నిరసన (గల్పిక)

విశ్వవిద్యాలయ ప్రాంగణం కోలాహలంగా ఉంది. ప్రాంగణానికి నడిబొడ్డులా ఉన్నdiag మైదానంలో విద్యార్థులు గుంపులుగా కూడి ఉన్నారు. అక్కడ నిరసన వ్రతం జరుగుతోంది. ఈ మధ్యనే ఒక చమురు కంపెనీ వారి ఓడ ఒకటి అలాస్కాతీరానికి దగ్గర్లో sea sicknessకి తల్లడిల్లి పొట్టలో ఉన్న చమురునంతా వెలపరించుకుంది. ఆ కక్కుకున్న చమురు నీటిపైనా, తీరపు ఇసుకపైనా పరుచుకుని జంతు, పక్షి, వృక్ష జాలాలకి ఉరితాడై బిగుసుకుంది. ఈ జాలాల మీద బతికే జాలర్లకి నోట మట్టి..కాదు కాదు..చమురు కొట్టింది. అందుకూ ఈ నిరసన.

మైకు ముందు ఆవేశంతో ఊగిపోతూ గొంతు చించుకుంటున్నాడు వక్త. వింటున్నమూడో సంవత్సరం విద్యార్థి Robert Windsor Jr. మనసులో ఆలోచనల కందిరీగలు. జాలర్ల పైన జాలి..ప్రకృతికోసం ఆవేదన..భయంకరమైన నేరం చెయ్యటమే కాక, చేసిన నేరానికి బాధ్యత తీసుకోని చమురు కంపెనీ మీద పట్టరాని ఆగ్రహం..అన్నీ కలిసి అతని మనసు రగిలి పోతోంది. చమురు కంపెనీని తుదముట్టించాలనే వినాశ నినాదాలు గొంతులోంచి ఆశుకవిత్వంలా పుట్టుకొస్తున్నాయి.

మాటలు చేతల్లోకి దిగాయి. చమురు కంపెనీ వారి స్థానిక gas station(“బంకు”??) ముందు జరగబోయిన శాంతియుత ప్రదర్శన కాస్తా దొమ్మీగా పరిణమించింది. Mr. Windsor Jr. ఆ రాత్రి ఊచలు లెక్కపెట్టుకున్నాడు.

కొన్నాళ్ళకి చమురు కంపెనీ వారు ప్రజా ప్రభుత్వంతో రాజీ పడ్డారు. కొన్నిమిలియన్లతో జిడ్డు ఒదుల్చుకున్నారు, చేతులు కడిగేసుకున్నారు. గొడవల మూలంగా అట్టడుగంటిన కంపెనీ షేరు ధర రాజీ వార్త బయటికి రాగానే ఆకాశాన్నంటింది. ఆ దెబ్బతో ఓ లక్ష దాకా లాభం తీసిన Mr. Windsor Sr.బహుమతిగా ఓ ఇరవై వేలు కొడుక్కి చెక్కు పంపించారు.

నిరసన ఫలించింది!

Afterword: Inspired by political activist and consumer advocate, Ralph
Nader’s comment last night: “This is a government of the General Motors,
for the Exxons, by the DuPonts”.


ఎస్‌. నారాయణస్వామి

రచయిత ఎస్‌. నారాయణస్వామి గురించి: కథకుడిగా, అనువాదకుడిగా, సమీక్షకుడిగా అమెరికాలోనూ, ఇండియాలోనూ, బ్లాగుల లోకంలోనూ పేరు గడించిన ఎస్‌. నారాయణ స్వామి అమెరికా ఆంధ్రుల జీవన తలాల్లో కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తున్న కథకుడిగా ఈమాట పాఠకులకు చిరపరిచితులు.  ...