పెద్దవారయ్యేసరికి వారి తెలుగు క్షీణించిపోతుంది. అక్కడక్కడ అప్పుడప్పుడు కొద్దిమంది పిల్లలు ఆంధ్రప్రదేశ్‌ వెళ్ళి తెలుగు నేర్చుకుంటున్నారు.

భాష గురించి ఎందుకు ఆలోచించాలి?

భాష ఒకరితో ఒకరు నిత్య అవసరాలని తీర్చుకునేందుకు వాడుకునే పనిముట్టు మాత్రమే కాదు. ఒక జాతి వారి లక్షణాలని, ఆలోచనలని, ఆలోచనా విధానాన్ని, జీవనసరళిని, మేధాసంపత్తిని, ఒక తరం నుండి మరో తరానికి అందించే అతి ముఖ్యమైన మానవ పరిణామ ప్రక్రియ మూలసూత్రం. ఈ దృష్టితో చూసినపుడు భాషకు ఉన్న అతి ముఖ్యమైన విలువని గ్రహించగలం. ఒక భాష మరుగునపడి పోతే, దానితో పాటు ఆభాషలోని సాహిత్యం, ఆ సాహిత్యంతో పాటు ఆ జాతి మేధాసంపత్తి పోయినట్టే. మానవ నిర్లక్ష్యం వల్ల పోయిన భాషల వల్ల జరిగిన నష్టాన్ని లెక్కకట్టడం సాధ్యం కాకపోయినా, రెండు మూడు భాషలు బాగా తెలిసినవారు ఊహించవచ్చు, గ్రహించగలరు.

“వాడుకోండి, లేదా వదులుకోండి!” అన్నది భాషకున్న ఓ ముఖ్య లక్షణం. సుమారు గత 40 ఏళ్ళగా విస్కాన్‌సిన్‌ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో నడపబడుతున్న ఏకైక తెలుగు బోధన (శ్రీ వెల్చేరు నారాయణ రావు) విద్యార్థులు లేని కారణంగా నిలిచిపోయింది. ఇది చాలా శోచనీయమైన విషయం. (సంపాదకీయం, తానా పత్రిక, మే 2001) (7).

భాష ఎలా చనిపోతుంది? యుద్ధాలలో ఓడిపోయిన వారి భాష నిషేధించబడడం, ఒక తెగ మరోతెగని పూర్తిగా అంతం చెయ్యడం, అప్పుడప్పుడు ప్లేగు వంటి జబ్బులు వచ్చి తెగ మొత్తం నాశనమై పోవడం వలన చాలా భాషలు అంతరించాయి. కానీ ప్రస్తుతం భాషలు చనిపోవడానికి ముఖ్యకారణం ఆ భాష మాట్లాడే వారికి ఆ భాష పట్ల ఉన్న నిర్లక్ష్యమే అని భాషా శాస్త్రజ్ఞులు గమనించారు. (8)

అమెరికాలో తెలుగు భాష ఎలా బ్రతుకుతుంది?

ఏ భాష నేర్చుకుంటే సంపాదన అవకాశాలు ఎక్కువ అవుతాయో ఆ భాష చక్కగా, పచ్చగా జీవిస్తుంది. ఇది అందరికి తెలిసినదే. తరతరాలుగా ఋజువైనదే. డబ్బుతో కొనలేనివి కొన్ని ఉన్నట్టే, సంపాదన అవకాశాలు పెంచలేని మాతృభాష వినడం, మాట్లాడడం, చదవడం, వ్రాయడం తెచ్చి ఇచ్చే “ఆనందం” సంపాదన అవకాశాలు పెంచే ఇతరభాష ఇవ్వలేకపోవచ్చు.

ఏ భాషైనా బ్రతకాలంటే ఆ భాష మాట్లాడేవారికి ఆ భాష పట్ల గౌరవం, అభిమానం, ఆ భాషని నిలపాలన్న ఆకాంక్ష ముఖ్యం. అవి ఉన్న తరవాత, పిల్లలకు నేర్పడం అతిముఖ్యం. ఆ భాష నేర్చుకునేందుకు కావలసిన ప్రోత్సాహాన్ని, వాతావరణాన్ని, అవకాశాలని పుస్తకాలు మొదలైన వాటిని, నేర్చుకునే వారికి ఏర్పాటు చెయ్యాలి. ఈ బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులది. సంఘపరంగా ఆలోచిస్తే తెలుగుభాష పచ్చదనం యొక్క నైతిక బాధ్యత తెలుగుభాష పేరిట ఏర్పడ్డ తెలుగు సంఘాలది.

తానా (9), ఆటా (10)ల బాధ్యత ఏమిటి?

“ఈ భాషా, గీషా కల్చర్‌, గిల్చర్‌ ఏవిటి? అదంతా హంబక్‌! మనం అంతా మన ఉద్యోగాలు, డబ్బు, మంచి ఫ్యూచర్‌ కోసం వచ్చాం. దట్సాల్‌! ఏదో సరదాగా నలుగురం కలవడానికి ఏర్పాటు చేసుకున్న ఈ ఎసోసియేషన్‌ మీద ఆ ఐడియల్‌ నాన్‌సెన్సంతా రుద్దకండి” అనే వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? “ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడో ఒకప్పుడు తెలుగు భాష చనిపోయేదేగా, అటువంటి దానిని నిలబెట్టడానికి ఎందుకీ ప్రయత్నాలు?” అంటారా? మన తల్లిదండ్రులు, మనం, మన పిల్లలు కూడా ఎప్పుడో ఒకప్పుడు చనిపోయేవారమేగా! తెలుగు పేరిట సంఘం పెట్టాం. తెలుగు భాషకి ఏ కొద్దిపాటి సేవైనా చేద్దాం అనుకునే వాళ్ళకి చెయ్యడానికి, చేయించడానికి, చేసి అమెరికాలో తెలుగుభాష కొత్తరెమ్మలు వెయ్యడానికి కావలసిన అవకాశాలు కలిగించడానికి చాలా ఉంది.

సూచనలు

1. అట్లాంటాలో జరిగిన “తెలుగు సాహితీ సదస్సు” (1998)లో ప్రతిపాదించబడినది (శ్రీ గవరసాన సత్యనారాయణ). “తెలుగు పీఠం” ఏర్పాటు చేయడం. (11)
2. తెలుగుభాషని రెండోతరం వారు, మాతృభాష కాని వారు సులభంగా నేర్చుకోవడానికి కావలసిన ఆడియో, వీడియో, పుస్తకాలు మొదలైనవాటిని అందరికి అందుబాటులోకి తేవడం.
3. అనువాదాలని ప్రోత్సహించడం ద్వారా తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి అందించడం. (శ్రీ ఆరి సీతారామయ్య)
4. తెలుగు మాట, తెలుగు వ్రాత కంప్యూటర్‌ గుర్తించడానికి కావలసిన ప్రణాళికని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్న నిపుణుల ద్వారా తెలుగు కంప్యూటరీకరణను ప్రోత్సహించడం (శ్రీయుతులు వేమూరి వేంకటేశ్వరరావు, కొచ్చెర్లకోట వెంకట బాపారావు, చోడవరపు ప్రసాదు, …)
5. తెలుగులో ప్రపంచస్థాయి ఉన్న ప్రామాణిక గ్రంథాలను ముందు తరాలకు అందుబాటులో ఉండేలా దాచుకోవలసిన తెలుగు సాహితీ సంపదని కంప్యూటర్‌ కాంపేక్ట్‌ డిస్కులపై ప్రచురించడం. (శ్రీ పిల్లలమర్రి రామకృష్ణ)

మనం మన చేతితో నాటిన “అమెరికా తెలుగు” అనే ఈ మొక్కని చక్కగా పోషించి, పెంచి, పెద్దచేసే బాధ్యత మనందరిది. మనని సభ్యులుగా చేసుకుని “తెలుగుజెండా” ఎగరవేస్తున్న మన తెలుగు సంఘాలది. “తెలుగుదనం” తెలుగుభాష అవసరం లేకుండానే నిలపవచ్చు. దీనికి తెలుగు సంస్కృతి మూలస్థంభం అనుకుంటే మరి అంత ముఖ్యమైన తెలుగు సమ్స్కృతిని తమ తమ సంఘాల ద్వారా తెలుగువారు ఎలా నిలబెట్టుకుంటున్నారో రాబోయే వ్యాసంలో చూద్దాం.

వివరాలకు ఈ క్రింది వెబ్‌పేజీలను చూడండి.

1. http://www.tana.org/memorg.htm
2. http://www.sil.org/ethnologue/top100.html
3. http://www.tfas.net/telugu_jyothi.html
4. http://www.tana .org/patrika.htm
5. http://www.americabharati.org/0101/index.html
6. //eemaata.lekha.org
7. http://groups.yahoo.com/group/telugu_unity/message/1644
8. http://www.ogmios.org
9. http://www.tana.org
10. http://www.atasite.com
11. http://www.tiac.net/users/bisa/telugu_chair/other.html

ప్రవాస శ్రుతిలో తెలుగు సంస్కృతి

భారతదేశంలో వింధ్యపర్వతాలకు దక్షిణంగా సుమారు 3,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో, దాదాపు 30 నదులతో, కనీసం క్రీ.పూ.8,0006,000 సంవత్సరాల నుండి (పురావస్తు పరిశోధనల ఆధారంగా) మానవులు నివసించారు నేటి మన ఆంధ్రప్రదేశ్‌ నేలపై. అందుబాటులో ఉన్న చరిత్ర, సాహిత్యం ఆధారంగా దక్షిణాపథం పేరుతో గుర్తించబడి (క్రీ.పూ. 1500) శాతవాహన రాజ్యస్థాపన (క్రీ.పూ. 300200) వలన ఓ ఆకృతి పొందింది. కనీసం 100 తరాల నిర్దిష్టమైన చరిత్ర, సామాజిక పరిణామ వారసత్వం కలిగి, 1956 నవంబరు 1వ తారీఖున ఓ రాష్ట్రంగా ఏర్పడింది నేటి ఆంధ్రప్రదేశ్‌ (1). బహుజన, బహుముఖ, విస్తృత అభివృద్ధితో సుమారు 3,500 సంవత్సరాలుగా కళకళలాడిన సంస్కృతి నేడు అతితక్కువ చరిత్ర, అంతకన్నా తక్కువ తనదైన సంస్కృతి గల ఉత్తరమెరికా ఖండంలో, ప్రవాసంలో ఎలా ఉంది?

ఉత్తరమెరికాలో తెలుగు సంస్కృతి

కల్చర్‌ అంటే ఏమిటి? పెద్ద సమాసాలు ఉన్న వ్యాసాలు, ఉపన్యాసాలు జోలికి పోకుండా “ఫెలో తెలుగూస్‌”కి అర్థం అయ్యేలా చెప్పాలంటే, కల్చర్‌ మన జీవన విధానం! మనం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేదాకా పనులు చేసే తీరు, ఆలోచించే విధానం, ఆనందించే విలువలు, విషయాలు, రకరకాల సందర్భాలలో తోటివారితో, పొరుగువారితో, ఆంతరంగికులతో, అతిథులతో, కుటుంబసభ్యులతో ప్రవర్తించే విధానం. మన సంగీత, సాహిత్య, వినోద సముదాయం. వీటన్నింటిలో అంతర్లీనమై ఉన్న మానసిక స్థితి కూడా మన సంస్కృతిలో భాగమే.

ఉదయం నిద్ర లేవడం, పరుగుపరుగున పనికి వెళ్ళడం, పని, పని, పని. సాయంత్రం ఇంటికి రావడం. వంట, తిండి, అలసిపోయాననుకోవడం. టీవీ, ఫోనులో సంభాషణలు లేదా కంప్యూటర్‌పై స్టాకులు వగైరా. నిద్ర. వీకెండ్‌లో మరింత డబ్బుకై మరింత పని. డబ్బు, హోదా కొద్ది ఆటలు, పార్టీలు. మనకంటే గొప్ప కల్చర్‌ లేదని స్వంత డబ్బావో, అమెరికాలో అంతా ఆదర్శనీయమే అనే లెక్చర్లో. ఇండియాలోని “డర్ట్‌”, అమెరికాలోని “బెస్ట్‌” లిస్ట్‌ అప్పచెప్పడమో. ఎదుటివారి ఆర్థిక, సామాజిక స్థోమతల అంచనాలు, తెలుగు సంఘాల రాజకీయాల చర్చతో గడుస్తుంది వీకెండ్‌. అర్థరాత్రి నిద్రరాని సమయంలో ఇది “రేట్‌ రేస్‌” అన్న సత్యం కనుక్కున్న తృప్తి. ఉదయం నిద్ర లేచింది మొదలు “అమెరికన్‌ డ్రీమ్‌” పై ఆసక్తి.

కొంతమందికి “కల్చర్‌”పై మోజు. పిల్లలకు డాన్స్‌, సంగీతం నేర్పించడం, స్టేజ్‌ ఎక్కించడం. దానికై తెలుగుసంఘాలలో ఉత్సాహంగా పాల్గోవడం. పోటీలు పడడం. పదవులు పొందడం. వీలుకాకపోతే వెనకనుండి నడిపించడం డబ్బులు దండడం. ప్రోగ్రాములు పెట్టడం. పెద్ద ఎత్తున సభలు జరపడం, అమెరికాలో తెలుగు సంస్కృతి నిలబెడుతున్న నాయకుల జాబితాలో చేరడం, ఫోటోలలోకి దిగడం. ఎంతైనా ఉంది వ్రాయడానికి. ఇంతేకాక, సంస్కృతి అనగానే ఎక్కడిది? ఎవరిది? ఎప్పటిది? అన్న ప్రశ్నలు కూడా వస్తాయి. విజ్ఞులైన పాఠకులు ఈ ప్రశ్నలని వేసుకుంటారని, ఆలోచిస్తారని, ఊహించుకోగలరని ఆశిస్తాను.

ఒకే పాటని, ఎవరి శ్రుతిలో వారు పాడుకునేటట్లే ఉత్తరమెరికాలో ప్రవాసాంధ్రులు “తెలుగు సంస్కృతి” పాటని ప్రవాస శ్రుతిలో పాడుకుంటున్నారు.

తెలుగు సంస్కృతిని ఎలా నిలుపుకుంటున్నారు?

సంక్రాంతి, ఉగాది, సమ్మర్‌ పిక్నిక్‌ (వనభోజనం), దీపావళి, తమ తమ పట్టణాలలో జరుపుకుంటారు. సంగీత, సాహిత్య, నృత్యాలలో ప్రతిభ ఉన్నవారిని వీలైనప్పుడల్లా రప్పిస్తారు మన సంస్కృతిని ప్రోత్సహిస్తున్నామన్న పేరుతో. వీలైన చోట్లకల్లా పంపి తగు స్థాయి కార్యక్రమాలు ఏర్పాటుచేస్తుంటారు. డబ్బు వసూలు చేస్తుంటారు. వాటి లెక్కల వివరాలు, వాటి వల్ల తెలుగు సంస్కృతికి జరిగే ప్రయోజనాల వివరాలు అంతగా అందరికీ తెలియవు.

ఖర్చు ఘనం, ఫలితం ….

జులై మొదటి వారాంతంలో ప్రతీ ఏడూ పెద్ద ఎత్తున ఏదో ఒక పట్టణంలో తెలుగు సభ (తానా ఆటా) కార్యక్రమాలని ఏర్పరుస్తారు. ఈ ఆచారం 1977 తొలి తానా సభలతో మొదలయింది (శ్రీ గుత్తికొండ వీరేంద్రనాథ్‌). ఇటువంటి సభలు ఇప్పటికి 17 జరిగాయి. ప్రస్తుతం 18వది ఫిలడెల్ఫియాలో జరగబోతున్నది (శ్రీ అల్లాడ జనార్దన). సుమారు 900 మంది హాజరైన తొలి తెలుగు సభలు నేడు 10 రెట్లు సంఖ్యతో, ఖర్చు అంకెలలో 200 రెట్లు (సుమారు 1.6 మిలియన్‌ డాలర్లకి) చేరుతున్నది. ఈ సభలకి హాజరయ్యే వారు అందరు చేసే అన్ని ఖర్చుల మొత్తం అంచనా వేస్తే దాదాపు 810 మిలియన్లు చేరుతున్నది. అంటే సుమారు 37.6 47 కోట్ల రూపాయలన్న మాట. ఇంతేకాక అందరూ ఈ సభలకై వెచ్చించే కాలాన్ని లెక్క కడితే అది సుమారు ఒక లక్ష పని గంటలు కావచ్చు. ప్రతీ ఏడాది తెలుగు సంస్కృతి పేరిట ఈ సభలు జరగడం అద్భుతమైన విషయం. తెలుగు జాతి ఆనందించవలసిన విషయం. అయితే దీని ఫలితం ఏమిటి? ఆలోచించండి!

కల్చరల్‌ “క్రౌడ్‌ పుల్లర్స్‌”

ఈ సభలలో జరిగే కల్చరల్‌ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆహ్వానించబడుతున్న వారు మన తెలుగు సంస్కృతికి ఎంతవరకు ప్రతీకలు? “ఏంటి మీరంటుంది? సినిమా స్టార్లు మన కల్చర్‌ కాదనా? ఆళ్ళని పిలవమాకండనా? అట్టా కుదరదు. ఆళ్ళొస్తేనే మనోళ్ళొస్తారు. రాజకీయనాయకుల్ని, సినిమావోళ్ళని పిలవ్వొద్దన్న మా ఫ్రెండొకడు సిన్‌సినాటీ తానాలో ఆళ్ళ చుట్టూ తిరిగాడు తెలుసా! అట్టమీద సినిమాస్టార్ల బొమ్మ లేకపోతే తెలుగు పత్రికలెలా నడవవో, మనకీ అలాగే సినిమావోళ్ళు లేకపోతే మన తానాలు, ఆటాలు నడవవండీ. వాళ్ళు క్రౌడ్‌ పుల్లర్సండి బాబు! క్రౌడ్‌ పుల్లర్స్‌!”. అలా సమర్థించుకుంటూ, అట్టమీద బొమ్మలకై, అవినీతికి పట్టుకొమ్మలైన రాజకీయనాయకులకై ఎగబడే వారి స్థాయికి ఉన్నత విద్యావంతులు, మేధావులు అనిపించుకోబడుతున్న ప్రవాసాంధ్రులని దిగజార్చిన ఘనత తానా, ఆటాల కల్చరల్‌ కమిటీ చైర్‌పెర్సన్లకు వారి కమిటీ సభ్యులకు తప్పకుండా దక్కుతుంది. అలా పుల్‌ చేసిన క్రౌడ్‌తో ఏం చేస్తున్నారు?

ఇంతేకాక, అమెరికాలో వివిధ జాతుల యొక్క సంస్కృతుల పరిచయ ప్రభావాల వలన తెలుగు సంస్కృతిలో మునుపెన్నడు లేనటువంటి రీతిలో రకరకాల ఆచరణలు, ఆలోచనలు జరుగుతుంటాయి. వీటిలో ఏవి ప్రయోగాలు? ఏవి పనికివచ్చేవి? ఏవి భద్రపరుచుకోవలసినవి? ఇంతటి గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకుని మన సంస్కృతిలో లోపాలని సంస్కరించుకుని, తెలుగు సంస్కృతికి అంతర్జాతీయ గౌరవాన్ని కలిగించే బాధ్యత ఈ ప్రవాసాంధ్రులపై ఉందన్న విషయం గ్రహించడం, దానికి తగిన ఆచరణయోగ్యమైన పథకం రూపొందించడం ముఖ్యం. మరి జరుగుతున్నాయా?

తెలుగు హెరిటేజ్‌ (వారసత్వం)

ఒక పదం వినగానే, ఒక భంగిమ చూడగానే, ఒక రాగం తలవగానే కలిగే పులకింత మన సాంస్కృతిక వారసత్వం. అది డబ్బుతో కొనలేనిది. మిషన్లు అందించలేనిది. అటువంటిదానిని, క్రొత్త సంస్కృతుల సంపర్కంలో మెరుగుపెట్టి మరో తరం వారికి అందించవలసిన బాధ్యత తల్లి తండ్రులది. తరవాతి తరాలకి ఎలా అందిస్తాం? ప్రతీ శతాబ్దంలో సంస్కృతి రకరకాల ప్రభావాలకు లోనై సంస్కరించబడుతూ సాహిత్య, జీవన విధానాల్లో ప్రతిబింబించబడుతూ తరువాతి తరాలకు అందజేయబడుతుంది. అమెరికాలో పెరుగుతున్న రెండో తరం పిల్లలకి తెలుగు సంస్కృతి నేర్పడం కష్టం అంటారు. ఎందుకు? ఎందుకంటే, ఇక్కడి పిల్లలపై ప్రతీరోజు ఎన్నో రకాల సంస్కృతుల ప్రభావం పడుతూ ఉంటుంది. వీటిలో తెలుగు సంస్కృతి అందించవలసింది ముఖ్యంగా తల్లీ తండ్రే! వారికి సంస్కృతి పట్ల సరయిన అవగాహన ఉండాలి. ఉన్నదానిని సరియైన పాళ్ళలో పరాయి సంస్కృతుల ప్రభావాలతో పాటు అందించే నేర్పు, ఓర్పు ఉండాలి. వీటితో బాటు తగిన వాతావరణం అవసరం. అటువంటి వాతావరణం అందించడం తెలుగు సంఘాల ముఖ్యోద్దేశంగా చెప్పుకుంటాయి. కానీ గత 30 సంవత్సరాల తెలుగు సంఘాల కృషి తరవాత కూడా 18వ తెలుగు సభలకు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకి మనం ఆంధ్రప్రదేశ్‌ నుండే ఎక్కువమంది కళాకారులని, తదితరులని రప్పించుకుంటున్నామంటే ఇక్కడ జరిగిన మన సాంస్కృతికాభివృద్ధి సంగతేమిటి?

ఈ ప్రశ్నలకి జవాబు చెప్పవలసిన అవసరం, కాలం, వీలు యీ సంఘాల మాజీ, ప్రస్తుత ప్రెశిడెంట్లకు, ఆ పదవి ఆశించే ప్రవాసాంధ్ర తెలుగు సాంస్కృతిక రంగాల లోని నాయకులకు లేకపోవచ్చు. వారికింకా పెద్దపెద్ద పనులుంటాయి. ముఖ్యమైన బాధ్యతలుంటాయి. ఇటు అమెరికాలో అటు ఇండియాలో చక్కబెట్టవలసిన పనులెన్నో ఉంటాయి. కాబట్టి వారికి తీరిక ఉండదు. కానీ కల్చరల్‌ కమిటీ చైర్‌పర్సన్‌ హోదాలో కుర్చీ ఎక్కిన వారి మాటేమిటి? వారి బాధ్యత ఏమిటి?

అటువంటి వారిపై (కల్చరల్‌ కమిటీ చైర్‌ పర్సన్‌) అంత బాధ్యత పెట్టి మనం మన ఇళ్ళలో కాలు మీద కాలేసుకుని, కేజువల్‌గా టీవీ చూసుకుంటుంటే ఈ శ్రుతిలో కాక మరే శ్రుతిలో ఉంటుంది తెలుగు సంస్కృతి?

మానవజాతి విశిష్ట వికాసానికి మూలకారణమైన సంస్కృతి (జాతి జీవన విధానం, సంగీత సాహిత్య కళలు) గతి తప్పుతున్నప్పుడు ప్రభువులు విజ్ఞానవంతుల, విద్వాంసుల, విద్వత్సంపన్నులతో విచారించి తగు చర్యలు తీసుకుని సాంస్కృతిక పరిరక్షణ చేస్తూ వచ్చారు. నేడు ప్రజలే ప్రభువులు.అందుచేత ఆ బాధ్యత మనందరిది. ఇది సరయినది కాదు, ఇది తప్పు అని ఎత్తి చూపించడమే కాకుండా కనీసం కొన్ని సరియైన వాటిని గుర్తించి చూపించడం బాధ్యతగా ప్రవర్తించే వారి లక్షణం. అందుచేత అటువంటి కార్యక్రమాలని, వాటిని జరిపించే శక్తి, ఆసక్తి కలవారిని సూచించడం జరిగింది.

సూచనలు

1. తెలుగుభాష, బట్ట, ఆలోచన, ఆహారం, లాస్యం, విలాసం, వినోదం తెలుగు జీవన విధానం (కల్చర్‌)ని ప్రతిబింబిస్తూ ఒక చక్కనైన Mobile exhibition  ఏర్పాటుచేసి ఉత్తర అమెరికా అంతా చూపించడం. (శ్రీ ఎస్‌. వి. రామారావు)
2. కూచిపూడి నృత్యానికి అమెరికా విద్యాలయాలలో గుర్తింపు కలగడానికి కావలసిన ఏర్పాటు చేయడం. (శ్రీమతి పెనుమర్తి శశికళ)
3. మన వాగ్గేయకారుల సంగీత, సాహిత్య సంపదని తెలుగునాట ఇంటింతా నిలపడాన్ని ప్రోత్సహించడం. (శ్రీ దేవరకొండ శ్రీనివాసరావు)
4. తెలుగువారి చరిత్ర, సంస్కృతి, తెలుగుతనం వివరించే సమగ్రమైన web site ని ఏర్పాటు చేయడం (శ్రీ పగిరి మదనమోహన్‌)
5. తెలుగు సంఘాల సమన్వయ, సహకారాలతో రెండో తరం వారిని, తెలుగుతనం, భారతీయత ద్వారా ప్రపంచ కుటుంబంలో మంచి సంస్కృతి కలవారిగా నిలబడడానికి కావలసిన అవకాశాలు, వాతావరణం కల్పించడం. (శ్రీ కోటపాటి సాంబశివరావు)

ఇవన్నీ ఎందుకండీ? ఏ జాతి బహుముఖంగా బలవంతులై ఉంటారో వారి సంస్కృతి వర్ధిల్లుతుంది, అంటారా? అది నిజమే. మరి తెలుగు జాతి బహుముఖాభివృద్ధికి తానా, ఆటాలు, మిగిలిన సంఘాలు ఏంచేస్తున్నాయో తరువాతి వ్యాసంలో చూద్దాం.

వివరాలకు
1. ఆంధ్రుల చరిత్ర, బి. ఎస్‌. ఎల్‌. హనుమంతరావు (1989).

జన్మభూమికి ప్రవాసుల “శతకోటి” నోటి మాట

కనీసం 250,000 కోట్ల రూపాయల (5.32 బిలియన్‌ డాలర్ల) ఖర్చుతో (1), నిక్కచ్చిగా పనిచేసే ముఖ్యమంత్రితో, ప్రజల “బాగు”కై రాత్రీపగలూ శ్రమించే అన్ని పార్టీల నాయకులతో, ప్రజాసేవకై public service commission ద్వారాఎంపిక కాబడ్డ వేలాది public servants (అధికారులు?)తో విరాజిల్లుతున్న మన రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంది?

ఆర్ధిక, ఆరోగ్య, మరియు సామాజిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని నిపుణులందరి ఆమోదంతో మానవ అభివృద్ధి సూచిక ( Human Development Index )ని తయారుచేశారు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి విభాగం వారు (2). ప్రస్తుకం సూచిక అందుబాటులో ఉన్న భారతదేశం (0.423) లోని 16 రాష్ట్రాలలో 1వ స్థానం కేరళ (0.603), 10వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్‌ (0.400)! (3) అంచనాల ప్రకారం కొన్ని జిల్లాలు అతి వెనకబడ్డ ఆఫ్రికా దేశాలకంటే వెనకబడ్డవిగా ఉన్నాయి.

“ఛా! I cann’t believe it. You don’t like India. CEO-CM is great. Bill Gates likes him, I am proud of my state!”  అని పార్టీలో బీర్‌ తాగుతూనో, బెంజ్‌ కారు ఎక్కి పార్టీకి వెడుతూనో, నన్ను కొట్టిపారెయ్యవచ్చు, కానీ,5,100 కోట్ల రూపాయల (బిలియన్‌ డాలర్లు) అప్పు (4)కై రాష్ట్రం బడ్జెట్‌లో 29.5 శాతం వడ్డీ ఏటా కట్టాలి (5). రాష్ట్రంలో 26,568 గ్రామాలు ఉన్నాయి (6). వాటిల్లో పెరుగుతున్న ధరలతో పాటు పెరగని కూలి, అది పెంచుతున్న అతి గడ్డు బీదరికాన్ని మోస్తున్న కోటిమంది జనం ఉన్నారు. అలాంటి జీవితాన్ని మోయలేని వాళ్ళు, 199798 లో వరంగల్లు, నిజామాబాద్‌లలో ఆత్మహత్యలు చేసుకున్న 400 మందిలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.(7)

“మరీ చెపుతున్నారండీ, మొన్న మేం ఆంధ్రా వెళ్ళినప్పుడు ఎక్కడపడితే అక్కడ ఫారిన్‌కార్లు, ఫైవ్‌స్టార్‌ హోటళ్ళు, సెల్‌ఫోన్లు, డబ్బు పారేస్తే అమెరికాలో దొరికేవన్నీ దొరుకుతున్నాయి. మునపటిలా కాదు. మీరు మరీ దారుణంగా చెపుతున్నారు” అంటారా? నిజమే. ఆంధ్రప్రదేశ్‌ వెళ్ళి మన స్నేహితులు, బంధువుల మధ్య తిరిగే మనం, “దాఋణాంధ్ర” చూడలేని, “దీనజనఘోష” వినలేని దూరంలో ఉంటున్నాం మరి.

ఆంధ్రప్రదేశ్‌ జనాభాలో 15.9%     (1 కోటి 19 లక్షల మంది) బీదవాళ్ళు ఉన్నారని కేంద్రం Lakadawala commission  లెక్కల ప్రకారం అంటుంది. కాదు, ఇంకా ఎక్కువమందే బీదవాళ్ళున్నారు మా రాష్ట్రంలో అని రాష్ట్రప్రభుత్వం అంటుంది (8). దారిద్య్రం తగ్గింది అనడం తెలివి తక్కువ మాట. సంపద పెరిగింది. అసమానత పెరిగింది. గత పదేళ్ళలో ఉన్నవారికి, లేనివారికి మధ్య ఆర్ధిక అసమానత అత్యంతవేగంగా పెరిగింది అంటారు ప్రముఖ తెలుగు పాత్రికేయుడైన శ్రీ పి. సాయినాథ్‌. (7)

అయితే ప్రగతి లేదా? ఎందుకు లేదు, ఉంది. చాలా ఉంది. కానీ ఆర్ధికాభివృద్ధి అతి కొద్ది మందికి మాత్రమే పరిమితమై పోతున్నది. మన శరీరంలో ఏదో ఒక భాగమే మిగిలిన వాటికంటే ఎక్కువగా పెరిగితే దానిని “వాపు” అంటాం. జబ్బుగా గుర్తిస్తాం. వైద్యం ద్వారా నయం చేసుకుంటాం. కానీ పెరుగుదల అని అనం. అలాగే ఆర్ధిక అసమానతలని గుర్తించి, నయం చేసుకొని, రాష్ట్ర ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

“ఆంధ్రప్రడేశ్‌ 2005 నాటికల్లా సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తుంది తెలుసా?” ఉద్దేశం మంచిదే. రాష్ట్రంలో ఉన్న 1.75 కోట్ల మంది 514 వయసున్న బాలబాలికలలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 45 లక్షల మంది ఎటువంటి బడికీ వెళ్ళడం లేదు (9). వీరిని బడికి పంపి కనీసం ఐదేళ్ళు బడిలో చదువుకునేలా చేయాలంటే రాష్ట్రప్రభుత్వం ప్రతీ ఏటా కనీసం 950 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాలి. అందుకే మళ్ళీ ప్రపంచ బేంక్‌ వద్ద ప్రతీ ఏటా 1,000 కోట్లు రూపాయలు కనీసం ఐదేళ్ళ పాటు అప్పు కావాలి (10). అంటే మరో 5,000 కోట్లు రూపాయలు (1.06 బిలియన్‌ డాలర్లు) అప్పు అన్న మాట.

అయితే ఈ రాష్ట్రం ఇంక బాగుపడదా? ఇంక ఆశ లేదా? ఉంది. బాగుపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడిప్పుడే తన లోటుపాట్లని తెలుసుకుంటున్నది. ఒప్పుకుంటున్నది (11). 1956 నుంచి గల ప్రభుత్వ బడ్జెట్‌ వివరాలు అందరికీ తెలిసేలా ఇంటర్‌నెట్‌ పై ఉంచింది (12). ప్రవాసాంధ్రులని ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో భాగస్వాములుగా చేరమని పదేపదే కోరిన ముఖ్యమంత్రి చక్కనైన అవకాశాన్ని కల్పించగలరని అనిపిస్తున్నది.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి గురించి ప్రవాసాంధ్రులు ఎందుకు ఆలోచించాలి?

ఏనేల నుండి అస్తిత్వం పొంది జీవి అయ్యామో, ఏనేల గాలి పీల్చి పెరిగామో, ఏనేలపై ఆటలు ఆడి ఎదిగామో, ఏనేల నేర్పిన పాఠాలే నేటి అర్హతల పునాదులుగా ప్రవాసంలో అతి ప్రతిభావంతమైన జాతి ప్రతినిధులుగా, ప్రజ్ఞావంతులుగా, అభివృద్ధి సోపానాలను ఆదరాబాదరాగా ఎక్కడానికి అవకాశం కల్పించిందో, ఆనేల వైపు ఒక్కసారి చూడండి. తొలకరిలో వర్షపు నీటి బొట్టుకై ఎదురుచూసే బీటలు వారిన పంట నేలలా వేలాది గ్రామాలు నిస్వార్థసేవ చేసే వారికై ఎదురు చూస్తున్నాయి.

అత్యంత ఆధునిక సాంకేతిక ప్రపంచంలో బ్రతుకుతూ దానిని మరింత అభివృద్ధి చేయడానికై ఎన్నో ఉపాయాలు ఆలోచించగల శక్తి ఉన్న మీరు కొద్దికాలాన్ని, కొన్ని ఆలోచనలని ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికై వెచ్చించడంలో చాలా తృప్తి పొందగలరు.

వాదాలకి, వివాదాలకి దూరంగా, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వాతావరణంలో స్వశక్తి మీద బ్రతుకుతూ, అక్రమైన ఆర్జన, అర్హత లేని పదవి వంటి వ్యామోహాలకు లోను కావలసిన అవసరం లేని ప్రవాసాంధ్రులుగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో మీవంతు మీరు చేయవలసిన అవసరం ఎంతో ఉంది.

ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఏవిధంగా సహాయం చెయ్యగలరు?

ప్రపంచంలో ఉన్న ప్రవాసాంధ్రులు అందరూ కలిసి ముందుకు వచ్చి, వారివ్వగలిగినంత ఇచ్చినా అది కావలసిన దానిలో 1%    కూడా కాకపోవచ్చు. అంత డబ్బు ఇవ్వలేకపోయినా ఈసమస్య నుండి బయట పడడానికి ఏదో ఒక ఉపాయం ఉండాలి కదా! శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఉంటాయంటారు. అన్ని ఉపాయాలు కాకపోయినా కొన్నైనా ఇవ్వగలరు కదా, కొంతైనా పని చెయ్యగలరు కదా! సమయానికి చేస్తే, అది అవసరంలో ఉన్నవారికి “శతకోటి”కి సమానం.

ఆంధ్రప్రడేశ్‌లోని సమస్యలు అన్నింటిని పరిష్కరించడానికి చాలినంత డబ్బు ప్రభుత్వం దగ్గర లేదు. మనం ఇవ్వలేం. మరేం చెయ్యాలి? ప్రభుత్వం చాలా డబ్బు జీతాలకి, అధికార యంత్రాంగం నడపడానికి ఖర్చు చేస్తుంది. దానిని ఉన్నట్టుండి తగ్గించలేరు. కానీ ఖర్చు అయ్యే ప్రతి రూపాయికి ఇప్పటికంటే ఎక్కువ ప్రతిఫలం వచ్చేటట్టు చేయవచ్చు. అలాగే అప్పు వినియోగించే పద్ధతులను అధిక ఫలితాలను ఇచ్చేటట్టు, దుబారాని తగ్గించేట్టు చేసే అవకాశం ఉంది. ఈ పని చేయడం సులభం కాదు . ఎందుకంటే ఇది ప్రజలలో జీర్ణించి ఉన్న పనితీరుకి సంబంధించిన విషయం. కానీ ప్రయత్నించాలి. దాని ద్వారా, మనం దారిద్య్రాన్ని, నిరక్షరాస్యతను, వాటివల్ల కలిగే వెనకబడినతనాన్ని తగ్గించవచ్చు. (శ్రీ వేమూరి వేంకట రామనాథం).

ఆర్థిక అసమానత, బీదరికం ఒక్క ఆంధ్రప్రదేశ్‌ సొత్తే కాదు. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈ పరిస్థితిలోనే ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద కొన్ని వేల మంది మానవాభివృద్ధికై కృషి చేస్తున్నారు. వారి వారి ప్రణాళికలలను, ఫలితాలను ప్రతీ ఏటా Global Development Net (GDNET)  (13) పరిశీలించి, అత్యున్నతమైన ప్రణాళికలను గుర్తిస్తారు. 2000 సంవత్సరం నాటికి వచ్చిన ఎన్నో ప్రణాళికలలో మన రాష్ట్రానికి ఉపయోగపడేవి, మీమీ వృత్తిపరమైన అనుభవాలకు దగ్గరగా ఉండేవి, మీకు ఆసక్తి ఉండేవి ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన దానిని తీసుకుని, పరిశీలించి, ఆంధ్రప్రదేశ్‌లో ఆచరణలో పెట్టండి.

అక్షరాస్యత అంటే పిల్లలు బడికి వెళ్ళడమే కాదు. నిజంగా అక్షరాస్యులు కావాలి కూడా. ముంబాయిలో గత కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రథమ్‌ అనే సంస్థ (14) ప్రభుత్వ పాఠశాలలలో ప్రాధమిక విద్యా రంగంలో విశేషమైన కృషి చేస్తున్నది. వారి అనుభవం ప్రకారం ప్రభుత్వం ప్రాధమిక విద్యకై పెట్టే ఖర్చులో 1% ఖర్చుతో మాత్రమే మంచి ఫలితాలను సాధించవచ్చు. ఇందుకుగాను ప్రథమ్‌, GDNET  వారు ఎంపిక చేసిన అత్యుత్తమమైన మూడు ప్రణాళికలలో ఒకదానిగా గుర్తించబడింది. మరి అటువంటి ఆలోచనలను మరిన్నింటిని వివిధ రంగాలలో ప్రవేశపెట్టాలి. ఈపని ప్రవాసాంధ్రులు చెయ్యవచ్చు కదా!

ఐతే, ఇలాటి ప్రణాళికల ఆచరణలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి సిద్ధం ఐ ఉండాలి. ఏ పని చెయ్యాలన్నా ఏ ప్రజల అభివృద్ధికై పనిచేస్తామో ఆ ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆఖరికి ప్రభుత్వ యంత్రాంగం వెయ్యి అడ్డంకులు కలిగిస్తారు. నిజమే, స్వానుభవంతోనే ఒప్పుకుంటాను. కానీ, మీమేధస్సుతో, కృషితో, పట్టుదలతో విదేశంలో ఎన్నో రకాల అడ్డంకుల్నీ, వివక్షతలనీ ఎదుర్కుని వృత్తి, వ్యాపార, సామాజిక, ప్రస్తుతం రాజకీయ రంగంలో కూడా, నిలదొక్కుకుని పదవులు, గౌరవాలు పొందుతున్న మీకు మీనేలపై, మీరు చెయ్యబోయే నిస్వార్థమైన పనులకు వచ్చే అడ్డంకులను, ఇబ్బందులను ఎదుర్కొని పనిచేసే శక్తి ఎందుకు లేదు? ఈ విషయంలో మనలో కొద్దిమంది చాలా అనుభవంతో ఫలితాలు పొందిన వారు ఉన్నారు. వారిని సంప్రదించండి. (శ్రీ వెగేష్న పృధ్విరాజు).

మనందరికీ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఓ వందకోట్ల రూపాయలు ఇవ్వాలన్న ఆశ ఉండవచ్చు. ఇవ్వలేకపోవచ్చు. రాష్ట్రప్రభుత్వం ఏ ఒక్క రంగంలో చూసినా వందల కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తున్నది (1). అనాలోచితమైన ఆచరణ, అలసత్వం, అధికారదుర్వినియోగం, లంచగొండితనం, ప్రజల నిరక్షరాస్యత, అందరి ఉమ్మడి స్వార్థం వలన ఫలితాలు సక్రమంగా లేవు. ఒక ఏడాది మీకు తోచిన రంగంలో, మీకు నచ్చిన చోట ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనండి. వివరాలు అర్థం చేసుకోండి. పరిస్థితులను గమనించండి. సమస్యలను పరిశీలించండి. ఆచరణయోగ్యమైన పరిష్కారాలను అందించండి. సాధించగల గమ్యాలను ఏర్పాటు చేసుకోండి. మీ ప్రయత్నాల వలన మంచి ఫలితాలు నూటికి ఒక్క శాతం ఎక్కువైనా అది కోటి రూపాయలు ఇచ్చినా మీరు సాధించలేని అభివృద్ధికి సమానం కాదా! ఆలోచించండి. మీకున్న ఆదాయంలో కానీ, కాలంలో కానీ కనీసం 3% ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి మీకు తోచిన విధంగా ఖర్చు పెట్టండి. (శ్రీ దామా వెంకయ్య). అతి ముఖ్యమైన రంగాలలో నిశ్చయమైన అభివృద్ధికి ప్రవాసంలో ఉన్న మనం సంఘటితంగా పాల్గోడానికి కావలసిన ప్రణాళిక తయారుచేసుకోవాలి.

సూచనలు

1. ప్రాధమిక విద్య. పలురకాల సంస్థలు, వ్యక్తులు చాలా ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌లో వివిధ విద్యాసంస్థలని స్థాపించడం కానీ సహాయం అందించడం కానీ జరుగుతున్నది. ఈ ప్రయత్నాలు అన్నింటిని సమీకరించి రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొనేటటువంటి ప్రణాళిక కావాలి. (శ్రీ వూరకరణం శ్రీకాంత్‌).

2. ఆరోగ్యం. ప్రవాసంలో ఉన్న తెలుగువారిలో వైద్యులు ముఖ్యులు. కొందరు వారివారి గ్రామాలలో వైద్యసౌకర్యాలు కలిగిస్తున్నారు (ఉదాహరణకు డా. కోమల, సాంబశివరావు, మల్లంపాటి వేములపల్లి, కృష్ణా జిల్లా) కానీ, కనీసపు వైద్యసౌకర్యాలు కూడా అందని ఊర్లు ఎన్నో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్‌లో. డయీరియా, మలేరియా, ఫైలేరియా వంటి నివారించగల జబ్బులతోనే అత్యధిక జనాభా నేటికీ బాధపడుతున్నారు. వీటిని ఎదుర్కోవడం ఎలా? దానికి తగిన పథకం ఏమిటి? ఈ విషయాలలో అనుభవజ్ఞులను సమీకరించి, వారందరూ కలిసి పనిచేసేందుకు వీలైన ఒక పథకం రూపొందించాలి. (డాక్టర్‌ వి. కె. రాజు)

3. ప్రజాస్వామ్య పరిరక్షణ. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పబడే మన దేశంలో పౌరహక్కులు రక్షించుకోవడం ప్రజల అతిపెద్ద కర్తవ్యం. లోక్‌సత్తా (15) మరియు వివిధ సంస్థలు ఎంతో కొంత, ఏదో ఒక తీరులో పనిచేస్తున్నాయి. వాటినన్నింటిని ఒక సామూహిక శక్తిగా తయారుచేసి, ప్రజా ఉద్యమాన్ని ప్రేరేపించే అవకాశం పదవులు ఆశించని ప్రవాసాంధ్రులకు ఉంది. (డాక్టర్‌ జంపాల చౌదరి)

4. గ్రామాభివృద్ధి. మన రాష్ట్ర ప్రగతి గ్రామాల ప్రగతిపై పూర్తిగా ఆధారపడి ఉంది. అందుచేత గ్రామాభివృద్ధి అతిముఖ్యం. సుమారు 40 శాతం గ్రామాలు, అంటే 10,000 గ్రామాలు అతి వెనకబడి ఉన్నాయి. వీటి అభివృద్ధికి ప్రయత్నించడం 10,000  తానా సభ్యుల (16) కుటుంబాలకు పెద్ద కష్టం కాదు. సరియైన అవగాహన, అనుభవం ఉన్న వాళ్ళ సహాయం కావాలి (డా. గుత్తికొండ రవీంద్రనాథ్‌)

ప్రవాస తెలుగు సంఘాలని, వారి సభ్యులని ఉద్దేశించి, వారివారి పని తీరును విశ్లేషించుకోమని సూచించి, ప్రవాసంలో సాంస్కృతిక అవసరాలకు మాత్రమే పరిమితమవక, అర్హతలిచ్చిన నేలను “ఋణాంధ్ర” కాక “స్వర్ణాంధ్ర” కావడానికి తమ తమ పరిధుల్లో పాల్గొనమని ప్రేరేపించడమే ఈ వ్యాసాల ఆశయం. తానా, ఆటా, మిగిలిన సంఘాల ద్వారా సేవ చేసి అనుభవం సంపాదించుకున్న మాజీ నాయకులను, సేవ చేయాలనుకుని పోటీ చేసిన వారిని, గెలిచిన వారిని, సంస్కృతి గురించి సరియైన అవగాహన ఏర్పర్చుకోమని, మాటగా కాక, ప్రయోగాలుగా మాత్రమే కాక, నిజమైన ఆసక్తితో రాష్ట్రాభివృద్ధికి ముఖ్యంగా గ్రామాభివృద్ధికి కృషి చేయమని అభ్యర్ధిస్తున్నాను. పేరు కోసం, స్టాకుల్లో విసిగి విరామం కోసం, ఉబుసుపోక నాయకులు అవుదాం అనుకుంటే సరే. కానీ,
మీరు నిజంగా తెలుగు సంస్కృతి, తెలుగు వారి అభివృద్ధి కోరే తానా, ఆటా, ఇతర తెలుగు సంఘాల నాయకులు కావాలనుకుంటే, ఫోటీలు పడి సేవచేద్దామనుకుంటే, చెయ్యవలస్న పని ఎంతో ఉంది. దానికి పోటీలు లేవు. ఎందరినా చెయ్యగలిగినంత పని ఉంది. రండి. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో పాల్గొనండి. ఈ సంఘాల ప్రెసిడెంట్లుగా పనిచేసి పొందే తృప్తి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ తృప్తిని పొందగలరు. నిజమైన నాయకులవగలరు. అటువంటి పనులు ఇచ్చే ఫలితాల వలన కలిగే తృప్తినా మనసారా పొందమని అనుభవపూర్వకంగా అభ్యర్ధిస్తున్నాను.

(ఈ వ్యాసాలు ఆలోచింపజేయడానికి ఉద్దేశించబడినవి. వీటిలో పేర్కొన్న సంస్థల, వ్యక్తుల సహాయంతో వివిధ రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో పాల్గొనడానికి ప్రవాసులకు గల అవకాశాలను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వ్యాసాలు వ్రాయడానికి సహకరించిన మిత్రులందరికి, ముఖ్యంగా ప్రొఫెసర్‌ వేమూరి వేంకట రామనాధం మరియు డాక్టర్‌ కలశపూడి వసుంధర దేవి కి కృతజ్ఞతలు.)

వివరాలకు

1. http://www.ap.gov.in/apbudget/v06_01.htm
2. http://www.undp.org/hdro
3.http://www.undp.org.in/REPORT/IDF97/ Default.htm
4. “ఈ ఋణాంధ్రం ప్రగతికి చేటు”, వార్త, మే 7, 2001.
5.http://www.the_hindu.com/2001/01/02/stories/13020362.htm
6. http://www.andhrapradesh.com
7. “Is there room for poverty in media?” P. Sainath. http://www.oneworld.org/wacc/twentyfive/sainath.htm
8. http://www.indiaserver.com/thehindu/2000/05/23/stories/05232524.htm
9. “2005 నాటికి సంపూర్ణ అక్షరాస్యతే ప్రభుత్వ ధ్యేయం”, ఆంధ్రభూమి, దినపత్రిక, ఫిబ్రవరి 2, 2001
10. “ప్రాధమిక విద్యకు వెయ్యికోట్లు ప్రపంచబ్యాంకు ఋణం,” ఆంధ్రభూమి, దినపత్రిక, జనవరి 31, 2001
11. “ఈ దుస్థితికి సిగ్గుపడాలి,” ఆంధ్రభూమి, దినపత్రిక, ఫిబ్రవరి 2, 2001
12.http://www.ap.gov.in/apbudget/bas55.htm?D1=1955&Gopbs=Show
13. http://www.gdnet.org/awards-shrtlist2.htm
14. http://www.pratham.org
15. http://www.LOKSATTA.ORG
16. http://www.tana.org


కలశపూడి శ్రీనివాసరావు

రచయిత కలశపూడి శ్రీనివాసరావు గురించి: జననం బొబ్బిలిలో, చదువు రాజా కాలేజి బొబ్బిలి, ఎ వి న్ కాలేజి , విశాఖపట్నం, ఆంద్రా యునివర్సిటీ వాల్తేరు, బయోటెక్నాలజిలో పిహెచ్.డి పేరిస్ యునివర్సిటీ , పేరిస్, ఫ్రాన్స్స్ లో. నివాసం ఫ్లోరల్ పార్క్, న్యూ యార్క్ లో, పనిచేస్తున్నది ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ బయో టెక్నాలజీ లో. ఎందులో ఏముందో తెలుసుకోవడం లో వృత్తి పరంగా, ప్రవృత్తి పరంగా ఉత్సాహం లో భాగమే జీవ శాస్త్ర పరిశోధన , జీవితాన్ని అనువదించే రచన. ...