భేదోపాయం

చీకటి పడుతోంది.
ఊరి బయట కాలవ గట్టు.
కోదండరామయ్య గారు వాచ్‌ కేసి మరోమారు చూసుకున్నారు విసుగ్గా.
భగ్గుమంటున్న వారి హృదయం ఎదురుగా ఆకాశంలో ప్రతిఫలిస్తోంది.
ఎలాగో నిముషాల్ని గంటలుగా గడిపి మామూలు సమయానికి అందరితో పాటు ఆయనా లేచేరు.
అందరూ లేచి ఇళ్ళకి బయల్దేరేరు.
పైకి నవ్వుతూ మాట్లాడుతున్నారే గాని వారి మనసులో లావా సముద్రాలు సుడులు తిరుగుతున్నాయి.
ఇంటికి ఎలా వచ్చి పడ్డారో వారికే తెలీలేదు.
అవమాన జ్వాలలు ఒళ్ళంతా కాల్చేస్తుంటే తమ ఏ.సి. ఆఫీసు రూమ్‌ లోకి వెళ్ళి ఆశీనులయేరు.

ఐతే
జీవితంలో ఎంతో కాలాన్ని గడ్డు సమస్యల పరిష్కారంలో గడిపి అందులో ఆరితేరిన వారు గనక కొంచెం స్థిమితంగా ఆలోచించటం మొదలెట్టేరు.
క్రమక్రమంగా ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకున్నారు.
వచ్చిపడ్డ సమస్య మీద తమ మేధస్సుని కేంద్రీకరించేరు.

ఇప్పుడు తాము పరిష్కరించాల్సిన సమస్య స్వరూప స్వభావాలు ఏమిటంటే
పదేళ్ళ క్రితం తాము డిస్ట్రిక్ట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు తమ దగ్గర యుడిసిగా పనిచేసేవాడు వెంకట్రావు. తను రెండేళ్ళ క్రితం రిటైరైతే, అతను ఏడాదినాడు రిటైరయ్యాడు. అనుకోకుండా యిద్దరూ క్రితం వేసవిలో అమెరికాలో కలుసుకున్నారు, కొడుకుల్ని చూడటానికి వెళ్ళి.

కోదండరామయ్య గారి అబ్బాయి సురేష్‌, వెంకట్రావు గారి అబ్బాయి శేఖర్‌, యిద్దరూ ఒక వూళ్ళోనే వుంటున్నారు అమెరికాలో. శేఖర్‌ రెండేళ్ళ క్రితం ఓ ఇంటర్నెట్‌ కంపెనీలో పనిచేసి ఆ కంపెనీని మరో కంపెనీ నాలుగు బిలియన్లకి కొంటే ఆ దెబ్బలో తనూ ఓ నాలుగు మిలియన్లు సంపాయించుకున్నాడు. సురేష్‌, అతని భార్య పద్మ కూడా యిద్దరూ ఉద్యోగాలు చేస్తూ బాగానే సంపాయించేరు కాని, శేఖర్‌ వాళ్ళు మిలియన్‌ డాలర్ల యింట్లో వుంటూ టాప్‌ ఆఫ్‌ ది లైన్‌ మెర్సెడీస్‌ కార్లలో తిరుగుతుంటే సురేష్‌ వాళ్ళు మూడు లక్షల యింట్లో వుంటూ హోండా ఎకార్డుల్లో తిరుగుతున్నారు.

అలా అనుకోకుండా అమెరికాలో కలిసిన కోదండరామయ్యా, వెంకట్రావు గార్లు ఇండియాకి తిరిగొచ్చాక కూడా అప్పుడప్పుడు కలుసుకుని పిచ్చాపాటీ మాట్లాడుకోవటం మొదలెట్టేరు.

కోదండరామయ్య గారికి ఆరోగ్యం మీద అమిత శ్రద్ధ. భోజనం, వ్యాయామం విషయాల్లో చాలా జాగ్రత్త. అంచేత, రిటైరైన దగ్గర్నుంచీ రోజూ సాయంత్రం రెండు మైళ్ళు నడవటం అలవాటు చేసుకున్నారు. అలా నడుస్తూండగా యింకొంతమంది యిలాటివాళ్ళే తారసపడటం, అందరూ కలిసి వూరికి దూరంగా వున్న కాలవ దాకా వెళ్ళి అక్కడ గట్టు మీద కొంచెంసేపు కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకోవటం ఆనవాయితీ అయ్యేయి.

ఓ రోజు వెంకట్రావు తమని చూడటానికి వచ్చే సమయానికి కోదండరామయ్య గారు నడవటానికి బయల్దేరుతున్నారు. తమతో పాటు రాకూడదా అని వెంకట్రావునీ ఆహ్వానించేరు. అప్పట్నుంచి రోజూ వెంకట్రావు గారు కూడా ఆయన్తో పాటే నడవటం సాగించేరు.

ఐతే యీ పద్ధతి వల్ల కోదండరామయ్య గారికి ఎదురుచూడని తలనొప్పి ఒకటి తయారయ్యింది. ఎందుకంటే

వాళ్ళతో పాటు సాయంత్రం నడిచే బృందంలో దాదాపు అందరికీ కొడుకులో కూతుళ్ళో అమెరికాలో వుండటం వల్ల, వాళ్ళ సంభాషణలు తరుచుగా అమెరికా చుట్టూ తిరగసాగేయి. వాటిలో ఎక్కువ సమయం తమ తమ అమెరికా ప్రయాణాలూ, అక్కడ తాము కన్న, విన్న, (టీవీలో) చూసిన విశేషాల గురించిన విషయాల్తో గడుస్తోంది. ఐతే, అలా మొదలైన ఆ సంభాషణలు సహజంగానే తమ కొడుకుల, కూతుళ్ళ, అల్లుళ్ళ సంపాదనలు, వాళ్ళ యిళ్ళూ, కార్లూ, ఖర్చులూ యిలాటి ఆసక్తికరమైన విషయాల మీదికి మళ్ళటానికి ఎక్కువ కాలం పట్టలేదు.

ఆ రకం సంభాషణల్లోంచి తమ బృందంలోని అందరి సంతానాల్లోనూ వెంకట్రావు సంతానం ఆర్థికంగా వున్నత స్థాయిలో వుందని తేలిపోవటానికీ, దానికి అందరూ అంగీకరించటానికీ కూడ ఆట్టే పట్టలేదు.

దాంతో, సంకల్పితంగానో అసంకల్పితంగానో ఆబృందంలో వెంకట్రావుకి ఒక ప్రత్యేక గౌరవం కలుగుతున్నట్టు కోదండరామయ్య గారికి అనిపించటమూ మొదలయ్యింది.

అప్పటివరకు, వున్నత పదవుల్లో వుండి రిటైరైన తమకు సంక్రమించిన గౌరవస్థానాన్ని, తమకంటే ఎంతో తక్కువ పదవుల్లో వుండి రిటైరైన వెంకట్రావు ఆక్రమించేస్తున్నట్టు ఆయనకు చూచాయగా నమ్మకం కూడ కుదిరిపోయింది.

ఈ పరిస్థితులు యిలా వుండగా

పులి మీద పుట్ర లాగా సురేష్‌కీ, వాళ్ళావిడ పద్మకీ ఒకేసారి ఉద్యోగాలు వూడేయి, అమెరికాలో ఆర్థికమాంద్యం పుణ్యమా అని.

ఐతే ఆ అగ్నికి ఆజ్యం యెలా కలిసిందంటే ఈ విషయం కోదండరామయ్య గారి చెవికి చేరింది వెంకట్రావు గారి ద్వారా! అందులోనూ తమ బృందం అందరూ కాలవగట్టు మీద కూర్చుని మాట్టాడుకుంటున్నప్పుడు!

కోదండరామయ్య గారికి జీవితంలో యెప్పుడూ రానంత వుద్రేకం వచ్చింది అలా అది విన్నప్పుడు.

వెంకట్రావు ఆ విషయం తమతో విడిగా అని వుండొచ్చును.
అసలు ఆ విషయంతో అతనికి ఎలాటి సంబంధమూ లేదు గనక బుద్ధిగా నోరు మూసుకుని వూరుకుంటే యింకా బాగుండును.
సురేష్‌ తనే స్వయంగా తమకి చెప్పేవాడో లేకపోతే యిలాటి విషయాలు చెప్పటం యెందుకులే అని తనలోనే దాచుకునే వాడో!

వెంకట్రావు ఆ విషయం అందర్లోనూ చెప్పటమే కాదు, ఆ చెప్పటం కూడా వెక్కిరింత ధోరణిలో, తమకి అవమానం కలిగించే విధంగా చెప్పాడని కోదండరామయ్య గారికి గట్టి అభిప్రాయం కలిగింది.
పైగా, అతను కావాలనే అలా చేశాడని కూడా ఆయనకి అర్థమై పోయింది.
వెంకట్రావు కొడుకు బోలెడు సంపాయించి అన్ని రకాల భోగభాగ్యాలూ అనుభవిస్తూ వుంటే తమ కొడుకూ కోడలూ ఉద్యోగాలు ఊడిపోయి ఊసురోమంటూ తిరుగుతున్నారని చెప్పి అలా తను (వెంకట్రావు) తమ (కోదండరామయ్య) కన్నా ఎంతో ఎత్తున వున్నానని చూపించుకునే యీధోరణిని ఎలాగైనా సరే అరికట్టటం తక్షణ కర్తవ్యంగా వారికి స్పష్టమయింది.

ఇదీ ఇప్పుడు ఆయనకి ఎదురైన సమస్య!

ఇలా తమంతటి వాణ్ణి పట్టుకుని అందరి ముందూ తలెత్తుకోకుండా చేసిన వెంకట్రావు కళ్ళు ఆకాశం నుంచి భూమ్మీదికి దించటం ఎలా?

ఎంతో సేపు అలా ఆలోచిస్తూనే వుండిపోయేరు కోదండరామయ్య గారు.
ఎన్నెన్నో మార్గాలు స్ఫురించేయి కానీ యేదీ తృప్తికరంగా కనిపించలేదు.
ఈలోగా ఆయన భార్య సరస్వతమ్మ గారు ఎన్నో సార్లు వచ్చి తొంగి చూసి, ఆయన చాలా దీర్ఘాలోచనలో వుండటం గమనించి వెనుదిరిగి వెళ్ళిపోయేరు.

కొంతసేపయాక కోదండరామయ్య గారు కూడా లేచి వెళ్ళి మౌనంగా మంచం మీద పడుకుని మళ్ళీ ఎంతోసేపు ఆలోచనల్లో మునిగిపోయేరు. అలా వుండగానే కునుకుపట్టటం, యెప్పుడో హఠాత్తుగా మెలకువ రావటం జరిగేయి. బహుశా నిద్రలో కూడా అదే విషయాన్ని గురించి ఆలోచించటం వల్ల కాబోలు, నిద్రలోనే ఒక పథకం రూపుదిద్దుకో సాగింది. మెలకువ రావటం తోనే ఆయన కళ్ళ ముందు మెదిలిందా ఆలోచన. వెంటనే దాన్ని అన్ని కోణాల్నుంచి జాగ్రత్తగా పరిశీలించి తృప్తి చెందేక గాని హాయిగా నిద్రకి ఉపక్రమించ లేక పోయేరు వారు.

మర్నాడు యథాప్రకారంగా సాయంత్రం షికారు కెళ్ళినప్పుడు తమ బృందం సభ్యులందరూ వచ్చేక తమ పథకంలోని తొలి పావుని కదిపేరు కోదండరామయ్య గారు. కొడుకులు అమెరికాలో వుంటున్న వాళ్ళని వుద్దేశించి మాట్టాడుతూ, అమెరికాలో వుంటున్న కుటుంబాల్లో యెలా ఆడవాళ్ళకి ప్రాధాన్యత యెక్కువో అక్కడ వుండగా తాము గమనించిన కొన్ని సంగతులు వివరించేరు. మగపిల్లల తల్లిదండ్రుల కన్నా ఆడపిల్లల తల్లిదండ్రులే పదేపదే అమెరికాకి వెళ్ళే అవకాశాలు యెందువల్ల యెక్కువో విశ్లేషించేరు.
దాంతో, ఉత్సాహం తెచ్చుకున్న మిగిలిన వాళ్ళు కూడ తమ అనుభవాల్ని వినిపిస్తూ ఓ చెయ్యి సాయం వేసేరు, వాళ్ళకి తెలీకుండానే.
పనిలో పనిగా కొడుకుల మీద కోడళ్ళ పెత్తనాల మూలంగా వియ్యంకులకి కొమ్ములు బారుగా పెరుగుతున్న వైనాన్ని కూడా ఉద్ఘాటించేరు.

అలా రంగం సిద్ధమయాక కోదండరామయ్య గారు అప్పటిదాకా భద్రంగా దాచిపెట్టిన ఒక అస్త్రాన్ని బయటికి తీసి వెంకట్రావు మీదికి గురిపెట్టి సంధించేరు
“మనందర్లోనూ వెంకట్రావు గారు అదృష్టవంతులండీ! వాళ్ళ వియ్యంకులు ఎంతో ఆస్తిపరులైనా ఆయన్ని యిప్పటికీ ఎంతో గౌరవంగా చూస్తారు” అన్నారు ఎంతో నిజాయితీని ధ్వనింపజేస్తూ. (ఐతే వెంకట్రావు గారికీ వాళ్ళ వియ్యంకులకీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని, దాన్ని ఆసరాగా చేసుకునే తమ పథకాన్ని ఆయన రూపొందించారనీ మనకి తెలుసు గాని వెంకట్రావు గారికి తెలీదు కదా! అంచేత )

కళ్ళు మిరుమిట్లు గొలిపే అగ్నిలోకి కళ్ళు మూసుకుని దూసుకు వెళ్ళే శలభంలా ముందూ వెనకా చూచుకోకుండా దూకేశారు వెంకట్రావు గారు.
“అయ్యయ్యో, మా వియ్యంకుల సంగతి మీకు తెలీదండి సార్‌! అంత త్రాష్టులు ఈ భూప్రపంచంలో మరొకరుండరు. ఏదో పెద్ద ఆస్తి వున్నట్టు అంతా నాటకం. లోపలంతా డొల్లే. అప్పుడెప్పుడో వున్న ఆస్తంతా అతగాడి తిరుగుళ్ళతో మట్టిగొట్టుకు పోయింది. ఆ మహానుభావుడికి లేని మంచిగుణాలు లేవు. ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్న ఆర్భాటం వెనక వుందంతా నా కొడుకు కష్టార్జితం. అక్కడ వాడు రాత్రుళ్ళూ పగళ్ళూ కష్టపడి సంపాయించిందాన్ని నా కోడలు మహాతల్లి తెచ్చిపోస్తుంటే యిక్కడ వీళ్ళు కులుకుతున్నారు గాని యిది సొంతం కాదు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. నా కొడుకు వట్టి చవట. వాడి పెళ్ళాం వాడి చెవులు పట్టుకుని ఆడిస్తుంది. అదంతా చూసి వొళ్ళు మండేగా ఆర్నెల్లు వుందామని వెళ్ళినవాణ్ణి రెణ్ణెల్ల లోనే తిరిగొచ్చేశాను!..” ఆవేశంగా ఎన్నాళ్ళుగానో కడుపులో దాచుకున్న తన అక్కసునంతా వెళ్ళగక్కేరు వెంకట్రావు గారు.

ఆ మాటలకి సానుభూతితో కదులుతున్న అక్కడి తలల్ని చూసేసరికి యింకా రెచ్చిపోయి తన వియ్యంకుల్ని ఎడాపెడా కడిగి పారేసి కసి తీర్చుకున్నాక గాని పూర్తిగా శాంతించలేక పోయారు వెంకట్రావు గారు.
“ఊరుకోండి వెంకట్రావు గారూ! మీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇది మనందరికీ వున్న బాధే కదా! ఐనా మీ వియ్యంకుల్ని యిలా అందరి ముందూ మరీ అంతగా తిట్టకండి. పొరపాటున ఈ విషయం గనక వాళ్ళ చెవుల్లో పడితే మీ సంబంధాలు యింకా దెబ్బతింటయ్‌!” అన్నారు కోదండరామయ్య గారు, ఆయన్ని యింకా రెచ్చగొడుతూ.
“దెబ్బ తిన్నివ్వండి, యింత కన్నా యింకా ఏం దెబ్బతింటయ్‌? ఇప్పటికి మేం ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుని రెండేళ్ళయింది. ఎప్పుడన్నా శుభకార్యాలకి పిలవటం మానేసి కూడా ఎంతో కాలమైంది. ఇంకా ఎందుకండీ వాళ్ళ గురించి వెనక్కి తగ్గటం?” అంటూ మళ్ళీ విరుచుకు పడిపోయారు.

అలా కోదండరామయ్య గారి పథకంలో తొలిఘట్టం విజయవంతంగా ముగిసింది. ఇక యీ సమాచారాన్నంతా, కొంత సొంత కవిత్వంతో సహా, వెంకట్రావు గారి వియ్యంకుడు వీరశంకరం గారికి తరలించటం పెద్ద కష్టం కాలేదు కోదండరామయ్య గారికి. ఐతే ముందు జాగ్రత్తగా తమ చేతికి మట్టి అంటకుండా నమ్మకమైన మరొకరి ద్వారా వీరశంకరం గారి తమ్ముడు ఉమాశంకరరావు గారికి చేర్పించారు. ఆయన వూహించినట్టే అక్కడినుంచి యింకా చిలవలు పలవలు చేర్చుకుని అవి అప్పటికప్పుడే వీరశంకరం గారికి చేరేయి. వారు వీరావేశంతో ఆ విషయం తన భార్య సుందరమ్మ గారికి చెప్పటంలో ఆ మాటలకి ఇంకాస్త పదును, మరికొంచెం వెటకారం, కొత్తగా కలిపిన వ్యంగ్యం కూడా చేరేయి.

దాంతో ఆ రాత్రికి వాళ్ళమ్మాయి శిరీష అమెరికా నుంచి ఫోన్‌ చేసే సమయానికి సుందరమ్మ గారు రూపం ధరించిన కోపంలా వున్నారు. మామూలుగానే మనసులో మాట దాచుకునే అలవాటు లేని సుందరమ్మ గారు ఆరోజు తమకున్న భాషా పరిజ్ఞానం అంతటినీ వుపయోగించి తమ మనసుని కూతురి ముందు పరిచేరు.

అలా, ముచ్చటగా మూడు రోజుల్లో వెంకట్రావు గారు తమ వియ్యంకుల్ని విమర్శిస్తూ అన్న మాటలు కొత్త కొత్త వేషాలు వేసుకుని వింత వింత రంగులు పూసుకుని వారి కోడలు గారిని చేరేయి.
ఇండియాలో ఒక కాలవగట్టున పడ్డ నిప్పురవ్వ అమెరికాలో శేఖర్‌ వాళ్ళింట్లో దావానలంగా ఎదిగింది.

ఆ రోజు సాయంత్రం శేఖర్‌ యింటికి వచ్చేటప్పటికి శిరీష కాళికావతారంలో వుంది. శేఖర్‌ తండ్రి తన తల్లిదండ్రుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడటానికి వాళ్ళు చేసిన అంతపెద్ద నేరం ఏమిటో చెప్పితీరాల్సిందే అని పట్టుపట్టింది.
ఎంతో గొప్ప కుటుంబంలో పుట్టిన తనని వెంకట్రావు లాంటి లేకివాళ్ళ కుటుంబంలోకి యివ్వటమే వాళ్ళు చేసిన మొట్టమొదటి పెద్ద నేరమని తనే సమాధానం కూడ చెప్పింది.
తమ పెళ్ళయిన యీ పదేళ్ళలోనూ వెంకట్రావు తనని, అంటే వాళ్ళ యింటి కోడల్ని, ఎంత అమర్యాదగా, అగౌరవంగా చూశాడో పది ఉదాహరణలు వల్లించి మరీ వివరించింది.
ఇప్పుడిలా ఏ కారణమూ లేకుండా తన తల్లిదండ్రుల్ని పురుగులు కింద తీసిపారేస్తూ పదిమంది పెద్దమనుషుల మధ్య తిట్టిన వాడితో యింకా తనకి బంధుత్వం ఎందుకు వుండాలని నిగ్గదీసింది.
అలాటి వాడి యింటిగడప తను మళ్ళీ తొక్కేది లేదని శపథం చేసింది.
అతను యింక తన గడప తొక్కితే సహించేది లేదని కూడా స్పష్టం చేసింది.
ఇక చివరగా, తన కొడుకు (అంటే శేఖర్‌) యిక్కడి నుంచి నెలనెలా బోలెడంత డబ్బు పంపుతుంటే తేరగా తింటున్నది అరక్క యిలాటి విపరీత ప్రవర్తనకి దారితీస్తోంది గనక యిక నుంచి అతనికి నయాపైసా పంపినా తను విడాకులిచ్చేది ఖచ్చితమని ఖరాఖండిగా చెప్పేసింది.
చెప్ప వలసిందంతా చెప్పేసి భోరున ఏడుస్తూ పడగ్గదిలోకి పరిగెత్తి తలుపేసుకుంది.

అప్పటిదాకా అవాక్కై విన్న శేఖర్‌కి అంతా అయోమయంగా వుంది. అర్థమయీ కానట్టుగా వుంది. గజిబిజిగా వుంది. ఏం చెయ్యాలో తోచకుండా వుంది.
ముందుగా, బిక్కుబిక్కుమంటూ చూస్తున్న మూడేళ్ళ కొడుకు వినయ్‌ని బుజ్జగించి ఓ కార్టూన్‌ డీవీడి పెట్టి టీవీ యెదురుగా కూర్చోబెట్టేడు.
తరవాత వెళ్ళి శిరీషని సమాధానపరచటానికి ప్రయత్నించేడు.
ఎక్కిళ్ళ మధ్య ఆమె చెప్పిందంతా విన్నాడు.

వెంటనే యింటికి ఫోన్‌ చేసేడు. తండ్రితో మాట్లాడేడు. నిదానంగా విషయం అంతా రాబట్టేడు. శిరీష చెప్పింది నిజమేనని నిర్ధారణకి వచ్చేడు.
ఆమెకి వచ్చినంత కాకపోయినా అతనికీ బాగానే కోపం వచ్చింది.
శిరీషని పెళ్ళి చేసుకోవటం వల్ల ఆమె కుటుంబం ద్వారా తనకి అందిన స్థాయి వల్లనే తను యింతదూరం రాగలిగేనని అతని నమ్మకం. ఆ విషయం తన తండ్రికి ఎందుకు అర్థం కాదో అతనికి అర్థం కాలేదు. తలుచుకునే కొద్ది తన తండ్రి ఎంత గర్విష్టిగా మారేడో, ఎంత ఫూలిష్‌గా ప్రవర్తిస్తున్నాడో అతనికి తెలిసొచ్చింది. శిరీష చెప్పినట్టు అతని ఈ ప్రవర్తనకి ముఖ్య కారణం తన దగ్గర్నుంచి తేలిగ్గా క్రమం తప్పకుండా అందుతున్న డబ్బేనని కూడ అర్థం చేసుకున్నాడు.

అలా జ్ఞానోదయం కలిగాక మళ్ళీ తండ్రికి ఫోన్‌ చేసేడు.
జీవితంలో తొలిసారిగా ఆయనకి ఘాటైన చీవాట్లు పెట్టేడు. తన కుటుంబం ఎంత ఉన్నత స్థితికి వచ్చినా తన వెనకటి గుణాన్ని మాత్రం మానుకోలేకపోతున్నాడనీ, ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో యింత వయసొచ్చినా నేర్చుకోలేక పోయాడనీ ఫోన్లోనే గనక ముందుగా అనుకున్న కంటే యింకాస్త గట్టిగానే మందలించేడు. తన యీ ప్రవర్తనని మార్చుకోకుండా యిలాగే తన (శేఖర్‌) పరువు పోగొడుతుంటే తమ మధ్య సంబంధాలు దెబ్బతింటాయని కూడా హెచ్చరించేడు. కోపంగా ఫోన్‌ పెట్టేసేడు.

అదంతా చూసి, విన్న తర్వాత గాని శిరీషకి కొంత ఊరట కలగలేదు.
“ఇకనుంచి మీ నాన్నకి నెలకో వందడాలర్లకి మించి పంపితే మాత్రం నేనూరుకునేది లేదు. అలాగే, మళ్ళీ ఇక్కడికి విజిట్‌కి రమ్మని పిలవకండి” అంటూ తీవ్రంగా ఆర్డర్‌ వేసింది శేఖర్‌కి.
“ఔను. అలా చేస్తేనే గాని ఆయన కాస్త నేల మీద నడవడు” అని ఒప్పేసుకున్నాడతను.

ఇదంతా జరిగి తమకు నెలనెలా వచ్చే ఐదు వందల డాలర్లు కాస్తా వందకి దిగజారిపోయాక కాని తన పరిస్థితి తెలిసిరాలేదు వెంకట్రావు గారికి.
అప్పట్నుంచి ఆయన బుద్ధి తెచ్చుకుని తన హద్దుల్లో మెలగసాగేడు.
కాలవగట్టుకి నడకకి వెళ్ళటం మానేసి కిళ్ళీకొట్టు దగ్గర కబుర్లు చెప్పటం మొదలెట్టేడు.

అలా, కోదండరామయ్య గారి పథకం దివ్యంగా ఫలించింది.
కాని వెంకట్రావు పతనం వెనక వున్నది తమ హస్తమేనని చెప్పుకోవటానికి మాత్రం వారు కొన్నాళ్ళు తటపటాయించేరు.
ఎందుకంటే, “ఆఫ్టరాల్‌ ఒక యూడీసీ” ని కిందికి లాగటానికి తమంత వారు పూనుకోవాల్సి రావటం వారి కీర్తికి వన్నె తెస్తుందో లేక మచ్చ ఔతుందో వారు తేల్చుకోలేకపోయేరు.