అక్షరాన్నై ప్రవహిస్తాను

నిజంగానే నేను
సముద్రమై ప్రవహిస్తాను
గొంతెత్తి ఆకాశంలో ప్రకాశిస్తున్న నక్షత్రాల్ని
భూమ్మీదకి ఆహ్వానిస్తాను.
అపురూపమైన సౌగంధాలు వెదజల్లే
పుష్పాలన్నిటిని ఒకచోటికి చేర్చి
నిలువెత్తు నాతెలుగుతల్లి మెడలో అలంకరిస్తాను.

అక్షరం నాకు ఆదర్శం… అక్షరం నా ఆయుధం…
అక్షరమే నా ఆత్మ
పలకరింపులే లేకుంటే ఏమైపోతుంది ఈ ప్రపంచం?
ప్రేమనే కరువయిపోతే కదలలేని అశక్తితో వుండిపోతుంది ఈ ప్రయాణం!
నేను ప్రపంచంకోసం పాడుతాను
నేను శాంతికోసం ప్రతిజ్ఞ చేస్తాను
నేను మానవత్వం కోసం పరితపించిపోతాను

నేను భారతీయుడను… ఆంధ్రుడను… తెలుగువాడిని…
అమ్మపాలతోనే తెలుగు అక్షరాన్ని జీర్ణించుకున్న వాడిని
ఒక నూతనోత్సహ పోరాటశక్తితో
‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ అని బాల్యంనుండే పాడి పాడి
మురిసిపోయిన గాంధర్వగాయకుడను
పచ్చటి పొలానికి పెదవుల్ని అద్ది
కమ్మటి తెలుగుదనానికి నాగుండెని గుచ్చి
గింజని కాపాడుకున్నంత పవిత్రంగానే నేను
నా తెలుగుదనాన్ని కాపాడుకుంటున్నాను.
నా భూమి భారతికి దండం పెట్టి
బ్రతుకును భుజాన్న వేసుకు నడుస్తున్న ప్రతిసారీ
ఎవరు ఏభాషలో పలకరించినా
నా తెలుగు వరమాలను నవ్వుతూ వారి మెడలో వేశాను… వేస్తున్నాను.

మానవ సంబంధాల మీద నమ్మకంతో
విన్నూత్నంగా అక్షరాన్నే వజ్రంగా మార్చి
ప్రాపంచిక దారులన్నీ నూతనంగా మెరుస్తాయనే ఆశతో
అక్షరాన్ని ఆత్మదీపంగా మలచి
కవిత్వధారణ చేస్తూ సంచరిస్తున్నాను.
మానవ అంతర్లోకాలలోకి ప్రవేశించి
అమ్మ తినిపించిన గోరుముద్దల్ని మరువకుండా
అక్షరం నేర్పించిన ఆచార్యుని మీద భక్తితో
మట్టిలో దిద్దిన అక్షరంపై మమకారంతో…
భూమి మీద పుట్టినందుకు పేగుబంధాన్ని
పంచినవాడికీ మొక్కి
తెలుగుదనపు కొమ్మలు విరగకుండా వుండేందుకు
నేను ఒక ధృఢమయిన అక్షర వృక్షపు మొదలై
ఆదికవి నుంచి ఆధునిక కవి వరకు
మొక్కవోని ఆత్మవిశ్వాసంతో నుంచున్న వారి సరసన
తెలుగుతల్లి తోటలో నిలబడ్డాను.

అవును…. మన కిప్పుడొక మానవ పద్యం కావాలి.
నదులు ప్రవహిస్తున్నంత స్వచ్ఛంగా
పసిపాపల చిరునవ్వుల వంటి నిష్కల్మషంగా
ఏ స్వార్ధమూ లేని యోగుల దీక్షాదక్షత లాంటి
మానవ పద్యం కావాలి.
తెలుగుదనపు కమ్మనైన శిఖరాన్ని ఎక్కి
ప్రపంచపు నూతన వాకిలిని తెరవగలిగిన
సరికొత్త తాళం చెవిని సాధించాలి.

ఈ జాతి మనది… జాతి సంపద మనది… తెలుగు మనది.
అందుకే నేను తెలుగుతనపు ఐక్యతంతా
మనగొప్పే అని గర్వంగా చెబుతాను…
అవును… నేను సముద్రమై
అక్షరాన్ని నింపుకొని ప్రవహిస్తాను
అనంత విశ్వంలోకి ప్రసరిస్తాను.