గతమెంతో ఘనకీర్తి – భవితెంతో భవదీప్తి

ఆఫ్రికా, ఈజిప్ట్‌ ప్రాంతాలవారి అద్భుత నిర్మాణ కౌశలం, పర్షియన్ల పాలనా పటిమ, చైనీయుల ఉత్పాదకతా నైపుణ్యం, అరబ్బుల దండయాత్రల సామర్థ్యం, తెలుగువారి సంస్కృతీ ప్రాభవమే మానవజాతి ఇంతవరకు సాధించిన విజయాలకు తార్కాణం. అంటే విశ్వమానవుడి విజయ పరంపరలో తెలుగువారిది అగ్రాసనాధిపత్యమే.

ఒక జాతి చరిత్రకు, సంస్కృతికి మూలాలు వెదకడం సులభం కాదు. స్థూలంగా కొన్ని ఆనవాళ్ళు మాత్రం పట్టుకోగలం. చరిత్ర, సంస్కృతి ఒక పరిణామక్రమం వల్ల అస్తిత్వంలోకి వస్తాయి తప్ప అవి ఎప్పుడు ఎలా ప్రారంభ మయ్యాయో గిరిగీసినట్లు చెప్పలేం. ఏ జాతి చరిత్ర, సంస్కృతి అయినా నదీ ప్రవాహం లాంటిదే. వాగులు, వంకలు, సెలయేర్లు, ఊటలు, జలాలు అనేకం కలిసి ప్రవాహక్రమంలో నదిని విస్తరింపజేసినట్టే భిన్న తెగల, గణాల, సహ జీవనం ఒక జాతిగా రూపొందవచ్చు.

మనకు చరిత్రను పదిలపరిచే అలవాటు తక్కువ. చారిత్రక అంశాలను క్రోడీకరించి జాగ్రత్త చేయడం మీద అంత శ్రద్ధ లేదు. పశ్చిమ దేశాల ప్రభావం వల్ల చరిత్రను గ్రంథస్తం చేసే విధానాన్ని అలవరచుకున్నాం. అయితే చరిత్ర రచనలో పశ్చిమ దేశాల వారి నుంచి మనం అలవరచుకున్నది రాజుల, సామ్రాజ్యాధిపతుల యుద్ధాలు, జయాపజయాల తబ్సీళ్ళు మాత్రమే చరిత్ర అన్న మాయలో పడిపోయాం. ప్రజలే చరిత్ర నిర్మాతలు. కానీ ఈ రకమైన జనజీవన చరిత్ర మనకు చాలా తక్కువ. అంటే సాంఘిక చరిత్ర మీద సురవరం ప్రతాపరెడ్డి, కంభంపాటి సత్యనారాయణ వంటి కొద్దిమందికి మినహా అట్టే ధ్యాస లేదు. దక్షిణభారతదేశంలోని కులాల, తెగల చరిత్రను, సంస్కృతిని, ఆచార వ్యవహారాలను రికార్డు చేసింది కూడా థర్‌స్టన్‌ వంటి పాశ్చాత్యులే. హైదరాబాద్‌ ప్రాంతంలో ఇలాంటి చరిత్రను గ్రంథస్తం చేసిన సిరాజుల్‌హసన్‌ వంటివారు మినహాయింపు మాత్రమే. చిలుకూరి వీరభద్రరావు ఆంధ్రుల సాంఘిక చరిత్రను ప్రత్యేకంగా రాయాలని సంకల్పించారు కాని ఆ లక్ష్యం నెరవేరినట్టు లేదు. రెడ్డి రాజ్యచరిత్రలో మల్లంపల్లి సోమశేఖరశర్మ కొంత క్రోడీకరించారు.

పాల్కురికి సోమనాథుని బసవపురాణం, పండితారాధ్య చరిత్రము, శ్రీనాథుని క్రీడాభిరామము, పల్నాటి వీరచరిత్రము, కొరవి గోపరాజు ద్వాత్రింశత్సాలభంజికలు, కృష్ణదేవరాయల ఆముక్తమాల్యద, తాళ్ళపాక తిరువెంగనాథుని ద్విపద పరమ యోగి విలాసము, సారంగు తమ్మయ్య వైజయంతీ విలాసము, గౌరవ హరిశ్చంద్ర ద్విపద, కదరీపతి శుక సప్తతి, వేమన, చంద్ర శేఖర, కుక్కుటేశ్వర, రామలింగేశ్వర, గువ్వలచెన్న శతకాలు, శ్రీనాథుని చాటువులు కొంతమేరకైనా సాంఘికచరిత్రను ప్రతిబిం బించాయి.

తెలుగు, ఆంధ్రం అన్న పదాలు అటు భాషకూ, ఇటు జాతికీ వర్తింపజేసి వాడుతున్నాం. కనుక భాష ఆధారంగా జాతి మూలాలను కనిపెట్టాలా, జాతి ఆధారంగా భాషాచరిత్రను బేరీజు వేయాలా అన్న సమస్య ఉండనే ఉంటుంది.

జాతిరీత్యా చూసినా, భాషరీత్యా గమనించినా తెలుగు వారిది సుదీర్ఘమైన చరిత్రే. తెలుగువారి సంస్కృతి విస్తృతి ఆంధ్ర ప్రదేశ్‌ భౌగోళిక సరిహద్దులకు పరిమితం చేయలేం. క్రీ.శ. ఒకటో శతాబ్దంలో ప్రపంచ భూగోళశాస్త్రాన్ని అందించిన టాలెమీ జంబూ ద్వీప తూర్పు తీరాన్ని అంతటినీ ఆంధ్ర తీరం అన్నాడు. ఈస్టిండీస్‌ను ఆంధ్రదీవులు అన్నాడు. టాలెమీకి వ్యాఖ్యానం రాసిన జె.ఇ. గెరినీ కావేరి నుంచి కృష్ణ వరకు ఉన్న ప్రాంతాన్ని కళింగ మనీ, మహానది నుంచి బర్మాలోని అరకాన్‌ నది వరకు ఉన్న ప్రాంతాన్ని ఆంధ్రతీరమని అన్నాడు. ఈశాన్య రాష్ట్రాల్లో తైలంగ్‌, తెలంగ్‌ అన్న ఇంటి పేర్లు ఉన్నాయి. మన జానపద కథలన్నీ బ్రహ్మపుత్ర నది దగ్గరే సంగమిస్తాయి. ఈ దృష్టితో చూస్తే కావేరీ నుంచి కృష్ణ వరకు ఉన్న తెలంగాణ, కృష్ణ నుంచి మహానది వరకు ఉన్న కళింగం, మహానది నుంచి బర్మాలోని అరకాన్‌ వరకు ఉన్న ప్రాంతంలో తెలుగు సంస్కృతి విలసిల్లింది.

రాజకీయ విస్తరణను బట్టిచూస్తే తెలుగునేలను ఏలిన శాతవాహనులు గుజరాత్‌లోని బరూచ్‌లో కూడా రాజ్యమేలారు. అసలు వారి రాజధానే మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లాలోని పైఠాన్‌. శాతవాహనుల జాతినామం ఆంధ్ర అన్నమాట నిజమే కాని వారి మాతృభాష తెలుగు కాదు – ప్రాకృతం.

రిడిల్స్‌ ఆఫ్‌ త్రీ ఓషన్స్‌ రాసిన రష్యా పండితుడు అలెగ్జాండర్‌ కోండ్రతోన్‌ భూభౌతిక శాస్త్రరీత్యా అత్యంత ప్రాచీన నాగరికతకు అనువైన స్థలం ఏది అని తర్కించాడు. కడకు అది కృష్ణా-తుంగభద్ర సంగమస్థలమైన నడిగడ్డ సీమ (దోఅబ్‌) అన్నాడు. అదే ఆది శిలాక్షేత్రం. ఆది శిలాక్షేత్రం ఇప్పటికీ మల్లకల్‌లో వుంది. డార్విన్‌ సహచరుడైన అల్డస్‌ హక్ల్సీ కూడా ఆది నాగరికత విలసిల్లింది తుంగభద్ర పరీవాహక ప్రాంతమేనన్నాడు. కాశీ పాండ్యన్‌ వాదన ప్రకారం తెలుగు సంస్కృతి మూలాలు 20-25 వేలఏళ్ళ నుంచి ఉన్నట్టు లెక్క. ఆంధ్రులకు రకరకాల పట్టణాలు ఉండేవని మెగస్తనీసు చెప్పాడు. ఈ పట్టణాలు ఎక్కడ ఉండేవో సరస భూపాలీయంలో చెప్పారు.

నిస్సందేహంగా భారతదేశంలోని అతి ప్రాచీన జాతులలో ఆంధ్రజాతి ఒకటి. మహాభారత, రామాయణాల్లో, పురాణాల్లో బౌద్ధ జాతక కథలలో ఆంధ్రులకు సంబంధించిన గాథలు అనేకం వున్నాయి. కురుక్షేత్ర కదనరంగంలో ఆంధ్రులు, కాళింగులు కౌరవుల పక్షాన పోరాడారు. ఆంధ్రుల ప్రస్థానం సుదీర్ఘమైనది. కొన్ని శతాబ్దాల పాటు గుంపులు గుంపులుగా ఒకచోటి నుంచి మరోచోటికి వెళుతూనే ఉన్నారు. క్రీ.పూ. 700 నాటికి కూడా కొన్ని ఆంధ్రగణాలు యమునా నదీతీరంలో సాళ్వీదేశంలో ఉండేవి. ఆపస్తంబఋషి గాథ దీనికి నిదర్శనం. ఆపస్తంబుని నిర్యాణానంతరం, ఆయన సూత్రాలను పాటిస్తున్న ఆంధ్ర గణాలు వింధ్యపర్వతాలు దాటి దక్షిణాది వచ్చి మిగతా ఆంధ్ర గణాలలో కలిసిపోయాయి. ‘తెనుగు’ అంటే దక్షిణ దిక్కుకు వెళ్ళేవారు అన్న అర్థమూ ఉంది. తెనుగు అంటే తెలుగే కదా! దక్షిణదేశానికి తరలి వచ్చిన ఆంధ్రులలో కొందరు వింధ్య పర్వతాలకు దక్షిణాన, అంటే హైదరాబాద్‌ రాష్ట్ర ఉత్తర సరిహద్దుల్లో స్థిరపడ్డారు. మరికొందరు తూర్పు కనుమల వెంబడి కిందికి దిగి ఒరిస్సా మీదుగా కళింగదేశం చేరుకున్నారు. సెరవణిజ జాతక కథలో ఆంధ్రులు తెల్‌నది తీరాన అంధకపురం నిర్మించినట్టు ఉంది. తెల్‌ నది మహానదికి ఉపనది. దీనినే తెలివాహ అంటారు. మహానది ఒరిస్సాలో ఉంది గనక ఒరిస్సా మీదుగా ఆంధ్రులలో ఒక శాఖవారు కిందికి దిగి వచ్చారు. వీరే కాళింగులు. ఆంధ్రులను, కాళింగులను క్రీ.పూ. 200-250 నాటి జాతక కథలలో ఒకే తెగలోని రెండు శాఖలుగా ప్రస్తావించారు.

దేశవ్యాప్తంగా చూస్తే హిందీ, బెంగాలీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అంటున్న ప్రాంతంలో ఎనిమిది కోట్లకు పైగా జనాభా ఉంటే అందులో తెలుగు మాట్లాడేవారే ఎక్కువ. కాని కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాలలో గణనీయమైన సంఖ్యలో తెలుగువారున్నారు. దేశంలోని మిగతాచోట్ల ఉన్న వారి సంఖ్య కూడా తక్కువ కాదు. ఈ లెక్కన దేశవిదేశాలలోని తెలుగువారిని కలిపితే కనీసం 15 కోట్లమంది దాకా ఉంటారు.

శాతవాహనులు, శకులు, ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్యులు, విజయనగర రాజులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు ఆంధ్ర ప్రాంతాన్ని ఏలారు. వీరిలో ఒక నిర్దిష్ట భౌగోళిక సరిహద్దులో నివసిస్తున్న తెలుగు వారినందరినీ ఏకమొత్తంగా పరిపాలించింది కాకతీయులు మాత్రమే. ఆ తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్‌ అవతరించేదాకా తెలుగువారందరూ ఎన్నడూ ఒకే రాజకీయ చట్రం కింద లేరు.

రాష్ట్రాల పునర్విభజన సమయంలో తెలుగువారు కొన్ని ప్రాంతాలను కోల్పోవాల్సి వచ్చింది. 1936లో ఒరిస్సా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు తెలుగు మాట్లాడే పర్లాకిమిడి, బరంపురం, జయపురం, గుణుపురం మొదలైన ప్రాంతాలను ఒరిస్సాకే వదిలేశారు. దీనికి నిరసనగా ఒరిస్సా రాష్ట్రం అవతరించిన రోజే గిడుగు రామమూర్తి పంతులు శాశ్వతంగా పర్లాకిమిడి వదిలి రాజమండ్రి వచ్చేశారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పుడు కొన్ని తెలుగు ప్రాంతాలు తమిళనాడులో మిగిలి పోయాయి. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ సమయంలో మూడు జిల్లాలు కర్ణాటకకు, మరో మూడు జిల్లాలు మహారాష్ట్రకు దక్కాయి.

ఒకప్పుడు మహానది, నర్మదా నదీ తీరాల నుంచి కావేరి నది దాకా విస్తరించి ఉన్న తెలుగునేల ఇప్పుడు భౌగోళికంగా చాలా కుంచించుకుపోయింది.

సరిహద్దులు కుంచించుకుపోయినా తెలుగుతేజం ఏమాత్రం తగ్గలేదు. తెలుగు సంస్కృతి బౌద్ధ, జైన, వీరశైవ, వైష్ణవ, వైదిక, మొగలాయీ, ఫ్రెంచి, ఆంగ్లేయ సంస్కృతుల ప్రభావానికి లోనైనా తన విశిష్టతను మాత్రం కోల్పోలేదు. ఈ ప్రభావాలన్నీ తెలుగు సంస్కృతిని సుసంపన్నం చేయడానికే ఉపకరించాయి. తెలుగువారు పరుల నీడను సోకనివ్వని తత్వం ఉన్నవారు కారు. ఇతర సంస్కృతుల్లో, జీవన విధానాల్లో ఉన్న మంచిని తమ సంస్కృతిలో అంతర్భాగం చేయడంతోపాటు తమ సంస్కృతీ సౌరభాలను తమతో సంపర్కం ఏర్పరుచుకున్న వారికి ఉదారంగా అందజేసి తమ ప్రాభవాన్ని ప్రదర్శించారు. ఆ రకంగా అనేక సంస్కృతులకు వన్నెలు దిద్దారు. శాతవాహనుల కాలంలోనే పాలకుల చిత్రాలను ముద్రించిన నాణాలను తయారుచేసే వారు. ఈ పద్ధతిని తర్వాత తర్వాత ఇతర రాజ్యాలు అలవరచుకున్నాయి.

బౌద్ధ, జైన మతాల సంస్కృతి తెలుగువారి బౌద్ధిక సంస్కృతితో పాటు భౌతిక సంస్కృతిని సుసంపన్నం చేశాయి.

హనుమకొండలోని పద్మాక్షమ్మ దేవాలయం ఇప్పుడు శక్తి ఆలయం కావచ్చు కాని ఒకప్పుడు అది జైనక్షేత్రం. కాకతీయులు వీరశైవాన్ని అనుసరించిన సమయంలో పద్మాక్షి ఆలయం రూపు మార్చుకుంది. పాలకులు అనుసరించే మతాన్ని బట్టి దేవాలయంలో ఉన్న దేవుడి మతం కూడా మారిపోవడం ఆశ్చర్యకరం కావచ్చు కాని ఆ మార్పు వాస్తవం. సుప్రసిద్ధమైన తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహం మొదల వీరభద్ర విగ్రహమేననీ, దానిని వైష్ణవ విగ్రహంగా మార్చారని కాకతీయుల కాలానికి చెందిన శ్రీపతి పండితులు శ్రీకరభాష్యంలో చెప్పారు. ఈ అంశాన్ని సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్రలో తెలియజేశారు. జైన, శైవ, వైష్ణవ ద్వేషాలే కాకతీయాంధ్ర రాజ్యాల పతనానికి కారణ మయ్యాయని కూడా ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. కాకతీయుల కాలంలో జైన, శైవ, వైష్ణవ మతాలు పరస్పర ప్రాబల్యం కోసం పోరాడినా ఆ మూడు మతాలలోనూ కులభేద నిర్మూలన పురోగామి లక్షణం కలిగిన సామాన్య ధర్మంగా వుండేది.

నీడను బట్టి చిత్రలేఖనానికి మెరుగులు దిద్ది ఏమాత్రం విరూపం చెందడానికి వీలులేకుండా చిత్తరువును గీయవచ్చునని మొట్టమొదట నిరూపించింది తెలుగువాడే. ఒక్క బుద్ధ భగ వానుడి చిత్రాలు, విగ్రహాలు తప్ప మనం నిత్యం కొలిచే ఏ దేవతావిగ్రహాలు అన్నిచోట్లా ఒకేలా ఉండవు. ప్రపంచమంతటా బుద్ధుడి విగ్రహాలు ఒకేలా ఉండడానికి తెలుగు చిత్రకారుడి ప్రతిభే కారణం.

2600 సంవత్సరాల కిందట కృష్ణాతీరంలోని వర్తకులు బీహార్‌లోని రాజగృహకు వెళ్ళారు. వీరిలో ఒక కుర్రవాడు చిత్రకారుడు. ఆ రోజుల్లో బుద్ధుడు తరచూ రాజగృహకు వచ్చేవాడు. గృధ్రకూటం శిఖరం మీద కూర్చుని ప్రకృతిని ఆస్వాదించేవాడు. అప్పుడే కృష్ణాతీరం వర్తకులకు బుద్ధుడి దర్శనం అయింది. ఆ ప్రశాంత, గంభీర బుద్ధునిమూర్తినీ, రాజగృహ ప్రకృతి సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైన యువ చిత్రకారుడు — ‘మీ చిత్రాన్ని గీస్తాను. కాస్త కదలకుండా నిలబడతారా?’ అని అడిగేశాడు. బుద్ధుడిదీ కళాహృదయమే గనుక మౌనంగానే అంగీకరించాడు. యువ చిత్రకారుడు బుద్ధుడిని ఎండలో నిలబెట్టి ఆయనకు అభిముఖంగా తెల్లటిగుడ్డ పట్టాడు. దానిమీద పడ్డ ఆయన నీడకు అండకరేఖలు గీశాడు. కన్ను, ముక్కు రేఖలూ దిద్దాడు. యువకుడి ఉపాయాన్ని, తన రూపచిత్రాన్ని చూస్తున్న బుద్ధుడి కళ్ళు కరుణను వర్షించాయి. పెదవులపై చిరునవ్వు విరిసింది. మనం చూస్తున్న బుద్ధుడి విగ్రహాలు, చిత్రాలు ఆనాటి యువకుడు గీసిన చిత్రం నకళ్ళే. నీడను సిల్‌హౌట్‌ అంటాం.

రెండువేల ఆరువందల సంవత్సరాల నాడే తెలుగు చిత్ర కారుడు నీడకూ, మనిషికీ పోలికున్నట్టు తెలుసుకుని నీడ సాయంతో రూపచిత్ర రచన చేశాడంటే ఆనాటికే కృష్ణాతీరంలో చేతివృత్తుల, సాంకేతిక స్థాయిల్ని అంచనా వెయ్యవచ్చు. అప్పటికీ తెలుగువారి చిత్రకళ బాగా అభివృద్ధి చెంది ఉండవచ్చు. ఆ యువకుడి చిత్రకళాకౌశలం, సాంకేతిక నైపుణ్యం తెలుగువారి సాంస్కృతిక వైభవానికి ప్రతీక.

బౌద్ధ గురువు ఆచార్య నాగార్జునుడు తెలుగువాడే. బౌద్ధ తర్క పండితుడు దిజ్ఞాగుడు మెదక్‌ జిల్లా కొండాపురం ప్రాంత వాసి. తెలుగునాట బౌద్ధాన్ని వ్యాపింపజేసిన వారిలో భావివేకుడు, బుద్ధపాలితుడు ఉన్నారు. బుద్ధపాలితుడు మంగళగిరి వాడు. జైనాన్ని వ్యాపింపజేసిన కొండకుంభాచార్యులు పేరు సాధారణంగా వినిపించకపోయినా ఆయన అనంతపురం జిల్లా గుత్తికొండ వాసి. ఆయనను మనం నిర్లక్ష్యం చేస్తే కన్నడిగులు అక్కున చేర్చుకున్నారు.

సాముదాయిక, ఉత్పాదక శ్రమలో అలసట తీర్చుకోవడానికి, శ్రమకు సమానమైన లయతో సహా వెలువడిన వాక్కే తొలి సంగీతం. తొలి సంగీతం ఎలాంటిది అని చెప్పడం కష్టమే కాని ఆ సంగీతశాస్త్రానికి వ్యాఖ్యానం చేసిన తెలుగువాడి ఆచూకీ కనిపెట్టడం కష్టం కాదు. మారాఠ్వాడా లోని దౌలతాబాద్‌ (దేవగిరి) రాజధానిగా పరిపాలించిన యాదవవంశ రాజు సింహణుని ఆస్థాన విద్వాంసుడు శార్ఞదేవుడు ‘సంగీత రత్నాకరం’ రాశాడు. ఆంధ్రదేశపు వెలమ ప్రభువు సర్వజ్ఞ సింగభూపాలుడూ, విజయ నగర కర్ణాటక సామ్రాజ్య ఆస్థాన విద్వాంసుడైన చతురకల్లి నాథుడు సంగీత రత్నాకరానికి ‘సంగీత సుధ’, ‘కళానిధి’ అనే వ్యాఖ్యానాలు రాశాడు. శార్ఞ్‌ దేవునికి సమకాలికుడైన జాయప సేనాని ‘నృత్యరత్నావళి’, ‘గీత రత్నావళి’, ‘వాద్య రత్నావళి’ గ్రంథాలను రాసి సంగీత, నాట్యకళలతో పాటు వాద్యాలకు సంబంధించిన తబ్సిళ్ళు కూడా అందించాడు. శ్రీనాథుడిని ఆస్థానకవిగా నియమించిన కొండవీటి రాజు కుమారగిరి వసంత భూపాలుడు ‘వసంత రాజీయం’ పేర భరతుడి నాట్యశాస్త్రానికి వ్యాఖ్య అనదగిన లక్షణ గ్రంథాన్నీ, పెదకోమటి వేమారెడ్డి ‘సంగీత చింతా మణి’ని అందించారు. ఇవన్నీ సంస్కృతంలో ఉన్నా రాసింది తెలుగువారు. ఆళ్వారుల తర్వాత ఆళ్వారులంతటి వాడైన పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు సంకీర్తనా పద్ధతికి ఆద్యుడయ్యాడు. సిద్ధేంద్రయోగి ‘భామాకలాపం’, నారాయణ తీర్థుని ‘కృష్ణలీలా తరంగిణి’ క్షేత్రయ్య పదాలకు దోహదం చేశాయి.

కృష్ణదేవరాయల తర్వాత తంజావూరులో స్వతంత్రులయిన తెలుగునాయక రాజుల హయాం తెలుగు యక్షగానాలకు స్వర్ణయుగం. 1762లో జన్మించిన శ్యామశాస్త్రి, 1767లో పుట్టిన త్యాగరాజు, 1775లో జన్మనెత్తిన ముత్తుస్వామి దీక్షితులు కర్ణాటక సంగీత వాగ్గేయకారుల్లో త్రిమూర్తుల్లాంటివారు. పేరుకే అది కర్ణాటక సంగీతం కాని వస్తుతః తెలుగు సంగీతమే.

తెలుగువాడి నాట్యరీతి అనగానే కూచిపూడి నృత్యమే గుర్తొస్తుంది. కృష్ణాజిల్లా దివి తలూకా కూచిపూడి గ్రామం పేర ఉన్న ఈ నాట్యానికి 1950ల తర్వాత ఎక్కువ ప్రచార, గౌరవాలు దక్కాయి. శాతవాహనుల రాజధాని శ్రీకాకుళానికి (కృష్ణా జిల్లా) కూచిపూడి దాదాపు తొమ్మిది మైళ్ళ దూరంలో ఉంటుంది. క్షేత్రయ్య జన్మస్థలం అయిన మొవ్వకు మూడు కిలోమీటర్లే.

తెలుగు వాఙ్మయం ఆనవాళ్ళు కనిపెట్టడానికి అమూల్యమైన కాలాన్ని వృధా చేసి నన్నయకు అగ్రాసనాధిపత్యాన్ని కట్టబెట్టి పనైపోయిందనిపించారు. తదనంతర ప్రబంధయుగం ఉక్తివైచిత్రిలో ఎంత గొప్పదైనా జనసంస్కృతీ చైతన్యాన్ని తాకకుండానే గిరి గీసుకు కూర్చుంది. ఆ బంధాలన్నీ తెంచుకుని ఇంగ్లీషు చదువుల ప్రభావంతో ఇప్పుడు ఆధునిక సాహిత్యంగా పరిగణిస్తున్న రచనలో ఒక పాయ సమాజాభ్యుదయానికి చేదోడుగా ఉంటే, స్వీయ మానసిక ధోరణులే కవితకు పరమార్థం అనుకున్న భావ కవిత్వ పాయ జనచేతనను పట్టించుకోకుండా ఉండిపోయింది.

కానీ గురజాడ వేసిన బాట ఒక శతాబ్దంలో సాహిత్యాన్ని పురోగమన మార్గం పట్టించింది. భావకవిత్వ ధారను చరిత్ర గర్భంలో నిక్షిప్తం చేసింది. కందుకూరి వీరేశలింగం సంస్కరణోద్యమం, గిడుగు భాషా సంస్కరణోద్యమం ఈ మార్గానికి అదనపు జవసత్వాలు సమకూర్చాయి.

1524లో కృష్ణదేవరాయలతో ఆదిల్‌ షా తలపడినప్పుడు ప్రపంచచరిత్రలోనే మొట్టమొదటిసారి ఆధునిక ఆయుధాలైన తుపాకులతో యుద్ధం జరిగింది. దీన్ని ‘దోఅబ్‌ యుద్ధం’ అంటారు. అంటే తుపాకుల వాడకానికి దారి చూపిందీ తెలుగు వారే.

తెలుగునాట వాస్తుకళలో మూడు ప్రధాన స్రవంతులు కనిపిస్తాయి. మొదటిది శాతవాహనుల కాలంలో నిర్మించిన అమరావతి స్థూపం. రెండవ పాయలో ఈ ప్రాంతంలో దండిగా ఉన్న రాయి, సున్నపురాయిని ఉపయోగించి నిర్మించిన వివిధ దేవాలయాలు, కోటలు ఉన్నాయి. వరంగల్‌లోని దేవాలయాలు దీనికి నిదర్శనం. మూడవది హైదరాబాదీ సంప్రదాయం. ఇందులో పర్షియన్‌ వాస్తుకళ మిళితమై ఉంటుంది. చార్మినార్‌తో పాటు హైదరాబాద్‌లో ఉన్న అనేకానేక రాజభవనాలు ఈ సంప్రదాయానికి తార్కాణంగా నిలుస్తాయి.

వంటకాల విషయంలో తెలుగువారి పేరు చెప్పిన తర్వాతే మరెవరినైనా తలుచుకోవాలి. ఆవకాయ, గోంగూర, పులుసు, పప్పుచారు, బొబ్బట్లు, అరిసెలు మరే సంస్కృతిలో కనిపించవు. తెలుగువారు మసాలా దినుసులు వాడడంలో దిట్టలు. నీరో చక్రవర్తి రోమ్‌ను పరిపాలిస్తున్న కాలంలో ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి మిరపకాయలు విపరీతంగా ఎగుమతయ్యేవి. రోమ్‌ నగరాన్ని పునర్మిస్తున్న సమయంలో రోమ్‌ పౌరులు ప్రభుత్వానికి కడుతున్న పన్నుల కన్నా ఆంధ్రప్రదేశ్‌ నుంచి మిరపకాయలు దిగుమతి చేసుకోవటానికి చెల్లిస్తున్న సొమ్మే ఎక్కువ అని వగచిన నీరో ఆ దిగుమతులను నిషేధించాడు.

కోహినూర్‌ వజ్రం, హోప్‌ వజ్రం తెలుగునాట ఉన్న విలువైన ఖనిజ వనరులకు నిదర్శనం. ఆఫ్రికాలోని రోడిషియాలో వజ్రాల గనులు కనిపెట్టేదాకా అంటే 1826 వరకు వజ్రాల వ్యాపారంలో తెలుగువారిదే గుత్తాధితప్యం. నగల తయారీకి వినియోగించే పది విలువైన రాళ్ళలో ఎనిమిది తెలుగునాట దొరికేవే.

బస్తీ అన్న మాటను కోస్తా ప్రాంతంలో పెద్ద పట్టణం అన్న అర్థంలోనూ, తెలంగాణ ప్రాంతంలో వీధి అన్న అర్థంలోనూ వాడతారు. ఈ మాట జైన సంప్రదాయంలోని బసతి (వసతి) నుంచి వచ్చిందే. ‘ఎక్కాలు’ అన్న మాట కూడా జైన ప్రభావం వల్ల తెలుగులో స్థిరపడిరదే. దక్షిణాది వారిలో తెలుగువారు మాత్రమే రోజులో మంచి పనులు చేయడానికి అనువుకాని కాలాన్ని ‘వర్జ్యం’ అంటారు. మిగతా దక్షిణాదివారు రాహు కాలాన్ని పట్టించుకుంటారు. వర్జ్యం కూడా జైన సంప్రదాయానికి చెందిందే. ‘రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టు,’ అనే మాట కూడా జైన రామాయణం ఆధారంగా వచ్చిందే.

ఇతర భాషాపదాలను తన భాషలో ఇముడ్చుకోవడంలో భారతీయ భాషల్లోకెల్లా తెలుగుదే అగ్రస్థానం. తెలుగులో హీబ్రూ పదాలు రెండు వందల దాకా ఉంటాయి. క్రీ.పూ. 722 నుంచే హీబ్రూ మాట్లాడేవారు తెలుగు ప్రజలతో కలిసి జీవించారు. అందుకే ఇజ్రాయిలీ ప్రజల్లాగా తెలుగువారు కూడా తండ్రిని ‘అబ్బ’ అని, తల్లిని ‘అమ్మ’ అని అంటారు. హీబ్రూలాగే తెలుగు ప్రాచీనమైన భాష. క్రీ.పూ. 1500 నాటికే తెలుగుభాషకు లిపి వుంది.

అయితే క్రమంగా తెలుగు సంస్కృతి కొల్లబోతోంది. మహాద్భుత నిర్మాణం అయిన స్వయంభూ దేవాలయం రాయి రాయి విడిపోతే కళ్ళప్పగించి చూస్తున్నాం. తెలుగుభాష మీద, సంస్కృతి మీద మనల్ని ఏలిన పరాయి భాషల పాలకులకు ఉన్నపాటి గౌరవాదరాలు కూడా తెలుగు పాలకుల్లో ఏ కోశానా కనిపించడం లేదు. అయితే ఏదైనా సంస్కృతిని, భాషను పొదివి పట్టుకుని పరిరక్షించుకునేది ప్రజలే. భాషాభిమానం కొరవడకుండా చూసుకుంటే భవిష్యత్తులోనూ తెలుగు మనగలుగు తుంది.