Comment navigation


15755

« 1 ... 25 26 27 28 29 ... 1576 »

  1. చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:

    11/09/2024 2:21 am

    చౌరాష్టకానువాదానికి యదుకులభూషణుల విమర్శ రమ్యంగా ఉంది.

    నేను చేసినది చౌరాష్టకానికి స్వేచ్ఛానువాదం అని మనవి చేయటం జరిగింది.

    ఒక భాష నుండి మరొక భాష లోనికి అనువదించటం లోని సాధకబాధకాలు తెలిసిన యదుకులభూషణులు అమూలకమైన మాటల నెత్తి చూపటమూ తప్పుబట్టటమూ కొంచెం అచ్చెరువు కలిగించింది. మూలం లోని పదాలను కాని తత్సమానాలను కాని ప్రయోగిస్తూ అలాగే భూలోకంలోని భావానికి న్యూనాతిరిక్తంగా ఏమీ లేకుండా మూలదైర్ఘ్యాన్నే పాటించుతూ అనువదించటం బహుకష్టం. పద్యం కృతకం అయిపోయే ప్రమాదం హెచ్చు.

    మహాభారతాంధ్రీకరణం నాటి నుండి నేటిదాకా కవులు అనువాదంలో స్వేచ్ఛ తీసుకున్నారు. మక్కికిమక్కి అనువాదాలు కళగట్టినది తక్కువే కదా.

    విషయాన్ని సందర్భానుసారంగా పెంచటం కొత్త విషయం కాదు కదా. పాల దొంగతనం వేమనగారే అంటించారు కదా కృష్ణుడికి గొల్ల యిండ్లపాలు కోరనేల అని. నేనేమీ కొత్తగా అన్నది లేదు.

    ఇకపోతే విమర్శకులు నేను బిల్వమంగళుని స్ఫూర్తి, ఆర్తి పట్టుకున్నానని అన్నారు. చాలా సంతోషం.

    యదుకులభూషణులకు ధన్యవాదాలు.

  2. చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    11/08/2024 9:44 pm

    అధికమాసం (పురుషోత్తమ మాసం అనీ పిలుస్తారు) లో చౌరాష్టకం గానం చేసే వైష్ణవ సంప్రదాయం ఒకటి ఉంది. ఇక ఈ అష్టకం ‘ఉపజాతి’ అన్న మిశ్ర ఛందస్సులో ఉన్నది. ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్రను సమ విషమపాదాల్లో ప్రస్తరిస్తే వచ్చే ఛందమిది (మినహాయింపు అష్టకంలో చివరిది – అందులో ప్రస్తరించిన పాదాలు ఇంద్ర వజ్ర (18 మాత్రలు), ఉపేంద్ర వజ్రవి (17 మాత్రలు) కావు, మరేదో వృత్తం -7 మాత్రలు ఎక్కువ). అన్ని అష్టకాల్లాగే ఇది గాన యోగ్యం. అనువాదంలో అసలు గొడవ ఇక్కడి నుండే మొదలవుతుంది. మూలంలో సంగీత గుణమున్న కవిత్వాన్ని అనువాదంలో మెప్పించలేము. అష్టకాలు మరీ కష్టం.

    అనువాదకులు అధికంగా మాలికలు ఎంచుకున్నారు (4 ఉత్పలమాలలు & 2 చంపకమాలలు – 28 మాత్రలు – వజ్రలతో పోలిస్తే 10-11 మాత్రలు ఎక్కువ); సీసం ఆటవెలది, తేటగీతి కూడా వచ్చాయి. ఇందులో తేటగీతితో చేసిన అనువాదం మేలుగా ఉంది. కారణం – తేటగీతి పాదంలో తక్కువ అంటే 17 మాత్రలు, ఎక్కువ అంటే 19 – మధ్యస్థంగా 18 మాత్రలు వస్తాయి. కొంత మెలకువతో రాస్తే క్లుప్తత చెడకుండా భావాన్ని, ఉపజాతి లోని స్ఫూర్తిని సమంగా పట్టుకురావచ్చు – ఏమాత్రం దండుగ్గణాలు లేకుండా. సంస్కృతంలో ఏదో ఒక వృత్తాన్ని ఎన్నుకొని చివరికంటా దానితోనే బండి లాగించడం పరిపాటి, మన కవుల్లో దూకుడు ఎక్కువ, అది అలా ఉండనిస్తే, అక్కడక్కడ లోతైన వ్యంగ్యం ఉన్నా – మూలంలో కథ అందరికి తెలిసినదే. కావున చౌరాష్టకం మొత్తం తేటగీతులతో రాస్తే మరింత అందగించేది. మూలంలో – వ్యంగ్యంగా, క్లుప్తంగా చెప్పడం ఉంది, ఎక్కడా వివరణ అన్నది లేదు.

    ఎంచుకున్న వృత్తం ఉపజాతి కాబట్టి, ఆ పరిమితులకు లోబడి, ఎంతో సంయమంతో నడిచింది వ్యవహారం. ఇక అనువాదంలోకి ప్రవేశిస్తే –

    మొదటి శ్లోకం, దానికి ఆంధ్రీకరణ:

    వ్రజే ప్రసిద్ధం నవనీతచౌరం
    గోపాంగనానాం చ దుకూలచౌరం
    అనేకజన్మార్జితపాపచౌరం
    చౌరాగ్రగణ్యం పురుషం నమామి

    దొంగిలె [పాలు]వెన్నలను [తొల్లిట నీతడు] గొల్లపల్లెలన్
    దొంగిలె గొల్లకన్నియలు [తోయములాడెడు వేళ] చీరలన్
    దొంగతనంబుచేసె [బహుధూర్తత నావగు] పాప[సంపదల్]
    దొంగల రాజువీ డనుచు దోయిలి యొగ్గెద [వీని కెప్పుడున్]
    [కుండలీకరణల్లో ఉన్నవి – మూలంలో లేని అంశాలు ]

    చిన్ని కృష్ణుడు వెన్నదొంగ అని తెలుసు కానీ, పాల దొంగ అని తెలియడం ఇదే ప్రథమం – కుండంత భావాన్ని కొండంత వృత్తంలో చెప్ప బోతే వచ్చే చిక్కులు – మూలంలో నవనీతం – అనువాదంలో పాలలో కలిసిపోయింది.
    కొండ మీద కూచుని రోజుకొక కృతి రచించిన అన్నమయ్య కూడా ‘ కినిసి వెన్న దొంగిలె వీడే’ అన్నాడే గానీ పాల ప్రస్తావన తీసుకురాలేదు. (5 వ పద్యానువాదంలో “వెన్నదొంగ నిన్ను విడుచు టెట్లు” అన్న వాక్యమున్నది – పాల ప్రస్తావన లేదక్కడ). ఇక, జలకాలు ఆడేటప్పుడే కదా బట్టలు మాయమయినది – మూలంలో స్నానాల ప్రస్తావన తేలేదు. అది అనువాదంలోకి వచ్చి చేరింది. కవిత్వంలో పాఠకుని ఊహకు వదిలేయవలసిన విషయాన్ని విస్తరించడం, వివరణకు పూనుకోవడం పెద్ద దోషం – మూలంలోని లేని దోషాన్ని అనువాదంలో స్థాపించడం మరింత పెద్ద తప్పు. అంతేకాదు, అగ్రగణ్యుడు అంటే రాజు అనడం కూడా తప్పు – వీరాగ్రగణ్యుడు అంటే వీరుల్లో మొదట లెక్కించవలసిన వాడు అంతే గాని వీరులకు రాజు కాదు. ఇన్ని తప్పులు ఎందుకు దొర్లాయి అంటే – మూలంలో కావ్యాత్మను పట్టుకోలేకపోవడం, వృత్తం ఎంపికలో ఔచిత్యం లేకపోవడం. కాబట్టి మూలంలో, 70 మాత్రల్లో క్లుప్తంగా, బలంగా – గానయోగ్యంగా ఉన్నవి – దండుగ్గణాలు చేరిన అనువాదం, పేలవ ప్రదర్శన గా మారిపోయింది.
    ఐదవ శ్లోకం దానికి ఆంధ్రీకరణ:

    “ధనం చ మానం చ తథేంద్రియాణి
    ప్రాణాంచ హృత్వా మమ సర్వమేవ
    పలాయసే కుత్ర ధృతోద్య చౌర
    త్వం భక్తిదామ్నాసి మయా నిరుద్ధః” (5)

    నాధనంబుల నెల్ల [నయముగా నీపాలు చేసికొన్నావుగా]( చిన్నిదొంగ)
    నా మాన[ధన]మును (శ్యామసుందర) [నీవు కొల్లగొట్టితివిగా] (గోపబాల)
    అరయ నా సర్వేంద్రియముల సత్వంబుల నీవ గైకొంటివి (నీటుకాడ)
    నాప్రాణములు [కూడ నావి కావాయెనే నీయందు నిలచెనే] (నీలవపుష)

    ఇన్ని యపహరించి యెందు బోయెదవయ్య
    [వెన్నదొంగ నిన్ను విడుచు టెట్లు]
    భక్తిరజ్జువులను బంధించినాను నా
    [హృదయమందిరమున నింపు మీఱ] ( 5)

    (మూలము నందు లేని సంబోధనలు ) [మూలంలో లేనివి ]

    మూలంలో కృష్ణ సంబోధన అష్టకం ముగిసేటప్పుడు కేవలం ఒక్క సారి వినిపిస్తుంది – అనువాదంలో ఐదారు వచ్చి చేరాయి. మూలంలో రెండు పాదాల్లో చెప్పిన భావం అనువాదంలో సీసమై విస్తరించింది. తర్వాత రెండు పాదాల్లోని భావం చెప్పడానికి అనువాదంలో ఒక ఆటవెలది ప్రవేశించింది. అనువాదం కత్తి మీద సాము, అందులోను గానయోగ్యమైన అష్టకాలకు ఇక చెప్పేదేముంది. దాని కన్నా – మూలంలోని విశేషాలు సరళంగా అనువాదకునికి తెలిసిన వాడుకభాషలో వివరించడం శ్రేయస్కరం అనిపిస్తుంది. లేదా గురజాడ మార్గంలో, ముత్యాల సరాల్లో అణకువగా తేలిక తెలుగులో అనువాదం చేయవచ్చు.
    (ఉరామరికగా, కేవలం ఉదాహరణ కోసం సుమా)

    పేరుమోసిన వెన్న దొంగవు
    గొల్లభామల వల్లెవాటులు,
    జన్మజన్మల పాపభారం –
    హరించు నీకు నమస్కారం 1

    రాధమనసును చూరగొంటివి
    మెరిసిపోయే మేఘకాంతిని,
    పంచ జేరినవారి సమస్తం –
    హరించు నీకు నమస్కారం 2

    ఆరవ శ్లోకం దానికి ఆంధ్రీకరణ :
    ‘ తేటగీతితో చేసిన అనువాదం మేలుగా ఉంది ‘ అని పైన తెలిపి ఉన్నాను. ఛినత్సి, భినత్సి అన్న రెండు సంస్కృత క్రియలను తెనుఁగులో ఏకంగా త్రెంచి పడ వైచినా – దాని దుంప తెంచిరి అది అటుండనిద్దాం- బిల్వమంగళుని స్ఫూర్తి, ఆర్తి పట్టుకున్నారు శ్యామలకవి – ఉపజాతిని ఎంతో ఔచిత్యంతో తేటగీతిలో తెనిగించారు.
    “దించెదను కవిభావ ముదీర్ణశక్తి ” అని గొప్పగా రాశారు ఈ పద్యం.

    ఛినత్సి ఘోరం యమపాశబంధం
    భినత్సి భీమం భవపాశబంధం
    ఛినత్సి సర్వస్య సమస్తబంధం
    నైవాత్మనో భక్తకృతం తు బంధం (6)

    త్రెంచెదవు ఘోరయమపాశ మంచితముగ
    త్రెంచెదవు భవపాశ ముదీర్ణశక్తి
    త్రెంచెద వఖిలబంధముల్ దీనుల గని
    భక్తిపాశంబులను ద్రెంచ వశమె నీకు

    స్థాలీపులాకంగా అనువాదంలో కష్టసుఖాలను వివరించాను. ఇంకా ఎవరైనా అనువాదాల్లో మెలకువలు తెలుసుకోదలిస్తే: “అనువాదంలో మెలకువలు

    ఇంత కష్టమైన పనిని తలకెత్తుకున్నందుకు తాడిగడప శ్యామలరావు గారికి అభినందనలు తెలుపుతున్నాను. అందరిలాగా, వారి ఇతర పద్యరచనల కోసం ఎదురుచూస్తాను.

  3. రెండు ఆకాశాలు గురించి Ramesh గారి అభిప్రాయం:

    11/08/2024 10:35 am

    కథనం బాగుంది, కానీ ఆవిడ 4గురి పిల్లల్ని వదిలి వెల్లిపోవడానికి ఏమాత్రం సహేతుకమైన కారణం కనిపించలేదు, తన సొంత కొడుకు 10 ఏళ్ళ తరవాత వస్తే కనీసం దగ్గరికి కూడా తీసుకోదా, మరి ఏ కారణం చేత చివరలో ఆవిడ పశ్చాత్తాపం పొందింది.

  4. చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:

    11/08/2024 8:56 am

    నవంబరు రెండవ తారీఖున ఒక శర్మగారున్నూ ఐదున మరొక శర్మగారున్నూ మెచ్చినందుకు వారిద్దరికీ ధన్యవాదాలు.

    సాహిత్యంపై మాకు ఏ నిర్వచనాలు నిబంధనలు లేవని ఇంకెన్ని వేలసార్లు చెపుతూ ఉండాలో అని సంపాదకులు అన్నారు కాని ఆశర్మగారు ఈమాటను తరచుగా చదువుతూ ఉండకపోవచ్చు కాబట్టి వారికి తెలిసి ఉండకపోవచ్చునేమో.

    దంతుర్తి వారు అసంపూర్తిగా ఉన్న నా పూతన ఖండ కావ్యాన్ని ఈమాటకి పంపి ప్రచురించండి పూర్తిగా, ఇదే సరైన సమయం అన్నారు. మంచిసలహా – అలాగే చేస్తాను త్వరలో. ఆపైన ఈమాటవారి యిష్టం.

  5. హైకూ గురించి Ramesh గారి అభిప్రాయం:

    11/08/2024 12:16 am

    “లెట్ అజ్ ఆల్ లివ్ ఇన్ పీస్!”

    ఈ కథలో ఎంతో భీభత్సమైన అందం వుంది. రచయిత ఎంతో హడావుడిగా వెళ్ళిపోయాడు.

    ఓంశాంతి

  6. “ఫూ …” గురించి Ramesh గారి అభిప్రాయం:

    11/07/2024 10:33 pm

    “ఇది కధ లాగా లేదు.” 4-11-2011

    పై విమర్శ సహేతుకంగా లేదు. ఈ కథ magical realism బాణి లో వ్రాసిన ఒక అద్బుతమైన కథ. ఈ కథను ఇంతకాలం miss అయినందుకు బాధగా వుంది. చాలా చక్కటి శైలి, రాజ్యహింస, అమానవీయతల పై గురితప్పని బాణం.

    చంద్రశేఖర్ గారికి నివాళులు

  7. మరణ మృదంగం గురించి Indra Prasad గారి అభిప్రాయం:

    11/07/2024 2:14 pm

    అనువాదం బావుంది. ఇంగ్లీష్ అనువాదానికి సరిపోలినట్లే కాకుండా, తెలుగు రచనలాగే ఉంది. గొప్ప కథే. నిజానికి టాల్‌స్టాయ్ అనువాదానికి అంతా తొందరగా లొంగే రచయిత కాదని నాకు ఇన్నాళ్ళు అనిపించేది. ఈ కథ కాస్త బెటర్ అనుకుంటా.
    జీవితానికి, మృత్యువుకు మధ్య మనిషిపడే సంఘర్షణ కథలో ముఖ్యమైనదైనా, తనది కాని కష్టమూ సుఖమూ తనకి పట్టనట్టు ఉండే మానవ నైజాన్ని విపులంగా వర్ణిస్తుంది కథ.

  8. అదృశ్య సముద్రం మీద వేట గురించి ram pasupuleti గారి అభిప్రాయం:

    11/07/2024 12:10 pm

    Dear sir, your expression inspired me a lot. I’m trying to connect with you since long time. can you please share me your contact details to mail ID. thank you!
    This is my MAIL address – rampasupuletipostbox@gmail.com

  9. కృత్రిమ మేధ, ప్రజ్ఞానం, నోబెల్ బహుమానాలు గురించి Srinivas గారి అభిప్రాయం:

    11/06/2024 2:04 am

    చాలా చక్కగా వివరించారు.

    కంప్యూటర్ విశేషజ్ఞులు చాలా ఇతర శాస్త్రాలలో గుర్తింపబడడం కొత్తకాదు. 1979 వైద్యం లో నోబెల్ బహుమతి ఇద్దరు భౌతిక శాస్త్రవేత్తలకు వచ్చింది.

    కానీ మీరు చెప్పిన విషయం ఆలోచించదగ్గది. కంప్యూటర్ మెల్లగా(?) అన్ని జీవన రంగాలను ప్రభావితం చేస్తోంది. చాలా రకాలైన సమస్యలను కంప్యూటర్ వాడి పరిష్కరిస్తున్నారు. అంతేకాదు, ఈ కంప్యూటర్ సామర్ధ్యం క్రమంగా పెద్ద కంపెనీల గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోతోంది. మెల్లిగా ప్రపంచం అంతా ఈ కంపెనీల చేతుల్లోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఈ పరిణామం అంత బాగా అనిపించుట లేదు.

    ఏమైనా మంచి టాపిక్ మీద ఆలోచన రేకెత్తించే వ్యాసం అందించినందుకు కృతజ్ఞతలు.

  10. ఎవరెస్ట్ బేస్ కాంప్ – 1 గురించి Srinivas గారి అభిప్రాయం:

    11/06/2024 12:11 am

    చాలా బాగా తెనిగించారు, అమరేంద్ర గారూ.

    ఎవరో అనుభవశాలి ఐన పెద్దాయన పక్కన కూర్చుని చెబుతున్నట్టుగా ఉంది. చాలా సరళమైన భాష, చదవడానికి సులభంగా ఉంది.

    ఈ ట్రెక్ గురించి చాలా రోజులుగా చదువుతున్నాను. ఎప్పుడు ఎన్నిసార్లు చదివినా కొత్తగా ఉత్సాహభరితంగా ఉంటుంది. ఒకసారి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సమీప భవిష్యత్తులో చేద్దామన్న ఆశ ఉంది.

    అమరేంద్రగారూ, మీ యాత్రా కథనాలు చాలా బాగుంటాయి. మీరు మరిన్ని యాత్రలు చేసి ఆ వివరాలు మాతో పంచుకుంటారని ఆశిస్తూ…

« 1 ... 25 26 27 28 29 ... 1576 »