అవ్యయ: సౌభాగ్య కుమార మిశ్ర ఒరియా కవితలు

అనువాద సేద్యానికి సహకారం ఎంతో అవసరం; అనువాదకుడికి ఆపాటి గ్రహింపు లేకపోతే బండి తిరగబడుతుంది. తెలుగులో తరచూ జరిగేది అదే. అనువాద వ్యవసాయంలో ఫలసాయం తక్కువ. కొందరు అనువాదకులు నిఘంటువులు చూడరు. ముందుకు పోలేనప్పుడు సందేహ నివృత్తి కోసం ప్రయత్నించరు. అనువాదం అనగానే ఎలా వికటించినా ఫర్వాలేదు అన్న పెద్ద భరోసా. మరీ ముఖ్యంగా అనువాదానికి ఒక ప్రణాళికే ఉండదు. ఇరుగు పొరుగు భాషల నుండి అనువాదం చేసేవారు కూడా ఆంగ్లాన్నే నమ్ముకుంటారు. అసలు మూలంలో ఏముందో తొంగి చూసే ప్రయత్నమే చేయరు. గుడ్డి వాడు ఏతం తొక్కినట్టే – నీళ్ళు వస్తున్నాయా లేదా అన్నది మనకు పట్టదు.

ఈ దుర్లక్షణాలేవి లేని అనువాదం అవ్యయ: ప్రముఖ కవి సౌభాగ్య కుమార మిశ్ర (1941) ఒరియా కవితలకు తెనిగింపు. చేపట్టిన వారు వేలూరి వేంకటేశ్వర రావు, భౌతిక శాస్త్ర పట్టభద్రులు, ఈమాట పత్రిక పూర్వ సంపాదకులు, పరిచయం అక్కర్లేని ప్రవాసాంధ్రులు.

ఈ పుస్తకానికి మూల కవి ముందుమాట My Two Cents వన్నె తెచ్చేదే. వేలూరి వారితో తమ స్నేహాన్ని నెమరు వేసుకొంటూ తమ కవితల అనువాద ప్రక్రియ ఎలా మొదలైందో చక్కగా వివరించారు సౌభాగ్య కుమార మిశ్ర: The primary criterion in my opinion for a translation is simple. The poem should flow smoothly, should ‘read’ like an original poem in the target language for the reader. అది వేలూరి గారి అభిభాషణ (మూడు మాటల్లో: తెలుగులో అది కవిత కావాలి, దాని నడత, నాణ్యం బావుండాలి.)

అలాగే అనువాదకుల ‘నా మాట’ కూడా విలువైనది. వేలూరి గారికి తమ పరిమితులు తెలుసు, కాబట్టే – ‘ఎంత జాగ్రత్త పడినా మూలంలోని మాటల సంగీతం, మాటల పొందిక వల్ల వచ్చే సొగసు అనువాద భాషలోకి తేవడం చాలా కష్టం అని నేనెరుగుదును.’ నాకు నచ్చిన మరో విషయం శాస్త్రజ్ఞుని శ్రద్ద. ఎవరు ఏ పని చేశారు? దాని వల్ల మొత్తం అనువాదం ఏ విధంగా మెరుగయింది? ఈ విషయంలో ఇతరుల ఘనతను నలుగురికి తెలియ చెప్పడం ముదావహం. విశేషించి అనువాదంలో వెనిగళ్ళ బాలకృష్ణ రావుగారి తోడ్పాటు గురించి స్పష్టంగా పేర్కొన్నారు. అదే విధంగా మిత్రులు కొలిచాల సురేష్ మూల కవితలను రోమన్ లిపిలో సంతరించి పెట్టారు, పట్టికలు సమకూర్చారు. పఠనానుభవాన్ని ఉజ్వలం చేయగల ప్రతి పని స్మరణీయమే.

ఒరియా, బెంగాలీ చాలా దగ్గరి భాషలు. దానివల్ల, వంగ భాష తెలిసిన వారు రోమన్ లిపిలో ఒరియా మూలాన్ని చదువు కొని తెలుగు అనువాదాలతో పోల్చుకోగలరు. ఇతరులు మూలంలోని నడక, ధ్వని గ్రహించి ఆనందించగలరు. భారతీయ కవిని యథామూలం తెలుగు చేసి, అందులోని సాధకబాధకాలు వెల్లడించి, సదరు అనువాద ప్రక్రియలో పొందిన సహకారాన్ని సాదరంగా తెలిపి, పైపెచ్చు మూలకవితలను రోమన్ లిపిలో ప్రకటించి – ఈ రకంగా ఒక సమగ్రత సాధించి, అనువాద రంగంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించిన వేలూరి గారు అభినందన పాత్రులు.

దాదాపు ఒక దశాబ్ద కాలంలో (1965 – 73) వచ్చిన అరవై కవితలు — ఆత్మనేపది (1965) నుంచి అధికంగా 37 కవితలు, మధ్యపదలోపి (1971) నుంచి 19 కవితలు, న ఈ పహారా (1973) నుంచి కేవలం నాలుగు — కాలగతిలో కవి ఆత్మను పరిచయం చేస్తాయి. సగం కన్నా ఎక్కువ కవితలు రాసే నాటికి కవి వయసు రెండుపదులు దాటలేదు. మొత్తానికి ఒక ప్రతిభావంతుడైన కవి ముప్పై ఏళ్ళ లోపు రాసిన కవితలివి. వీటిలో, ‘కాల్పనిక వాదం, అద్వైతం, అజ్ఞేయతావాదం గూఢంగా కనిపిస్తాయి,’ అని వేలూరి వారి అభిప్రాయం. నాకు చూడగా, వీటిలో కనిపించేది మిరిమిట్లు గొలిపే ఆధునికత. ప్రతి కవి తనదైన ఆధునికతను భాషలోనో, భావంలోనో వ్యక్త పరుస్తాడు. సౌభాగ్య కుమార సంప్రదాయ బలం మీద తనదైన ఆధునికతను ఆవిష్కరించారు. నిండుగా జీవించి, ఆ జీవన కాంక్షను కవిత్వంలో వ్యక్తం చేసిన తీరు తెలుసుకోవడానికి ఈ పుస్తకం తెరవాల్సిందే.

మచ్చుకు కొన్ని పద్య శకలాలు:

నేను ఎన్నిసార్లు రాశానో నా పేరు
సముద్రపొడ్డున ఇసుకలో
నేను చెప్పాను, నామనసు పాటలమయం
నీలిరంగు సరివి తోట.
ఆఫీస్‌ కుర్చీలో కూచొని లెక్కపెట్టాను
నా జీతపు రాళ్ళు
మృత్యువుకి, స్వర్గలోక జన్మకీ
నేను కారణాలు వెతికాను.
ఉదయం హఠాత్తుగా చూశావు నువ్వు
పళ్ళు తోముకుంటున్న నన్ను
న్యూస్‌ పేపర్‌ లో చదువుతున్నాను
నా చావు కబురు. నేను అంటున్నాను,
“నువ్వు ఎంత అందంగా ఉన్నావు?
ఇవాళ ఆదివారం,కదూ!” అని!
నా జేబులో మిగిలి ఉన్నాయి గుప్పెడు గవ్వలు
దూరంగా మిగిలిన నీలి సముద్రజలస్మృతులు.

(అవ్యయ, పు: 27)

రాయిగామారిన అహల్య ఏ రాముడికోసమో ఎదురుచూస్తున్నది.
రాతిలో ప్రాణం ఎక్కడ? ప్రాణం లేకుండా
ఎదురుచూడటం ఎలా సాధ్యం, చెప్పు, ఓ వాల్మీకీ! ఓయీ విశ్వామిత్రా!
హే విజ్ఞానీ! ఇదేమిటో విశదంగా చెప్పు! నిరుడు నేను చూశాను,
స్టెనో అనుపమా దాస్ నాకోసం ఎంతో ఎదురు చూసింది.
ఎంత ప్రయత్నించినా తన ఉసురు నేను గుర్తించలేకపోయాను
టైప్ మెషీన్ టప్ టప్ టప్ టప్ అన్నట్టు, ఆమె గొంతులోనుంచి
మాట వెనుక మాట, మాట వెనుక మాట ఇప్పటికీ నా చెవుల్లో రింగుమని మోగుతున్నాయి.
హే శ్రీరామా! హే నీలసాగరా! జీవనబాటలో దుఖం తప్ప మరేమయినా మిగిలి ఉన్నదా?
(ప్రథమ సంధ్యా సమయ స్వరం, పు: 67)

కవి దృష్టి ప్రసరించిన మేరకు వింత ఆకర్షణతో వెలిగిపోతాయి మనం రోజు చూసే – కొండ (పు: 55), పీత (పు:89), నిచ్చెన (పు:71), కృష్ణచూడా పుష్పం (పు:53), సముద్రమూ, నేను (పు: 151), సూర్యుడు (పు: 157).

దేవుడు ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించి ఉంటే
పులిగానో, ఏనుగుగానో అధమ పక్షం గుర్రం గానో
పుట్టి ఉండేది; అట్లా కాకుండా
నిస్సహాయంగా మరొక అవకాశానికి కూడా నోచుకోని
పీత ఏకాకిగా సముద్రపొడ్డున పడి ఉంది.

అప్పుడప్పుడు ఊహా ప్రపంచంలో నేను దాని వీపు మీదెక్కి
ఎగిరి సముద్రంలో దూకుతాను, అభిమన్యుడిలా

దేవుడు మరి కాస్త ప్రయత్నించి ఉంటే
నవగ్రహాలలో కనీసం ఏడింటినైనా
నా గుప్పెట్లో పెట్టుకొని ఉండగలిగే వాడిని.

చొక్కా గుండీల్లా అవి పరస్పరం సమదూరంలో ఉండి
సూర్యాస్తమయాల కోసం ఓపిగ్గా ఎలా తాలి ఉంటాయో
మనం అందరం అలాగే సహిస్తాం
పట్నంలో వేసవి, వర్షం, చలి వసంతకాలపు దుఃఖం!

(పీత, పు: 89)

ఎంత వ్యంగ్య మర్యాద! ఇదీ ఆధునికతా లక్షణం!

కవిశబ్ద వాచ్యుడు మృదువైన తొలిపొద్దు వెలుగును, ఆహ్లాదం కలిగించే అపరాహ్ణపు కాంతిని, చీకటికి ఆహ్వానం పలుకుతూ కిటికీ రెక్కను తాకి జారుకునే చివరి కిరణాన్ని కవిత్వం లోకి ప్రవేశ పెట్ట గలగాలి. అంతే కాదు సకలేంద్రియములతో తాను దర్శించిన ప్రపంచాన్ని పాఠకునికి దృశ్యమానం చేయాలి. అందులో తాను బ్రతికిన దాఖలాలు కనిపించి తీరాలి. అంతే కానీ, కాగితం పులి కారాదు. జరుగుతున్న సంఘటనలు జర్నలిస్టుల ఖాతాలో వేసి, కాలం చెల్లిన వాదాల కసవును ఊడ్చి, కరెంట్ అఫైర్స్‌నే కవిత్వం అని భ్రమించక, ప్రతి కుక్క అరుపుకు స్పందించక మన అంగుష్ఠ కవిమాత్రులు అర్జంటుగా ఎదగవలసిన అవసరాన్ని ఈ అనువాదాలు గుర్తుచేస్తాయి.

వేలూరి గారు అనుసరించిన అనువాద పద్ధతులు ఎంతో సహేతుకమైనవి శాస్త్రీయమైనవి. అనువాద ప్రమాణాలు మెరుగైనవి. తులనాత్మక పరిశీలనలో ఎంతో వివేచన కనిపిస్తుంది: ‘ఒరియా తెలుగు ఇరుగు పొరుగు భాషలు. రెండు భాషలపైనా సంస్కృత ప్రభావం వున్నది. అయినప్పటికి, రెండుభాషల లోను వాక్య నిర్మాణంలో చాలా భేదాలున్నాయి. ముఖ్యంగా పద్యపాద నిర్మాణములో ఈ భేదాలు కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి.’

ఉదాహరణకు:

భూగోళ పాఠ నిశ్చయ కష్ట భారి

జాగ్రఫీ పాఠం నేర్చుకోవడం గ్యారంటీగా చాలా కష్టం. (కవిత: పహార / కొండ, పుట 54.)

‘భూగోళం నిజంగా కష్టం’ అని కూడా చేయవచ్చు. (వాడుకలో లెక్కలు కష్టం / సైన్సు కష్టం అంటాం గాని లెక్కల పాఠం నేర్చుకోవడం కష్టం అనము.) మన నుడికార బలంతోనే అనువాదాలు గట్టెక్కుతాయి, అంతే గాక మూలానికి వీలయినంత సమాంతరంగా అనువాద శకటాన్ని నడిపించవచ్చు.)

తెలుగులో ముందు నుంచి వర్స్ లిబ్ర (Verse Libre) స్ఫూర్తిని గ్రహించ లేక, కవిత్వాన్ని వచన స్థాయికి దిగజార్చి దాన్నే కవిత్వంగా చలామణి చేసే ప్రయత్నాలు మెండు. అగ్నికి ఆజ్యము తోడయినట్టు ఉబుసుపోక ఉద్యమాలు, వదరుబోతు వాదాలు కవిత్వాన్ని పాతాళానికి నెట్టాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కవిత్వంలో ఏమి చెప్పాలి? ఏమి వదలాలి? అన్న విషయంలో మన కవులకు, విమర్శకులకు విచక్షణ లేదు. ఇతర భాషల్లో ఇంత గందరగోళం లేదు.

జర్మన్ మహాకవి గర్ట (Goethe) Faust A Tragedy నాటకం రెండవ భాగం పూర్తి చేసి మరణానంతరం ప్రచురించమని చెబుతూ, ‘It will contain problems enough and certainly leaves some points obscure yet it will satisfy a reader who knows how to take a look , a gesture, a gentle hint. He will even find more there than I could give,’ అంటాడు.

సూచన ప్రాయంగా వెల్లడించిన భావాన్ని పట్టుకునే వాడు కవిత్వానికి సరయిన పాఠకుడు.

సూచన ప్రాయంగా వెల్లడించడానికి తగిన భాషను విచక్షణతో సమకూర్చుకునే వాడు నిజమైన కవి. సౌభాగ్య కుమార మిశ్ర ఆ కోవకు చెందినవారు కాబట్టే అనువాదకుడి పని
అంత సులువు కాదు. ఈ అరవై కవితల అనువాదానికి ఒక్క ఏడాది పట్టిందంటే ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.

[అవ్యయ – సౌభాగ్య కుమార మిశ్ర ఒరియా కవితలు, తెలుగు అనుసృజన: వేలూరి వేంకటేశ్వర రావు, వెనిగళ్ళ బాలకృష్ణ రావు, 2016. చరిత ఇంప్రెస్సిఒన్స్ ముద్రణ. రూ. 60. విశాలాంధ్ర, కినిగె నుంచి లభ్యం.]


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...