ఆఫీసుకు వెళ్ళేసరికి నా టేబుల్ మీద ఒక కవరుంది.
రిటైర్మెంట్ పార్టీకి నన్ను ముఖ్య అతిథిగా పిలుస్తూ ఆహ్వానం. కవరులోనుంచి ఇన్విటేషన్ బయటకు తీసాను. పేరు వీధుల సుబ్బరామయ్య. సూపరింటిండెంటు గా చేస్తూ, వాలంటరీగా రిటైరౌతున్నారు. ఫోటో చూస్తుంటే, అతడిని ఎక్కడో చూసినట్లు, చాలా బాగా పరిచయమున్నట్లు అనిపించింది.
నేను ఈ మధ్యనే జాయింట్ కలక్టరుగా ఈ ఊరొచ్చాను. ఇలాంటి పార్టీల కెళ్ళేటప్పుడు, రిటైరయ్యే వాళ్ళ గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటే, సభలో నాలుగు ముక్కలు మాట్లాడొచ్చు. పీయేని పిలిచి, ఆహ్వాన పత్రం చూపిస్తూ, “పార్టీ ఈ రోజు సాయంత్రమే. వీరి గురించి కొన్ని వివరాలు కావాలి. ఎప్పుడు సర్వీసులో చేరాడు? ఏఏ పొజిషన్లలో చేసాడు? ఏమైన చెప్పడానికి మంచి పనులేమైనా చేశాడా లాంటివి” అన్నాను.
“ఆయన్ని ఆఫీసులో అందరూ వీయస్సార్ అని పిలుస్తారు. డెబ్భై ఎనిమిదిలో అదే ఆఫీసులో ఎల్‌డీసీ గా చేరారు. వెల్‌ఫేర్ హాస్టళ్ళ సెక్షన్‌లో ఎనభై ఏడు వరకు…”
పీయే చెపేది వింటూ, ఆహ్వాన పత్రం మీది ఫోటోను మరో సారి పరిశీలనగా చూస్తూ “అంటే ఎనభై ఒకటిలో ఇక్కడ వెల్‌ఫేర్ ఆఫీసులో స్కాలర్‌షిప్పుల విభాగంలో ఉండేవారా?!” అడిగాను.
ఇతణ్ణి ఇంతకు ముందు చూసాను. చాలా యేళ్ళ క్రితం. ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు చూశాను?!
“అవునండీ. ఇన్నేళ్ళ సర్వీసులో ఈయన మీద పెద్దగా కంప్లైంట్లేవీ లేవు. ఎనభై అయిదు తర్వాత ఇక్కడనుంచీ బదిలీ అయి, మళ్ళీ రెండేళ్ళ క్రితమే ప్రమోషన్ మీద ఇక్కడకు వచ్చారు”
అతడిని అంతకు ముందు ఎక్కడ చూసానో గుర్తొస్తోంది! సాయంత్రం సన్మాన సభలో నేను చేయ బోయే ప్రసంగానికి పీయ్యే సహాయం అంతగా అవసరం లేదు.
పాతికేళ్ళ క్రితం నేను చదువుకునే రోజుల్లో, నా స్కాలర్‌షిప్ పని మీద కలుసుకున్న వీయస్సార్, ఈ వీధుల సుబ్బరామయ్యా ఒక్కరే!
ఆ రోజుల్లో మా ఊళ్ళో కాలేజీ లేదు. పదో తరగతి తర్వాత చదవాలంటే పొరుగూరు వెళ్ళాల్సిందే.
బయట రూము తీసుకుని వుండి, చదువు కొనే స్తోమత లేదు. స్కాలర్‌షిప్ కోసం హాస్టల్లో ఉండడం తప్పనిసరి.
ప్రతి నెలా అయిదో తేదీకల్లా ఇంటి దగ్గర నుంచీ మనీయార్డరొచ్చేది. దాంతో హాస్టలు బిల్లు కట్టేసే వాణ్ణి. నవ్వుతూ చేయి చాపిన పోస్ట్‌మాన్‌కు నాలుగు రూపాయలిచ్చి, ఆ నెలలో ఇంటి దగ్గర నుంచి వొచ్చిన ఎంఓ డబ్బు తీసుకుని వస్తూంటే, మా సీనియర్ మురళి ఎదురయ్యాడు. హాస్టల్ ఫీజు కట్టడానికి వెళుతున్నానని తెలిసి, ఇలా ప్రతి నెల హాస్టల్ బిల్లులు కట్టక్కరలేదని చెప్పాడు. సంవత్సరం చివరలో వచ్చే స్కాలర్‌షిప్ తో బిల్లులన్నీ ఒకే సారి కట్టేయ్యొచ్చని చెప్పి, ఇరవై రూపాయలు అప్పడిగాడు.
అప్పు కోసం మురళి అలా చెబుతున్నాడేమోనని అనుమానమేసింది. హాస్టల్ మేనేజరుని అడిగాను. బిల్లులన్నీ విద్యాసంవత్సరం చివరలో వచ్చే స్కాలర్‌షిప్ తో జమచేసినా పర్వాలేదన్నాడు. ఇంట్లో వాళ్ళ మీద భారం కాస్త తగ్గించ వొచ్చనుకున్నా! స్కాలర్‌షిప్ దరఖాస్తు కోసం, కులం, ఆదాయం ధృవీకరణ పత్రాలు కావాలి. తాలూకా ఆఫీసులో గుమాస్తాకు పది రూపాయాలిస్తే గానీ ఆ పత్రాలు వచ్చేవి కావు! అందరితో పాటు ఆ పత్రాలు సంపాదించి, స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు పూర్తి చేసి హాస్టల్లో ఇచ్చాను.
అయితే నాకు తప్పించి, అందరికీ స్కాలర్‌షిప్పొచ్చింది!
హాస్టల్ ఆఫీసుకెళ్ళి మేనేజరునడిగాను.
హాస్టల్లో చేరిన తేదీ, అప్లికేషన్లో వేయకపోవడాన స్కాలర్‌షిప్ మంజూరు కాలేదట! సాంఘిక సంక్షేమ శాఖ వాళ్ళకు, ఎప్పటినుంచీ ఉపకార వేతనాన్ని లెక్క కట్టి ఇవ్వాలో తెలియక, నా అప్లికేషన్ ను ప్రక్కన పెట్టేశారట! ఆ తేదీని అప్లికేషన్‌లో మేనేజరు నింపాలి! మేనేజరు మీద చాలా కోపమొచ్చింది.
గొడవ పెట్టుకుందామని, నలుగురైదుగురిని పోగేసుకుని వెళ్ళా. వెల్‌ఫేర్ ఆఫీసుకు అప్పటికే లెటరు వ్రాసినట్లు చెప్పాడు మేనేజరు. స్కాలర్‌షిప్ మంజూరౌతుందని, నన్నేమీ వర్రీ కావద్దని అన్నారు. తన పొరపాటు వల్ల ఇలా జరిగినందుకు చాలా బాధ పడుతున్నట్లు చెప్పాడు. అప్పటిదాకా తప్పు చేసి తప్పించుకో చూసే వాళ్ళనే చూసిన మాకు, మేనేజరు చాలా గొప్ప వ్యక్తిలా అగుపించాడు.
కొన్ని రోజులు స్కాలర్‌షిప్ వస్తుందని ఎదురు చూసాను. ఒక వేళ రాకపోతే, ఒక్క సారిగా ఆరేడునెలల బిల్లులు కట్టాలంటే కష్టమే!
మరో రెండు వారాల తర్వాత, మా హాస్టల్ యూనియన్ సెక్రెటరీతో నా సమస్య మొరపెట్టుకున్నా. యూనియన్ లీడర్లు, నలుగురైదుగురు స్నేహితులు కలిసి ఒక రాత్రి నా రూములోనే చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. మేనేజరు తన పొరపాటును ఒప్పుకున్నాడు కాబట్టి, మేనేజరు దగ్గర నుంచే ఆ డబ్బు రాబట్టడం న్యాయమన్నారు కొందరు. ‘ఏదో పొరపాటయిందన్నాడుగా. పాపం వాడిని వదిలేద్దాం’ అన్నారు ఇంకొందరు. ఆయన మీద అంత జాలి ఎందుకు చూపాలో అర్థమవలేదు నాకు. కాకపోతే, నాతో సహా అక్కడున్న వారందరికీ మేనేజర్ ఆర్థిక పరిస్థితులు తెలుసు. అందుకని అతడిని ఒత్తిడి చేయడం ధర్మం కాదనుకున్నాం.
వాళ్ళు చెప్పిన ఇంకో మార్గం: సోషల్ వెల్ఫేర్ ఆఫీసు వాళ్ళ కాళ్ళా వేళ్ళా పడి, సెకండ్ ఫేజులో స్కాలర్‌షిప్ శాంక్షన్ చేయించుకోవడం. ఇది విని, నాక్కాస్త ఊరట కలిగింది.
“పొరపాటు జరిగిందని మేనేజరు లెటరు పంపాడు కాబట్టి, ఆ ఆఫీసు వాళ్ళను కలిసి మాట్లాడితే మంచిది. అయినా, వాళ్ళు వాళ్ళ జేబుల్లోంచీ తీసి డబ్బివ్వడం లేదుకదా. వాళ్ళిచ్చేది ప్రభుత్వానిదేగా. ప్రభుత్వానిదంటే మనదేగా” అన్నాడు యూనియన్ లీడరొకతను.
“గవర్నమెంటు సొమ్మైనా, ఇచ్చేవాడు వాడి తాత ముల్లె తీసి ఇస్తున్నట్లు ఫీలౌతాడు. వందో రెండొందలో ఆ క్లర్కు మొహాన కొడితే, పని జరుగుతుంది” అని సలహా ఇచ్చారింకొకరు. నూట యాభైతో నెలంతా బతికే రోజుల్లో, అప్పటికప్పుడు వందో రెండొందలో తేవాలంటే కష్టమే! ఆఫీసు వాళ్ళ కాళ్ళ వ్రేళ్ళా పడి బతిమలాడుకోవడమే మంచిదనిపించింది.
స్కాలర్‌షిప్‌ల ఆఫీసు గుంటూరులో వుంది. పెద్ద దూరమేమీ కాదు. మర్నాడు ఉదయమే నర్సరావుపేటలో రైలెక్కి బయల్దేరాను, టికెట్ లేకుండానే. సాధారణంగా అప్పట్లో మా హాస్టల్ వాళ్ళెవరూ రైలు టికెట్లు కొనేవారు కాదు. మా హాస్టల్ ఫైళ్ళు చూసే గుమాస్తా గురించి అడిగే, ‘అదిగో ఆ మూల నుంచీ రెండో సీట్లో కూర్చున్నాడే. అతణ్ణి కలువు’ అని చెప్పి, ‘వీయెస్సార్, నీకోసమొచ్చాడీ అబ్బాయి’ అని కేకేసి చెప్పాడతను.
డిగ్రీ చదివే స్టూడెంట్ లాగా ఉన్నాడు. నవ్వు మొహం. సాయం చేసేవాడిలాగే అగుపించాడు. నేను వెళ్ళిన పని చెప్పగానే, తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమన్నాడు. తను చూస్తున్న ఫైలును ప్రక్క సీటతనికి ఇచ్చి, “మీ హాస్టల్ వాళ్ళు పంపిన లెటరందింది. మా ఆఫీసరుకు పంపాను. అందరికీ స్కాలర్‌షిప్పులివ్వగా డబ్బులు మిగిలితే నీకు కేటాయిస్తామని చెప్పారు”
నా మొహంలో బాధ చూసి, “ఏ మాత్రం వీలున్నా నీకు సాంక్షన్ చేస్తాము బ్రదర్ ” అన్నాడు గుమాస్తా.
ఈసురోమంటూ హాస్టలుకొచ్చా!
మరో రెండు మూడు వారాలు గడిచాయి. స్కాలర్‌షిప్ గురించి క్రొత్త సమాచారమేమీలేదు. హాస్టల్ బిల్లులు ఇంకా చెల్లించని వాళ్ళ పేర్లు నోటీసు బోర్డులో పెట్టారు. మరో నెలలో కట్టక పోతే, పరీక్ష వ్రాయనివ్వరట! నా పేరు కూడా ఆ లిస్టులో ఉంది. స్నేహితులు, యూనియన్ వాళ్ళు మరోసారి చాలా తీవ్రంగా ఆలోచించి “ఇదిలా తేలదుగానీ, నువ్వు మళ్ళీ గుంటూరెళ్ళి, ఆ గుమాస్తాని కలువ్. ఒక వంద ఇచ్చి, పని జరిగాక మరో వంద ఇస్తానని చెప్ప” మని తేల్చారు!
“అలా ఇవ్వడం తప్పుకదా? వీళ్ళేమో తేదీ వెయ్యలేదు. వాళ్ళేమో డబ్బు ఇవ్వడంలేదు. నా తప్పేమీ లేకపోయినా.” నా అవేశానికి అడ్డుపడి,
బోరింగు పంపుంది. దాన్లో నాలుగు చెంబులు నీళ్ళు పోస్తేనేగదా బకెట్ల కొద్దీ నీళ్ళొచ్చేదీ. నేను బోరులో నీళ్ళు పొయ్యనంటే, నువ్వెంత పంపు కొట్టినా నీళ్ళు రావు. ఆ క్లర్కుకో వంద ఇస్తే, అంతా వాడే చూసుకుంటాడు.
“అప్పుడు నీ కేస్ట్ సర్టిఫికేట్ కోసం పదిచ్చావు. ఇంకో సెర్టిఫికేట్ కోసం మరో పదిచ్చావు! మనియార్డరిచ్చినప్పుడల్లా, పోస్ట్ మేనుకి కూడా మూడో నాలుగో ఇస్తుంటావుగా. ఇప్పుడూ అలాగే ఒక వొందివ్వు” అన్నాడు, మా హాస్టల్ యూనియన్ సెక్రెటరి.
అదీ నిజమే! వాళ్ళకసలు డబ్బెందుకిచ్చాను? ఇచ్చినా ఇప్పటిలా అప్పుడు ఎందుకు ఆలోచించలేదు? ఇబ్బంది కలిగించని చిన్న మొత్తమనా?!
“స్కాలర్‌షిప్ రాకపోతే నష్టమెవరికి? తప్పొప్పులు వదిలెయ్. ఇప్పుడు నువ్వాలోచించాల్సింది లాభ నష్టాల గురించి. బోరింగు పంపుంది. దాన్లో నాలుగు చెంబులు నీళ్ళు పోస్తేనేగదా బకెట్ల కొద్దీ నీళ్ళొచ్చేదీ. నేను బోరులో నీళ్ళు పొయ్యనంటే, నువ్వెంత పంపు కొట్టినా నీళ్ళు రావు. ఆ క్లర్కుకో వంద ఇస్తే, అంతా వాడే చూసుకుంటాడు” అన్నాడు ఒక స్నేహితుడు.
తాలూకా ఆఫీసులో వాళ్ళకు, పోస్ట్‌మాన్‌కు. చెయ్యి చాపితే ఇచ్చే వాణ్ణి. ఆ గుమాస్తా చెయ్యి చాపకుండా, నోరు తెరిచి అడగకుండా ఎలా ఇవ్వడం? అసలు డబ్బు ప్రస్తావన తేవడం ఎలా?!
నాకు తోడుగా మా సీనియరొకతను వస్తానన్నాడు. తనకీ గుంటూరులో ఏదో పనుందట.
మేను వెళ్ళేసరికి గుమాస్తా సీటులోనే ఉన్నాడు.
పలకరింపుగా నవ్వి “నేను ఆఫీసరుతో మాట్లాడాను బ్రదర్. ఈ సంవత్సరానికి నిధులైపోయాయట. కుదరదన్నాడు” చెప్పాడు.
చావు కబురు చల్లగా చెప్పడమంటే ఇదే కాబోలు.
“మీరు తలుచుకుంటే అదెంత పనండీ. మీకొచ్చే నిధులతో పోలిస్తే నాకు ఇవ్వాల్సిందెంతండీ”
“లేదు బ్రదర్ ఇవ్వడానికి ఏ మాత్రం అవకాశమున్నా ఇచ్చే వాళ్ళం” అని, ఇక వెళ్ళొచ్చనట్లు ఎదురుగా వున్న ఫైలు తీశాడు.
నాకిక ఏడుపొక్కటే తరువాయి. తప్పుడు సర్టిఫికేట్లతో స్కాలర్‌షిప్పులు పొందిన వాళ్ళు నాకు తెలుసు. పొందే అర్హతలన్నీ ఉండీ, చిన్న పొరపాటు వల్ల ఇలా కావడం దారుణమనిపించింది. ఇంట్లో వాళ్ళను డబ్బు పంపమని ఇప్పుడెలా అడగాలి. అడిగినా వాళ్ళేమి తాకట్టు పెట్టి డబ్బు తేవాలి?
నాతో పాటు వచ్చినతను, “అలా వెళ్ళి కాఫీ తగొద్దామా?!” అన్నాడు, గుమాస్తాతో.
రాబోతున్న ఏడుపును అదిమిపెట్టి “రండిసార్ కాఫీ తాగుదాం” అన్నాను.
“కాఫీనా…?!” అంటూ నా వైపొకసారి చూసి, చేతిలోని ఫైలును టేబుల్ మీద పెట్టి సీటులోంచీ లేచాడు.
ముగ్గురం ఆ ఆఫిసు ఆవరణ లోనే ఉన్న కాంటీన్‌కి వెళ్ళాం.
ఒక బల్ల మీద కూర్చున్నాక, “ఏమైనా టిఫిన్ తీసుకుంటారా?” అడిగాను.
“తీసుకుంటా! కోటీ” అని కేకేసి, తనకొక మసాల దోసె చెప్పి, “మీకేమి కావాలో చెప్పండి” అన్నాడు మా వైపు తిరిగి.
మా స్నేహితుడు పూరీ, నేను ఇడ్లీ తిన్నాం. అందరం టీ త్రాగాము.
టిఫిన్ చేస్తూ మా వూరు గురించి, తల్లిదండ్రులేమి చేస్తుంటారని, ఇంకా చదువు ఎలా సాగుతుందనీ అడిగాడు.
అతడడిగిన వాటికి సమాధానాలు చెబుతున్నా మనసంతా, స్కాలర్‌షిప్పు మీదేవుంది. కాలం వెన్నక్కి వెళ్ళి, ఒక్క సారి అప్లికేషన్‌లో తేదీ రాసాక, నాకు స్కాలర్‌షిప్ ఇచ్చేక, టైము ముందుకు జరిగితే బావుణ్ణని పించింది.
టిఫిన్ తినడం అయింది. గుమాస్తా గారు, తోటి ఉద్యోగి కనిపిస్తే పలకరిస్తున్నాడు.
నేను గబగబా వెళ్ళి, కాష్ కౌంటర్లో పది రూపాల నోటిచ్చాను.
“ఇదిగో కోటి. అది తీసుకోకు. బిల్లు నేనిస్తా” అన్నాడు గుమాస్తా.
కోటి పది నోటును నా వైపుకు తోసాడు.
“ఫర్వాలేదండీ నేనిస్తా”అని పది కాయితాన్ని, బల్ల మీద నుంచీ కోటి వైపుకు తోసాను.
అతను తీసుకోలేదు.
గుమాస్తా గారొచ్చి తన జేబులోంచీ డబ్బు తీసి చ్చాడు.
“నేనిస్తానండీ” అన్నాను. కూర్చుని పని చేసుకునే వాణ్ణి పిలిచి తనతో బాటు మేమూ తిని, తన చేత అందరి బిల్లు కట్టించడానికి నాకు మనసొప్పలేదు.
“నువ్విచ్చేదేమిటి? ఇది నీ డబ్బా? ఇంకా చదువుకుంటున్నావుగా. డబ్బు జాగ్రత్తగా వాడుకో” అని టేబుల్ మీది పది నోటును నా చేతిలో పెట్టి గుప్పిటి మూసాడు.
బహుశా, కేంటీన్‌లో అందరి ముందూ నా చేత డబ్బిప్పిస్తే బాగోదని, అలా చేశాడేమోననుకున్నా!
కేంటీన్ నుంచీ ఆఫీసు వైపు నడుస్తున్నాం.
నా గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లనిపించింది.
నేను ఆగిపోయాను. అక్కడొక చిన్న మొక్క, దాని చుట్టూ వెదురుతో అల్లిన చిన్న కంచె. ఇంకో ఇరవై ముప్పై అడుగుల్లో ఆఫీసు ద్వారం ఉంది. చుట్టూ చూసాను. దరిదాపుల్లో ఎవరూ లేరు. నాతో పాటు వచ్చిన స్నేహితుడు, ఇవ్వ మన్నట్లు సైగ చేసాడు.
జేబులోంచీ మడతలు పెట్టి తెచ్చిన వంద నోటును తీసి గుమాస్తా గారి చేతులో పెట్టాను.
“వీయస్సార్ గారు, ఇదుంచండి. ఎలాగైనా నా పని అయ్యేలా చూడండి” అన్నాను. అంటున్నప్పుడు గొంతు తడారినట్లనిపించింది. చేతులు వణికాయి.
గుమాస్తా గారు, చుట్టూ ఒక సారి పరిశీలనగా చూసారు. నోటు వైపు చూసుకున్నారు. ఆశగా చూస్తున్న నన్నూ చూశాడు.
పచ్చ నోటు మడతలన్నీ విప్పి, మధ్యకి ఒక మడత వేసి నా చొక్కా జేబులో పెట్టాడు.
తన కుడి చేయి పైకెత్తి, సాచి నా చెంప మీద కొట్టాడు.
నా గూబ గుయ్యిమంది. తూలి పక్కనే ఉన్న కంచె మీద పడబోయి, నిల దొక్కుకుని, నీళ్ళ కళ్ళతో గుమాస్తాని చూసాను. నా స్నేహితుడు గుడ్లప్పగించి నిల్చుండి పోయాడు.
“ఇంకో సారి ఈ ఆఫీసు ఛాయల కనబడ్డారా కాళ్ళూ చేతులు విరిచేస్తా. అసలేమనుకుంటున్నారు. మీరసలు చదువుకునే పిల్లలేనా?”
ఏదో గొడవ జరుగుతుందని పోల్చుకుని, “ఏమైందీ, ఏమైందీ?” అంటూ చిన్నగా జనం పోగవుతున్నారు.
“ఏమీ లేదు, మా తమ్ముడికి నాకూ చిన్న గొడవ…” అంటూ నా రెక్క పుచ్చుకుని, రోడ్డు మీదకు తీసుకొచ్చాడు. నేనూ, నా స్నేహితుడూ సిటీ బస్సెక్కేవరకు మా దగ్గరే ఉండి “గుర్తుంచుకో! ఇంకెప్పుడైనా ఎవరికైనా ఇలా డబ్బు ఇవ్వబోయేటప్పుడుఈ దెబ్బ గుర్తుంచుకో. నేను తల్చుకుంటే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని పోలీసులకు పట్టించగలను. మీరిలా చేయడం ఎంత పెద్ద నేరమో తెలుసా?” అన్నాడు.
ఇన్నేళ్ళ తర్వాత కూడా నాకా దెబ్బ, అతడు చెప్పిన మాటలూ గుర్తున్నాయి!
ఆ తర్వాత ఎప్పుడూ టికెట్ లేకుండా రైలెక్కలేదు. ఎవరికీ ఎప్పుడూ డబ్బివ్వలేదు. చాలా సార్లు నాలో నేను ఘర్షణ పడ్డా, ఇంట్లో వాళ్ళతో ఘర్షణ పడ్డా, నాలో నేను తర్కించుకున్నా. కొన్ని సార్లు వత్తిడిని తట్టుకోలేక తల వంచబోయేంతలో, నా చెంప వైపు లేచిన వీయెస్సార్ గారి చెయ్యి కనిపించేది. తర్వాత అతడి మాటలు గుర్తొచ్చేవి. అంతే మళ్ళీ తలెత్తి, సమస్య వైపు ధీరుడిలా చూసే వాణ్ణి!
చదువయ్యాక, పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షల్లో గట్టెక్కి, ఎవరి చెయ్యి తడపకుండానే రెవెన్యూ కార్యాలయంలో ఆఫీసర్నయ్యాను. ఈ మధ్యనే జాయింటు కలెక్టరుగా ప్రమోషన్ మీద గుంటూరుకొచ్చాను. యాధృకచ్ఛికంగా తారసపడి, ఇన్నాళ్ళుగా ‘నన్ను’ కాపాడిన శక్తి అయిన వీయస్సార్ గారి సన్మాన సభకు ముఖ్య అతిథిగా, ఈ రోజిలా వేదిక మీద కూర్చున్నాను!
సభ అయిపోయాక, సుబ్బరామయ్యతో కలిసి బయటకొచ్చాను.
చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నాయి.
సుబ్బరామయ్య ప్రక్కనే వున్న, వాళ్ళ రెండో కొడుకు కిరణ్‌ని పరిచయం చేశారు. హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా చేస్తున్నాడట. నా ప్రసంగానికి మరో సారి కృతజ్ఞలు చెప్పి, తనారోజు నా చెంప మీద కొట్టినందుకు క్షమాపణ అడిగారు మళ్ళీ!
“ఆ విషయం మరచి పోండి. అప్పుడు కాస్త బాధ పడ్డా, తర్వాత ఎంతో సంతోషించాను మీ నిజాయితీకి”
నవ్వి, నడుస్తున్న వాడల్లా ఆగిపోయాడు. నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు.
సరిగ్గా అక్కడే, నేను తన చేతులో వంద నోటు పెట్టింది. కాకుంటే కంచె రక్షణలో అప్పడక్కడున్న చిన్న మొక్క, ఇప్పుడు పెద్ద చెట్టైంది!
కేంటీన్ లో గ్లాసులను, ప్లేటులను కడుగుతున్న చప్పుళ్ళు, పార్టీ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు చెప్పే వీడ్కోళ్ళు తప్పించి పెద్దగా అలికిడి లేదు. కేంటీన్ లైటు వెలుగు మేమున్న చోటుకు మసగ్గా ప్రసరిస్తోంది.
“మీతో అయిదు నిమిషాలు మాట్లాడాలి. కుదురుతుందా?”అడిగారు.
“అంత అర్జంటు పనులేవీ లేవు. చెప్పండి” అన్నాను తన కళ్ళలోకి చూస్తూ.
వాళ్ళబ్బాయిని, స్కూటర్ దగ్గర ఉండమని పంపాడు.
“మీ ప్రసంగం చాలా బాగుంది. మిమ్మల్ని ఇలా చూడ్డం నాకు చాలా ఆనందంగా ఉంది. అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పొచ్చింది మీలో” అన్నాడు.
“చాలా థాంక్స్” చెప్పాను.
“నాలో కూడా మార్పొచ్చింది కదూ” అదోలా నవ్వుతూ అని, “వయసు తెచ్చిన మార్పులే కాదు. బాధ్యతలు, అనుభవాలు తెచ్చిన మార్పులు. ఇందాక మీరలా వేదిక మీద నా గురించి చెబుతూంటే, వింటూ సిగ్గు పడ్డాను. ఇప్పుడు నాలో కుర్రతనపు ఆవేశం లేదు. అప్పటి ఆదర్శాలు లేవు. ఒక వైపు ఒక్కో మెట్టూ జారుతూంటే, మరో వైపు కొత్త కొత్త మెట్లు ఎక్కుతున్నట్లుండేది. నా కుటుంబమిప్పుడు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉంది. పిల్లలు వాళ్ళకు నచ్చిన చదువులు చదువుకొన్నారు. మా ఆవిడా ఆనందంగా ఉంది. వాళ్ళ సంతోషమే నా సంతోషం కదా?!”
నేనేమీ మాట్లాడలేదు. ఆలోచిస్తున్నాను.
“అందరూ కారుల్లో పరుగులు తీస్తుంటే, నేను గుర్రబ్బండిలో ప్రయాణించలేక పోయాను”
నా చేతులింకా తన చేతుల్లోనే ఉన్నాయి.
“రోజులు బాగా మారాయి. మనుషులూ మారారు. అవసరాలూ మారాయి. కనీసావసరాలు కూడా మారాయి. నేనూ మారి పోయాను!” అంటూ నా చేతులనొకసారి నొక్కి వదిలేసి, తల పైకెత్తాడు. కళ్ళలో నీటి పొర… పల్చటి వెలుగులో!
వెంటనే ఏమనాలో తెలియలేదు.
“ఇదంతా నన్ను నేను సమర్ధించుకోడానికి చెప్పడంలేదు. కన్‌ఫెషన్ అంతకన్నా కాదు. మీ గురించి చాలా మంచి విషయాలు విన్నాను. ఇందాక మీరు మాట్లాడినప్పుడు, నాకూ పాతికేళ్ళు వెనక్కి వెళ్ళాలనిపించింది”అని సన్నగా నవ్వుతూ, “మీక్కుదిరితే మళ్ళీ కలుద్దాం” అంటూ, స్కూటర్ మీద కూర్చుని ఎదురు చూస్తున్న కొడుకు వైపుకు నడిచాడు.
అర్థ రాత్రి వచ్చిన పీడ కలకు, దిగ్గున లేచి కూర్చున్నట్లనిపించింది!
కొద్ది దూరంలో నుంచుని నా కోసం ఎదురు చూస్తున్న కారు డ్రైవరు కారు తేవడానికి కదిలాడు.