వృక్షమానవం

ఆకురాలు కాలమని మరిచాను

నీ కుమారుణ్ణి నేను

సుకుమారంగా చూడలేను

కాకులరుస్తున్నాయి.

మృత్యుపేటికలో

మెరిసే ముత్యం

యుద్ధం!!

భూమిలో బిగుసుకొనే

వేళ్ళ పిడికిళ్ళు..

నిటారుగా నిలబడతాను

నీడలేదు నాకు.

చిన్నపిల్లల గుండెచప్పుడు

టిక్కుమనే గడియారాలు

చీకటిలో తడుములాట

చిత్రమైనవీ శరీరాలు

అద్దంలో,నీటిలో

అలలుకొట్టే రూపం

ముద్దగా తడిచావు

తలతుడుచుకో,పాపం!

ఎగురుతున్న పక్షితో,ఎకాఎకీ

చిగురుతో ,ముఖాముఖీ

మాట్లాడుతాను.

మరణం నా చిరునామా!

బ్రతుకు చిన్న కామా,

మర్రి వృక్షంలా నా ఊహ

వెర్రిగా నిలబడుతుంది!!

అజంతాకు ..

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...