మల్లె అంటు

కిటికీ ప్రక్కన కుండీలో కుదురుగా కూర్చుని
కనులు తెరవగానే పచ్చ పచ్చగా పలుకరిస్తుంది
మూత విప్పని దంతపు భరిణలను వైశాఖం వచ్చీ రాగానే
తన చిట్టి పొట్టి రెమ్మల చివర్లలో పొందికగా అమర్చుకొంటుంది
లేత మొగ్గల పెదవులు సుతారంగా విచ్చీవిచ్చకనే
పట్టెడు పరిమళంతో ఇంటినంతటినీ
సుగంధపు అలలపై ఉయ్యాలలూపుతుంది

ఇంతలోనే ఏ వేసవి మధ్యాహ్నపు వాన తుంపరో
తటాలున పెరట్లో మట్టిని తడిపొడిగా తడిపి
జ్ఞాపకాల జవ్వాది వీచికలను రేపుతుంది
తెగిన తల్లివేరు స్పర్శ చల్లగా తగిలినట్లు తోచిందేమో
ఎంతో దూరాన తాను వదిలేసిన తన వెచ్చని కుదురును
పచ్చని బాల్యాన్ని తలుచుకుని చిన్నబోయిన మల్లె అంటు
చెమ్మగిల్లిన పూరేకులను దిగులుగా రాలుస్తుంది


రచయిత వైదేహి శశిధర్ గురించి: జన్మస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. నివాసం న్యూ జెర్సీలో. వైద్యరంగంలో పనిచేస్తున్నారు. చాలా కవితలు ప్రచురించారు. ...