పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16345

  1. కంప్యూటర్ చిప్ కథ – 8: మైకేల్ ఫారడే ప్రయోగాలు గురించి Mr. Rao Vemuri గారి అభిప్రాయం:

    12/01/2025 2:52 pm

    ఇంత విపులంగా రాస్తూన్న ఉద్గ్రంధానికి “చిప్పు కథ” అని పేరు నప్పలేదు.

  2. పుస్తక పరిచయం: మధుమేహం, సమగ్ర విశ్లేషణ గురించి Mr. Rao Vemuri గారి అభిప్రాయం:

    12/01/2025 2:40 pm

    ఎమెస్కో వారితో నాకు జరిగిన అనుభవం చెబుతాను. “నా అమెరికా అనుభవాలు” పుస్తకం ప్రచురించినప్పుడు నాకు “రాయల్టీ” లాంటిది ఏదీ ఇవ్వలేదు కానీ, నేను బయలుదేరి తిరిగి అమెరికా వచ్చేస్తూన్న తరుణంలో 100 ప్రతులు నా హొటేలు గదికి పట్టుకొచ్చి అందజేసేరు! అదే నా “రాయల్టీ” అన్నారు. మిగిలిన 900 ప్రతులు వారు అమ్ముకున్నారనే అనుకుంటున్నాను. అప్పటికప్పుడు 100 ప్రతులని నేను ఎలా మోసుకు రాగలను? కనిపించినవారందరికి హరేకృష్ణా వారు పంచిపెట్టినట్లు పంచిపెట్టేను – విమానాశ్రయంలో కూడా!

  3. కృష్ణశాస్త్రి వచన (సం)గీతాలు గురించి తః తః గారి అభిప్రాయం:

    12/01/2025 2:36 pm

    కృష్ణశాస్త్రి గారి మరొక పార్శ్వం వారి సినిమాల మాటలు –
    బి ఎన్ మల్లీశ్వరి లో పాటల్లో కనపడతాడు . మాటల్లో పాత్రల్లో దాక్కుంటాడు.
    తః తః

  4. స్త్రీవాద కథల సంపుటి: విభజిత గురించి kavya గారి అభిప్రాయం:

    11/24/2025 7:00 pm

    ” కథ నేపథ్యంలో హిజాబ్‌ విషయంలో దేశంలో మతం పేరుతో మైనారిటీలపై హిందుత్వవాదులు చేస్తున్న అరాచకాలను చూపించారు. హిజాబ్‌ వేసుకోవాలా? వద్దా అనేది ముస్లింలకు సంబంధించిన వ్యక్తిగత విషయమని, దానిపై ఇతర మతస్తులు అభ్యంతరపెట్టడం మైనారిటీల హక్కులను తిరస్కరించడమే అవుతుందని కథలో పేర్కొన్నారు.”

    ఈ దేశమ్‌లో ఏ వాదమైనా హిందువులమీద పడి ఏడవకపోతే దానికి పరిపూర్ణత సిద్ధించదు. సన్మానాలు సత్కారాలు లభించవు.

  5. సెప్టెంబర్ 2025 బైరాగి ప్రత్యేక సంచిక గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    11/23/2025 12:14 pm

    కేష్ ఇచ్చినవాళ్లకన్నా, స్త్రీని కేష్ చేసుకున్నవాళ్లు, రక్షిస్తున్నట్టు నటించి అసహాయస్ధితులు కల్పించి భక్షించిన వాళ్లే సాహిత్యం నిండా కనిపించేది.

    ఇది మొత్తం ఈ ఏడాది అంతట్లో ఈమాట పత్రికలో నేను చదివిన అత్యుత్తమ వ్యాఖ్య. మొహమాటం లేకుండా అనేకానేక మేకులు వేసిన అరిగిపోయిన చెప్పు తీసి వాటిల్లో వొక వాడి మేకు మొహం మీద దిగబడేటట్టు కొట్టినట్టు చెప్పారు. బ్రేవో!

  6. పుంతరేవమ్మ తల్లి గురించి పల్లె దేవప్రియం గారి అభిప్రాయం:

    11/21/2025 5:45 am

    క్లిష్టమైన కథా వస్తువును సునాయాసంగా చెప్పారు. జనాలు ఇంకా ఎలా మోసగింపబడుతున్నారో, ఎలా మోసపోతున్నారో చక్కగా వివరించారు. రచయితకు అభినందనలు.

  7. సెప్టెంబర్ 2025 బైరాగి ప్రత్యేక సంచిక గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    11/17/2025 2:21 pm

    “బైరాగి శతజయంతి సందర్భంగా, ఈ ప్రత్యేక సంచికలో శ్రీశ్రీ నుండి సమకాలీన రచయితల వరకు ఎందరో ప్రముఖులు బైరాగి సాహితీమూర్తిత్వాన్ని వివిధ కోణాల్లో ఆవిష్కరించిన రచనలను మీకందజేస్తున్నాము…. ఈ సంచిక గురించి మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి.”

    A vent out.

    1920 లలో పుట్టిన ఆలూరి బైరాగి, మా తండ్రుల తరం వాడేగా. వారి సమవయస్కుడైన తెలుగువాడు.

    ఆ రోజుల్లో ఆంధ్రాలో ఎక్కువమంది, అంతో ఇంతో అక్కడా ఇక్కడా చదువుకుని, స్కూల్ మాస్టర్లుగా కుదురుకొనేవారు. వాళ్లకి చాలామందికి డిగ్రీలు ఉండేవి కావు అప్పటికి. మా పెదనాన్నగారు, నాన్నగారు, వైజాగ్ మెడికల్ కాలేజీకి వెళ్లి డిగ్రీలు తీసుకున్నారు. వారి మామగార్లకు లింగులింగుమంటూ ఒకర్తే కూతురు ఉంటంతో, ఆ రైతులు, వాళ్ల పంటడబ్బుతో అల్లుళ్లని చదివించారు. ఒక పెదనాన్నని, బాబాయిని దింటిమెరక లో, వాళ్ల తండ్రి, (చదివించే స్తోమతు లేక) పొలం పనుల్లో పెట్టాడు. పొలాలగట్లు, నీళ్ల తగువుల్లో రాటుదేరి తరవాత వాళ్లు కొన్నాళ్లు కమ్యూనిస్టులయ్యారు. మా మేనత్తలకి, పెద్దమ్మ పిన్నమ్మలకి స్కూల్ చదువు లేదు. మా అమ్మ బెనారస్ మెట్రిక్ పాసయ్యింది. కాలేజ్ కి వెళ్లవలసింది, కాని నా ఉద్భవంతో ఆమె చదువు ఖతమ్.

    మా నాన్నగారి గ్రాడ్యుయేషన్ అప్పటిది, ఎన్లార్జ్డ్ రంగుల ఫొటో ఆయన బెజవాడ ఇంట్లో ఒక గుమ్మం మీద, చాలా ప్రామినెంట్ గా ప్రదర్శించబడేది. వరండాలోకి వస్తూనే అందరికీ కనపడేది. అంత అందగాడు సినిమాల్లో కెందుకు వెళ్లలేదో మరి తెలియదు.

    హాలులోకి వెళ్లాక, పక్కగా ఒక గోడమీద ఒక చిన్న ఫొటో ఉండేది. అది మా నారాయణరావు మామయ్యది. బైరాగి చిత్రం చూస్తే నాకు ఆ ఫొటో గుర్తు వచ్చింది. ఒక మృతుని ఫొటో చూసినట్టుగా అనిపించింది. జీవకళ లేదు. Sunken eyes. Sadness. ప్రేతకళ. మా మామయ్య (ఇరవైల్లో ఉన్న యువకుడు) ఆయన్ని పోలీసులు బెజవాడలో కాల్చి చంపాక, అప్పటి ఫొటోగాని కుటుంబం అడిగితే పోలీసులు ఇచ్చారా అని నా అనుమానం. కాని మేం ఎవరమూ ధైర్యం చేసి మా మామయ్య ఆ ఫొటో గురించి అడగలేదు.

    బైరాగి చిత్రంలో, అతని మీసాల చివరలు కొంచెం పైకి తిప్పాడు చిత్రకారుడు అన్వర్. కాని వీరత్వం ఏమీ రాలేదు. బొమ్మలో అతను అప్పటికే టి.బి. పేషెంట్ లా ఉన్నాడు. బహుత్ ఉదాసీ దిఖ్ ర హా హై.

    ఈ సంచికలో ఆలూరి బైరాగి గురించి తెలుగువాళ్లు ఇచ్చిన భోగట్టా చదివినందునే, నా ఈ-ఆలోచనలు.

    అసలు స్త్రీ సంపర్కమే లేని ఆలూరి బైరాగికి బోగం వాళ్ల గొడవ దేనికి! వాళ్ల మీద ఈయన నిరసన దేనికి? తెలుగులో ఆ పిచ్చ పాటలెందుకు? ఈయనేదో పెద్ద ధనవంతుడైనట్టు వాళ్ల చిరుగు బట్టల గురించి, వాళ్ల మురికి వాడల గురించి అసహ్యపడటం దేనికి.

    స్త్రీ ఒక సాధనమై పోయింది కవితల ప్రాక్టీసుకి. ఆడవాళ్లపై రాయటం కవుల, రచయితల గొప్పగా భావించి జాతీయ, అంతర్జాతీయ ఎవార్డులు ఇవ్వటం అదో రివాజై పోయింది.

    రెడ్లైట్ డిస్ట్రిక్ట్ అతివల మీద మోజు, నిరసనలు -కథలుగా, పద్యాలు, నవలగా రాసి ప్రపంచ సాహిత్యంలో, పేరు, ప్రైజులు తెచ్చుకున్నవారెందరని చెప్పను! ఎవరితో మొదలెట్టను! శ్రీనాథుడు, బాల్జాక్, ధూర్జటి, సోమర్సెట్ మామ్, పెద్దన, వోల్టేర్, ఫ్రాయిడ్, టాగోర్, జోలా, ప్రేమ్చంద్, శరత్, నేబకోవ్, అడివి బాపిరాజు, మొపాసా, మార్కేజ్, డాస్టావ్యెస్కీ, బూదలేర్, గురజాడ, వీరేశలింగం, ఆస్కార్ వైల్డ్, సాహిర్, ఆలూరి బైరాగి, వెరీ రీసెంట్లీ మధురాంతకం నరేంద్ర.

    కేష్ ఇచ్చినవాళ్లకన్నా, స్త్రీని కేష్ చేసుకున్నవాళ్లు, రక్షిస్తున్నట్టు నటించి అసహాయస్ధితులు కల్పించి భక్షించిన వాళ్లే సాహిత్యం నిండా కనిపించేది.

    ఆలూరి బైరాగికి అన్నిటికీ మధనపడటం ఒక వ్యసనమైనట్టుంది. టి.ఎస్. ఎలియట్ తరహాలో నాన్ స్టాప్ బిచ్చింగ్. సుబ్బరంగా కుడిచి కూర్చుని, విషాదిస్తుంటారు కొందరు. ఆ బ్రాండ్ ఇంటలెక్టుయల్స్‌ని సైకయాట్రిస్టులే సహించగలరు. అసలుకి ఆలూరి బైరాగికి పర్సనల్‌గా ఏమంత ఉపద్రవం వచ్చిందని నాకు అనిపించలేదు.

    అతను యుద్ధానికి వెళ్లిందే లేదు. సైడ్లైన్స్ మీద ఉండి ఎందుకా శోకాలు, ఫిలసాఫిక్ విమర్శలు. యుద్ధంలో స్వయంగా పాల్గొన్న వాళ్లు ఎందరో రచయితలు, వారి ఘోషలు వినిపించారు. కొందరు బలవంతంగా డ్రాఫ్ట్ చెయ్యబడిన వారు, ఎంత ఘోరమైన ఎక్స్పీరియన్స్ అని వారి సొంత మాటలలో రాసుకున్నారు. ఇండాలజిస్ట్ Heinrich Zimmer రాసుకున్న చిన్న ఆత్మచరిత్ర (Some Biographical Remarks) నేను చదివాను. He hated war.

    “The only benefit which I derived from my participation in the war was complete liberation from the authority of the older generation who had managed the war and managed it into catastrophe. I said to myself: (“I do not criticize anybody or anything. But henceforth I shall decide what I take seriously, if anything at all. I am a revenant, a ghostly revenant. It is mere irony that I have come back. Many much better did not. I offered my life for ideals and purposes of the community, and did it naively, willingly. With this life I brought back, I am free to do what I decide to do, -free as a guest from the other world. They have no claim upon me anymore.” …)

    హెమింగ్ వే, ఫిట్జరాల్డ్, జె.డి. సాలింజర్ లాటి వాళ్లు యుద్థం గురించిన కథలు, నవలలు రాసారు. వార్ టైమ్-అనుభవాలనుండి వారికి మానసిక వైకల్యం కలిగింది. అప్పటికి పి.టి.ఎస్ డిసార్డర్ కి వైద్యం లేదు. అసలు డయాగ్నోసిస్ యే అప్పటికి లేదు కదా. సైనికుల ఫిజికల్ అంగ వైకల్యాలు ఎంత నిజమో, మానసిక గాయాలు అంతే నిజం. అవి తీరే బాధలు కావు.

    If American Hemingway blew his brains out, that violent act called for same kind of courage/despair, to be an ambulance driver in horrid wars.

    యుద్ధం విషయంలో, మనుషులు ముందుగానే ఆలోచించుకోటం మంచిదే. ఆ భయంకర మారణకాండ లోనికి దిగకూడదు అని బైరాగి నిర్ణయించుకునుంటే గాని, అది మంచిదే.

    ఎయిర్ లైన్ పైలట్ లుగా, వార్ టైంలో పనిచేసిన Roald Dahl, Antoine De- Saint Exupéry- ఫ్లయింగ్ కి సంబంధించిన రచనలు చేసారు. వీరు, ఒకే రకం ఆలోచనలో కూరుకు పోకుండా, వివిధ రకాల ఇతివృత్తాలు తీసుకుని, పిల్లా పెద్దల కోసం విస్తృతంగా రచించారు. ఇంగ్లిష్ Roald Dahl తన జీవిత కాలంలో అనేక రకాల పనులు సమర్ధతతో సాధించటం చూస్తే, ఇతనికి down time అనేది లేదా అనిపిస్తుంది. I am in awe.

    French రచయిత Guy d. Maupassant యుద్ధంతో పరిచయం ఉన్నవాడే. దానితో పాటు వేశ్యలతోనూ, సిఫిలిస్ రోగం తోనూ. ముందు మురికి వాడలలో, డబ్బులేని ప్రాస్టిట్యూట్స్ గురించి కథలూ, నవలలలో రాసి, తను రచయితగా డబ్బు, ఖ్యాతి సంపాదించుకున్నాక, ఆఖరు నవల ‘The Alien hearts’ లో పారిస్ హై సొసైటీ ‘Coquettes’ గురించి, రాసాడు. వారి Salons లో ప్రతి సాయంత్రం గుమిగూడే నావలిస్ట్ లు, మ్యూజిక్ కంపోజర్ లు, సింగర్స్, స్కల్ప్టర్స్ ను చూస్తూ, వారందరి డిస్కషన్స్ అక్కడ వినవచ్చు.

    మొపాసా సిఫిలిస్ వల్లే చిన్నవయసులోనే మరణించాడు. సిఫిలిస్ కు అప్పుడు వైద్యం లేదు. ఐతే, తెలుగు బైరాగి చౌదరికి క్షయ వచ్చినప్పటికి, ఇండియాలో ఆ జబ్బుకి వైద్యం ఉంది. అతను ఇతరులకు జబ్బు అంటకుండా ఉండేందుకు, వారి ఆరోగ్యం గురించి కూడా తను వైద్యం చేయించుకోవాలి. అది మానేసి, దగ్గుకుంటూ గదిలో కూర్చుని కాగితాలు ఖరాబు చేస్తుంటే, అది మూర్ఖత్వంగా కాక, వీరత్వంగా భావిస్తారేం? ఎక్కడో జరిగే యుద్ధం గురించి చర్చలు, భారతీయ సమాజసంస్కరణ గురించి, కిళ్లీబడ్డీల దగ్గర చర్చలు ఎడతెగకుండా చేసి. ఇన్డివిడ్యుయల్ రెస్పాన్సిబిలిటీని ఇగ్నోర్ చెయ్యటం, does that make any sense! Not to me.

    పైగా, టి.బి. డెత్ అంత సుకరమైంది కాదు. ఆ ఫీవరిష్నెస్, ఎర్రబడే కళ్లు, లోతుకుపోయే చెంపలు, దుర్బల కాయం, జ్వరపు వాగుడు, దగ్గు, పాత ఓపెరాలు చూసీ, పాత చరిత్రలు చూసీ, అక్కడి నుంచీ ఆ జబ్బు గురించి ఒక రొమాంటిక్ ఇంప్రెషన్ కవుల మనసులలో, రచనలలో చొరబడిందేమో. ఆ రోగంతో చావు, Bronte sisters, Keats, Shelley, Toru Datt టైమ్ లో వారికి తప్పలేదు. కాని, నయమయ్యే వ్యాధికి వైద్యం చేయించుకో పోటం, హైదరాబాద్లో ఇరవయ్యో శతాబ్ది మనిషికి – it’s inappropriate. It is irresponsible, anti-social behavior.

    “మళ్లీ మీకు చెపుతున్నాను”, ఈ పై విషయాల మీద ఎందుకు రాస్తున్నానంటే, – ఈ సంచికలో ఇక్కడ రాసిన ఏభై మంది నుండీ నాకు ముక్కా చెక్కాగా తెలిసిన విషయాలు ఇవే. బైరాగి కవిత్వం కాదు.

    అతడి సొంత రచనలు ఏవో సరిగా నాకైతే తెలియడం లేదు. అతని కన్నా ముందటి ప్రపంచకవులను, ఉదా: ఎలియట్, హాఫిజ్ లను, అతను ఏ భాషలో మొదట చదివి అనువదించుకున్నాడో, సమకాలీన కవుల అనువాదాలకు, అనువాదాలు గాని చేసాడో అనుసరణలు, హేళనలు చేసాడో తెలియటం లేదు.

    బైరాగి హిందీ చందమామలో హిందీలో రాయలేదా? మరి తెలుగుపాట ఇచ్చారేం ఉదాహరణగా? హిందీ చందమామలో, తెలుగు చందమామలో ఒకే కథలు, కవితలు అనువదించి ప్రచురించేవారా?

    ఈ కవికి నాగిరెడ్డి, చక్రపాణిలు సినిమా గీతాలు రాసే అవకాశం ఇవ్వలేదేం. ఎందుకనో? కవి బైరాగి ఎవరి మాటలూ ఖాతర్ చెయ్యని, మొండివాడు ఐనందున అని నేను అనుకోలేపోతున్నా. ఇతడు షాయర్ సాహిర్ కన్నా స్వేచ్ఛా స్వభావియా!

    బైరాగి మొదటికి హిందీ కవే, ఛాయావాద కవులతో సరితూగే కవి అని ఒకరంటే, వారి కవిత్వం గూర్చి కొంచెం చదివాక, నేను ఎంతో ప్రియంగా గుర్తు చేసుకున్నది -బైరాగి కరెక్ట్ కాంటెంపరరీ ఐన హిందీ-ఉర్దూ కవి साहिर लुधियानवी. (Sahir Ludhianvi). ఇతని హిందీ కవిత్వం – హిందీ సినిమాల పుణ్యమా అని మస్తుగా విన్నాను.

    సాహిర్ సొంత హిందీ కవితలకు మురిసి, మోహించి, సినీసంగీత దర్శకులు సంగీతం కూరిస్తే, సినీగాయకులు పాడారు. In his case, his poetry took precedence. అతడి హిందీ భాషకూ, అతని కవిత్వానికే ప్రాధాన్యత. అతని భావాలకే ప్రాధాన్యత. అతడి మాటల ఎన్నికకూ, అమరికకూ ప్రాధాన్యత.

    అరే! సాహిర్ -అదే వెలయాళ్ల మీద, తాజ్ మీదా, హింద్ గురించీ, దునియా గురించి, రాస్తే, ఓహో ఓహో అని మెచ్చుకుని, బైరాగి రాస్తే నచ్చుకోవేంటి? అని ఆ కవిని కూడా విన్నవాళ్లు నన్నంటే – ఎందుకంటే, వారిద్దరి అప్రోచ్ లో, ఎక్స్ప్రెషన్ లో చాలా తేడా కనిపించింది. అందుకేమో!

    “నాకు మా బైరాగి తెలుగు కవితలు ఎంత ఇష్టమో హిందీ కవితలూ అంత ఇష్టం.” అంటూనే అతడి హిందీ కవితను తెలుగు చేసి దాశరధి వినిపించారెంచేత? హిందీలోనే కవిత్వం అంతా రాసి ఉంటే ఎప్పుడో జాతీయ బహుమతి వచ్చుండేది అన్నారేం సూరపనేని? అంటే అతను హిందీలోనే రమ్యంగా రచించాడు అనేనా?

    హిందీ, తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో బైరాగి సొంత కవిత్వం చెప్పినప్పుడు, ఆ భాషల్లోనే పాఠకులను ఎందుకు చదువుకోనివ్వరు! అతడి కవిత్వం అతడు రాసిన భాషల్లోనే, క్రోనలాజికల్ గా ప్రచురించటం ఈ డిజిటల్ ఏజ్ లో చాలా సులభం. ఆ మూడు భాషలూ వచ్చినవాళ్లు బోలెడుమంది.

    ఐతే, ఇలాటి శతజయంతుల ఉత్సాహంలో, ఉత్తరాన హిందీకవులూ, ఆంధ్రా, తెలంగాణా హిందీ, తెలుగు కవులూ, జర్నలిస్టులు, ప్రవాస జర్నలిస్టులు, ఎవరికి వారు, బైరాగి మా కవంటే మా కవి, అని లాక్కోటాలూ పీక్కోటాల్లో, అభిమానుల అభిమానపు నివేదనల సంరంభంలో, ఒక భాష నుండి మరో భాషకు, అనువాదాల అనువాదాల అనువాదాల తాపత్రయంలో, ఆలూరి బైరాగి కవిత్వమేదో తెలుసుకోటం నాకు ప్రస్తుతానికి అసాధ్యం.

    అంతా గందరగోళం! కంగాళీ! రభస! Guys! Did I come to the right party? Is this how birthdays are celebrated these days!

    Pardon me, I am wanted someplace else.

    By Lovers creek
    Moon is bright
    Violin plays so light
    Cheek to cheek

    We dance tonight
    Hold me tight
    Kiss me right
    You and I
    We dance tonight.

    -Lyla

    A Lovely Holiday Season All!

  8. కథల గారడీ తెలిసిన ముని సురేష్ పిళ్లె గురించి సురేఖ పులి గారి అభిప్రాయం:

    11/17/2025 2:31 am

    ఏ ఒక్కరూ, ఎందులోనూ 100% నిష్ణాతులు కారు, కాలేరు కూడా…

    సమీక్ష చేసేవారు రచయిత మనోభావాలను దెబ్బ తీయకుండా చెప్పగలిగిన నాడు ‘విమర్శకుడు’.. అవుతాడు. ఛాన్స్ దొరికింది కదా అని కీలెరిగి వాత పెట్టాలనుకునే వారి సంఖ్య ఎక్కువ.

    పాఠకుడు రచయితకు ఇచ్చేది ప్రోత్సాహం! కానీ చాలా మటుకు రచయితకు లభించేది నిరుత్సాహం! అయినా రచయిత తన భావనలతో మనముందు స్వచ్ఛంగా మళ్లీ మళ్లీ ఉంచుతాడు. ఓడిపోని సైనికుడు!

  9. ఆధునిక ఆర్షకవి ఆదిమ బైరాగి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    11/15/2025 11:10 pm

    సాహితీ ఉద్దండులతో (సూరపరాజు, వాడ్రేవు, తమ్మినేని, న్యాయపతి) విభేదించడానికి బిడియపడుతూనే సాహసిస్తున్నాను.

    సూరపరాజు గారు,“Literary Criticism is not on literature; it is literature,” అన్నదానితో నాకు పేచీ లేదు. కాని ఉత్తమ సాహిత్య స్థాయికి చేరిన విమర్శలు అరుదు.

    రెడ్డిగారి ప్రోత్సాహంతో శర్మగారు 1928 లో అనంతపురం కళాశాలలో చేసిన ఉపన్యాసాలు ఇప్పటికీ ఇంపుగా ఉన్నాయి:

    “వెదకి, యేర్చి యోగివేమన్న చెప్పిన
    మాటవనలకొక్క నీటుఁ గూర్చి
    వానిలోన రుచుల వాచవి చూపితి
    కీర్తనీయ చరిత! కృష్ణశర్మ!”
    — చిలుకూరు నారాయణరావు

    ఆడవారి రచనలపై ఉపన్యసించమని 1928 లో ఇంగ్లాండు కళాశాలలు కోరితే, Virginia Woolf, “But, you may say, we asked you to speak about women and fiction – what has that got to do with a room of one’s own?” అంటూ మొదలెట్టిన ప్రసంగం ఇప్పటికీ ఓ సాహితీరత్నంగా విలసిల్లుతోంది.

    “ఆగమగీతి” లోని ప్రారంభానికి

    “మానస యజన వాటికపై మరల నేడు
    ముసురుతోంది సందేహాల మందేహాంధదేహచ్ఛాయ
    ద్విధాదూషిత ద్వ్యాభా సహజాసుర మాయ.”

    వ్యాఖ్యానం ఇస్తూ సూరపరాజు గారు, గాయత్రీ మంత్రం, భగవద్గీత, శంకరభాష్యం, హరివంశం, సహస్రనామాలు, వేదాంతులు, చివరకి అంధరంధ్రం (Black Hole) దాకా వెళ్ళారు. నాకు హడలు పుట్టి, భాష్యకారుని గురించిన బైరాగి హెచ్చరిక గుర్తొచ్చింది: “భాష్యకారుడు అపరిణత బుద్ధులైన పాఠకులకు సహాయకారి కావచ్చు. సాధారణార్థాలు బోధించవచ్చు. కాని ఈ ప్రయత్నంలో తరచు అతడు కావ్యంలో మృణత్వాన్ని చెరుస్తాడు. అతి సున్నితంగా వ్రేలిడివలసిన చోట నానార్భాటాలు చేసి తుదకు రసాభాస చేసి కూచుంటాడు.” కటువుమాటకి క్షమించవలె.

    మందేహులు అంటే వికాసం కోల్పోయినవారని నిఘంటువు అర్థం. (“పొడమిన సందేహంబుల, జడిసిన మందేహులం బ్రసన్నులఁ జేయన్‌,” పాండురంగ మాహాత్మ్యము, 1-157. అచ్చ తెలుగు అంకెలకు బదులు వాడుకలో ఉన్న అంకెలను వాడమని ఆంధ్రభారతి శాయి గారికి మనవి). “ద్విధాదూషిత ద్వ్యాభా” అంటే నాకు సరయిన అర్థం దొరకలేదు కాని మందేహుల మానసాన్ని కటిక చీకటితో (ద్విధాదూషిత ద్వ్యాభా సహజాసుర) పోల్చినట్లు ఆ సమాసాన్ని అర్థం చేసుకున్నాను.

    కవిత ముగింపుకి సూరపరాజు గారి వ్యాఖ్యానం: “ఉదయిస్తాడు…..నవమానవుడు…అతని వ్యోమమార్గంలో ఉల్కాధరప్రహరి తరణి.” (“ప్రహరి” లోని “హరి” విష్ణుసహస్రనామఫలశ్రుతిలోని సర్వప్రహరణాయుధుడా?)

    ఉల్కాధర ప్రహరి అంటే చుట్టూ (ప్రహరి) ఉల్కని (మెరుపుని) ధరించిన వాడు (సూర్యుడు) అని అర్థం చేసుకున్నాను. విష్ణు సహస్ర నామాలు తలపుకే రాలేదు.

    “ఆగమగీతి”కి ఉపశీర్షిక “సంచయనం” అన్నారు కాని నాదగ్గరున్న ప్రతుల్లో ఎలాంటి ఉపశీర్షికా లేదు. బైరాగి “అస్థిసంచయనం చేస్తూ,” ఈ ప్రయాణాన్ని “నీ గుండెల డమడమాల బండి మోత సద్దు మణగి” (“క్షమించండి”) వర్ణించాడన్నారు. ప్రఖ్యాత పుష్కిన్ కవితనివ్వడం సరియే కాని, ఎర్రన హరివంశంలోని పద్యంలో (షష్ఠాశ్వాసము-22) ఏముంది విశేషం? కవ్వాలు, కొడవళ్ళు, కత్తులు, బియ్యం, పప్పులు, అన్నీ బస్తాలలో వేసి బళ్ళు కట్టి బృందావనానికి బయలుదేరారని చెప్తుంది.

    “ఉపనిషత్తు ఇంటి సరుకులు, బిందెలు గిన్నెలు డబ్బాలు, బరువును మోస్తున్న బండిని చెబుతున్నది. ఇది తన కవితలో అస్థిత్వం నుండి అస్తిత్వానికి ప్రయాణంగా ఊహించాడు ఔపనిషద బైరాగి,” అన్నారు. ఉపనిషత్తులలోని బండి గురించి నాకు తెలియదు కాని, “క్షమించండి” లో బైరాగి, తన కవిత జనుల “జీవిత జయఘోషల పల్లవి” ని పలకలేదు కాని:

    “జీవితం ఉరిత్రాటి ఉచ్చులాగు
    ఒంటరి సున్నాలాగు పిలుస్తోన్న రోజున
    నీ గుండెల డమడమాల బండి మోత సద్దుమణగి
    నీడలేని మైదానంలో, ఒంటరి బాటసారిలా ప్రాణం
    మొండి గుర్రమై చతికిలపడినప్పుడు నా గానం
    నైరాశ్యపు కొండబాటపై, తడబడు అడుగులలో కొనఊపిరి వెదుకులాట
    నీ మండిన గొంతుకలోని ఎండిన పెదవులపై
    మంచుబొట్టు చెమ్మలాగు నాపాట ఆరిపోతే చాలు
    బ్రతుకు కిటికీ రెక్కలోంచి
    నీ వెరిగిన మొగం ఒకటి మెరసిపోతే చాలు!”

    ఇది సామాన్య పాఠకులకి బాగానే అర్థం అవుతుంది. ఉపనిషత్తుల ఉటంకాలు మిగిల్చేది గందరగోళాన్ని మాత్రమే. చివరన, “విజ్ఞానశాస్త్రవేత్తలు దానినే అంధరంధ్రం (Black Hole) అంటున్నారు. ఆ రంధ్రంలోకి వెలుగు వెళుతుంది, వస్తుంది,” అన్నారు. బ్లాక్ హోల్ నుండి వెలుగు రావడమేమిటి? అసలు దాని పేరే “నల్లని గొయ్యి.” దాని నుండి ఏదీ, కాంతితో సహా, వచ్చే ప్రసక్తే లేదు. దీని గురించిన ఆసక్తికరమైన వాస్తవ కథ ఉంది.

    జులై 31, 1930 న ఇరవై ఏళ్లయినా నిండని ఓ కుర్రవాడు స్వదేశాన్ని వదిలి పైచదువులకి ఇంగ్లాండుకి ప్రయాణమయ్యాడు. రెండు వారాలకు పైనే ఓడ ప్రయాణం. తోటి ప్రయాణీకుల సరదాలలో పాల్గొనకుండా, తను తెచ్చుకున్న మూడు భౌతికశాస్త్ర పుస్తకాల అధ్యయనంలో మునిగాడు. దానిలో ఒకటి Arthur Eddington’s “The Internal Constitution of the Stars.” నక్షత్రాల జనన మరణాల గురించి ఆలోచిస్తూ, ఆ కుర్రవాడు ఓ వినూత్న విషయం కనుగొన్నాడు. సూర్యుని కన్నా పెద్ద నక్షత్రాలు క్షీణించి కొన్ని చివరకి “బ్లాక్ హోల్” (ఆ పేరు తర్వాత వచ్చింది) గా మారతాయని తన లెక్కలద్వారా చూపాడు. ఇంగ్లాండు చేరిన తర్వాత తన ఫలితాలని ప్రచురిస్తే, పెద్దలు నమ్మలేదు. Eddington చిన్నచూపుతో నిరుత్సాహపడిన యువకుడు [1], ఇంగ్లాండు వదలి అమెరికాలో స్థిరపడ్డాడు. మరి కొన్నేళ్ళకి అతని పరిశోధనలు నిజమని తేలాయి. అతనే 1983 లో నోబెల్ బహుమతి పొందిన S. Chandrasekhar. నోబెల్ విందు ప్రసంగంలో మనందరికీ తెలిసిన టాగోర్ కవితనీ, అంతగా తెలియని వుల్ఫ్ నవలనీ ప్రస్తావించాడు (https://www.nobelprize.org/prizes/physics/1983/chandrasekhar/speech/).

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “Empire of the Stars: Obsession, Friendship, and Betrayal in the Quest for Black Holes,” by Arthur I. Miller. Houghton Mifflin Company. 2005.

  10. తండ్రి గురించి Ramesh గారి అభిప్రాయం:

    11/07/2025 3:02 pm

    కథలో ఎమీ లేదనిపించింది, కానీ ఎంతోవుంది. కథ చాలా వుద్విగ్నంగా వుంది. మానవసంబంధాలు పట్ల మనసు పడే బాధ మన మనసుని బాధించింది. ధన్యవాదాలు.