పొగలో దోబూచులాడే కొండలే
ఈ ఊరికి అండగా నిలుస్తాయి.
దట్టమైన వృక్ష కవచాలతో
నలు దిక్కులా సైనికుల్లా కాపలా కాస్తాయి.
పట్టు చీర కట్టుకున్న దేవ కన్యలై
పర్యాటకుల్ని సమ్మోహ పరుస్తాయి.ఏవో ప్రాచీన స్మృతులతో నిత్యం ధ్యానంలో మునిగినా,
ఊరు కొత్త మెరుగులు దిద్దుకుని జన సంద్రం కావటానికి
తమ భుజాల్ని ఆసరాగా ఇస్తాయి.ఉన్నవన్నీ విడిచి రమ్మనే అడవి,
లేనివి కూడా అనుభవించమని పిలిచే ఊరు
ఆశ్చర్యంగా ఇక్కడ సహజీవనం చేస్తాయి.అలవికాని తళుకు బెళుకులతో,
అర్థరాత్రి దాకా ఆనందాన్ని వెతుకుతూ తిరిగే మనుషులతో
సతమతమయ్యే ఊరిని చూసి
ఆకుల రంగులే ఆభరణాలుగా ధరించిన అడవి
చిన్నగా నవ్వుకుంటుంది.అడవిలో కాసిన వెన్నెల
అద్భుతంగా పండుతుంది.
ఊరి మీద పడిన వెన్నెలే వృధా అయిపోతుంది.వినోదాలను పంచే తలుపులన్నీ మూతపడ్డాక
తలపులతో అలసిన ఊరు
కలత నిదురలోకి జారే తెల్లారివేళలో
అడవి నిద్ర లేస్తుంది.
తొలి మంచు బిందువులలో తడిసిన
ముంగురులను సరిచేసుకుని
నుదుట సూర్య తిలకం దిద్దుతుంది.