ఆంధ్రసాహిత్యములో గల అఖండపాండితీమండితము, అత్యంతకఠినమైన గ్రంథములలో ప్రథమగణ్యమైనది మా పాలమూరు జిల్లాలో వర్ధిల్లిన జటప్రోలు (కొల్లాపురం) సంస్థానమున కధీశుడైన శ్రీ సురభి మాధవరాయలవారి చంద్రికాపరిణయ మహాప్రబంధము. కవిత్వములోను, శ్లేషలోను ఇది రామరాజభూషణుని వసుచరిత్రమునకు ప్రతిబింబమువలె ఉంటుంది. కాని ఇందులో వ్యాకరణసాధ్యమైన విచిత్రపదప్రయోగములు తఱచుగా నుండుటచే దీని శైలి వసుచరిత్రమునకంటె కఠినమై పండితులకు కూడ దుర్భేద్యముగా నున్నది. మాధవరాయలు 16వ శతాబ్దిలో జటప్రోలు సంస్థానము నేలిన సర్వజ్ఞ సింగభూపాలుని వంశీకుడు. ఇట్లితడు రామరాజభూషణునకు సమకాలికు డగుచున్నాడు. నేను 15 నెలల క్రిందట ఈ మహా కావ్యాన్ని చదువుకొన సంకల్పించితిని. ఈ గ్రంథ మిప్పుడు ముద్రణలో లేకపోవుటచే, దీనిని పోతనలిపిలో వ్రాసికొని చదువుకొన్నచో విషయమును జాగ్రత్తగా చదువుకొన్నట్లగునను తలంపుతో దీనిని పూర్తిగా పునర్లిఖించి అందరికిని అందుబాటులో నుంచుటకై ఈమాట గ్రంథాలయములో చేర్చుతున్నాను.
ఈగ్రంథానికి వ్యాఖ్యానం వ్యాఖ్యానము వ్రాసినది కొల్లాపురసంస్థానపండితులైన బ్రహ్మశ్రీ వెల్లాల సదాశివశాస్త్రి, అవధానం శేషశాస్త్రులవారు. ఉద్దండపండితులైన వారి వ్యాఖ్యానంతో గూడిన చంద్రికాపరిణయం 1904లో అచ్చై, మరల 1928లో పునర్ముద్రణ పొందింది. కేశవపంతుల నరసింహశాస్త్రిగారు వారు 1982లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురించిన వ్యాఖ్యానరహిత మూలప్రతికి సంపాదకులుగా వర్తించి, ఆప్రతికి తమ ఉపోద్ఘాతమును వ్రాసినారు. ఈరెండవప్రతిని తెలుగు యూనివర్శిటీవారు శ్రీరంగాచార్యులవారి ఉపోద్ఘాతంతో యథాతథంగా ఫోటోకాపీ ముద్రణ చేసినారు. కాని అదియు ఇప్పుడు దొరుకుట లేదు. నేను గ్రహించిన విషయం ఈరెండుప్రతులనుండే. కేశవపంతులవారి యొక్కయు, శ్రీరంగాచార్యులయొక్కయు ఉపోద్ఘాతములను కూడ ఇందులో చేర్చినాను.– తిరుమల కృష్ణదేశికాచారి.