గ్లాస్ నోస్త్

ఇప్పుడు తెర తీసేశారు
ఇక యే దాపరికమూ లేదు !
ఈ రహస్యం
ఇంత వికృతంగా ఉంటుందని
నేననుకోలేదు.
నేనిన్నాళ్ళూ కొలిచిన వేలుపు
అసలు రూపం ఇదని
నేనూహించను కూడా లేదు.

కట్టువిప్పినపుడు మళ్ళీ
గాయమే ఎదురైనట్టుగా ఉంది.
చికిత్స కోసం చేసిన కోత
సంవత్సరాలు గడిచినా
మాననట్టుగా ఉంది.

పరదా వెనుక దాచింది
పసిమి అందంకాదు,
భయంకరమైన పాత కధనని,
సమాధుల్లో అడుగడుగునా
సత్యమే పాతిపెట్టబడిందని,
ఒకనాడిలా ఒప్పుకుంటారని
నేననుకోలేదు.

అసలీ ఒప్పుకోళ్ళతో,
ఈ అనంత విషాద వృత్తాంతాలతో
ఒక ప్రదర్శన
ఇలా మొదలౌతుందని నేనూహించలేదు.

ఇప్పుడు తెర తీసేసారు
ఇకయే ఆలస్యమూ లేదు.
దీనిని కాదు, కూడదనే
అవకాశమూ లేదు.