ఒక జనవరి శుక్రవారం, లోకస్ట్‌ వాక్‌ కార్నర్లో

నడు, నడు తొందరగా. టైమై పోతోంది బాసుతో మీటింగుకి. ఇంకా కొన్ని రిజల్స్టు ప్రింట్‌ చెయ్యాలి. తొమ్మిదింటికల్లా .. ఆవిడ .. అబ్బా, పోట్లు .. తలలో .. ఇద్దరు కంసాలులు ఒకే బంగారు నరాన్ని ఉంగరంలా సాగ్గొడుతున్నట్లు .. పోట్లు .. ఎడా పెడా, ఎడమా కుడీ ఇవ్వాళ్ళ పొద్దున్న మీటింగు పెట్టుకుని నిన్న మల్లూ గాడి పార్టీలో మరీ అంత తాక్కుండా వుండాల్సింది. టూలేట్‌ చూస్తూ చూస్తూ, స్వామీ విద్యానంద ఉపదేశించిన గ్రాడ్యువేట్‌ విద్యార్థి జీవన సూత్రాల్లో .. మొదటిదీ .. అతి పవిత్రమైనదీ ” ఫ్రీ గా వచ్చే తీర్థ ప్రసాదాల్ని ఎప్పుడూ తిరస్కరించ రాదు!” ఉల్లంఘించ మన తరమా? హబ్బా, ఇంకో సుత్తి దెబ్బ! కంసాలి గాళ్ళు పోయి, వాళ్ళ చోట్లో .. యెల్లా వెంకటేశ్వర్రా వొచ్చేసి .. సుత్తితో శ్రుతిచేసి, మద్దెల .. వాయించు .. ఆది తాళం .. తధిం తన, తకిట తధిం తన, కిట తకిట తధిం తన ముక్తాయింపుతో భరత నాట్యం స్టెప్పులు.

నిన్న .. రాత్రి పార్టీలో రీమా స్టెప్పులు, మినీ స్కర్టులో రీమా, రీమాలో వొంపులు, వొంపుల్లో వొయ్యారాలు, వొయ్యారాల భరతనాట్యం వెరసి, మినీస్కర్టులో రీమా భరతనాట్యం! అబ్బ, ఏం లాజిక్కు గురూ!! తకిటా తధింతన .. తాగీ తందనా లాడనా? ఎందుకో ఆ పార్టీలకి పోవడం, పోయి .. నా యిరవయ్యెనిమి దేళ్ళ వార్ధక్యాన్ని నిరూపించుకోడమే ఆ పిల్లకాయల్ని చూస్తుంటే .. మామధ్య జెనరేషన్‌ గాప్‌ వాళ్ళు .. ఫ్రెష్‌ ఆఫ్‌ ది బోట్‌ బట్‌ అమెరికా ఇన్‌ దైర్‌ బ్లడ్‌ అమెరికా గాలిని ఊపిరితిత్తుల్లోనూ, అమెరికన్‌ కల్చర్ని రక్త నాళాల్లోనూ నింపుకుని పుట్టినట్టు .. యంగ్‌ టర్క్స్‌ ఆడా మగా అరమరికల్లేకుండా కలిసి పోతూ, తుళ్ళుతూ తాగుతూ ఆడుతూ పాడుతూ తను వాళ్ళల్లో కలవలేడు, తాగినా తందనాలాడలేడు.

మూల .. కౌచ్‌ మీద డిమ్‌ లైట్లో 180 ప్రూఫ్‌ రమ్ము ఘాటుకి బుర్ర దిమ్మెక్కి పోతూ స్తబ్దుణ్ణై వాళ్ళ కేరింతల్ని చూస్తూండగా రీమా సుడిగాలిలా చుట్టు ముట్టేసి “కమాన్రామ్‌, గిమ్మీ ఎ సిగరెట్‌ మేన్‌” చనువుగా జేబులోంచి మార్ల్‌బొరో లైట్స్‌ పేకెట్‌ తీస్కుని, మనోజ్‌ గాడు కోపంగా చూస్తున్నా పట్టించుకోకుండా. ఎర్రటి జిగురు పూసుకున్న పెదాల మధ్య తెల్లటి సిగరెట్‌ “కమాన్‌ యూ బుద్ధూ .. గిమ్మీ ఎ లైట్‌” ఛ!! నా షివల్రీ .. ఎక్కడకి పోయింది? లైటర్‌ ఫ్లిక్‌ .. ఎక్స్పర్ట్‌ లాగా పీల్చింది, కౌచ్‌లో వెనక్కి వాలి, తల వెనక్కి విసిరేసి, సీలింగ్‌ వేపుకి రింగులు విసుర్తోంది. బుల్లి బుల్లి పెదాల్లోంచి తెల్ల తెల్ల మబ్బుల పొగ .. పొగ చూరిన అధరోష్ఠం .. నననానన నననానా .. ఏదో ఛందస్సులా గుందే, గణపతిగాణ్ణి అడగాలి. ఛందస్సేం ఖర్మ, కవిత్వమే వచ్చేస్తుంది, అంగుళంగుళమే పైకి జరుగుతున్న మినీ స్కర్టులో .. రీమాని ఆ పోజులో .. చూస్తుంటే ఆ బాలామణి నట్టె చెట్టబట్టి బంధించి ఎముకల్‌ ఖలుక్కుమనన్‌ కౌగలించి నవపల్లవాధరిన్‌ చుంబించినన్‌ .. హుహ్‌ అంత దమ్ముంటే ఈమూల లోన్లీగా పడుండట మెందుకు .. ఆయనే వుంటే మంగలాడెందుకు? ఎందుకంటే .. ఐ బాడ్లీ వాంటు గెటింటూ హర్‌ పేంట్స్‌, మేన్‌! అబ్జెక్షన్‌ యువరానర్‌ సదరు ముద్దాయి రీమా పేంటు వేసుకోలేదనీ, మినీ స్కర్టు వేసుకున్నదనీ గౌరవనీయులైన కోర్టువారు గమనించ ప్రార్థన. జడ్జీగారి గావెల్‌ పైకి లేచి .. కుడి కణతలో కలుక్కు మంటే ..

కాఫీ, అర్జంటుగా ఒక గుక్కెడు కాఫీ! ఒక్ఖ నిమిషం ఓర్చుకో, లోకస్ట్‌ వాక్‌ దాకా వచ్చేశాంగా. అవతలి బ్లాక్‌లో స్టార్‌బక్స్‌లో దూరి ఇంత కాఫీ లోపల పోస్తా. కాఫీషాప్‌ బయట రెండు కుర్ర కోతులు .. ఎర్ర కోతులు .. ముందూ వెనకా తాటికాయలంత అక్షరాల్లో రాసిన బోర్డులు బుజాలనించి వేళ్ళాడుతూ “స్టాప్‌ ఎక్స్‌ప్లాయిటేషన్‌ ఇన్‌ కాఫీ ప్లాంటేషన్స్‌ యువర్‌ కాఫీ మోఖా ఫండ్స్‌ డ్రగ్‌ లార్స్డ్‌ ఇన్‌ కొలంబియా” నీ బొంద, నువ్వుపోయి చూసొచ్చావ్‌ కొలంబియాలో ఏం జరుగుతోందో! పనీ పాటా లేక పోతే సరి, ఈ ఛలిలో .. అమ్మా నాయనా బోలెడు డబ్బులు పోసి ఐవీలీగ్‌ యూనివర్శిటీకి పంపితే .. బుద్ధిగా చదువుకోక .. పక్కకి తప్పుకోండ్రా నాయనా .. కొలంబియాలో కాఫీ కార్మికుల సంగతి సరే, ముందు గుక్కెడు కెఫినామృతం నా గొంతు దిక్క పోతే ప్రాణం పోతుం దిక్కడ. “వన్‌ షార్ట్‌ లాట్టే, వితెక్స్ర్టా షాట్‌ ప్లీజ్‌” కౌంటర్‌ వెనకాల చైనా బొమ్మ .. తప్పు తప్పు మేడిన్‌ అమెరికా చైనా బొమ్మ “ఎవడీ గ్రహాంతర వాసీ, ఏమి వీని ఏలియన్‌ భాషా” అన్నట్టు ఆమె అమాయకపు మొహంలో అయోమయపు చూపులు. నా యాస .. ఆమెకి ప్రయాస .. నీ మొహంలాగుందీ ప్రాస! ఇక్కడ ఎన్నేళ్ళున్నా ఆ మాట పలకటం .. వాళ్ళ లాగా పలకడం .. నోరు తిరిగి చావదు .. నోరు తిరక్క పోతేనేం జియ్యా, మేమే తిరుగుతాం .. వేసుకో వీరతాడు .. అమ్మా చైనా బొమ్మా, షార్టమ్మా , షార్టు. లాంగు .. షార్టు. హమ్మ, ఇప్పటికి వెలిగిందా లైటు, మాయమ్మే, మా తల్లే, చచ్చి నీ కడుపున పుడతా! ఆహా, ఆ సువాసన .. ఒక్ఖ గుక్ఖ చప్పరిస్తే ..ఓహో, ఆ రుచీ, .. బైబై, మిస్టర్‌ యెల్లా!

నడు, నడు, కాఫీ పుణ్యమాని ఫది నిమిషాలు మటుమాయం, కమాన్‌! పర్లేదులే, లోకస్ట్‌ వాక్‌ మీద సరిగ్గా ఏడు నిమిషాల నడక, ఆ చివరి కార్నర్‌ వరకేగా, వచ్చేసినట్టే. జాగర్త! ఈ ఇటికల బాట చలికి తేమతో సన్నటి ఐసు కవచం తొడుక్కుంది. జారి పడ్డామంటే .. కాఫీ కాస్తా ..ఏబ్బే నిలబడి తాగేందుకు టైములేదు. నడుస్తూనే .. లేటయ్యామంటే .. బాససలే .. చండ శాసిని .. చండ శాసనురాలు .. ఏది రైటు? ఛ, ఏదో వొహట్లే .. ఆ ప్లాట్లు గనక ప్రింట్‌ చేసి రెడీగా వుండక పోతే పర్లేదులే .. అంతా కంప్యూటర్లో రెడీగానే వుందిగా, జస్ట్‌ ప్రింట్‌ కొట్టాలంతే, చేసేద్దాం. ఏమో .. ఎవడు చూడొచ్చాడు, మర్ఫీ గారి సూత్రము సరిగ్గా మనకి అత్యవసర పరిస్థితుల్లో కార్టరిడ్జ్‌ నిండుకుంటే .. నిండు కుండ .. నిండుకుంటే .. నెట్టు వర్కు .. డౌనయ్యుంటే? అవదు .. అవటానికి వీల్లేదు! అందుకే కొంచెం ముందుగా చేరుకుంటే “కెన్‌ యూ స్పేరె క్వార్టర్‌ ప్లీజ్‌ ” రామాయణంలో పిడకల వేట .. మేరీ ప్లీజ్‌ .. మేడం ప్లీజ్‌ మేరీ ప్లీజ్‌ .. ధర్మం ప్లీజ్‌ .. ఎ క్వార్టర్‌ ప్లీజ్‌

“లోకస్ట్‌ వాక్‌ రిచర్డ్‌”!! బెంచీకి చేరగిల బడి, చెవులకి ఇయర్‌ ఫోన్లు, జీన్‌స్‌ బెల్టుకి వాక్‌మేన్‌, ఒక చేతులో కాఫీ కప్‌ ఇంకో చేతి వేళ్ళ మధ్య తగలడుతున్న మార్ల్‌బరో ఇంత స్టైలిష్‌గా అడుక్కునేవాడు బహుశా ప్రపంచంలో ఇంకెవడూ లేడేమో. అవున్లే, ఈ లోకస్ట్‌ వాక్‌కి వాడొక సెలబ్రిటీ కిందే లెక్క. వాణ్ణి గురించి పేపర్లలోనే రాసేశారు. స్టూడెంట్లు, ఫ్రాట్‌ పార్టీలకి డిన్నర్లకీ వీణ్ణి పిల్చుకెళుతూ వుంటారని కర్ణాకర్ణిగా వినికిడి. హేంటో, ఇదో పిచ్చి లోకం .. ఎవడి పిచ్చి వాడికానందం .. ఆనందో బ్రహ్మ! అదుగో, అక్కడ బెంచీ మీద, ప్రాణం వుట్టి పడుతున్నట్టు, పేపరు చదివేస్తున్నట్టు, పోతపోసి, తీర్చి దిద్దినట్టు కూర్చు నున్నాడే, మిస్టర్‌ బెన్నీ ఫ్రాంక్లిన్‌ .. ఈ లోకస్ట్‌వాక్‌కి ఆ బెన్నీ లాగే .. ఈ రిచర్డ్‌ కూడా ఒక పెర్మనెంట్‌ ఫిక్స్చర్‌ .. రియల్లీ? వాళ్ళు అంత పెర్మనెంటా? లేకపోతే రోజీ లాగే ఒక రోజు ..

రోజీ కూడా ఈ లోకస్ట్‌ వాక్‌కి పెర్మనెంటే అనుకుంటూ వుంటే .. సరిగ్గా ఈ లోకస్ట్‌ వాక్‌ని ముప్ఫై నాలుగో వీధి ఖండించే చోట .. ఆమె వయసెంతో చెప్పడం కష్టం .. ఇటికలు పరిచిన ఆ ఇంటర్సెక్షన్లో .. వింత వింత డ్రెస్సులేస్కుని .. ఏవేవో విచిత్రమైన బొమ్మలు .. నిజంగా బొమ్మలు కావు, ఏవో సింబల్స్‌ .. కుట్టిన పేద్ధ నీలం రంగు జెండా పట్టుకుని .. వూపుతూ .. నాట్యం కాని నాట్యమేదో విన్యసిస్తూ .. మధ్య మధ్య గొంతెత్తి పాడుతూ .. మొదట్లో పిచ్చిదేమో అనుకున్నా. ఒకసారి ఆ స్క్వేర్‌ దాటుతుంటే రోజీ పాట వినపడి, ఏవిటో నని .. మాటల కర్థం వెతుక్కుంటే .. పూర్తిగా అర్థం కాలేదు. కానీ శాంతీ .. పిల్లలూ .. ప్రపంచం .. ఇలాంటి మాటలేవో వినిపించాయి. అలా ఆమె పాట విన్నప్పుడల్లా .. అప్పుడో ముక్కా ఇక్కడో ముక్కా వింటూ .. ఆమె ప్రపంచ శాంతి కోసమూ, బాల కార్మికుల విముక్తి కోసమూ, భూపర్యావరణ రక్షణ కోసమూ కలవరిస్తున్నదని .. ఆ రంగుల కలని వరిస్తున్నదని .. అర్థమైంది. కానీ ఆమే అర్థం కాలేదు. పొద్దున్న లాబుకెళ్ళేటప్పుడూ, మధ్యాన్నం లంచికి పోతుంటేనూ, సాయంత్రాలు ఆ వెధవ కంప్యూటర్నించి కసింత విశ్రాంతి కోసం బయటి కొస్తేనూ, తటస్థించేది .. అదే స్క్వేర్లో .. తనదైన నాట్యం కాని నాట్యం చేస్తూ .. అలాగే వుండిపోతుందా ఆ స్క్వేర్లో .. యుగాంతం వరకూ అనిపిస్తూ .. ఆమె కోరుకునేవేవీ యుగాంత మైపోయినా సూర్యుడు సూపర్‌ నోవా ఐపోయినా .. జరిగేవి కావు అని గ్రహించిందేమో. అందుకే పిచ్చిది కాదేమోననిపించింది. ఒకానొక సాయంత్రం అదే స్క్వేర్లో నిలబడి, వొంటిమీద గాసొలీన్‌ దిమ్మరించుకుని ఆరు ఇటికల మీద కాలిన నల్లటి మచ్చగా ఈ లోకస్ట్‌ వాక్‌లో రోజీ పర్మనెంట్‌గా నిలిచిపోయింది. నిజంగా పిచ్చిదే! లేకపోతే, తను సజీవంగా కాలిపోతున్నా పట్టించుకోని ఈ వెధవ ప్రపంచం కోసం .. నిండు ప్రాణాలు .. తప్పకుండా పిచ్చిదే!

అమ్మయ్య, స్క్వేరు దాటి లాబుకొచ్చి పడ్డాం! చర్మంలో అక్కడక్కడా ఇంకా బతికున్న ప్రతి నరాన్నీ వెతికి పట్టుకుని సరసరా కోసేసే కత్తిలాంటి ఆ జనవరి చలిలోనించి .. బిల్డింగ్‌ లోపలికి రాగానే .. ఆహాహా, పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టే. జౌ గాడింకా రాలేదే! వాడు బలే చాలూ గాళ్ళే బాసు ఎదురుగుండా .. వెధవ నక్క వినయాలూ వాడూ .. మిగతా టైమ్‌లో .. వాడిష్టం .. ఎప్పుడొస్తాడో ఎప్పుడు పోతాడో! నేనిలా .. ఇలా వొళ్ళు విరుచుకుని పని చేసినా .. బాసిణి నించి అప్పుడప్పుడూ అక్షింతలు తింటూనే .. చూద్దాం, చూద్దాం! ఎక్కడో ఎప్పుడో న్యాయం జరక్క పోదు. గ్రాఫులు ప్రింట్‌ చెయ్యాలి .. ఇదుగో, ముందు యుడోరాలో ఒక్ఖ నిమిషం ఈమెయిల్‌ చూసుకుని, షిట్‌ ఇరవై మూడు కొత్త మెసేజ్‌లు! ఈమెయిల్‌ గ్రూప్సన్నిటికీ అన్‌సబ్‌స్క్రైబ్‌ చేసి పారెయ్యాలి, మరీ టైము తినేస్తున్నై! మోస్టాఫ్‌ ద టైమ్‌, ఎందుకూ పనికి రాని చెత్త .. వావ్‌ బాస్‌ నించి మెయిల్‌ .. ఇవ్వాళ్ళ తెల్లారు జామున పంపింది .. ఆవిడ అసలు నిద్ర పోదా? సడన్‌గా డీసీకి ఏదో మీటింగుకెళ్ళాలంట, అందుకని .. ఇవ్వాళ్టి మన మీటింగ్‌ సోమవారానికి పోస్ట్‌పోన్‌ .. పో .. ఓ .. స్టు .. పో .. ఓ ..న్‌ !!! ఇంగ్లీషు భాషలోనే అతి మధురమైన మాట! ఈరోజంతా కేర్‌ ఫ్రీ! బాసు రెండొందల మైళ్ళ దూరంలో వున్నదన్న హాయిగొలిపే ఆలోచన! ఏయ్‌ ముందు ఆవిడకి చూపించాల్సిన ప్లాట్లు ప్రింట్‌ చేసేస్తే .. ఆ, అదెంత సేపు, చేసేద్దాం, ఐదు నిమిషాలు కూడా పట్టదు. ఒక్కసారి .. జస్ట్‌ సినిమా డిస్కషన్‌ లిస్టులో మెసేజ్‌లు మాత్రం చూసేసి .. “జీవిఫేన్‌” గాడి నుంచే ఆరు మెసేజ్‌లు. వెధవకి బొత్తిగా పన్లేదు .. ఎప్పుడూ ఈమెయిల్లోనే వుంటాడు .. పిచ్చి వాగుడు వాగుతూ .. ఎప్పుడూ అదే పాట “చిరు అన్‌బీటబుల్‌ ” “చిరు ఎవర్‌ గ్రీన్‌” .. కమాన్‌ యు ఇడియట్‌ వేకప్‌ అండ్‌ స్మెల్‌ ద కాఫీ!! చిరు రోజులై పోయినై!!! నాగార్జున ఈజ్‌ ద టాప్‌ నౌ! ప్లాట్లు ప్రింట్‌ చెయ్యాలి. ఇదుగో .. జస్టెమినిట్‌ ఒక్క సారి స్పోర్స్ట్‌ న్యూస్‌ మాత్రం చూసుకుని ద సిక్సర్స్‌ ఆర్‌ డూయింగ్‌ వెల్‌ క్రికెట్‌ ఎలా వుందో? అది కూడా ఐ ఫర్గాట్‌ .. జనతా డాట్‌ కామ్‌లో సుజాత వెయిట్‌ చేస్తోందేమో .. చాట్‌ రూమ్‌లో .. ఒక్కసారి హలో చెప్పేసి “హాయ్‌ సుజీ! హౌ ఆర్యూ?” ఎదురుగా పైకి అనలేని “ఈ ఛంపేసే ఛలిలో .. నువ్వే పక్కనుంటే ..” లొట్టలేస్కుంటూ .. ఎప్పుడన్నా నిజంగా కలిస్తే .. వర్చువల్‌ సుజీ .. నిజంగా నిజమైతే .. రీమా అంత సెక్సీగా .. రీమా కంటే సెక్సీగా వుంటుందా? కలలే నిజమైతే “డార్లింగ్‌ నీ అందం చూస్తుంటే నా కలల్లోంచి దిగి వచ్చావని అనచ్చు, కానీ నా కెప్పుడూ నీ అంత హై లెవెలు కలలు రాలేదు!!” స్మైలీ .. నవ్వు .. సుజీ .. అసలు నిజంగా అమ్మాయో కాదో ..సుజీ .. ప్లాట్లు .. ప్రింట్‌ .. జస్టింకో ఐదు నిమిషాలు. అబ్బా, ఆకలేస్తోంది. అబ్బో, అప్పుడే పన్నెండున్నర! చివరిసారి ఈమెయిల్‌ చూసేసి .. లంచికి లేద్దాం. లంచైపోయి రాగానే గ్రాఫులు ప్రింట్‌ చేసెయ్యొచ్చు. అలాగే .. వల లాగే .. ఈవల నించి ఆ వలకి .. ఏదో లింకు ఇంకో సైటుకి రైఠో బైఠో మరింకో సైటుకి ఫ్లైటు ఎగురుతూ దూకుతూ పాకుతూ దేకుతూ .. లోతులు శోధిస్తూ, నిడివి తడిమి చూస్తూ .. అంతర్జాలపు ఇందర్జాలంలో కొట్టుకు పోతూ .. కళ్ళు మండుతూ, కుడి చెయ్యి చూపుడు వేలు నొప్పెడుతూ .. కుర్చీలోంచి లేచి వొళ్ళు విరుచుకుంటుంటే .. తలెత్తి .. ఎదురుగా గోడ గడియారంలో టైము పావు తక్కువ ఐదు! ఛ,ఆ వెధవ గడియారం .. ఎప్పుడో ఆగిపోయింది .. మానిటర్‌ స్క్రీన్‌మీద .. అక్కడా అదే టైము!! ఓ మై గాడ్‌!! పొద్దున ఎనిమిదిన్నర్నించీ .. ఎ. ని. మి. ది. గంటలు .. తిండైనా తినకుండా, ఏవిటి పడ్డ పాటు? చేసిన పని? ఛ, వేస్టు. అంతా వేస్టు. యూజ్‌లెస్‌ వెధవ మైండు. కంట్రోల్లేని మైండ్‌ ఇలా .. ఈ పీహెచ్చిడీ ఎన్నాళ్ళూ .. ఎప్పటికయ్యేను .. ఎప్పటికైనా అయ్యేనా? ఆల్రెడీ ఇరవయ్యెనిమిది దాటి .. ఒక లక్ష్యం లేకుండా .. ఒక డిసిప్లీన్‌ లేకుండా, ఏం చేస్తున్నట్టు? ఎవర్ని వుద్ధరిస్తున్నట్టు?

చలో .. ఇవ్వాళ్టికి ఇంతే గాని, సాయంత్రం భార్గవ్‌ గాడింట్లో పార్టీ .. రీమా వస్తుందేమో .. షిట్‌ .. ఇదే ప్రాబ్లం! రాత్రిళ్ళు మందు పార్టీలు, పగళ్ళు ఇంటర్నెట్లో చాట్లు! మన పాట్లు .. రిజల్టు ప్లాట్లు .. ఛ, వెధవ జీవితం దీనికంటే ష్కుయిల్‌కిల్‌ రివర్లో .. దూకినా మునుగుతామని గారెంటీ .. లేక మా వూళ్ళో ఏలూరుకాలవ అంతకంటే పెద్దగా వుంటుంది .. దాన్లోనే కదూ .. రామచంద్రం దూకి .. టెన్త్‌ పాసవలేదని .. షిట్‌ మాట మార్చకు! చచ్చి సాధించే దేవుందిలే. ఆ పిచ్చిది .. ఆ ఇటికల స్క్వేర్లో బార్బెక్యూ ఐపోయి ఏం సాధించింది! ఇవ్వాళ్ళింక పని జరగదులే. ఇదుగో చివరిసారి ఈమెయిల్‌ చూసేసి .. దేశీ స్టూడేంట్‌ ఎసోసియేషన్నించి .. ఏదో .. ఏంటిది, ఎర్త్‌క్వేకేంటి? ఎక్కడ? “స్పెషల్‌ మీటింగ్‌ ఎట్‌ ఫైవ్‌ టు .. ఎమర్జెన్సీ హెల్ప్‌ గుజరాత్‌ ..” 7.9 రిక్టర్‌ స్కేల్లో, ఓ మై గాడ్‌ CNN సైటుకి పోయి చూస్తే .. ఓ మై గాడ్‌ ఆ విధ్వంసం .. ఆ శవాలు .. కూలిన ఇళ్ళు, చితికిన మనుషులు .. ఊహకందని వినాశనం .. ఓ మై గాడ్‌ ఇక్కణ్ణించి .. మనవాళ్ళు ఏం చెయ్యగల్రు? “ఇవ్వాళ్ళ సాయంత్రం అందరూ తలొక పెద్ద ట్రాష్‌ బేగ్‌ పట్టుకుని యూనివర్సిటీ సిటీలో వున్న షాపులన్నిట్లో ముష్టెత్తటం”గొప్ప ఐడియాలే! ఎవడో ఆ తిక్క వెధవ, ఈ ఐడియా పుట్టించిన వాడు?ఖచ్చితంగా మనోజ్‌గాడే అయ్యుంటాడు! వీళ్ళ ఉత్సాహం ముచ్చటేస్తోంది, కానీ వీళ్ళ పిచ్చి కాకపోతే .. ఈ ఛలిలో ఎవడొస్తాడు? వొచ్చినా, ఆ షాపుల్లో ఎవడు .. వీళ్ళకి ఏమిస్తాడు? ఇక్కడి వాళ్ళకి .. గుజరాత్‌ సంగతి దేవుడెరుగు, అసలు ఇండియా అన్నా .. ఎక్కడుందో తెలుసో లేదో .. వెయిటే మినిట్నిన్న పార్టీలో రీమా .. ఏంటో మనోజ్‌ గాణ్ణి అంటి పెట్టుకునే వుంది, ఇవ్వాళ్ళ వాడు పిలుస్తున్నాడంటే .. ఈ బిచ్చవెత్తడానికి .. రీమా కూడా వస్తుందేమో. పోనీ, మనం గూడా వెళ్తే .. పుణ్యమా పురుషార్థమా? భూకంపానికి సహాయం పుణ్యం!! రీమా సందర్శనం పురుషార్థం!!! మన లక్కు బావుంటే రీమాకి జట్టుగా తిరగచ్చునేమో బిచ్చమెత్తుతూ! ఈ సాయంత్రమంతా .. బానే వుంది .. చలి వొణికిచ్చేస్తుంటే .. రీమా పక్కనుంటే .. మరి భార్గవ్‌ గాడి పార్టీ? .. షిట్‌ .. స్క్రూ ద పార్టీ .. సాయంత్రమంతా రీమా కంపెనీ దొరికేట్టైతే .. ఆ వెధవ పార్టీ ఎవడిక్కావాలి?

ఆగు ఒక్క ఫ్రిగ్గింగ్‌ సెకండాగు నువ్వేవంటున్నావో నీకే వినిపిస్తోందా? ఎంత వెగటుగా ఆలోచిస్తున్నావో అర్థమౌతోందా? ఒక పక్క .. అక్కడ, దేశంలో అంత పెద్ద వినాశనం జరిగి .. అంతమంది చచ్చి మొత్తుకుంటుంటే .. నువ్విక్కడ రీమా పేంట్లో దూరడానికి దార్లెతుక్కుంటూ ఛీ ఛీ, నాకంటే నీచ నికృష్టు డింకోడుండడు! ఫర్గెట్‌ రీమా! నేనెళ్ళాలి ఈ బిచ్చానికి దిసీజ్‌ ద లీస్టై కెన్‌ డూ!! పదిహేనేళ్ళక్రితం .. బుజమ్మీద మూడు పోగులేసి ఇచ్చిన ట్రైనింగ్‌ “భవతి భిక్షాందేహీ, మాతా” ఇప్పుడు నా మాత కోసమే ఈ సవతి వీధుల్లో బిచ్చమెత్తడానికి పనికొస్తుంది పద, ఇదే నిశ్చయం ఇదే లక్ష్యం సోంవారం పొద్దున్నే .. మీటింగుకి ప్లాట్లు ప్రింట్‌ చెయ్యాలి .. వుందిలే, వీకెండంతా వుందిగా, చేద్దాం నడు .. ఇప్పుడు దానికంటే ఇంపార్టెంట్‌ మీటింగ్‌ .. టైమై పోతోంది .. నడు, నడు.

ఎస్‌. నారాయణస్వామి

రచయిత ఎస్‌. నారాయణస్వామి గురించి: కథకుడిగా, అనువాదకుడిగా, సమీక్షకుడిగా అమెరికాలోనూ, ఇండియాలోనూ, బ్లాగుల లోకంలోనూ పేరు గడించిన ఎస్‌. నారాయణ స్వామి అమెరికా ఆంధ్రుల జీవన తలాల్లో కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తున్న కథకుడిగా ఈమాట పాఠకులకు చిరపరిచితులు.  ...