(ఈ వ్యాసం మూడు భాగాల్లో మూడు “ఈమాట” సంచికల్లో ప్రచురించబోతున్నాం. ఇది తొలి భాగం.)
1. పరిచయం.
మూడు రకాల ప్రయోజనాల కోసం ఈ వ్యాసం రాస్తున్నా. 1. అవధాన ప్రక్రియ గురించి కుతూహలం, “మనమూ ఎందుకు చెయ్యకూడదు” అన్న కోరిక ఉన్నవాళ్ళకి ఓ mini-guide ఇవ్వటం, 2. అవధాన శ్రోతలకి అవధాని ఏయే techniques ఏయే సందర్భాల్లో వాడుతున్నాడో తెలిసేట్టు చెయ్యటం (సంగీతం గురించి తెలిస్తే సంగీత కచేరీల్ని enjoy చెయ్యగలిగినట్టు అవధానం techniques తెలిస్తే అవధాన కచేరీల్నీ ఇంకా enjoy చెయ్యొచ్చని నమ్మకం వల్ల), 3. పృఛ్ఛకులు అవధానుల techniques తెలుసుకుని సమయానుకూలమైన ప్రశ్నలడిగే అవకాశం ఇవ్వటం.
అవధానం ఓ సాహితీవినోదం. ఈ ప్రక్రియ తెలుగులోనే ఉందని చాలా మంది అంటారు. నిజం కావొచ్చు. కనీసం నాలుగొందల ఏళ్ళ క్రితం “అష్టావధానం” చేసిన ఆధారాలున్నాయి గాని అప్పటి అష్టావధానాలకీ ఇప్పటి వాటికీ పోలికే లేదు. అప్పుడు అష్టావధాని ఎనిమిది భాషల్లో కవిత్వం చెప్పేవాడు. ఇప్పుడు ఒక భాషలో ఎనిమిది
అంశాల్లో పరీక్ష పెడుతున్నారు. ఈ format తయారైంది ఈ శతాబ్దం లోనే.
మనకి ఎంతో మంది అవధానులున్నా, అవధానంలో science part ఎంత, art part ఎంత అన్న విషయాన్ని గురించి విశ్లేషణ జరిగినట్టు కనిపించదు. ఒక్క సి. వి. సుబ్బన్న doctoral thesis “అవధాన విద్య” మాత్రం కొంత వరకు ఈ విషయాన్ని స్పృశించింది. ఇది పూర్తిగా దైవదత్తమైన వరమనీ నేర్చుకుంటే వచ్చేది కాదనీ ప్రచారం
చెయ్యటం అవధానుల natural interest గనక దాన్లో గుట్టుమట్టులు అలాగే ఉండిపోతున్నాయ్. వాటిలో వీలైనన్నిటిని అందరి ముందు ఉంచటానికి ఇదో చిన్న ప్రయత్నం.
2. అవధానాల రకాలు.
అవధాన్ని ప్రశ్నలడిగే పృఛ్ఛకుల సంఖ్యని బట్టి అవధానాలకి పేర్లొచ్చాయి. అన్నిటికన్నా తక్కువ సంఖ్య ఎనిమిది. ఎనిమిది మంది పృఛ్ఛకులుండేది అష్టావధానం. అలాటివి రెండు, మూడు,.. యిలా ఎన్నైనా ఒకసారి చెయ్యొచ్చు. వాటిని వరసగా ద్విగుణిత, త్రిగుణిత,.. అష్టావధానాలంటారు. ఇరవైకి పైన, వందకి లోపు పృఛ్ఛకుల్తో కొంచెం different format తో శతావధానాలు చేస్తారు. రెండు మూడు వందల మంది పృఛ్ఛకుల్తో సహస్రావధానాలు, వెయ్యిన్నూట పదహార్లతో మహాసహస్రావధానాలు చేసేస్తున్నారు. తొందర్లో లక్షావధానాలు, మిలియనవధానాలు కూడ జరగొచ్చు.
కొత్తగా మొదలుపెట్టే అవధాని ముందుగా అష్టావధానంలో నిష్ణాతుడు కావాలి గనక ఈ వ్యాసం ముఖ్యంగా అష్టావధానాల గురించి.
3. కొన్ని అవధాన పద్యాల విశ్లేషణ.
అవధాన పద్యాల్ని తయారుచేసే techniques గురించి మాట్టాడుకునే ముందు కొన్ని ఉదాహరణల్ని విశ్లేషించి చూద్దాం. అష్టావధాన అంశాల్లో అవధానికి అతి తక్కువ స్వేచ్ఛ ఉన్నవి సమస్య, దత్తపది. వర్ణన, ఆశువు అలా కాదు. కనక అవధాని వాడే techniques స్పష్టంగా తెలియాలంటే దత్తపది, సమస్య మంచి చోట్లు. పైగా, ఇవి చెయ్యగలిగిన potential అవధానికి మిగిలిన అంశాలు తేలిక.
పద్యాలు కట్టటంలో అవధానులు రెండు పద్ధతులు వాడతారు పృఛ్ఛకుడు ప్రశ్న అడిగిన వెంటనే దానికి కావలసిన పద్యం మొత్తం తయారు చేసుకోవటం ఒక పద్ధతి; అలా కాకుండా ఒకో పాదం తయారుచేసుకోవటం రెండో పద్ధతి. నాకు కనిపించేది నాగఫణి శర్మ, మేడసాని మోహన్ లాటి ఇటీవలి అవధానులు ఒకో పాదం కడితే, అంతకు ముందు తరాల వాళ్ళు పద్యం మొత్తం ఒకే సారి చేసేవాళ్ళని (అవధాన సమయంలో ఒకో పాదమే చెప్తారు, అది వేరే విషయం). కింది ఉదాహరణలు ఈ విషయాన్ని కూడ చూపిస్తాయి.
దత్తపది ఉదాహరణలు.
నాగఫణిశర్మ న్యూజెర్సీ శతావధాన పద్యాలు చాలా మంది చూసి ఉంటారు. కనక అప్పటి దత్తపదుల్ని కాస్త పరిశీలిద్దాం. మొదటిది గణపతి, గణపతి, గణపతి,
గణపతి అనే నాలుగు పదాల్తో వినాయకుడి మీద చంపకమాల చెప్పమనేది. ఇది ఇచ్చిన పృఛ్ఛకులెవరో కరుణాసముద్రులు. ఈ పదాల్లో ఏ మాత్రం కష్టం లేకపోవటమే కాకుండా అసందర్భమైనవి కూడా లేవు. ఇలాటి దత్తపదులు ఆశువు అలవాటున్న వాళ్ళు అవలీలగా సాధించగలరు. ఇలాటివి ఎప్పుడో అవధాని అదృష్టం బాగుండి
తగుల్తాయి. ఐనా కొంతమంది అవధాన్లు “కుప్పుస్వామయ్యర్ మేడ్‌డిఫికల్ట్” లాగా కావాలని తేలిక పదాల్తోనైనా వాళ్ళకి వాళ్ళే పరీక్ష పెట్టుకుని non-trivial పూరణలు చేస్తారు. న్యూజెర్సీ సందర్భంలో నాగఫణిశర్మ అలా చెయ్యకుండా తేలిగ్గా లాగించేశాడు. కాని మిగిలిన దత్తపదులు ఇలాటివి కావు. వాటి సంగతి చూద్దాం.
లండన్, అమెరికా, జపాన్, ఇటలీ వీటితో వరూధినీ ప్రవరుల కథ.
వీటిలో లండన్, జపాన్, ఇటలీ తేలికైన పదాలు. లండన్‌ని లు, అండన్‌అని విరచొచ్చు. జపాన్‌ని సమాసం చెయ్యటం హాయి జప అనేది చక్కటి సంస్కృత పదం, ఇచ్చిన సందర్భానికి బాగా అతికేది. ఇటలీ ని ఇట, లీ గా విడదీస్తే ఇట మంచి తెలుగు పదం, లీ తో మొదలయ్యే పదాలు కొల్లలు. అమెరికా ఒకటే తలనొప్పి. దీన్ని ఎలా విరిచినా అర్థవంతమైన పదం కాని పదం suffix గాని రావు. ఇలాటి పరిస్థితుల్లో అవధాన్లు చేసే పని ఇచ్చిన పదాన్నే కొద్దిగా మార్చటం. ఈయన అమెరికా ని అమరిక చేశాడు. ఇంకేముంది, గొడవంతా తీరిపోయింది. విరవక్కర్లేకుండానే అది మంచి పదం. ఐతే, మరీ అంత simpleగా చెయ్యటం బాగుండదనుకున్నాడేమో, దాన్ని కూడ అమరి, క అని విరిచాడు. ఇదీ పద్యం.
అలరున్‌చారు జిగిన్‌బిగిన్‌హొయల డాలండన్‌పిసాళించగా
లలితన్‌పొందిన పుణ్యమే అమరి కళ్యాణంబులే కల్గు; నో
లలనా నేను జపానురక్తుడ కథాలావణ్యమై గేహమం
దలఘుశ్రీ త్రితయాగ్ని వెల్గె నిట లీలాలాపముల్‌ధర్మమే!
ఈ పద్యం ఎలా తయారయ్యిందో చూద్దాం. తొలిపాదంలో లండన్‌రావాలి. దాని ముందు డా చేర్చి డాలు, అండన్ చేశాడు. డాలు అంటే ప్రకాశం కనక ఆ పాదం అందం గురించి అని అలరున్‌అని మొదలెట్టాడు. ఇక చారు, జిగి, బిగి, హొయలు, డాలు అన్నీ ఒకటే అర్థం ఉన్న పదాలు ఇంచుమించుగా. పిసాళించగా అని పాదం ముగించాడు బహుశా ఆ పదం ఆయన stock పదాల్లో ఒకటై ఉంటుంది అక్కడ పట్టే అనేక పదాలు, ప్రకాశించగా, సమీక్షించగా,వినోదించగా, ప్రభల్‌నించగా, .. ఇలా ఉండగా మారు మూల దొరికే పిసాళించటం ఊరికే రాదు. సరే, ఇక రెండో పాదంలో అమరిక రావాలి. దీన్ని అమరి, క గా విడగొడదా మనుకున్నాడు కదా! పై పాదంలో డాలు అనుకోవటంతో మిగిలిన పాదంలో ఏం ఉండాలో తెలిసిపోయింది గాని ఇక్కడ అమరి అనే పదం బట్టి అలాటి information ఏమీ రాదు. ఇక మిగిలింది క. దాన్తో కళ్యాణం అనే పదం వేద్దామనుకున్నాడు. కనక ఏదో అమరి కళ్యాణం సమకూరాలి. ప్రాస ల కాబట్టి లలితన్‌పొందిన అని చెప్పేశాడు. ఏదో అర్థం లాగొచ్చు గాని నిజానికి సందర్భానికీ, ఈ పాదానికీ సంబంధం చాలా దూరం. మూడో పాదం చూస్తే ఈ విషయం ఇంకా స్పష్టమౌతుంది. మూడో పదం జపాన్ కనుక దాన్ని హాయిగా జపానురక్తుడ అని మలుచుకున్నాడు. అంచేత లలనా నేను జపానురక్తుడ అనే చక్కటి expression వచ్చింది. ఐతే దాని తర్వాత ఏం వస్తే బాగుంటుందో దానికేం pointer లేదు. ఒకటే handle యతి. యతి ల రావాలి గనక కథాలావణ్యమై అనే పదం వేశాడు సందర్భానికీ దానికీ బాదరాయణ సంబంధం కూడా లేకపోయినా. ఇక పాదం ఐపోవస్తుంది, పై పాదంలో ఇటలీ పడాలి; దాన్ని ఇట, లీ గా విడగొట్టాలని ముందే నిర్ణయం జరిగింది. కాబట్టి, అట, అంటే ఇప్పుడు తనున్న హిమాలయాలకి దూరంగా, తన ఇంటిని గురించి మాట్టాడొచ్చుననిపించింది. అలా గేహమందలఘు అనే phrase వచ్చేసింది, తర్వాతి పాదం ప్రాసని కూడ పూర్తిచేస్తూ. ఇక నాలుగో పాదం అలఘు దగ్గర ఆగి ఉంది గనక ఆ ఘు ని గురువు చెయ్యటానికి ఓ శ్రీ పడేశాడు. ఆ తర్వాత తల్లో, తండ్రో, భార్యో, ఉన్నారని చెప్పొచ్చు (ఎవరికైనా ఆ అలఘుశ్రీ అనే adjuctive సరిపుచ్చొచ్చు). కాకుంటే ప్రవరుడి కథలో ఆ తర్వాత అతను అగ్నిని ప్రార్థించి ఇల్లు చేరతాడు గనక అగ్నులున్నాయని చెప్పటం సమంజసం, సందర్భోచితం. మిగిలింది ముక్తాయింపు.
మొత్తం మీద తేలేదేమంటే,
1. ఇతను ఏ పాదానికి ఆ పాదం తయారుచేశాడు; పద్యమంతా ఓ ప్లాన్ ప్రకారం చెయ్యలేదు. పైగా ఒక పాదంలో కూడ పూర్తి ఏకసూత్రత లేదు. అంటే పాదం కూడ పూర్తిగా కాకుండా ఒక్కోసారి ఒకో ముక్క తయారుచేశాడు ప్రాస చుట్టుపక్కల ఉండే పదాలు ఒక భాగం; యతి చుట్టుపక్కలవి మరో భాగం; దత్తపదం చుట్టుపక్కల మూడో భాగం. ప్రాస వల్ల తయారైన phrase కి ఉదాహరణ రెండో పాదం; యతి వల్ల రావటానికి ఉదాహరణ మూడో పాదం; దత్తపదం వల్ల రావటానికి ఉదాహరణ మూడో పాదం మొదటి భాగం.
2. తేలిగ్గా విరిగి, ముందూ వెనకా అర్థవంతమైన మాటల్నిచ్చే పదాలు దత్తపదాలైనప్పుడు ఆ భాగంలో (మొదటి పాదం లాటి సందర్భంలో మొత్తం పాదంలో) ఉండాల్సిన భావం స్ఫురించి అర్థవంతమైన భాగం తయారుచెయ్యొచ్చు. అలా కొరుకుడు పడని పదాలిస్తే జరిగింది ఎలాగోలా పద్యం తయారైందనిపించటమే. అలాటి పదాలుండే పాదాలు అతుకుల బొంతలు, అర్థం తయారు చెయ్యటానికి శ్రమ పడాల్సినవీ ఔతాయి.
ఇలాటిదే మరో ఉదాహరణ టూకీగా చూద్దాం. అదే అవధానం లోది ఈ దత్తపది కూడ.
టీవీ, వీడియో, కారు, రేడియో రామాయణార్థంలో ఉత్పలమాల.
వీటిలో 1, 2, 4 వ పదాల్ని అలాగే వాడ్డానికి లేదు రామాయణార్థంలో! టీవీ లో ఉన్నదే రెండక్షరాలు. కనక విరచటానికి ఒకటే మార్గం టీ, వీ గా. ఇక వీడియో కూడా ఒక రకంగానే విరుగుతుంది వీడి, యో గా (డియో తో మొదలయ్యే పదాలెక్కడున్నాయి?) రేడియో తో ఇంకా బాధ. వీడియో విషయంలో కనీసం వీడి అనేది చక్కటి తెలుగు పదం. రేడి అలా కాదుగదా! అందుకనే దాంతో ఎనరేడి అనే వింతపదం తయారుచేశాడు. దాని అర్థం ఏమిటని డబాయిస్తే ఏదో ఒక విధంగా ఏదో ఒక అర్థం సాధించగలడు గాని ఆ పదం ఇదివరకు ఎవరైనా వాడేరేమో నాకు తెలీదు. మొత్తం మీద ఈ పద్యం తయారయ్యింది.
తారక మంత్రమున్విడి సదా చనటీ విషవార్థి క్రుంకెదో
వైరము వీడి యోగి జనవంద్యు వినీల మహాపయోధరా
కారు మహాత్ము రాముని సుఖం కరునిన్‌శరణంబు వేడుమా
ఈరిత చిత్తవృత్తి నెనరేడి యొనర్పగ శాంతి నీకునై
ఇంతకు ముందు పద్యం విషయంలో అనుకున్నవి ఇప్పుడు ఇంకా స్పష్టంగా కన్పిస్తాయి. రెండు, మూడు పాదాల్లో పదాలు విరచటానికి తేలికైనవి. అందుకే ఆ పాదాలు కూడ బాగా వచ్చాయి. ఒకటి, నాలుగు కష్టం. ఆ రెంటిలోనూ నాలుగోది మరీ కష్టం. ఆ పాదాలు చూస్తే తెలుస్తుంది అవి తయారుచేసేప్పుడు అవధాని మనఃస్థితి ఏమిటో! ఇది ఏ అంగదుడో రావణుడికి చేస్తున్న హితబోధ అనుకుంటే ఒకటి, నాలుగు పాదాలు దారి తెలియకుండా వెళ్ళినట్టు, రెండు, మూడు హాయిగా వచ్చినట్టు కన్పిస్తాయి. రెండూ మూడూ బాగా రావటానికి కూడ ముఖ్య కారణం అవి రెండు filler lines కావటమే! రాముడి పొగడ్త తప్ప వాటిలో ఏమీ లేదు. రాముణ్ణి పొగడ్డం అనేది ఇదివరకు వందల మంది కొట్టిన పిండి కదా, కళ్ళు మూసుకుని పాడెయ్యొచ్చు!
ఇంకొక్కటి చూద్దాం. ఈ పద్యం విషయంలో భలే తమాషా జరిగింది కూడా.
రామా, కామా, రోమా, కోమా చిన్న పిల్లలకు ఆశీర్వాదం. దీనికి చెప్పిన పద్యం
రామా మేమిట పూజకై పిలిచిననన్‌రమ్యంబుగా శారదా
కామా మేము త్వదీయ భక్తులము శంకాతంక మింకేటికో
మామా మానసమెల్ల నీకు సుమమై మందారమై పూచెరో
మా మై నింపిన యాసలెల్ల నివిగో మన్నింపవే గైకొనన్
ఇచ్చిన అన్ని పదాల రెండో అక్షరం ఒకటే కావటంతో వాటిని ప్రాసల్లో పడెయ్యటం అనేది original plan. ఇక రామా అనేది మొదటి పదంగా ఇచ్చి ఆ పాదంలో ఏం ఉండాలో పృఛ్ఛకుడే చెప్పేశాడు కనక ఆ పాదం హాయిగా వచ్చేసింది. కాకుంటే రెండో పాదం కామా తో మొదలవ్వాలి కనక మొదటిపాదం చివర్లో దానికి prefix గా ఉండే పదం వెయ్యాలి. చిన్న పిల్లల సందర్భం కాబట్టి శారదా అని వేసేశాడు నిజానికి శారదాకాముడు రాముడు కాకపోయినా! ఇక మూడో పాదంలో గమ్మత్తు జరిగింది. మూడో దత్తపదం మామా అని ఎందుకో మనసులో ఉండిపోయింది. అలా అనుకుని ఉత్సాహంగా పాదం మొత్తం చెప్పేసరికి గుర్తొచ్చింది అది మామా కాదు రోమా అని. మూడో పాదం మొదట్లో రోమా రావాలంటే ఆ ఒక్క పాదం సర్దితే చాలదు రెండో పాదం చివర్లోనే దానికి సరైన prefix వెయ్యాలి. దానికి పూర్తిగా ఆలస్యం జరిగిపోయింది రెండో పాదం వెనక్కి తీసుకోటానికి లేదుగదా! ఏమైనా గొప్ప ఆత్మవిశ్వాసమూ, ఎవరూ నిలదియ్యర్లే అనే నమ్మకమూ ఉన్నవాడూ గనక ఆ రోమా ని మూడు, నాలుగు పాదాల మధ్యలో ఇరికించేశాడు. కాకపోతే దీనివల్ల నాలుగోపాదం మొదట్లో కోమా వెయ్యటానికి వీల్లేకుండా పోయింది. పైగా ఈ పాదానికి వచ్చేసరికి అవధానం కూడా అయిపోవచ్చి ఉండాలి. కోమా బదులుగా గోమ పెట్టి లాగేశాడు. ఇదీ ఈ పద్యం కథ.
ఇంక మేడసాని మోహన్‌పద్యం కూడ ఒకటి చూద్దాం.
తార్చి, కూర్చి, మిర్చి, ఆర్చి ద్రౌపదీ వస్త్రాపహరణం గురించి.
ఇవన్నీ కూడా పాదాల మొదల్లో ఉంచటానికి సరిపడే పదాలే గాని, పద్యాన్ని తార్చి తో మొదలెట్టటం బాగుండదనుకుని వాటిని లోపలికి నెట్టేశాడు. ఇదీ పద్యం.
అకటా దుష్ట గణాలు తార్చినవి మాయద్యూత సంక్రీడకై
వికటింపన్‌అని జాలి కూర్చి హరి సుస్విన్నాత్ముడై ప్రీణితో
త్సుకుడై సార గమిర్చిరోద్భవ పటు స్ఫూర్తిన్‌లసద్వస్త్రముల్
ప్రకటింపన్‌మది తాప మార్చి కడు ఇంపై కృష్ణ హర్షింపగన్
ఈ పద్యం కూడా ఒక్కో పాదం ఒకో సారి తయారయ్యిందేనని చెప్పక్కర్లేదు అతుకులు స్పష్టంగానే కన్పిస్తాయి. తార్చి ని విరచకుండా అలా వదిలేద్దామని నిర్ణయించుకోవటంతో తొలి పాదంలో ఏం విషయం ఉండాలో తేలిపోయింది. రెండో పాదమూ అలాగే వచ్చింది. ఇక మూడో పాదానికొచ్చేసరికి మిర్చి దాపురించింది. ఓ అర్థంలేని సమాసంలోకి నెట్టేశాడు దాన్ని. నాలుగో పాదం ఏదో పద్యం పూర్తయిందనటానికి పనికొచ్చింది. ఇలా, ఇచ్చిన పదాలు తేలికైనవి కావటం, అవధాని కూడ ఏమీ శ్రమ పడకుండా లాగించేద్దామని చూడ్డంతో ఏమీ సరుకు లేని పద్యం తయారయ్యింది (నేనేదో మేడసానిని ప్రత్యేకంగా విమర్శిస్తున్నాననుకోవద్దు పైన ఇచ్చిన నాగఫణిశర్మ పద్యాల్లోనూ “లలనా నేను జపానురక్తుడ” అనే ప్రయోగం తప్ప మిగిలిందంతా చెత్తే నా దృష్టిలో!).
ఇప్పుడు కొన్ని ఉదాహరణలు పాత అవధానుల పూరణల నుంచి ఇస్తాను. వేలూరి శివరామశాస్త్రి గుంటూరు శతావధానము (1911) నుంచి రెండు దత్త పదులు.
యతి చెడె, గతి చెడె, మతి చెడె, స్మృతి చెడె చంపకమాల
యతి చెడె పిల్ల కాలువను క్రోతి తరించె నటంచు పల్కగా
గతి చెడె సభ్యులందరు వికావిక నవ్వులనున్‌పొనర్పగా
మతి చెడె నేటి దుష్కవుల మాయ కవిత్వముచే జనాళికిన్
స్మృతి చెడె నట్టి వారలను చేరిక బేరగదీయు వారికిన్
ఇప్పట్లాటి పిచ్చిపిచ్చి దత్తపదులు, విషయాలు (కనీసం శతావధానాల్లో) అప్పుడు ఇచ్చే వారు కారేమో! కఠినమైన దత్త పదాలే లేవు! కనక పద్యంలో ఒడుదుడుకులు ఉన్నాయో లేదో చూసే అవకాశం లేదు. అప్పుడున్న కవితా వివాదాల దృష్య్టా పతికక్ష కవుల్ని ఓ పోటు పొడిచే అవకాశం వస్తే వదల్లేదు కుర్రతనపు దూకుడు మీద ఉన్న అవధాని! ఈ పద్యం మొత్తం ఒకసారి చేసిందా లేక ఏ పాదానికాపాదమా అనేది చెప్పటం కష్టం ఏ పాదానికాపాదం స్వతంత్రంగా ఉంది గనక. కాని flow చూస్తే ఒక సారే చేసిందనిపిస్తుంది. ఆ శతావధానంలో మిగిలిన పద్యాలు చూస్తే చాలా వాటిలో మొత్తం ఒకసారే తయారైన గుణాలు కనిపిస్తాయి గనక నా ఉద్దేశ్యం ఆయన పద్యం మొత్తం ఒకసారే కట్టేవాడని. (అన్నట్లు తొలిపాదంలో ఓ మంచి చమత్కారం ఉంది గమనించండి!)
ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాం, ఆ అవధానంలోదే. సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి, సౌవర్చ్యకరణి, వీటితో పద్యం.
చెలగు పాంధులకెల్ల సంజీవకరణి
సరసి చెందొవలకును విశల్యకరణి
తగు చకోరంబులకును సంధానకరణి
కడు ప్రకాశించె సౌవర్చ్యకరణి తరణి.
ఎంత చక్కటి పద్యం! ఇది ఆశువుగా, అందులోనూ ఓ శతావధానంలో భాగంగా చెప్పాడంటే నిజంగా ఆశ్చర్యమే! రామాయణంలోని మూలికల పేర్లు తీసుకుని వాటిని సూర్యుడికి అన్వయించటం అనే భావంతో పట్టుబట్టి రాసిన పద్యంలా మలచటం జరిగింది. అనుమానం లేకుండా ఈ పద్యం మొత్తం ఒక సారి తయారయ్యిందే! మామూలు వాళ్ళ చేతిలో ఈ దత్తపదాలు ఎన్ని తిప్పలు పడాల్సొచ్చేదో (లేకపోతే గొడవ లేకుండా రామాయణంలో original context లోనే పద్యం చెప్పేసే వాళ్ళేమో.)
సి.వి. సుబ్బన్న పద్యం కూడ ఒకటి చూసి దత్తపదుల్ని ముగిద్దాం.
గవాస్కర్, కిర్మాని, పటౌడి, కపిలదేవ్ రాయలసీమ క్షామ పరిస్థితి గురించి (80 లో అనంతపురంలో జరిగిన అష్టావధానం నుంచి).
పశుసంతానము ప్రాగవస్కర తను ప్రత్యగ్రతన్‌బాసి క్రుం
గి, శనైరీతి కృశించి కూలె నిల, జంకిర్మానినుల్‌క్షామమై
అశనాయన్‌తినజొచ్చి రెల్లెడల తృణ్యాలంపటౌడింబ మె
ప్డు శుభశ్రీ విలసిల్లునో కపిల, దేవుల్‌చూడ రాట్సీమలో
ప్రాక్ అవస్కర తనుప్రత్యగ్రత అంటే పురోభాగ పృష్టభాగ తను సౌష్ఠవము; తృణ్యా, లంపట, ఔ, డింబము అంటే గోవుల కడుపు. ఇవి అవధాని ఇచ్చిన అర్థాలు. ఇది నిజంగా చాలా కష్టమైన పూరణ. పైగా పద్యం మొత్తం ఒకసారే తయారయ్యింది లేకుంటే ఇచ్చిన పదాల్తో ఇంత integrity ఉన్న పద్యం తయారు కావటం మహాకష్టం. పైగా సంస్కృత పద భూయిష్టమైన పద్యం చెప్పాలంటే ఏ పాదానికాపాదంగా విడబియ్యటం కష్టం గనక అలాటి పద్యాలు చెప్పేవాళ్ళు సాధారణంగా పద్యం మొత్తం ఒక సారే తయారుచేస్తారు.
(contrast కోసం San Antonioలో నాగఫణి శర్మ చెప్పిన ఒక పద్యం చూడండి నాగలి, మొరకు, గిలక, వల్లకాడు;
వీటితో అమెరికాలో తెలుగు భాష భవిష్యత్తు గురించి పద్యం అడిగారు; పద్యం ఇది
చేతబట్టిన నాగలి చెలువు మీర
మొరకు నుడికారమున్‌జున్పి చెరకు పిండి
గిలక వలె నాల్క తిరిగిన పలువరసల
వెలుగు పస వల్ల కాడోయి వెలితి వల్ల
దీనికీ అడిగిన విషయానికీ సంబంధం లేకపోగా అసలు ఏమైనా అర్థం అనేది ఉందా అని ప్రాజ్ఞులు దీర్ఘంగా ఆలోచించుకోవచ్చు; ఐతే ఇక్కడ ఉద్దేశ్యం అవధాన్ని విమర్శించటం కాదు పద్యం తయారైన technique చూడటం. ఈ పద్యాన్నుంచి నేర్చుకోవలసింది ఏ పాదానికా పాదం చేస్తే ఎలాటి దౌర్భాగ్యపు పద్యాలు పుడతాయనేది!)
(వచ్చే సంచికలో సమస్యా పూరణల విశ్లేషణ)