పూర్వజన్మ వాసన

అతను స్టీలు కుర్చీలో నిస్త్రాణగా వాలి కూర్చు నున్నాడు. ఆమె అతని కుర్చీకి కొంచెం ఏటవాలుగా మోడా మీద ఒద్దిగ్గా కూర్చు నుంది. స్కూల్లో మిగతా స్టాఫంతా ఇళ్ళకి వెళ్ళిపోయి చాలా సేపైంది. ఆమెకి ఎకౌన్‌టెన్సీలో డౌట్లున్నా యంటే స్కూలు పన్లు పూర్తయ్యాక పాఠం చెప్పటానికి కూర్చున్నాడు. టీచర్లందర్నీ పైకి చదవమని అతను ప్రోత్సహిస్తుంటాడు. చేతనైన సహాయమూ చేస్తుంటాడు. ఆర్థికంగానే కాక తనకొచ్చిన సబ్జెక్ట్‌లకి అప్పుడప్పుడూ పాఠం చెప్పటం కూడా. ఇదేం కొత్త కాదు.

రెండో లెక్క పూర్తి కావస్తుండగా కరంటు పోయింది. ఆ గదిలో కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. అతనికి పూర్తిగా అలవాటైన గదే తన శరీరం తెలిసినంత సన్నిహితంగా తెలుసతనికి ఆ గది. ఎక్కడ ఏముందో, ఏ సొరలో ఏం దాగుందో. అతను లేచి తడుముకోకుండానే అలమారు దగ్గరికి పోయి రెండో అరలో వున్న మొద్దుపాటి కొవ్వొత్తిని అందుకున్నాడు. చొక్కా జేబులోంచి సిగరెట్‌లైటర్‌తీశాడు. జుప్పనే నిట్టూర్పుతో వెలిగిందది, బొటనవేలి విరుపుతో. మంట నించి మంట “ఫ్రమ్‌ ద లైటర్‌ టు ద కేండిల్‌” మొద్దుపాటి కొవ్వొత్తి నుంచి సన్నపాటి వెలుగు. లైటర్‌ని జేబులో వేసుకుంటుంటే గోల్డ్‌ఫ్లేక్‌ పేకెట్‌ చేతికి తగిలింది. పన్నెండేళ్ళ విదేశీ వాసానికి గుర్తుగా ఈ అలవాటొకటీ ఇంకా మిగిలి పోయింది. “పూర్వ జన్మ వాసన”లని వాళ్ళ అమ్మ అంటుండేది. ఈ అలవాటు నిజంగా పూర్వ జన్మ వాసనే! అలవాటా, లేక అలవాటుకి బానిసత్వమా?

స్వదేశానికి తిరిగొచ్చి, ఎప్పుడో తెగి పోయాయనుకున్న వేళ్ళని తిరిగి ఈ భూమిలో పాతుకోడానికి చేసిన ప్రయత్నం తనకి పునర్జన్మే! ద్విజుడయ్యే ఆ మహా యజ్ఞంలో అతను తన చాలా అలవాట్లని సమిధలుగా ఆహుతిచ్చాడు వాళ్ళ తాతయ్య కాశీకి వెళ్ళి తనకి అత్యంత ప్రియమైన వంకాయని వొదులుకున్నట్టు వొదిలేశాడు. ఆ అలవాట్లన్నీ ” పుట్టినప్పుడు లేనివి ” ఎక్కణ్ణిం చొచ్చిన అలవాట్లు? ఆకలి పుట్టించిన అలవాట్లు. అప్పుడెప్పుడో ” రెండు జన్మల కిందట కాబోలు ” ఆ చిన్న పట్నంలో అమ్మ దగ్గర పెరుగుతున్నప్పుడు ” ఆవిడ “నీకు ఆక లెక్కువరా” అంటుండేది. ఆవిడ అన్నది క్షుద్బాధ గురించి మాత్రం కాదు ” ఇంకో ఆకలి, జఠరాగ్ని లాంటిదే ” కాకపోతే నిలువెల్లా దహించేస్తుంది. ఆ అగ్నిలో కాలి కాలి, సుత్తి దెబ్బలు తిని తిని, రాటు దేలాడు. పదునెక్కాడు. ఆకలి తీర్చుకునే సామర్య్ధం నేర్చుకున్నాడు. అవసరమైన దార్లు, అడ్డమైన వైనా సరే, తొక్క గల తెగింపు అలవరుచు కున్నాడు. అలవాటు చేసుకున్నాడు .. ఆకలి తీర్చే అలవాట్లు. ఒక్కొక్కటే, ఇటుక మీద ఇటుకలా పేర్చుకుంటూ ” మెట్టు పై మెట్టుగా” పైకి సాగుతున్న తన స్థాయికీ, హోదాకీ, స్మారక సౌధంగా నిర్మించు కున్నవి. మత్తెక్కించే మలయ మారుతంలాంటి సెంట్లు, మెత్తటి పట్టులా గొంతులోకి జారి కవ్వించే వైన్‌లు, నాలికని మురిపించి మరపించి గిలిగింతలు పెట్టే అంతర్జాతీయ క్యూయిసీన్‌లు, వొంటికి పూసినట్టు అమరిపోయే వూలెన్‌సూట్లు, పాదాలతోనే పుట్టి పెరిగాయా కర్ణుడి కవచంలా అనిపించే బూట్లు బహు జాగ్రత్తగా ఎంచెంచి ఏర్చి కూర్చి ఏర్పరచుకున్న అలవాట్లు తన సొఫిస్టికేషన్‌ని లోకానికి బాకాల్లా చాటింపు వేసే ప్రచార సాధనాలు! అన్నీ మాతృభూమికి మరలి వచ్చే మహాప్రస్థానంలో, ఝంఝామారుతంలో దూది పింజల్లా ఎగిరి పోయాయి. ఇదొక్ఖటీ మిగిలి పోయింది.

అతనికి ఒక సిగరెట్‌ కాల్చుకోవా లనిపించింది. కానీ ఆ పిల్లను ఒక్కదాన్నీ అక్కడ చీకట్లో వదిలి బయటికి వెళ్ళడం ” ఊహు. పోనీ, ఇక్కడే .. తన స్కూల్లో తానే విధించి అమలు పరుస్తున్న తన ఆజ్ఞని తానే ఉల్లంఘిస్తూ .. ఇక్కడే కాల్చేస్తే ” తనని అడ్డేదెవరు? ఎంత వెలిగించగానే నాల్గు పీల్పుల్లో .. బూడిదై పోతుంది. వేళ్ళు చకచకా పేకెట్‌ తెరిచి ఒక సిగరెట్‌ని బయటికి కూడా తీశాయి. ఎడం చేతిలో అడ్డంగా పట్టుకున్న పేకెట్‌ మీద కుడి చూపుడు, బొటన వేళ్ళ మధ్య సుతారంగా పట్టుకునున్న సిగరెట్‌ని ముచ్చటగా మూడు సార్లు తాటించి .. పూజకి ముందు సంకల్పం చెప్పుకున్నట్టు సిగరెట్‌ నొట్లో స్థాపించే ముందు అదొక రిచువల్‌ ఏదో సినిమాలో హంఫ్రీ బోగార్ట్‌స్టైల్లో .. ఆర్‌ వాజిట్‌క్లార్క్‌గేబుల్‌? డజన్‌ట్‌ మేటర్‌! సిగరెట్‌కాల్చడంతో పాటు ఈ రిచువల్‌కూడా జాగ్రత్తగా అలవరుచుకున్న అలవాటే కదూ, తన నాగరికతకి సూచనగా. టప్‌. టప్‌. టప్‌.. మూడు సార్లు ముచ్చటగా.

ఆగు! ఒక్క క్షణం ఆగు!! వ్హాటెబౌట్‌దట్‌గాల్‌ నీ బలహీనతని ఆ పిల్ల ముందు ఇలా .. తామందరి కంటే నువ్వెంతో అధికుడివని నిన్నొక అందలమ్మీద కెక్కించి ఆరాధించే నీ స్టాఫ్‌కి ప్రతినిధి ఐన ఆ అమ్మాయి ముందు “నువ్వు విధించిన నియమాన్ని నువ్వే అతిక్రమిస్తూ ” నీ బలహీనతని చూపించు కుంటావా? వొద్దు వొద్దు. ఆ మాత్రం నిగ్రహం వుంది. ఇట్‌ కెన్‌ వైట్‌ ” టిల్‌ ద లెసనీజ్‌ ఓవర్‌! తన జేబులో సిగరెట్‌ పేకెట్‌ని తన స్టాఫ్‌ చాలా సార్లే చూసి వుంటారు ” ఈ అమ్మాయీ చూసే వుంటుంది, అదేం రహస్యం కాదుగా. ఐనా ఎందుకో వాళ్ళ ముందు తన అలవాటుని .. తన బలహీనతని .. తన బలహీన అలవాటుని చూపించుకోవటం అతనికి ఎప్పుడూ మనస్కరించ లేదు. ఇప్పుడూ మనస్కరించ లేదు. పేకెట్‌తెరిచి సిగరెట్‌ని అందులోకి తోసేసి జేబులో వేసుకుని, కొవ్వొత్తి పట్టుకొచ్చి ఆమెకి దగ్గరగా బల్ల మీద పెట్టాడు. పెట్టి తన కుర్చీలో చతికిల బడ్డాడు.

“ఇంకేముంది? చెప్పింది అర్థ మైంది గదా! అలా ఆ లెక్క పూర్తి చెయ్యి. ఈలోగా కరంటు రాకపోతే ఇక ఇవ్వాళ్టికి ఇక్కడ ఆపుదాం,” అన్నాడు తన కోసమే చూస్తున్న ఆమెతో.

ఆమె వొళ్ళో పెట్టుకున్న నోట్‌బుక్‌మీదికి వంగి లెక్క పూర్తి చేస్తోంది. అతను తన కుర్చీకి చేరబడి, అనాలోచితంగా ఆమెవేపే చూస్తూ కూర్చున్నాడు.

తను స్కూలు టీచర్లకి విధించిన యూనిఫాం లో వుంది ఆమె. లేత గులాబి రంగులో సాధారణమైన వాయిల్‌చీర, అదే రంగు జాకెట్టు బోర్డరన్నా లేకుండా, నిరాడంబరతకి నిదర్శనంలా. పల్చటి ఒంటిపేట గొలు సొకటి మెడలో తెల్లగా మెరిసింది. వెండిదల్లే వుంది. వెండిదో సత్తుదో? వాళ్ళ బతుకులకి వెండే బంగారం! సన్నపాటి వొళ్ళు తీగలాగా వొంగి వుంది. పైట కప్పని కుడి భుజమ్మీద ఎముక పైకి పొడుచుకు రావటాన్ని చర్మం ఆపలేక పోతోంది, జాకెట్టు దాచనూ లేక పోతోంది. నిరంతరం కరువు దేవత తాండవమాడే పుణ్య భూమిలో పుట్టి ఆమె పాలనలో పెరిగిన వాళ్ళు. పెరిగే పిల్లలకి ” పోషకాహారం మాట దేవుడెరుగు కడుపునిండా ఏదో ఒక తిండి పెట్టడమే మహా ప్రళయం ఐన స్థితిలో ” ఉన్న కాస్తా రేపు తలకి కొరివి పెట్టాల్సిన మగ పురుష సన్తానానికి పెట్టుకోక, నేడో రేపో ఎవడో ఒక అయ్యని కట్టుకుని లేచిపోయే ఆడముండలకి పెట్ట గలదా ఏ తల్లైనా? పెట్టి మన గలదా? లింగ ధారులకి నైవేద్యం పెట్టుకోగా మిగిలిన కుండ గీకుడే గతి కూతుళ్ళకైనా, ఆ తల్లికైనా!

ఇదంతా మనసు కొచ్చి అతని రక్తం సలసలా మరిగి పోయింది. తను మాత్రం ఏం చేశాడు ? బళ్ళో ఏర్పాటు చేసిన మధ్యాన్నం భోజనం పిల్లలకే గాని టీచర్లకి లేదే! ఛ ఛ!! ఈ తప్పు వెంటనే సవరించాలి. ఈ పిల్లే కాదు, మిగతా టీచర్లూ ఇంచు మించు ఈ వయసు వాళ్ళే ” అందరూ ఇలాగే వుంటారు. ఈ విషయం తను ఇంతకు ముందెప్పుడూ గమనించ లేదేం ? పోన్లే ! ఇప్పుడైనా దృష్టి కొచ్చింది. ఈ పూటే ఇంటి కెళ్ళే ముందు ఈ విషయమై మెమో టైప్‌చేసేసి రేపణ్ణించే అమలు పరచాలి. ఈ నిర్ణయాని కొచ్చాక అతను కొంచెం స్థిమిత పడ్డాడు.

ఈ సారి కొంచెం ప్రసన్నంగా చూశాడు ఆమె వంక. ఆమె తల వంచుకునే దీక్షగా లెక్క పూర్తి చేసే ప్రయత్నంలో లీనమై వుంది. ఊగిస లాడుతున్న దీపం వెలుగు ఆమె మొహమ్మీద వెలుగు నీడల కెలైడోస్కోప్‌ఆడిస్తోంది.

జుట్టు కొంచెం రేగి వుంది, తల మీద వింత కిరీటంలా. నుదుటి మీదా, చెక్కిళ్ళ పైనా, దవడల దగ్గరా లేత చర్మం బిగదీసి బిగించి నట్టుంది. బుగ్గ మీద మీటితే కాకతీసిన డప్పు మోగినట్టు మోగుతుందేమో. నల్లటి వొళ్ళు నిగనిగ లాడి పోతోంది కనుకొలుకుల్లోనూ, బుగ్గల మీదా. మెడా భుజమూ కలిసే చోట కాయ కష్టం తీర్చి దిద్దిన కండరాలు మెలి తిరుగుతూ జాకెట్‌లోకి అదృశ్య మవుతున్నాయి. వయసు వొరవడి బక్కచిక్కిన తనంలోనూ చక్కదనాన్ని ప్రకటిస్తోంది. కొద్దిగా తలవాల్చుకున్న ఆమెని ఈ ఏంగిల్‌లో చూస్తుంటే .. చాలా పాత హిందీ సినిమాల్లో నిమ్మీలా .. ఆ మొహం, గువ్వ పిట్టలా .. సినిమాల్లోనా ? ఆ మొహం, పొందిగ్గా .. ఆర్యూ షూర్‌? లీలగా, కలలో లాగా ” కలల్లో రంగులు కనబడవట! బ్లాక్‌ అండ్‌ వైట్‌లో, ఇలాంటి సీన్లోనే, ఇదే ఫీలింగ్స్‌ తోటే .. బ్లాక్‌ అండ్‌ వైట్‌ సీన్లో గ్రే కలర్‌ ఫీలింగ్స్‌తో ” ఇదివర కెప్పుడో ” పూర్వ జన్మలోనేమో ” చూసిన, అనుభవించిన ఫీలింగ్‌ .. పునః పునః .. డీజా వు ?

అతను అధాట్టున లేచాడు. ఆ విసురుకి కూర్చునున్న స్టీలు కుర్చీ కీచుమంటూ మూలిగి రెండడుగులు వెనక్కి జారింది. ఆ చప్పుడుకి ఆమె వులిక్కి పడి తలెత్తి చూసింది. లేచిన విసురుతోనే అతను కుడి చేత్తో ఆమె ఎడమ జబ్బ పట్టుకుని పైకి గుంజాడు. ఆమె వొళ్ళో వున్న పుస్తకాలు అస్తవ్యస్తంగా నేలకి రాలిపోయాయి. రెండు బుజాలూ పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఎడమ చెయ్యి పెనవేసి ఆమె వంటిని తన వంటికి నొక్కేస్తుంటే కుడి చెయ్యి ఆమె మెడ వెనక జుట్టు పట్టుకుని తలని వెనక్కి వంచుతూ .. అతని తల ఆత్రంగా ఆమె మొహమ్మీదికి వాల్తున్నప్పుడు .. అతని గుండెలో అగ్ని పర్వతాల విస్ఫోటనాల చప్పుడు. ఆ నిప్పులు ఎగజిమ్మి అతని కళ్ళలోకి ఎర్రటి లావాగా ప్రవహిస్తుంటే .. విచలితమైన ఆమె మొహంలో ఆ కళ్ళు బెదరిన లేడిపిల్ల కళ్ళల్లే. ఆవు తల తగిలించుకుని ఇన్నాళ్ళూ తిరిగిన పెద్దపులి నిజస్వరూపాన్ని మొదటిసారిగా చూస్తున్న లేడి కళ్ళు ” నరమాంసపు రుచి మరిగిన పెద్దపులి ఆకలికి పదే పదే నైవేద్యమయ్యే మనిషి కళ్ళు యుగ యుగాలగా తర తరాలుగా దౌర్జన్యం దాడి చేసినప్పుడు అలవాటుగా ఆత్మార్పణ చేసుకోడం తప్ప ఎదురు తిరిగి పోరాడటం తెలియని ఒక ప్రాణి కళ్ళు .. ఆ కళ్ళల్లో తన ఆకళ్ళ నీడల్ని అతని కళ్ళు చూస్తూనే వున్నై, కానీ ఏమీ కనబళ్ళేదు.

అతని మొహం ఆమె మొహమ్మీదికి వొంగింది. ఉద్రేకంతో విచ్చుకుని వొణికి పోతున్న అతని ముక్కు పుటాలకి ఒక పల్చటి వాసన సోకింది. ఘ్రాణనాడి తీగల్లో ఒక అపస్వరం ” జ్ఞాపకాల పొరల్లో ఒక అలజడి మరుపు పడిందనుకున్న ఒకానొక వాసనని గుర్తుకి తెస్తూ. ఎప్పుడో .. చాలా కాలం క్రితం .. కిందటి జన్మలోనేమో .. ఇలాగే .. బ్లాక్‌ అండ్‌ వైట్‌ సీన్‌లో గ్రే కలర్‌ ఫీలింగ్స్‌తో .. ఇదే వాసన తన ముక్కు పుటాల్లో ఘాటుగా, తల దిమ్మెక్కించేస్తూ. ఆ దిమ్ముకి అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగి నిప్పు జీరలు చల్లారి పోయి ఆమె మొహం మొదటిసారిగా ఉన్న దున్నట్టుగా కనబడింది. అతని చేతులు నిర్జీవంగా వాడి వాలి పోయాయి. పెదవులు మాత్రం అస్పష్టంగా గొణుగుతున్నై .. అయామ్‌ సారీ .. అయామ్‌ సారీ .. ఆమె అతన్నొక సారి ఎగా దిగా చూసి దొర్లిపోయిన మోడాని లాక్కుని కూర్చుని పుస్తకాల్ని ఏరుకుని వొళ్ళో పెట్టుకుని లెక్క తెరిచింది, అతను గుచ్చి పట్టుకున్న చోట జబ్బని తడుముకుంటూ.

వుస్సురని తన స్టీలు కుర్చీలో కూలబడ్డాడు. అర చేతుల్లో మొహం దాచుకున్నాడు. ఎప్పుడో అంతరించిం దనుకున్న జన్మ తాలూకు ఆ వాసన .. ఆ వాసన్నీ, ఆ జ్ఞాపకాల్నీ ” ఆ జన్మనే” కప్పెట్టెయ్యటానికి చాలా శ్రమ పడ్డాడతను ఆ రోజుల్లో. మళ్ళీ ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి ఆ వాసన తగిలింది. ఆ జన్మ తలెత్తింది. కూడదు! వీల్లేదు!! ఆ జన్మ మళ్ళీ జీవం పోసుకోడానికి వీల్లేదు!!! ఆ రోజుల్లో ఆ జన్మనే కప్పెట్టేసేందుకు ఆ వాసన్ని బలవంతంగా మర్చిపోయాడు. ఈ రోజున ” అది పునర్జన్మించ కుండా వుండేందుకు ” ఈ వాసన్ని ఎప్పుడూ, ఎల్లప్పుడూ, ఈ జన్మాంతం గుర్తు పెట్టుకుంటాడు. ఆ నిశ్చయంతో స్థిమిత పడిన ముక్కు పుటాల్ని విప్పారించి లోతుగా గాలి పీల్చుకున్నాడు. ఆ పూర్వ జన్మ వాసన అతని అస్తిత్వ్తాన్నంతా నింపేసింది.

అదిక మరపు రాదు. ఆ పూర్వ జన్మకి మరుజన్మ లేదు.


ఎస్‌. నారాయణస్వామి

రచయిత ఎస్‌. నారాయణస్వామి గురించి: కథకుడిగా, అనువాదకుడిగా, సమీక్షకుడిగా అమెరికాలోనూ, ఇండియాలోనూ, బ్లాగుల లోకంలోనూ పేరు గడించిన ఎస్‌. నారాయణ స్వామి అమెరికా ఆంధ్రుల జీవన తలాల్లో కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తున్న కథకుడిగా ఈమాట పాఠకులకు చిరపరిచితులు.  ...