“అనగనగా ఒక చెరువుందంట. ఆ చెరువులో చాల చేపలు..”
“ఆ కథ చెప్పావుగా అమ్మమ్మా!”
“అయితే అనగనగా ఒక ఈగ ఉందంట. ఒక రోజు ఇల్లలుకుతూ ఈగ తన పేరు మర్చిపోయిందంట.”
“ఈ కథ కూడ చెప్పావు! ఇంకోటి చెప్పు”
“సరే అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు.”
“అది కూడా చెప్పావు అమ్మమ్మా, కొత్తది చెప్పు.”
“నాకింక రావమ్మా!”
“ఎందుకని?”
“మా అమ్మమ్మ ఇవే నేర్పించింది.”
“అయితే అదే కొత్తరకంగా చెప్పు!”
“కొత్తరకంగా చెప్పేదేమిటే నీ మొహం?” అని ఆలోచనలో పడింది పాప బొజ్జ మీద జో కొట్టటం ఆపి.
“సరే, అనగనగా ఒక ఏటి వొడ్డున ఆరు చేపలున్నాయంట ఎండిపోయి. పక్కనే గడ్డిమోపు ఉందంట. దాని నీడలో ఏడో చేప ఉందంట. ఆ మరి నువ్వు ఊఁ కొట్టకపోతే నే చెప్పను.”
“ఊఁ ఊఁ చెప్పు చెప్పు!”
“ఏడో చేపా! ఏడో చేపా! ఇదేమిటి ఇక్కడున్నావు?” అంటే రాజు గారి ఏడుగురు కొడుకులు వేటకొచ్చి మమ్మల్ని పట్టుకొచ్చి ఇక్కడ పడేశారు. ఇప్పుడు రాజుగారి ఏడో కొడుకొచ్చి నన్నడుగుతాడు ఎందుకు ఎండలేదని. వాడి కోసం ఎదురుచూస్తున్నాను అందంట. ఒక చీమ పుట్ట దగ్గర కూచుని ఒకబ్బాయి ఏడుస్తున్నాడంట. ఏంటబ్బాయ్, ఏడుస్తున్నవాంటే, చీమ పుట్టలో వేలు పెట్టాను, చీమ కుట్టింది అని చెప్పాడంట. అక్కడ కొట్టంలో ఆవు ఒకటే అరుస్తుందంట. ఏమిటని అడిగితే ఈ పిల్లాడు రావాలి, వచ్చి నా తాడు విప్పితే ఏటి వొడ్డుకి వెళ్ళి గడ్డిమోపు తినాలి అందంట.” హుషారుగా చెపుతున్నదల్లా ఆగి నైట్‌లాంప్ మసక వెలుతురులో పాప మొహం వంక చూస్తూ అడిగింది “ఇట్లా చెపితే కొత్తగా ఉందా?”
“మమ్మీకి ఈ కథలేమీ రావు.”
“వొచ్చమ్మా!”
“మరి ఎప్పుడూ చెప్పలేదేం?”
“మమ్మీకి బోలెడు పనికదా! అయినా కథలు మమ్మీలు చెప్పరు. అమ్మమ్మలే చెప్తారు. నాక్కూడా మా అమ్మమ్మే చెప్పింది. ఇంక పడుకోమ్మా పొద్దుపోయింది.”
* * *
బయట ఒకటే వాన పడుతుంది. ముందుగదిలో పాప ఒక్కతే ఆడుకుంటూంది. వాళ్ళమ్మ కిచెన్‌లో అంట్లు తోముకుంటూ ఉంది. ఇద్దరు దృఢకాయులు తలుపు పక్కనే నక్కి నిల్చున్నారు. ఇద్దరి చేతుల్లోనూ నల్లటి రివాల్వర్లు నిగనిగలాడుతున్నాయి. వాళ్ళమ్మ గట్టిగా పిలిచింది కాసిని పాలు తాగిపొమ్మని. “వస్తున్నా మమ్మీ!” అంటూంది పాప. ఆ ఇద్దరిలో ఒకడు చటుక్కున గదిలోకి నాలుగు అంగలు వేసి పాప వెనగ్గా వచ్చి నోటి మీద చెయ్యేసి..
అప్పుడే గదిలోకి వచ్చిన వాళ్ళమ్మ కేకేసింది చేతిలో రిమోట్ తీసుకుని టీవీ చానెల్ మారుస్తూ “కార్టూన్ ఛానెల్ పెట్టా గదా! ఎందుకు మార్చావు?”
“డిస్నీ ఛానెల్ పెట్టబోతే ఇదొచ్చింది.”
“ఎందుకు, కార్టూన్లు వస్తున్నాయి గదా! నీకు Tom and Jerry ఇష్టమేగా!”
“Jerry Tomకి దొరకటం లేదు ఎంతసేపు చూసినా!”
“ఏది పడితే అది చూడకు. ఛానెల్ మార్చాలంటే నన్నడుగు.” గట్టిగా చెప్పి వాళ్ళమ్మ కిచెన్‌లోకి వెళ్ళింది. ఫోను. వాళ్ళ నాన్న. ఆఫీసునుండి ఆలస్యంగా వస్తాడట.
* * *
ఆమెకి నిద్ర పట్టటం లేదు. ఎక్కడ్నుంచో పాప పిలుస్తున్నట్టే ఉంది అమ్మమ్మా అంటూ.లేచి వంట గదిలోకి వెళ్ళి మంచినీళ్ళు తాగొచ్చి మంచం మీదనే కూచుంది.
అలికిడికి లేచిన ఆయన అడిగాడు “ఏమిటి నిద్ర పట్టటంలేదా?”
“ఏమిటో అది బాగా అలవాటయిందండీ! అది వెళ్ళి వారం రోజులయినా ఇంకా కళ్ళముందు మెదులుతున్నట్టే ఉంది.”
“బాగానే సందడి అది ఉంటే!”
“భలే తెలివయింది అది. ఒక రోజు వాన పడుతుంటే ఈరోజు మనం మొక్కలకు నీళ్ళు పెట్టక్కర్లేదు అమ్మమ్మా, దేవుడు పెడుతున్నాడు అని పరుగెత్తుకొచ్చి చెప్పింది”
“బాగానే సందడి అది ఉంటే” అని పక్కకి తిరిగి పడుకున్నాడాయన. రెణ్ణిముషాల లోపల గురక.
* * *
“ఇదుగో నీకిష్టమని పప్పేసి నెయ్యేసి పెడుతుంటే తినవెందుకని?”
“నాకు ఇదొద్దు.”
“మరేం కావాలి?”
“చికెన్ నగ్గెట్స్”
“అవి ఇక్కడుండవమ్మా!ఇది తింటే నీకు చికెన్ కూరేసి పెడతాగా! నా తల్లివిగా తినమ్మా!”
“యాక్! చికెన్ కూర బాగోదు.”
“ఇవాళ కొత్తరకంగా చేశాగా!”
“అయితే ఇందుట్లో చికెన్ వేయి!”
“అట్లా తినకూడదమ్మా! దేనికది తినాలి. సర్లే!” అంటూ కలిపేసి “ఇదుగో కలిపాను.తిను మరి!” అని నోట్లో ముద్ద పెట్టబోయింది.
“పెరుగు కూడా వేయి మరి”
“ఏమిటీ ఇందుట్లోనా? దేనికది తింటేనే రుచమ్మా! అట్లా అన్నీ కలపకూడదు! ”
“నీకెట్లా తెలుసు? నువు కలిపి తిన్నావా?”
“ఇంత తిక్క పిల్లవేమే! కానియ్ తింటే అంతే చాలు.” అని పెరుగు కూడా కలిపేసింది. “ఇదుగో పెరుగు కూడా కలిపా. ఇక తింటావా?” ముద్దచేసి నోట్లో పెట్టింది. రెండు ముద్దలు తిని “ఇంకొద్దు అమ్మమ్మా” అంది.
“ఎందుకు, నువ్వడిగినట్టే అన్నీ కలిపాను కదా?”
“కడుపు నిండిపోయింది” అంటూ గౌనెత్తి గాలి నిండా పీల్చి ఉబ్బించిన పొట్ట చూపించింది.
* * *
“ఇంతకీ సమ్మర్‌కి ఇండియా వెళుతున్నారా లేదా?” వాళ్ళమ్మ స్నేహితురాలు ఫొన్లో అడిగింది.
“ఆఁ జూన్ రెండున వెళ్తున్నాము. మేమో టూ వీక్స్ ఉండి వచ్చేస్తాము పాపను వదిలి. మా మమ్మీ కూడా ఉంచమంటూంది.”
“మరి తిరిగి ఎట్లా వస్తుంది?”
“మా కజిన్ వందన లేదూ హ్యూస్టన్లో? వాళ్ళు జులైలో వెళ్ళి ఆగస్టు ఫస్ట్‌వీక్ వస్తున్నారు. వాళ్ళతో వస్తుంది.”
“ఉంటుందా నీమీద బెంగ పడకుండా?”
“దానికి బెంగ ఏమీ ఉండదు. అలవాటయిపోయిందిలే!”
“ఇంగ్లీష్ మర్చిపోతుందేమో వచ్చేసరికి.”
“అదేం లేదులే! అక్కడా ఇది చూసే కార్టూన్ ఛానెల్సన్నీ వస్తాయిగా!”
“అయితే మా అమ్మకు రెండు చీరలు కొని ఉంచమని చెబుతాను. తీసుకొస్తావుగా!”
* * *
“అమ్మమ్మా! అమ్మమ్మా! ఇటురా!” వంట చేస్తుంటే బయటీకి లాక్కెళ్ళింది చేయి పట్టుకుని. “ఏంటే?” అంటే “అదుగో విను” అంది చెట్టువైపు చూపిస్తూ. ఏదో పిట్ట గట్టిగా కూస్తుంది.
“పిట్టే! పిట్టని ఎప్పుడూ చూడలేదా?”
“చూడలేదు. ఏదీ చూపించు!”
ఎక్కడో గుబురాకుల్లో వెతగ్గా వెతగ్గా కనపడింది. చూడగానే ఆనందంతో ఆమె మొహం పొటకరించింది. “అదుగో అదుగో” అని వేలితో పాపకు చూపించింది. పిట్ట మళ్ళీ కూసింది. ఎప్పటిదో తొలి యవ్వనాల్లో ఒక పిట్ట కూసిన జ్ఞాపకం ఆమె మనసులో కదలాడింది. పెదాల మీదికి నవ్వూ. కళ్ళల్లోకి మెరుపూ.
“అదుగో బటర్‌ఫ్లై పట్టుకుందాం రా అమ్మమ్మా!” అని పాప పరుగులు తీస్తే వెనకే తనూ పరుగెత్తింది. అది ఎగిరి కనపడకుండా పోయింది.
“ఇవాళ నీకో కొత్త ఆట నేర్పిస్తాను దా!” కిందకి వంగి గుండ్రటి గులకరాళ్ళు ఏరుతూ పాపకు చెప్పింది.
“నేను జీవితమంతా వర్ధనమ్మను కాను!” అని మనసులో అనుకుంది.
ఇంటి లోపలనుంచి మాడిన వాసన వస్తూంది.
* * *
ఆమెకి నిద్ర పట్టటం లేదు. ఎక్కడ్నుంచో పాప పిలుస్తున్నట్టే ఉంది అమ్మమ్మా అంటూ.లేచి వంట గదిలోకి వెళ్ళి మంచినీళ్ళు తాగొచ్చి మంచం మీదనే కూచుంది.
అలికిడికి లేచిన ఆయన అడిగాడు “ఏమిటి నిద్ర పట్టటంలేదా?”
“ఏమిటో అది బాగా అలవాటయిందండీ! అది వెళ్ళి వారం రోజులయినా ఇంకా కళ్ళముందు మెదులుతున్నట్టే ఉంది.”
“బాగానే సందడి అది ఉంటే!”
“భలే తెలివయింది అది. ఒక రోజు వాన పడుతుంటే ఈరోజు మనం మొక్కలకు నీళ్ళు పెట్టక్కర్లేదు అమ్మమ్మా, దేవుడు పెడుతున్నాడు అని పరుగెత్తుకొచ్చి చెప్పింది”
“ఇదే మాట ఇంతకు ముందు అచ్చం ఇట్లాగే కూచుని నువు చెప్పినట్టు ఉంది. నువు చెప్పావా? నాకు ఊరికే అట్లా అనిపిస్తుందా?” జవాబు వినకుండానే పక్కకి తిరిగి పడుకున్నాడాయన. రెణ్ణిముషాల లోపల గురక.
* * *
“నువ్వూ రా అమ్మమ్మా!” పాప కళ్ళ వెంట కన్నీటి చారికలు.
“నేనొస్తే మీ తాతయ్యో!” తుడుస్తూ అంది.
“తాతయ్య కూడా!”
“తాతయ్య ఆఫీసుకి వెళ్ళాలి కదా? పైగా అక్కడ ఏం తోచదమ్మా! మళ్ళీ వచ్చే ఏడు నువ్వే రా! సరేనా?”
“ఉహుఁ.. ఇప్పుడు నువ్వొస్తే మళ్ళీ నేనొస్తా!”
“మరి నాదగ్గర టికెట్ లేదు కదా! వెళ్ళి నువ్వు పంపిస్తే నేనొస్తా, సరేనా?”
“సరే!”
“వెళ్ళగానే ఫోన్ చేస్తావా మరి?”
“ఊఁ రోజూ పడుకునే ముందు చేస్తా, కథ చెబుతావా?”
“నువు చేస్తే ఎందుకు చెప్పను తల్లీ! మరి ముద్దు పెట్టు”
మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టింది.
“మీరు దిగులు పెట్టుకునేట్టున్నారు ఆంటీ!” లోపలికి తీసుకువెళ్ళడానికి దగ్గరికి వచ్చి అంది వందన.
“మా దిగులు ఎప్పుడూ ఉండేదేలేమ్మా! ఇదే ఎక్కడ మా మీద బెంగ పెట్టుకుంటుందేమోనని భయం!దగ్గరా దాపూ కాదాయె!”
అడిగితే వాళ్ళ తాతయ్యకూ ముద్దు పెట్టింది పాప. చేయూపుతూ వాళ్ళతో పాటే లోపలికి వెళ్ళిపోయింది. కనిపించకుండా పోయినంతవరకూ పాపనే చూస్తూ నిలుచుంది ఆమె, “ఇంక కనపడదులే, వెళ్దాం పద” అని ఆయన హెచ్చరించిందాకా.
* * *
“నేను పోస్తా అమ్మమ్మా, నేను పోస్తా!” మొక్కలకు నీళ్ళు పోస్తుంటే వచ్చింది. అట్లాగే అన్నిటికీ తనే పోసింది బకెట్ లోంచి లోటాతో తీసుకుని. అంతా అయ్యాక మూలగా ఎందుకో ఎండిపోయిన జామచెట్టు దగ్గరికి వెళ్ళి దానికీ పోసింది.
“దానికి వద్దమ్మా! ఎండిపోయింది కదా! ఎవరన్నా పనబ్బాయ్ వస్తే పీకించేద్దాము”.
“నీళ్ళు లేక కదా ఎండిపోయింది! అందుకే దానికి ఎక్కువ పోయాలి.” అంటూ బకెట్ అంతా గుమ్మరించింది.
“ఓసి నీ పిల్ల!” అంటూ రెండో బకెట్‌లో కాసిని నీళ్ళుంటే పాప మీదకి చల్లింది. పాప చిక్కకుండా కిలకిలా నవ్వుతూ లోపలికి పరుగు తీసింది.
రోజూ ఇదే తంతు.
* * *
ఆమెకి నిద్ర పట్టటం లేదు. ఎక్కడ్నుంచో పాప పిలుస్తున్నట్టే ఉంది అమ్మమ్మా అంటూ.లేచి వంట గదిలోకి వెళ్ళి మంచినీళ్ళు తాగొచ్చి మంచం మీదనే కూచుంది.
అలికిడికి లేచిన ఆయన అడిగాడు “ఏమిటి నిద్ర పట్టటంలేదా?”
“ఏమిటో అది బాగా అలవాటయిందండీ! అది వెళ్ళి వారం రోజులయినా ఇంకా కళ్ళముందు మెదులుతున్నట్టే ఉంది.”
“బాగానే సందడి అది ఉంటే!”
“భలే తెలివయింది అది. ఒక రోజు వాన పడుతుంటే ఈరోజు మనం మొక్కలకు నీళ్ళు పెట్టక్కర్లేదు అమ్మమ్మా, దేవుడు పెడుతున్నాడు అని పరుగెత్తుకొచ్చి చెప్పింది”
“ఇదే మాట ఇంతకు ముందు అచ్చం ఇట్లాగే కూచుని నువు చెప్పినట్టు ఉంది. నువు చెప్పావా? నాకు ఊరికే అట్లా అనిపిస్తుందా?”
కొంచెం ఆగి ఆయనే “ఏమిటో, ఈ మాటలు కూడా నేను ఇంతకుముందు అన్నట్లే ఉంది” అని పక్కకి తిరిగి పడుకున్నాడు. రెణ్ణిముషాల లోపల గురక.
* * *
“అమ్మమ్మా, చూడు ఇక్కడ ఈ యాంట్స్ చూడు. షుగర్‌ని ఎట్లా తీసుకు వెళుతున్నాయో!” లాక్కొచ్చి చూపించింది. “అయ్యయ్యో పాడు చీమలు ఎక్కడ్నుంచి వస్తాయో గానీ..” అంటూ దులపబోతుంటే గొడవ చేసి వాటిని అంటుకోనీయలేదు. పాపతోటే కూచుని ఒక్కో చీమా ఒక్కో పంచదార పలుకుని పట్టుకుని ఒకదాని వెనక ఒకటి బారులు కట్టి పోవడం చూస్తూంటే కొంతసేపటికి ఎంతో అబ్బురంగా అనిపించింది.
సాయంత్రం ఆ సంగతే ఆయనకి చెపితే, వాళ్ళిద్దరూ పడుకున్నాక వంటింటి గోడల పక్కగా చీమల మందు వేశాడు.
* * *
“ఈ పిల్ల ఏం చేస్తూంది? సరిగ్గా తింటుందా?”
“బాగానే ఉందమ్మా! అన్నం కాకుండా ఏదయినా తింటుందది.”
“ఏదీ పిలువు దాన్ని! వెళ్ళాక రెండు ముక్కలు కూడా మాట్లాడ లేదు.”
“టీవీ ముందు కూచుందో, బార్బీ బొమ్మలతోటి ఆడుతుందో!” కార్డ్‌లెస్‌లో మాట్లాడుతూనే ఆ గదీ ఈ గదీ చూసి పాప దగ్గరికి వెళ్ళి చెప్పింది.”ఇదుగో అమ్మమ్మ, హలో చెప్పు!”
“హలో అమ్మమ్మా!”
“హలో తల్లీ!”
“బాగున్నావా, అడుగు!” వాళ్ళమ్మ అందించింది.
“బాగున్నావా?”
“బాగానే ఉన్నాను. నువ్వెట్లా ఉన్నావు?”
“బాగానే ఉన్నా. బై! ఇదుగో మమ్మీ!” ఫొన్ వాళ్ళమ్మకి ఇచ్చేసి ఆటల్లో మునిగిపోయింది.
“ఫోన్ చేస్తానమ్మమ్మా అని ఎన్ని కబుర్లు చెప్పింది! ఒక్క ముక్క మాట్లాడదే!”
“అది ఫోన్‌లో మాట్లాడదమ్మా! తెలుసుగా దాని సంగతి. ఉంటా ఇంక.”
“సరే!” అని పెట్టాక పక్కనే కూచుని పేపరు చదువుతున్న ఆయనతో అంది ఉక్రోషంగా “రెండు ముక్కలు కూడా మాట్లాడదు. మనల్ని మర్చిపోడానికి వాళ్ళమ్మకు నాలుగేళ్ళు పడితే దీనికి నాలుగు రోజులు కూడా పట్టలేదు చూడండి!”
“నీమీద బెంగ పెట్టుకోకుండా ఉంది, మంచిదే కదా!”
నిజమే, కానీ ఒక వెలితి. ఆ ఆపేక్షకు అర్థమేదీ లేదా? కొంచెమన్నా దిగులు పెట్టుకునుంటే అదో తృప్తి.
ఆమె దిగులు మొహాన్ని చూస్తూ అన్నాడు “రెండు నెల్లు దానితో బాగానే ఎంజాయ్ చేశావు గాదా! సంతోషించడం పోయి ఇప్పుడు అది ఇంకా ప్రేమగా మాట్లాదడం లేదని బాధ దేనికి?”
* * *
ఊఁ కొడుతూనే పాప నిద్ర పోతే, ఆ పసి మొహాన్నే చూస్తూ పడుకుంది. లేత బుగ్గలూ, పల్చటి పెదాలూ. “నా దిష్టే తగిలేట్టుంది దీనికి” అనుకుంది. తమలపాకుల్లాంటి పాప అరిచేతుల్ని తడుముతుంటే గమ్మత్తుగా ఉంది. ఎప్పటిదో ఆ స్పర్శ. కూతురి చిన్నప్పటి పోలికలు వెతుక్కుంది. “ముక్కూ, నుదురూ అచ్చం దాని పోలికే”.
అంతలోనే ఒక చిత్రమైన భావన తను మళ్ళీ తల్లి అయినట్టు.
* * *
వెనక మెట్ల మీద కూచుని కాఫీ తాగుతున్నవాడల్లా లోపలికి తిరిగి కేకేశాడు “ఏమోయ్! ఇటు రా!” అంటూ.
“ఏమిటి ఏమయింది?” అంటూ వచ్చింది.
“అటు చూడు” చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు.
“ఎటు?”
“ఆ ఎండిపోయిన చెట్టు చూడు. చిగురు కనపడటంలా మొదట్లో? మొత్తానికి నీళ్ళు పోసీ పోసీ మనవరాలు సాధించింది.”
“నిజమేనండీ! పసిపిల్ల ప్రేమతో నీళ్ళు పోస్తే.. భలే పచ్చబడిందే?” సంభ్రమంగా అంటూ చెట్టు వేపు నడిచింది గబగబా అడుగులు వేస్తూ. వెనకే ఆయన.
దగ్గరగా వెళ్ళి చూస్తే అది వొట్టి పాచి.
* * *