నేరం నాది కాదు!

“హియరీ, హియరీ ..
హేస్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ ఇన్‌ సెషన్‌,ది ఆనరబుల్‌ జడ్జ్‌ మైకల్‌ ఫీల్డ్‌ ప్రిసైడింగ్‌. ఆల్‌ రైజ్‌”
కోర్ట్‌ అనౌన్సర్‌ బిగ్గరగా ప్రకటించాడు.

అసంకల్పితంగానే అందరూ లేచి నిలబడ్డారు.
“దయచేసి కూర్చోండి” అన్నాడు జడ్జ్‌ ఫీల్డ్‌ తన ఆసనంలో కూర్చుంటూ.

“పీపుల్‌ వెర్సెస్‌ సెకార్‌ మడూగుల” అని అనౌన్సర్‌ చదవటంతోనే ఇరుపక్షాల లాయర్లు లేచి జడ్జి దగ్గరకు వెళ్ళారు.
“అంతా సిద్ధమే కదా!” అన్నాడు జడ్జ్‌ అలవాటు ప్రకారం, తనలోతను అనుకుంటున్నట్టుగా.
ఔనన్నట్టు అందరూ తలలూపారు.
“ముందుగా, ఇప్పుడు నేను రూలింగ్‌ ఇవ్వవలసిన మోషన్స్‌ ఏమైనా ఉన్నాయా?”
“మొన్న మనం చర్చించుకున్నట్టు, ఇతర డిఫెండెంట్ల విషయం ఒక్కటే వుంది” అన్నాడు డిఫెన్స్‌ అటార్నీ జాన్‌ డెన్వర్‌ మెల్లగా.
“ఆ విషయం డిఫెన్స్‌ సమయంలో మాట్లాడదాం. ప్రోసెక్యూషన్‌ వారి వాదానికి దాని అవసరం లేదనుకుంటాను” అన్నాడు జడ్జ్‌ డిస్ట్రిక్ట్‌ ప్రోసెక్యూటర్‌ ఫ్రాంక్‌ జినాక్‌ వంక చూస్తూ.
“నో, యువర్‌ ఆనర్‌” అన్నాడతను ముక్తసరిగా. ఎప్పుడెప్పుడు తన కేసును జ్యూరీ ముందు పెడదామా అని ఆతృతగా ఉన్నాడతను.

ఏకంగా డిస్ట్రిక్ట్‌ అటార్నీయే రంగంలోకి దిగాడని తెలిసి మామూలుగా నిద్రలో జోగుతుండే డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ ఆవరణ అంతా ఒక్కసారిగా ఒళ్ళువిరుచుకుని మేలుకుంది. చుట్టుపక్కల ఊళ్ళ పత్రికా విలేఖరులు ప్రేక్షకుల్లో ముందు వరసలో కూర్చున్నారు. కొందరు స్కెచ్‌ ఆర్టిస్టుల్ని కూడా తీసుకొచ్చారు.

జడ్జ్‌ జ్యూరీని పిలిపించాడు. మొత్తం తొమ్మిదిమంది వరసగా వచ్చి జ్యూరీస్థానాల్లో కూర్చున్నారు.
జడ్జ్‌ వాళ్ళందర్నీ ఒకసారి పరామర్శించి, అప్పుడక్కడ ఏం జరగబోతోందో, అందులో వాళ్ళ బాధ్యత ఏమిటో ఒక పది నిమిషాల పాటు ఉపన్యసించాడు. పదిహేనేళ్ళ నుంచి వారానికి నాలుగైదు సార్లన్నా ఇదే ఉపన్యాసం ఇస్తున్నా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉన్నట్టు చెప్పటం అతని ప్రత్యేకత!

జ్యూరీ అంతా సావధానంగా విన్నారు. జ్యూరర్‌ నంబర్‌ 7 నోట్సు కూడ రాసుకున్నారు (అతను ఇమిగ్రెంట్‌ ఇండియన్‌ కావటం బహుశా కాకతాళీయం!).

ప్రోసెక్యూషన్‌ వారి తొలిపలుకులతో కేసు విచారణ ప్రారంభమైంది.
చాలా మెల్లగా, వినపడీ వినపడనట్టుగా ప్రారంభించాడు ప్రోసెక్యూటర్‌ జినాక్‌
“ఇప్పటి సమాజంలో పిల్లలకు రక్షణ దొరకటం కష్టమై పోతున్నది. బయట నడవాలంటే భయం, రోడ్ల మీద ఆడుకోవాలంటే భయం, టీవీ చూడాలంటే భయం, స్కూలుకు వెళ్ళాలంటే భయం. ఎక్కడ చూసినా పిల్లలకి అపాయాలు కలిగించాలని చూసేవాళ్ళే! సభ్యసమాజంలో ఉంటున్నామన్న పేరే గాని, మనకున్న ముఖ్యమైన సంపద మన పిల్లల్ని మనం కాపాడుకోవటం ఎంతో కష్టమై పోతున్నది. ఇప్పుడో కొత్తరకం కాముకమృగాలు తయారయ్యారు వీళ్ళు ఎంతో ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు, పెద్దపెద్ద ఇళ్ళలో ఉండేవాళ్ళు, బోలెడంత సంపాదిస్తున్న వాళ్ళు,” ఇక్కడికి వచ్చేసరికి అతని కళ్ళు ఎరుపెక్కినయ్‌, పెదాలు కంపించసాగినయ్‌, జ్యూరీ ముందున్న ఊచల్ని విరిచేస్తాడా అన్నంత బలంగా పట్టుకుని నలుపుతూ స్వరం తీవ్రం చేస్తూ తన ప్రసంగం కొనసాగించాడు “వీళ్ళు మనకు బయటకు పెద్ద మనుషుల్లా కనిపిస్తారు, మర్యాదస్తుల్లా ముసుగులేసుకుని తిరుగుతారు. లోపల పచ్చి నేరస్తులు వీళ్ళు. వీళ్ళ వాలకం చూసి మోసపోకూడదు మనం. ఇంట్లో కూర్చుని ఇంటర్నెట్‌ ద్వారా మన పిల్లల్ని రెచ్చగొట్టి, మోసం చేసి, వాళ్ళ జీవితాల్ని నాశనం చెయ్యాలనుకునే ఇలాటి నీచుల్ని, తుచ్ఛుల్ని ..”

డిఫెన్స్‌ లాయర్‌ అబ్జెక్ట్‌ చెయ్యటానికి లేవబోవటాన్ని తన కనుకొనల నుంచే గమనించాడతను. అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా “ప్లీజ్‌ స్ట్రైక్‌ దోజ్‌ టూ వర్స్డ్‌ ఫ్రమ్‌ ద రెకర్డ్‌” అని కోర్ట్‌ రిపోర్టర్‌ తోటీ, “సారీ యువరానర్‌” అని జడ్జ్‌ తోటీ అనటం కనురెప్ప పాటులో జరిగిపోయాయి. ఐతే, అతను ముందుగా వేసుకున్న పథకం ప్రకారం గానే జ్యూరీ మీద ఆ మాటల ప్రభావం బలంగా పడింది అప్పటికే దాదాపు సగం మంది జ్యూరర్లు అతని పక్షమై పోయారు. ఏమీ జరగనట్టుగా తన ప్రసంగాన్ని కొనసాగించాడతను.

“ఇలాటి నేరస్తుల్ని బయట తిరగనివ్వకూడదు. అందుకే ఇవాళ నేను మీ ముందుకు వచ్చాను. స్వయంగా మీకు నా మనసులో మాట చెప్పాలని వచ్చాను.”

ఒకవంక అతని నటనాచాతుర్యానికి, చాకచక్యానికి అబ్బురపడుతూనే, “తొందర్లో రాబోతున్న ఎన్నికల్లో కూడ గెలిస్తే మొత్తం టెక్సస్‌ రాష్ట్రంలోనే ఎవరూ ఎన్నిక కానన్ని సార్లు డిస్ట్రిక్ట్‌ అటార్నీగా ఎన్నికైన రికార్డ్‌ సృష్టిద్దామని నీ తాపత్రయం! సరే కానీ, అందుకు సరిపడే కేసే దొరికిందిలే!!” అనుకున్నాడు జడ్జ్‌ ఆ ప్రదర్శనని చూస్తూ.

“ఇప్పుడు మీ ఎదురుగా ఉన్న ముద్దాయి యాభై ఆరేళ్ళ వాడు. ముప్ఫై ఏళ్ళుగా ఈ దేశంలో ఉంటున్నవాడు. పదమూడేళ్ళ ఆడపిల్లల్తో సరసాలాడుతున్న వాడు. వాళ్ళతో కామసంబంధాలు పెట్టుకోవాలని రాత్రింబవళ్ళు రహస్యంగా, ఇంటర్నెట్‌ చాటున దాక్కుని ప్రయత్నిస్తున్నవాడు. ఆ పిల్లలు ఎవరైనా కావొచ్చు ”

జ్యూరీలో ఒక్కొకరి వంక సూటిగా చూస్తూ అన్నాడతను “మీకు గాని మీకు తెలిసిన వాళ్ళకు గాని పదమూడేళ్ళ ఆడపిల్లలు ఉండకపోరు. వాళ్ళని ఇలాటి మోసగాళ్ళు ఎన్ని విధాలుగా మభ్యపెట్ట గలరో మీరే ఊహించుకోండి.
ఇలాటి మృగాల నుంచి వాళ్ళకు రక్షణ ఎలా దొరుకుతుందో మీరే ఆలోచించండి.
అతని అమాయకపు వాలకం చూసి, అతని తరఫు లాయర్ల కల్లబొల్లి కథలు విని మోసపోకండి. వాళ్ళు మీకు రకరకాల సిద్ధాంతాలు తయారు చేసి చెప్పబోతున్నారు. అతనెంతో ఆదర్శపౌరుడని మీకు నచ్చజెప్పబోతున్నారు. చైల్డ్‌ పొర్నో అనే పదానికి అర్థమే అతనికి తెలియదని మిమ్మల్ని నమ్మించబోతున్నారు. తొందరపడి ఆ మాటల్ని నమ్మకండి.
మేము చూపించబోయే సాక్ష్యాలన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించండి. మీకే తెలుస్తుంది ఇది ఎంత పటిష్టమైన కేసో! మన షరీఫ్‌, అతని బృందం ఎంత జాగ్రత్తగా, మూడు నెల్ల పాటు శ్రమించి, ఈ ముద్దాయిని రెడ్‌ హేండెడ్‌ గా పట్టుకున్నారో చూద్దురు గాని! అంతా చూశాక మళ్ళీ ఇలాటి వాళ్ళు తలెత్తకుండా, ఇలా ఆలోచిస్తున్న వాళ్ళెవరైనా వుంటే వాళ్ళకి ముందుగానే పర్యవసానం ఎలా వుంటుందో తెలిసొచ్చేలా, ఎవ్వరూ మరిచిపోలేని మెసేజ్‌ పంపంచండి మీ నిర్ణయం ద్వారా! తేంక్‌ యు!” గర్జించి వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు జినాక్‌.

అంత సేపు, చీమ చిటుక్కుమన్న శబ్దం వినిపించేలా నిశ్శబ్దంగా విన్నారందరూ.
జ్యూరీ ఊపిరి పీల్చటం కూడ మరిచిపోయినట్టు బొమ్మల్లా కూర్చున్నారు.

డిఫెన్స్‌ అటార్నీ డెన్వర్‌ గుండెల్లో రాయి పడింది. తన క్లయింట్‌ ఈ కేసు లోంచి బయటపడటం చాలా కష్టమని ముందుగానే తెలుసతనికి. ఐతే డిస్ట్రిక్ట్‌ అటార్నీ స్వయంగా వచ్చి తనే వాదిస్తాడని ఊహించలేదతను. ప్రత్యర్థి ఐనా గాని అతని చాకచక్యాన్ని మెచ్చుకోలేకుండా పోయాడు. కాని, తన కర్తవ్యం తను నిర్వహించాలి, తప్పదు!

కేసు పూర్తిగా వినకుండానే ఎలాటి నిర్ణయానికి రావద్దని, తన క్లయింట్‌ నిర్దోషి అని, పోలీసులు కొందరు మరీ ఆవేశపూరితులై తన క్లయింటుని అన్యాయంగా వల్లో పడవేశారని, అతని ఆంతర్యాన్ని అపార్థం చేసుకున్నారని, క్లుప్తంగా వివరించాడు. తన క్లయింట్‌ దోషి అని ఋజువు చెయ్యాల్సిన బాధ్యత పూర్తిగా ప్రోసెక్యూషన్‌దే నని, తన పని కేవలం వాళ్ళ వాదనలో కొంత అనుమానం కలగజెయ్యటం మాత్రమే నని పదే పదే హెచ్చరించాడు.

ప్రోసెక్యూషన్‌ తొలి సాక్షిని పిలిచింది. ముద్దాయిని అరెస్ట్‌ చేసిన ఆఫీసర్‌ వచ్చాడు.
“ఈ ముద్దాయి గురించి మీకు తొలిసారిగా ఎలా అనుమానం కలిగింది?” అడిగాడు ప్రోసెక్యూటర్‌.
జ్యూరీ వైపు తిరిగాడా ఆఫీసర్‌ “మన ప్రాంతంలో చైల్డ్‌ పొర్నాగ్రఫీలో పాలుపంచుకొంటున్నవాళ్ళు చాలా మంది ఉన్నట్టు ఎఫ్‌. బి. ఐ. నుంచి మాకు సమాచారం వచ్చింది. వాళ్ళే కొన్ని ఇంటర్నెట్‌ చాట్‌ గ్రూపుల్లో పాల్గొంటున్న వాళ్ళ స్క్రీన్‌ పేర్లు మాకు పంపించి, ఆ వ్యక్తులు ఈ ప్రాంతం వాళ్ళని అనుమానంగా వున్నట్టు చెప్పారు. ఇది జరిగి నాలుగు నెలలు. అప్పుడు మన షరీఫ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఒక చైల్డ్‌ పొర్నాగ్రఫీ సెల్‌ని ఏర్పాటు చేశాం. నేను, మరొక ఆఫీసరు తీరిక వేళల్లో ఆ చాట్‌ గ్రూపుల్లో తిరుగుతూ చిన్న పిల్లల్లా నటించాం. అలా ఒక చాట్‌ గ్రూపులో ఈ ముద్దాయితో పరిచయం కలిగింది.”
“అంటే అతనితో మీ పరిచయం జరిగింది నేరుగా కాదు, ఒక చిన్న పిల్ల లాగ. అవునా, కాదా?”
“అవును. అతనితో చాట్‌ గ్రూపులో మాట్లాడినప్పుడు నా పేరు ఏంజెల్‌, నాకు పదమూడేళ్ళు!” అన్నాడతను సన్నగా నవ్వుతూ. జ్యూరీలో కూడ చిరునవ్వులు కనిపించాయి ఆ మాటకి.
“మీ ఇంటర్నెట్‌ చాట్‌ తాలూకు రికార్డులు అన్నీ కోర్టుకు అందజేశారు కదా?”
“అవును”
“జ్యూరీ వాటన్నిటినీ ప్రశాంతంగా చూస్తుంది. టూకీగా ఏం జరిగిందో చెప్తారా?”
” తప్పకుండా. ముద్దాయితో ఏంజెల్‌గా నేను చాట్‌ చెయ్యటం మొదలెట్టిన రెండు రోజుల తర్వాత నేను ఏ వూళ్ళో వుంటానో అడిగాడతను. నేను చెప్పటంతో ఎగిరి గంతేసి, ఐతే మనం మనం చాలా దగ్గరి వాళ్ళం, అరగంట దూరం కూడ లేదు అని మంచి ఉల్లాసంగా మెసేజ్‌ పంపించాడు. ఇంక ఆ మర్నాడు ఇప్పుడు ఎలాగూ వేసవి సెలవులే కనుక ఇద్దరం ఎక్కడన్నా కలిస్తే బాగుంటుందని సూచించాడు. ముందు నేను ఒప్పుకోలేదు. అప్పుడు నాకు రకరకాల కథలు చెప్పాడు. నాకు ఇష్టమైన వస్తువులు కొనిస్తానని మాల్‌కి రమ్మన్నాడు.”
“మీ మధ్య సెక్స్‌కి సంబంధించిన విషయాలు వచ్చాయా?”
“వచ్చాయి”
“ఎవరు ముందుగా ఆ విషయాలు ఎత్తారు?”
“అతనే! నేను కేవలం ఉబుసుపోకకు చాట్‌ చేస్తున్నట్టు చెప్పానే తప్ప ఎప్పుడూ నేరుగా సెక్స్‌ గురించి మాట్లాడనే లేదు.”
“ఆ విషయం వచ్చినప్పుడు మీ అంటే ఏంజెల్‌ వయస్సెంతో అతనికి స్పష్టంగా తెలుసునా?”
“తెలుసు. నేను ఎన్నో సార్లు చెప్పాను. తను కూడ చిన్న పిల్లనైనా చాల పెద్దరికంతో మాట్లాడుతున్నానని నన్ను అభినందించాడు!” చిరునవ్వుతో చెప్పాడతను. దాన్లోని ఐరనీకి కోర్టంతా నవ్వులతో ప్రతిధ్వనించింది.

“ఐతే వాళ్ళ ఇంట్లో ఎందరో వుండొచ్చు కదా, మరి ఇతనే మీతో చాట్‌ చేసినవాడని ఎలా నిర్ణయించారు?”
“ఇలాటి కేసులు మాకు మామూలే. ఈ మధ్య ఇంటర్‌నెట్‌ బాగా ప్రచారం లోకి వచ్చాక ప్రతి వేసవిలోను ఇలాటి వాళ్ళు కొందరు దొరుకుతున్నారు. ఆ చాట్‌ చేసిన వ్యక్తి ఇతనే అని నిర్ధారణ చేసుకోవటానికే అతనికీ ఏంజెల్‌ కీ మధ్య భేటీ ఏర్పాటు చేశాము. అతని సలహా మీదనే ఒక రహస్య ప్రదేశంలో కలుసుకోవటానికి ఇద్దరమూ అంగీకారానికి వచ్చి, అక్కడికి అతను ఒక్కడే వచ్చినప్పుడు అతన్ని అరెస్ట్‌ చేశాము.”
“ఐతే, అతను ఏంజెల్‌తో సెక్స్‌ కోసమే వచ్చాడని ఎలా తెలుసు మీకు?”
“అతన్ని అరెస్ట్‌ చేసినప్పుడు అతని కార్లో ఒక తెరవని కండోమ్‌ పేకెట్‌ దొరికింది. అది చాలా ప్రత్యేకమైన బ్రాండ్‌.”
“అది మరే కారణం వల్లనైనా అతని కార్లో ఉండవచ్చుగా?”
“వీల్లేదు. ఎందుకంటే, ఆ బ్రాండ్‌ కండోమ్స్‌ తీసుకు రమ్మని అతనికి సలహా ఇచ్చింది నేనే! అంటే ఏంజెల్‌ అన్నమాట. నేను చెప్పేవరకు  అలాటి కండోమ్స్‌ ఉన్నాయని కూడ అతనికి తెలియదట!”

“ఇప్పుటివరకు మీరు చెప్పిన విషయాల బట్టి తేలేది ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు మీ ఇద్దరి మధ్య జరిగాయని, అవతలి వ్యక్తి ఇతను కాకుండా మరొకరైతే ఇతనికి ఈ విషయాలు తెలిసే అవకాశం లేదని. ఒప్పుకుంటారా?”
“అవును. మొదటి నుంచి చివరి వరకు నాతో చాట్‌ చేసింది ఒక వ్యక్తే. మా భేటీ ప్రదేశానికి వచ్చింది కూడ ఆ వ్యక్తే. అతనే మన ఎదురుగా ఉన్న ఈ ముద్దాయి”
“తేంక్‌ యు ఆఫీసర్‌” తృప్తిగా చెప్పి కూర్చున్నాడు డిస్ట్రిక్ట్‌ అటార్నీ.

డిఫెన్స్‌ అటార్నీ డెన్వర్‌ కూడ తక్కువ వాడేం కాదు.
ఎన్నో క్లిష్టమైన కేసుల్లో పనిచేసి ఢక్కామొక్కీలు తిన్నవాడు.
తన ఆఫీసులో పనికైతే గంటకు మూడు వందల యాభై డాలర్లు బిల్‌ చేస్తాడు.
కోర్టులో వాదించటానికి గంటకు ఆరువందలు!

ఇప్పటివరకు జరిగింది ప్రోసెక్యూషన్‌కి చాలా అనుకూలంగా వుంది. ప్రోసెక్యూటరూ, ఆఫీసరూ చక్కగా రిహార్సల్‌ చేసుకు వచ్చి నట్టున్నారు. ఏమాత్రం ఒడుదుడుకులు, తడబాట్లు లేకుండా సాగింది సాక్ష్యం.
కేసు స్వరూపం స్పష్టంగా తెలిసిపోయే ప్రశ్నలు వెయ్యటం, వాటికి సూటిగా, విడమరిచినట్టుండే సమాధానాలు రాబట్టటం జరిగింది. జ్యూరీ దృష్టిని మరో పక్కకు మళ్ళించాలంటే మార్గం నేరుగా ఆ ఆఫీసర్ని ఎటాక్‌ చెయ్యటమే.
అదే చేశాడతను.

“ఆఫీసర్‌! మీకు కంప్యూటర్‌ టెక్నాలజీలో ఎంత పరిజ్ఞానం ఉంది?”
“మూడు నెలల శిక్షణ తీసుకున్నాను”
“దాంతో మీరు నిష్ణాతులయ్యారా?”
“అలా అనుకోను. కాని చాట్‌ గ్రూపుల్లో మాట్లాడటానికి నిష్ణాతులు కావాల్సిన పని లేదు”
“చాట్‌ గ్రూపుల్లో మాట్లాడటం ఎవరైనా చెయ్యగలిగిన పనే. కాని మీరు అంతటితో ఆగలేదు కదా! అవతల మీతో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో మీరు తెలుసుకోగలిగా మంటున్నారు. దానికి ఎంత పరిజ్ఞానం కావాలో అంత మీకు ఉన్నదా అని నా ప్రశ్న”
“ముద్దాయిని రెడ్‌ హేండెడ్‌గా పట్టుకోగలిగానంటే దాన్ని బట్టి నా పరిజ్ఞానం ఎంతో తెలియటం లేదా?”
జ్యూరర్లు ఒకరిద్దరు కిసుక్కుమన్నారు. దారి మార్చటం మంచిదని గ్రహించాడు డిఫెన్స్‌ లాయర్‌.

“ఐతే, ఆ చాట్‌ గ్రూప్‌ నుంచి మీకు తెలిసింది కేవలం ఒక వ్యక్తి తాలూకు స్క్రీన్‌ పేరు, ఔనా?”
“ఔను”
“మరి ఆ స్క్రీన్‌ పేరు ఈ నిందితుడిదే నని మీరు ఎలా కనుక్కో గలిగారు?”
“ముందుగా తెలియలేదు. ఇతను ఏంజెల్‌ తో కలుసుకోవటానికి ఒప్పుకున్న వెంటనే వారంట్‌ తీసుకొచ్చి ఇక్కడున్న ఐ. ఎస్‌. పి. లందరికీ ఇచ్చాం. ఏ కంప్యూటర్‌ నుంచి ఆ స్క్రీన్‌ పేరున్న వ్యక్తి లాగిన్‌ చేస్తున్నది కనుక్కున్నాం”
“ఆ స్క్రీన్‌ పేరున్న వ్యక్తి ప్రతి సారీ అదే కంప్యూటర్‌ నుంచి లాగిన్‌ చేశారా?”

ఆ ప్రశ్నకు కొంచెం ఇబ్బందిగా కదిలాడు ఆఫీసర్‌.
“అవును, మేము చూసిన ప్రతిసారీ అక్కడి నుంచే”
“మీరు ఇందాక చెప్పిన దాన్ని బట్టి మీ తీరిక వేళల్లో ఈ పని చేశారు. కేవలం ఆ సమయాల్లోనే ఆ వ్యక్తి లాగిన్‌ చేసినట్టు, మిగిలిన సమయాల్లో ఎప్పుడూ చెయ్యలేదని మీకెలా తెలుసు?”
కోర్టులో సాక్ష్యాలు చెప్పటంలో ఎంతో అనుభవం వున్నా, అతని గొంతులోని అనుమానం అందరికీ తేటతెల్లంగా కనపడింది
“మాకు తెలియదు” అన్నాడు నీరసంగా.
“అంటే ఆ స్క్రీన్‌ పేరున్న వ్యక్తి ఎన్నో చోట్ల నుంచి లాగిన్‌ చేసి వుండొచ్చు, ఔనా?”
సమాధానంగా అటు ఇటూ కాని దగ్గు దగ్గాడతను.
“దాని అర్థం ఔననా, కాదనా?”
“ఔను” వినపడీ వినపడనట్టు అన్నాడతను.
ఇంత గొప్ప అవకాశాన్ని అంత తేలిగ్గా వదలదల్చుకోలేదు డెన్వర్‌. అప్పుడే కొందరు జ్యూరర్స్‌ తనవంక ఆరాధనగా చూస్తున్నట్టు గమనించాడతను.
“యువరానర్‌! సాక్షిని స్పష్టమైన సమాధానం చెప్పమనండి” అని గర్జించాడు.
జడ్జ్‌ అలా చెప్పే లోగానే “అవును, అది నిజమే” అన్నాడతను ఉక్రోషంగా.

“మీరు ఆ స్క్రీన్‌ పేరున్న వ్యక్తితో చేసిన చాట్‌ల రికార్డ్‌ ఉన్నదన్నారు. మరి ఈ నిందితుడి కంప్యూటర్‌ మీద కూడ అలాటి రికార్డ్‌లు దొరికాయా?”
“దొరకలేదు. ఎందుకంటే వెబ్‌ ఇరేజర్‌ ..”
“దయచేసి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి చాలు”
“…” రోషంతో కూడిన చిన్న మూలుగు. పళ్ళు పటపటలాడిన శబ్దం.

“మీ వయస్సెంత?” హఠాత్తుగా అడిగాడు డెన్వర్‌ .
“అబ్జెక్షన్‌ యువరానర్‌” అతను పూర్తిగా అనీ అనకముందే గర్జించాడు ప్రోసెక్యూటర్‌. డిఫెన్స్‌ వంక ప్రశ్నార్థకాన్ని సారించాడు జడ్జ్‌.
“ఆ సమాచారంతో నాకు చాలా అవసరం వుంది  యువరానర్‌! నాకు అనుమతివ్వండిి, ఇప్పుడే చూస్తారు”
“ఆల్‌రైట్‌, అలా ఐతే అనుమతిస్తాను” అని సాక్షి వైపు తిరిగి, “ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి” అని ఆదేశించాడు జడ్జ్‌.
“యాభై రెండు” అన్నాడతను. ఇంకా నీరసంగానే వినిపిస్తుందతని గొంతు. ముందున్న ఆత్మవిశ్వాసం చాల వరకు క్షీణించింది.
“మీరు చాట్‌ గ్రూప్‌లో మీకు ఎన్నేళ్ళని చెప్పారు?”
“పదమూడు”
“అంటే, మీ అసలు వయసుకు, చాట్‌ గ్రూపుల్లో మీరు చెప్పిన వయసుకీ ఏమీ సంబంధం లేదు. ఔనా?”
“ఔను”
“నిందితుడు ఎంత కాలంగా కంప్యూటర్‌ ఫీల్డ్‌లో పనిచేస్తున్నాడో మీకు తెలుసా?”
“ఖచ్చితంగా తెలియదు గాని, దాదాపు ఇరవై ఏళ్ళ పైగానే”
“మరి, చాట్‌ గ్రూపుల్లో చెప్పే వయసులు నిజమైనవి కావని అతనికి తెలియకుండా ఉంటుందంటారా?”
సాక్షి తన ధోరణిలో పడి సమాధానం చెప్పబోయేంతలో అతన్ని వారిస్తూ, “అబ్జెక్షన్‌ యువరానర్‌! ముద్దాయి మనసులో మాట సాక్షికి ఎలా తెలుస్తుంది? కావాలంటే డిఫెన్స్‌, ముద్దాయిని బోనెక్కించి ఈ ప్రశ్న అడగమనండి” దాదాపుగా తన్నేంత దగ్గరగా నిందితుడి దగ్గరకు వెళ్తూ అరిచాడతను. కేసు తన చేతి వేళ్ళ సందుల్లోంచి జారిపోతున్నట్టు అతనికి అనుమానం కలుగుతోంది. “ఇంక దయా దాక్షిణ్యాలు లేవు!” అనుకుంటూ తన సీట్లో కూర్చున్నాడతను, జడ్జ్‌ అన్న “సస్టైన్డ్‌” అన్న మాట అతనికి వినపడిందో లేదో కూడ తెలియదు.
“మరొక విధంగా అడుగుతాను. మీరు వెళ్ళిన చాట్‌ గ్రూపులో ఎవరైనా తన వయసు ఇరవై ఏళ్ళంటే మీరు వెంటనే నమ్మేస్తారా?”
“అదంతా ఆ సందర్భాన్ని బట్టి వుంటుంది” డిఫెన్స్‌ వాళ్ళ వలలో పడగూడదని తనని తాను హెచ్చరించుకుంటూ జాగ్రత్తగా చెప్పాడతను.
“యువరానర్‌! అతని చేత సరైన సమాధానం చెప్పించండి”
“మీరడిగిన ప్రశ్నకు సరైన సమాధానమే చెప్పాడతను.” నిర్వికారంగా అన్నాడు జడ్జ్‌ “మీ వాదనని ముందుకు కదల్చండి”
“చాట్‌ గ్రూప్‌లో ఎవరైనా తన వయసు పదమూడేళ్ళని చెప్తే మీకు ఏ మాత్రం అనుమానం రాదా?”
“నాకు రాదు” దృఢంగా చెప్పాడు సాక్షి. ఎలాగైనా సరే, డిఫెన్స్‌కి ఏమాత్రం అనుకూలంగా చెప్పకూడదనే నిర్ణయానికి అతను వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
“యువరానర్‌. ఈ సాక్షి ఇంత వ్యతిరేకంగా వుంటే కేసు ముందుకెలా సాగుతుంది?” ఆక్రోశించాడతను.
“మిస్టర్‌ డెన్వర్‌ ! ఈ నాటకీయత ఆపి మీ వాదనని కదిలించకపోతే నేను మిస్‌ట్రయల్‌ డిక్లేర్‌ చెయ్యాల్సొస్తుందిి”
“సారీ యువరానర్‌” ఏంజెల్‌ తన వయసు పదమూడేళ్ళని చెప్పినా తన క్లయింట్‌ అది నమ్మలేదని, అతని ఉద్దేశ్యంలో తను కలుసుకోవాలని వెళ్ళింది పదమూడేళ్ళ పాపను కాదని, బహుశ ఏ నడివయసు స్త్రీయో అలా తన వయసు అబద్ధం చెప్పిందని నమ్మి అలా వెళ్ళాడని, జ్యూరీని నమ్మించే మార్గం తర్వాత చూడాలి. ఎవరైనా ఇంటర్నెట్‌ ఎక్స్‌పర్ట్‌ ద్వారానో, నేరుగా నిందితుడి ద్వారానో, లేకపోతే కనీసం తన ముగింపు ఉపన్యాసం ద్వారానో ఈ విషయాన్ని స్పష్టంగా బయటకు తీసుకు రావొచ్చు. అన్నింటిలోను ఎవరన్నా ఎక్స్‌పర్ట్‌ ద్వారా చెప్పించటమే బహుశా మంచి మార్గం క్షణంలో నూరో వంతులో ఈ ఆలోచనలు అతని మస్తిష్కంలో గంతులేశాయి. అంతటితో ఆ విషయాన్ని వాయిదా వేసి ప్రస్తుతానికి వచ్చాడు.

“సరే, ఇప్పుడు మరో విషయానికి వద్దాం. ఇందాక మీరు అదే, ఏంజెల్‌ రూపంలో ఉన్నప్పుడు సెక్స్‌ గురించి అంతా అవతలి వ్యక్తే మాట్లాడాడని చెప్పారు. ఔనా?”
“ఔను”
“మరి, ఓ ప్రత్యేకమైన బ్రాండ్‌ కండోమ్‌ తీసుకురమ్మని మీరే సలహా ఇచ్చామని చెప్పారు. అది సెక్స్‌ గురించి మాట్లాడటం కాదా? .. దయచేసి సెక్స్‌ అనే పదానికి అర్థం ఏమిటో నన్ను నిర్వచించమని అడక్కండి!” జ్యూరి వంక చూస్తూ నవ్వుతూ అన్నాడు డెన్వర్‌.
“మేమిద్దరం కలుసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాతనే ఆ సలహా ఇచ్చింది!” కీచుమన్నాడు ఆఫీసర్‌. కాని కోర్టంతా నవ్వుల్లో మునిగి వుండటం వల్ల అది బహుశా ఎవరికీ వినపడలేదు.

“దట్సాల్‌ యువరానర్‌” తృప్తిగా అంటూ వెనుదిరిగాడు డిఫెన్స్‌ లాయర్‌.

డిస్ట్రిక్ట్‌ అటార్నీ మళ్ళీ లేచాడు. అతని మొహం జేవురించి వుంది. ఐతే వెంటనే తమాయించుకుని, చాలా సౌమ్యంగా అడిగాడతన్ని
“ఆఫీసర్‌! ఈ ముద్దాయి ఇంట్లో ఎవరెవరు ఉంటారు?”
“అతను, అతని భార్య, పద్నాలుగేళ్ళ కొడుకు”
“వాళ్ళలో ఇతను తప్ప మిగిలిన వాళ్ళెవరూ ఆ చాట్‌ గ్రూపుల్లోకి వెళ్ళలేదని మీ పరిశోధనలో తేలిందా?”
“తేలింది”
“ఏంజెల్‌తో కలుసుకోవటానికి వచ్చినది ఇతనా మరెవరైనానా?”
“ఇతనే!”
“ఇతని కంప్యూటర్‌ మీద చాట్‌ తాలూకు రికార్డులు ఏమీ ఎందుకు లేవంటారు?”
డిఫెన్స్‌ లాయర్‌ వెంటనే అందుకున్నాడు “అబ్జెక్షన్‌ యువరానర్‌! కేవలం ఊహాగానం!”
“సస్టైన్డ్‌” అన్నాడు జడ్జ్‌.
“ముద్దాయి కంప్యూటర్‌ మీద అలాటి రికార్డుల్ని చెరిపేసే ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ ఏమైనా మీకు కనిపించిందా?”
డిఫెన్స్‌ లాయర్‌ మళ్ళీ లేచాడు “అబ్జెక్షన్‌ యువరానర్‌! ఇతనా విషయాల్లో నిపుణుడు కాడు!”
“నిజమే. కాని ఆ ప్రశ్నను తోసిపుచ్చను. సమాధానం చెప్పండి” అన్నాడు జడ్జ్‌.
“అతని కంప్యూటర్‌ మీద వెబ్‌ ఇరేజర్‌ అనే ప్రోగ్రాం ఉంది. దానితో ఇంటర్‌నెట్‌ మీద అతను చేసిన పనుల తాలూకు రికార్డులన్నీ చెరిపెయ్యొచ్చు”
“తేంక్‌ యు!”

డిఫెన్స్‌ లాయర్‌ మళ్ళీ లేచాడు.
“వెబ్‌ ఇరేజర్‌ ని అతను ఎప్పుడైనా వాడినట్టు మీకు ఏ ఆధారాలు దొరికాయి?”
“ఆధారాలు లేకుండా చెయ్యటమే దాని పని!” మొండిగా సమాధానం చెప్పాడతను.
“నేనడిగేది ఆ ప్రోగ్రామ్‌ గురించి కాదు. అతను దాన్ని వాడాడని, వాడితే దాంతో మీరు ఆరోపిస్తున్న రికార్డుల్ని తొలిగించాడని మీకు ఎలా తెలిసింది?”
“మేము అతన్ని అరెస్ట్‌ చెయ్యటానికి రెండు రోజుల ముందు చివరిసారిగా ఆ ప్రోగ్రాం ని వాడినట్టు తెలుసుకున్నాం”
“మరి అరెస్ట్‌ చేసే ముందు రోజు మీరు అంటే ఏంజెల్‌ అతనితో చాట్‌ చేశారా లేదా?”
“లేదు” అన్నాడతను తన దగ్గరున్న రికార్డుల్ని పరిశీలించి చూసి.

దెబ్బ తిన్నాను అనుకున్నాడు డెన్వర్‌. ఐతే అది పైకి కనిపించనీయకుండా,
“వాళ్ళ ఇంట్లో వున్న వాళ్ళు ముగ్గురు తప్ప మరెవరూ ఆ కంప్యూటర్ని వాడలేదని మీరెలా చెప్పగలరు?” అనడిగాడు, మరో విషయం మీదికి దారి మళ్ళిస్తూ.
“నేను అతనితో చాట్‌ చేసిన రోజుల్లో వాళ్ళింట్లో మరెవరూ ఉండలేదని నిర్ధారించుకున్నాం”
“కంప్యూటర్‌ వాడటానికి ఆ ఇంట్లో ఉండనక్కర లేదు కదా? ఇరుగుపొరుగుల పిల్లలు ఎవరైనా వాడకూడదా?”
“అది మరీ అసంబద్ధమైన ప్రశ్న” అరిచాడు డిస్ట్రిక్ట్‌ అటార్నీ. అతని గొంతు అతనికే వింతగా అనిపించింది. తమాయించమని తనని తను హెచ్చరించుకున్నాడు.
“ఓవర్‌రూల్డ్‌” అన్నాడు జడ్జ్‌ నిర్వికారంగా. ఇప్పుడిప్పుడే అతనికి ఈ కేసు కొంచెం ఉత్సాహాన్ని కలిగిస్తున్నది.
“ఇరుగుపొరుగులేం ఖర్మ, దారిన పోయే వాళ్ళెవరైనా వాళ్ళింట్లో దూరి వాళ్ళ కంప్యూటర్ని వాడొచ్చు” హేళనగా జ్యూరీ వంక చూస్తూ అన్నాడు ఆఫీసర్‌. అతని హావభావాల్లో డిఫెన్స్‌ లాయర్‌ మీద కసి కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది.
సరిగ్గా అలాటి ముద్రే జ్యూరీ మనసుల్లో నిలిచి ఉండేలా చేయాలని ఎదురు చూస్తున్న డెన్వర్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ఆపటానికి ఇదే మంచి సమయమని నిర్ణయించుకుని “తేంక్స్‌ ఆఫీసర్‌” అని వెళ్ళి కూర్చున్నాడు.

అంతటితో ప్రోసెక్యూషన్‌ కేసు ముగిసింది. డిఫెన్స్‌ మొదలు కావలసి వుంది.

ప్రోసెక్యూషన్‌ సాక్షిని కొంత తికమక పెట్టటం జరిగింది కాని, తన క్లయంట్‌ని నిర్దోషిగా బయటకు లాగటానికి అది సరిపోదని డెన్వర్‌కి తెలుసు. మాంఛి ఊపైన ముగింపు ఉపన్యాసం ఇచ్చి జ్యూరీ మనసుల్లోంచి ఆ తికమకలన్నిటినీ తుడిచెయ్యగల సమర్ధుడు డిస్ట్రిక్ట్‌ అటార్నీ!
కనుక తన చేతిలో ఇంకొన్ని అస్త్రాలు కావాలి ఈ కేసు గెలవాలంటే.

ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం డిఫెన్స్‌ కేసులో నాలుగు భాగాలు. మొదటిది పోలీసులు తన క్లయంట్‌ని ట్రాప్‌ చేశారనటం. క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ఆ విషయంలో కొంత సాధించాడు. ఐతే అది తను నేరుగా ఋజువు చెయ్యగలిగింది కాదు. ఇక రెండవ భాగం, చాట్‌ చేసింది అతను కాదు, మరొకరని వాదించటం. ముఖ్యంగా, అతని పద్నాలుగేళ్ళ కొడుకు అలా చేశాడని నమ్మించటం తేలిక. కాని అలా వాదిస్తే, ప్రోసెక్యూషన్‌ వారు ఆ పిల్లవాణ్ణి బోనెక్కించి తన తండ్రికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించొచ్చు. అప్పుడు ఇంక ఏమేం విషయాలు బయటకు వస్తాయో ఎవరు చూశారు? తీగ లాగితే డొంకంతా కదలొచ్చు! దానికి శేఖర్‌ కూడ ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోను కొడుకును ఇందులోకి లాగటానికి వీల్లేదని పట్టుపట్టి కూర్చున్నాడు. ఇక మూడో మార్గం ఇంట్లో వాళ్ళెవరూ కాకుండా మరెవరో చేశారనటం. అది ప్రయత్నించాడు కాని సరిగా పనిచెయ్యలేదు. ఇక చివరగా “కల్చరల్‌ డిఫరెన్స్‌ తియరీ” అతను సిద్ధం చేసుకున్న ముఖ్యాస్త్రం. ఇదివరకు కొన్ని కేసుల్లో ఆ డిఫెన్స్‌ విజయవంతంగా పనిచేసింది. టూకీగా చెప్తే నిందితుడు పుట్టిపెరిగిన సమాజంలో ఇలాటి సంఘటనలు మామూలేనని, అందువల్ల అతనికి తెలియకుండానే అది తప్పు కాదన్న భావం అతనిలో బలపడి వుంటుందని, కనుక నేరం అతనిది కాదు అతను పెరిగిన సమాజానిదని వాదిస్తారన్న మాట. ఐతే, అది రెండు వైపులా పదునున్న కత్తి. అందులోనూ, జ్యూరీలో ఒక ఇండియన్‌ ఇమిగ్రెంట్‌ ఉన్నాడు కనుక, అలాటి వాదన అతన్ని విముఖుణ్ణి చేసే అవకాశం వున్నది. ఐతే, అలా వాదించకపోయినా అతని ఓటు ఇటు పడుతుందా అన్నది అనుమానమే. ఎందుకంటే, మరో ఇండియన్‌కి సహాయం చేసే అలవాటు లేకపోగా, అపకారం చెయ్యటానికి వీలైనంత ప్రయత్నం చెయ్యటం ఇండియన్స్‌ లక్షణం అని అతనికి బాగా తెలుసు. కాబట్టి అతని ఓటును లెక్కలోంచి తీసివెయ్యటమే మంచిది. మిగిలిన వాళ్ళు ఆ వాదానికి ఎలా స్పందిస్తారనేదే క్లిష్టమైన ప్రశ్న.

తనకు ముందుగానే సమాధానం తెలియని ఏ ప్రశ్నా ఒక సాక్షిని అడక్కూడదంటారు.
అలాగే, జ్యూరీ స్పందన ఎలా వుంటుందో తెలియని ఒక వాదాన్ని కూడ వాళ్ళ ముందుంచకూడదని నమ్ముతాడు డెన్వర్‌.

అందుకే , ఒక “ఫోకస్‌ గ్రూప్‌”ని ఏర్పాటు చేసి, వాళ్ళ ముందు ఈ వాదాన్ని రిహార్సల్‌ చేశాడతను. వాళ్ళలో అరవై శాతం దానికి అనుకూలంగా స్పందించారు.
ఐతే, “ఫోకస్‌ గ్రూప్‌” జ్యూరీ కాదు కదా!
అక్కడ పనిచేసినంత మాత్రాన ఆ వాదం ఇక్కడా పనిచేస్తుందన్న నమ్మకం లేదు!
చివరకు తన మనసుకు తోచిన విధంగా వెళ్ళక తప్పదు.
జ్యూరీలో ఎక్కువమంది దృఢమైన మతనమ్మకాలు ఉన్నవాళ్ళని అతని పరిశోధనల్లో తేలింది. కనుక, క్రైస్తవ మతం గొప్పతనాన్ని పొగుడుతూ, నిందితుడి మతం ఎంత తక్కువదో వివరిస్తూ, అలాటి మతంలో పెరిగిన వ్యక్తికి ఇంతకన్నా మంచి గుణాలు ఎలా వస్తాయని వాళ్ళకు అనిపించేలా చిత్రిస్తే తన పని సులువు కావచ్చు.

ప్రొఫెసర్‌ క్లెయిర్‌ మార్టిన్‌ని తన తొలి సాక్షిగా పిలిచాడు.
భారతీయుల మూఢనమ్మకాల మీద, అనాగరిక ఆచారాల మీద ఎన్నో పుస్తకాలు రాసిందావిడ.

ఎనభై ఏళ్ళ మగవాళ్ళు పదేళ్ళ లోపు ఆడపిల్లల్ని పెళ్ళాడటం ఆ సమాజంలో సర్వసాధారణం అని ఆవిడ సోదాహరణంగా వివరించి చెప్పినప్పుడు జ్యూరీ సభ్యులు విస్తుపోయి విన్నారు.

రేప్‌ అనేది ప్రతి ఇంట్లోనూ రోజూ జరిగే వ్యవహారమనీ, అది మామూలు విషయంగా అందరూ భావిస్తారని వివరిస్తే వినలేక చెవులు మూసుకున్నారు.

వాళ్ళకు వేల కొద్దీ దేవుళ్ళున్నారనీ ఆ దేవుళ్ళలో చాలా మందికి వందల కొద్ది భార్యలున్నారని విశదీకరిస్తే “అవ్వ!” అని నోటి మీద వేళ్ళేసుకున్నారు.

ఆడవాళ్ళు పడే ఘోరమైన కష్టాల్ని సహగమనాల నుంచి కట్నాల హత్యల దాకా ఒక్కొక్కటే కళ్ళకు కట్టినట్టు వినిపిస్తుంటే జడ్జ్‌ కలగజేసుకుని మరీ అంత “గ్రాఫిక్‌”గా చెప్పవలసిన అవసరం లేదని మందలించాడామెను.

మొత్తం మీద ఆమె సాక్ష్యం ముగిసే సరికి జ్యూరీ సభ్యులు చాలా మంది జుగుప్స తోను, అసహ్యం తోను, నిందితుడి మీద కొంత జాలి తోను కనిపించారతనికి. తన పథకం నెరవేరినట్లే అనిపించింది.
జ్యూరీలో ఉన్న ఒక్క ఇండియన్‌ మాత్రం తన తలని ఎక్కడ దాచుకోవాలా అని వెదికి ఏమీ కనపడక తలవంచుకుని, కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. ఐనా మిగిలిన జ్యూరర్ల చూపులు అతనికి గుచ్చుకుంటూనే ఉన్నాయి.

నిందితుడికి మద్దతుగా వచ్చి ప్రేక్షకుల్లో కూర్చున్న కొందరు మిత్రులు లేచి బయటకు వెళ్ళిపోయారు.
అతని కేరక్టర్‌ గురించి సాక్ష్యం చెప్పటానికి సిద్ధంగా వచ్చిన వాళ్ళు కొందరు తీరా బోనెక్కాక ఆ ప్రొఫెసర్‌ చెప్పిన వాటిలో తమకున్న అనుభావాలని గురించి కూపీ లాగుతారేమోనని భయపడి అక్కడినుంచి చల్లగా జారుకున్నారు.

ఐతే డిస్ట్రిక్ట్‌ అటార్నీ మాత్రం ఏమాత్రం తొణకలేదు. ఈ వాదం రాబోతుందని ముందుగానే ఊహించాడతను.
“ఈ దేశంలో ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు?” అనడిగాడామెను.
“దాదాపుగా ఒక మిలియన్‌”
“వాళ్ళలో ఎంతమంది ఇలాటి పనులు చేస్తారో మీకు తెలుసా?”
“తెలియదు”
“వేలల్లో వున్నారో, వందల్లో వున్నారో, పదుల్లో వున్నారో ఐనా తెలుసా?”
“తెలియదు”
“నేను చెప్తాను. క్రితం సంవత్సరం నేరాల గణాంకాల ప్రకారం పదుల సంఖ్యలో కూడ లేరు”
“అబ్జెక్షన్‌ యువరానర్‌! డిస్ట్రిక్ట్‌ అటార్నీ గారే ఈ కేసులో స్వయంగా సాక్ష్యం చెప్పదలుచుకుంటే వారిని ప్రమాణం చెయ్యమనండి. నిన్న మొన్నటి స్టింగ్‌ ఆపరేషన్‌లో ఇక్కడ దొరికినపదిహేను మందిలోనూ తొమ్మిది మంది దాకా ఇమిగ్రెంట్‌ ఇండియన్స్‌ ఉన్నారనే విషయం దాచి ఇలా ఏవో గణాంకాలు చెప్పటం సక్రమంగా లేదు”

కోపంగా బల్ల గుద్దాడు జడ్జ్‌.
జ్యూరీని అక్కడి నుంచి వాళ్ళ వెయిటింగ్‌ రూమ్‌కి పంపించాడు.
లాయర్లు ఇద్దర్నీ దగ్గరకు పిలిచి చెడామడా తిట్టాడు.
“నేను రూలింగ్‌ ఇవ్వకుండానే మీరిలా దొంగచాటుగా ఆ విషయాన్ని జ్యూరీ ముందుంచటం క్షంతవ్యం కాదు. మీలో మళ్ళీ ఇలా ఎవరైనా చేశారో, వాళ్ళని నా కోర్టు నుంచి నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటిస్తా!” అని హెచ్చరించి పంపాడు. లాయర్ల ఆ సంభాషణని రికార్డ్‌లోంచి కొట్టెయ్యమని రిపోర్టర్‌ ని ఆదేశించాడు.

ప్రేక్షకులందరూ ఈ తమాషాని చూసి వినోదించారు.

తాము చెప్పదలుచుకున్నది చేరవలసిన వాళ్ళని చేరిందని లాయర్లిద్దరూ ఆనందించారు!

“ఇంకా ఎంతమంది సాక్షులున్నారు?” కోపంగా అడిగాడు జడ్జ్‌ గోడగడియారం వంక చూస్తూ.
“ఐదుగురున్నారు యువరానర్‌”
“ఏ విషయాల గురించి సాక్ష్యం చెప్పబోతున్నారు?”
“నిందితుడి కేరక్టర్‌ గురించి”.

అంతటితో మరుసటి రోజుకు కోర్ట్‌ “ఎడ్జర్న్‌” అయింది.
“ఇన్‌ మై చేంబర్స్‌” అన్నాడు జడ్జ్‌ ఇరు పక్షాల వంక చూస్తూ. తన చేంబర్స్‌లోకి నడిచాడు.
అటార్నీలందరూ అతన్ని అనుసరించారు.
అందరూ కూర్చున్నాక, “మీరు ఈ కేసుని కోర్టు బయట స్థిరపర్చుకోవటం మంచిదని నా అభిప్రాయం” అన్నాడతను.
ఒక్క క్షణం నిశ్శబ్దం.
“నా క్లయంట్‌ నిర్దోషి యువరానర్‌” అన్నాడు డిఫెన్స్‌ లాయర్‌.
చిరునవ్వు నవ్వాడు జడ్జ్‌. “అతను నిర్దోషి ఐతే ఇంతకుముందు నువ్వు నడిపిన ఆ సర్కస్‌ అంతా ఏమిటి? ఒక మాట చెప్తున్నాను విను. జ్యూరీ గనుక అతన్ని దోషి అని నిర్ణయించిందో, ఏగ్రవేటెడ్‌ అటెంప్టెడ్‌ సెక్సువల్‌ ఎస్సాల్ట్‌ కి పడే అత్యధిక శిక్షని నేను నీ క్లయంటుకి వేసేస్తాను. అది సెకండ్‌ డిగ్రీ ఫెలనీ అని మర్చిపోకు” అన్నాడు చిన్నగానే ఐనా దృఢంగా. ప్రోసెక్యూషన్‌ తో ప్రత్కేకించి ఆయన ఏమీ చెప్పలేదు గాని, డిస్ట్రిక్ట్‌ అటార్నీ వంక చూసిన ఒక చూపులోనే, “జ్యూరీ ఎటువైపు వెళ్తుందో ఎవరమూ చెప్పలేం. నీకు ఎంతవరకు దొరుకుతుందో అంత తీసుకో, ఎలక్షన్‌ వేళకి బాగానే ఉపయోగిస్తుంది” అన్న సూచన స్పష్టంగా కనిపించిందతనికి.

నీళ్ళు నముల్తూ నేల చూపులు చూశాడు డిఫెన్స్‌ లాయర్‌.
“ముద్దాయి రెడ్‌ హేండెడ్‌గా పట్టుపట్టాడు. అలాటివాళ్ళు మన జ్యూరిస్‌డిక్షన్‌లో బయట తిరగాలని మనం ఎవరమూ కోరుకోము. కాబట్టి మీ ఇద్దరికీ నా సలహా ఏమిటంటే, ఇద్దరికీ అనుకూలంగా ఉండే విధంగా పరిష్కారం చేసుకోవటం అందరికీ మంచిది” మరో సారి వివరించాడు జడ్జ్‌.

ఇలాటిది జరుగుతుందని ముందుగానే ఊహించాడు డిస్ట్రిక్ట్‌ అటార్నీ. అందుకే అందుకు సిద్ధంగా కూడ వచ్చాడు.
“యువరానర్‌! నాక్కావలసింది చాలా సింపుల్‌ అతను ఈ దేశంలో వుండటానికి లేదు, అతను ఈ దేశం నుంచి ఎలాటి ఆస్తులూ తీసుకెళ్ళటానికి లేదు.”
“అది అసంభవం! ఇక్కడ ముప్ఫై ఏళ్ళుగా ఉన్నాడతను! ఇప్పుడెక్కడికి వెళతాడు? పైగా ఇంతకాలం సంపాయించిన డబ్బంతా ఇవ్వమంటే ఎలా?”
“నీ ఫీజులన్నీ నువ్వు తీసుకున్నాక మిగిలిందే మేం తీసుకుంటాం. అదంతా ఎబ్యూజ్డ్‌ చిల్డ్రెన్‌స్‌ చారిటీలకి ఇస్తాం”
“అలా కాదు, ఏదో కొంత న్యాయంగా ఉండే అంకె చెప్తే అంత డబ్బు ఇప్పించటానికి ప్రయత్నిస్తా”
“రెండు మిలియన్లు”
“అంత ఆస్తి అతనికి లేదు”
“ఎంత వుంది మరి?”
“ఒకటిన్నర”
“ఐతే, నీ ఫీజు ఓ పావు మిలియన్‌, అతనికి మరో పావు. మిగిలిన మిలియన్‌ ప్రభుత్వానికి”
“ఇక్కడి నుంచి వెళ్ళిపోయే విషయం?”
“ఆ విషయంలో నేను ఏమాత్రం తగ్గను. జ్యూరీ దోషిగా నిర్ణయిస్తే అతని గతేమౌతుందో ఆలోచించు. ఇరవై ఏళ్ళ జైలు, ఆ తర్వాత దిక్కులేని బతుకు, ఎక్కడికి వెళ్ళినా సెక్స్‌ అఫెండర్‌ కింద ఎవరూ రానివ్వరు. ఎవరూ ఉద్యోగం ఇవ్వరు. అతని బతుకు దుర్భరం చేసే బాధ్యత నేనే స్వయంగా తీసుకుంటాను. అదా నీకు కావలసింది?”
“సరే ఐతే, దేశం విడిచి వెళ్ళటం, అతనికి అర మిలియన్‌, మీకు ముప్పావు మిలియన్‌, నాకు పావు మిలియన్‌” అన్నాడు డిఫెన్స్‌ లాయర్‌.
“ఒప్పుకుంటున్నాను”
“దీనికి నా క్లయంట్‌ కూడ ఒప్పుకుంటేనే!”
“నీ శక్తిసామర్య్థాల మీద నాకు ఆపాటి నమ్మకం వుంది!”

“ఓకే జెంటిల్‌మన్‌! యు హావ్‌ ఎ గుడ్‌ ఈవెనింగ్‌!” బయటకు దారి తీశాడు జడ్జ్‌.

(ఇటీవల ఆస్టిన్‌ ప్రాంతంలో జరిగిన చైల్డ్‌ పొర్నాగ్రఫీ స్టింగ్‌ ఆపరేషన్‌లో పట్టుబడ్డ వాళ్ళలో చాలా భాగం భారతీయులే! వాళ్ళ విచారణలు ఏవీ ఇంకా మొదలు కాలేదు. ఆ విచారణలు ఎలా ఉండవచ్చునో ఊహించి రాసింది ఇది.)