Comment navigation


15538

« 1 ... 24 25 26 27 28 ... 1554 »

  1. ముష్టి పలురకములు గురించి Madhav గారి అభిప్రాయం:

    07/29/2024 4:00 pm

    “ఒరే, ఇక వ్యాసుడికి పట్టరాని కోపం వచ్చింది. తాళలేని ఆకలి, కళ్ళు చీకట్లు కమ్ముతున్నై. చేతిలో భిక్షాపాత్రను ఎత్తి కొట్టాడు, ఎలా? మామూలుగా కాదు. శతథా భిన్నంబులై. ముక్కలు ముక్కలైపోయింది అది… చూశా? క్ష-ప్రాస కేవలం ఇలాంటి విపరీతపు సందర్భాల్లోనే వాడతారు…” అంటూ నా చిన్నప్పుడు మా నాన్న చెప్పిన కథ గుర్తొచ్చింది, ఇక్కడి చర్చ వ్యాసుడు, కాశీ, శాపం మీదకు పోగానే. ఆ పద్యం అప్పుడే మర్చిపోయాను కాని, కొన్నేళ్ళ క్రితం, భైరవభట్ల కామేశ్వరరావుగారి పుణ్యమా అని మళ్ళీ తెలుసుకున్నాను. ఆ పద్యం ఇదీ. ఇప్పటికీ చదువుతుంటే వ్యాసుడి మనఃస్థితి కళ్ళకు కట్టినట్టే ఉంది నాకైతే.

    కుక్షిప్రోద్భవ నిష్ఠురక్షుదిత దుష్క్రోధాంధకారంబునన్
    జక్షుల్ రెండును జిమ్మచీకటులుగా సంరంభ శుంభద్గతిన్
    బ్రేక్షచ్ఛాత్రులు భీతిబొంద గడునుద్రేకించి హట్టంబునన్
    భిక్షాపాత్రము రాతిమీద శతధా భిన్నంబుగా వైచితిన్

    (ఇది భీమఖండం లోని పద్యం. భీమఖండంలో కూడా వ్యాసుని కోపం గురించిన కథ వస్తుంది, సంక్షిప్తంగా. వ్యాసుడీ కథని అగస్త్యునికి చెప్తాడు. మీరన్న ఇల్లాళ్ళు భిక్ష వెయ్యకపోవడాన్ని వర్ణించే సీసపద్యం కాశీఖండంలోనిది. అందులో ఈ కథ వివరంగా ఉంది. శివుడూ పార్వతీ వ్యాసునికి పెట్టిన చీవాట్లు బలేగా ఉంటాయందులో. దుష్కర ప్రాసలు సాధారణంగా ఇలాటి ప్రత్యేక సందర్భాలలోనే మన తెలుగు కవులు వాడారు. ఇక్కడ భిక్షాపాత్ర ప్రసక్తి కూడా “క్ష”కార ప్రాసకి నేరుగా దారిచూపించి ఉంటుంది. – భై.కా.)

    కొడవళ్ళగారు ఇందాకే వర్ణించారు ఆ చీవాట్లను.

    మాధవ్

  2. ముష్టి పలురకములు గురించి VSTSayee గారి అభిప్రాయం:

    07/29/2024 2:57 pm

    హనుమంతరావుగారు:

    ఆవిడన్నది కొంతవరకు నిజమే. ఎంతమంది వడ్లు దంచుకొని అన్నం వండుకు తినడంలేదు, ఆకులు దుంపలు తినే వాళ్ళు లేరా. కాని ఓ జీవనవృత్తికి అలవాటుపడ్డ వాణ్ణి హఠాత్తుగా వేరే మార్గం చూసుకోమనడం ఎంతవరకు సమంజసం?

    ఈజీవనవృత్తిని అలవాటు పడ్డట్టుగా చూడటం సమంజసం కాదనుకొంటాను.

    అన్నం వండుకుతింటుంటే – ‘కౌపీనసంరక్షణార్థం’ మాదిరి – (లింగార్చనంబు కల్పించటం, పంచాక్షరంబు జపంబుచేయటం తనకోసమే అనుకున్నా) శిష్యతతికి శివధర్మములు చెప్పటం, పురాణము చెప్పటం ఇవన్నీ అటకెక్కవా!

    వీరిలాంటి గురువులకు/అధ్యాపకులకు భృతి సమాజమే కల్పించాలి.

    నమస్సులతో,
    వాడపల్లి శేషతల్పశాయి.

  3. మరల రామాయణంబదేల… గురించి పూడూరి రాజిరెడ్డి గారి అభిప్రాయం:

    07/29/2024 9:17 am

    చర్చలు ఇంత బాగా కూడా జరుగుతాయన్నమాట! ప్రతి ఒక్కరి వ్యాఖ్యా ఏదో ఒక అదనపు విలువను జోడించేదే!

  4. ఆర్. కె. లక్ష్మణ్ కథ – నా స్వస్తివాక్యం గురించి Tadepalli subrahmanyam గారి అభిప్రాయం:

    07/28/2024 10:01 pm

    Readers can purchase “the tunnel of the time” by the same author — same story(auto biography). Purchased it as I cannot wait for a Telugu version for so long a time.

  5. ముష్టి పలురకములు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    07/28/2024 12:45 am

    వేలూరి గారూ,

    మీ సూచన మేరకు నేనివాళ వ్యాసుడు కాశి మీద కోపించిన కథ చదివాను – ముగ్గురు పండితుల సాయంతో [1][2][3]. మీరు పూర్తిగా శివుడి పక్షాన ఉన్నారేమోనని అనుమానంతో వ్యాసుని తరఫున వకాల్తా తీసుకొని ఆయనకి కొంత న్యాయం చేయడానికీ ప్రయత్నం.

    మీసంగతేమోకాని నాకు ఓపూట పస్తు ఉంటే కళ్ళు తిరిగి శోష వస్తుంది. మరి రెండు రోజులు (అగస్త్యుడితో, భీమేశ్వర పురాణంలో, ఏడు రోజులంటాడు) కడుపు కాలితే వ్యాసుడేం చెయ్యాలి? శివుడీ దిక్కుమాలిన పరీక్ష పెట్టడం ఎంతవరకు న్యాయం? వ్యాసుడు కోపంలో అనరాని మాటలన్న మాట నిజమే:

    “ధన మదంబును వేదవిద్యామదంబు
    మోక్షలక్ష్మీ మదంబును ముదిరికాదె?
    కాశికాపట్టణంబున కరుణ లేక
    బ్రాహ్మణులు నను నిటు భంగపరిచి రనచు.” – కాశి: 7-156.

    వారి మదానికి చికిత్స చెయ్యాలని సంకల్పించాడు, శపింప పూనుకొన్నాడు:

    “ధనము లేకుండెదరు మూడు తరములందు
    మూడు తరముల చెడుగాక మోక్షలక్ష్మి
    విద్యయును మూడు తరముల వెడలవలయు
    పంచజనులకు కాశికాపట్టణమున.” కాశి: 7-158.

    మీరు ఇక్కడే వ్యాసుడు crossed the line అనొచ్చు ; కాని, శపింపడానికి చెయ్యి రాలేదు:
    “అని శపింపగ పూను నయ్యవసరమున
    నేమి చెప్పుదునో సంయమీంద్ర వంద్య!
    యుదిలగొని కంపమందుచు నుండె గాని
    శాపజాలమందుకో కేలు సాగదయ్యె.” భీ.పు. 2-109.

    అంతలో ఓ మంజులభాషిణి అడ్డుకొంది. (“వేనలి పాటపాట నర వెండ్రుకతో తిలతండులాన్వయశ్రీ,” అంటే అక్కడక్కడ నెరసిన వెంట్రుకలతో నువ్వులు బియ్యపు గింజలు కలిసినట్లుగా నట – రమ్యమైన పార్వతి కొప్పు వర్ణన.)

    పార్వతి నానా చివాట్లు పెట్టింది:

    “ఆ కంఠంబుగ నిప్డు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా
    లేకున్నం గడునంగలార్చెదవు మేలే? లెస్స! శాంతుండవే!
    నీ కంటేన్ మతిహీనులే కటకటా! నీవార ముష్టింపచుల్
    శాకాహారులు కంద భోజులు, శిలోంఛప్రక్రముల్ తాపసుల్.” కాశి. 7-163.

    ఆవిడన్నది కొంతవరకు నిజమే. ఎంతమంది వడ్లు దంచుకొని అన్నం వండుకు తినడంలేదు, ఆకులు దుంపలు తినే వాళ్ళు లేరా. కాని ఓ జీవనవృత్తికి అలవాటుపడ్డ వాణ్ణి హఠాత్తుగా వేరే మార్గం చూసుకోమనడం ఎంతవరకు సమంజసం?

    వ్యాసుడికీ శిష్యులకీ భోజనం వడ్డించింది; కరివేపాకు నుండి గడ్డ పెరుగు దాకా రెండు పేజీలకు పైగా శ్రీనాథుడు భోజనవైభవాన్ని వర్ణిస్తాడు. కడుపు నిండింది కదా, విను అని మరలా బుద్ధి చెప్తుంది – “క్రోధంబు ఫలమె నిర్మల బోధమునకు?”:

    “ఎట్టు పురాణాముల్ పదియునెన్మిది జెప్పితి వెట్టు వేదముల్
    గట్టితి వేర్పరించి? నుడికారము సొంపెసలార భారతం
    బెట్టు రచించితీవు? ఋషి వెట్టయి? నొక్క దినంబు మాత్రలోఁ
    బొట్టకులేక తిట్టెదవు పుణ్యగుణంబులరాశి కాశినన్?” కాశి. 7-194.

    భీమేశ్వర పురాణము లో పార్వతి వ్యాసుడి పట్ల కొంత సానుభూతితో అంటుంది:
    “క్రొన్నెల పువ్వుదాల్చునకుఁగూరిమి భోగ పురంధ్రి కక్కటా
    యిన్నగరీలలామమున కీపరిపాటికి నిట్టి కోపమే
    లన్న! ఘటించెదో మునికులాగ్రణి! నిక్కమువో “బుభుక్షితః
    కిన్నకరోతిపాప” మను కేవల నీతి దలంచి చూడగన్.” భీ.పు. 2-117.

    అవునులే, “ఆకలితో ఉన్నవాడు ఏపాపానకైనా ఒడిగట్టుతాడన్న” నీతి ఉంది కదా, అని. విశ్వనాథ: “ఈ మాట ఎంత విచిత్రముగా నున్నది. మానవులు రాజ్యములు సిద్ధాంతములు నేటి సర్వ నాగరికతయు నొక్కమాటలో చెప్పినట్లున్నదే!”

    త్రినేత్రుడు “కాశినుండంగ నర్హుండు కాడు వీడు, వెడలిపొమ్మను, మాటలు వేయినేల?” అని పరుషంగా మాట్లాడి బహిష్కరిస్తాడు:
    “శాపమిచ్చెదనని యనాచార సరణి
    నడుగు వెట్టినవాడ వహంకరించి
    పొమ్ము నిర్భాగ్య! మాయూరి పొలము వెడలి
    యెచటికేన్ శిష్యులును నీవు నీక్షణంబు.” భీ.పు. 2-153.

    వెళ్ళకపోతే నీమొహం రాతితో చితగ్గొడతానని వినతగని మాటలంటాడు శివుడు.

    “వడి విడువక యివ్వడువున
    నుడుపతి మకుటుండు చెవులకొనరని నుడుగుల్
    నొడివిన నే నయ్యురువుర
    యడుగులబడి కాశి వెడలి యరిగెడు వేళన్.” భీ.పు. 2-155.

    పార్వతి, “భయపడకు, నీకు నేనున్నాను, నువు దక్షారామము వెళ్ళు, నీకు శుభములు కలుగుతాయంటే,” ఇలా వచ్చాను అని అగస్త్యుని తో చెప్పి:

    “అనవధానత యావగింజంత సూవె
    పర్వతంబంత యపరాధ భరము కొలిపి
    కాశి వెడలంగ మొత్తిన గాసిఁబొంది
    తిరుగుచున్నాడ నిదియేను దిక్కుమాలి.” భీ.పు. 2-158.

    “కడు దయాళురు దేవతా గణము లెల్లఁ;
    గాలభైరవు చిత్తంబు కఠినపాక
    మీరసము పెద్దడుంఠి విఘ్నేశ్వరునకుఁ
    గాశి మనబోంట్ల కెల్లను గాని బ్రతుకు.” భీ.పు. 2-159.

    విశ్వనాథ:

    “ఈ పద్యము చాల చిత్రమైన పద్యము. కాశిలో సర్వదేవతలు కలరు. అందరు దయావంతులట! ఈ మాటలో పార్వతీదేవి యున్నది. … కాలభైరవుని చెప్పెను. డుంఠిని చెప్పెను. ఒకటి చెప్పకుండ వదిలిపెట్టెను. ఆ వదలిపెట్టినది శివునియొక్క లక్షణము. ఆయన చాల కోపియనుట. ఆయన ఆవగింజంత యశ్రద్ధను పర్వతమంత జేయునని చెప్పినాడు కదా!”

    “మనమందరము ఋషులము. తపస్సు చేయుదుము. అప్పుడప్పుడు కోపము వచ్చును. మనమెవ్వరినైన శపింతుము. ఇవతల మనమాడినది యాట. పాడినది పాట. ఆ కాశిలో మనకట్లు కుదరదు. పైన శివుడున్నాడు. మనము చేసినపని యాయన కిష్టమగునో కాదో! కానిచో మన బ్రతుకులు బండలెక్కినట్లే. మన మొగములు రాచట్లు మీద రాపించును.”

    “ఇట్టి వలపోతయంతయు నీ రెండు పద్యముల నిండ నున్నది. ఈ పద్యముల లోనిదంతయు ధ్వని. ఇట్లు వ్రాయుట చాల కష్టము. తన మనోభావములన్నియు చెప్పుటకు వీలు లేదు. మనసేమో బాధపడుచున్నది.. ఒకటి రెండు మాటలకన్న నెక్కువ చెప్పరాదు. తాను చెప్పదలచుకున్న దా రెండు మాటల వలన వ్యక్తము కావలయును ఇంతియే.”

    ‘తన కోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ …’ పద్యంలో చెప్పినట్లు పార్వతి చూపించినట్లు “కరుణ ముఖ్యం”.

    చివరగా, “The religion of one age is the literary entertainment of the next.” — Emerson

    ఇవాళ శ్రీనాథుని చదివింపచేసినందుకు ధన్యవాదములతో,
    కొడవళ్ళ హనుమంతరావు

    [1] శ్రీనాథ విరచిత “శ్రీ కాశీఖండము,” వ్యాఖ్యాత శ్రీ మలంపల్లి శరభేశ్వర శర్మ. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. 2018.
    [2] శ్రీనాథ మహాకవి విరచిత “శ్రీ భీమేశ్వర పురాణము,” వ్యాఖ్యాత డాక్టర్ గుండవరపు లక్ష్మీనారాయణ. 1997.
    [3] “కావ్య పరీమళము,” విశ్వనాథ విమర్శ గ్రంథనిధి – IV, విశ్వనాథ సత్యనారాయణ.

  6. బొమ్మలగూటిలో ఠాగూరు గురించి లక్ష్మీ అనంతరాజు గారి అభిప్రాయం:

    07/27/2024 10:43 am

    చంద్రలత గారు! నమస్కారం. టాగోర్ అంటే నాకు ఎంతో ఇష్టం. స్కూల్ లైబ్రరీలో టాగోర్ రచనలు చాలా చదివాను. ‘చండాలిక’ నృత్య నాటిక ప్రదర్శించాం. అంతగా గుర్తు లేదు. అలాగే టాగోర్ చిత్రం ఆయిల్ పేయంట్స్‌లో వేసాను. అనుకోకుండా ఈరోజు మీ పేజీ చదవడం జరిగింది. ఎంత బాగా రాసారో!! మళ్ళీ గురుదేవులతో కనెక్ట్ చేసారు.
    అనేక ధన్యవాదాలు.

  7. చక్కని తండ్రికి చాంగుభళా! గురించి Tadepalli subrahmanyam గారి అభిప్రాయం:

    07/24/2024 1:53 am

    A small shortcoming. You should have appended “ముచ్చట బ్రహ్మాదులకు దొరకునా … చూదము రారే” keertana to make it more charming.

  8. కాలనాళిక గురించి Tadepalli subrahmanyam గారి అభిప్రాయం:

    07/23/2024 11:28 am

    కధకులలో రారాజులయిన మధురాంతకం తండ్రికొడుకులలాగా కథలు రాయాలంటే తలక్రిందులుగా తపస్సు చేయాల్సిందేనని మరొకమారు ఈ కథ నిరూపించింది . నరేంద్రగారికి కృతజ్ఞతలు.

  9. పొంతన గురించి Tadepalli subrahmanyam గారి అభిప్రాయం:

    07/23/2024 10:22 am

    సూటిగా స్పష్టంగా ఏ శషభిషలు లేకుండా చాలా ఇంపుకలిగేటట్టు వ్రాసారు.

  10. నాకు నచ్చిన పద్యం: హరిశ్చంద్ర కాటి సీను గురించి sankara appajee గారి అభిప్రాయం:

    07/23/2024 9:23 am

    ధన్యవాదములు సారు. పద్యాలతో పాటుగ భావాలు గానీ తాత్పర్యము గానీ వుంటే చాలా బాగుంటుంది.

« 1 ... 24 25 26 27 28 ... 1554 »