” అమ్మా ! కళ్ళు మండుతున్నాయే !”
” ఏం చెయ్యనురా, తండ్రీ,
ఎక్కడ దాచను నిన్ను !
గదిలో, వాకిట్లో,
ఊరిలో, వాడలో,
ఎక్కడా దారిలేదు;
ఏ మాత్రం ఆశలేదు.
ఇక్కడ రక్షించే వాళ్ళు,
రక్షింపబడే వాళ్ళు లేరు.
ఓదార్చేవాళ్ళు, ఓదార్చబడేవాళ్ళు లేరు.
అంతా ఒక్కటే !
నీ కాళ్ళే నీకు ప్రాణభిక్ష పెట్టాలి.
నీ కాళ్ళే నీ కళ్ళకోసం ఏడవాలి.
ఎక్కడికని పరిగెత్తనురా,
నిన్ను తీసుకుని !
పరిగెత్తనిది ప్రాణం లేదు;
పసితనానికి, ముసలితనానికి
మరి బతికే హక్కులేదు.
నువ్వూ, నేనూ చచ్చిపోయినా,
నా తండ్రీ,
మనల్ని కప్పెట్టేందుకు కూడా
ఇక్కడెవరూ మిగలరు !
ఇది నగరం కాదు, అడవి.
ఇక్కడ నాగరికత లేదు.
పీల్చేగాలికూడా చివరికి మోసం చేస్తే,
తప్పించుకోవడం మన తరమా !
చెల్లా చెదురైపోతాం తప్ప
చెల్లలేంరా తండ్రీ, ఈ తొక్కిసలాటలో.
ఫ్యాక్టరీ అకాలంగా మోత పెడుతోంది.
సైరన్ తీతువులా కూత పెడుతోంది.
ఎక్కడికని పరిగెత్తనురా, నిన్ను తీసుకుని ! “