Comment navigation


15534

« 1 ... 10 11 12 13 14 ... 1554 »

  1. అక్టోబర్ 2024 గురించి దాసరి అమరేంద్ర గారి అభిప్రాయం:

    10/05/2024 3:57 am

    సాహిత్యం వైయక్తిక ప్రక్రియ అనిపించినా అది సామూహిక సామాజిక ప్రక్రియ. మనిషికి సాహిత్యం కళలు ప్రాథమిక అవసరాలు కావు. ఏ సమూహానికైనా తిండి గుడ్డలాంటి అవసరాలు తీరాకే కళాసృజన సాధ్యం.

    *
    సాహిత్య ప్రయోజనాలు అనేకం: మానసోల్లాసం, మానసిక వికాసం, వ్యవస్థ స్థిరీకరణ, నిరసన ప్రకటన, ప్రతిఘటన, పోరాటం – చరిత్రలోకి వెళితే ఇలా ఎన్నో ప్రయోజనాలు సాధించబడి కనిపిస్తాయి. ఈ ప్రయోజనాల్లో కొన్ని యథాతథస్థితిని కాపాడేవి. కొన్ని గతవైభవం కోరేవి. కొన్ని గతాన్నీ వర్తమానాన్నీ ప్రశ్నించి రేపటి మార్పుకు దారి వేసేవి.
    *
    గతమూ యథాస్థితీ కోసం రాసేవారి వెనుక శతాబ్దాల సాధన ఉంది. వ్యవస్థ తోడ్పాటు తప్పక ఉంటుంది. వారి వస్తువు ఎలాంటిదైనా శైలి శిల్పం లాంటి సాహితీ విలువలు పుష్కలంగా ఉంటాయి.

    రేపటి కోసం రాసేవారిది ఏనాడైనా ఎదురీత. రాయడం అప్పుడే నేర్చుకొంటోన్న బృందమిది. జీవితమే వీరి కథా వస్తువు. పోరాటమే వీరి శైలి. ధిక్కారమే వీరి శిల్పం.
    *
    ఈమాట ఎవరిది? ఎవరికోసం?
    మనకు స్పష్టత అవసరం.
    మానసోల్లాసం, వికాసమే లక్ష్యమనీ, రచనలో పరిణత నిర్దుష్టతే ప్రామాణికమనీ ఈమాట అనుకుంటే – సరే… అలానే కానిద్దాం.

    కానీ సాహిత్యానికి వేరే ప్రయోజనాలకోసం దగ్గర అయ్యే పాఠకులూ రచయితలూ ఉంటారనీ, వారి రచనల్లో మనమనుకొనే ప్రామాణికత ఉండక పోవచ్చనీ, అంతమాత్రం చేత అవి అరత్నాలు అయిపోవనీ ఈమాట గ్రహించడం ప్రాథమిక అవసరం. అగ్రవర్ణ సాహిత్యమూ అణచబడినవారి సాహిత్యమూ ఒకే స్థాయిలో ఉండాలనకోడం సమంజసం కాదు. అలాంటి సాహిత్యాన్ని నిరసించడం తగదు.
    *
    ఈ విషయంలో ‘ఆక్టోబరు 2024’ రచనలో ఈమాట మాటలు తూలింది. ఆలోచనను ఆవేశానికి పణంగా పెట్టింది. తానేమిటో ఈమాట తేల్చుకోడానికీ, తేల్చుకున్నాక అడుగులు సవరించుకోడానికీ ఇప్పటి చర్చ సరైన అవకాశం కలిగిస్తోంది. వినియోగించుకుందాం.

    అమరేంద్ర
    5 అక్టోబర్ 2024

    [ఈమాట ఏ రకమైన సాహిత్యానికీ వ్యతిరేకి కాదని, సాహిత్యానికి ఎటువంటి హద్దులు, ఆంక్షలు, నిర్వచనాలు ఉండవు, ఉండకూడదు అని మా నిశ్చితాభిప్రాయమని, మరొక్కసారి స్పష్టం చేయవలసి ఉంది. “పాఠకులను ఆద్యంతం తన కథనబలంతో చదివించి, కథావస్తువు పట్ల ఆలోచన రేకెత్తించగలిగినది ఏదైనా మంచి సాహిత్యమే” అన్నది ఒక్కటే ఈమాట మాట. అదే సాహిత్యప్రయోజనం. సాహిత్యానికి వేరే ప్రమాణాలు ఇంకేమీ లేవు. సాహిత్యంగా మలచబడలేని వస్తువు ఏదీ లేదు. ప్రతీ రచనకు ఒకే ఆశయం ఉంటుంది. అది – ఆవేశమైనా, ఆహ్లాదమైనా, అసహ్యమైనా, ఇంకే అనుభవమైనా – పాఠకులలో స్పందన కలిగించడం.

    “సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి వ్రాసినవి సాహిత్య రత్నాలు కావు” అని ముందుమాటలో మేము అనలేదు. “సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి ‘వ్రాసినంత మాత్రాన’ అవి సాహిత్య రత్నాలయిపోవు” అని మాత్రమే అన్నాం. మమ్మల్ని నిందించిన వారెవరూ ఈ రెండు వాక్యాల మధ్య ఉన్న అర్థభేదాన్ని గమనించలేదు – కారణాలు అనేకం. ఎవరికి తోచినట్టు వారు అర్థం చెప్పుకున్నారు. ఈ వాక్యానికి బదులు “బ్రాహ్మణుల గురించి వ్రాసినంత మాత్రాన అవి సాహిత్య రత్నాలయిపోవు” అని ఉదహరించి ఉంటే ఈ విపరీతార్థాలకు ఆస్కారం ఉండేది కాదని ఇప్పుడు కలిగిన అభిప్రాయం.

    కథావస్తువు జీవితం అయినా, భ్రమ అయినా చదివించలేని సాహిత్యానికి ఏ ప్రయోజనం ఉంటుంది? అంటే కేవలం వస్తుబలం వల్లనే సాహిత్యప్రయోజనం చేకూరదు. అందువల్లే, వాక్యంపై శ్రద్ధ పెట్టండి, చదివించగలిగేలా వ్రాయండి అని పదేపదే చెప్తున్నాం. సాహితీ విలువలు పట్టుపడేదాకా వ్రాయకండి అని అనటం లేదు. వ్రాయండి, మీ ఇష్టానుసారం వ్రాయండి. కాని, వస్తువు వల్లనే మీ రచనకు విలువ వస్తుందన్న (సాహిత్య ప్రయోజనం చేకూరుతుందన్న) భ్రమలో ఉండకండి. వ్రాయండి, వ్రాసినది ఒకటికి పదిసార్లు చదువుకోండి. వ్రాసినది దిద్దుకోండి – అనే మేము అంటున్నది. వాక్యానికి శక్తి ఉంది. దానిని సరిగ్గా వినియోగించుకోవాలంటే వాక్య లక్షణం తెలియాలి. రచయితకు ఆవేశం మాత్రమే సరిపోదు, ఆలోచన కూడా అవసరం. నిర్జనమైన ఎడారిలో ఎంత బలంగా మీరు ధిక్కారస్వరం వినిపించినా ఏం ప్రయోజనం? ఎవరూ పూర్తిగా చదవలేని, చదివినా ఆ వస్తువుతో మమేకం కాలేని రచనతో ఏ సాహిత్యప్రయోజనం? రేపటికోసం రాస్తున్నవారు, ధిక్కారపోరాటాలే శైలీశిల్పాలయినవారు నిజంగా తమ సాహిత్యంతో సమాజంలో మార్పు తేగలగితే అంతకంటే కోరుకునేది ఎవరికీ ఏమీ ఉండదు, మాకంటే సంతోషించేవారు, ప్రోత్సహించేవారు ఇంకొకరు ఉండరు. ఏ గొంతుతో చెప్పినా, ఏ భాషలో చెప్పినా మేము ఎప్పుడూ చెప్తున్నది ఒకటే: సాహిత్యం కూడా ఒక కళ. దానికీ అభ్యాసం, పరిశ్రమ అవసరం. రచయితలు తమ వ్యాసంగాన్ని నిర్విరామంగా మెరుగు పరుచుకుంటూ ఉండాలన్నదే మా కోరిక, మా నమ్మకం. – సం.

    తాక: అక్టోబరు 2024′ రచనలో ఈమాట మాటలు ‘తూలింది’ – ఈ విషయంలో కాదని; మనసాహిత్య వారసత్వసంపద అప్రస్తుతం, ఇప్పుడు చదవడం అనవసరం అని ప్రబలుతున్న ఒక ధోరణి పట్ల మాత్రమేనని గమనించమని విన్నపం.]

  2. అక్టోబర్ 2024 గురించి B. Rama Naidu గారి అభిప్రాయం:

    10/04/2024 4:46 pm

    ‘సమాజంలో అభ్యుదయం, ప్రగతి అంటే ఏమిటి? ఒక తరం తన వారసత్వ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పదిలపరచుకొని, దానినుండి నేర్చుకొని, సమకాలీన పరిస్థితులతో అన్వయించుకొని ఆపైన ఆ సంపదకు తమ వంతు జ్ఞానాన్ని జోడించి ముందుతరం వారికి ఇవ్వడం.’

    మీ ఎడిటోరియల్ లో పైన ఉదహరించిన మొదటి వాక్యానికున్న అవగాహనను, తరవాత భాగం ఖండిస్తోంది. చాలా సంకుచితమైన వ్యక్తీకరణలు ఉన్నాయి.

    మంచి లేదా ఉత్తమ సాహిత్యానికి మీ ప్రమాణాలు లేదా గీటురాళ్ళు ఏమిటో చెప్పకుండా చేసేవి ప్రకటనలుగా లేదా ఖండనలుగా మిగిలి పోతాయి.

    మీ దృష్టిలో గొప్ప సాహిత్యంగా హైలైట్ చేయబడే వాటిలో కొన్నిటిని మీరు మీ ప్రమాణాలతో రివ్యూ చేయండి.

    గతసాహిత్యాన్ని, గతకాలపు ప్రముఖ రచయితల గురించి ఎవరైనా అచారిత్రికంగా మాట్లాడితే వారి అభిప్రాయాల లోతుపాతుల్ని వివరించే వ్యాసం రాయమని అడగండి. చర్చను నిర్వహించండి.

    [“పాఠకులను ఆద్యంతం తన కథనబలంతో చదివించి, కథావస్తువు పట్ల ఆలోచన రేకెత్తించగల”గడం మంచి సాహిత్యపు మొట్టమొదటి ప్రమాణం (లేదా అవసరం) అని చాలాసార్లే చెప్పామండీ – సం.]

  3. అక్టోబర్ 2024 గురించి ఎ. కె. ప్రభాకర్ గారి అభిప్రాయం:

    10/04/2024 3:08 pm

    జూలై 2024 సంపాదకీయం చూడండి అన్నారు. చూశా. ఆ మాటలో విభేదించాల్సింది ఏఁవీ లేదు. ఇవాళ్టి ఈ మాటలో మాత్రం hegemonic స్వరం పొంగి పొర్లుతోంది. రెండూ పక్క పక్కన పెట్టి మీరే చూసుకోండి. సాహిత్యంలో మీకు నచ్చని పోకడల్ని ఖండించొచ్చు. కానీ అసహనంతో గొంతు పెంచడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు.. ‘సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి వ్రాసిన’ సాహిత్యాన్ని మీరెంచుకున్న ప్రమాణాల మీద తిరస్కరించలేరు. మీకు నచ్చని వారినీ మీ పంథాకి భిన్నమైన అభిప్రాయం ప్రకటించిన వారినీ ‘వెలివేయాలని ఫత్వాలు జారీ చేయడం ఎంతమాత్రం ఆమోదం కాదు. మీ మాటలు మరోసారి వెనక్కి తిరిగి చూసుకోండి. బేషరతుగా ఉపసంహరించుకోవాల్సిన అంశాలు మీకే గోచరిస్తాయి. మరక మంచిది కాదు. దిద్దుబాటు తప్పు కాదు.

    [“మీరు మాట్లాడింది మనుషుల గురించి. జీవితాల గురించి. అవి సాహిత్యంలోకి ఎక్కడం గురించి. ఇంకా ఆంక్షలు ఎందుకు పెడతారు?” అన్న మీ అభిప్రాయానికి బదులుగా మాకు అటువంటి ఉద్దేశ్యం ఏమీ లేదని, ‘మారుతున్న సమాజపు పోకడలను ఇలా తెలుగు సాహిత్యంలోకి యువరచయితలు తేవడం తప్పకుండా అవసరం, అభిలషణీయం’ అనే మా అభిప్రాయం కూడా అని స్పష్టం చేయడం కోసం, ఆ ముందుమాట మిమ్మల్ని చదవమని కోరుకున్నది. అందువల్ల ‘సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి వ్రాసిన’ సాహిత్యాన్ని ‘మేము’ ఎంచుకున్న ప్రమాణాల మీద తిరస్కరించడం అనే ఆరోపణకు ఆధారం లేదు. ఒకరిపై ఫత్వాలు జారీ చేసే అధికారం, అవసరం మాకు లేదు. సరళంగానో, కఠినంగానో సాహిత్యంపట్ల, సాహిత్యధోరణుల పట్ల మా అభిప్రాయం చెప్పగలం, అంతే. -సం.]

  4. అక్టోబర్ 2024 గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:

    10/04/2024 2:24 pm

    ఒక అజెండాతో మాత్రమే రచనలు చేసే రచయితలు…

    కీలకం అంతా ఇక్కడ ఉంది. మీవ్యాసంలోనూ, సమకాలీనసాహిత్యం విషయంలోనూ కీలకం అదేను.

    ఒక మంచిరచనకు ఉండే ముఖ్యలక్షణాలలో మొదటిది చదివించగలగటం రెండవది ఆలోచన రేకెత్తించగలగటం. మూడవది దాని గురించి ఇతరులకు చెప్పాలని అనుకోవటం. ఈతూకపురాళ్ళు వేసి తూచండి.

    సమకాలీనరచనలు ప్రజల మనస్సులకు ఎక్కుతున్న పక్షంలో వాటికి మంచి ఆదరణ ఉండి సాహిత్యరంగం కళకళలాడుతూ ఉండేది. ఆరచయితలకు కాసిని కాసుల గలగలలూ వినిపించేవి (వారూ బ్రతకాలిగా మరి). అలాంటిది స్వప్నంలో తప్ప వాస్తవజగత్తులో సాహిత్యకారులు చూడలేకుండా ఉన్నారే?

    ఏవో అజెండాలతో బయలుదేరి రకరకాలవాదాల ప్రచారసాహిత్యం తయారీ ఫాక్టరీ కార్మికులలాగా రచయితలూ కవులూ కష్టపడి అచ్చుపోసి జనం మీద విసిరేసే చిన్న పెద్దా కరపత్రాల్లాంటి సో-కాల్డ్ ఆధునికసాహిత్యాన్ని పోగేసుకొని చదువుకొనే పాఠకులు ఎక్కువమంది ఉండటం కష్టమే.

    ఏరంగు కళ్ళద్దంలో నుండి చూస్తే ఈ ప్రపంచం ఆరంగు పులుముకొని కనిపిస్తుందే కాని అది సత్యప్రపంచం కాదు కదా. ఈ ఇజాలూ వాదాల కళ్ళద్దాలను ప్రక్కనబెట్టి స్వఛ్చమనస్క్కులై తెలుగు రచయితలూ మంచి రచనలు చేయటం మొదలుపెట్టితే సాహిత్యరంగానికి మంచిరోజులు వస్తాయి. లేకుంటే లేదు.

  5. అక్టోబర్ 2024 గురించి అనిల్ గారి అభిప్రాయం:

    10/04/2024 12:50 pm

    రచయితల్లోనే కాదు, సంపాదకుల్లోనూ సంయమనం ఉండాలి. ఈ సంపాదకీయంలో లేవనెత్తిన విషయాలపై నాకు స్థూలంగా అంగీకారం ఉంది కానీ, వాడిన భాషలో అంత నిష్టూరం, కాఠిన్యం అనవసరం. దానివల్ల అసలు విషయమ్మీద చర్చ జరిగే అవకాశం శూన్యమని రాసినవారికి తెలీదా!?! ఇప్పుడదే జరుగుతోందిక్కడ.

  6. అక్టోబర్ 2024 గురించి Akkiraju Bhattiprolu గారి అభిప్రాయం:

    10/04/2024 12:08 pm

    అమెరికా సాహితీ ప్రపంచానికీ, తెలుగునాట సాహితీ ప్రపంచానికీ మధ్య ఒకలాంటి Love and Hate బాంధవ్యం కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాను. ఈ రెండూ రెండుగానే కొన్నిసార్లు విస్ఫష్టంగా ‘మీరు మేమూ’ అనీ కొన్ని సార్లు ఆ తేడాలే లేనట్టూ కూడా చూశాను. తెలుగునాట ఉన్న రచయితలని కలుపుకోకుండా, ప్రస్తావించకుండా అమెరికా సాహిత్య సభలు చిన్నవైనా, పెద్దవైనా జరగవు. కొందరు NRI రచయితలూ, సాహితీకారులపట్ల తెలుగునాట ఉన్న సాహితీకారులకి ఉన్న ఆపేక్ష కూడా నాకు తెలుసు.

    చిత్రమేమిటంటే, వ్యక్తిగత కలయికల్లో ఎక్కడా మర్యాద తప్పకుండా అందరూ సంభాషించుకుంటారు. అందరూ సంస్కారవంతులే of course, no surprise.

    వ్యక్తిగత పరిచయాల కారణంగానూ, సాహితీ రంగంలో నాకున్న మిల్లీమీటర్ ప్రవేశం కారణంగానూ, రెండు చోట్లా బతికే, తిరిగే జీవనం కారణంగానూ ఈ రెండు ప్రపంచాలకీ నేను సమదూరంలో ఉన్నాను. రెండువైపులా నాకు ఇష్టులూ, కష్టులూ కూడా ఉన్నారు. బహుశా వేరెవరి కన్నా కూడా ఈ రెండు ప్రపంచాలూ నాకే ఎక్కువ అర్థమవుతాయి అని చెప్పుకోవడం పెద్ద సాహసమనుకోను.

    నేను అమెరికాలో ఉన్న రోజుల్నించీ కూడా ఈ రెండు ప్రపంచాలకీ మధ్య ప్రధానంగా నేను చూస్తున్న అంతరం… వస్తువుకీ, శిల్పానికీ ఇచ్చే ప్రాధాన్యతల్లో ఉంది.

    ఏది రాయాలన్నా ఓ అమెరికా/పాశ్చాత్య రచయిత ఎంత శిక్షణ తీసుకుని రాస్తారు. ఏదో ఒక ‘అవసరమైన ‘ వస్తువు దొరికితే చాలు, ఎలా రాసినా సాహిత్యం కిందకి వస్తుందా అనేది అమెరికా వాదం.

    తరతరాలు పలకా బలపానికే నోచుకోని అనేకానేక సమూహాలు తమ కథలు ఎలాగోలా చెప్పుకుంటున్నప్పుడు ఎలాంటి లాక్షణిక అవరోధాలు కల్పిస్తారు అని తెలుగునాట సాహితీకారుల అనంగీకారం.

    నిజం చెప్పొద్దూ, మరీ నలుపూ తెలుపుల్లా కూడా ఏమీ లేదు మళ్ళీ. ‘కథలు ఇలాకూడా రాస్తారూ’, ‘కథలో చూపించాలి, చెప్పకూడదూ’ లాంటి సలహాలు ఇక్కణ్ణించే ఖదీర్ బాబు రాశాడు.

    నా పరిస్థితి మరీ చిత్రం. నేను అక్కడి వాళ్ళతో మాట్లాడేటప్పుడు రాసే సామర్థ్యాన్ని ఇప్పుడిప్పుడే తెచ్చుకుంటున్న సమూహాలకి ఏ రూల్స్ ఉండకూడదనే వాదిస్తాను.

    ఇక్కడ మాట్లాడేటప్పుడు, మొదటి కథ ఎలా రాసినా, ఈ రచయితని పొదివి పట్టుకుని కథా లక్షణాలని నేర్పించాలనీ, మంచి సాహిత్యాన్ని పరిచయం చేసి, ఆ సమూహ కథలని మరింత ప్రభావవంతంగా ఎలా చెప్పాలో నేర్పించాలనీ వాదిస్తూ వచ్చాను, ఇప్పుడు కూడా అదే అంటాను.

    అందుకే నేను వెళ్ళే ప్రతి రైటర్స్ వర్క్‌షాప్‌లో నా స్థాయిలో నేను ఏదో ఒక సెషన్ క్రాఫ్ట్ మీద మాత్రమే తీసుకుంటాను. ఖదీర్ బాబుకి కూడా ఈ విషయంలో క్రెడిట్ ఇవ్వాలి.

    వస్తువు శిల్పం అని కాకుండా శ్రీశ్రీ చెప్పిన లక్ష్యం, లక్షణం అనే విభజన నాకు ఇష్టం. ఈ విషయం మీద నేను సారంగలో ‘అస్థిత్వ కథ అంటే దినచర్యేనా’ అనే వ్యాసంలో నాకు తోచింది చెప్పాను. బహుశా లక్ష్యం, లక్ష్యణం అనేవి కాస్త దూరాల్ని తగ్గిస్తాయి అని నాకెందుకో అనిపిస్తుంది.

    అందుకే నేను ఇక్కడి వాళ్ళకి అక్కడి వాడిగా, అక్కడి వాళ్ళకి ఇక్కడి వాడిగా తోస్తాను. కౌన్ కిస్కా గాణ్ణి నన్ను పక్కన పెట్టినా ఓ మధ్యే మార్గం ఉంది అని నాకు సాధ్యమయినంతగా చెపుతూ వస్తున్నాను.

    ఇహ ఇప్పటి వ్యాసంలో విషయంకూడా కొత్తదేమీ కాదు. అలాగే అక్కడి వాళ్ళు ‘ఈ లక్షణాలు ఉంటేనే మా పత్రిక సాహిత్యంగా గుర్తిస్తుంది’ అంటే నాకు అస్సలు అభ్యంతరం లేదు. వాళ్ళ పత్రిక, వాళ్ళ ఇష్టం. నేను పూర్తిగా అంగీకరించపోవచ్చు గాక. సమస్య, ఆ విషయం చెప్పిన విధానంతోనే.

    (వాళ్ళ పత్రిక ఆంటున్నాను కానీ, ఆ పత్రిక నిర్వహణలో నా పాత్ర ఎప్పుడూ ఏ విధంగానూ లేకపోయినా, ఆ పత్రిక నడపడంలో మొదటినించీ ఇప్పటిదాకా పడ్డ శ్రమ, commitment లాంటివి దగ్గర్నించి చూడడం చేత కొంత సొంతదనం కూడా తోస్తుంది అనేది నిజం.)

    నా ఉద్యోగంలో ఓ సారెప్పుడో కోపంతో ఓ మెయిల్ రాసి ఓ పది మందికి పంపించ బోతే మా బాస్ నాకు చెప్పిన మాట. You want to make a point and display your anger? Or you want to effect a change?

    కొంత సమ్యమనం పాటించి ఉండొచ్చు. వెలివేతలూ, బ్రాహ్మణులూ, హిందూ కారికేచర్ విలన్లూ… ఈ పదాలకి ఎంత సందర్భం (context) ఆపాదించినా, ఇక్కడున్న పరిస్థితుల్లో there are very many connotations and baggage that cannot be avoided.

    వ్యక్తిగతంగా నాకు తెలిసి ఉండడం చేత నా స్నేహితులమీద ఉన్న నమ్మకంతో తెరవెనక అంత కల్మషం లేదులే అని సమాధాన పడగలను. మిగతా వాళ్ళకి ఆ obligation ఏమీ లేదు.

    ఏ మాత్రమూ మన నమ్ముతున్న దానితో రాజీ పడకుండా ఇంకాస్త మర్యాదగా ఇరు పక్షాలూ స్పందిస్తే నాలాంటి వాళ్ళకి కాస్త మధ్యేమార్గంలో వేళ్ళే అవకాశం మిగులుతుంది.

    Not a pleasant day. Not happy having to write this.

    – అక్కిరాజు భట్టిప్రోలు

  7. అక్టోబర్ 2024 గురించి Alti Mohana Rao గారి అభిప్రాయం:

    10/04/2024 6:33 am

    మీ అహంకారం, ఆధిపత్య భావజాలం ఇంకా కనిపిస్తున్నది అనడానికి మీ వ్యాసమే సాక్ష్యం…

  8. దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 8 గురించి Ramesh గారి అభిప్రాయం:

    10/04/2024 3:57 am

    “మన మిథ్యావిలువలను, సంకుచిత సంస్కారాలను, ఎగసిపడే అహంకారాలనూ జీర్ణవస్త్రాల్లాగా విడిచిపెట్టగలిగితే ఈ ప్రపంచమంతా మనదే. వసుధైక కుటుంబకం అన్నది మిథ్యానినాదం కానేకాదు.”👌
    మీ యాత్రానుభవాలు చాలా చాలా బాగున్నాయి, దేవుడు మీకు అయు:ఆరోగ్యాలు ఇవ్వుగాక

  9. అక్టోబర్ 2024 గురించి anil Dani గారి అభిప్రాయం:

    10/04/2024 2:47 am

    మనం ఏం మాట్లాడినా చెల్లుబాటవుతుందనే భావన ఈ మధ్యన కొంతమందిలో కలుగుతుంది దానికి పరాకష్ట ఈ వ్యాసం. సాహిత్యం ఇలాగే ఉండాలని, ఒక వర్గమే రాయాలనే అహంకారపు రాతల వల్ల ఒరిగేది ఏమిలేదు. ఈ చౌకబారు వ్యాఖలని ఖండిస్తున్నాను

  10. అలనాటి యువ కథ: స్వామీజీ గురించి Rohini Vanjari గారి అభిప్రాయం:

    10/04/2024 1:59 am

    పాపం స్వామిజీ వారి ఆకలి అవస్థలు తలుచుకుంటే జాలి, నవ్వు ఒకసారి కలిగాయి. తమాషా కథ. బాగుంది.

« 1 ... 10 11 12 13 14 ... 1554 »