నిన్నటి కల

మళ్ళీ అప్పుడే నిద్ర వద్దు;

నిన్నటి కల ఇంకా పచ్చిగానే ఉంది.

కళ్ళల్లో గాలిదుమారం లేపుతూ,

ఎర్రటి ధూళిని రేపుతూ వస్తుంది నిద్ర.

రెప్పల తలుపులు టప టప కొట్టుకుని

ఒక్కసారిగా మూతపడతాయి.

ఎప్పుడో విరిగిన జ్ఞాపకాల దుంగల్ని

తెప్పల్లా మోసుకొంటూ,

వరదై వస్తుంది కల.

నిన్నటి నిద్రలో నేను

నిరాశ్రయుడి నయ్యాను.

నిన్నటి వరదలో

ప్రాణ భయంతో విలవిల్లాడాను.

మళ్ళీ అప్పుడే నిద్ర వద్దు

నిన్నటి ఆ కల ఇంకా పచ్చిగానే ఉంది.

కనిపించని గాయం కల

వచ్చేపోయే నిద్ర ఎప్పుడో చేసి వెళ్ళిపోతుంది.

ఊహల, భయాల

మృత్యు రహస్యం కల.

మరణించిన మిత్రునిలా

వేల భంగిమలలో కనిపించి,

అంతులేని ఆలోచనల మధ్య

తళుక్కుమని మెరిసేది కల.

నిన్నటి కల

ఇంకా పచ్చిగానే ఉంది.