అక్కడైనా ఇక్కడైనా వేసవి మధ్యాహ్నాలు
ముళ్ళపొదలై గుచ్చుకునేవే!
ప్రవాసంలో మాత్రం, చిన్నప్పటి జ్ఞాపకాలలో
వేసవి మొగలిపొదల్లా గుబాళిస్తుంది
వట్టివేళ్ళ పరదాల మీంచి వీచే ఫాన్‌గాలి
చెదిరిన ముంగురులతో నాట్యమాడుతుంది
అమ్మమ్మ తడి నూలుచీర ఎన్నిసార్లు చుట్టినా
సింహతలాటపు ఎర్రని కూజానోరు
తడారిపోతూనే వుంటుంది
పెరట్లో ఎర్రగన్నేరు చెట్టుకింద సిమెంట్ గాబులో నీళ్ళు
మంట వేయకుండానే సలసలా కాగిపోతాయి
కళ్ళు చిట్లించి కిటికీలోంచి బైటకు చూస్తే
గులకరాళ్ళ రోడ్డు మీద ఎండ వేగిన పేలాలై పెట్రేగుతుంది
గాలి గోపురం మీదో చర్చి గూళ్ళలోనో తలదాచుకున్న పిట్టల్లా
మధ్యాహ్నంయ్యేసరికి ఊరిజనమంతా
చెట్లనీడల్లోనో, దుకాణాల కప్పుల కిందో
ఇంటి లోపలిగదుల్లోనో
భయపడిన పిల్లల్లా గుమిగూడతారు
ఖాళీ చేసిన కొబ్బరినీళ్ళు, తాటిముంజెలు, మామిడిరసం
నిమ్మసోడా, లస్సీలతో వంటిల్లంతా
చెదురుమదురుగా పడివున్న ఆయుధాలతో అలసిన
యుద్ధరంగంలా వుంటుంది
ఇంత ప్రచండరౌద్రాన్ని వేడి వడగాడ్పుగా నలుదిక్కులా
విసిరేసిన సూర్యుడు సాయంకాలమయ్యేసరికి
శాంతించిన ప్రేమికునిలా
సంధ్య ఒళ్ళో మెల్లగా తలదాచుకుంటాడు
పెరట్లో విచ్చుకుంటున్న మల్లె మొగ్గలు, విరజాజులు
సుడిపడిపోయిన వడగాలికి అత్తరు సుగంధాలని
చల్లగా రాస్తాయి
నీటిచుక్క తాకీ తాకగానే ఆరాటపడుతూ
చెమ్మ కూడా కనబడనివ్వక
వడలిన ఆకుల్ని, వాలిన రెమ్మల్నీ
మళ్ళీ కళకళలాడుతూ నిలబెట్టి
గుండెల్నిండా ఆర్ద్రతని నింపుకుంటుంది
ఉదయం నుంచీ ఎండిన నేల
రోజంతా ఉక్కిరిబిక్కిరైన ఆకాశం ఇక తీరిగ్గా తల దువ్వుకుని
చుక్కల చెమ్కీల కుట్టుపూల చీరను
అందంగా కట్టుకుంటుంది
ఊరంతా ఉపశమనంతో ఊపిరి పీల్చుకుని
చల్లని పైరగాలిలో నిద్రలోకి జారుకుంటుంది