అమెరి గల్పిక ఆదా

ఒక శనివారం ఉదయం. ఖాళీ అయిన రిఫ్రిజిరేటర్ని తిరిగి నింపే  సంకల్పంతో సుబ్బారావు భార్యా సమేతుడై సూపర్‌ మార్కెట్టుకి వేంచేశాడు.  అక్కడ ప్రొడ్యూస్‌ సెక్షన్‌ లో ఇటాలియన్‌ ఎగ్‌ ప్లాంట్‌ (సన్న వంకాయలు) ఒక్క పౌనూ రెండు డాలర్లు ఉల్లిపాయలు పౌనూ డలరు (ఇదేవన్నా అమెరికానా, బీజేపీ పాలనలో ఉన్న  ఇండియానా?) బాటిల్‌ స్క్వాష్‌ (సొరకాయ) చిన్నదీ డాలరు వెధవది, అరిటిపళ్ళు పౌనుకి అరవై సెంట్లు

ఈ మండే ధరల్చూసి సుబ్బారావుకి కడుపు మండిపోతుండగా (ఎసిడిటీ వల్లనే  కాదు  సుమండీ) సతీమణి చల్లటి మాట చెప్పింది .. ఫార్మర్స్‌ మార్కెట్లో కూరగాయలు  కారు చౌకగా అమ్ముతున్నార్ట.

నాలుగు లీటర్ల ఎనిమిది సిలిండర్లూ నాలుగొందల గుర్రాలై లాగుతున్న స్పోర్టు  యుటిలిటీ మహా రథాన్నెక్కి పదిహేను మైళ్ళ దూరాన్నీ పది నిమిషాల్లో  దాటేశాడు సుబ్బారావు, హనుమంతుడు సముద్రం లంఘించినంత అవలీలగా.  వారాని కొక రోజు మాత్రమే జరిగే ఈ సంతకి విపరీతమైన రద్దీ. పార్కింగ్‌  లాట్‌ లో చోటు దొరక్క, పార్కింగ్‌ మీటరుకి డాలరు ధార పోసేందుకు  మనసొప్పక, అనతి దూరాన ఇళ్ళున్న ఒక బ్లాకులో వాహనాన్ని నిలిపి, సంతలో  ప్రవేశించాడు సుబ్బారావు, పద్మవ్యూహంలోకి చొచ్చుకు పోయే అభిమన్యుడి లెవెల్లో  ఒక్కటే డిఫరెన్సు అభిమన్యుడి వెనక ఉత్తర లేదు, సుబ్బారావు వెన్నంటి  శ్రీమతి వుంది.

సంతలో సుబ్బారావు కళ్ళబడిన ధరలెట్టివనిన సన్న వంకాయలు ఎనభై సెంట్లే ఉల్లిపాయలు అర్థ డాలరు పెద్ద సొరకాయ ముప్పావలా అరిటిపళ్ళైతే పావలాయే

అబ్బ, ఎంత చౌక! ఇంతటి గొప్ప ఐడియా ఇచ్చిన పెళ్ళాన్ని అమాంతం  ముద్దెట్టేసుకోవా లన్నంత ముచ్చటేసినా, తనలాంటి ఉత్తమ ఇండియన్‌ మొగుడు  తనదైన ఇండియన్‌ పెళ్ళాన్ని అలా పబ్లిగ్గా ముద్దెట్టుకోవడం బొత్తిగా ఇండియన్‌  వేల్యూ కాదని గుర్తించి, ఆ ఉత్సాహాన్ని కూరలు కొనడంలోకి మళ్ళించాడు.

ఇంత చౌకగా దొరుకుతుంటే వొదలడ మెందుకని అత్యవసర మైనవీ,  అప్పుడప్పుడూ అవసరమయ్యేవీ, వాటితోపాటే అసలు అవసరం లేని కూరలూ  పళ్ళూ కూడా కొనేసుకుని, కనీసం పది డాలర్లన్నా ఆదా చేశామన్న తృప్తితో  సుబ్బారావు దంపతులు గృహోన్ముఖులై వాహనమెక్కారు.

స్టార్ట్‌ చేసి గేరు మారుస్తుండగా చూశాడు, వైపర్‌ బ్లేడ్‌ కింద రెపరెపలాడుతున్న  కాగితాన్ని. ఏదో ప్రకటన పత్రం! విసుక్కుంటూ కిందకి దిగాడు దాన్ని తీసి  చించి పారెయ్యడానికి. అది ప్రకటన పత్రం కాదు, పాతిక డాలర్లకి పార్కింగ్‌  టిక్కెట్టు. టిక్కెట్టెందు కిచ్చారబ్బా అని ఆశ్చర్యపడి లేచి చుట్టూ కలయ  జూస్తున్న సుబ్బారావుకి, అక్కడ అంతకు ముందు లేని, ఉన్నా కనిపించని  “రెసిడెన్షియల్‌ పెర్మిట్‌ పార్కింగ్‌ ఓన్లీ” అన్న బోర్డు ఇప్పుడు కనబడి  వెక్కిరించింది.

ఇక గాసొలీన్ని కోక్‌ లాగా జుర్రుకునే స్పోర్ట్‌ యుటిలిటీ మహారథంలో రానూ  పోనూ ముప్ఫై మైళ్ళకి గాస్‌ ఖరీదు ఎంతో సుబ్బారావుతో చెప్పకండి, మండి  మసై పోగల్డు.


ఎస్‌. నారాయణస్వామి

రచయిత ఎస్‌. నారాయణస్వామి గురించి: కథకుడిగా, అనువాదకుడిగా, సమీక్షకుడిగా అమెరికాలోనూ, ఇండియాలోనూ, బ్లాగుల లోకంలోనూ పేరు గడించిన ఎస్‌. నారాయణ స్వామి అమెరికా ఆంధ్రుల జీవన తలాల్లో కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తున్న కథకుడిగా ఈమాట పాఠకులకు చిరపరిచితులు.  ...